జీవన శిల్పి-21

‘ఇప్పటివరకూ నేను మాట్లాడుతున్నదంతా ఒక సంపూర్ణ నాగరికత గురించి’ గురూజీ మళ్ళా కొత్త సంభాషణ మొదలుపెడుతున్నారని గ్రహించాను.  ఆయన చెప్తున్నారు: ‘ఇది ఒక సభ్యతకు సంబంధించిన విషయం. అంతే తప్ప ఏదో ఒక మతానికో, రాజ్యానికో సంబంధించింది కాదు. వింటూనే ఉన్నారుకదా, ఇప్పటిదాకా నేను ఏ మతం గురించి గానీ, ఏ అధికార వ్యవస్థ గురించి గానీ మాట్లాడలేదు. ఇది ఒక నాగరికత. ఈ సభ్యతామూలాల్లో ఉండే ఆర్థిక వ్యవస్థ ఎలాంటిది, ఏమిటనేదే నేను చెప్తున్నాను. ఈ సభ్యతని తల్లకిందులు చెయ్యడంలో మతం, రాజ్యం చాలా పాత్ర పోషించాయి. కాని మనం మాట్లాడుతున్నది అసలు ఒక నాగరికత తనలో తాను ఎలా ఉంటుందనే దాని గురించే.’

‘నాగరికత మూలంలో నేను చెప్పినట్లుగా ఒక అర్థశాస్త్రం- ఒక ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. అలాగే కళల మూలాల్లో, సంస్కృతిమూలాల్లో ఒక సౌందర్య దృష్టి ఉంటుంది. సంప్రదాయాల మూలాల్లో ఒక తత్త్వం ఉంటుంది. నేను మాట్లాడుతున్నదంతా దీని గురించే. ఇప్పటిదాకా మనం ఆర్థికవ్యవస్థ, గ్రామాల నిర్మాణం, గ్రామాల స్వరూపం, కోటల నిర్మాణం లాంటి వాటిగురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ సమాజంలో ఎవరికి వారు చిన్న చిన్న వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకవైపు చూస్తే ఇదంతా శ్రమజీవుల, కళాకారుల సమాజం. గ్రామంలో పూర్తి సాంకేతికత, విజ్ఞానమూ ఉండేవి. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది. విజ్ఞానం ఒక వస్తువు లేదా సాధనం. ఈ  వాద్యమొక విజ్ఞానం, వీణ తయారు చేయడం ఒక విజ్ఞానం. అన్ని సాధనాలూ విజ్ఞానమే. కానీ విజ్ఞానానికి ‘పరా’,  ‘అపరా’ లకీ ఉన్న సంబంధం ఏమిటి? విజ్ఞానం విజ్ఞానమే, కాని దీన్నుంచి సుందరమైన కళని సృష్టిస్తున్నారు. దాన్ని నువ్వు కావాలనుకుంటే ‘అపరా’ అంటే భౌతిక సుఖాల కోసం వాడుకోవచ్చు, లేదా ‘పరా’ అంటే ఆధ్యాత్మికత కోసం వాడుకోవచ్చు. లేదా రెండింటి కోసమూ వాడుకోవచ్చు.’

‘అందుకే నేను చాలా సార్లు చెప్తుంటాను- విద్యా , వ్యవస్థలూ సంపదకోసం, భూమిని సమృద్ధం చేయడం కోసం ఏర్పడ్డాయి. కాని మనవాళ్ళు సంపదనే సర్వస్వంగా భావించలేదు. ఆ సంపద పట్ల నిర్లిప్తంగా ఉంచే విషయాల్నే మనం జ్ఞానం అని పిలిచాం. విద్యావ్యవస్థల పని భూమినీ, ప్రతి ఒక్కరినీ సమృద్ధం చేయడమే. అది జ్ఞానం కాదు, కేవలం సమృద్ధి సాధన మాత్రమే. కాని ఆ సంపద పట్ల నిర్లిప్తంగా ఉండేలా చేసే విషయాల్ని మాత్రమే మనం జ్ఞానంగా భావించాం.’

‘కళాకారులు, జాతిపురాణాలు చెప్పేవాళ్ళు, భిక్షావృత్తి చేసేవాళ్ళు వీళ్ళంతా ఈ కోవలోకి వస్తారు. వారిని ఈ సమాజం ఎప్పుడూ ఆదరించింది. వారు తమంతట తాముగా ఎప్పుడూ ఒక ఆర్థిక వ్యవస్థగా స్థిరపడలేదు. వారి బాధ్యతని ఈ సమాజమే చూసుకోవాల్సి వచ్చేది. సమాజం గనుక అందంగా, సుఖంగా జీవించాలనుకుంటే ఇలాంటి వారికోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయవలసి ఉంటుంది.’

‘అందుకని మన దగ్గర ఉన్న అన్ని కులాల్లోనూ ప్రతి కులానికీ అనుబంధంగా కొన్ని కులాలు వచ్చాయి. వాటిని పోషించవలసిన బాధ్యత ఆ కులాల వారు తీసుకున్నారు. ఉదాహరణకి ఈ చర్మకారులున్నారు. వీరు కనీసం ఐదు కులాల్ని పోషించేవారు. డక్కలివాళ్ళు చర్మకారుల జాతిపురాణం చెప్పేవారు. డక్కలివాళ్ళ జాతిపురాణం చెప్పేవారు హీనోళ్ళు. ఆ తర్వాత సిందోళ్ళు, నెత్తికంపోళ్ళు, పచ్చబద్దోళ్ళు- ఇలా ఎందరో వస్తారు. అంటే ప్రతి ఒక్క కులంవారూ కూడా ఏదో ఒక అనుబంధ కులాన్ని ఖచ్చితంగా పోషించేవారు. అది కాకుండా మొత్తం గ్రామమంతా కలిసి పోషించే మరికొన్ని కులాలు కూడా ఉండేవి.’

‘మన భారతీయ సభ్యతలో ఒక నియమం ఉండేది- ప్రతి ఒక్కరూ ఉషస్సును దర్శించుకోవాలి. గ్రామంలో జీవించే ప్రతి ఒక్కరూ ఉషోదయాన్ని చూడాలి. తెల్లవారు జామున మూడున్నర, నాలుగు గంటల సమయంలో ఆకాశంలో వచ్చే ఎరుపుదనాన్నే ఉషస్సు అంటారు. దాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాత సూర్యాస్తమయం అయ్యేంతవరకు మంచం మీద కూర్చోవడం నిషిద్ధం. అందుకే మన మంచాల డిజైన్లు ఎలా ఉండేవంటే, పగటిపూట వాటిని గోడకు నిలబెట్టి ఉంచేలా ఉండేవి. సూర్యాస్తమయం అయ్యాకే మంచాన్ని కిందకి వాల్చాలి. అంటే రోజంతా ఎప్పుడూ పడుకోకూడదు, కూర్చోకూడదు, ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. పగటిపూట నిద్రని మన సంస్కృతిలో మంచిగా భావించలేదు. అందుకే ఒక తరం కిందటిదాకా మనవాళ్ళు మధ్యాహ్నం  పూట అస్సలు పడుకునేవారు కాదు. ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు.’

‘సరే, ఉషస్సును దర్శించుకోవాలంటే, అంత పొద్దున్నే లేవాలంటే, ఆ రోజుల్లో గడియారాల్లేవు, అలారాలు లేవు, మరి ఎలా లేచేవారు? ఆ సమయంలో నిద్రలేపే బాధ్యత సమాజంలో ఒకరు తీసుకునేవారు. తెల్లవారు జాము మూడున్నర-నాలుగు గంటల సమయంలో బుడ్డబుక్కలోడు వచ్చేవాడు. బుడబుక్క ఒక సమాజం పేరు. వారు వాయించే పరికరం బుడబుక్క. ఆ వాద్యం వల్లనే వారికా పేరు వచ్చింది. అదొక చిన్న డమరుకం లాంటిది. దాన్నుంచి చాలా తీక్ష్ణమైన శబ్దం వస్తుంది. వాడు ముఖం కూడా కడుక్కోకుండా, కళ్ళకు కాటుక పెట్టుకుని ఆ సమయంలో బయలుదేరతాడు. వాడి పని గ్రామంలో ఉన్న సైతాన్ ని బయటకు తోలడం. నిద్ర కంటే పెద్ద సైతాన్ ఇంకేముంటుంది? వాడి డమరుకం శబ్దం ఎంత తీక్ష్ణంగా ఉండేదంటే, వాడు పాడుకుంటూ వెళ్తే అందరూ నిద్ర లేచేవారు.’

‘ఆ తర్వాత వచ్చేవాణ్ణి బాలసంతోడు అనేవారు. వాడు ఒక గంట, శంఖం పట్టుకుని వచ్చేవాడు. వారికి వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లున్నాయి. మహారాష్ట్రలోనూ ఇలాంటివాళ్ళు చాలామంది ఉన్నారు.  కానీ అక్కడ పేర్లు వేరు. భారతదేశమంతటా వీరున్నారు, పురాణాలు చెప్పేవాళ్ళు, భిక్షావృత్తి చేసేవాళ్ళు దేశమంతటా ఉన్నారు. బాలసంతోడు వచ్చివెళ్ళిన తరువాత గోసమోళ్ళు వస్తారు. వాళ్ళు ఏక్ తార పట్టుకుని ఎంతో చక్కగా పాడుకుంటూ వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తరువాత వచ్చేది హరిదాసు. కాళ్ళకు గజ్జెలు కట్టి, చేతిలో తంబురా, చిడతలు పట్టుకుని, భైరవి రాగంలో పాడుకుంటూ, ఎంతో అందంగా నాట్యం చేసుకుంటూ వస్తాడు. అందరినీ మేల్కొల్పుతాడు.’

‘హరిదాసు వెళ్ళిన తర్వాత వచ్చేవాడు ‘జంగముడు ‘. తెల్లని వస్త్రాలు ధరించి, నల్లటి తంబురా పట్టుకుని ఎంతో వైరాగ్య గీతాలు పాడేవారు వాళ్ళు. మొదట బుడబుక్కలోడు వచ్చినప్పుడు అందరూ నిద్రలేచేవారు. రెండోవాడు అస్సలు పడుకోనిచ్చేవాడే కాదు. మూడోవాడు వచ్చేసరికి అందరూ స్నానపానాలు ముగించేవారు. సమాజంలో మొదటి భిక్ష హరిదాసుకే లభించేది. ఆ తర్వాత అందరూ పనులకు బయలుదేరినప్పుడు ఈ వైరాగ్య గీతాలు వినబడేవి- ఈ దునియా ఏమిటి, ఇదంతా అశాశ్వతం, ఇదంతా అంతమైపోయేదే అని. పనులకు వెళ్ళేటప్పుడు ఈ వైరాగ్య గీతాలు  ఎందుకు వినేవారంటే, రోజంతా ఎక్కడా ఏ తప్పూ, ఏ అన్యాయమూ చేయకుండా ఉండటం కోసం. ఆ సమయంలో అంటే ఉదయం ఏడు గంటల దాకా జంగాల సమయం ఉండేది. ఆ తర్వాత లేదు. మళ్ళీ మర్నాటి పొద్దున్న ఐదున్నరా, ఆరు గంటలకే కనబడేవారు. ఏడు గంటలకి వాళ్ళ పాత్ర ముగిసిపొయ్యేది.’

‘1851 నుంచి 1941 దాకా ఈ జాతులన్నిటిమీదా నిషేధం విధించారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాల గురించి నేను విన్నాను. ఈ నిషేధం దాదాపు 90 ఏళ్ళ పాటు నడిచింది. అయినా సరే, ఈ ప్రాంతంలో ఇవన్నీ సాగుతూనే వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ నేరుగా బ్రిటిష్ వారి పాలన సాగలేదు కదా, అందుకని ఇవన్నీ నడుస్తూనే ఉండేవి.’

‘పొద్దున్న ఏడుగంటలనుంచి తొమ్మిది గంటల తర్వాత అందరూ పొలాలకూ, పనులకూ వెళ్ళిపోయాక, పాములవాళ్ళూ, ఎలుగుబంట్లు ఆడించేవాళ్ళూ, ఎడ్లని ఆడించేవాళ్ళూ వచ్చేవారు. వీళ్ళు ఊళ్ళో మిగిలిపోయిన ముసిలివాళ్ళనీ, పిల్లల్నీ అలరించేవారు. ఒక రకంగా వీరంతా ‘లోక శిక్షకులు’. నేను వీరందరినీ లోకశిక్షకులు అనే అంటాను. కూర్చున్న చోటనే మనుషులకు ఎంతో విజ్ఞానాన్ని, సమాచారాన్ని ఇచ్చేవారు.’

‘పాములవాడు ఎన్నో రకాల పాముల గురించి చెప్పేవాడు. పిల్లల మెడలో పాములు వేసి వాళ్ళ పాములభయం పోగొట్టేవాడు. ఏ పాము విషపూరితమైంది, ఏది కాదు లాంటి విషయాలతో పాటు ఎన్నో పాముల కథలు, ఎన్నో జాతుల పాముల కథలు వినిపించేవాడు. మన సంస్కృతిలో నాగు వేరు, సర్పం వేరు. వాడు రకరకాల రంగుల పాముల్ని తెచ్చి చూపిస్తూ కథలు చెప్పేవాడు-ఇది తక్షకుడు, ఇది పరీక్షిత్తును కరిచింది, పరీక్షిత్తు భార్య తన సువాసినీ రంగుల్ని, అంటే కుకుమ, కాటుక, మెహిందీ రంగులు వీటిమీద వేసేసింది, ఆ రంగులే ఇలా ఉండిపోయాయంటూ ఎన్నో కథలు చెప్పేవాడు.’

‘ఎలుగుబంటివాడు వస్తే, పిల్లల్ని దానిమీద కూచోబెట్టేవాడు. దాని వెండ్రుకలు తాయెత్తులు తీసి ఇచ్చేవాడు. ఇదంతా మధాహ్నం రెండుమూడు గంటలదాకా సాగేది.  ఆ తర్వాత మధ్యాహ్నం పూట జాతిపురాణాలు చెప్పేవాళ్ళను చూసాం మేము. ఏడాది పొడుగునా ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు. వారి దగ్గర నలభై చేతుల  పొడుగుండే పెద్ద పెద్ద వర్ణచిత్రాలుండేవి. వాటిని పటాలు అంటారు. ఎంతో అందమైన చిత్రకళ ఉండేది వాటిమీద. వారు ఆ పటాల ద్వారా ఆయా జాతుల పురాణాల్ని వివరించేవారు. వారు చెప్తున్నప్పుడు కేవలం ఆ జాతివారే కాకుండా, ఊళ్ళో అందరూ కూర్చుని వినేవారు. ఎందుకంటే వాటిద్వారా అన్ని కులాల ప్రస్తావన, ఒక కులానికి మరో కులంతో ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎంతో చక్కగా వివరించేవారు. ఈ కథలు సాయంత్రం వరకూ సాగేవి.’

‘ఇక రాత్రి భోజనాలు ముగిసేవేళకి, మన జానపద నృత్యాలుండేవి-కోలాటం, చిడతల రామాయణం, భాగవతం వంటి ప్రదర్శనలు రాత్రిపూట నడిచేవి. అర్ధరాత్రిదాకా సాగేవి. వాటితో పాటు బుర్రకథల్లాంటివి కూడా ప్రదర్శించేవారు. అంటే పొద్దున్న నాలుగ్గంటలనుంచి రాత్రి తొమ్మిది-పదింటిదాకా గ్రామవాతావరణమంతా సంగీతమయ వాతావరణంగా ఉండేది. జీవరహితంగా కాకుండా, నిరంతరం ఏదో ఒక శబ్దం, ఒక సంగీతం గంభీరంగా వినిపిస్తూనే ఉండేవి. మన శ్రమజీవులు, కంసాలి, కుమ్మరి పని చేసుకుంటూనే ఆ లయకు అనుగుణంగా తమ పని తాము చేసుకుంటూ ఉండేవారు. సాలెవారు బట్టలు నేస్తూనే ఆ సంగీతంతో ఆనందం పొందేవారు.’

‘మన సభ్యతలో ఈ ‘నాదం’ అనేదానికి చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది. నటరాజ విగ్రహంలో ఏముంది? ఆ ప్రతిమలో ఆ గుండ్రటి ముఖమండలం భూమి, ఆ ఎగిరే జుత్తు వాయువు, ఆ జటాజూటం అగ్ని, ఆ గంగ జలం, ఆ చంద్రుడు ఆకాశం- ఇవి పంచమహాభూతాలు. ఈ పంచమహాభూతాలు కలిసినప్పుడు మొదట నాదం పుడుతుంది. పుట్టగానే ఏడవని బిడ్డ మట్టితో సమానం. వాని చైతన్యానికి గుర్తు వాడి ఏడుపే. వాడు బతికే ఉన్నాడనడానికి అదే గుర్తు. కాబట్టి నాదం చైతన్యానికి ప్రతీక. నాదం ఉంటేనే లయ ఉంటుంది. నాదం కోసం చేతిలో డమరుకం ఉంది. ప్రకృతిలో శబ్దాలన్నీ ఆగిపోతే మనం రాళ్ళలా మారిపోతాం. మన హృదయం చలించడానికి ఏ కారణమూ ఉండదు. మనం కదుల్తున్నామంటే దానికి కారణం ఈ శబ్దాలే.’

