నా చంపారన్ యాత్ర-2

సంజయ్ సత్యార్థి ఆసక్తికరమైన మనిషని అర్థమయింది. ఆయన మర్నాడు మధ్యాహ్నానికి గాని మాకు టైము ఇవ్వలేనన్నవాడు, మమ్మల్ని పొద్దున్నే మూజియం దగ్గరికి రమ్మన్నాడు. ఆ రోజు రక్షాబంధనం కాబట్టి మధ్యలో మూడు నాలుగు గంటలు తనకి విరామమిస్తే, రోజంతా మాతోనే ఉంటానన్నాడు.

ఆయన చెప్పినట్టే, మర్నాడు అంటే, ఆదివారం పొద్దున్నే గాంధీమూజియం దగ్గరకి వెళ్ళేటప్పటికి ఆయన మా కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ మూజియం ఎదురుగా కొంత ఖాళీస్థలముంటే, అక్కడ ప్రభుత్వం ఒక చరఖా పార్కులాగా రూపొందించింది. అక్కడ చరఖా నమూనా ఒకటి, కొన్ని గాంధీ ప్రతిమలు, కుడ్యచిత్రాలు ప్రదర్శనకోసం ఏర్పాటు చేసారు.

అక్కడ అడుగుపెట్టగానే సత్యార్థి తన బాగులోంచి ఒక గాంధీటోపీ తీసి నన్ను పెట్టుకోమన్నాడు. అతడి ముచ్చట కాదనలేక పెట్టుకున్నాను గానీ, నాకు ఆ అర్హత లేదనిపించింది. పాంటూ, షర్టూ మీద ఆ టోపీ అతకలేదనిపించింది. స్వతంత్రభారతదేశంలో పుట్టి, నాలుగక్షరాలు నేర్చుకున్న మిథ్యావిద్యావంతుల్లానే నేను కూడా ప్రజాజీవితానికి దూరంగా జీవిస్తున్నవాణ్ణి. మన కాలం మేధావులు చాలామందిలానే, ప్రజలతో కలిసి మెలిసి జీవించకుండానే, వాళ్ళ మంచిచెడ్డలగురించి తీర్మానాలు ప్రకటిస్తున్నవాణ్ణి. మొన్న సోమయ్యగారు అంటున్నారు నాతో. గాంధీజీ అన్నిటికన్నాముందు సామాన్యమానవుడితో మమేకమైన వ్యక్తి అని. మనకి లభించిన విద్యావకాశాలవల్లా, ఉద్యోగావకాశాలవల్లా మనం అరకొరగా నేర్చుకున్న నాలుగుమాటలతోనూ ప్రజలకి ఏది మంచో ఏది చెడో తీర్పులివ్వడానికి సిద్ధపడుతున్న దుస్సాహసం మనది. ఇదొక కొత్త సంస్కృతి. ఇప్పుడు ఈ దేశంలో ప్రజల గురించి మాట్లాడటమంటే శాసనసభలనుంచి విశ్వవిద్యాలయాలదాకా మనకొక career opportunity. మనలో ప్రతి ఒక్కరం ఒక ప్రజాసమూహానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం అనుకుంటూ మనల్నీ వాళ్ళనీ కూడా నమ్మించుకోడం కోసం తక్కిన ప్రజాసమూహాల్ని ఏదో ఒక ప్రాతిపదిక మీద ద్వేషించడం, దూషించడం వ్యాపకంగా మారిపోయిన వాళ్ళం. తన కాలంనాటి అన్ని రకాల మౌఢ్యాల్నీ దాటి, సామాన్యమానవుడితో మమేకమై జీవించగలిగిన గాంధీ టోపీ తాకడానికి కూడా నాకు అర్హత లేదనిపించింది. కానీ, సత్యార్థి నన్ను వదల్లేదు. ఆ రోజంతా నేను ఎప్పుడు ఆ టోపీ తీసేస్తున్నా అతడు మళ్ళా పట్టుబట్టి నాతో తొడిగిస్తూనే ఉన్నాడు.

c1

అక్కణ్ణుంచి అతడు మళ్ళా రైల్వే స్టేషన్ కి తీసుకువెళ్ళాడు. నిన్న రాత్రి స్పష్టంగా చూడలేకపోయిన ఆ పోస్టరు ఎగ్జిబిషన్ ని ఇప్పుడు మరింత తీరిగ్గానూ, మరింత నిశితంగానూ చూడగలిగాను. ఆ ఫొటోల ఎంపికగానీ, ఆ డాక్యుమెంటేషను గానీ, ముఖ్యంగా చంపారన్ లో నీలిమందు చరిత్ర గురించి ఎంతో గ్రాఫికల్ గానూ, అత్యున్నత ప్రమాణాలతోనూ రూపొందించిన ప్రదర్శన అది.

c3

ఆ తరువాత మేం ఒకప్పటి జిల్లాబోర్డు కార్యాలయానికి వెళ్ళాం. చంపారన్ ఎంక్వైరీ కమిషన్ ఆ ప్రాంగణంలోనే విచారణ చేపట్టింది. అక్కడ ఆ కమిటీ వాడిన పెద్ద టేకు బల్లని గాంధీ మూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ఆ ప్రాంగణంలోనూ, గోడలమీదా, తలుపుల మీదా కూడా చాలా అందమైన, అరుదైన గాంధీ ఛాయాచిత్రాలూ, వర్ణచిత్రాలూ ఉన్నాయి.

ఆ తర్వాత అతడు రక్షాబంధనం కార్యక్రమానికి వెళ్ళిపోతాడనుకున్నాను గాని, అతడిలోని గాంధీ ప్రేమి చాలా బలంగా ఉన్నాడు. తాను ఆ రోజుకి పెట్టుకున్న ప్రోగ్రాములన్నీ రద్దుచేసేకున్నాననీ, పది నిమిషాలు తనకి సమయమిస్తే ఆర్యసమాజ మందిరం దగ్గర రక్షాబంధన పూజకి హాజరై వచ్చేస్తాననడంతో మేం కూడా అతడితో పాటు ఆర్యసమాజమందిరానికి వెళ్ళాం.

2

గాంధీ 1917 ఏప్రిల్ 15 న మోతీహారిలో అడుగుపెట్టినప్పుడు ఆయన్ని లోమరాజ్ సింగ్ అనే ఒక నీలిమందురైతు వచ్చి కలిసాడు. అతడు నీలిమందుతోటలకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాడని ఆ ఫాక్టరీ యజమాని అతడి అరటితోట నరికేసి, అతడి ఇల్లూ, వాకిలీ నేలమట్టం చేసి, అతడి కుటుంబాన్ని భయభ్రాంతుల్ని చేసాడు. అతడు గాంధీని తన ఊరికి వచ్చి తనకు జరిగిన నష్టాన్ని కళ్ళారా చూడమని అడిగాడు. ఆ మర్నాడు పొద్దున్నే గాంధీని తన ఊరికి తీసుకురావడానికి ఒక ఏనుగు పంపించాడు. గాంధీ మరొక ఇద్దరు యువలాయర్లతో కలిపి ఆ ఏనుగు ఎక్కి లోమరాజ్ సింగ్ గ్రామమైన జసౌలి పట్టికి బయల్దేరాడు. కాని ఆరేడుకిలోమీటర్ల దూరంలో చంద్రాహియా అనే గ్రామం చేరేటప్పటికే, ఆయన్ను పోలీసులు అడ్డగించి మేజిస్ట్రేటు ఉత్తర్వులమీద వెనక్కి తీసుకొచ్చేసారు.

అందుకని నా సందర్శనలో మొదటగా ఆ గ్రామం చూడాలనుకున్నాను. ఇప్పుడు ఆ గ్రామంలో, అక్కడ గాంధీజిని ఏ స్థలం దగ్గర అడ్డగించారో అక్కడ ఒక స్మారక మందిరం నిర్మిస్తున్నారు. ఒక లైబ్రరీ, సమావేశమందిరం, అతిథి గృహం కూడా నిర్మాణంలో ఉన్నాయి. గాంధీకి మేజిస్ట్రేటు పంపిన ఉత్తర్వులు, దానికి గాంధీ ఇచ్చిన సమాధానం అక్కడ పెద్ద పెద్ద ఫలకాల్లో చెక్కి ప్రతిష్టించారు. ఇప్పుడు భారతీయ రైల్వే, పర్యాటక శాఖ బీహార్ లో రూపకల్పన చేస్తున్న Champaran Circuit కి అది మొదటి మజిలీ గా రూపొందుతున్నది.

c4

ఆ స్మారకమందిరం చూసాక నాకు ఆ గ్రామాన్నీ, ఆ ప్రజల్నీ కూడా చూడాలనిపించింది. ఆ పర్యాటక ప్రాంగణం ఎదురుగానే ఒక బీద జనావాసం కనిపించింది. వాళ్ళు మూష్ హార్ అనే కులానికి చెందిన వాళ్ళని తెలిసింది. మూష్ హార్ లు సాంప్రదాయికంగా ఎలుకలు పట్టుకుని, తిని జీవించే అత్యంత నిరుపేద జాతి. ఆంధ్రప్రాంతంలో వాళ్ళని షెడ్యూల్డు తెగగా గుర్తించారు కాని, బీహార్ లో వాళ్ళని షెడ్యూలు కులంగానే పరిగణిస్తున్నారని తెలిసింది. వాళ్ళ ఇళ్ళు చూద్దామని ఆ జనావాసంలో అడుగుపెట్టాను. అక్కడ కొంతమంది స్త్రీపురుషులు, వంటినిండా గుడ్డకూడా లేని మనుషులు, ఒక పెద్ద ఊరపంది కళేబరాన్ని మధ్యలో పెట్టుకుని మాంసం ముక్కలు తరుక్కుంటూ ఉన్నారు. ఆ ఆవాసమంతా అత్యంత అపరిశుభ్రంగానూ, దుర్గంధమయంగానూ ఉంది. వాళ్ళ ఇళ్ళల్లో ఎలా ఉంటుందో చూద్దామని ఒక ఇంట్లో అడుగుపెట్టాను. ఆ ఇంట్లో తైల సంస్కారం గాని, సరైన వస్త్రంగాని లేని ఒక ఏడెమినిదేళ్ళ బాలిక కనబడింది. ‘నువ్వు చదువుకుంటున్నావా’ అనడిగాను. ఆమె తల్లిదండ్రులు లేరనీ, ఆమె ఏదో కూలిపని చేసుకుంటూ బతుకుతోందని పొరుగింటామె చెప్పింది. నాకు అక్కడ మరొక నిమిషం కూడా ఉండలేననిపించింది. వడివడిగా అక్కణ్ణుంచి వెనక్కి వచ్చేసాను.

ఆ తర్వాత వాళ్ళ గురించిన సమాచారం పరిశీలిస్తుంటే వాళ్ళల్లో అక్షరాస్యత కేవలం 3 శాతమే ఉందనీ, స్త్రీలలో చదువుకున్నవాళ్ళు నూటికి ఒకరు కూడా లేరనీ తెలిసింది. స్వతంత్రభారతం, స్వచ్ఛభారతం ఇంకా అక్కడకు చేరలేదు. అసలు వాళ్ళ ప్రపంచం భారతదేశానికి చెందింది కాదనిపించింది.

చంద్రాహియాలో ఒక శతాబ్దకాలం ముందు పరాయిపాలకుల ఉత్తర్వులని ధిక్కరించిన ఒక మనిషి కన్న కలలు వీళ్ళ దాకా రాలేదని స్పష్టంగా అర్థమవుతోంది. కాని దానికి ఎవరికి కారకులు? ఎవరు కారకులనే పోస్ట్ మార్టం కన్నా, ముందు ఆ మనుషుల్ని మానవులుగా నిలబెట్టుకోడానికి అత్యవసరంగా చెయ్యవలసిందేమిటనే ప్రశ్న నా చెవిలో గీపెట్టడం మొదలయ్యింది.

అసలు ప్రభుత్వం అక్కడ ఆ పర్యాటక మందిరాలు నిర్మించేబదులు ఆ జనావాసానికొక గృహ సముదాయం, ఒక నీటిపారుదల వ్యవస్థ, మరుగుదొడ్లు, పాఠశాల ఇవ్వడం ముఖ్యం అనిపించింది. బహుశా, ఇప్పుడు గాంధీజీ ఆ గ్రామాన్ని సందర్శిస్తే అక్కడే ఉండిపోతాడని కూడా అనిపించింది.

3

నాకు మరొక జనావాసం కూడా, మూష్ హారి కులానికి చెందినవారిది, చూడాలనిపించింది. నేను చూసిన చంద్రాహియా ని బట్టే అక్కడి షెడ్యూల కులాల స్థితిగతుల్ని అంచనా వెయ్యకూడనుకున్నాను. అది కూడా రోడ్డు మీద గ్రామం కాక, ఏదన్నా లోతట్టు గ్రామానికి తీసుకువెళ్ళమని సత్యార్థిని అడిగాను. అతడు ఎవరెవరినో ఫోన్లో సంప్రదించి మమ్మల్ని పిప్రా కోఠీ బ్లాకు కి చెందిన జీవధారా మూష్ హరి టోలా గ్రామానికి తీసుకువెళ్ళాడు.

ఆ గ్రామం కొద్దిగా పెద్ద జనావాసమే, కాని అక్కడ కూడా పక్కా ఇళ్ళు లేవు. తాగునీటి వ్యవస్థ, ఒక ప్రాథమిక పాఠశాల కనిపించాయి. కాని, టాల్ స్టాయి రాసినట్టుగా, దుఃఖపడే వాళ్ళ దుఃఖాలు ఎవరివి వారివే. ఈ గ్రామంలో కుటుంబాలు ఎలుకలు పట్టుకునే వృత్తినుంచి ఎప్పుడో దూరమై వ్యవసాయ కూలీలుగా బతుకుతున్నారు. దానివల్ల రెండువంతుల మందికి పని దొరకని పరిస్థితి. పని దొరికేవాళ్ళకి కూడా ఏడాది పొడుగునా పని దొరకదు. అక్కడ కొద్దిగా చదువుకున్నట్టు కనబడుతున్న ఒక యువకుణ్ణి నువ్వేమి చేస్తున్నావని అడిగాను. అతడు కేరళలో భవననిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నానని చెప్పాడు.

ఇదేమి దేశం! ఎటువంటి చదువులు! బీహార్లో పని దొరక్క యువకులు కేరళ వెళ్తారు. కేరళలో యువతీయువకులు పని దొరక్క గల్ఫ్ దేశాలకు వెళ్తారు. రవీంద్రకుమారశర్మ గారు అన్నట్లుగా ‘మొత్తం భారతీయులే ఒక సంచారజాతిగా మారిపోయారు.’ అట్లా ఒక దేశం దేశాన్ని ఒక సంచారజాతిగా మార్చిన విద్యావ్యవస్థ మనది! ఇది చదువుకాదనీ, పిల్లలకి చిన్నప్పణ్ణుంచే ఏదో ఒక వృత్తిపని కూడా నేర్పమనీ గాంధీజీ చెప్తే అది మన విద్యావేత్తలకి అనాగరికంగా కనిపించింది. దాని ఫలితమేమిటో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళు, ప్రతి గ్రామమూ, ప్రతి పట్టణమూ ఎలుగెత్తి ఘోషిస్తున్నాయి.

c7

మరికొంత సేపు వాళ్ళతో జీవితస్థితిగతుల గురించి మాట్లాడేను. ఒకరిద్దరి ఇళ్ళల్లో అడుగుపెట్టి వాళ్ళ జీవితం ఎలా ఉందో చూసాను. కొద్దిసేపటికి వాళ్ళకి మేమేదో ప్రభుత్వశాఖకి చెందినవాళ్ళమనే భావన కలిగి, మా రాక వల్ల ఏదన్నా లభ్ది చేకూరుతుందేమోనన్న ఆకాంక్ష తలెత్తడం మొదలయ్యింది. తమ గ్రామంలో పాఠశాల వున్నప్పటికీ ఉపాధ్యాయులు రారనీ, వాళ్ళు తమ బదులు కూలిమనుషుల్ని పెట్టి చదువు చెప్పిస్తున్నారనీ, మధ్యాహ్నభోజనం సరిగా పెట్టడం లేదనీ, ఇంకా ఇలాంటివే, ఈ దేశంలో బీదవాళ్ళ జనావాసాల్లో వినిపించే సమస్యలే వినిపించడం మొదలుపెట్టారు. ఆ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఎందుకు అమలు జరగటం లేదో తెలుసుకోవాలని ప్రయత్నించాను గానీ, అసలు ఆ పథకం గురించే వాళ్ళు విన్నట్టు లేదు. ఆ ఊరిపేరు జీవధార! కాళీపట్నం రామారావుగారి కథ గుర్తొచ్చింది. కళింగాంధ్రనుంచి బీహార్ దాకా దళిత జీవధార ఒక్కలానే ఉంది!

ఇక్కడ కూడా నన్ను గుచ్చే దృశ్యం మరొకటి కనిపించకపోలేదు. అక్కడున్న ప్రతి మనిషీ గుట్కా నములుతూనే ఉన్నాడు. మాట మాటకీ మధ్య ఉమ్ముతూనే వున్నాడు.

ఆ రెండు జనావాసాలూ చూసేటప్పటికి ప్రణాళికావేత్తలూ, ఆర్థికవేత్తలూ, ఏ బీహారు గురించి ఆక్రోశిస్తున్నారో ఆ బీహార్ ను పూర్తిగా చూసేసాననిపించింది.

4

మహాత్మాగాంధీ చూడటానికి బయల్దేరిన లోమరాజ్ సింగ్ జసౌలిపట్టి గ్రామస్థుడు. ఆ రోజు గాంధీజీ ఆ గ్రామానికి వెళ్ళకుండానే వెనుదిరగ వలసి వచ్చింది. ఆయన తరఫున ఆ రోజు ఆయన కూడా వెళ్ళిన ధరణీధర్ బాబు, రామ నవమి ప్రసాద్ అనే యువలాయర్లు ఆ గ్రామానికి వెళ్ళి వచ్చారు. ఒక చారిత్రిక సంఘటనకు కారణమైన ఆ గ్రామాన్ని కూడా చూసితీరాలని నాకు చాలాబలంగా అనిపించింది.

దాంతో సత్యార్హి మమ్మల్ని మళ్ళా వెనక్కి తీసుకువచ్చి, మరేవో రకరకాల దారుల్లో ఎక్కడెక్కడికో తిప్పి మధ్యాహ్నం మూడుగంటల వేళకి జసౌలిపట్టి తీసుకువెళ్ళాడు.

‘మరి ఇంత దూరం ఆ రోజు ఏనుగు మీద వాళ్ళు ఎలా వెళ్ళగలిగేరు’ అనడిగాను అతణ్ణి.

‘ఏనుక్కి ఇట్లా సర్కారీ రోడ్ల మీద ప్రయాణించవలసిన అవసరం లేదు కదా’ అన్నాడతగాడు!

ఇక ఆ తర్వాతంతా అతడు బీహర్ ని అభివృద్ధి పరచడానికి నితీష్ కుమార్ చెయ్యని ప్రయత్నం లేదనీ, ఆదాయవనరుల్లేకపోయినా గాంధీ విలువలకి కట్టుబడి అతడు రాష్ట్రంలో మద్యనిషేధం అమలు చేస్తున్నాడనీ చెప్పాడు. రోడ్లు బీహార్ తక్షణ అవసరమనీ, కాని అతడికి కేంద్రప్రభుత్వం కూడా కలిసి రావడంలేదనీ వాపోయాడు.

ఆ ఇరుకుదారుల్లో మేం జసౌలి చేరుకునేటప్పటికి, పండగకళతో మెరుస్తున్న గ్రామసీమ ఎదురయ్యింది. అక్కడ లోమరాజ్ సింగ్ విగ్రహం కూడా ఉంది. అక్కడ దిగి ఫోటో తీసుకుందాని సత్యార్థి ఉబలాటపడ్డాడుగానీ, మధ్యాహ్నం భోజనం మిస్సవడంతో డ్రైవరు అతడి మాట వినే పరిస్థితిలో లేడు. జసౌలి ఒక ఊరు. ఆ ఊరుదాటాక చిన్న నది, ఆ నది మీద వంతెన దాటాక వచ్చేది జసౌలిపట్టి.

జసౌలి పట్టి గ్రామంలో ప్రభుత్వపాఠశాల ఆవరణలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించారనీ దాన్ని చూస్తే ఆ ఊరు సందర్శన పూర్తవుతుందనీ సత్యార్థి చెప్పడంతో ఆ పాఠశాల వెతుక్కుంటూ వెళ్ళాం. పండగ కావడంతో స్కూలుకి సెలవు. కాని అక్కడ ఆడుకుంటున్న కొంత మంది విద్యార్థుల్ని పట్టుకుని ఆ స్కూలు గురించి తెలుసుకున్నాం. అది రెండు విభాగాలు. ఎనిమిదవతరగతిదాకా ఉన్న ఎలిమెంటరీ పాఠశాలలో పదిమంది ఉపాధ్యాయులున్నారు. పిల్లల సంఖ్య కూడా ఎక్కువే. ఆ ఆవరణకి బయట ఎప్పుడో కట్టినా, ఆవిష్కరణకు నోచుకోక చాలాకాలం పాడుపడ్డ మరొక భవనంలో ఇప్పుడు తొమ్మిది, పది తరగతులు నడుస్తున్నాయి. ఆ హైస్కూలు సెక్షన్లకి కేవలం ఇద్దరే ఉపాధ్యాయులు. నాకు ఆ సంగతి విన్నప్పుడు చాలా ఏళ్ళ కిందట, ఖమ్మం జిల్లాలో మారుమూల గుండాల మండలంలో చూసిన జిల్లా పరిషత్ హైస్కూలు గుర్తొచ్చింది. ఆ స్కూల్లో లానే ఇక్కడ కూడా ఈ ఏడాది పదవతరగతి పిల్లందరూ పరీక్ష తప్పడం ఖాయమని తెలిసిపోయింది. ‘నితీష్ కుమార్ అర్జెంటుగా పరిష్కరించవలసిన సమస్య రోడ్లు కాదు, ఇలాంటి పాఠశాలలు’ అన్నాను సత్యార్థితో.

c8

ఆ రోజు ఆ దారమ్మట చేసిన గంటాగంటన్నర ప్రయాణం నాకు శరత్ బాబు శ్రీకాంత నవలను పదేపదే గుర్తుచేస్తూ ఉంది. నాలుగు దశాబ్దాల కిందట ఆ నవల చదివినప్పుడు నా మనసులో ఏ బీహారును ఊహించుకున్నానో ఆ గ్రామీణ బీహారు, ఆ పేదబీహారు, అమాయికమైన ఆ బీహారు అదేరూపంలో నా కళ్ళముందు సాక్షాత్కరించింది. శరత్ బాబు చూసిన కాలం నుంచి ఆ బీహారు ఒక్క అడుగు కూడా ముందుకు జరగలేదనిపించింది.

5

నేను పనిచేస్తున్న సంస్థకు నాలెడ్జి పార్టనర్ గా ఉన్న కాయిన్ కన్సల్టన్సీస్ వారు చంపారన్ జిల్లాలో మత్స్యకార కుటుంబాలకు శిక్షణ ఇస్తున్నారు. ఆ శిక్షణ కార్యక్రమం ఎలా అమలు జరుగుతున్నదో చూద్దామని అక్కణ్ణుంచి తర్కౌలియా తాలూకాకి చెందిన మఝారియా గ్రామానికి వెళ్ళాం. అది చిన్న మత్స్యకారగ్రామం. ఆ కుటుంబాలు స్థానికంగా ఉండే చెరువుల్లోనూ, దొరువుల్లోనూ, కాలవల్లోనూ చేపలు పట్టి జీవిస్తున్నారు. అటువంటి వృత్తికారులకి వృత్తిలో భాగంగా ఒనగూడిన నైపుణ్యం ఎంత, మనం అదనంగా అందించవలసిన ఆధునిక పరిజ్ఞానమెంత అని తెలుసుకుని ఆ విధంగా వాళ్ళ నైపుణ్యాన్ని మరింత అభివృద్ధిపరచడానికి నేషనల్ స్కిల్ డెవలప్ మెంటు కార్పొరేషన్ వారి సహాయంతో చేపట్టిన కార్యక్రమం అది.

మేం వేళ్ళేటప్పటికే ఒక కాలవ వడ్డున ఆడామగా అందరూ సమావేశమై మా కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడ వాళ్ళతో కొంతసేపు గడిపాం. వాళ్ళకి ముందే తెలిసి ఉన్న విషయపరిజ్ఞానం ఏమిటి, ఈ శిక్షణ వల్ల ఒనగూడిన కొత్త నైపుణ్యమేమిటి చాలామందిని అడిగి తెలుసుకున్నాం. ముఖ్యంగా మహిళల్ని. వాళ్ళని ఉద్దేశించి వచ్చీ రాని అరకొర హిందీలో నాలుగుమాటలు మాట్లాడేను. కాని,నేను విప్పి చెప్పలేకపోయిన నా హృదయాన్ని అనర్గళమైన భోజ్ పురీలో వివరిస్తూ సంజయ్ సత్యార్థి మహోపన్యాసం చేసాడు.

c9

ఆ కొద్దిసేపూ అక్కడొక ఉల్లాసకరమైన వాతావరణం నెలకొంది. అప్పుడు వాళ్ళల్లోంచి ఒక మత్స్యకారమహిళ మా అందరికీ రాఖీలు కట్టి మిఠాయి తినిపించింది. నేనెప్పుడూ చూసి ఉండని ఆ ఉత్తరబీహారు కుగ్రామంలో, మళ్ళా మరొకసారి వాళ్ళని కలుస్తానో లేదో తెలియని ఆ కుటుంబాల మధ్య, రక్షాబంధనం పుణ్యమా అని నేను నా సోదరిని కలుసుకోగలిగాను.

ca

ఆ మత్స్యకారగ్రామంలో ఆ గంటా, గంటన్నరా గడపకపోయి ఉంటే, పొద్దున్న చూసిన ఆ మూష్ హారి జీవితాలు నా హృదయాన్ని పూర్తిగా ఛిద్రం చేసిఉండేవనుకున్నాను.

6

చంపారన్ ఉద్యమంలో భాగంగా గాంధీజీ మూడు పాఠశాలలు తెరిచారు. వాటిలో ఒకటి తూర్పు చంపారన్ లో ఉన్న బర్హార్వా లఖన్ పూర్ గ్రామం. ఆ గ్రామాన్నీ, అక్కడ ఉన్న గాంధీ ఆశ్రమాన్నీ చూపించాలని సత్యార్థి ప్రణాళిక, కానీ జసౌలిపట్టి ప్రయాణంతో మాకు సమయం మిగల్లేదు. ఇంక పూర్తిగా చీకటిపడేలోగా, దగ్గర్లో మరెదైనా గామం చూపించమంటే, అతడు మమ్మల్ని తర్కౌలియా గ్రామానికి తీసుకువెళ్ళాడు.

రక్షాబంధనం సందర్భంగా చుట్టుపక్కల గ్రామాలనుంచి మనుషులు పెద్ద ఎత్తున ఊరేగింపుగా తర్కౌలియా వైపు సాగుతున్నారు. వాళ్ళందరి చేతుల్లోనూ ఈటెలు, బల్లేలూ, గొడ్డళ్ళూ లాంటి ఆయుధాలూ, కర్రలూ, జెండాలూ ఉన్నాయి. అవన్నీ ఎందుకు తీసుకువెళ్తున్నారని అడిగాం. అది ఆ పండగ ఊరేగింపులో భాగమనిచెప్పారు. కాని, ఆ ఊరేగింపులు మహ్మదీయులు అధికంగా ఉండే గ్రామాలమీంచి సాగుతుందనీ, చాలా సార్లు అది మతఘర్షణలకు దారితీస్తూ ఉంటుందనీ, అందుకని, ఆ ఊరేగింపు సాగినంతసేపూ పోలీసులకి అగ్నిపరీక్షనేననీ కూడా వాళ్ళు చెప్పారు. ఆ ఊరేగింపు వెనక నెమ్మదిగా మా కారు సాగుతుంటే, నేనేదో పదహారో శతాబ్దంలో ప్రయాణిస్తున్నానేమో అనిపించింది.

c12

కాని తర్కౌలియా చేరేటప్పటికి వాతావరణం మారిపోయింది. అక్కడ ఉద్విగ్నత లేదు. పల్లెటూరి జాతరలో కనిపించే ఉల్లాసమే ఉత్సాహమే కెరటాల్లాగా ఎగిసిపడుతూ ఉంది. ఆ మానవసముదాయపు ఆ మహాసంతోషాన్ని చూస్తూ ఉంటే అంతవరకూ శారీరకంగానూ, మానసికంగానూ మేము పొందిన అలసటనంతా ఎవరో చేత్తో తుడిచేసినట్టనిపించింది.

తర్కౌలియా లో మేం చూడవలసింది ఆ ఊళ్ళో ఉన్న పురాతనమైన వేపచెట్టు అని మమ్మల్నా చెట్టుదగ్గరకు తీసుకువెళ్ళాడు సత్యార్థి. వందేళ్ళకు పైగా అక్కడ నిలబడి ఉన్న ఆ వేపచెట్టు మొదట్లో ఒక ఫలకం మీద ఆ చెట్టు చారిత్రిక ప్రాధాన్యత రాసి ఉంది.

cb

చంపారన్ లో నీలిమందుతోటలు విరివిగా పెంచేరోజుల్లో, ఆ తోటలు పెంచడానికి నిరాకరించిన రైతుల్ని ఆ చెట్టుకి కట్టి ఫాక్టరీ యజమానులు కొరడాల్తో కొట్టేవారట. ఆ పేదరైతుల రక్తంతో తడిసిన ఆ చెట్టు గరళకంఠుడైన శివుడిలాగా ఎంతో విషాన్నీ, విషాదాన్నీ తనలో దాచుకుంది అని ఆ పలక మీద రాసి ఉంది. అదే చెట్టుకింద 1917 ఆగస్టున 4 న మహాత్మాగాంధీ చంపారన్ విచారణ కమిటీ ముందు ఆ రైతుల్ని హాజరు పరిచి వారి వాజ్ఞ్మూలాల్ని వినిపించారని కూడా ఆ పలక మీద రాసిఉంది. అట్లా ఒక రైతుసమాజం అనుభవించిన దాస్యానికీ, సాధించిన విముక్తికీ కూడా సాక్షిగా నిలిచిన ఆ వేపచెట్టుని చేతుల్తో తాకాను. కాని అది చాలదనిపించింది. రెండుచేతులూ ఆ చెట్టుచుట్టూ చాపి మనసారా నిలువెల్లా హత్తుకున్నాను.

4-10-2018

arrow

Photos: Ashish Choragudi

3 Replies to “నా చంపారన్ యాత్ర-2”

  1. అదే బీహార్ లో ఆర్యసమాజ్ సంస్కరణ వాదంనుండి కమ్యూనిస్టు పోరాటాలవైపు మళ్ళితే తీవ్రాతితీవ్రంగా అణిచివేత సాగింది. ఆ తర్వాతే కదా కేశవానందపాండే రాహుల్ సాంకృత్యాయన్ అయింది. ఎందరో మహాత్య్ములు నడయాడిన ,సామ్రాజ్యాల ఉత్థాన పతనాలు చూసిన బీహార్ దుస్థితి ఏమాత్రం మారలేదు. జెపి శిష్యుడుగా రాజకీయాల్లోకి వచ్చిన లాల్లూ వేలకోట్ల అవినీతి కేసుల్లో జైలులో విశ్రాంతి తీసుకుంటున్నాడు.
    నితీష్ ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

  2. నేటి విద్యా భోదనలో వృత్తి విద్య ఒక భాగం కావాలి

Leave a Reply

%d bloggers like this: