ఒక సంగీత సాయంకాలం

నిన్న సాయంకాలం ఆ సితారు ఆలాపన వింటున్నంతసేపూ నాకు ఒక నది ఒడ్డున కూచున్నట్టూ, నా పాదాలు ఆ నీళ్ళల్లో మునిగీ మునక్కుండా పెట్టుకున్నట్టూ, చిన్ని చిన్ని నీటితరగలు నా పాదాల్ని తాకి విరిగి కిందకి జారిపోతుంటే, నా హృదయంలోపల ఎవరో చేయిపెట్టి మెత్తని సున్నితమైన తంత్రులేవో కెరలిస్తున్నట్టూ అనిపించింది.

స్వర-మిలన్

సంగీతం వినేప్పుడు నా అనుభూతి కూడా అటువంటిదే. అంతేకాదు, గొప్ప చిత్రలేఖనాలు చూస్తున్నప్పటిలాగా, గొప్ప కావ్యాలు చదువుతున్నప్పటిలాగా, ఆ సంగీతం నాలోని ఏవో పురాస్మృతుల్ని కెరలిస్తుంది. నెమ్మదిగా నేనొక మధుర విస్మృతిలోకి జారుకుంటాను.

ప్రభాతసంగీతం

ఆ గాయకులు తాము గానం చేసిన రెండున్నర గంటల పాటూ అక్కడ అటువంటి ఒక వేడుకనే నడిపారనిపించింది. మనం పండగల్లో మట్టితో దేవతను రూపొందిస్తే వారు మన చుట్టూ ఉన్న గాల్లోంచి సంగీతదేవతను ఆవాహన చేసారు.