జపాన్ లో పుట్టిన బ్రిటిష్ రచయిత ఇషిగురొ మీద ఆదిత్య తెలుగులో రాసిన వ్యాసం నేను పోస్ట్ చేస్తే, ఆ వ్యాసం లింక్ కావాలని నవీన్ అమెరికానుంచి అడిగాడు. నేనింకా వెతుక్కుంటూ ఉండగానే, కన్నెగంటి రామారావు ఆ లింక్ అక్కడ పోస్ట్ చేసాడు. అతనప్పుడు రోమ్ లో వాటికన్ నగరంలో రినైజాన్సు శిల్పాలు చూస్తూ ఉన్నాడు. దేశాల, భాషల, కాలాల హద్దులు చేరిపేస్తూ నలుగురు తెలుగువాళ్ళట్లా తమ భావాలు పంచుకున్న ఆ క్షణం నాకెంతో ఆసక్తికరమనిపించింది. అది నాకు దాదాపు వందేళ్ళ కిందటి విషయాన్నొకటి గుర్తుకు తెచ్చింది. ఒకప్పుడు దువ్వూరి రామిరెడ్డిగారి కవిత్వమిట్లానే దేశాల హద్దులుదాటి ప్రయాణించిన సంఘటన.
ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయవలసిన ఆ విషయమది.
ఒకప్పుడు దువ్వూరి రామిరెడ్డి తాను తెలుగులో రాసిన కొన్ని కవితల్ని తానే ఇంగ్లీషులోకి అనువదించుకున్నాడు. 28 ఇంగ్లీషు కవితల్తో The Voice of the Reed (1924) పేరిట దాన్ని వెలువరించాడు. దానికి ఆయనే రాసుకున్న ముందుమాటలో ఇట్లా రాసుకున్నాడు:
‘నా ఖండకావ్యములందు కొన్నిటిని ఇంగ్లీషులోనికనువదించి ‘వాయిస్ ఆఫ్ ద రీడ్’ గా ప్రకటించితిని. భారతదేశమునందును, ఇంగ్లాండునందును, అమెరికాయందును పత్రికలు ఆ గ్రంథమును ప్రశంసించినవి. డాక్టరు జేమ్స్ ఎచ్ కజిన్స్, డి.లిట్ గారు ప్రపంచయాత్ర సల్పుచు, భారతదేశములోను, జపాను, అమెరికా, ఇంగ్లాండు దేశములలోగల అనేక కేంద్రములందు నా యింగ్లీషు పద్యములను చదివి వినిపించిరి. అవి ప్రశంసింపబడెనని వారు నాకు చెప్పిరి. ఆయన కలకత్తా నగరముననిచ్చిన యుపన్యాసమును గురించి వ్యాఖ్యానించుచు, అందుండి వెలువడు ఫార్వర్డు అను పత్రిక ఈ తీరున వ్రాసెను: ‘మన రవీంద్రనాథునిలోను, హరీంద్రనాథుని లోను, సరోజినిలోను, యువకుడైన రామిరెడ్డిలోను ప్రజ్వరిల్లుచున్న మహాకాంతి దేశాంతరములకు కూడ వ్యాపించి, అంతర్గతమైన ఉత్తమ కవిత్వమును వెలువరింపగల్గుచున్నది.’
‘ప్రపంచ యాత్ర ముగించుకొని వచ్చిన డాక్టరు కజిన్సుగారిని నేను అడయారున కలసికొంటిని. వారి మాటలు నన్ను దిగ్భ్రాంతుని చేసెను. ‘రామిరెడ్డి, ఒకానొక ఐరిష్ కవి భారతదేశ భాషలలోని కవిత్వమును గురించి ఇంగ్లాండు నందు ఉపన్యసించుట, ఈజిప్టులోని పిరమిడ్ల కడ పర్యటన సల్పుచుండిన ఒక అమెరికన్ ప్రొఫెసరు మీ వాయిస్ ఆఫ్ ద రీడ్ లభింపమిచే బాధపడుట, మీరువురు ఎంతో ఎడమున నుండుటవలన నాకడగల ఒఖే యొక్క ప్రతిని నేనినాయనకు పంపుట-యివి విచిత్రముగ లేవా!’ యని నన్నడిగిరి.’
‘బ్రిటిష్ ఎంపైర్ ఎడిషన్ ఆఫ్ ఇంగ్లీష్ పొయిట్రీ’ లో నా పద్యములు మూడు ప్రకటింపబడినవి. విదేశీయులైన కవిత్వసంకలనకర్తలు తెలుగుకవినొకనిని గౌరవించుటకు ఇదే ప్రథమమేమో! డాక్టరు జేమ్స్ కజిన్సుగారు ‘సమదర్శన’ యను తమ గ్రంథమందు ‘భారతీయ భాషా కవిత్రయము’ అను భాగమున, సర్ మహమ్మద్ ఇక్బాల్ ను, పురాణ సింగ్ ను, మరి నన్ను గురించి రాసిరి. ఇంగ్లీషు కవిత్వ ఛందోరీతులలో కాక, నేను కల్పించుకొనిన స్వచ్ఛంద కవిత్వ రచనానిర్మాణకౌశలమును, నా స్వతంత్రభావనాశక్తిని వారు మెచ్చుకొనుచు ,అమెరికాలో ఉత్పత్తి చేయబడుచున్నదానికంటే ఎన్నో మడుగులు యిది హెచ్చయినది’ అని వ్రాసిరి. ‘
తర్వాత రోజుల్లో, ఆయన శివశంకరస్వామిగారి కోరిక మేరకు తన జీవితవిశేషాలు వివరిస్తూ, ఈ సంగతులు మళ్ళా రాసారు. (ఆయన ఇంగ్లీషులో రాసిన దానికి ఈ తెలుగు అనువాదం ఎవరు చేసారో తెలియదు.)
రామిరెడ్డిగారిని ప్రోత్సహించిన జేమ్స్ హెచ్ కజిన్స్ (1873-1956) మామూలు వ్యక్తి కాడు. ఆయన అప్పటికే పేరొందిన ఐరిష్ వక్త, నాటకకర్త. యేట్సు, జాయిస్ లకు మిత్రుడు. అనీబిసెంట్ ప్రోద్బలంలో భారతదేశానికి వచ్చాడు. దివ్యజ్ఞానసమాజంలో సభ్యుడు. ఆయన రాసిన సాహిత్య వ్యాసాలు New Ways in English Literature చదివాకనే, కవిత్వం గురించి ఎటువంటి వివేచన చేయాలో తనకి అర్థమయిందని అరవిందులు తమ The Future Poetry లో రాసుకున్నారు.
అటువంటి కజిన్సు తన సమదర్శన గ్రంథంలో రామిరెడ్డి గురించి ఏమి రాసాడు? ‘కవికోకిల’ (1964) రాసిన కె.వి.రమణారెడ్డి కి కూడా ఆ పుస్తకం దొరికినట్టు లేదు. కాని, ఇప్పుడు మన అదృష్టంకొద్దీ, నెట్ లో దొరుకుతోంది. https://archive.org/details/in.ernet.dli.2015.90439. అందులో, ఆధునిక భారతీయ కవిత్వంలో సమదర్శనం అనే పేరిట రాసిన అధ్యాయంలో కజిన్స్ ఇట్లా రాసాడు (పే.21-22):
‘..ఇప్పుడిది చదవండి:
O Cowherd Prince of Brindavan!
O celestial Fluter!
Fill the cup of my frail life
With the wine of Thy song,
That I may melt into liquid music,
And Flow into eternity.
O Poet of the universal Poem!
Touch the camphor of my heart
With the spark of Divine Wisdom,
That I may burn at Thy lotus feet,
Wafting perfume into the air.
O Light of the Worlds!
Show to my inner vision
Thy Divine Radiance,
That my tears of joy may bloom
Into flowers for Thy worship.
ఇక్కడ అభివ్యక్తిలో సూటిదనం మీరు చూస్తున్నారు. తనదైన సంప్రదాయంలోనూ, వాక్కులోనూ స్వేచ్ఛగా ప్రవర్తించగల ఒక మనసు తీర్చిదిద్దిన హృదయాభివ్యక్తిలోంచి వచ్చిన అత్యంత ఉత్కంఠభరితమైన, నిర్మలసౌందర్యమిది. ఇది కవి తన కవితకు ఇంగ్లీషులో చేసుకున్న వచనానువాదమే అయినప్పటికీ, ఇప్పుడు ఇంగ్లాండ్ లోనూ, అమెరికాలోనూ బళ్ళకొద్దీ వస్తున్న ఫ్రీ వెర్సు కన్నా ఎన్నో యుగాలు ముందున్న కవిత్వమిది. ఈ కవితలో ఒక వాస్తునిర్మాణానికుండేలాంటి లయాత్మక విన్యాసం కనిపిస్తున్నది. ఇందులో ప్రతి ఒక్క చరణం, ఒక దేవాలయస్తంభంలాగా తోటి స్తంభాలకు తోడుగా నిలబడినప్పటికీ, తనదే అయిన అద్వితీయతను నిలుపుకుంటున్నది. ఇందులో జీవితవిశేషాలద్వారా జీవితకేంద్రాన్ని చూడగల ఒక దర్శనం- సమదర్శన లక్షణం సహజంగా సిద్ధించిన ఒక ప్రతీకవాదలక్షణంతో కనిపిస్తున్నది. అలాగని, ఈ ప్రతీకవాదం యాంత్రికంగా ఒకదాన్ని మరొకదానితో సూచిస్తున్నది కాదు. ఇది కవి అనుభూతి వల్ల సజీవంగానూ, ప్రత్యక్షంగానూ మనకి కనిపిస్తున్నది.
ఆంధ్రదేశానికి చెందిన డి.రామిరెడ్డి అనే ఒక యువకవి తన తెలుగు కవితలనుంచి తానే చేసుకున్న అనువాదసంపుటిలోది ఈ కవిత. అందులో కవితలన్నిటిలోనూ, భారతీయ జీవితం, చింతన, అనుభూతి, వాతావరణ విశేషాలవల్ల సమకూరిన ఒక సాన్నిహిత్య స్పర్శ ఉన్నది. అవి మనకి సుపరిచితమైనచోట, సాధికారికంగానూ, మనకి అంతగా తెలియని చోట, అత్యంత మౌలికంగానూ కనిపిస్తున్నవి. Fields in Rain అనే ఈ కవిత చూడండి:
How picturesque are the cranes
Flying against a smoky sky
Like a garland of emancipated souls
Winging their way heavenwrd,
Having broken the mortal bonds of form and life ‘
ఇందులో the homing cranes అనే ప్రకృతిదృశ్యమూ, a garland of emancipated souls అనే ప్రతీకా రెండూ పూర్తిగా భారతీయాలు. సరిగ్గా, అందువల్లనే, అవి పూర్తి భారతీయ ప్రతీకలు కాబట్టే, విశ్వజనీనాలు కూడా..’
కజిన్స్ ఈ మాటలు రాసింది 1925 లో. అప్పటికి, ఇంగ్లీషులో రాసిన భారతీయ కవులు టాగోరూ, తోరూదత్, అరవిందులూ, సరోజినీ నాయుడు మాత్రమే. టాగోర్ ని యేట్సు గుర్తుపట్టినట్టు, రామిరెడ్డిని కజిన్సు గుర్తుపట్టాడు. కాని వాళ్ళందరినీ భారతదేశం నెత్తిన పెట్టుకుంది, రామిరెడ్డిని ఆంధ్రదేశమే మరిచిపోయింది.
మరొక మాట కూడా గుర్తుచేసుకోవాలి. రామిరెడ్డి గురించి దేశాంతారాల్లో ప్రశంసిస్తున్నప్పుడే, కజిన్సు ఒకసారి మైసూరు విశ్వవిద్యాలయానికి వెళ్ళినప్పుడు,అది కూడా 1925 లోనే, అక్కడ చదువుకుంటున్న ఒక విద్యార్థి తాను ఇంగ్లీషులో రాసిన కవితలు చూపించాడట. ఆ కవితలు చదివి కజిన్స్ తన ఎదట ఉన్న మనిషిని పరికించిచూసాడట. ఆ విద్యార్థి ఖద్దరు ధరించి ఉన్నాడు. ‘నీ వేషంలో ఉన్న స్వదేశీ నీ కవిత్వంలో ఎందుకు లేదు?’ అని అడిగాడట కజిన్స్. ఆ మాట తనకెంతో ఉక్రోషం కలిగించిందనీ, తానేదో అన్నాననీ, కానీ కజిన్సు ఎంతో ఓపిగ్గా, తాను కన్నడంలోనే కవిత్వం రాయడం ఎందుకు మంచిదో వివరించాడనీ, ఆ కలయిక వల్లనే తనకి కన్నడ భాషామతల్లి స్తన్యం దొరికిందనీ ప్రసిద్ధ కన్నడ రచయిత, జ్ఞానపీఠ పురస్కార స్వీకర్త కువెంపు రాసుకున్నారు.
The Voice of the Reed ని తర్వాత 1986 లో మళ్ళా ముద్రించారు. ఆ పుస్తకం ఇప్పుడు నెట్ లో దొరుకుతోంది. https://archive.org/details/in.ernet.dli.2015.176620. ఆయన రెండవ సంపుటి The Last Farewell and Other Poems ను మళ్ళా 2002 లో పునర్ముద్రించారు. కానీ, ఆ సంపుటి నాకింకా దొరకలేదు.
13-10-2017