
అదెలా ఉంటుందంటే ఒక సంపన్న గృహస్థుడి ఇంటిముందు నిల్చున్నాను. ధగధగలాడుతున్న ఆ ఇంట్లోకి తొంగి చూస్తున్నాను. అతనికి నేనెవరో తెలీదనుకుంటాను, అయినా లోపలకి రమ్మన్నాడు. నన్ను స్వయంగా మేడమీద గదిలోకి తీసుకెళ్ళాడు. లైటు వేసాడు. కళ్ళు మిరుమిట్లుగొల్పేటంత వెలుగు. నేను నిద్రలోకి జారిపోయాను. వరదల్లో ఇరుకున్నాను. మళ్ళా ఎట్లానో ఆ ఇంటిముందున్నాను. ఈ సారి నన్ను మేడ మీద మరో అంతస్తుకి తీసుకెళ్ళాడు. లైటు వేసాడు. కళ్ళుమిరుమిట్లు గొల్పేటంత కాంతి. నాకు నిద్రపట్టేసింది. నిద్రలోనే దంతం ఊడిపోయింది. మళ్ళా ఎట్లానో కళ్ళునులుముకుంటూ ఆ ఇంటిముందు నిల్చున్నాను. ఈ సారి మూడో అంతస్తుకి తీసుకెళ్ళాడు. ఆ గదినిండా షాండ్లియర్లు. నాకు కళ్ళు మూతలు పడిపోయాయి. ఎవరో నన్ను వదిలిపెట్టి నా మిత్రుల్ని తమ కారెక్కించుకున్నారు. ఒక్కణ్ణీ ఎలానో దారివెతుక్కుంటూ మళ్ళా ఆ యింటిముందుకు చేరుకున్నాను. మళ్ళా మరో అంతస్తుకి తీసుకెళ్ళాడు. ఆ అద్దాల గదిలోకి ఆకాశం ప్రవహిస్తోంది. అక్కడ అన్నాఅఖ్మతోవాని కలుసుకున్నాను. ఆమెతో మాట్లాడుతూనే నిద్రపోయాను, కాని అంతస్తుమీద అంతస్తు అధిరోహిస్తూనే ఉన్నాను.
12-3-2026
భలే
ఆహా.. Anna Akhmatova – ఎప్పుడో కాలేజీ రోజుల్లో క్విజ్ పోటీల్లో విన్నాను ఆ పేరు.. ఇటాలియన్ పెయింటర్ Modigliani Sketches చూపించి అవి ఎవరిని మోడల్ గా తీసుకుని గీసిన చిత్రాలు అని అడిగారు. ఆన్సర్ ఎవరో చెప్పరనుకోండి… ఆమె ఒక రష్యన్ పోయట్ అని అప్పుడు తెలుసుకున్నా.. మీ పోస్టులో ఆమెను గుర్తు చేసుకోడానికి ఆమె పోయెమ్ ఏదైనా కారణమా? మీరెందుకు ఇక్కడ యేనా అఖ్మతోవా ని తలుచుకన్నారో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది భద్రుడు గారు..