ప్రియమైన శాఫో-14

ప్రియమైన శాఫో

ఈ రోజు టాగోర్ పుట్టినరోజు. నిండు వైశాఖంలో పుట్టాడాయన. నేను మార్చిలో పుట్టానుకాబట్టి ఆయన కన్నా రెండు నెలలు పెద్దవాణ్ణి. లేదా చైత్రం అనుకుంటే నెలరోజులు పెద్దవాణ్ణి. అందుకని ఆయన్నుద్దేశిస్తూ ఒకసారిలా కవిత రాసాను:

టాగోర్ పుట్టినరోజు సందర్భంగా రేపు వినయ చేజెర్ల గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి టాగోరు కథలమీద మాట్లాడమని అడిగారు. ఎప్పుడో నలభయ్యేళ్ళ కింద చదివిన కథలు. ఇప్పుడు మళ్ళా ఈ వారం రోజుల పాటు ఆ కథలే చదువుతూ ఉన్నాను. కొన్ని పుస్తకాల గురించి అనుకుంటూ ఉంటాం, ఇవి మన చిన్నప్పుడే ఎందుకు తెలీదు? వీటినప్పుడే చదివి ఉంటే, జీవితం ఇలా ఉండి ఉండేది కాదు అని. కాని ఇప్పుడు కొత్తగా తెలుస్తోంది: కొన్ని పుస్తకాలు నీ చేతుల్లోకి ముందే వచ్చినా, నువ్వు చిన్నప్పుడే చదివినా, ఏమీ ప్రయోజనం లేదని. ఎందుకంటే, ఒక జీవితకాలం గడిస్తే తప్ప ఆ పుస్తకాల్లో రాసి ఉన్నదేదో అర్థం కాదు. నువ్వు నిప్పుల్లోంచి నడిచి ఉండాలి. కన్నీటిప్రవాహాలు యీది ఉండాలి, అప్పుడు గాని ఆ పుస్తకాల వెనక ఆ రచయిత హృదయమేమిటో గుర్తుపట్టలేవు.

ఈ వారం రోజులుగానూ ఒక వైపు నీకు ఉత్తరాలు రాస్తూనే మరో వైపు నూట ముప్ఫై ఏళ్ళ కిందటి ఆ బెంగాల్ గ్రామసీమల్లో తిరుగుతూ ఉన్నాను. ఆ కథలనిండా ఎంత దుఃఖం శాఫో! ఎంత స్త్రీ దుఃఖం! అదే సమయంలో ఆయన తన కవితల్లో జీవితోత్సవం జరుపుకుంటూ ఉన్నాడని కూడా నాకు గుర్తొస్తూ ఉంది. కాని అంత దుఃఖపూరితమైన ఆ కథల్ని అప్పుడు నేనెట్లా చదివేయగలిగాను? లోకం ఏమీ తెలియని ఆ కాలంలో, ‘స్త్రీర్ పత్ర’ లాంటి కథ చదివితే మాత్రం నాకేమి అర్థమై ఉంటుంది? నాకు సరే, ఆయన కాలం నాటి బెంగాల్ సాహిత్యవేత్తలకి మాత్రం ఏమర్థమై ఉంటుంది? ఆ కథల్లో అంతా కవిత్వమూ, కాల్పనిక ప్రపంచమూ ఉన్నాయని అన్నారట వాళ్ళు. అప్పటి తన సమకాలికుల మాటలు గుర్తుచేసుకుంటూ, తన చివరి సంవత్సరాల్లో, టాగోర్ అన్నాడట: ‘ఆ కథల్లో ఉన్నదంతా నిష్ఠుర వాస్తవాలు’ అని.

అదే ఆశ్చర్యమనిపిస్తుంది. ఆయన అంత దుఃఖభాజనమైన జీవితం గురించి రాస్తే పాఠకులకి అది కవిత్వమని ఎలా అనిపించింది? దీని గురించి ఆలోచిస్తూ, మొదట నేననుకున్నాను, నాలానే ఆయన సమకాలిక బెంగాల్ పాఠకులు కూడా శైశవంలోనే ఉండి ఉంటారని. కానీ, ఆలోచించగా అనిపించింది, అది ఆయన సాహిత్యశిల్ప మహిమ అని.

సాహిత్యం, కళ- ఇవి చేసే ఇంద్రజాలమిదే. దుఃఖం గురించి మాట్లాడుతున్నప్పుడు అవి మనలో రసానందాన్ని కలగచేస్తాయి. ఎందుకిలా? దీని గురించి వెయ్యేళ్ళ పాటు చర్చించి కూడా భారతీయ అలంకారికులు ఇదీ కారణమని ఇతమిత్థంగా తేల్చలేకపోయారు. కాని ఒకటైతే నిజం, ప్రపంచంలో ఉన్నంతసేపూ అది దుఃఖం. కాని కవి కళ్ళల్లో పడ్డతరువాత ఆ శోకం శ్లోకంగా మారిపోతుంది.

అందుకని ఈ రోజంతా నీ యీ వాక్యమే నాకు గుర్తొస్తూ ఉంది. Fragment 150 గా మాకు లభించిన ఈ వాక్యం:

ఆశ్చర్యంగా ఉంటుంది, నీ కవిత్వంలో ఎవరెవరు తమకి నచ్చిన వాక్యాల్ని ఎలా ఎత్తి రాసుకుని భద్రపరిచారో. గ్రీకు, రోమన్ పండితులు, అలంకారవేత్తలు, వ్యాకరణవేత్తలు, వక్తలు- ప్రతి ఒక్క రంగంలోనూ ఉత్తమోత్తములైనవాళ్ళు నీ మాటలు ఒకటో రెండో ఏదోఒక సందర్భంలో ప్రస్తావించకుండా ఉండలేకపోయారు. అదే చెప్తుంది నీ భావనాసీమ ఎంత సముజ్వలమైందో.

అలాంటివాళ్ళల్లో Maximus of Tyre కూడా ఒకడు. రెండో శతాబ్దపు రోమన్. కాని రోమన్ సామ్రాజ్య కాలంలో ఉదాత్తభావాల్నీ, అత్యున్నత సౌందర్యాన్నీ, గాఢమైన అనుభూతినీ అన్వేషించినవాళ్ళు చాలామందిలానే మాగ్జిమస్ కూడా మానసికంగా గ్రీకు ప్రపంచంలోనే జీవించాడు. రోమన్ అయినప్పటికీ రోమ్ గురించి అతడు రాసింది చాలా తక్కువని చెప్తారు. నిజానికి అతడు నివసించింది కూడా ఏథెన్సులోనే అని విన్నాను. మనిషి గురించి, అతడి మర్త్యత్వం గురించీ, దాన్ని దాటి అతడు దివ్యత్వం వైపుగా చెయ్యవలసిన ప్రయాణం గురించీ అతడు మాటాడుతూ వచ్చాడు. వాటిలో 41 సంభాషణలు Orations  పేరిట మిగిలాయి. వాటిల్లో ఏ ఒక్క భాగం చదివినా, అతడు ఒక సోఫిస్టులానో, ప్లేటో  అనుయాయిలానో వినిపిస్తాడు. మాలాంటి వాళ్ళకి ఆ మాటలు భారతీయ వేదాంతాన్ని గుర్తుచేస్తాయన్నా ఆశ్చర్యం లేదు.  కాబట్టే, అతడు తన మానసిక ప్రపంచానికి తగ్గట్టే నీ ఈ కవితాశకలాన్ని ప్రస్తావించాడు,

ఈ వాక్యాన్ని ఒక్కో అనువాదకుడు ఒక్కోలా అనువదించాడు. కాని భారతీయ కావ్య సంప్రదాయంతో పరిచయం ఉన్నవారికెవరికైనా నీ మాటలు ఎంతో సముచితమనిపిస్తాయి. మా పూర్వులు దీనే మరోలా చెప్పారు: కావ్యం ఆదిలో మంగళమయంగా ఉండాలి, మధ్యలో మంగళమయంగా ఉండాలి, కావ్యాన్ని ముగించినప్పుడు కూడా మంగళప్రదంగా ముగించాలి అని.

అంటే జీవితంలో ఉన్న శోకాన్నీ, దుఃఖాన్నీ సాహిత్యం ప్రతిబింబించకూడదనా? కాదు. దుఃఖం తప్పకుండా ఉంటుంది. మా మాష్టారు చెప్పేవారు, కాళిదాసు అజవిలాపంలో పురుష దుఃఖాన్నీ, రతీవిలాపంలో స్త్రీ దుఃఖాన్నీ, మేఘదూతంలో స్త్రీపురుష దుఃఖాలు రెండింటినీ చిత్రించాడని. కాని రఘువంశమూ, కుమారసంభవమూ, మేఘదూతమూ చదివితే మనకి కలిగేది దుఃఖం కాదు, ఆనందం. ఎందుకని? కవి అక్కడ తన చేతుల్లోకి తీసుకున్న మానవాశ్రువుల్ని మంచిముత్యాలుగా మార్చేసాడు కాబట్టి. రామాయణాన్నే తీసుకుందాం. అంతకన్నా దుఃఖభరితమైన జీవితగాథ మరొకటి ఉంటుందా? కాని అదంతా ఒక దివ్యమంగళ లీలలో భాగమనే మనకి కావ్యం పొడుగుతా స్ఫురిస్తూ ఉంటుంది. నిజమైన సాహిత్య ప్రయోజనం ఇదే.

అందుకని సరస్వతీ ఉపాసకుల ఇంట్లో వేదనకి తావులేదన్నావు. నువ్వు వాడిన గ్రీకు పదం moisopolōn. ఇంగ్లిషులో Home of Muses. ఎవరు Muses? మీ గ్రీకు పురాణాల ప్రకారం సర్వేశ్వరుడైన  Zeus కీ, Mnemosyne కీ, అంటే స్మృతికీ పుట్టిన దేవతలు. తొమ్మిది మంది. ఇతిహాస కవిత్వం, ప్రేమ కవిత్వం, మోదాంత  నాటకం, విషాదాంత నాటకం, స్తోత్రాలు, సంగీతం, నృత్యం, చరిత్ర, ఖగోళ శాస్త్రం.  వాటి సన్నిధిలో విలాపానికీ, రోదనకీ స్థానం లేదంటున్నావు నువ్వు. ఆ తొమ్మిది మంది దేవతల్లో విషాదాంత నాటకం కూడా ఉందని గుర్తుపెట్టుకుంటే, అక్కడ కూడా విలాపానికి చోటులేదంటున్నావంటే, నీ దృష్టి ఎంత ఉన్నతమైందో నేను గ్రహించగలుగుతున్నాను. అంటే సోపోక్లీస్  రాసిన ‘ఈడిపస్ రెక్స్’ నాటకం చూసిన తరువాత, యురిపిడిస్ రాసిన ‘మేడియా’ చూసిన తర్వాత కూడా, చివరికి షేక్ స్పియర్ రాసిన ‘కింగ్ లియర్’ చూసాక కూడా  ప్రేక్షకుడు విలపించడం ధర్మం కాదంటున్నావు నువ్వు. ఏమి మాటలివి శాఫో! మేము తేరిపారచూడలేని ఏ ఔన్నత్యంలోంచి, ఏ అసామాన్య పరిణతిలోంచి మాట్లాడుతున్న మాటలివి! అందుకనే ఆ తొమ్మిదిమంది తర్వాత నువ్వు  Tenth Muse వి అని ప్లేటో అన్నాడంటే ఆశ్చర్యమేముంది!

నువ్వంటున్న మాటల్లో అర్థమేమిటో నాకు టాగోర్ కథలు చదువుతుంటే తెలుస్తున్నది. ఆయన అటువంటి విషాదమయ జీవితాన్ని చూస్తూ కూడా విలాపానికి పూనుకోలేదు. ఆ కథలు చదువుతుంటే మనకి కన్నీళ్ళు వస్తాయి, నిజమే, దుఃఖం కలుగుతుంది, నిజమే, కాని దైన్యం కలగదు. అటువంటి దుస్సహ, బాధామయ, వేదనామయ జీవితం మధ్య కూడా మనలో ఒక శక్తి మేల్కోవడం మనకి అనుభవంలోకి వస్తుంది. కాదు, జీవితమిలా ఉండకూడదు, దీనెట్లాగైనా సరే, మనం సరిదిద్దాలి, ఏమైనా సరే, ఈ తల్లులూ, ఈ పిల్లలూ ఇట్లా కన్నీళ్ళు కార్చకూడదు, ఇది మన ప్రపంచానికి శోభించేది కాదు అనిపిస్తుంది. ఆ మెలకువ, ఆ స్ఫూర్తి మనలో వెంటనే ఏదో ఒక కర్మకలాపంగా బయటపడితీరాలని ఏమీ లేదు. బహుశా మనం జీవితకాలం పాటు అటువంటి కావ్యాలు చదువుకుంటూ, కావ్యానందం పొందుతూ, బయటి ప్రపంచంలో ఒక్క అశ్రువు కూడా తుడిచివేయలేకపోవచ్చు. కానీ, ఆ అశ్రువుల్ని మనం అంగీకరించలేం చూడు, ఆ కన్నీళ్ళే నిజమని మనకి మనం చెప్పుకోం చూడు, లేదా బయటి ప్రపంచానికి నచ్చచెప్పాలనుకోం చూడు, ఆ మానసిక స్థితి దానికదే ఒక మహోద్యమం. అది ప్రభవిస్తున్నది మన అంతరంగంలోనే కావొచ్చుగానీ అది  మన మనసు ద్వారానే మానవసమష్టి మానసాన్ని ప్రక్షాళనం చేస్తూనే ఉంటుంది.

మామూలుగా చూస్తే శాకుంతలం నాటకం అయిదో అంకంలోనే ముగిసిపోవాలి. తనని కలవడానికి వచ్చిన శకుంతల ఎవరో తనకు తెలియదని రాజు అబద్ధమాడటం వాస్తవ ప్రపంచంలో జరిగే విషయమే. కాని కవి అక్కడితో ఆగిపోడు, ఆగిపోలేడు కూడా. అక్కడితో ఆగిపోతే, అది మంగళాంతం కాదు. కాబట్టి వాళ్ళిద్దరూ మళ్ళా కలుసుకుంటారు. అది రాజసభలో కాకపోవచ్చు, రాజాంతఃపురంలోనూ కాకపోవచ్చు, ఎక్కడో మరొక దివ్యస్థలంలో, ఏదో ఒక ఋష్యాశ్రమంలో కలుసుకోవచ్చు. కాని నిజానికి వాళ్ళిద్దరూ కలుసుకునేది కవి అంతరంగంలో, అతడి శుభేచ్ఛలో. ‘సరస్వతీ మందిరంలో విలాపగీతాలకి చోటులేద’ నే శుభాకాంక్షలో.

నిజమే, కింగ్ లియర్ అయిదో అంకంలో, లియర్, కార్డీలియాలు కారాగారానికి వెళ్ళవలసి రావడం అత్యంత విషాదం. కానీ, అక్కడ ఆ తండ్రి, ఆ బిడ్డతో:

అని అంటున్నప్పుడు, ఆ మాటలు వింటున్నప్పుడు, మన కళ్ళు తడిసిపోతూనే ఉంటాయిగాని, చెప్పలేని ఒక సంతోష తరంగమేదో మనలోపల ఎగిసిపడుతుండటం కూడా మనకి అనుభవానికొస్తుంది. ఆ తండ్రీ, ఆ కూతురూ, ఆ చెరసాలలోనే కానివ్వు, కలిసి గడుపుతారన్న ఊహానే మనకు ప్రాణప్రదాయకంగా ఉంటుంది. ఎండా, వానా కలిసి కురుస్తున్నట్టు ఉంటుంది. లియర్ మాటల్లో చెప్పాలంటే, the gods themselves throw incense, దేవతలే ధూపం వెలిగించినట్టుగా ఉంటుంది.

టాగోర్ కథలో మాష్టరు మహాశయుడు నిష్కారణంగా మరణిస్తాడు. కాని మరణానికి ముందు అతడిలో కలిగిన అలౌకిక అనుభూతి ఏమి చెప్తుంది? తాను జీవితం చేతిలో, తాను నమ్మిన వారి చేతిలో, తన సాత్త్విక ప్రవృత్తి వల్ల ఓడిపోయాననే భావనతో మాష్టరు మహాశయుడు ఈ లోకాన్ని విడిచిపెట్టడం కథకుడికి ఇష్టం లేదు. మాష్టరు మరణించవచ్చుగాక, కాని, అతడు మానసికంగా విముక్తి చెందాకనే మరణించాడని మనకి బోధపడుతుంది.

ఒక్క వాక్యం శాఫో- ఈ ఒక్క వాక్యంతో నువ్వు నేనింతదాకా చదివిన మహనీయ సాహిత్య కృతులన్నిటికీ హారతి పట్టి చూపిస్తున్నావు. ఆ వెలుగులో  ఆ కావ్యాల్నే  కాదు, నీ మంగళమయ వదనాన్ని కూడా చూడగలుగుతున్నాను శాఫో!

7-5-2026

4 Replies to “ప్రియమైన శాఫో-14”

  1. ఈ ఉత్తరాలు చదువుతూ same feeling sir,
    మా “ కళ్ళు తడిసిపోతూనే ఉంటాయిగాని, చెప్పలేని ఒక సంతోష తరంగమేదో మనలోపల ఎగిసిపడుతుండటం కూడా మనకి అనుభవానికొస్తుంది”

    Beautiful painting!! 🙏🏽

  2. మరొక మహోత్తరమైన ఉత్తరం రాసారు. ధన్యవాదాలు భద్రుడు గారు.

    “కొన్ని పుస్తకాల గురించి అనుకుంటూ ఉంటాం, ఇవి మన చిన్నప్పుడే ఎందుకు తెలీదు? వీటినప్పుడే చదివి ఉంటే, జీవితం ఇలా ఉండి ఉండేది కాదు అని. కాని ఇప్పుడు కొత్తగా తెలుస్తోంది: కొన్ని పుస్తకాలు నీ చేతుల్లోకి ముందే వచ్చినా, నువ్వు చిన్నప్పుడే చదివినా, ఏమీ ప్రయోజనం లేదని. ఎందుకంటే, ఒక జీవితకాలం గడిస్తే తప్ప ఆ పుస్తకాల్లో రాసి ఉన్నదేదో అర్థం కాదు. నువ్వు నిప్పుల్లోంచి నడిచి ఉండాలి. కన్నీటిప్రవాహాలు యీది ఉండాలి, అప్పుడు గాని ఆ పుస్తకాల వెనక ఆ రచయిత హృదయమేమిటో గుర్తుపట్టలేవు.”

    భద్రుడు గారు ఇదే నా సందిగ్ధత కూడా, మీ సమాధానం లో నాక్కూడా సమాధానం దొరికింది.

    టాగోర్ కథలేవీ చదవలేదు.. ఇప్పుడు ఒకటో రెండైనా చదవాలనుంది మీ ఈ పోస్టు పూర్తిగా ఆకళింపు చేసుకోడానికి. నాకు ట్రాజెడీలు చదవడం చాలా కష్టంగా ఉంటుంది. చదివిన కొన్ని రోజులు అదే దుఃఖం నన్ను ఆవరించి ఉంటుంది.

    Fragment 150 – అది ధర్మం కాదు-
    సరస్వతీసేవకుల గృహంలో
    శోకగీతాలు ఆలపించడం
    మనకి తగదు. English translation కోసం చూస్తే “For it is not the custom that a funeral song be heard
    in the house of the servants of the Muses; for us, it would be inappropriate.” ఇది కనబడింది.. ఈ వాక్యాన్ని మీరు ఎంత సరళంగా చేసేసారో.. అలాగే Nine Muses గురించి మీ ఉపోద్ఘాతం , ప్లేటో ఎందుకు శాఫో ను 10th Muse అన్నాడో చాలా అర్థవంతంగా explain చేశారు.

    సరస్వతీ సేవకుల గృహంలో
    శోకగీతాలు ఆలపించడం
    మనకి తగదు.. అందుకేగా సరస్వతీ సంతతి గురించిన ఈ శ్లోకం అంత ప్రాచుర్యం పొందింది..

    “జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః |
    నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం ||

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading