చాలా ఏళ్ళకిందటి మాట. 1990 లో. అప్పుడు నేను కర్నూల్లో జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా చేరాను. అప్పటికే మా కలెక్టరు నా కోసం ఎదురుచూస్తున్నాడు. అక్కడ నల్లమల అడవుల్లో ఇంకా వేట, ఆహారసేకరణ మీద జీవిస్తున్న చెంచువారిని వ్యవసాయం లోకి తేవడం నా బాధ్యత అని చెప్పాడు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో వాళ్ళకి అటవీభూమిమీద హక్కులిచ్చారనీ, ఆ నేల బీడుగా, చిట్టడవిగా పడి ఉందనీ దాన్ని సస్యశ్యామలం చేయాలనీ చెప్పాడు.
అప్పుడు మేమా భూమిని చదునుచేయించి, ఆ గూడేల్లో ఉమ్మడి సేద్యపు సంఘాలు ఏర్పాటు చేయించి, పెద్ద ఎత్తున వ్యవసాయం మొదలుపెట్టాం. ఆ పొలాల్లో ఏదన్నా ఆహారపంట, ఏ జొన్నలో, వేయించాలన్నది కలెక్టరు ఉద్దేశ్యం. కాని ఆ మొదటితరం రైతులు, గ్రామాల్లో రైతుల్లాగా తాము కూడా, పొద్దుతిరుగుడు వేసుకుంటామన్నారు. కొద్ది రోజులకే ఆ అడవుల్లో పచ్చనిపూలు రేకలు విప్పాయి.
ఒకరోజు, నేనా పొలాలు చూసుకుంటూ, నాగలూటిగూడేనికి వెళ్ళాను. అది ఆత్మకూరు మండలంలో ఒక మారుమూల గూడెం. ఆ రోజు అక్కడ నేను చూసిన దృశ్యం నా జీవితమంతా నన్ను వెంటాడుతూనే ఉంటుంది. మధ్యాహ్నం పన్నెండుగంటలవేళ, అక్కడ గూడెం పక్కన పొద్దుతిరుగుడు పూల చేలో, ఒక మంచెమీద ఒక ముసిలామె పిట్టల్ని తోలుతూ ఉంది. చేతిలో వడిసెల. అప్పటికి ఎంతసేపటినుంచో అట్లా రెండు చేతులూ ఊపుతో పొలమ్మీద పిట్టలు వాలకుండా అరుస్తో ఉంది. ఇంకా ఎంతసేపు అట్లా అరవాలసి ఉంటుందో ఆమెకి తెలీదు, కొన్ని గంటలు, కొన్ని వారాలు? బహుశా కొన్నేళ్ళు?
ఆ పంటవేయకపోయి ఉంటే ఆమె జీవితం ఎంత సుఖంగా ఉండిఉండేదోకదా అనుకున్నాను. ఓపిక ఉంటే ఏ చింతపండో, చిల్లగింజలో ఏరుకుంటుంది, లేకపోతే ఆకలితో పస్తుపడుకుని ఉంటుంది. కాని, అభివృద్ధి పేరిట ఈ కొత్త బాధ ఏమిటి?
కాని మనుషులు మనుషులుగా మారాలంటే నడవక తప్పని దారి అది. కొత్త బాధలు వెతుక్కోవడమే స్వాతంత్ర్యం. కొత్త సమస్యల్ని అన్వేషించడమే ప్రగతి. అక్కడ, ఆ పచ్చనిపూలచేను, వాటిమీద దండెత్తే పిట్టలూ, ఆ పిట్టల్ని రోజంతా తోలుతుండే ఆ చెంచుముసిలామే- ఆ గూడేల్లో, వాళ్ళ జీవితాల్లో, కొత్త అధ్యాయం తెరుచుకున్నట్టుగా నేను అర్థం చేసుకున్నాను.
అమెరికన్ అంతర్యుద్ధానికి పూర్వపు (ante-bellum) నీగ్రోల జీవితానికీ, బానిసత్వం రద్దయిన తర్వాత వారి జీవితానికీ మధ్య ఉన్న తేడా అటువంటిదే. అంతర్యుద్ధం తర్వాత వాళ్ళ కష్టాలు మరింత పెరిగాయి. బానిసత్వ నిర్మూలనతో పోరాటం పూర్తవలేదు. మళ్ళా మొదలయ్యింది. ఎందుకంటే, బానిసలుగా వాళ్ళు పడ్డ కష్టాలు జంతువులుగా పడ్డ కష్టాలు. ఆ తర్వాత వాళ్ళు లోనయిన కష్టాలు మనుషులుగా పడ్డ కష్టాలు.
వాళ్ళల్లో మళ్ళా మరికొందరున్నారు. కొత్త జీవితం అందిస్తున్న సౌకర్యాలతో ఏదో ఒక మేరకు తృప్తి చెందకుండా మరింత మనుషులుగా జీవించాలనుకున్నవాళ్ళు. లాంగ్ స్టన్ హ్యూస్ లాంటివాళ్ళు.
లాంగ్ స్టన్ హ్యూస్ (1902-67) ఆఫ్రికన్-అమెరికన్ కవుల్లో అత్యున్నత కవి మాత్రమే కాదు, అత్యున్నత స్వాతంత్ర్యవీరుడు కూడా అనిచెప్పవలసి ఉంటుంది. అయితే అతడి స్వాతంత్ర్య పోరాటం డగ్లస్ లాగా భౌతిక స్వేచ్ఛ కోసం చేసింది కాదు. తన మానసిక స్వేచ్ఛ కోసం, తాను తన జాతి మనుషుల మధ్య జీవించే సంతోషం కోసం చేసిన పోరాటం.
‘నీకోసం గొప్ప కెరీర్ ని ప్లాన్ చేసాను’ అని తండ్రి చెప్తుంటే, ‘నాకు కెరీర్ వద్దు, కవిత్వం కావాలి’ అని చెప్పగలిగిన స్వాతంత్ర్యం. ఎవరన్నా ఉన్నారా అట్లాంటివాళ్ళు? మనకు తెలిసినవాళ్ళు?
లాంగ్ స్టన్ హ్యూస్ కవిత్వం చదవడానికి ముందు అతడి ఆత్మకథ The Big Sea (1940) చదవాలి. ముఖ్యంగా ఈ సన్నివేశం. ఇది ఒక హ్యూస్ జీవితంలోనే కాదు, ఆఫ్రికన్-అమెరికన్ స్వాతంత్ర్య చరిత్రలోనే పతాక సన్నివేశమనిపిస్తుంది.
నాకొక రచయితని కావాలని ఉంది
‘.. మేం తిరిగి వస్తూండగా, మా నాన్న హఠాత్తుగా తన నిర్ణయం ప్రకటించాడు. నన్ను మైనింగ్ ఇంజనీరింగ్ చదివించాలని నిశ్చయించేసుకున్నట్టుగా చెప్పాడు.
‘మహా అయితే మరొక అయిదారేళ్ళు. అప్పటికి మళ్ళా ఈ గనులన్నీ మళ్ళా తెరుస్తారు. నీకు చేతుల్నిండా పని ఉంటుంది, ఆ గనులూ, ఈ సుక్షేత్రమూ’ అన్నాడాయన.
‘కాని నేను మైనింగు ఇంజనీర్ని కాలేను. నాకు లెక్కల్లో అంత ప్రావీణ్యం లేదు’ అన్నాన్నేను. మేము గుర్రాలు దిగి నడుస్తున్నాం.
‘మనసు పెట్టి చదివితే అదే వస్తుంది’ అన్నాడు మా నాన్న. ‘ఇంజనీరింగ్ చదివితే నువ్వు నాలుగు రాళ్ళు సంపాదించగలుగుతావు. లేకపోతే ఎట్లా బతుకుతావు? జీవితమంతా నీగ్రోగాడిలానా? మీఅమ్మ చూడు, హోటళ్ళల్లో బల్లలదగ్గర నిలబడి, వడ్డనచేస్తో బతుకుతోంది. నీకేమీ పైకి రావాలని లేదా?’
‘రావాలనే ఉంది’ అన్నాన్నేను. ‘కాని, నేను మైనింగు ఇంజనీర్ని మటుకు కావాలనుకోడం లేదు.’
‘మరేం కావాలనుకుంటున్నావు?’
‘స్పష్టంగా తెలీదు. నాకొక రచయితని కావాలని ఉంది.’
‘రచయితనా?’ మా నాన్న రెట్టించాడు. ‘రచయితనా? రచయితలకు డబ్బులొస్తాయా?’
‘సంపాదించినవాళ్ళు లేకపోలేదు.’
‘కాని నల్లజాతివాళ్ళు మాత్రం కాదు’ అన్నాడు మా నాన్న.
‘అలెగ్జాండర్ డ్యూమా ఉన్నాడు’ అన్నాన్నేను.
‘కావచ్చు. కాని అది పారిస్ లో. అక్కడ నీ చర్మం రంగు ఎవరూ పట్టించుకోరు. చూడు, లాంగ్ స్టన్, అదే నేన్నీకు చెప్పేది. చదువుకో. ఎట్లాంటి చదువంటే, ప్రపంచంలో ఎక్కడైనా సరే బతగ్గలిగే లాంటి చదువు. యూరోప్, దక్షిణమెరికా ఎక్కడేనా సరే. ఒక్క అమెరికాలో తప్ప. అమెరికాలో బతకాలంటే తక్కిన నీగ్రో గాళ్ళతో కలిసి నువ్వూ ఓ నీగ్రోగాడిలా బతకాల్సి ఉంటుంది.’
‘కాని నాకు నీగ్రోలంటే ఇష్టం’ అన్నాన్నేను. ‘వాళ్ళతో ఉంటే సరదాగా ఉంటుంది.’
‘సరదానా?’ అరిచాడు మా నాన్న. ‘వర్ణవిభజన నిన్ను నిలువెల్లా తేరిపారజూచే చోట నీకు సంతోషమెట్లా దొరుకుతుంది? నాకైతే ఊహకి కూడా అందడం లేదు.’
పైన్ చెట్ల మధ్యనుంచి మేం స్వారీ చేస్తున్నాం. ఆకాశానికి నాలుగు చెరగులా దూరాంచల పర్వతశ్రేణి మరీ నీలంగా ఉంది. నా తండ్రి మరీ వేగంగా దౌడు తియ్యాలనుకోవడం లేదు. గుర్రం నెమ్మదిగా బాటకటూ ఇటూ పచ్చికమేస్తూ సాగుతున్నది. మేమట్లా ముందుకు సాగుతుండగా, నా తండ్రి నా భవిష్యచిత్రపటాన్ని నా ముందు ఆవిష్కరిస్తో వచ్చేడు. అట్లాంటి భవిష్యత్తు ఉండగలదని నేనంతకుముందెప్పుడూ ఊహించలేదు. నేను ముందు స్విజర్లాండు వెళ్ళి చదువుకోవాలట. అక్కడ ఒక్కసారే మూడు భాషలు నేర్చుకోవాలట. ఫ్రెంచి, జర్మన్, ఇటాలియన్. అది కూడా నేరుగా ప్రజలనుంచే. ఆ తర్వాత నేనో జర్మన్ స్కూల్లో ఇంజనీరింగ్ చదవాలట. అప్పుడు తిరిగి మెక్సికో రావాలి.అదీ ప్రణాళిక.
ఏదో పరాయిభాషలో త్రికోణమితి, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం చదవాలన్న ఊహనే నాకు భరించడం కష్టంగా ఉంది. వాటిని ఇంగ్లీషులో చదవడమే ఒక నరకం. కాని, స్విజర్లాండ్, జర్మనీలకు బదులు నేను కొలంబియాలో చదవాలనుకుంటున్నాను అని చెప్పాను. నా దృష్టి అంతా న్యూయార్క్ లో హార్లెం మీద ఉంది.
మా నాన్న అదేదీ వినే పరిస్థితిలో లేడు. కాని, నాకేమో ఆ ఊహనే ఎంతో సంతోషంగా ఉండింది. హార్లెం చూడాలన్న కోరిక నాకు పట్టశక్యంగా కాకుండా ఉంది. పారిస్ కన్నా, షేక్స్పియర్ పుట్టినదేశం కన్నా, బెర్లిన్ కన్నా, ఆల్ప్స్ పర్వతప్రాంతాలకన్నా, నాకు హార్లెం చూడటం మీదనే ఎక్కువ మక్కువగా ఉండింది. హార్లెం! ప్రపంచ నీగ్రో మహానగరం. అప్పుడే ఒక కొత్త నీగ్రో గీతం విడుదలయింది. దాన్ని ఫ్లోరెన్స్ మిల్స్ సుమధురగానంలో వినాలని నేను ఉవ్విళ్ళూరుతున్నాను. స్విజర్లాండ్ కన్నా కొలంబియా వెళ్ళడమే నాకిష్టమని మా నాన్నకు చెప్పేసాను.
మా నాన్న మరేమీ మాటాడలేదు. నేను కూడా మౌనంగా ఉండిపోయాను. మా గుర్రాలు ఆ పర్వతసానువుమీంచి కిందపరుచుకున్న నీలినీడల్లోకి దిగసాగాయి..’
2
లాంగ్ స్టన్ హ్యూస్ అతడి తండ్రి కోరుకున్నట్టుగా స్విజర్లాండ్ వెళ్ళి మైనింగ్ ఇంజనీరింగ్ చదవలేదు. కొన్నాళ్ళు కొలంబియా యూనివెర్సిటీలో చదివాడుగాని, వర్ణవివక్షత వల్ల చదువు మధ్యలోనే ఆపెయ్యాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒక ఓడలో కళాసిగా ఒకసారి ఆఫ్రికాదాకానూ, మరోసారి యూరోప్ దాకానూ పర్యటించివచ్చాడు. యూరోప్ పర్యటనలో కొన్నాళ్ళు పారిస్ లో ఒక రెస్టారెంటులోఅంట్లు తోముకుంటూ జీవికసాగించాడు. మళ్ళా అమెరికా వచ్చి ఒక హోటల్లోసర్వరుగా జీవితం మొదలుపెట్టాడు.
యేసు బాప్తిస్మం పొందాక, నలభై రోజుల పాటు తనని వేధిస్తున్న ప్రలోభాల మధ్య ఆత్మశోధన చేసుకుంటూ ఒక ఎడారిలో గడిపాడనీ, తనని చుట్టుముట్టిన ప్రలోభాల్ని చివరికి జయించాడనీ సువార్తలు చెప్తున్నాయి. ఆ ప్రలోభాలు ఆయన్ని ఒక కొండకొమ్ము మీదకు తీసుకువెళ్ళి, సమస్త ప్రపంచాన్నీ చూపిస్తూ, తమ మాటవింటే యేసు భూలోకాధిపతి కావచ్చని ఆశపెడతాయి. లాంగ్ స్టన్ హ్యూస్ కీ, అతడి తండ్రికీ మధ్య మెక్సికో సిటీలో జరిగిన ఆ సంభాషణ కూడా అటువంటి ప్రలోభాన్నే తలపిస్తున్నదని ఆర్నాల్డ్ రాంపెర్షాద్ రాసాడు.
అతడిట్లా రాస్తున్నాడు:
‘యువ క్రీస్తులాంటి ఆ కవిని సాతాను ఒక ఉన్నతశిఖరం మీదకు తీసుకువెళ్ళి ప్రలోభపరిచాడు. తన మాట వినకపోతే, అతడు పేదరికంలో కూరుకుపోతాడనీ, ప్రజలు పట్టించుకోరనీ బెదిరించాడు. దాన్నుంచి బయటపడాలంటే, ఆ కవి తన ఆత్మను వదులుకుంటే చాలనీ, అందుకు బదులుగా ప్రపంచాన్ని కానుక చేస్తానన్నాడు. కాని, లాంగ్ స్టన్ తన భగవంతుడికే, అంటే తన కవిత్వానికీ, తన నల్లజాతిసోదరులకే విధేయంగా ఉండిపోయాడు. ఆ రెండూ కూడా నిజానికి అతడి దృష్టిలో ఒకటే. అతడు తన తండ్రిని ద్వేషించకుండా ఉండలేకపోయానని ఒప్పుకుంటున్నప్పుడు తన నల్లజాతి పాఠకులకు స్పష్టంగా చెప్తున్నదొకటే. తనలో రచయిత కావాలన్న గాఢాభిలాష ఒక్కటే బలంగా ఉందనీ, దానివెనక బలంగా పనిచేస్తున్న శక్తి తన నల్లజాతి పట్ల పొంగిపొర్లుతున్న ప్రేమాతిశయమేననీ.’
పద్ధెనిమిదేళ్ళ వయసులో, ఉన్నతవిద్యావకాశాల కోసం యువతీయువకులు పరితపించేవేళ, లాంగ్ స్టన్ తన తండ్రి తనకోసం కంటున్న కలల్ని అంత సునాయాసంగా ఎట్లా తిరస్కరించగలిగాడు?
అందుకు జవాబు కూడా అతడి ఆత్మకథలోనే కనిపిస్తుంది. 1920 లో, అతడు తన తండ్రిని కలవడానికి రైల్లో ప్రయాణిస్తున్నప్పుడే, అతడు మానసికంగా విముక్తుడయిపోయాడు. 1893 లో దక్షిణాఫ్రికాలో పీటర్ మారిష్ బర్గ్ రైల్వేస్టేషన్ లో బారిష్టరు గాంధీ మహాత్మాగాంధీగా మారినట్టే, యువ లాంగ్ స్టన్ హ్యూస్ ని ఒక రైలు ప్రయాణం ‘యువక్రీస్తు’ లాంగ్ స్టన్ హ్యూస్ గా మార్చేసింది. ఆ ప్రయాణం కన్నా కొన్ని రోజుల ముందు అతడు తన తండ్రి దగ్గర్నుంచి అమెరికా తిరిగి వస్తున్నప్పుడు రైల్లో ఒక డిన్నర్ కోసం కూచున్నప్పుడు అతడికి ఎదురుగా ఒక తెల్లజాతివాడు కూచున్నాడు. అతడు చాలాసేపు హ్యూస్ నే తేరిపారచూస్తూ, చివరికి హఠాత్తుగా కెవ్వునకేకపెట్టి దిగ్గున లేచి, ‘నువ్వు నీగ్రోగాడివి కదూ’ అంటో అక్కణ్ణుంచి చరచరా వెళ్ళిపోయాడు. తనని చూస్తూనే ప్లేగు వ్యాథిని చూసి భయపడి పారిపోయినట్టుగా అతడక్కణ్ణుంచి పారిపోయాడని రాస్తాడు హ్యూస్. ఈసారి మళ్ళా మెక్సికో వెళ్తున్నప్పుడు ఆ అనుభవమే హ్యూస్ కి గుర్తొస్తూ ఉన్నది.
అతడిట్లా రాస్తున్నాడు:
‘..నేను స్టేషన్ కి ఒక్కణ్ణే వెళ్తున్నా మా అమ్మ పట్టించుకోలేదు. రైలెక్కగానే నాకెందుకో చాలా బాధగా అనిపించింది. ఆ తర్వాత కూడా మూడునాలుగేళ్ళపాటు నేను దిగులుగానే గడిపాను. కాని నిజం చెప్పాలంటే, ఆ కాలంలోనే నేను నా కవిత్వం అధికభాగం రాసింది కూడా. ( నేను గొప్ప దిగుల్లో కూరుకుపోయినప్పుడే నా కవితల్లో అత్యుత్తమమైనవి రాసాను. ఉల్లాసంగా ఉన్నప్పుడు ఒక్క అక్షరం కూడా రాయలేదు.)
కవితాసంకలనాల్లో తరచూ ప్రచురించే నా కవితల్లో ఒకటి ఆ రోజు నా మెక్సికో ప్రయాణంలో,ఆ దిగుల్లోనే రాసాను. ‘ఆ నీగ్రో నదుల గురించి గానం చేస్తున్నాడు’ అనే ఆ కవితని రైలు సెయింట్ లూసిస్ దాటి టెక్సాస్ వెళ్తుండగా రాసాను.
ఆ కవిత పుట్టిందిలా. ఆ రోజంతా రైల్లో నేను మా నాన్న గురించీ, తన జాతి ప్రజల పట్ల ఆయన పెంచుకున్న విచిత్రమైన ఏహ్యత గురించే ఆలోచిస్తూ ఉన్నాను. నేను దాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నేను నీగ్రోని, కాబట్టి నీగ్రోలంటే నాకు చాలా ఇష్టం. నేను హైస్కూల్లో చదువుకునే రోజుల్లో నేను చేసిన ఒక చిల్లర ఉద్యోగం నాకు చాలా ఇష్టమైనది ఒక సోడా ఫౌంటెన్ దగ్గర పనిచేసిన కాలం. దక్షిణాది నుంచి అక్కడికొచ్చిన నల్లజాతివాళ్ళు ఐసు క్రీముకోసమో, పుచ్చకాయల కోసమో ఆ షాపు దగ్గరకొచ్చేవాళ్ళు. వాళ్ళ మాటలూ, ఉరుములు ఉరిమినట్టుండే వాళ్ళ నవ్వులూ, వాళ్ళ కష్టాలూ, యుద్ధం గురించీ, వర్ణవివక్షతలో నలిగిపోయే దక్షిణాదినుంచి యూరోప్ వెళ్ళినవారి గురించీ, అద్దెలు పెరిగిపోతున్నాయనో, లేదా పని భారం మరీ పెరిగిపోతోందనో వాళ్ళు చెప్పుకునే మాటలన్నీ వింటూండేవాణ్ణి. వాళ్ళని చూస్తుంటే, ఆ దక్షిణాది వెలివాడలనుంచి వలస వచ్చిన ఆ నీగ్రోల్ని చూస్తుంటే, ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఉల్లాసపూరితులైన మహాసాహసికుల్ని చూస్తున్నట్టుండేది. ఎన్నో కష్టనష్టాల్ని ఎదుర్కుంటున్నప్పటికీ, పనిచేసుకుంటూ, నవ్వుకుంటూ, ఈ ప్రపంచంలో ఏదో ఒకమూల తమ కంటూ ఇంత చోటు సంపాదించుకుంటున్నవాళ్ళలాగా కనిపించేవారు వాళ్ళు.
