
సాయంకాలానికల్లా మేనెల
వీథుల్లోకి చేరుకుంటుంది.
చైత్రమాసపు చివరి పరిమళాలుకూడా
చెరిగిపోయిన వీథులు.
అప్పటికే కాలనీలో ఇళ్ళకీ ఇళ్ళకీ మధ్య
సగం జాగా కార్లే ఆక్రమించి ఉంటాయి.
మిగిలిన కొద్దిపాటి జాగాలోనూ
పిల్లలు క్రికెట్టు మొదలుపెడతారు.
ఒక బౌలింగుకీ మరొక బాటింగుకీ
మధ్య విరామంలో నా సాయంకాలం నడక.
మా మధ్యనుంచే ఒక ఎల్ బోర్డు కారు
దారి వెతుక్కుంటూ ఉంటుంది.
సాయంకాలం కాగానే ఆ దుమ్ములోనే
ఏదో ఒకటి వెతుక్కుంటూ ప్రతి ఒక్కరూ.
కొండలూ, అడవులూ కూడా ఖాళీచేసిన
హృదయంతో నేనేమి వెతుక్కోవాలి?
అయినా నడుస్తుంటానా, ఇంతలో
ఎక్కణ్ణుంచో వినిపిస్తుంది కోకిల కూత
తలెత్తి చూడబోతే నేనున్నచోటే
పెద్ద పార్కు కిందకి దిగుతుంది.
3-5-2025