‘గోండీపురాణంలో ఒక చక్కని కథ ఉంది. ప్రళయం వచ్చినప్పుడు వారి పెర్సపేన్ లేదా మహాదేవుడు సృష్టిని ఊహించి ఒక కాకిని పుట్టించి భూమి విత్తనం తీసుకురమ్మని చెప్పాడు. అంతటా నీరే ఉండటంతో ఆ కాకి ఎగురుతూ వెళ్ళి నీటిలో ఉన్న ఒక ఎండ్రకాయమీద కూర్చుంది. అది దీని కాలుపట్టుకుంటే కాకి తన సమస్య చెప్పింది. అప్పుడు ఆ ఎండ్రకాయ నీటి అడుక్కి వెళ్ళింది. అక్కడ ఏడుగురు అక్కచెళ్ళెళ్ళు మట్టిని బంగారంలాగా తూస్తుంటే, అది వారి దగ్గరినుండి కొంత మట్టి నోట్లో పెట్టుకుని తెచ్చి కాకికి ఇచ్చింది. ఆ సమయంలో దేవతలు దాని వెనక పడి దాని మెడ కోసేసారు. అందుకే ఎండ్రకాయకు తలా, మెడా ఉండవు. కేవలం మొండెం మాత్రమే ఉంటుంది.’

‘ఆ కాకి ఆ మట్టి తెచ్చి మహాదేవుడికిస్తే ఆయన శేషుడి తలమీద ఆ మట్టి ఉంచి మథించడం మొదలుపెట్టాడు. అది మెల్లమెల్లగా పెరిగి పృథ్వి ఆకారం ధరించింది. కానీ శేషుడికి ఒక మాట చెప్పారు: ‘ఎంత వరకూ అయితే ఈ మథించే శబ్దం వినిపిస్తూ ఉంటుందో అంతవరకూ నువ్వు కదలకూడదు, దీన్ని సంభాళించి ఉండాలి’ అని. అందువల్ల ఈ సృష్టి ఏర్పడింది. ఈ శబ్దాలన్నింటినీ ఆ శేషుడు ఇప్పటికీ వింటూ, పరమాత్ముని కార్యం ఇంకా సాగుతూనే ఉందని భావిస్తూ తన తలమీద మోస్తున్నాడు. ఈ నాద, శబ్దాల బలం మీదనే ఈ సృష్టినిలిచి ఉంది.’

‘నాదం ఉంటేనే లయ ఉంటుంది. మన సంస్కృతిలో నాదానికి మొదటి స్థానం ఇచ్చారు. మనం ఏ శుభకార్యంలోనైనా వాద్యాన్ని ముందుంచుతాం. వాద్యం వైభవానికి గుర్తు కాదు, అది మన చైతన్యానికి గుర్తు. సమాజం చైతన్యవంతంగా ఉందనడానికి అది ఒక గుర్తు.’

‘నాదానికి మన శరీరంతో ఒక సంబంధం ఉంటుంది. ఇప్పుడు నువ్వు బస్సులో ప్రయాణిస్తున్నావు. ఏమీ చెయ్యకపోయినా అలసిపోతావు. ఎందుకు? ఎందుకంటే ఆ బస్సునుండి వచ్చే శబ్దం, ఆ నాదంతో మన శరీరానికి ఎలాంటి సంబంధమూ లేదు. కాబట్టి శబ్దాలు మన శరీరంతో కనెక్ట్ అయి ఉండాలి. నాదం ఎంత ప్రభావశీలమైందంటే, ప్రసేనజిత్తు అనే రాజుకి ఒక ఏనుగు ఉండేది. అది యుద్ధాల్లో ఎంతో వీరత్వం చూపించేది. కానీ కాలక్రమేణా అది ముసలిదైపోయి ఒక రోజు ఒక చెరువులో దిగి ఆ బురదలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా అక్కణ్ణుంచి లేవలేకపోయింది. రాజు కూడా వచ్చి బయటకు లాగడానికి ప్రయత్నించాడు. ఇక దానికి అక్కడే సమాధి చెయ్యక తప్పదనుకున్నారు. అప్పుడొకరు చెప్పారు: ‘దీన్ని పూర్వం నడిపించిన ఆ ముసలి మావటిని తీసుకురండి’ అని. వాడు వచ్చి ఏనుగును చూసి ‘రణభేరి వాయించండి’ అని అన్నాడు. భేరీ శబ్దం వినబడగానే ఆ ఏనుగు ఎక్కడలేని బలం తెచ్చుకుని ఆ బురదలోంచి లేచి నిలబడింది. నాదానికి అంతటి శక్తి ఉంది, అది మృతప్రాయుల్ని కూడా లేపి నిలబెడుతుంది.’

‘నాదానికి లయ ఉంటుంది. మన సమాజంలో ప్రతి కులానికీ, ప్రతి తెగకీ తమదైన వాద్యం, సంగీతం, నృత్యం ఉన్నాయి. చర్మకారులకి, కోలీలకి, గొండు, కొలాం, లంబాడాలకు- ప్రతి ఒక్కరికీ తమదైన శైలిలో తయారు చేసుకున్న వాద్యాలున్నాయి. ఆయా పనులకు అనుగుణంగా వారి నృత్యాలు కూడా ఉన్నాయి. దీనిమీద ఎవరైనా మరింత పరిశోధిస్తే బాగుంటుంది. ప్రతి కులానికీ ఉన్న వాద్యం ఏమిటి, అదెలా తయారవుతుంది, దానికి ఎలాంటి తోలు వాడతారనేది తెలుసుకోవాలి. బుడబుక్కకి కుందేలు చర్మం వాడతారు. చర్మకారుల డప్పుకి మేక చర్మం వాడతారు. కోలీల తప్పెటకి కోతుల చర్మం వాడతారు. సారంగికి జింక చర్మం, కంజరికి ఉడుము చర్మం వాడతారు. నగారాలకు మహిషచర్మం వాడతారు. ఇలా ప్రతి ఒక్క వాద్యానికి వేర్వేరు చర్మాలు ఉంటాయి. వాటి నాదం వేరుగా ఉంటుంది. ఇప్పుడు అన్నింటికీ ప్లాస్టిక్ వచ్చేసింది. దాంతో అన్నింటి శబ్దమూ ఒకేలా వినిపిస్తోంది. కానీ పూర్వం ప్రతి ఒక్క చర్మానికి ఒక ప్రత్యేకమైన నాదం ఉండేది.’

