బసవన్న వచనాలు-18

216

వడగళ్ల తునకలాగా
లక్కబొమ్మలాగా
తనువు కరిగి పొందే సుఖాన్ని
నేనేమని చెప్పను?

కనుకొనలనుండి
ప్రవహిస్తున్నాయి
నయనసుఖజలాలు.

మా కూడలసంగమదేవుని
తాకిపొందిన సుఖాన్ని
నేనేమని చెప్పను? (849)

217

నాలుకకి సోకిన రుచికి
మనస్సే సాక్షి,
చాలదా? చెప్పండి.

తోటమాలిని అడిగి
మల్లె వికసిస్తుందా?

ఆగమాన్ని ఎదుటివాళ్ళకి
చూపించడం ఆచారమా?

మా కూడలసంగముణ్ణి కూడిన
ప్రేమకలయిక
మరొకళ్ళకి వివరించడం
సముచితమేనా? చెప్పండి? (850)

ప్రాణలింగి ఐక్య స్థలం

218

అందరి భర్తల్లాంటివాడు
కాడు చూడమ్మా!

నా ప్రియుడు దరిచేరడు
చేరి సింగారించడు.

కూడలసంగమదేవుడు
నన్ను
తనలోనే
పొదువుకున్నాడు. (851)

219

జ్ఞానమేదో,
గమనమేదో
సహజోదయమేదో
తెలియదు.

దైవప్రభ
లోబర్చుకుంది కాబట్టి
నాకేమీ తెలియదు.

కూడలసంగమదేవుడి
తలపుల్లో
నాకు మరేమీ తెలియదు. (852)

220

దేహం ఒక వంటపాత్ర
చైతన్యం పాకసామగ్రి.
సమత జలం.
కరణాదులు వంటచెరకు.

జ్ఞానమనే అగ్ని రగిల్చి
మతి అనే గరిటెతో కలయబెట్టి
బాగా వండి
భావంలో కూచోబెట్టి
పరిణామమనే
అన్నం వడ్డిస్తే

కూడలసంగమదేవుడికి
నైవేద్యమయింది. (853)

221

కళ్ళు నిండిన తర్వాత
చూడలేను.

చెవులు నిండిన తర్వాత
వినలేను.

చేతులు నిండినతర్వాత
పూజచెయ్యలేను.

మనసునిండిన తర్వాత
మహాత్ముడు కూడలసంగముణ్ణి
మరింక తలవలేను. (854)

222

అడుగడుగునా
నిధినిక్షేపం.

అడుగడుగునా
దివ్యక్షేత్రం.

అడుగడుగునా
నిధినిధానం.

అతడున్నచోటనే
వారణాసి.

కూడలసంగమశరణుడు
స్వతంత్రుడు కాబట్టి
అతడున్నచోట
ముక్తితో పనిలేదు. (854)

శరణుని జ్ఞానస్థలం

223

పిచ్చివాడు కన్నకలలాంటిది
శివాచారం.

అది ఏనుగు అద్దంలో
అణగిపోయినట్టు ఉంటుందయ్యా.

గుణవంతుడు గుణహీనుణ్ణి కలిస్తే
అది అతడి కర్మఫలం కదా.

కూడలసంగమశరణుల
అనుభూతి
ప్రపంచదుఃఖితులకి
తెలిసేది కాదు. (861)

224

తినే గిన్నె వేరే కంచుకాదు
చూసుకునే అద్దం మరో కంచుకాదు.

వంటకుండా
తినే కంచమూ రెండూ ఒక్కటే
రుద్ది చూడు,
అద్దంలాగా మెరుస్తుంది.

తెలుసుకున్నాడా
సంగడి మనిషి
మర్చిపోయాడా
మామూలు మనిషి.

మరిచిపోక పూజించయ్యా
కూడలసంగమయ్యని. (862)

225

చెరువులు, కుంటలు, బావులు
ఇంకిపోయినప్పుడు
నాచూ, బురదా, నత్తగుల్లలూ
బయటపడతాయి.

సముద్రం ఇంకిపోయినప్పుడు
రత్నాలూ, ముత్యాలూ
బయటపడతాయి.

మా కూడలసంగని మనుషులు
మనసారా మాట్లాడినప్పుడు
మహదేవుడే బయటపడతాడు. (863)

226

కుండ పగిలి
మళ్ళా మన్నుకావడం
జరగనిపని

నెయ్యి కరిగి
మళ్లా వెన్న కావడం
జరగనిపని.

పసిడి కరిగి
మళా ఇనుము కావడం
జరగని పని.

ముత్యం కరిగి
మళ్ళా నీరు కావాడం
జరగని పని.

శరణుడు మళ్ళా
మామూలు మనిషి కావడం
జరగనిపని. (870)

227

లగ్నమెక్కడిది?
విఘ్నమెక్కడిది?
సంగా
దోషమెక్కడిది?
దురితమెక్కడిది?

మానకుండా నిన్ను
తలచుకునేవాడికి
కూడలసంగయ్యా
ప్రపంచ
బంధమెక్కడిది? (872)

శరణుని శరణస్థలం

228

చూడండయ్యా
శరణుడు నిద్రపోతూ ఉంటే
అదే జపం.

శరణుడు
లేచు కూచున్నాడా
చూడండయ్యా
అదే శివరాత్రి.

చూడండయ్యా
శరణుడు ఏం చేస్తే
అదే పవిత్రం.

శరణుడు
ఏమి మాట్లాడితే
చూడండయ్యా
అదే శివతత్త్వం.

కూడలసంగముణ్ణి
నమ్ముకున్నవాడి
కాయమే
కైలాసం. (874)

229

సముద్రం గొప్పదందామా?
ధరిత్రిమీద అణగింది.

ధరిత్రి గొప్పదందామా?
నాగేంద్రుడి
పడగలనే మణులమీద
అణగింది.

నాగేంద్రుడు గొప్పందామా?
పార్వతి చిరుగజ్జెల
మువ్వగా ఒదిగాడు.

పార్వతి గొప్పదందామా?
పరమేశ్వరుడికి
అర్థాంగి అయ్యింది.

పరమేశ్వరుడు గొప్పవాడందామా?
మా కూడలసంగమశరణుల మనస్సు
కొనలమీద,
మొనలమీద
ఒదిగిపోయాడు. (877)

230

స్థలం ఒక్కటే
శివాలయానికీ
మాలపల్లికీ.

జలం ఒక్కటే
శౌచానికీ
ఆచమనానికీ.

కులం ఒక్కటే
తన్ను తాను
తెలుసుకున్నవాడికి.

ఫలమొక్కటే
షడ్దర్శనాలకీ
ముక్తికీ.

నెలవు ఒక్కటే
కూడలసంగమదేవా
మిమ్మల్ని
తెలుసుకున్నవాడికి. (880)

11-12-2023

7 Replies to “బసవన్న వచనాలు-18”

  1. కాగితం ఒక వంట పాత్ర
    అక్షరాలు పాక సామగ్రి
    సీర జలం
    సహనము వంట చెరకు

    జ్ఞానమనే అగ్ని రగిలిచి
    ప్రీతి అనే గరటేతో కలియ బెట్టి
    అ కుాడలసమగమదేవుడి నైవేద్యమును మాకు
    ప్రసాదించిన పరమాత్మనికి
    మా ప్రణామాలు 🙏🛐

      1. చిన్న వీరభద్రుడి పాఠకుల అనుభూతి
        నిజంగా ఏనుగు తినే చెరుకుకాడ లాంటిది..
        అది ఎండు గడ్డి తినే గొర్రెలకి తెలిసేది కాదు.. వివరించేది అంతకన్నా కాదు 🙏

  2. అతడున్న చోటనే
    వారణాసి
    రాముడున్న చోటనే
    అయోధ్య
    స్వ పర భేదం లేనివాడే
    సాంబుడు
    ఉచ్ఛ నీచముల అంతరముల
    నెరుగనివాడే కూడల
    సంగమ దేవుడు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading