
విశ్వనాథ రాసిన రెండు ఖండకావ్యాల్ని, కవి సంధ్య మార్చి-ఏప్రిల్, 2026 పత్రికలో, గాలి నాసరరెడ్డి వచనకవితలుగా మార్చి చూపించాడు. ఆయన ఎంచుకున్న రెండు కవితలూ విశ్వనాథ ‘భ్రష్టయోగి’ సంపుటంలోవి, రెండూ సుప్రసిద్ధాలు, అత్యంత ప్రభావశీల పద్యాలు. ఒకటి, ‘పసివాడు’, రెండోది, ‘అంధభిక్షువు’.
నాసరరెడ్డి చేసిన ఈ ప్రయోగం నాకెంత సంతోషాన్నిచ్చిందో చెప్పలేను. నిజానికి తెలుగు సాహిత్యలోకం ఇటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టాలని నేను చాలాకాలంగా కోరుకుంటున్నాను.
రెండు కారణాలవల్ల.
మొదటిది, విశ్వనాథ కవిత్వంలో అందరూ తరచూ ప్రశంసించే ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’ కన్నా, ‘కిన్నెరసాని పాటలు’ కన్నా ఆయన తొలినాళ్ళల్లో రాసిన ఖండకావ్యాల సంపుటి ‘భ్రష్టయోగి’ అత్యున్నత స్థాయి కవిత్వం అని నా ఉద్దేశ్యం. కారణమేమంటే, ఆ పద్యాల్లో, ఆయన పాశ్చాత్య ఆధునిక కవుల imagination లాంటిది చూపించాడు. అదే సమయంలో, ఆ ఊహాశాలీనతను సంప్రదాయ ఛందస్సుల్లో పద్యాలుగా మలిచాడు.
ఆధునిక కవిత్వానికి మార్గదర్శకుడిగా చెప్పే బోదిలేరు కూడా సాంప్రదాయిక ఛందస్సులే వాడేడు. అలానే రొమాంటిసిజం నుంచి మాడర్నిజానికి కవిత్వాన్ని తీసుకువెళ్ళిన యుగసంధ్య కవులు, ఇలియట్, రిల్క, యేట్సు వంటివారు కూడా సాంప్రదాయిక ఛందస్సుల్లో ఆధునిక ప్రవృత్తిని కనపర్చారు. ఒక ఆధునిక భావాన్ని సాంప్రదాయిక ఛందస్సులో చెప్పినప్పుడు, వారు చెప్పదలుచుకున్నదానికి, గొప్ప అదుపు, ఉత్కంఠ, పద్యం ముగిసేటప్పటికి పాఠకుణ్ణి ఊహించలేని విభ్రాంతికి గురిచెయ్యగల రసనిర్వహణా సాధ్యమవుతుందని వారు నమ్మారు. అందుకు ‘భ్రష్టయోగి’ సంపుటిలోంచి చాలా పద్యాలు ఎంచి చూపవచ్చు. వీటినిలా వచన పద్యాలుగా మార్చినందువల్ల, ఇప్పటి యువకవులు ఈ పద్యాల్ని కొత్తగా సమీపించగలిగే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకి ఈ సంపుటిలోని ‘పసివాడు’ అనే ఈ మూడు పద్యాల ఖండకావ్యం చూడండి:
ఏను మారాము పెట్టి పెల్లేడ్చుచుంటి
నేడుపుడిపింప మా తండ్రి యివియవియును
నిచ్చె, నవి పారవేసి నేనేడ్చుచుంటి
నేడ్చుచుంటిన యాయన యెత్తుకొనిన
ఎత్తుకొనిపోయి నను రాజగృహముకడకు
పట్టపేనుగు జూపి ‘నా పట్టి! నీకు
దానిపై నెక్కగా నిచ్చెదను సుమన్న!
ఊరకుండు’ మటంచు నన్నూఱడించె.
ఏడ్చుటను మాననేలేద యేను, తండ్రి
యంగడికిఁ దీసికొనిపోయి యచట నాకు
ముచ్చెచేసిన రంగుల పచ్చిపేడ
బొమ్మ కొనియిచ్చె నా యేడు వుపశమించె.
దీన్ని గాలి నాసరరెడ్డి ఇలా వచనకవితగా అనుసరించాడు:
పసివాడు
నేను మారాం చేస్తూ పెద్దగా ఏడుస్తున్నాను
ఏడుపు మానిపించడానికి
మా నాన్న అవీ ఇవీ ఇచ్చాడు
నేను వాటిని విసిరేసి ఏడుస్తున్నాను
ఆయన ఎత్తుకున్నాడు
అయినా ఏడుస్తూనే వున్నాను.
నన్ను రాజగృహం దగ్గరికి ఎత్తుకెళ్ళి
పట్టపేనుగు చూపి
‘బాబూ! నిన్ను దానిమీద ఎక్కిస్తాను
ఊరుకో’ అని ఊరడించాడు.
నేను ఏడవడం మాననేలేదు
అప్పుడు అంగడికి తీసికెళ్ళి
ముచ్చెచేసిన రంగుల పచ్చిపేడబొమ్మ
కొనిచ్చాడు.
నా ఏడుపు ఆగిపోయింది.
ఇక రెండోది, ఇలా పద్యసాహిత్యంలో ఆధునికతా స్ఫూర్తి కలిగిన కవిత్వాన్ని వచన కవితలుగా మార్చడంతోపాటు, ఇంగ్లిషులోకి అనువదించడం. అందుకని నేనీ కవితని ఇలా ఇంగ్లిషులోకి అనువదించాను. చూడండి.
The Toy Elephant
I threw a tantrum, weeping long and loud;
To hush my cries, my father offered toys.
I flung them all away and wailed the more,
Until he gathered me into his arms.
He bore me to the royal palace gates,
And showed the state elephant: “Quiet now!
My boy, I’ll set you high upon its back.”
He sought to soothe, but I would not be stilled.
My sobbing would not cease; and so, my father
Led me to the market, bought for me
A painted toy of humble, sun-dried clay-
And suddenly, the world was still and hushed.
ఇప్పుడు ఈ కవితని అంతర్జాతీయ పాఠకులముందు పెట్టినప్పుడు, వారికి వెంటనే, Coventry Patmore (1823–1896) రాసిన The Toys, Rainer Maria Rilke (1875–1926) రాసిన Childhood (Kindheit), W.B. Yeats (1865–1939) రాసిన Among School Children లో మూడవ స్టాంజా గుర్తొస్తే ఆశ్చర్యం లేదు. అంటే విశ్వనాథ అవి చదివి ఈ పద్యం రాసాడని కాదు. తాను ఎంత సంప్రదాయ వాదినని ఆయన తనను భావించుకున్నా, ప్రపంచమంతా విస్తరించిన ఆధునిక యుగధర్మానికి ఆయన అతీతుడు కాకపోగా, మరింత సమర్థవంతమైన దర్పణం కాగలిగాడనే దీని అర్థం.
23-3-2026
కవికి ఆధునికత కల గలసి యున్న
భావ సంపత్తి నిండిన చేవ వలయు
సర్వ కాలానుగుణ్య సౌజన్య స్ఫూర్తి
లేని వాడేమి కవియగు ? ‘ లేకి ‘ యగును .
ధన్యవాదాలు సార్!
Sir, తెలియని విశ్వనాథ పద్యం గురించి తెలుసుకోవడం,
నాసర రెడ్డి గారి వచన రూపం,
mee English translation
are a beautiful way of looking at the poem in multiple angles.
It is always fascinating to me to understand the construct of a poem,
Showing the poet’s craft, and the way you placed it in the world poetry context.
Thank you for introducing this beautiful poem with complete perspective.
Special thanks to Nasara Reddy garu for the beautiful వచన రూపం. 🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!
విశ్వనాథ నవలల్లో ఆ ఆధునికత ప్రత్యక్షంగా
గోచరమవుతుంది. 🙏
ధన్యవాదాలు సార్! చిన్న కథల్లో మరింత ప్రస్ఫుటంగా ఉంది.
అద్భుతం సర్.
మీకూ, నాసరరెడ్డి గారికి అభినందనలు …శుభాకాంక్షలు
ధన్యవాదాలు సార్!
పద్యాలకు తాత్పర్యం వ్రాసినట్లున్నది, కాని ఛవిత్వ ఛాయలు లేవు!
ఈరోజుల్లో వచనకవిత్వం అంటే ఏమనుకున్నారు?
వ్రాసినవారు వచనకవిత అంటే అది కవిత్వం కాదనటానికి రూల్స్ ఒప్పుకోవు.
కొంచెం పేరుప్రఖ్యాతులు కలవారి వచనకవితలను తప్పనిసరిగా బ్రహ్మాండం అని పొగడకపోతే మహాపాపం అన్నమాట.
పై వ్యాఖ్య వచనకవితానువాదం గురించి.
Shakesphere నాటకాలను Charles Lamb & Mary Lamb అనేవారు వచనంలో Shakesphere Retold అని వ్రాసారు. అవి మంచి ఆదరణ పొందాయి. ఏనియమమూ పాటించమనే వచనకవితల్లో నేటికాలంలో స్వేఛ్ఛపేరిట కనుపిస్తున్నది ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి వచనకవితగా మళచటాన్ని with a pinch of salt తీసుకోవలసి వస్తోందండి.
శ్యామలరావు గారూ! వచన కవిత్వానికి నియమాలు లేవని మీరెలా అనుకుంటున్నారు? మీకు వచన కవిత గురించిన అవగాహన చాలా తక్కువ అనీ, అలా తక్కువనే విషయం మీకు తెలుసనీ కూడా నాకు అర్థం అవుతున్నది.
అయితే విషయం అది కాదు. నా దృష్టిలో సాహిత్య ప్రయోజనం ఒక మనిషికి సహనాన్నీ, సహృదయతనీ అలవర్చడం. అవి అప్పటికే ఆ మనిషిలో ఉంటే సాహిత్యం వాటిని మరింత బలపరచాలి. కానీ నా పోస్టుల్లో వచన కవిత్వం ప్రస్తావన వచ్చినప్పుడల్లా మీరు చేస్తున్న వ్యాఖ్యల్లో తీవ్రమైన అసహనం, అవహేళన పదేపదే కనిపిస్తూ ఉన్నాయి. ఒక మనిషికి రసజ్ఞతా లోపం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు కానీ ఎదుటి మనిషి అనుభవం పట్ల, అనుభూతి పట్ల, అభిప్రాయాల పట్ల గౌరవం లేకపోవడం మాత్రం ఆ వ్యక్తిత్వానికి అతి పెద్ద లోపమని నేననుకుంటాను. కాబట్టి మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేసే ముందు మిమ్మల్ని మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని, మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాల్సిందిగా నా మనవి.