ఆ ప్రభుదర్శనం ఆమె స్వయంగా సాధించుకున్నది, ఆమె సొంతం. తనకీ, తన దేవుడికీ మధ్య మరొక మధ్యవర్తి అవసరం లేదామెకి. ఒక తోటతోనూ, తోటలో పాడే ఒక పిట్టతోనూ ఆమె నేరుగా స్వర్గానికి ప్రయాణించగలదు.
హార్లెం సౌందర్యశాస్త్రం
కవిత్వం కూడా యవ్వనంలాగా, వసంతంలాగా, ఒక జీవితంలో ఒక్కసారి మటుకే వచ్చివాలుతుంది. నిర్మలమైన ప్రేమలాగా, యవ్వనారంభసమయంలోనే సాక్షాత్కరిస్తుంది. కవి అంటే పాతికేళ్ళలోపు, మహా అయితే, ముప్పై ఏళ్ళ లోపు కవిత్వం చెప్పినవాడే, కీట్స్ లాగా, రేంబో లాగా, తోరూదత్ లాగా, మహా ప్రస్థానగీతాలు రాసిన శ్రీ శ్రీ లాగా. ఆ తర్వాత కూడా కవిత్వం రాయొచ్చుగాని, అప్పుడది అయితే వచనమవుతుంది, లేదా ప్రవచనమవుతుంది.