నేను తిరిగిన దారులు-1

నేను తిరిగిన దారులు నా యాత్రాకథనాల సంకలనం. 1995 నుంచి 2010 మధ్యకాలంలో చేసిన యాత్రల గురించి రాసిన అనుభవకథనాలు. 2011 లో వెలువరించిన ఆ పుస్తకాన్ని తెలుగు పాఠకులు చాలా ఆదరించారు. ఇప్పుడు ఆ కథనాల్ని మీతో వరసగా పంచుకోబోతున్నాను.

ఒకమాట

తెలుగులో యాత్రాచరిత్రలు కొత్తకాదు. ఏనుగుల వీరాస్వామయ్య ‘కాశీయాత్ర చరిత్ర’ నుండి ఆదినారాయణ ‘భ్రమణకాంక్ష’ దాకా రాహుల్‌ సాంకృత్యాయన్‌ ‘లోకసంచారి” నుంచి బి.వి.రమణ ట్రెక్కింగ్‌ అనుభవాలదాకా తెలుగు సాహిత్యప్రపంచాన్ని సుసంపన్నం చేసిన యాత్రాచరిత్రలెన్నో ఉన్నాయి. వారితో పోల్చదగ్గ భ్రమణజీవిని కాకపోయినప్పటికీ నేను కూడా యాత్రాసాహిత్య సృష్టికి పూనుకోవడానికి కొంతకారణం లేకపోలేదు.

శరత్‌బాబు రాసిన సుప్రసిద్ధనవల ‘శ్రీకాంత్‌’ లో తన కథ వినిపించడానికి ఉద్యుక్తుడవుతూ కథానాయకుడు చెప్పే మొదటివాక్యం ‘నా జీవితమంతా ప్రయాణాల్లోనే గడిచిపోయింది…’ ఆ నవలను నేను ఒక రైలుప్రయాణంలో మొదలుపెట్టి, ఆ ప్రయాణమయ్యేటప్పటికి పూర్తిచేసేసాను. ఆ నవల గుర్తొచ్చి నప్పుడల్లా సుదూరంలోకీ సాగిపొయ్యే రైలుపట్టాల మీద మధ్యాహ్నపు వేళల ఎండ గీసిన వెండి అంచుగీతలూ, దడదడలాడే బోగీల చప్పుళ్లు, ఇంజన్‌కూతలూ, గాల్లోకి అలముకునే పొగా, ఇనపతలుపుల వాసనా, వెనక్కి సాగిపోయే గ్రామాలూ, అక్కడక్కడ ఏ తుమ్మచెట్టుకిందనో పరుచుకునే ఊదారంగునీడలూ గుర్తొస్తాయి.

అవును, నా జీవితం కూడా అధికభాగం ప్రయాణాల్లోనే గడిచిపోయింది. ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది. బుతుపవనాలు మలుపు తిరిగి తొలివానజల్లులు వేసవి నేలల్ని తడుపుతున్నప్పుడు ఏ రైల్లోనో లేదా చిన్నకారులోనో ఆగని ప్రయాణమేదో కొనసాగిస్తూ పోవాలని. మరీ పసితనంలోనే ఇల్లువదలి ఎక్కడో ఒక దూరపుపాఠశాలకు పోవలసివచ్చిన బాల్యంలో, ఒక బస్సుకిటికీనో లేదా రైలుకిటికీనో ఆశ్రయించి ఏ పంటపొలాలమీద తూనీగగానో, ఏ మబ్బుదారుల్లో మెరుపుగానో నా మనసుని పోనిచ్చేవాణ్ణి. ఏవేవో కలలు కంటూండేవాణ్ణి.

బహుశా ప్రయాణాలూ, యాత్రలూ మా ఇంట్లో తరంతరంనుంచి తరానికి కొనసాగుతూవస్తున్న వ్యసనాలై ఉండాలి. మా తాతగారు సుందర్రావుగారు కాలినడకన మూడు సార్లు కాశీనుండి రామేశ్వరం దాకా యాత్ర చేసారని మా నాన్బగారు చెప్తూ ఉండేవారు. తన యాత్రల మధ్యలో అక్కడక్కడనుండి ఆయన మా బామ్మగారికి రాసిన ఉత్తరాలు కూడా మా ఇంట్లో చాలాకాలంపాటే ఉండేవి. నేను చదివిన మొదటి యాత్రాసాహిత్యం ఆ ఉత్తరాలే.

