సముద్రమంత కవి

శివరాత్రి. అమావాస్య దగ్గర కావడంతో సముద్రం ఘూర్ణిల్లుతూంది. నౌకాదళ విన్యాసాలు కూడా తోడవడంతో విశాఖ సాగర తీరం జనసముద్రమైపోయింది. హోరెత్తుతూన్న మనుష్య సముద్రం మధ్య కారు ఎక్కడ పార్కు చెయ్యాలా అని డ్రైవరు ఆలోచిస్తూనే బండి నడుపుతుండగా, ‘నాన్నా, ఆయన శ్రీశ్రీనే కదా’ అన్నాడు ప్రమోద్, మాకు ఎడమవేపుగా ఉన్న విగ్రహాల్లో ఒకరిని చూపిస్తూ. అదేమిటో తక్కిన విగ్రహాలన్నీ చీకట్లో ఉన్నాయిగానీ, శ్రీ శ్రీ ఒక్కడి మీదా ఎందుకో బంగారు రంగు వెలుతురూ పడుతూ ఉంది. ఆయన కూడా విశాఖపట్టణం చూడటానికి వచ్చేడా అన్నట్టు మెరిసిపోతూ ఉన్నాడు.

ఆయన జీవితంలో అధికభాగం చెన్నైలో గడిపినప్పటికీ, అది కూడా సముద్రతీరమే అయినప్పటికీ ఆయనకి విశాఖ సముద్రంతోనే ఆత్మీయత. తాను ఆ ఊళ్ళో పుట్టినందువల్లా, పద్ధెనిమిదో ఏటిదాకా అక్కడే గడిపినందువల్లా, తన బాల్యకౌమారాల్లో, ఆ వీథుల్లోనే తన కవిత్వ ఉపాసన చేసినందువల్లా మాత్రమేనా? సముద్రం అంతకన్నా మించిన సంవేదనలు వేటినో ఆయనలో రేకెత్తిస్తూనే  ఉంది. చూడండి. ఆత్మకథలు రాసుకునేవాళ్ళు మామూలుగా తాము పుట్టినప్పటినుంచీ జీవితప్రయాణం గురించి రాసుకుంటారు. కానీ 1910 లో పుట్టిన శ్రీ శ్రీ 1909 నుంచే తన జీవితకథ రాసుకున్నాడు. ‘మరో ప్రారంభం'(1979) అనే మరో వ్యాసంలో ఇలా రాసుకున్నాడు

తాను ఈ భూమ్మీద కళ్ళు తెరవకముందు మాతృగర్భ మహాసముద్రంలో ఈదులాడుతున్నప్పటి జ్ఞాపకాల్ని మరో సారి తలుచుకుంటూ ఇలా అంటున్నాడు (1979):

విశాఖపట్టణం సముద్రం గురించిన తలపుల్లో అతడికి తన తండ్రి, తన తల్లులు, తన బంధుమిత్రులు, గురువులు, తాను చదువుకున్న పుస్తకాలు, వెతుక్కున్న కవిత్వాలు అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే, విశాఖపట్టణమూ, శ్రీ శ్రీ కూడా సమకాలికులుగానే ఎదుగుతూ వచ్చారు.  ‘విశాఖపట్టణం ఎప్పుడు పుట్టిందో నాకు తెలియదుగాని విశాఖపట్టణంలో 1910 వ సంవత్సరంలో నేను జన్మించాను. అప్పటినుంచీ నేనూ విశాఖపట్టణమూ కలిసే పెరుగుతూ వచ్చాము’ అని రాసుకున్నాడు. ఒకచోట ఇలా రాస్తున్నాడు:

మరొకచోట ఇలా రాసుకున్నాడు: ‘విశాఖపట్టణం వీథుల్లో ఉన్న రాళ్ళన్నిటితో నా పాదాలకు పరిచయం అని గర్వపడుతూ ఉండేవాణ్ణి.’