‘డమరుకంలోనే ఎన్నో రకాలున్నాయి. బుడబుక్క ఒక రకం. ఒగ్గుల దగ్గర ఉండే జగ్గు ఒక రకం. అది చాలా పెద్దగా ఉండి గంభీరమైన శబ్ద్దాన్నిస్తుంది. తోటీ వారిదగ్గరుండే డమరుకం శబ్దం వేరు. ఇక్కడ కీంకరి, కర్నాట్ అనే వాద్యాలున్నాయి. మెట్ల కిన్నెర అనే వాద్యం ఉంది. అందులో పన్నెండు మెట్లు ఉండి, దానిమీద నెమలి బొమ్మ ఉంటుంది. ఆ వాద్యం వాయిస్తూ నెమలిలాగా నర్తించేవారు. దాన్ని వాయించేవాడు డక్కలి గోపాల్ ఒక్కడే ఉండేవాడు. అతను రెండేళ్ళ కిందట చనిపోయాడు. అతను ఆ వాద్యం వాయిస్తూ నెమలిద్వారా కథలు చెప్పేవాడు. వడ్డెరి రామస్వామిగారి దగ్గర కడ్డీ అనే వాద్యం ఉండేది. తబలా, డగ్గా అన్నీ ఆ పుల్లలతోనే వాయించేవారు.’

‘ఈ వాద్యాలన్నింటినీ రికార్డు చేయాలి, లేదంటే ఈ కళలన్నీ అంతరించిపోతాయి. ఎందుకంటే, ఒకవేళ ఆయా కళలు అంతరించిపోయినా, వాటికి సంబంధించిన శాస్త్రం గనుక మన దగ్గరుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా వాటిని మళ్ళీ పునరుద్ధరించవచ్చు. భరతముని నాట్యశాస్త్రం రాసింది అందుకే. నాట్యం అంతరించిపోతోంది అని దాన్ని శాస్త్రబద్ధం చేసారు. శిల్పశాస్త్రం కూడా అంతే. శిల్పకళ అంతరించిపోయినా ఆ శాస్త్రం ఉండటం వల్లనే అది మళ్ళీ ప్రాణం పోసుకుంది. అలాగే ఈ సాంప్రదాయిక వృత్తులకీ, కళలకీ కూడా శాస్త్రాలు నిర్మించాలి.’

‘పనిని బట్టి శరీర స్వరూపం మారుతుంది. శరీర స్వరూపాన్నిబట్టి ఆయా అలంకారాలు, ఆభరణాలు తయారవుతాయి. ప్రతి కులానికీ తమదైన ఆభరణాల డిజైను ఉండేది. నిజాం నగల ఎగ్జిబిషను చూసినప్పుడు నాకు అనిపించింది-మన ప్రాంతంలోని ఆదివాసీ మహిళలు కూడా అవే గజ్జెలు, అవే హారాలు, అవే బాజుబందులు ధరిస్తారు. తేడా అల్లా వారి ఆభరణాలు వెండివి, సామాన్యమైనవి. నిజాంవి బంగారానివి, వజ్రాలు పొదిగినవీను. కేవలం ధాతువులోనే తేడా ఉంది తప్ప డిజైనులో కాదు. ఆ డిజైనులో అందరూ సమానులే.’

‘మన దగ్గర భాష, భోజనం, భే(వే)షం, భూషణం, భవనం- ఈ ఐదు ‘బ’ లు ఆధారంగానే ఆయా ప్రాంతాల సంస్కృతి ఏర్పడింది. చిన్న పరిశ్రమలు ఎప్పుడూ ఎక్కువ డిజైన్లని సృష్టించగలవు. పెద్ద కర్మాగారాలు ఒకే రకమైన వస్తువులు మాత్రమే తయారు చేయగలవు. చిన్న పరిశ్రమలు సమాజం  రంగురంగులుగా, వైవిధ్యభరితంగా ఉండాలని కోరుకుంటాయి. పెద్ద కర్మాగారాలు సమాజం మొత్తం ఒకేలా, యూనిఫాంగా ఉండాలని కోరుకుంటాయి.’

‘మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ ఇప్పుడు చేనేత ద్వారా వంద కోట్ల మందికి బట్టలెలా వస్తాయి అని అడుగుతారు. వంద కోట్ల మంది భోజనం చెయ్యడం లేదా? ఎక్కడినుండి వస్తోంది? అలాగే ఇదీ సాధ్యమే. పూర్వం ఉమ్మడి కుటుంబాలుండేవి. ఆ కుటుంబాల్లో ఇవన్నీ సాగేవి. పెద్ద కర్మాగారాలు వచ్చాక కుటుంబం కాస్తా వ్యక్తిగతంగా మారిపోయింది. కార్ఖానాలు చిన్నగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలుండేవి. ఇదంతా ఆధునికత పేరిట జరుగుతున్న మార్పు.’

‘సరే, భిక్షావృత్తి చేసే ప్రతిఒక్కరికీ తమదైన వాద్యం ఉంది. ఫకీర్ల దగ్గర శంఖం ఉంటుంది. కొమ్మోళ్ళు అనే ఒక జాతి ఉంది. వారు గొల్లోళ్ళకు కథలు చెప్తారు. వారి దగ్గర పెద్ద కొమ్ము ఉంటుంది. రెండు డోళ్ళు కలిపి ఒక వాద్యం చేస్తారు. అది వాయిస్తూ యాదవుల కథలు చెప్తారు. యాదవుల కథలు చెప్పేవాళ్ళు మందగోళ్ళు, మందయెచ్చోళ్ళు, కొమ్మోళ్ళు. మందగోళ్ళ వాద్యం బిగుల్ లాగా ఉంటుంది.’

‘శివాలయాల్లోని గంటలనుండి వచ్చే నాదం శివనాదం. విష్ణు ఆలయాలనుండి వచ్చేది ఓంకారనాదం. చర్చిగంటల్లోంచి వచ్చే నాదం ఒకరకమైన ప్రశాంతతను, వైరాగ్యాన్ని కలిగిస్తుంది. ఇలా ప్రతి ఒక్కదానికీ ఒక ప్రత్యేకమైన నాదప్రభావం ఉంటుంది. దేవాలయాల్లో వీటి గురించి ఎంతో పరిశోధన చేసి ఆయా గంటలు తయారుచేసారు.’

‘మన గ్రామాల్లో ఈ నాదం నిరంతరం ఘూర్ణిల్లాలి. ఇప్పుడు ఆ నాదాలన్నీ మూగబోయాయి. గ్రామాల్లో నిశ్శబ్దం ఆవరించింది. వాతావరణంలో సంగీతం లేకపోతే మనుషుల భాష కూడా కఠినంగా మారిపోతుంది. లయబద్ధమైన భాష ఉండదు. ఇదంతా ఒక గడబిడ. ఒక గ్రామాన్ని నిర్మించాలంటే కేవలం వృత్తికళాకారుల్ని ఒక్కచోట కూర్చోబెడితే సరిపోదు. ఈ నాదాన్నీ, ఈ కళల్నీ కూడా పునరుద్ధరించాలి.’

‘ఆయా పనుల్ని బట్టి, ఆయా జీవనశైలుల్ని బట్టి మన శరీరాలు, మన అలవాట్లు మారుతుంటాయి. మన పూర్వీకులు ప్రతి దానికీ ఒక లయనీ, ఒక సంగీతాన్నీ జోడించారు. దంచేటప్పుడు పాటలు, విసిరేటప్పుడు పాటలు, నూర్చేటప్పుడు పాటలు- ఇవన్నీ ఆయా పనుల్లోంచి వచ్చే శబ్దాల్ని అనుసరించి పుట్టినవే. ఆ నాదం మన శరీరానికి ఒక హాయినిస్తుంది.’

‘ఆవుల గజ్జెలు వేరు. గేదెల మెడలో కట్టే లొటారం వేరు. గొర్రెల గజ్జెలు వేరు. ప్రతి జీవికి అనుగుణంగా ఆయా శబ్దాలు తయారు చేసారు. ఆ శబ్దం వల్ల ఆయా జీవులకు కూడా ఒక ఉత్సాహం వస్తుంది. గుర్రాల గజ్జెలు గుండ్రంగా ఉండవు. పొడవుగా ఉంటాయి. ఎందుకంటే గుర్రం పరుగెత్తే విధానం వేరు. ఆ గజ్జెల శబ్దం వింటే గుర్రానికీ, రౌతుకీ కూడా ఒక ఉత్సాహం వస్తుంది. ఎడ్లబండిపై వెళ్తుంటే ఆ గజ్జెల శబ్దానికి అనుగుణంగా మనుషుల నోట గీతాలు పుడతాయి.’

‘ఇలా ప్రతి ఒక్కదానికీ వెనక ఎంతో విజ్ఞానం ఉంది. వీటిమీద మంచి రీసెర్చి జరగాలి. ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఈ కళలు రికార్డు చేయాలి. ఎందుకంటే నాదమే లయని, లయ తిరిగి గీతాన్నీ సృష్టిస్తాయి. ఆ నాదం మళ్ళా మన జీవితాల్లో భాగం కావాలి. సమాజంలో సౌందర్యదృష్టి చాల అవసరం అది లేకపోతే సమాజంలో ఈర్ష్యాద్వేషాలు పెరిగిపోతాయి. మనుషుల జీవనశైలి పాడైపోతుంది. కళలద్వారా, వాద్యాల ద్వారా, సంగీతం ద్వారానే ఆ సౌందర్యదృష్టి లభిస్తుంది. అందుకే వీటన్నిటినీ కాపాడుకోవాలి.’

‘మన పూజా విధానాలు చూసినా- ఒక చిన్నచోటు, ఒక విగ్రహం, దాన్ని కడిగి, రంగురంగుల కుంకుమ, గులాల్, అక్షతలు, చందనం అద్ది, పూలతో అలంకరించి, దీపం వెలిగించి, ధూపం వేస్తే, ఎంతో అందమైన వాతావరణం ఏర్పడుతుంది కదా. ఆ దేవుడు మనకు ఏదైనా ఇస్తాడో లేదో గాని ఆ కార్యం మనకు ఒక సౌందర్య దృష్టిని ఇస్తుంది. స్పేస్ డివిజన్, కలర్ సెన్స్ వంటి ఎన్నో విషయాల్ని నేర్పుతుంది.’

‘అందుకే మనకు ప్రతి కులానికీ ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ, ప్రత్యేకమైన ఆభరణాల శైలి ఉండేవి. అవన్నీ ఆయా పనుల్ని బట్టీ, శరీర స్వరూపాన్ని బట్టీ ఏర్పడ్డాయి. చేసే పనుల ద్వారా శరీర స్వరూపం మారుతుంది. ఒకసారి మేము భద్రావతి వెళ్ళినప్పుడు చూసాం-అక్కడి మహిళలు చేతులు వెనక్కి తిప్పి నడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బొగ్గు కాల్చే పనులు చేస్తారు. ఆ బొగ్గు చేతులకి అంటుకుని ఉంటుంది కాబట్టి దుస్తులకి తగలకుండా చేతులు అలా వెనక్కి పెట్టినడుస్తారు.  అది వారికి ఒక అలవాటుగా మారిపోయింది.’

‘కొంతమంది పెద్దపెద్ద నగరాలనుండి వస్తే, వారి నడక చూసి చెప్పేయవచ్చు, వారి ఇంట్లో ఎలాంటి ఫ్లోరింగు ఉందో- ఎందుకంటే చాలా నునుపైన ఫ్లోరింగు ఉన్నచోట, మనుషులు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు. అది వారికి ఒక అలవాటుగా మారిపోతుంది. ఉత్తరాంచల్ నుంచి వచ్చిన కొందరు కళాకారులు ఇక్కడి గ్రౌండులో ప్రయాణించడానికి అలసిపోయేవారు. కానీ వాళ్ళు కొండలమీద గాస్ సిలిండర్లు, ఇటుకలు మోసుకుంటూ కిలోమీటర్ల కొద్దీ సునాయాసంగా ఎక్కేస్తారు. ఎందుకంటే వారి నడక శైలి వేరు. ఇక్కడ సమతలంగా ఉండే నేలమీద నడక శైలి వేరు. అందువల్ల వారు ఇక్కడ అలసిపోయేవారు.’

