ఆ సందర్భంగా నా 'కొన్ని కలలు కొన్ని మెలకువలు' పుస్తకంలోంచి మొదటి భాగాన్ని చిన్ని వీడియోగా చేసి చూసుకున్నారు. ఆ కథనం వినగానే వారికి తాము ఆ స్కూల్లో చేరిన మొదటిరోజులు గుర్తొచ్చాయి. కొందరు ఎమోషనలు కూడా అయ్యారని విన్నాను. ఆ చిన్ని వీడియో నాకు పంపించారు. దాన్నిక్కడ మీతో పంచుకుంటున్నాను.
కొన్ని కలలు, కొన్ని మెలకువలు
వాడ్రేవు చినవీరభద్రుడు జిలా గిరిజన సంక్షేమాధికారిగా 1987 నుంచి 1995 దాకా విజయనగరం, విశాఖపట్టణం, కర్నూలు, అదిలాబాదుజిల్లాల్లో పనిచేసిన కాలంలో ప్రాథమికవిద్యను గిరిజనప్రాంతాల్లో సార్వత్రీకరించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేపట్టారు. 1995 నుంచి 1997 మధ్యకాలంలో గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయంలో ఆ ప్రయత్నాలకొక సమగ్రరూపాన్ని సంతరించి ప్రణాళికాబద్ధంగా రాష్ట్రమంతటా అమలు చేయడానికి ప్రయత్నాలు కొనసాగించారు. ఆ అనుభవాల్లో ఆయన సాఫల్యవైఫల్యాలను వివరించే రచన 'కొన్ని కలలు, కొన్ని మెలకువలు.'
నా జీవితమంతా ఉపాధ్యాయులతోనే గడిచింది
పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ నాకు బోధించినవాళ్ళతో పాటు జీవితానికి ఆవశ్యకమైన ప్రతిరంగం గురించీ అంతోఇంతో మొదటి పాఠాలు నేర్పిన మా నాన్నగారితో పాటు, తరగతిగదులకు బయట నాకు గురుత్వం వహించిన నా సాహిత్యాచార్యులు నామీద చూపించిన ప్రభావం విలువకట్టలేను