‘విశాఖపట్నం జ్ఞాపకాలు ‘అనే వ్యాసంలో (1948) ఇంకా ఇలా రాస్తున్నాడు:

శ్రీ శ్రీ చూసిన, సదా తన స్మృతుల్లోనూ, స్వప్నాల్లోనూ జీవిస్తూ వచ్చిన విశాఖపట్టణం భూమ్మీద ఉన్నది కాదు. దాని ఉనికి సముద్రంలోనే. కాబట్టే, అదే వ్యాసంలో, ఇంకా ఇలా అంటున్నాడు:

ఆ మహాకావ్యంలో సముద్రం అంతర్భాంగం. లేదా సముద్రంలో ఆ మహాకావ్యం అంతర్భాగం. అందుకనే ఈ మాటలు కూడా రాసుకున్నాడు:

విశాఖపట్టణంలో ఆయనకి అక్షరాభ్యాసం జరిగింది. కాని నిజమైన అక్షరాభ్యాసం, అంటే కవిత్వాక్షరాభ్యాసం  కూడా అక్కడే జరిగింది. చిన్నప్పుడు ఎనిమిదో ఏట ఒక పొడుగుపాదం, ఒక పొట్టి పాదం రాసి తాను కందపద్యం రాసేనని, దాంతో కవినైపోయానని అనుకున్నప్పణ్ణుంచి, 1970 తర్వాత, విరసం ఏర్పడ్డాక, తాను రాసిన గీతాల్లో కూడా విశాఖపట్టణం తనకు దారిచూపిస్తున్నదనే చెప్పుకున్నాడు. (‘మరో ప్రస్థానం’ సంపుటిలోని మొదటిగీతం ‘యిప్లవం యాడుందిరా ఆడనే నీ కూడుందిరా, నీ గూడుందిరా ‘ అనే పాటలో విశాఖపట్టణపు కార్మికుల భాషనే తాను ఉపయోగించానని చెప్పుకున్నాడాయన.)

శ్రీ శ్రీ జీవితం పొడుగునా ఒక మహాసముద్రం రహస్యంగా ఆయనలో ఘూర్ణిల్లుతూనే ఉంది. లేదా ఒక మహాసముద్రంలో ఆయన ఈదుతూనే ఉన్నాడు. ‘శిశువు చిత్రనిద్రలో ప్రాచీన స్మృతులూచే చప్పుడు’ ఆయన ఆ సముద్రతరంగాల్లోనే విన్నాడు. మహాప్రస్థానం తర్వాత రోజుల్లో, మరో ప్రస్థానానికి మధ్యకాలంలో, ఆయన సర్రియలిజం పేరిట, ఆ సముద్రంలోకే పయనిస్తూ ఉన్నాడు. సముద్రం ఆయనలో రేకెత్తించిన భావాల్లో ఒక రొమాంటిసిజం ఉంది. ఏకాలంలో అతడు ఒకవైపు సామ్యవాద గీతాలు రాయడానికీ, మరోవైపు సర్రియలిస్టు రచనలు చేయడానికీ మూలం అతడికీ, ఆ సముద్రానికీ ఉన్న అనుబంధంలో ఉంది. ఒకచోట ఈ మాట స్పష్టంగా చెప్పుకున్నాడు కూడా:

పిచ్చాసుపత్రికి ఇలా 1948 లో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నవాడు మరో ఏడేళ్ళ తరువాత ఒక రాజకీయసభలో ప్రసంగిస్తూ అమాంతం మతిస్థిమితం కోల్పోడం ఆశ్చర్యమనిపించదు. ఎందుకంటే భావకవులది కూడా స్వాప్నిక ప్రపంచమేగాని, శ్రీ శ్రీ కలల్లో ఉన్న ప్రపంచంలో చీకటి పాలు చాలా ఎక్కువ. సర్రియలిజం గురించి రాస్తూ ఇలా అంటున్నాడు:

శ్రీ శ్రీ అంతరంగంలో సజీవంగా ఉన్న ఈ స్వప్నప్రపంచాన్ని పంచుకోడానికి ఎవరూ లేనందువల్లనే ఆయన కవిత్వాన్ని ఆశ్రయించాడు. కాని 1950 లో మహాప్రస్థానం వెలువడ్డ తరువాత, తనకి సాహిత్యక్షేత్రంలో ఒకింత స్థిరత్వం లభించిందని, ఆయన తన మనసులో మాటల్ని సూటిగా చెప్పడానికి సాహసించాడు. ‘సంక్షుబ్ధ సౌందర్యం’ (1945) పేరిట ‘ఢంకా’ పత్రికలో అచ్చయిన ఆ వ్యాసాన్ని తిరిగి ఆయన సమగ్ర సాహిత్యంలో ‘సర్రియలిజం’ పేరిట అచ్చేసారు. ఆ వ్యాసం మొదటిభాగం 1945 లో, అంటే ఆయనకు ముప్ఫై అయిదేళ్ళ వయసులో రాసింది. ఆ వ్యాసం శ్రీ శ్రీ అంతరంగ ప్రపంచంలో ప్రవేశించడానికి ఒక దీపంలాంటిది. కాని ఎందుకనో, ఎవరూ ఆ వ్యాసం మీద ఇప్పటిదాకా ఏమీ రాయగా నేను చూడలేదు. ఆ వ్యాసంలో ఇలా అంటున్నాడు:

ఇక్కడ ఆయన తలుచుకున్న కవుల్లో తెలుగు కవులు సరే, ఆ రెండు ఫ్రెంచి కవిత్వ పంక్తుల్లో ఒకటి రింబోది, రెండోది, పో కవిత్వానికి బోదిలేర్ చేసిన అనువాదం లోది. అంటే, పదిహేడేళ్ళ వయసుకే శ్రీ శ్రీ మనోలోకంలో వేములవాడ భీమకవితో పాటు ఫ్రెంచి సింబలిస్టులు కూడా బలంగా ఉన్నారన్నమాట. ఆ వ్యాసంలోనే ఆ తర్వాత ఇంకా ఇలా రాస్తున్నాడు:

ఈ రెండు పేరాల్నీ ఇంత సుదీర్ఘంగా ఎత్తి రాసానంటే, శ్రీ శ్రీ కవిత్వం గురించి, తన విశాల హృదయ సామ్రాజ్యాన్ని పాలించే ఈ కవుల గురించి ఇంత స్పష్టంగా రాసుకున్న మాటలు ఎప్పుడూ ఎవరూ ప్రస్తావించరు కనుక. ఇందులో ప్రతి ఒక్క వాక్యం ఒక ద్వారం. తెరుచుకుని వెళ్తే శ్రీ శ్రీ హృదయప్రపంచంలోకి, ఇంతదాకా మనం చూడని, కొత్త గదులెన్నిటిలోనో ప్రవేశించగలుగుతాం.

ఉదాహరణకి, ఇక్కడ Lautreamount ప్రసక్తి రాగానే, ఆయనకు కృష్ణశాస్త్రి పద్యాలు సరే, నన్నయ గారి వికసన్నవ కైరవ గంధబంధురోదార సమీర సౌరభము కూడా గుర్తు రావడం ఆశ్చర్యంగా లేదూ! ఎందుకంటే, ఆయన ఎప్పుడూ చెప్తుండే మాట, తిక్కన, వేమన, గురజాడ తన కవిత్రయమని. కాని అది ఆయన తలపుల్లో సింబలిస్టులూ, డికడెంట్ కవులూ మెదలనంతవరకే. ‘ఒక సంభాషణ శకలము ‘అనే వ్యాసం ఎత్తుకుంటూనే ఇలా రాస్తున్నాడు:

ఎడ్గార అలన్ పో ఇంగ్లిషులో రాసిన అమెరికన్ కవి అయినప్పటికీ, ఆయన గురించి బోదిలేర్ రాసాకనే ఇంగ్లిషు మాడర్నిస్టులు పో ప్రతిభని గుర్తించారు. కాబట్టి శ్రీ శ్రీ తనకి దారి చూపించిన ఋషులుగా ఫ్రెంచి రచయితల్నీ, సదా తన హృదయ సామ్రాజ్యంలో నివసించే కవులుగా ఫ్రెంచి సింబలిస్టు కవుల్నీ పేర్కొన్నాడు. ‘ఇప్పుడు కూడా’ అని ఆయన 1945 లో ఈ మాటలు రాస్తున్నప్పటికి, మహాప్రస్థానంలోని కవితలన్నీ కూడా రాయడం పూర్తయిందని గమనించాలి మనం.

అంటే ఏమిటి? అతడు తన జీవితకాలం పొడుగునా ఒక అస్పష్ట మార్మికతని, ఒక సముద్రాంతర్గత మంత్రలోకాన్ని, ఒక చీకటినీడని తనలో దాచుకుంటూనే ఉన్నాడు.

అదే ఏడాది (1945) లో ‘మానవుడి మొగం ‘ అని రాసిన ఒక వ్యాసంలో ఇలా అంటున్నాడు:

ఈ వ్యాసం రాసిన మరో అయిదేళ్ళ తరువాత అయన ‘చరమరాత్రి’ (1950) కథ రాయడంలో ఆశ్చర్యం లేదు. ఖడ్గసృష్టి లో అత్యధిక శాతం కవిత్వం, శ్రీ శ్రీ కథలు, రేడియో నాటకాలూ ఈ చీకటి గుహల్లో ఆయన నిరాయుధుడిగానూ, నిరీశ్వరవాదిగానూ, నిర్భయంగానూ చేసిన సంచారాలే.

ఒక కవి ఏకకాలంలో సామ్యవాదిగానూ, ‘అంతరాళ భయంకర ప్రాంతరాల విహారి ‘ గానూ సంచరించడం తెలుగు సాహిత్యలోకానికి అర్థం కాని సంగతి. ఇంకా భావకవిత్వమే పూర్తిగా వికసించని రోజుల్లోనే, ‘సుప్తాస్థికలు’ (1929) పద్యాలు రాస్తే ‘భారతి ‘ప్రచురించకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా తెలుగు సాహిత్యవిమర్శకులు తెలుగు భావకవిత్వాన్ని అర్థం చేసుకోడానికి ఇంకా ఇంగ్లిషు తొలితరం రొమాంటిక్ కవుల్నే ప్రస్తావిస్తున్నారు. కాని, శ్రీ శ్రీ, భావకవిత్వవికాసదినాల్లోనే, డార్క్ రొమాంటిక్, డికడెంట్, సింబలిస్టు ధోరణుల్ని ప్రతిబింబించే కవిత్వం రాస్తున్నాడు. మహాప్రస్థానంలో ఒక బలమైన పార్శ్వం ఈ కవితలే. ఇవి లేకపోయుంటే, శ్రీ శ్రీ తనతో తాను జరుపుకున్న అంతర్యుద్ధం గురించిన ఈ ఆనవాళ్ళే లేకపోయుంటే, మహాప్రస్థానం కవిత్వం యొక్క ‘పరమ స్వరూపం’ గా మారి ఉండేది కాదు.

‘ఆశయాలకేం అనేకం, అప్పారావంతటివాణ్ణి’ అని ఆయన చెప్పుకున్న సంగతి మనకు తెలుసు. అదొక పార్శ్వం. కాని ఫ్రెంచి కవుల పట్ల కూడా ఆయనకిలాంటి ఆశయాలే ఉండేవి. ‘కవుల బాధలు’ అనే వ్యాసంలో తాను ‘ఫ్రాన్సులో పాల్ ఎలార్డ్ ని కావడం కంటే తెలుగుదేశంలో శ్రీశ్రీనికావడమే ధన్యంగా భావిస్తున్నాను’ అని రాసుకున్నాడు. ఇక అదే వ్యాసంలో నెర్వాల్ గురించి రాస్తూ, డొంకతిరుగుడులేకుండా, మరింత సూటిగా ఇలా అంటున్నాడు:

ఒక కవి ఏకకాలంలో సింబలిస్టుగానూ, సోషలిస్టుగానూ ఉండటం సాధ్యమా? ఫ్రెంచిలో కవిత్వం రాసిన బెల్జియం కవి ఎమిలీ వెర్ హేరన్ ని అడిగితే తననే ఉదాహరణగా చూపిస్తాడు. అందుకనే మహాప్రస్థానంలో ఉన్న ఒకే ఒక్క అనువాద కవిత వెర్ హేరన్ దే. తర్వాత రోజుల్లో సింబలిజం, సర్రియలిజం కి దారి ఇచ్చి, పక్కకు తప్పుకున్నాక, ఒక కవి ఏకకాలంలో సింబలిస్టుగానూ, సర్రియలిస్టుగానూ ఉండటం సాధ్యమేనా అని అడిగితే, Paul Eluard అవుననే చెప్తాడు. అందుకనే ఖడ్గసృష్టిలో శ్రీ శ్రీ ఎలార్డ్ వి ఏకంగా తొమ్మిది కవితలు అనువదించాడు.శ్రీ శ్రీ లోని ఈ అంతరంగప్రపంచాన్ని ఇంకా లోతుగా శోధించవలసిన అధ్యయనాలు రావాలి. లేకపోతే, దీన్నంతా వట్టి విదూషకత్వంగానే పరిగణించి పక్కనపెట్టేసే ప్రమాదముంది.

ఆ సాయంకాలం ఆ మహాసముద్రం ఎదట శ్రీ శ్రీని చూసి వచ్చినప్పణ్ణుంచీ, ఆ సముద్రమూ, ఆ శ్రీశ్రీనే నా మనసులో మెదుల్తూ ఉన్నారు. ఆ సముద్రమూ శ్రీ శ్రీని విడిచిపెట్టలేదు, శ్రీ శ్రీ కూడా సముద్రాన్ని విడిచింది లేదు, భౌతికంగానే కాదు, మానసికంగా కూడా. ఈ వాక్యాలు చూడండి:

మామూలుగా కవుల్ని వారు ఏ నదీతీరాల్లో జీవించారో ఆ నదుల్తో గుర్తుపెట్టుకుంటాం. కానీ శ్రీ శ్రీ సముద్రమంత కవి. ఆయన్ని సముద్రంతోటే గుర్తుపెట్టుకోవాలి.

3-3-2026

10 Replies to “సముద్రమంత కవి”

  1. ఆహా.. ఎంత అద్భుతమైన , ఆనందదాయకమైన పోస్ట్.. భలే బాగుంది శ్రీశ్రీ విశాఖ కోణం.. అలాగే శ్రీశ్రీ రాతల గురించి ఎన్ని తెలియని సంగతులు తెలిశాయో. ఈ పోస్టు ను ఎంత ఆస్వాదించానో మాటల్లో చెప్పలేను నాకు స్విన్ బర్న్ కవిత్వం తో పాటు ఆయన గురించిన ఏ విషయాలైన భలే ఫాసినేటింగ్ గా అనిపిస్తాయి. అందుకు ముఖ్య కారణం శ్రీ.శ్రీ కవిత ” విషం క్రక్కే భుజంగాల్.. “. అక్కడి నుంచే స్విన్బర్న్ గురించి మరింత ఎక్కువ తెలుసుకున్నా.. ఆ కవిత మాత్రమే కాదు. మీరు ఈ వ్యాసంలో పేర్కొన్న కవులు చార్లెస్ బౌడేలైర్, గై డీ మోపాసా, ఎడ్గార్ అలాన్ పో లతో స్విన్బర్న్ కనెక్షన్, స్విన్ బర్న్ కి విట్మన్ రచనల గురించిన భిన్న కాలాలలో భిన్నాభిప్రాయాలు.. ఎట్రెటాట్ తీరంలో మునిగిపోతున్న తాగిన స్విన్‌బర్న్‌ను గై డీ మౌపాసంట్ రక్షించిన వైనం, తరువాత స్విన్బర్న్ ఇంట్లో లంచ్ మీటింగ్… 1903 నుంచి 1909 వరకు ప్రతీ ఏడు నోబెల్ ప్రైజ్ కి నామినేట్ అవ్వడం.. లాంటి ఎన్నో ఆసక్తి కరమైన విషయాలతో కుదిరితే ఒక వ్యాసం రాయాలి. ఐల్ ఆఫ్ రైట్ లో ఒక చర్చ్ ప్రాంగణంలో ఆయన సమాధి ఉంది.. కుదిరితే అది ప్రత్యక్షంగా వీక్షించినపుడు ఆ పని చేస్తానేమో…

    1. పనిలో పనిగా విశాఖతో ఉన్న అవినాభావ సంబంధం తో పాటు అక్కడ కుట్టే దోమల గురించిన శ్రీశ్రీ పద్యం ఒకటి…

      తెగ కుట్టి వదలి పెట్టినవి
      అగణిత వైజాగు దోమలశ్వత్థామల్
      పొగరెక్కిన రెక్కేన్గులు
      సెగలెగిసెడి తుమ్మముళ్ళు సిరిసిరిమువ్వాg

    2. హృదయపూర్వక ధన్యవాదాలు సార్! ఇంత విస్తృత పఠనానుభవం ఉన్న మిత్రుల కోసం ఇటువంటి పోస్టులు ఎన్నైనా రాయవచ్చు.

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్!

  2. వ్యాసంలో ఈక్రింది వాక్యాలు చాలా క్షోభ కలిగించాయి.

    – –
    మరి షేక్ స్పియర్, తిక్కన?

    ‘వందనార్హులు. కానినాకక్కరలేని బోలెడు చెత్త వ్రాశారు..’
    – –

    షేక్ స్పియర్ వ్రాసింది బోలెడు చెత్తో కాదో అది వేరే చర్చ.

    తిక్కన గారు వ్రాసినది బోలెడు చెత్త అనటం చాలా అసహ్యంగా ఉంది చదవటానికే.

    శ్రీశ్రీ రాసింది మాత్రం బోలెడు బోలెడు చెత్త కాదా?

    ఈరోజున ఇంకా ఆయనను నాలుకపీకేలా పొగడే వాళ్ళు కొంతమంది ఉండవచ్చును. మరి కొన్ని వందల యేళ్ళు నిలుస్తుందా శ్రీశ్రీ కవిత్వం?

    తిక్కన కవిత్వం నిలిచింది మరి వందల యేళ్ళు కాలానికి నిలబడి.

    రేపో మాపో బండ్లకొద్దీ చెత్త వ్రాసాడు శ్రీశ్రీ అని జనం ఈసడించే అవకాశం లేదా? అన్నట్లు ఒక కాట్లాటలో ఆరుద్రే శ్రీశ్రీని ఈసడించ లేదా?

    తిక్కన స్వయంగా రాజనీతివేత్త, మంత్రి. గొప్ప కవి. తెలుగునుడికారంతో కవిత్వాన్ని పండించి భారతాంధ్రీకరణం చేసారు. ఆయన రాకకోసమే ఆ ఆంధ్రీకరణయజనం వేచి ఉండినది శ్రీకృష్ణుని వంటి రాజనీతీ యుధ్ధతంత్రమూ ధర్మశాస్త్రమూ తెలిసిన యజ్వ రావాలీ చేయాలీ అని. అందుకే అది నిలిచిపోయింది ఆయన చేపట్టేదాకా.

    తిక్కనను చెత్త అన్న వాడిని ఎంతవాడినీ తెలుగుజాతి ఎంతమాత్రమూ క్షమించకూడదు. క్షమించదు.

    శ్రీశ్రీ కవిత్వం నిండా ఆయనకు తెలుగుభాషపైన కల సాధికారత కనిపిస్తోందంటే అది పూర్వకవులకవితావైభవాన్ని ఆయన అధ్యయనం చేసిన పుణ్యప్రభావం కాదా?

    తన శైశవంలో ఒకపూట పాలు ఇచ్చిన దాదిని ఐనా స్వంత తల్లిలా గౌరవించేది మన భారతీయ సంస్కృతి. ఈనేలపై పుట్టిన ఒక కవివాచ్యుడు తనకు భాషాభిక్ష పెట్టిన ఒక పూర్వమహాకవిని “ఆయన తనకు ఆక్కరలేని బోలెడంత చెత్త వ్రాసాడూ” అన్నాడంటే ఆదెంత దౌష్ట్యం? చెప్పటానికి మాటలున్నాయా?

    ఇంతవరకూ శ్రీశ్రీ అంటే ఎంతో కొంత అభిమానం ఉండేది. ఇప్పుడ లేదండి. కుసంస్కారిని కవి యన లేను. క్షమించాలి.

    1. మీ వ్యాఖ్య చదివాక నేను ఉల్లేఖించిన భాగాన్ని కొంత సరి చేశాను. ఎందుకంటే ఏదైనా సందర్భం నుంచి బయటికి లాగి చూస్తే అసందర్భంగానే అనిపిస్తుంది. శ్రీశ్రీ తిక్కనకి ఇచ్చినటువంటి గౌరవం అసామాన్యమైన గౌరవం. బహుశా అంత గౌరవాన్ని అంత బాహాటంగా తెలుగులో మరే కవీ తిక్కనకి ఇవ్వలేదు. అయితే ఇక్కడ సందర్భం వేరే. కాబట్టి నేను ఆ వాక్యాన్ని ఉటంకించాను. కానీ ఇలా సందర్భాన్నించి బయటకు లాగి దాన్ని పరీక్షించే అవకాశం ఉందని మీ వ్యాఖ్య చదివాక నాకు అర్థమైంది. కాబట్టి నేను ఉల్లేఖించిన భాగాన్ని సవరించక తప్పలేదు.

  3. మిమ్ము నొప్పించి ఉంటే మన్నించండి. అలా మిమ్ము నొప్పించటం నాఅభిమతం కాదు.

    శ్రీశ్రీ తిక్కయజ్వను ఎలాగు మరియు ఎంత ప్రశంసించారో నిజంగా నాకు అవగాహన లేదు.

    విశ్వనాథ వారు “తిక్కన్న శిల్పపు తెలుగుతోట” అన్నారు. ఏమో శ్రీశ్రీ గారు మరింత బాగా ఏమన్నా అన్నారేమో తెలియదు. ఐనా శ్రీశ్రీ విశ్వనాథ రామాయణం నిలువదు అంటూ తీర్పు ఇచ్చారు కాబట్టి విశ్వనాథ మాటలకు ఇక్కడ విలువ ఉండకపోవచ్చును.

    మీవ్యాసంలో నేను “సందర్భాన్నించి బయటకు లాగి దాన్ని పరీక్షించే అవకాశం” అనుద్దేశపూర్వకంగా తీసుకున్నానా అని ఇపుడు పరిశీలించలేకపోయాను. మీరు ఆభాగాన్ని సవరించారు కదా.

    ఐనా ప్రయత్నించాను. ఆభాగంలో వ్యాసంలో కవిత్వంలో ఋషిత్వం ప్రసక్తి నడుస్తోంది. విశ్వనాథ వారు “ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి” అన్నారు. శ్రీశ్రీ నన్నయను కాక తిక్కనను సూచించి చెత్త వ్రాసినట్లు అన్నారు. అదే ఎత్తి చూపాను అసమంజసం అని.

    నానృషిః కురుతే కావ్యం అన్నారు. మూడవ వాల్మీకి అనకపోయి అచ్చమైన తెలుగు కవీంద్రుడు తిక్కన ఋషియే. ఆయనను ఇక్కడ గర్హించిన వారు మరెక్కడో కీర్తించారా? కావచ్చును.

    (మరొక మాట. నాకైతే ఈవ్యాఖ్య కూడా నాతొలివ్యాఖ్య లాగా కించిత్పారుష్యయుతంగా అనిపిస్తోంది. క్షంతవ్యుడను. బహుశః నేను వాడుతున్న మందులేవన్నా అశాంతిని కలిగిస్తున్నాయేమో. నామాటలు పట్టించుకోకండి. నేనేమీ లబ్ధప్రతిష్ఠుడైన కవినో రచయితనో కాను. ఏదో తోచినమాటలు చెప్పాను.)

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%