ఆ సాయంకాలం నేను డిన్నర్ కొంత తొందరగానే ముగించి కూచున్నాను. బయట సూర్యాస్తమయం అవుతూ ఉంది. అప్పుడే నెమ్మదిగా ఒక పొడవైన వంతెనమీంచి మిసిసిపి మహానది దాటుతూ ఉన్నాం. ఆ మహానది ఎర్రనీళ్ళతో దక్షిణదేశ గర్భంవైపు ప్రవహిస్తూ ఉంది. ఈ పురాతన మిసిసిపి మహానది పూర్వకాలంలో నీగ్రోలకు ఏ విధంగా అనుభవంలోకి వచ్చిందా అని ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ నదిఒడ్డున తననెవరికి అమ్మేయబోతున్నారా అని ఎదురుచూడటమే ఆ దాస్యకాలంలో ఒక బానిసకి ఎదురుకాగల అతి నికృష్ట అనుభవం. ఆ రోజుల్లోనే అబ్రహాం లింకన్ ఒకరోజు ఆ నది మీద ఒక తెప్ప వేసుకుని న్యూ ఆర్లియన్స్ దాకా ప్రయాణించిన విషయం కూడా నాకు గుర్తొచ్చింది. బానిసత్వం ఎంత దారుణంగా కొనసాగుతోందో అతడు ఆ పర్యటనలోనే కళ్ళారా చూసాడు. ఆ కళంకాన్ని అమెరికన్ జీవితం నుంచి ఎట్లాగేనా చెరిపితీరాలని అతడికి సంకల్పం కలిగిందప్పుడే. ఆ క్షణానే నాకు మా గతానికి చెందిన పురాతన ఆఫ్రికా మహానదులు-కాంగో, నైగర్, నైలు-నదులు కూడా గుర్తొచ్చాయి. ‘నాకు నదులు పరిచయమయ్యాయి’ అని స్ఫురించింది. వెంటనే, నా జేబులో ఉన్న ఓ ఎన్వలప్ తీసుకుని దానిమీద తక్షణమే నా భావాల్ని ఉన్నదున్నట్టుగా రాసేసుకున్నాను. రాయడానికి బహుశా పది పదిహేను నిమిషాలు పట్టి ఉంటుంది, అంతే. ఆ సంధ్యాసమయంలో రైలు వేగం పుంజుకుంటూండగా, నేను నా కవిత ‘ఆ నీగ్రో నదుల గురించి గానం చేస్తున్నాడు’ పూర్తిచేసేసాను.’
ఆ నీగ్రో నదుల గురించి గానం చేస్తున్నాడు
నాకు నదులు పరిచయమయ్యాయి.
మానవరక్తనాళాల్లో మానవరక్తం ప్రవహించడం కన్నాముందటివి, ఈ ప్రపంచమెంత పురాతనమో, అంతటి పురాతనమైన నదులు పరిచయమయ్యాయి.
నా ఆత్మ కూడా ఆ నదుల్లానే లోతుగా వికసించింది.
ఉషస్సుల నవయవ్వనోదయకాలంలోనే నేను యూఫ్రటీసులో స్నానమాడాను.
కాంగో ఒడ్డున పర్ణశాల కట్టుకున్నాను, ఆ నది నాకు జోలపాడి నిద్రపుచ్చింది.
నైలునదీ పరీవాహకతీరంలో సంచరిస్తూ పిరమిడ్లు పైకి లేపాను.
అబ్రహాం లింకన్ న్యూ అర్లియాన్స్ దాకా ప్రయాణించినప్పుడు మిసిసిపి పాటలు పాడటం విన్నాను. దాని పంకిల జలాలు సూర్యాస్తమయవేళ బంగారంగా మారడం చూసాను.
నాకు నదులు పరిచయమయ్యాయి.
ప్రాచీన, ధూసర మహాప్రవాహాలు.
నా ఆత్మ కూడా ఆ నదుల్లానే లోతుగా వికసించింది.
*
అది అతడు కవిగా పుట్టిన క్షణం. ఇక అతడి కవిత్వం లోకానికి పరిచయమయిన సందర్భం మరింత నాటకీయంగా సంభవించింది.
3
‘ఆ నీగ్రో నదుల్ని గానం చేస్తున్నాడు’ అనే కవితని లాంగ్ స్టన్ హ్యూస్ డుబ్వా నడుపుతున్న ‘క్రైసిస్’ పత్రికకి పంపించాడు. ఆ కవితని డుబ్వాకే అంకితమిచ్చాడు కూడా. ఆ తర్వాత మరికొన్ని కవితలు రాసాడు. వాటిని The Weary Blues పేరిట ఒక సంపుటంగా వెలువరించాలనుకున్నాడు. అప్పటికే వాన్ వెచెన్, జేమ్స్ వెల్డన్ జాన్సన్ వంటి పెద్దవాళ్ళ దృష్టిలో పడ్డాడు. వాన్ వెచెన్ ఆ కవితల్ని ఒక ప్రసిద్ధ ప్రచురణసంస్థద్వారా ప్రచురించే ప్రయత్నం మొదలుపెట్టాడు కూడా. కాని, హ్యూస్ గురించి ప్రపంచానికి తెలియచెప్పే అవకాశం వేచల్ లింజీ (Vachel Lindsay) కి లభించింది.
వేచల్ లింజీ (1879-1931) సుప్రసిద్ధ అమెరికన్ వాగ్గేయకారుడు. కవిత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంకోసం పాదయాత్రలు చేసినవాడు. లాంగ్ స్టన్ హ్యూస్ తన 23 వ ఏట లింజీ కళ్ళల్లో పడ్డాడు. ఆ సంఘటన గురించి హ్యూస్ ఇట్లా రాసుకొచ్చాడు:
‘.. నేను వార్డ్ మన్ పార్క్ హోటల్లో పనిచేయడం ఒకవిధంగా మంచిదే అయింది. ఎందుకంటే అక్కడే నేను వేచల్ లింజీని కలుసుకున్నాను. ఆ హోటల్ కి వచ్చే మంత్రుల్నీ, రాయబారుల్నీ చూస్తే నాకేమంత గొప్పగా అనిపించలేదుగానీ, వేచల్ లింజీ వచ్చినరోజు మాత్రం నేను గొప్ప ఉద్వేగానికి లోనయ్యాను. ఆయన గురించి నాకు అప్పటికే తెలుసు. ఆ రోజు పొద్దున్న పేపర్లలో చదివాను కూడా. ఆ సాయంకాలం,ఆ హోటల్లో థియేటర్లో ఆయన కవిత్వం వినిపించబోతున్నాడు. నాక్కూడా ఆయన కవిత్వం వినాలని ఎంతగానో ఉండింది. కాని, ఆ ఆడిటోరియం లోకి నల్లవాళ్ళని అడుగుపెట్టనివ్వరని కూడా నాకు తెలుసు.
ఆ మధ్యాహ్నం నేను నా కవితలు మూడింటిని వేరే కాగితాల మీద రాసుకున్నాను. ఆ కాగితాల్ని నా తెల్లటి సర్వరు కోటుజేబులో కుక్కుకున్నాను. సాయంకాలం లింజీ డిన్నర్ కి వచ్చినప్పుడు ఆ ప్రముఖుడితో ఏం మాట్లాడటానికీ నాకు ధైర్యం చాల్లేదు. మాట్లాడినా ఏమి చెప్పగలను,నీ కవితలంటే నాకిష్టం, ఇవి నా కవితలు చూడండి అనేకదా. అందుకని, ఆ కాగితాలు ఆయన ప్లేటు పక్కన పెట్టి వడివడిగా ముందుకు నడిచిపోయాను. వేరే బల్లమీంచి ఎంగిలి ప్లేట్లు ఎత్తుతూ వెనక్కి తిరిగి చూస్తే, లింజీ ఆ కాగితాలు తీసుకుని ఆ కవితలు చదువుతుండటం కనిపించింది.
మర్నాడు పొద్దున్నే మళ్ళా పనిలోకి పోతూ, అలవాటు ప్రకారం న్యూస్ పేపరు కొనుక్కుని తెరిచాను-అందులో- వేచల్ లింజీ ఒక నీగ్రో సర్వరులో ఒక కొత్త కవిని కనుగొన్నాడని వార్త! నేను హోటల్ కి వెళ్ళేటప్పటికి పత్రికా విలేకరులు నా కోసం మూగి వున్నారు. వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చెయ్యడానికి విరగబడ్డారు. ఆ బల్లలమధ్య ఎంగిలి పళ్ళాలు చేత్తో పట్టుకున్న నన్ను ఫొటో తీసుకున్నారు. అండర్ వుడ్ అండ్ అండర్ వుడ్ కంపెనీ తీసిన ఆ ఫొటో దేశవ్యాప్తంగా చాలా వార్తాపత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. నా జీవితంలో మొదటిసారిగా నాకు ఊహించని ప్రసిద్ధి లభించింది.
లింజీ వెళ్ళిపోతూ కౌంటరు దగ్గర ఒక పాకెట్ పెట్టివెళ్ళిపోయాడు. అది అమీ లోవెల్ రాసిన John Keats. ఆ పుస్తకం మొదటిఖాళీపేజీల్లో లింజీ రాసిన ఈ వాక్యాలు కనిపించాయి:
డిసెంబరు 6, 1925
వార్డ్ మన్ పార్క్ హోటల్
వాషింగ్టన్ డి.సి
ప్రియమైన లాంగ్ స్టన్ హ్యూస్,
అమెరికాలో New Poetry ఉద్యమం 1912 నుంచీ నడుస్తూ ఉంది. ఆ సేనాధిపతుల్లో ఇద్దరు ఇప్పటికే మరణించారు. జాయిస్ కిల్మెర్ యుద్ధంలో మరణిస్తే, అమీ లోవెల్ ఇటీవలనే పరమపదించింది. ఆ ఉద్యమంలో భాగంగా ఇప్పటికే వందపుస్తకాలకు పైగా కవిత్వమూ, విమర్శా వెలువడ్డాయి. వందలాదిగా కవితలు వస్తూనే వున్నాయి.
ఆ పుస్తకాల్లో పదకొండుదాకా అమీ లోవెల్ రాసిన విశిష్ఠ రచనలే. వాటి జాబితా ఈ పుస్తకంలో ఉంది, చూడు. న్యూస్ పేపర్ల సంగతి మర్చిపో, ఆ పుస్తకాలు చదువు. అమీ లోవెల్ రచనల్లో Tendencies in Modern American Poetry తో మొదలుపెట్టు. బహుశా ఇవన్నీ నాకన్నా నీకే బాగా తెలిసి ఉండవచ్చు.
అమీ లోవెల్ కీట్సు జీవితాన్ని నవ్యకవిత్వ దృక్పథం నుంచి తిరగరాసింది.నువ్వు ఈ ఉద్యమం గురించి క్షుణ్ణంగా చదువుతావని ఆశిస్తున్నాను. ఎడ్విన్ ఆర్లింగ్ స్టన్ రోబిన్ సన్ నుంచి ఆల్ఫ్రెడు క్రేయంబర్గ్ రాసిన ‘ట్రబుడేర్’ కవితదాకా, మొత్తం.
నిన్ను వెన్నుతట్టడానికి ముందుకొచ్చేవాళ్ళు నిన్ను తొక్కుకుంటూ పోయే ప్రమాదముంది. వాళ్ళకి దూరంగా ఉండు. కవిత్వంలో ముఠాలు ఏమి చెయ్యగలవో నాకు తెలుసు. వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండు. బిగ్గరగా పొగిడేవాళ్ళు ఏం చేస్తారో నాకు తెలుసు. వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండు. వీపుతట్టేవాళ్ళు ఏమి చెయ్యగలరో నాకు తెలుసు. వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండు.
నీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తున్నాను.
నికొలస్ వేచల్ లింజీ.
ఆ వాక్యాలు, ఇంకులో రాసిన ఆ చేతిరాతలో, ఆరుపేజీల పొడుగునా, గొప్పగా, ఉదారంగా, ప్రవహిస్తున్నట్టుగా ఉన్నాయి.. ‘
ఒక సుప్రసిద్దుడి ప్రశంసలకి లోనయిన తర్వాత లాంగ్ స్టన్ హ్యూస్ జీవితం మారకుండా ఎలా ఉంటుంది! కాని, ఆ మార్పు మనం ఊహించేటట్టు కాదు. ఆ తర్వాత ఏమి జరిగిందో, హ్యూస్ ఆ తరువాతి అధ్యాయంలో ఇలా రాస్తున్నాడు:
‘వేచల్ లింజీ సంఘటన తర్వాత నాకు లభించిన అపారమైన పబ్లిసిటీ నా కవిత్వప్రస్థానానికి నిస్సందేహంగా మేలు చేసిందిగాని, నా ఉద్యోగానికి మాత్రం కాదు. ఎందుకంటే, ఆ రోజునుంచీ, హోటల్ కి ఏ కొత్త అతిథులు వచ్చినా, వాళ్ళు ఆ సర్వరు కవి ఎలా ఉంటాడో చూడాలనుకోవడం, మా పెద్ద సర్వరు నన్ను పిలిచి వాళ్ళకి చూపించడం మొదలయ్యింది. అది నాకు చాలా ఇబ్బందిగానూ, చీకాకుగానూ ఉండింది. అందుకని ఆ నెలజీతం తీసుకున్నరోజునే ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పేసాను.’
15-2-2018, 16-2-2018, 17-2-2018