‘చేనేత కార్మికుడు ఎక్కువసేపు నిలబడలేడు. గొర్రెల కాపరి ఎక్కువసేపు కూర్చోలేడు. ఎందుకంటే నేతకార్మికుడు రోజంతా కూర్చునే ఉంటాడు. గొర్రెల కాపరి రోజంతా నిలబడే ఉంటాడు. వాడు ఒక చేత్తో కర్ర పట్టుకుని ఒక కాలు పైకి మడిచి నిలబడతాడు. రోజంతా అలాగే ఉంటాడు తప్ప కూర్చోడు. వాని శరీరపు అలవాటు అది. దానికి అనుగుణంగానే అలంకారాలూ, నగలూ అన్నీ ఉంటాయి.’

‘మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలంటే భగవంతుడు ఇచ్చిన ఇరవైనాలుగ్గంటల్లో ఎనిమిది గంటలు నిద్రపోవాలి, ఎనిమిది గంటలు ఆహారంకోసం పనిచేయాలి, మిగిలిన ఎనిమిది గంటలు మన ఆధ్యాత్మిక సామాజిక జీవితం గడపాలి. ఆ సమయం ఉన్నప్పుడే ఈ కళలు, ఈ నాదాలు అన్నీ జీవించి ఉంటాయి. ఇరవైనాలుగ్గంటలూ కేవలం పొట్టకూటికే కష్టపడితే అక్కడ కళలకు స్థానం ఉండదు. అందుకే మనమొక సుందర జీవనశైలిని అలవర్చుకోవాలి. తక్కువ సమయం పనిచేసినా సరిపోయేలాంటి ఒక ఆర్థిక, సామాజిక స్వరూపాన్ని నిర్మించుకోవాలి. అటువంటి జీవనశైలి ద్వారానే గొప్ప నాగరికత నిలిచి ఉంటుంది. అటువంటి జీవనశైలిని మనం ఊహించాలి, నిర్మించాలి.’

‘సమాజంలో అప్పుడప్పుడు దురాచారాలు తలెత్తడం సహజం. శరీరంలోంచి మాలిన్యాలు ఎప్పటికప్పుడు విసర్జించకపోతే ఆ శరీరం ఎన్నిరోజులు బతుకుతుంది? మరణిస్తుంది. అలానే సమాజం కూడా తనలో పేరుకుంటున్న దురాచారాల్ని తొలగించుకోకపోతే అది అంతమైపోతుంది. కానీ మన సమాజంలో మంచి ఆచారాల కంటే చెడు ఆచారాల ప్రచారం ఎక్కువైపోయింది. ఆ దురాచారాల్నే పదే పదే చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. దానివల్ల సమాజం పట్ల మనకే ఒక రకమైన విరక్తి, ద్వేషం ఏర్పడింది.’

‘మంచి సంప్రదాయాల ప్రచారం ఎక్కడా జరగడం లేదు. కేవలం చెడు ఆచారాల ప్రచారమే సాగుతోంది. ఇప్పుడు  టీవీ సీరియల్సులోనూ అదే చూపిస్తున్నారు. సమాజాన్ని సంస్కరిస్తున్నాం అనే పేరిట అందులోని లోపాల్ని మాత్రమే వెతికి వెతికి చూపిస్తున్నారు. ఇదంతా ‘ఆధునికత’ అనే పేరిట జరుగుతున్న పెద్ద గడబిడ. దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే మనల్ని వెనకబడ్డవాళ్ళుగా చూస్తారు. ఆ భయంతోనే అందరూ ఆధునికత వైపు వెళ్తున్నారు. అందులోనే మునిగిపోతున్నారు. కానీ మనం మన గతాన్ని, మన మూలాల్ని కాపాడుకోవాలి. అటువంటి స్మృతిని మేల్కొల్పడమే నా పని.’

23-6-2026

4 Replies to “జీవన శిల్పి-21”

  1. నాగరికత మూలంలో ఒక ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. అలాగే కళల మూలాల్లో, సంస్కృతిమూలాల్లో ఒక సౌందర్య దృష్టి ఉంటుంది. సంప్రదాయాల మూలాల్లో ఒక తత్త్వం ఉంటుంది. అంటూ మొదలుపెట్టి మన ప్రాచీన గ్రామీణ సమాజం లో విలసిల్లిన విజ్ఞానానికి ‘పరా’, ‘అపరా’ లకీ ఉన్న సంబంధం ఎంత అద్భుతంగా వివరించారో ఈ సంభాషణలో గురూజీ.

    “విద్యావ్యవస్థల పని భూమినీ, ప్రతి ఒక్కరినీ సమృద్ధం చేయడమే. అది జ్ఞానం కాదు, కేవలం సమృద్ధి సాధన మాత్రమే. కాని ఆ సంపద పట్ల నిర్లిప్తంగా ఉండేలా చేసే విషయాల్ని మాత్రమే మనం జ్ఞానంగా భావించాం.” ఎంత బాగా సెలవిచ్చారు!

    భారతీయ సభ్యతలో గ్రామంలో జీవించే ప్రతి ఒక్కరూ తెల్లవారు జామున మూడున్నర, నాలుగు గంటల సమయంలో ఆకాశంలో వచ్చే ఉషస్సును దర్శించుకొని ఉషోదయాన్ని చూడాలన్న నియమం పాటించడానికి ఏర్పరిచిన వ్యవస్థ కోసం ప్రతి రోజు క్రమం తప్పకుండా ఉషోదయానికి ముందరే వచ్చి మేల్కొలిపే బుడబుక్కలవాడు, బాలసంతోడు , హరిదాసు, జంగముల నాదాలు, వైరాగ్య గీతాలు కేవలం శారీరక నిద్రను లేపడానికి కాదు గురూజీ చెప్పినట్టు పనులకు వెళ్ళేటప్పుడు ఆ గీతాల్లో వినబడే “ఈ దునియా ఏమిటి, ఇదంతా అశాశ్వతం, ఇదంతా అంతమైపోయేదే” అన్న తత్వం, రోజంతా ఎక్కడా ఏ తప్పూ, ఏ అన్యాయమూ చేయకుండా ఉండటం కోసం.” ఉదయం ఏడు గంటల దాకా జంగాల సమయం ఉండేదని. వాళ్ళు ఇలా వైరాగ్య గీతాలు పాడి జనాల్ని వైరాగ్యం వైపు సమ్ముఖులు గా నడిపించేవారని చదివినప్పుడు నాకు
    ఆముక్తమాల్యదలో మత్స్యధ్వజుడు, భోగిని అనే వేశ్య వద్దకు వెళుతూ త్రోవలో ఏదో సత్రపు అరుగు మీద పడుకున్న ఎవరో జంగముడి దో / బ్రాహ్మణుడిదో పాట విని విరక్తి చెంది భోగ విలాసాలను త్యజించిన సన్నివేశం, ఈ పద్యం గుర్తొచ్చింది.

    వినియె, నెలల్చతుర్ద్వయిని వృష్టి దినాళికి, రాత్రికై దివం
    బున, జరకై వయస్సునను బూని, పరంబున కిప్పుడుద్యమం
    బనువుగ జేయగా వలయునంచు బురోహిత ధర్మమాత్మ గీ
    ల్కొన నల విప్రుడా ద్విజులలోన సుభాషితముల్పఠింపగన్…

    గోండీ పురాణం లో కాకి కథ, నాదానికి శరీరానికి ఉన్న అవినాభావ సంబంధం, వివిధ నాదాలు, లయల గురించి వివరణ ఎంత బాగా చెప్పారో గురూజీ. అసలు ఎంత విలువైన సమాచారం ఆయన మస్తిష్కం లో నిక్షిప్తమై ఉందో . “మన దగ్గర భాష, భోజనం, భే(వే)షం, భూషణం, భవనం- ఈ ఐదు ‘బ’ లు ఆధారంగానే ఆయా ప్రాంతాల సంస్కృతి ఏర్పడింది” ఎంత గొప్ప పరిశీలన ఇది.

    గురూజీ ఈ సంభాషణకు ఇచ్చిన ముగింపు వాక్యాలు చదువుతుంటే “మంచి సంప్రదాయాల ప్రచారం ఎక్కడా జరగడం లేదు. కేవలం చెడు ఆచారాల ప్రచారమే సాగుతోంది. ఇప్పుడు టీవీ సీరియల్సులోనూ అదే చూపిస్తున్నారు. సమాజాన్ని సంస్కరిస్తున్నాం అనే పేరిట అందులోని లోపాల్ని మాత్రమే వెతికి వెతికి చూపిస్తున్నారు. ఇదంతా ‘ఆధునికత’ అనే పేరిట జరుగుతున్న పెద్ద గడబిడ. దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే మనల్ని వెనకబడ్డవాళ్ళుగా చూస్తారు. ఆ భయంతోనే అందరూ ఆధునికత వైపు వెళ్తున్నారు. అందులోనే మునిగిపోతున్నారు. కానీ మనం మన గతాన్ని, మన మూలాల్ని కాపాడుకోవాలి. అటువంటి స్మృతిని మేల్కొల్పడమే నా పని.” మీరు శీర్షికలో కోరుకున్నట్టు ఎప్పటికైనా గ్రామాల్లో మళ్ళీ ఈ నాదం ఘూర్ణిల్లుతుందా అని సందేహాలు కలుగుతున్నాయి భద్రుడు గారు.

    1. ఎంతో శ్రద్ధగా చదివి ఎంతో ఆర్తితో స్పందిస్తున్న మీకు నా హృదయపూర్వక నమస్కారాలు.

  2. తెల్లవారుజామున బుడబుక్కలోడు నుంచి మొదలై, బాలసంతోడు, హరిదాసు, జంగముడు, జాతిపురాణాలు, కోలాటాలు, బుర్రకథల దాకా రోజంతా గ్రామం నాదంతో, లయతో, కళలతో నిండిపోయి ఉండేదంటే కొంత వరకు చూసి వుండడం వలన I can imagine a day like that. Day filled with color, art and music!!

    రోజంతా కాకపోయినా, మా చిన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు వచ్చే బుడబుక్కలోళ్ళు, పాముల వాళ్ళు, ఆవును, ఎద్దును ఇంటింటికీ తిప్పుతూ రాముడు-సీత అంటూ వాటితో సంవాదం చూపించేవాళ్ళు, పండుగలప్పుడు పులి వేషాలు కట్టేవాళ్ళు, పగటిపూట భారతం చెబుతూ రాత్రిపూట దాన్నే ఆటగా ప్రదర్శించేవాళ్ళు, తోలుబొమ్మలాటలు ఆడించేవాళ్ళు వస్తూనే వుండేవారు.

    గురూజీ చెప్పినట్లు ఒకప్పుడు ఎంతో colorful గా ఉన్న పల్లెల్లో unfortunately ఇప్పుడు ఆ నాదమూ లేదు, అటువంటి చైతన్యమూ కనిపించడం లేదు.

    ఉషస్సును దర్శించుకోవాలి, పగటిపూట నిద్రపోకూడదు, ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి అన్న మాటలు చదువుతుంటే, నిజమే కదా అప్పట్లో అందరూ రోజంతా ఏదో ఒక పని మీదే ఉండటం చూశాను. ఇప్పుడైతే అందరూ గ్రామాల్లో కూడా TVలు cell phone మీద తమ కాలాన్ని వృధా చేసుకుంటున్నారు.

    అన్నిటికంటే ఈ కళల్ని, వాద్యాల్ని, సంప్రదాయ జ్ఞానాన్ని రికార్డు చేయాలని చెప్పిన విషయం చాలా ముఖ్యం అనిపించింది. ఒక కళ బతికుండకపోయినా, దాని వెనుక ఉన్న శాస్త్రం బతికుంటే దాన్ని మళ్లీ పునరుద్ధరించవచ్చు అన్న ఆలోచన very hopeful గా వుంది. 🙏🏽

    ఈ భాగంలో కూడా ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాను.

    Thank you Sir. 🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading