ఈ చెట్టు

And since to look at things in bloom
Fifty springs are little room, ..

A.E (Loveliest of trees, the cherry now)

బ్రెహ్టేనా అన్నాడు: ఎలాంటి కాలమిది
ఇప్పుడు చెట్ల గురించి మాట్లాడటం నేరం
ఎందుకంటే ఆ వంకన
మనుషులకి జరుగుతున్న అన్యాయాల గురించి
మాట్లాడకుండా తప్పించుకుంటున్నావు-అనే కదా!

కానీ, ఇప్పుడు నేను ఈ చెట్టు గురించి
మాట్లాడకపోవడం కన్నా మించిన
నేరం మరేదీ ఉండదు.

ప్రపంచం మొత్తం కలిసికట్టుగా
నన్ను చీకట్లోకి నెడుతున్న ఈ కాలంలో
ఈ చెట్టు ఒక్కటే నా పక్కన నిలబడుతున్నది.

జానపదకథల్లో మైదాసులాగా
ఇప్పుడు ఒక చూపు, మాట, తలపు కూడా
మారణాయుధంగా మారిపోతున్న రోజుల్లో
ఈ చెట్టు ఒక్కటే
తనని ఎవరు చూస్తే వాళ్ళని
బంగారంగా మారుస్తున్నది.

జపానువాడు చెర్రీపూలకోసం
ఏడాది పొడుగునా వేచివున్న ట్టు
ఈ ఫాల్గుణ మాసపు కానుగ చెట్టు కోసం
నేను కూడా ఎదురు చూడగలను.

నేను సాష్టాంగపడకుండానే
నన్ను దీవిస్తున్న ఈ చెట్టుముందు
మరో యాభయ్యేళ్ళు బతికినా
తక్కువనే అనిపిస్తున్నది.

6-3-2026

11 Replies to “ఈ చెట్టు”

  1. “ ప్రపంచం మొత్తం కలిసికట్టుగా
    నన్ను చీకట్లోకి నెడుతున్న ఈ కాలం”

    “నేను సాష్టాంగపడకుండానే
    నన్ను దీవిస్తున్న ఈ చెట్టు”

    🙏🏽🙏🏽🙏🏽

  2. నాది సంప్రదాయికకవిత్వధోరణి కావటం వలన కాబోలు తరచుగా వచనకవిత్వాలను ఎక్కువగా ఆస్వాదించలేకపౌతున్నాను. ఈవిషయం చాలాయేళ్ళుగానే నాగమనికలో ఉంది.

    ఈక్రింది మూడుపంక్తులను చూదాం. (ఆధునికధోరణిలో వీటిని కూడా పద్యపాదాలవలె పాదాలనే అంటారేమో తెలియదు.)

    | కానీ, ఇప్పుడు నేను ఈ చెట్టు గురించి
    | మాట్లాడకపోవడం కన్నా మించిన
    | నేరం మరేదీ ఉండదు.

    నాకైతే ఇదంతా ఒక సాధారణమైన తెలుగువాక్యమే అనిపించింది. నిర్మితిలో.

    నా ఛాందసం ఏస్థాయిలో ఉంటుందంటే “నేను ఈ” అని విసంధిగా వ్రాసినచోట, వ్యావహారికంగా కూడా సంధి నిత్యం కదా, ఇదేమిటీ? అనిపిస్తుంది. ఈమూడు పంక్తులూ కలిపి

    | కానీ, ఇప్పుడు నేనీ చెట్టు గురించి మాట్లాడకపోవడం కన్నా మించిన నేరం మరేదీ ఉండదు.

    అని వ్రాయటానికి ఇబ్బందేమిటీ? తెలియటం లేదు. అందువలన, మూడు పంక్తులుగా చేయటంవలన వచ్చిన నిజమైన ప్రయోజనం ఏమిటీ అని నాకనిపిస్తుంది.

    ఇది సాధారణవాక్యమే ఐనా మూడు పంక్తులుగా (పాదాలుగా) విడదీసి వ్రాయటానికి ప్రాతిపదిక ఏమిటి? అన్నది ఒక ప్రశ్న. పైగా ఇక్కడ పంక్తి కూడా ప్రత్యేకంగా నిలువటం లేదే!

    సమకాలీనకవిత్వాన్ని ఆస్వాదించలేకపోవటం నేరం కాకపోవచ్చును కాని బహుశః అది ఒక లోటుగానే భావించవలసి ఉంటుందేమో. నాకు తెలియటం లేదు.

    నేను స్వయంగా వచనకవిత్వం చెప్పటానికి పూనుకొని కొంత అవగాహనా అనుభవమూ సంపాదించితే తప్ప నాసందేహాలు తీరవేమో నండి. (ఒకవేళ నేను వ్రాసినా అదెలాగూ బుట్టదాఖలు అయే అవకాశమే హెచ్చుగా ఉంటుంది.)

    నాసందేహాలను అటుంచితే.

    | నేను సాష్టాంగపడకుండానే
    | నన్ను దీవిస్తున్న ఈ చెట్టు

    ఈప్రయోగం బాగుంది. సమున్నతమైన చెట్టు క్రింద నిలబడి మనిషి ఇలా ఆనుకోవటం ఒక ఆహ్లాదకరభావన. చాలా బాగుందండి.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%