మా దూరపుబంధువు ఒకాయన, వరసకు మా పెదనాన్న, ఈశాన్యరైల్వేలో పనిచేస్తూండేవారు. ఆయన పేరు అప్పరాజు బుచ్చి సుందరరావు. ఆయన యాత్రలు చెయ్యడంతో ఊరుకోకుండా ఆ యాత్రావర్ణనల్ని రాసి, వాటికి కొన్ని స్కెచ్‌లు జోడించి పత్రికలకు పంపేవారు. ఆయన తరువాత మా అన్నయ్య సుందర్రావు కూడా యాత్రావ్యసనశీలుడే. బహుశా మొత్తం భారతదేశాన్ని వాడొక్కసారేనా చుట్టి వచ్చిఉంటాడు.

నా ప్రయాణానుభవాలూ, యాశ్రానుభవాలూ విచిత్రమైనవి. నేను చూసిన ప్రపంచం పెద్దదేనని అప్పుడప్పుడూ అనుకుంటానుగానీ, నిజానికి అది చాలా చిన్నది. నేను చూడడానికి నోచుకున్న లోకం కన్నా ఇప్పటికీ చూడలేకపోయిన లోకమే పెద్దది. ఆ లోకం కూడా ఎక్కడో సుదూరంగా ఉన్నదిపూత్రమే కాదు, చాలా సందర్భాల్లో నాకు అత్యంత సమీపంలో ఉండే ప్రపంచం కూడా.

మా ఊరు దాటిన తరువాత ఎడమవైపు కొండల మధ్యనుండి ఒక మట్టిబాట పోతూఉంటుంది. అక్కడొక చిన్న కుంటా, దాని గట్టుమీద ఒక వెలగచెట్టూ ఉంటాయి. ఆ వెలగచెట్టు పక్కనంతా నల్లని నేరేడు వనం. ఆ బాట ఎక్కడికి పోతుందని అడిగానొకసారి నా చిన్నప్పుడు ఎవరినో. వాళ్లది బడదనాపల్లి అనే ఊరికి పోతుందని చెప్పారు.

మా ఊరినుంచి బహుశా రెండుమూడు కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ఉండని ఆ ఊరు ఇప్పటికీ నేను పోలేకపోయాను. కాని ఆ మట్టిబాటా, ఆ కొండలమలుపూ, ఆ నీటికుంటా, ఆ వెలగచెట్టూ, ఆ నేరేడు చెట్ల ఆడవీ నేను చూసిఉండని ఆ ఊరుపట్ల నా కేదో సున్నితమైన కుతూహలాన్నిప్పటికీ రేకెత్తిస్తూనే ఉంటాయి.

 చూసిన భూముల కన్నా చూడవలసిన భూముల్లో మరేదో అనిర్వచనీయ సౌందర్యం దాగిఉందనే భ్రమ నన్నెప్పుడూ వీడదనుకుంటాను.

చేసిన నా కొద్దిపాటి యాత్రల్నీ రచనలుగా తేవాలనే కోరిక నాకు కలిగింది కాదు. 1994లో నేను పాడేరులో పనిచేస్తుండగా సుప్రసిద్ధ కథకులు శ్రీపతి ఒకసారి నన్ను చూడటానికి వచ్చారు. పాడేరు, అరకులోయల గురించి అప్పుడు మేమేం మాట్లాడుకున్నామోగాని, నా చేత అరకులోయ పైన ఒక యాత్రాకథనాన్ని రాయించవలసిందిగా ఆయన ఇండియాటుడే పత్రికను కోరారు. ఆ విధంగా నేను యాత్రారచయితగా కూడా మారాను.

ఇందులోని మూడు యాత్రా వర్ణనలు, అరకు, పాపికొండలు, శ్రీశైలం గురించి రాసినవి ఆ విధంగా ఇండియాటుడే పత్రిక కోసం రాసినవి. అవి మూడూ గిరిజన ప్రాంతాలు కూడా కావడంతో నా కర్మభూములు. ఇందులో ఒకచోట రాసినట్టుగా వాటి గురించి రాయడమంటేనా ఇంటికి నేనే అతిథిగా పోయినట్టు. అయినా కూడా వాటినొక కొత్త చూపుతో చూడటానికి ప్రయత్నించాను.

అరకులోయ మీద రాసిన యాత్రావర్ణన చదివి సుప్రసిద్ధ భావుకులు చేకూరి రామారావు ‘ఆ రచనలో అడవులతో పాటు మనుషులున్నారు. మనుషుల్ని కొత్తగా చూడటముంది, అది నాకు బాగా నచ్చింది’ అన్నారు. బహుశా ఏ యాత్రావర్ణనకైనా అంతకుమించిన ప్రశంస ఉంటుందనుకోను.

పదేళ్ల కిందట ఢిల్లీలో రిపబ్లిక్‌ దినోత్సవాలను చూడటానికి ఇద్దరు గిరిజనరైతులకు ఆహ్వానం వచ్చింది. వారిని తీసుకువెళ్లి తిరిగి తీసుకువచ్చే బాధ్యత ప్రభుత్వం నాకు అప్పగించింది. అప్పుడు లభ్యమైన కొద్ది తీరికలో మా విజ్జికి రాసిన ఉత్తరాల్ని కూడా ఇందులో చేర్చాను. ఇవి అముద్రితాలు. కాని, స్వదేశాన్ని కొత్తకళ్లతో చూసే ప్రయత్నం వీటిలో కూడా ఉందడనిపించి వీటిని కూడా ఇందులో చేర్చాను.

ఈ యాత్రారచనల మధ్యలో నేను ఇంగ్లాండ్‌ వెళ్లడం తటస్థించింది. నేను ఆ పర్యటనకు బయలుదేరేముందే దాన్నాక యాత్రాచరిత్రగా రాయాలని సంకల్పించుకున్నాను. తిరిగి రాగానే నా రచనను నా మిత్రుడు, ప్రముఖ కవి కల్లూరి భాస్కరం ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ధారావాహికగా ప్రచురించారు.

తెలుగు రచయితలు, కవులు ఎందరో తమ విదేశయాత్రలను యాత్రాచరిత్రలుగా రాయకపోలేదు. కాని అవేవీ నన్ను తృప్తి పరచలేదు. ఒక మనిషి విదేశానికి వెళ్లినప్పుడు యథార్థానికి అతడు స్వదేశానికి వెళుతున్నట్టే. తనని తాను అన్వేషించుకోవడానికీ, అర్ధం చేసుకోవడానికీ విదేశం ఒక కొత్త కుదుపునిస్తుంది. అక్కడ అతడు తన అత్మకూ, తన హృదయానికీ సన్నిహితమైనదాన్నేదో ఆసక్తిగా, బెరుగ్గా, ఇష్టంగా సమీపించేప్రయత్నం చేస్తాడు.

అటువంటి ప్రయత్నంలో కొంత తాత్విక సమాలోచన, జీవిత దృక్పథనిర్మాణం తప్పనిసరి. అటువంటి స్వీయావలోకన లేకుండా కేవలం వస్తువుల్నీ, సంఘటనల్నీ, పరిచయస్థుల్నీ వివరించడం మ్యూజియం కేటలాగులా ఉంటుందిగాని, కళాత్మక ప్రదర్శనగా ఉండదు.

స్వామి వివేకానంద ఐరోపా పర్యటన చరిత్ర, టాగోర్‌ రాసిన చీనా, జపాన్‌, రష్యా, అమెరికా, ఐరోపా యాత్రాలేఖలు, జార్జిగుర్జ్‌జీఫ్‌ రాసిన ‘మీటింగ్స్‌ విత్‌ రిమార్కబుల్‌ మెన్‌’, కౌంట్‌ కీసిర్లింగ్‌ రాసిన ‘ద ట్రావెల్‌ డైరీ ఆఫ్‌ ఎ  ఫిలాసఫర్‌’ వంటివి నాకు నచ్చడానికి కారణం అటువంటి పరిశీలనమే.

చారిత్రకప్రాధాన్యత కలిగిన స్థలాలకు వెళ్లి తమ అనుభవాలను నమోదు చేసిన యాత్రాచరిత్రకారుల గురించి రాస్తూ బ్రియాన్‌ ఫాగన్‌ అనే ఒక యాంత్రొ పాలజిస్టు ‘ఫ్రమ్‌ స్టోన్‌ హెంజ్‌ టు సామర్థండ్‌’ (2006) ఆనే రచన వెలువరించాడు. అందులో ఆయన ‘చారిత్రక ప్రాధాన్యతకలిగిన యాత్రాసాహిత్యంలో కొంత వచనం, కొంత కవిత్వం కలగలిసి వుంటాయనీ, కొంత నిర్దుష్ట సమాచారంతో శాస్త్రీయంగానూ, కొంత ఉత్తేజపరిచేదిగానూ ఉండక తప్పదనీ’ అంటాడు. ఆ రచనల్లో అన్నిటికన్నా ముఖ్యంగా ‘కొంత ఆశ్చర్యం, అద్భుతం, సంతోషం వెల్లివిరుస్తుంటాయం’టాడు. నా యాత్రారచనలకు కూడా ఈ మాటలు సరిపోవాలని కోరుకుంటాను.

నాతో యాత్రారచనలు చేయించి వాటిని ప్రచురించినందుకు ఇండియాటుడే పత్రికకూ, అమర్‌నాథ్‌ కె మీనన్‌గారికీ, రాజేంద్రగారికీ, జి. రాజశుక గారికీ, ఆ పత్రికకు నన్ను పరిచయం చేసిన శ్రీపతి గారికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అరకులోయలో, పాపికొండల్లో, నల్లమల అడవుల్లో చక్కని ఫోటోలు తీసిన ఇండియాటుడే ఫొటోగ్రాఫర్లు కె.ఆర్‌. వినయన్‌, ఏ.ప్రభాకరరావుగార్లను కూడా సంతోషంతో గుర్తుచేసుకుంటున్నాను. సాంచి పైన నా రచనను అడిగి మరీ ప్రచురించిన అంధ్రజ్యోతి ఆదివారం సంపాదకులు వసంతలక్ష్మి గారికి నా ధన్యవాదాలు. రిపబ్లిక్‌ డే ఉత్సవాలకోసం ఢిల్లీ వెళ్లడానికి కారణమైన నా సహోద్యోగి, స్కౌటుఆఫీసరు, స్వర్గీయ ఎ.సూర్యనారాయణను కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాను.

ముఖ్యంగా, నేను ఆశించకపోయినా, నన్ను టైనింగ్‌ కోసం మాంచెష్టర్‌ పంపించిన అప్పటి మా గిరిజనసంక్షేమమశాఖ కమిషనర్‌ టి. ఎస్‌. అప్పారావుగారికి కూడా ఈ సందర్భంగా నమస్సులు చెల్లించుకుంటున్నాను.

గత మూడునాలుగేళ్లలో చేసిన ప్రయాణాల్ని మా అమృత డైరీల్లోనూ, మా ప్రమోద్‌ ఫొటోల్లోనూ భద్రపరిచి వుండకపోతే, నాకా యాత్రారచనలు నిర్దుష్టంగా రాయగలిగే అవకాశముండేదికాదు. అందుకు వాళ్లిద్దరికీ కూడా నా ఆశీస్సులు.

నా చిన్నప్పుడు మా ఇంటికన్నా విస్తృతమైన ప్రపంచం మా ఊరే. ఆ ఊరికి ఉత్తరంగా పారే సెలయేరు, దక్షిణంగా చాపరాయి, తూర్పు వైపు కొండలోయ లొద్దు, పడమటి వైపు చెరువూ, చెరుకుతోటలూ, ఊరి అంచుల్లో రాళ్లగట్టుతూములు, నేరేడు చెట్లు.. వీటన్నిటితో కూడిన ప్రపంచాన్ని నా పసి కళ్లకీ, కాళ్లకీ మా భద్రం అన్నయ్యే పరిచయం చేసాడు. అందుకు గుర్తుగా ఈ రచనని వాడికి కానుకచేస్తున్నాను.

12-11-2011


A Word Before You Begin

Travelogues are not new in Telugu literature. From Enugula Veeraswamayya’s Kasiyatra Charitra to Adinarayana’s Bhramanankanksha, and from Rahul Sankrityayan’s Lokasanchari to B.V. Ramana’s trekking memoirs, many travel writings have enriched the Telugu literary world. Although I cannot compare myself to such lifelong wanderers, I too have my own reasons for venturing into travel writing.

In Sarat Chandra Chattopadhyay’s famous novel Srikanta, as the protagonist gets ready to tell his story, his very first sentence is: “My whole life was spent in journeys…” I started reading that novel during a train journey and finished it just as the journey ended. Whenever I recall that book, I am reminded of the silver lines drawn by the afternoon sun along distant railway tracks, the rattling sound of train coaches, the engine whistles, smoke spreading into the air, the smell of iron doors, villages drifting backward, and the purple patches of shade resting under scattered acacia trees.

Yes, a large part of my life has also been spent travelling. Sometimes I feel an urge to embark on an endless journey—by train or in a small car—just when the monsoons turn and the first showers wet the parched summer earth. As a young child forced to leave home for a distant school, I would sit by a bus or train window and let my mind wander—like a dragonfly over crop fields, or a flash of lightning across cloudy skies. I used to dream endlessly.

Perhaps travelling and wandering have been an ongoing passion in our family across generations. My father used to tell me that my grandfather, Sundarrao, walked on foot from Varanasi to Rameswaram three times. The letters he wrote to my grandmother from various stops along those journeys remained in our home for a very long time. Those letters were the very first travel literature I ever read.

A distant relative of ours, an elder uncle of mine, worked in the North Eastern Railway. His name was Apparaju Buchi Sundararao. He did not just travel; he wrote vivid travelogues, added sketches to them, and sent them to magazines. After him, my elder brother Sundarrao also caught the travel bug. He must have travelled across all of India at least once.

My experiences of travel are quite strange. Sometimes I think the world I have seen is vast, but in reality, it is very small. Compared to the world I was fortunate enough to see, the unseen world remains far greater. And that unseen world is not just somewhere far away; often, it is the world right next to me.

Just past our village, a dirt path winds its way between the hills on the left. There is a small pond there, with a wood-apple tree on its bank. Beside that tree stands a dense grove of black jamun trees. Once during my childhood, I asked someone where that path went. They told me it led to a village called Badadanapalli.

That village is probably no more than two or three kilometers from ours, yet to this day, I have never visited it. But that dirt path, the bend in the hills, the little pond, the wood-apple tree, and the jamun grove still stir a gentle curiosity in me about that unseen place.

I think I will never lose the illusion that some indescribable beauty lies hidden in the lands yet to be seen, far more than in the lands already visited.

I never initially intended to turn my modest travels into books. In 1994, while I was working in Paderu, the renowned storyteller Sripathy came to visit me. I don’t recall what we spoke about regarding Paderu and the Araku Valley, but he requested India Today magazine to have me write a travel feature on Araku. That was how I became a travel writer.

Three travelogues in this collection—on Araku, Papikondalu, and Srisailam—were written for India Today. Since all three are tribal regions, they are also my workplaces. As I noted somewhere in this book, writing about them felt like visiting my own home as a guest. Even so, I tried to look at them with fresh eyes.

After reading the piece on Araku Valley, the well-known critic and intellectual Chekuri Rama Rao remarked: “In this writing, along with forests, there are human beings. You have looked at people with a fresh perspective; I liked it very much.” I don’t think there can be greater praise for any travelogue.

Ten years ago, two tribal farmers received an invitation to witness the Republic Day celebrations in Delhi. The government entrusted me with the responsibility of escorting them there and back. During the little free time I had then, I wrote a few letters to Vijji, which I have also included here. They were previously unpublished. I included them because I felt they, too, reflect an effort to see our country with new eyes.

Amidst these writings, I happened to travel to England. Before embarking on the trip, I resolved to write it as a travelogue. Upon my return, my friend and prominent poet Kalluri Bhaskaram published it as a serial in the Andhra Prabha Sunday supplement.

Many Telugu writers and poets have written travelogues about their journeys abroad, but none of them truly satisfied me. When a person travels to a foreign land, in truth, they are journeying back toward themselves. A foreign country offers a new jolt to explore and understand oneself. There, one tries to approach whatever is close to their soul and heart—with curiosity, hesitation, and affection.

In such an effort, philosophical reflection and the shaping of a worldview become essential. Without such introspection, merely listing objects, events, and acquaintances reads like a museum catalogue rather than a work of art.

Swami Vivekananda’s European tour memoirs, Rabindranath Tagore’s travel letters from China, Japan, Russia, America, and Europe, George Gurdjieff’s Meetings with Remarkable Men, and Count Keyserling’s The Travel Diary of a Philosopher appeal to me precisely because of this kind of introspective insight.

Writing about travel writers who visited historic places and recorded their experiences, anthropologist Brian Fagan published a work titled From Stonehenge to Samarkand (2006). In it, he notes that travel literature of historic significance blends prose and poetry, combining precise scientific information with an inspiring quality. Above all, he says, such writings brim with a sense of wonder, astonishment, and joy. I hope these words hold true for my travel writings as well.

I express my heartfelt gratitude to India Today magazine, Amarnath K. Menon, Rajendra, G. Rajasuka, and Sripathy, who introduced me to the publication, for encouraging me to write these pieces and publishing them. I also warmly remember India Today photographers K.R. Vinayan and A. Prabhakara Rao, who captured beautiful photographs across Araku Valley, Papikondalu, and the Nallamala forests. My thanks to Vasanthalakshmi, editor of Andhra Jyothi Sunday supplement, who specifically requested and published my piece on Sanchi. I also fondly remember my colleague and Scout Officer, the late A. Suryanarayana, who was the reason for my Delhi trip during Republic Day.

In particular, I offer my respectful regards to T.S. Appa Rao, the then Commissioner of Tribal Welfare, who sent me to Manchester for training even though I had not anticipated it.

Had our Amrutha not preserved our journeys of the past three or four years in diaries, and had our Pramod not captured them in photographs, I would not have been able to write these travelogues with such precision. My blessings go to both of them.

In my childhood, the world beyond our home was our village. The brook flowing to the north, the hill slopes to the south, the mountain valley gorge to the east, the lake and sugarcane fields to the west, the stone sluices and jamun trees at the village edge—it was my elder brother Bhadram who introduced my young eyes and feet to this entire world. In fond memory of that, I dedicate this work to him.

12-11-2011

3 Replies to “నేను తిరిగిన దారులు-1”

  1. “తనని తాను అన్వేషించుకోవడానికీ, అర్ధం చేసుకోవడానికీ విదేశం ఒక కొత్త కుదుపునిస్తుంది. అక్కడ అతడు తన అత్మకూ, తన హృదయానికీ సన్నిహితమైనదాన్నేదో ఆసక్తిగా, బెరుగ్గా, ఇష్టంగా సమీపించేప్రయత్నం చేస్తాడు.
    అటువంటి ప్రయత్నంలో కొంత తాత్విక సమాలోచన, జీవిత దృక్పథనిర్మాణం తప్పనిసరి.”

    Wonderful, sir! Looking forward to reading this book and experiencing these journeys through your travelogues.

  2. మీ యాత్రానుభవాల్లో మొదటి పుస్తకం అయిన ఈ ‘నేను తిరిగిన దారులు’ లో కొత్త ప్రదేశాలను ఏ చూపుతో చూడాలో అవగతం చేస్తుంది.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading