
భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రమాదం ఏమిటి? ఈ ప్రశ్నకి ఎవరికి తోచిన సమాధానం వారిస్తారు. వారి వారి రాజకీయ దృక్పథాల్ని బట్టీ, వారు ఎంచుకునే రాజకీయ ప్రయోజనాల్ని బట్టీ తమకి తోచిన సమాధానం చెప్తారు. ఈ మధ్య ఒక మతసంస్థ ప్రతినిధి, దేశంలో హిందువుల జనాభా తగ్గిపోవడం అన్నిటికన్నా పెద్ద ప్రమాదం అని భావిస్తూ హిందువులు మరింతమంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చాడు. కానీ ఆయనతో సహా మొత్తం భారతదేశానికి తెలియవలసిందేమిటంటే, దేశాన్ని కబళిస్తున్న అతి పెద్ద ముప్పు అనీమియా అని.
అనీమియా అంటే ఏమిటి?
శరీరంలో, రక్తంలో ఎర్ర రక్తకణాల సంఖ్య తక్కువగా ఉండటం, ఉన్నవి కూడా తగినంతగా ఆక్సిజనుని అందుకోలేకపోవడం, వాటివల్ల శారీరిక కార్యకలాపాల్ని సక్రమంగా నిర్వహించుకోగలిగే శక్తి సన్నగిల్లడం అనీమియా. భారతదేశంలో దీనికి ప్రధాన కారణం ఐరన్ డెఫిషియన్సీ. అయితే, బి12 విటమిన్, ఫోలేట్,అంటే బి9 విటమిన్ల లేమి కూడా రక్తహీనతకి దారితియ్యవచ్చు.
భారతదేశంలో అనీమియా
నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే-5 లెక్కల ప్రకారం భారతదేశంలో 67 శాతం మంది పిల్లలు, 57 శాతం మంది స్త్రీలు 25 శాతం మంది పురుషులు రక్తహీనతతో బాధపడుతున్నారు. అంటే ప్రతి ముగ్గురు పిల్లల్లో ఇద్దరు, ప్రతి ఇద్దరు స్త్రీలలో ఒకరు, ప్రతి నలుగురు పురుషుల్లో ఒకరు అనీమిక్ గా ఉన్నారన్నమాట.
ప్రపంచంలోని అయిదు అభివృద్ధి చెందిన దేశాలతో ఈ అంకెలు పోల్చిచూస్తే, కెనడాలో 9-11 , అమెరికాలో 10-12, ఫ్రాన్సులో 12-14 , యు.కె లో 14-16, జపాన్ లో 20-22 శాతం జనాభా మాత్రమే అనీమియాతో బాధపడుతున్నారు. అలాగే ప్రపంచంలోని అత్యంత అనీమిక్ దేశాల్తో పోల్చి చూస్తే, యెమెన్ లో 70-75 , బుర్కినా ఫాసో లో 68-72, మాలిలో 65-70 , సియర్రా లియోన్ లో 63-66 శాతం అనీమిక్ గా ఉన్నారు. ఆ తర్వాత స్థానం భారతదేశానిదే.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఏ దేశంలోనైనా 40 శాతం కన్నా ఎక్కువ జనాభా అనీమిక్ గా ఉన్నట్లయితే, ఆ దేశం అత్యంత తీవ్ర ఆరోగ్య సమస్యకి లోనైనట్టు. అలా చూసినప్పుడు 57 శాతం అనీమియాతో భారతదేశం కేవలం ప్రమాదం అంచుల్లో ఉన్నట్టుకాదు, కొన్ని దశాబ్దాలుగా ఆ తీవ్ర ప్రమాదంలో కూరుకుపోయే ఉన్నట్టు,
భారతీయ స్త్రీలలో అనీమియా
భారతదేశంలో అనీమియా వల్ల కుంగిపోతున్నవాళ్ళల్లో స్త్రీలే అత్యధికంగా ఉన్నారు. నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే-5 ప్రకారం దేశంలో 57 శాతం మంది స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారు. స్త్రీలలో మళ్ళా గర్భిణీ స్త్రీలలో 52 శాతం మందికి రక్తలేమి ప్రధాన సమస్య. కౌమార వయస్సు బాలికల్లో 60 శాతం మందిని రక్తహీనత బాధిస్తున్నది. స్త్రీల గురించి ఎందుకు ప్రత్యేకంగా పట్టించుకోవాలంటే, మన ఇళ్ళల్లో, పొల్లాల్లో, కార్యాలయాల్లో దాదాపుగా పని మొత్తం చేసేది వాళ్ళ చేతులే కాబట్టి. అంతేకాదు, పిల్లల్ని కనేది కూడా వారే కాబట్టి. ఒక కౌమార బాలిక రక్తహీనతతో బాధపడుతూనే పెళ్ళిచేసుకుంటే ఆమెకి పెళ్ళయ్యి గర్భం దాల్చేటప్పటికి ఆ సమస్య మరింత పెరుగుతుంది. ఒక గర్భిణి రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే, ఆ ప్రసవం మరింత కష్టమవుతుంది. దాదాపు 20-40 దాకా ప్రసూతి సమయ స్త్రీ మరణాలు రక్తహీనత వల్లనే సంభవిస్తున్నాయని అంచనా. సాధారణంగా ప్రసూతి సమయంలో మరణానికి కారణమయ్యే పోస్ట్ పార్టం హెమర్రేజి, రక్తహీనతతో బాధపడే గర్భిణి స్త్రీ కి సంభవించడానికి పది రెట్లు ఎక్కువ అవకాశం ఉంది. ఈ సమస్య ఇక్కడితో ఆగిపోదు. రక్తహీనతతో ఉన్న మహిళ సురక్షిత ప్రసవాన్నిచ్చిన్నప్పటికీ, ఆ రక్తహీనత పుట్టుకతోటే శిశువుకి కూడా సంక్రమిస్తుంది. అంటే రక్తహీన జాతి రూపొందుతుందన్నమాట.
రక్తహీనత వల్ల మందగిస్తున్న ఉత్పాదకత
స్త్రీలూ, వారికి పుట్టే పిల్లలూ, కౌమార బాలికలూ తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న దేశంలో ఆ జాతీయ ఉత్పాదకత తప్పనిసరిగా కుంటుబడుతుంది. రక్తహీనతవల్లా, పోషకాహార లేమివల్లా భారతదేశంలో ప్రతి ఏటా 2-4 శాతం స్థూల జాతీయోత్పత్తి కుంటుపడుతున్నదని ఒక అంచనా. ఈ శాతాన్ని మరింత వివరంగా చూద్దాం. భారతదేశ స్థూల జాతీయోత్పత్తి 350 లక్షల కోట్లు అనుకుంటే, రక్తహీనత వల్ల సగటున 3 శాతం ఉత్పత్తి కుంటుబడుతోందనుకుంటే, ప్రతి ఏటా దాదాపు 11 లక్షల కోట్లు ఉత్పత్తిని మనం నష్టపోతున్నాం అన్నమాట. ఈ ఏడాది బడ్జెటులో భారత దేశం రక్షణ వ్యవస్థకు కేటాయించింది దాదాపు 8 లక్షల కోట్లు అనుకుంటే, రక్తహీనత వల్ల మనం కోల్పోతున్నది అంతకన్నా ఎక్కువ అని తెలుస్తూనే ఉన్నది కదా!
ఏది అత్యంత ప్రమాదకరం?
ఇప్పుడు చెప్పండి? దేశానికి ఏది అత్యంత ప్రమాదకరం? సరిహద్దు ఉగ్రవాదం కన్నా, మతపరమైన జనాభా లెక్కలలోని అసమతౌల్యం కన్నా, అంతర్గత తీవ్రవాదాల కన్నా దేశంలోని స్త్రీ, శిశు, బాలికల రక్తహీనత అత్యంత ప్రమాదకరమని ప్రతి ఒక్కరూ గుర్తించవలసిన సమయం ఇది. ఈ నిజాన్ని గుర్తుపెట్టుకోకుండా, దేశానికి గుర్తుచెయ్యకుండా, దేశ స్త్రీలని మరింత మంది పిల్లల్ని కనమని చెప్పడంలోని అమానుషత్వమేమిటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.
నిజమే, స్వాతంత్ర్యం వచ్చినప్పటి పరిస్థితితో పోలిస్తే మనం తిండి గింజల ఉత్పత్తిలో స్వావలంబన సాధించాం. అప్పటి పరిస్థితితో పోలిస్తే, ఇప్పుడు మన రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా ఉంది. అప్పటి నిరక్షరాస్యతతో పోలిస్తే, ఇప్పుడు అక్షరాస్యతలో మనం గణనీయమైన పురోగతి సాధించాం. కానీ అనీమియాలో మాత్రం ఇంకా అక్కడే ఉన్నాం. నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే 1970 లో మొదలయ్యింది. దాన్నే మనం బేస్ లైను గా తీసుకుంటే, అప్పటి 63 శాతం అనీమియా నుంచి, అర్థశతాబ్ది గడిచిన తరువాత కూడా 57 శాతంతో మనమింకా అక్కడే ఉన్నామని చెప్పుకోడానికి సిగ్గుకన్నా కూడా ఎక్కువ భయం కలుగుతూ ఉంది.
ఇంకో అంకె కూడా చెప్తాను. 2015-16 లో చేపట్టిన నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే-4 లెక్కల ప్రకారం అనీమియా 53 శాతం ఉంది. అది కాస్తా 2019-21 నాటి లెక్కలకి వచ్చేటప్పటికి 57 శాతానికి పెరిగింది. అయినా కూడా మనం స్త్రీల ఆరోగ్యం గుట్టించి పట్టించుకోడం మానేసి మతపరమైన జనాభా లెక్కల గురించి మాట్లాడం మొదలుపెట్టామన్నమాట. ఇంతకన్నా జాతీయ అంధత్వం, రాజకీయ క్రూరత్వం మరొకటి ఉండబోదు.
బ్రెయిన్ కాదు, ఐరన్ డ్రెయిన్
సాధారణంగా మన దేశానికి కలిగే నష్టాల్ని లెక్కేసేటప్పుడు అందరూ ‘బ్రెయిన్ డ్రెయిన్’ గురించి మాట్లాడతారు. ఈ దేశంలో పుట్టి, పెరిగి, ఈ జాతి పెట్టినపెట్టుబడితో చదువుకుని, తీరా ఉద్యోగం వచ్చేటప్పటికి యువతీయువకులు విదేశాలకు వెళ్ళిపోతున్న పరిస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. కాని మనం నిజంగా బాధపడవలసింది, ‘ఐరన్ డ్రెయిన్ ‘ గురించి. ఒక స్త్రీ గర్భం దాల్చి, ఒక శిశువుకు ప్రసవమిచ్చినప్పుడల్లా ఆమె ‘ఐరన్ డ్రెయిన్ ‘కి గురవుతూ ఉంటుంది. భారతీయ రైతు అప్పులో పుట్టి, అప్పుల్లోనే పెరుగుతాడనే మాట మనం చిన్నప్పుణ్ణుంచీ వింటున్నాం. కాని భారతీయ మహిళ రక్తహీనతలో పుట్టి, రక్తహీన శిశువులకు జన్మనివ్వడం ద్వారా, రక్తహీనతనే ఒక శాశ్వత ఋణంలో మరింత కూరుకుపోతూనే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న ప్రసూతి మరణాల్లో 7-15 శాతందాకా భారతీయ ప్రసూతి మరణాలే అనే అంకెనొకసారి చూద్దాం. ప్రసూతి మరణాలు 7 శాతం అనుకుంటే ప్రతి ఏటా 22,000 మంది తల్లులు ప్రసవసమయంలో మరణిస్తున్నారన్నమాట. భారతదేశం ఇంతదాకా పాల్గొన్న ఏ ఒక్క సరిహద్దు యుద్ధంలోనూ ఇంతమంది సైనికులు మరణించలేదు. అంటే మన దేశ స్త్రీలు పళ్ళబిగువున ఒక ‘నిశ్శబ్ద యుద్ధం’లో ప్రాణత్యాగం చేస్తున్నారన్నమాట!
అనీమియా ముక్త భారత్
భారతప్రభుత్వానికి ఈ సంగతులు తెలీవా? తెలుసు కాబట్టే ‘అనీమియా ముక్త భారత్’ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తోంది. కాని అది ప్రభుత్వానికీ, ప్రభుత్వయంత్రాంగానికీ మాత్రమే పరిమితమైన కార్యక్రమంగా నడుస్తున్నదే తప్ప, రాజకీయ శక్తుల ప్రాధాన్యతగా మారలేదు. అలా మారి ఉంటే, మన రాజకీయ నాయకులు, వీరిలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు!, మరింతమంది పిల్లల్ని కనండి అని దేశానికి పిలుపునివ్వరు. దేశ ప్రజలు గుర్తించవలసిన విషయమిది.
తెలుగు ప్రభ, 6-3-2026
Good morning sir, today your article about health issue anaemia and over population. it’s very important now day s& today your article very nice informative Thank u sir. Happy women’s day from Srinidhi dept of heritage museum employee
ధన్యవాదాలు శ్రీనిధీ!
True sir. ఇదెవరూ పెద్దగా పట్టించుకోని విషయం. మొన్న రక్తదానానికి వచ్చిన మహిళల్లో ఒక్కరికి కూడా ఉండాల్సిన స్థాయిలో హీమోగ్లోబిన్ లేకపోవడం చూసి చాలా ఆలోచించాల్సి వచ్చింది. ఇది నిజంగా సమాజం సీరియస్‌గా తీసుకోవాల్సిన పెద్ద సమస్య.
ధన్యవాదాలు మేడం!
Such an important point for discussion. Great insights sir. Thank you.
ధన్యవాదాలు మానసా!
A very urgent and important issue, sir. It is embarrassing to see those numbers.
It’s scary and inexcusable for politicians in office calling for population growth rather than addressing such serious public health issues.
అవును. నిజమే.