చివరి రొమాంటిక్

కార్ల్ మార్క్స్ కవి అని అతని రచనలు చదివినవారికి ఎవరికైనా స్ఫురిస్తుంది. మార్క్స్, ఎంగెల్స్ రచనల్లో మార్క్స్ శైలికీ ఎంగెల్స్ కీ శైలికీ మధ్య భేదం కూడా సాధారణ పాఠకుడికి కూడా ఇట్టే చప్పున బోధపడుతుంది. ఎంగెల్స్ శైలి శాస్త్రకారుడి శైలి. నిర్దుష్టం గానూ, నిర్దిష్టంగానూ, తాను చెప్తున్నదానికి మరో అర్థమిచ్చే అవకాశమేమీ లేకుండానూ, సూటిగానూ, స్పష్టంగానూ ఉండే శైలి అది. కాని మార్క్స్ శైలి అలా కాదు. అతడి భాష భావోద్వేగభరితంగా ఉంటుంది. కొన్నిసార్లు కవిత్వంలానూ, కొన్నిసార్లూ ఉద్విగ్నపూరితమైన సంభాషణలానూ ఉంటుంది. అందుకని కొందరి దృష్టిలో మార్క్స్ ఒక రొమాంటిక్. చాలామంది దృష్టిలో ఆయన చివరి రొమాంటిక్. కమ్యూనిష్ట్ మానిఫెష్టో వెలువడ్డ 1848 నే రొమాంటిసిజం తాలూకు చివరి సంవత్సరంగా సాహిత్యచరిత్రకారులు లెక్కేస్తుంటారు.

మార్క్స్ చిన్నప్పుడు స్కూలు విద్యార్థిగా ఉన్నప్పణ్ణుంచే సాహిత్యమంటే ప్రేమ పెంచుకున్నాడనీ, యూనివెర్సిటీలో చేరాక, కవి కావాలని అనుకున్నాడనీ తెలిసినప్పుడు, అందుకే, ఆశ్చర్యం అనిపించదు. ఒక సాహిత్యసృజనకారుడిగానే తన భవిష్యత్తుని కలగన్నాడనీ, ప్లేటో తరహా సంభాషణలు రాయాలనుకున్నాడనీ, ఒక విషాదాంత నాటకం, ఒక నవల రాయడానికి పూనుకున్నాడనీ కూడా ఇప్పుడు మనకు తెలుస్తోంది. కాని కవి కావాలనుకున్న తన కోరికపట్ల అతడు చాలా తొందరగానే నిరుత్సాహానికి లోనయ్యాడనీ, 1841 నాటికే, అంటే ఇరవైమూడేళ్ళ వయసుకే  తనకు సాహిత్యకారుడు కాగలిగే శక్తిలేదనే నిశ్చయానికి వచ్చేసాడని కూడా ఉత్తరాలు చెప్తున్నాయి. అయినా కూడా మరికొన్నాళ్ళు కవిత్వసాధన కొనసాగిస్తూనే వచ్చాడు, చివరగా 1839లో జెన్నీకి ఒక కవితాసంకలనం బహూకరించినప్పుడు అందులో తన కవిత్వం తప్ప తక్కిన కవులనుంచీ, జానపదగీతాలనుంచీ తనకు నచ్చినవాటిని ఏరికూర్చి కానుక చేసాడు. ఇక ఆ తర్వాత అతనిలోని కవి ప్రత్యేకమైన కవితలు రాసే రూపంలో, ప్రత్యేకమైన కవితల్ని ఏరి కూర్చి పెట్టుకునే కవిత్వాభిమానిరూపంలో అదృశ్యమైపోయాడు. ఆ తర్వాత మిగిలింది ఒక తత్త్వవేత్త. కాని ఆ తత్త్వవేత్త పూర్తిగా కవిత్వద్రవ్యంతో రూపొందిన తత్త్వవేత్త. షేక్ స్పియర్, ఎస్కిలస్, గొథే లు రక్తంలో ప్రవహిస్తున్న తత్త్వవేత్త. అందుకనే అతని ఆలోచనలు, పదజాలమూ, వ్యక్తీకరణ శైలి ఎంత బలమైనవిగా రూపొందాయంటే, అతడు మరణించి వందేళ్ళు తిరక్కుండానే (1883-1993) సగం ప్రపంచం అతడి భావాలకు అనుయాయిగా మారిపోయింది.

1836-37 మధ్యకాలంలో అయన రాసుకున్న కవిత్వంలో 120 ఖండికలదాకా లభ్యమవుతున్నాయంటున్నాడు ఫిలిప్ విల్సన్.  వాటినుంచి పన్నెండు కవితల్ని ఎంపిక చేసి Evening Hour పేరిట జర్మన్-ఇంగ్లిషు ద్విభాషా సంపుటిగా వెలువరించాడు విల్సన్. ఆ సంపుటిని పోయిన ఏడాది ఆర్క్ పబ్లికేషన్స్ వారు ప్రచురించారని తెలియగానే వెంటనే తెప్పించుకుని చదివాను. ఆ పుస్తకాన్ని పరిచయం చేయాలని అనుకుంటూనే తాత్సారం చేస్తో వచ్చాను. అందుకు కారణం లేకపోలేదు. వాటిని నేరుగా వచన కవితలుగా కాక, పద్యాల్లోనో లేదా మాత్రాఛందస్సుల్లోనో అనువదించాలని అనుకోవడమే అందుకు కారణం.

జర్మన్ మాత్రాఛందస్సుల్లోని లయ, అంత్యప్రాసలు ఆ కవితలకు ఇచ్చిన అందాన్ని మనం కూడా తెలుగులో సమాంతరంగా పట్టుకురావాలంటే ముత్యాలసరాలో లేదా చతురశ్రగతి, ఖండగతి గేయాలుగానో మార్చవలసి ఉంటుంది. కవిత్వంలో, అదీ జర్మన్ కవిత్వంలో, మార్క్స్ కి ఒక నమూనా ఉన్నాడు. అతడు హైన్రిఖ్ హైని. పందొమ్మిదో శతాబ్దపు జర్మన్ భాషని హైని అపూర్వమైన కావ్యభాషగా తీర్చిదిద్దాడు. నేను ఇంతకుముందు హైని కవిత్వాన్ని పరిచయం చేస్తూ, హైని ఎవరెవరిని ప్రేమించాడా అని అతడి జీవితచరిత్రకారులు ఆరా తీస్తూ వచ్చారుగాని, అతడు తన జీవితంలో నిజంగా ప్రేమించింది ఒకే ఒక్కర్ని, అది జర్మన్ భాషని అని రాసాను. హైని ప్రేమించినంతగా మార్క్స్ కూడా జర్మన్ ని  ప్రేమించాడు. అతడి నవయవ్వనంలో తొలిసారిగా ప్రేమలో పడ్డప్పుడు ఆ ప్రేమని వ్యక్తం చెయ్యడానికి అందరిలాగా రోజువారీ జర్మన్ ని కాకుండా గొథే, హైని లాంటి కవులు తీర్చిదిద్దిన జర్మన్ కోసం వెతుక్కున్నాడు. కాబట్టి ఆ కవితల్ని ఊరికే వచనంలో అనువదించడమంటే, బహుశా, ఆ మూడ్ ని పరిచయం చెయ్యగలనేమోగాని, అతడి హృదయంలోని poetic fire ని మాత్రం కాదు.

ఉదాహరణకి

The lantern burns so softly

And casts a mellow light

It seems to weep beside me

As if it knew my plight

అనే పద్యచరణమే తీసుకోండి

దీపమొక్కటి వెలుగుచున్నది

పరచుచునుపరిపక్వకాంతిని.

నాదు శోకము తాను గైకొని

ఏడ్చునట్లగుపించుచున్నది.

అని చెయ్యవచ్చు. కాని గేయఫణితిని తేగలిగాను గాని, ఆ భావస్ఫూర్తిని పూర్తిగా పట్టుకురాలేకపోయాను కదా. Evening Hour  అనే ఈ పద్యాన్ని తెలుగు చెయ్యగల కవి ఎవరున్నారా అని ఆలోచించాను, కృష్ణశాస్త్రి తప్ప మరొక కవి కనిపించడం లేదు. ప్రభవ పద్యాలు రాసిన శ్రీ శ్రీ కొంతవరకూ కృతకృత్యుడు కాగలడేమో.

కాని ఏమి చెయ్యను? పుస్తకాలు సర్దినప్పుడల్లా, ఆ పుస్తకం నాకేసి చూస్తోనే ఉంది. దాన్ని అలమారులో లోపలి వరసలో పెట్టెయ్యలేను. అలాగని ఆ కవితల్నిగీతాలుగా మార్చనూ లేను.

అలాగని ఈ పుస్తకాన్ని నా బల్లమీద ఆట్టే రోజులు పెట్టుకోనూలేను. ఒకటి రెండు కవితలేనా మీతో పంచుకుంటే, ఈ పుస్తకాన్ని పక్కన పెట్టి, మరో కవిని తెరవగలుగుతాను.

అందుకని, ఇవిగో, ఒకటి రెండు, కవితలు మీ కోసం.

సంధ్యవేళ

ఆ లాంతరు మృదువుగా జ్వలిస్తున్నది

కాయ పండినప్పటి కాంతి ఆ చుట్టూ.

నా  దుర్దశ ఏదో తెలిసినదానిమల్లే

నా చెంత నిలబడి శోకిస్తున్నట్టుంది.

నా ఒంటరితనాన్ని పసిగట్టినట్టుగా

నా వక్షస్థలమ్మీద ఆనుకుంటున్నది

తలాతోకాలేని నా ఊహల్లో దాని నీడ

భూతాకృతులు సంతరించుకుంటున్నది.

అది నికృష్టఛాయ, వికృతాకృతి

అయినా గ్రహించకపోలేదు,  నా

ఎదలో రగులుతున్న అగ్ని ముందు  

తాను వెలవెలబోక తప్పదని.

కాని అయ్యో ఆ అగ్ని వాడిపోతున్నది

అలాగని అది ఆరిపోవడం అసాధ్యం.

బహుశా, నీ ఆత్మసాగర ప్రకాశాన్ని నేను

 బలంగా ప్రతిఫలించలేకపోతున్నట్టున్నది.

విలాపం

నాతోనేను తలపడుతున్నాను, ఓడిపోతున్నాను

ఈ సంఘర్షణ నా ఆత్మని శోధిస్తున్నది, చీలుస్తున్నది

సంకెళ్ళకు కట్టుబడ్డ ఈ పాత్ర పోషించలేక నీకు

మరింత చేరువకావాలని హృదయం పరితపిస్తున్నది.

 

కాని కనరాదే  నువ్వు ప్రేమిస్తున్నట్టు ఏదో ఒక అభిజ్ఞ,

కనీస సంకేతం, దయాపూరిత, కనీసం ఒక మాట.

నీ పెదాల మీద కనీస ప్రేమనామోచ్చారణ.

అయినా నా లోపల, అగ్ని, దహిస్తూనే ఉన్నది.

 

ఎంతోసేపు పట్టదు ఇదంతా నిష్ఫలమైపోడానికి.

కోరికలు ఫలించకుండానే  శూన్యం కాకతప్పదు

నిండారా ప్రేమ పొంగిపొర్లిన నా హృదయం

కృశించి, రిక్తమై, ఇంతలోనే ఎండిపోక తప్పదు.

 

ఇంకా నా ఆత్మవృక్షం పైకి కొమ్మలు చాపుతున్నది

ఎంత ఎగబాకినా ఫలితం శూన్యమని తెలుస్తున్నది.

గగనసీమను దాటిన ద్యులోకాన్ని అందుకోడానికి,

ఆ శాఖోపశాఖలు, చేతులు పైకి చాపుతున్నవి.  

 

ఏమి చెప్పు, ఈ విలాపం నిరర్ధకం. స్వర్గాన్ని

భూమికి దింపాలన్న నా పరితాపం నిష్ఫలం.

నువ్వింక చూపులు అటువైపు తిప్పుకున్నాక

కడపటి ధైర్యం కూడా కనరాకపోతున్నది.

10-1-2023

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading