గర్వించదగ్గ కానుక

299

కొత్త సంవత్సరం అడుగుపెడుతూనే తెలుగు సమాజం గర్వించదగ్గ కానుకను తీసుకొచ్చింది. ఎప్పుడో నలభై ఏళ్ళ కిందట వడ్డెర చండీదాస్ అనే తెలుగు తాత్త్వికుడు తనకోసం తాను రాసుకున్న ఒక సత్యమీమాంస ఇప్పటికి వెలుగు చూసింది. Desire and Liberation (2018) అనే ఆ గ్రంథాన్ని ఆక్స్ ఫర్డ్ యూనివెర్సిటీ ప్రెస్ ప్రచురించడంతో మొదటిసారిగా ఒక ఆధునిక తెలుగు తాత్వ్వికుడు ప్రపంచతత్త్వశాస్త్ర పటమ్మీద చోటు సంపాదించుకున్నాడు. ఒకవైపు సృజనాత్మక రచయిత, మరొక వైపు మౌలిక తత్త్వవేత్త అయిన ఆధునిక తత్త్వవేత్తల్లో జ్యా పాల్ సార్త్ర్ తర్వాత ఇకనుంచి ప్రపంచం వడ్డెర చండీదాస్ నే తలుచుకోవడం మొదలుపెడుతుంది.

అరుదైన,అపురూపమైన ఈ రచన వెలుగు చూడటం వెనక ఆచార్య అడ్లూరు రఘురామరాజు జీవితకాలం పాటు చేసిన తపసు ఉంది, భగీరథుడు గంగని భూమ్మీదకు తీసుకురావడంలాంటి కథ ఉంది.

ఆ కథ 1972 లో మొదలయ్యింది.

కాళిదాస్ భట్టాచార్య (1911-84) ప్రపంచప్రసిద్ధి చెందిన తత్త్వశాస్త్ర ఆచార్యుడు. శాంతినికేతన్ లో బోధించేవాడు. యు.జి.సి కోరికమీద, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రవిభాగం ఎలా పనిచేస్తోందో చూడటానికి ఆయన 72 లో తిరుపతి వెళ్ళారు. వారం రోజుల పాటు ఆ విభాగాన్ని కూలంకషంగా పరిశీలించటంతో పాటు,ఆ శాఖలో పనిచేస్తున్న ప్రొఫెసరల్నీ, రీడర్లనీ, లెక్చెరర్లనీ స్వయంగా కలుసుకోవాలనుకున్నారు. కలుసుకున్నారు, మాట్లాడేరు. ఒక్కరిని తప్ప.

డా.చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వర రావు అనే ముప్పై ఏడేళ్ళ వయసుగల లెక్చెరర్ ని మాత్రం అతని ముందు హాజరుపర్చడానికి ఆ శాఖాధిపతి సుతరామూ ఇష్టపడలేదు. ఇక భట్టాచార్య మర్నాడు వెళ్ళిపోతారనగా, ఆ లెక్చెరర్ ని కూడా ఆయనముందు హాజరు పరచకతప్పింది కాదు.

నిర్లక్ష్యంగానూ, అన్యమనస్కంగానూ తనముందు నిలబడ్డ ఆ యువకుణ్ణి ‘నువ్వేం చేస్తున్నావు?’ అనడిగాడు భట్టాచార్య.

‘ఏమీ చెయ్యను’ అన్నాడతడు.

‘ఏదో ఒకటి చెయ్యకుండా ఎలా ఉంటావు? యూనియన్లు నడుపుతుంటావా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటావా? సినిమాలు తీస్తుంటావా?’ అడిగాడు భట్టాచార్య.

‘లేదు, ఏమీ చెయ్యను’ అన్నాడతడు మళ్ళా.

‘ఏమీ చెయ్యకుండా ఉండటం అంత సులభం కాదు, అది యోగులకే సాధ్యం. నిజం చెప్పు,ఇన్నాళ్ళూ నువ్వు నన్ను కలవలేదు. అసలు నువ్వు చేస్తున్న పనేమిటి?’

‘రాస్తుంటాను.’

‘ఏం రాస్తుంటావు?’

‘కథలూ, నవలలూ, అది కూడా తెలుగులో.’

‘తెలుగు నాకు రాదు. ఇంగ్లీషులో ఏమన్నా రాసావా?’

ఆ యువకుడు ఒక క్షణం పాటు ఆగాడు. అప్పుడు కూడా నెమ్మదిగా సందేహిస్తూ

‘ఒక రచన రాసాను. కాని అది ఫిలాసఫీ డిపార్ట్ మెంటు కి అర్థం కాదు, అంగీకరించదు.’

‘నాకు చూపించగలవా దాన్ని.’

ఆ యువకుడు తన ఛాంబర్ లో తన సొరుగులోంచి ఒక మాన్యుస్క్రిప్ట్ తీసి ఆయన చేతుల్లో పెట్టాడు. పట్టుమని ఇరవైపేజీలు కూడా లేని రచన.

భట్టాచార్య కుతూహలంగా మొదటి పేజీ తెరిచాడు. మొదటి వాక్యం చదివాడు.

Contradictoriness is an inherent structural tinge of reality.’

ఆయన తనముందున్న యువకుణ్ణి ఎక్స్ రే కళ్ళతో చూస్తూ

‘మీ తండ్రితాతల్లో ఎవరన్నా శాక్తులా?’ అనడిగాడు.

‘కాదు. ఎవరూ లేరు.’

ఆయన నమ్మలేకపోయాడు.

‘మీపూర్వీకులెవరేనా రాసిన తాళపత్రాన్ని ఇంగ్లీషులోకి అనువదించావా?’

‘లేదు. ఇది నేనే రాసాను.’

‘నువ్వేం రాసావో నీకు తెలుసా?’

‘కొద్ది కొద్దిగా అర్థమవుతోంది’ అన్నాడా యువకుడు.

అంతే, భట్టాచార్య మర్నాడు రైలు టిక్కెట్టు కాన్సిల్ చేసేయమన్నాడు. నేరుగా గెస్ట్ హవుజ్ కి వెళ్ళిపోయాడు. ఎవరూ తనని కలవొద్దని చెప్పాడు. ఆ రాతప్రతినే అధ్యయనం చేస్తూండిపోయాడు. తాను శాంతినికేతన్ వెళ్తూ ఆ రాతప్రతిని టైపు చేసి ఒక కాపీ తనకి పంపించమన్నాడు.

శాంతినికేతన్ వెళ్ళాక కూడా భట్టాచార్య స్తిమితంగా ఉండలేకపోయాడు. ప్రాచీన భారతీయ దార్శనికుల పంథాలో సూత్రప్రాయంగా రాసిన ఆ ఇరవై పేజీల రాతప్రతి ఆయన్ని నిలవనివ్వలేదు. ఆయన ఒక ఏడాది పాటు ఉద్యోగానికి సెలవుపెట్టేసాడు. భిలాయిలో ఉన్న తన కూతురిదగ్గరకు వెళ్ళిపోయి, ఆ రచనను మరింత లోతుగా అధ్యయనం చేస్తూండిపోయాడు. ఏమైతేనేం, చివరికి, 1975 జనవరి నాటికి, ఆ రచనకు ఒక విపులమైన పీఠికను రాయగలిగాడు.

కాని, ఆ రచనను అట్లా ప్రాచీన సూత్రవాజ్మయం తరహాలో ప్రచురిస్తే ఎవరికీ అర్థం కాదనీ, దానికి కనీసం మూడువందల పేజీల భాష్యం కూడా రాయాలనీ చండీదాస్ ని కోరాడు. ఆ సందర్భంగా ఎనిమిది నెలలపాటు వాళ్ళిద్దరి మధ్యా ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి.

భట్టాచార్య సూచనను చండీదాస్ ఆదేశంగా స్వీకరించి తన రచనకు తనే వ్యాఖ్యానం రాయడానికి ఉపక్రమించాడు. కాని, ఆ దివ్యావేశం అతడికి మళ్ళా లభించలేదు. తాను రాసింది తనకే సంతృప్తికరంగా అనిపించలేదు.

18 ఏళ్ళు గడిచాయి.

ఆయన జీవితంలోకి రఘురామరాజు అనే తత్త్వశాస్త్ర విద్యార్థి ప్రవేశించాడు. తాను భట్టాచార్యకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోడానికి ప్రత్యక్షమయిన అవకాశంలాగా కనిపించాడతడు. తనకన్నా ఇరవయ్యేళ్ళు చిన్నవాడు. 1993 లో, చండీదాస్ నోరుతెరిచి అతణ్ణి అడిగాడు.

‘ఈ రచనకు నువ్వు భాష్యం రాయగలవా?ఇంగ్లీషు పాఠకలోకానికి నువ్వు పరిచయం చెయ్యగలవా?’

ఆ తర్వాత 2004 దాకా వాళ్ళిద్దరి మధ్యా ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి.(ఆ లేఖల్ని ‘ప్రేమతో..చండీదాస్’ పేరిట ఎమెస్కో ప్రచురించింది. అందులో కాళిదాసు భట్టాచార్య చండీదాస్ కి రాసిన లేఖలకు నా తెలుగు అనువాదాలు కూడా ఉన్నాయి.) రఘురామ రాజు చండీదాస్ ని చివరి సారి కలిసినప్పుడు ఆయన బయట గుమ్మం దాకా వచ్చి అతడికి వీడ్కోలు పలుకుతూ ‘నేను మరణించినా కూడా నువ్వు నన్ను చూడటానికి రానక్కర్లేదు. కాని నేను భట్టాచార్యగారికి ఇచ్చిన మాట మాత్రం మర్చిపోకు’ అన్నాడు.

ఆ రచన ని రఘురామరాజు 16 సంవత్సరాలు అధ్యయనం చేసాడు. దానికొక విపులమైన వ్యాఖ్యానం రాసాడు. వందమందికి పైగా ప్రచురణకర్తలకు పంపాడు. ఒక్కరు కూడా ప్రచురణకు అంగీకరించలేదు. మొదటిసారిగా, జాన్ హారిస్ అనే ఒక తత్త్వశాస్త్ర ఆచార్యుడు దాన్ని work of genius అన్నాడు. కాని అతడు యాక్సిడెంట్ లో మరణించడంతో ఆ పుస్తకం గురించి చెప్పడానికి మరెవరూ లేకపోయారు. చివరికి ఆశిష్ నందీ ఆ రచనని ఆక్స్ ఫర్డ్ కి పరిచయం చేసాడు. కాని ఆక్స్ ఫర్డ్ కూడా నిరాకరించింది.

‘రఘురామరాజు ఎవరు? చండీదాస్ ఎవరు?’ అనడిగింది ఆ ప్రచురణ సంస్థ.

అప్పుడు రఘురామరాజు తానెవరో తెలియచేసుకోడానికి Debates in Indian Philosophy: Classical, Colonial and Contemporary (2006) అనే పుస్తకం రాసాడు. ఆ రచన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ‘ఛాయిస్’ పత్రిక దాన్ని అత్యంత విశిష్ఠమైన రచనగా ఎంపికచేసింది. డా. రాధాకృష్ణన్ తర్వాత మళ్ళా ఆక్స్ ఫర్డ్ కి భారతీయ తత్త్వశాస్త్రం గురించి మాట్లాడగల రచయిత దొరికాడు.

అప్పుడు, చండీదా రచనకి డా. రఘురామరాజు రాసిన భాష్యాన్ని ఆక్స్ ఫర్డ్ Enduring Colonialism: Classical Presences and Modern Absences(2009) పేరిట ప్రచురించింది. ఆ రచన చదివిన తత్త్వశాస్త్రప్రపంచం ‘చండీదాస్ ఎవరు? ఆ మూల రచన ఎక్కడ?’ అని రఘురామరాజు వెంటపడింది.

అదిగో, ఆ దాహాన్ని తీర్చడానికి, ఇప్పుడు ఆక్స్ ఫర్డ్ యూనివెర్సిటీ ప్రెస్ చండీదాస్ రచనను Desire and Liberation:Biography of a text by Vaddera Chandidas (2018 ) పేరిట ప్రచురించింది.

1972 లో ఒక తెలుగు యువకుడు తనకోసం తాను రాసుకున్న ఒక రచన. 45 సంవత్సరాల పాటు దాన్ని ఇద్దరు మటుకే చదివారు. ఒకరు కాళిదాసు భట్టాచార్య, మరొకరు రఘురామరాజు. ఇప్పుడు యావత్ ప్రపంచం చదవబోతున్నది. తత్త్వశాస్త్రంలో metaphysics కి ఒకప్పుడు భారతదేశం పుట్టినిల్లు. కాని ఆధునిక భారతీయ చింతనలో మౌలికమైన metaphysical రచన ఏదీ ఇంతదాకా ప్రభవించలేదు. అరవిందులు, కె.సి.భట్టాచార్య ఆ దిశగా కొంత చింతనచేసారు. కాని ప్రధాన సూత్రగ్రంథమేదీ రాయలేదు. ఆ అవకాశం చండీదాస్ కి దక్కింది. ఆపస్తంబుడు, ఆచార్య నాగార్జునుడు, కుందకుందాచార్యుల తర్వాత ఇన్నాళ్ళకు తిరిగి ఒక తెలుగువాడి మౌలిక దార్శనిక గ్రంథం ప్రపంచం ముందు అవతరించింది.

తెలుగు జాతి గర్వించదగ్గ క్షణమిది.

5-1-2018

 

 

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading