అందర్నీ వెన్నాడే కథలు

‘నన్ను వెన్నాడే కథలు’ ఇరవై ఏరి నేనొక సంపుటంగా వెలువరించిన సంగతి మీకు తెలిసిందే. అనిల్ బత్తుల ఆ పుస్తకాన్ని అనిల్ బత్తుల ప్రచురణల తరఫున ముద్రించాడు. ఈ రోజు లా మకాన్ లో ఆ పుస్తకం, ఆవిష్కరణ, పరిచయ సభ కూడా నిర్వహించాడు.

పుస్తకం ఎవరితో ఆవిష్కరింపచేస్తే బాగుంటుందని ఆయన నన్నడిగాడు. నాకే పేరూ స్ఫురించలేదు. మన మీటింగుకి మొదట ఎవరొస్తే వారితోటే పుస్తకం ఆవిష్కరణ చేయిద్దాం అని అన్నాను. కాని అతనిది out of box thinking కదా. అందుకని మీటింగుకి వచ్చినవారందరి పేర్లూ రాసి ఒక లక్కీడిప్ తీయించాడు. ఆ డిప్ లో కిషన్ పిన్నమశెట్టి పేరు రావడం అక్కడున్న ప్రతి ఒక్కరికీ థ్రిల్లింగ్ గా అనిపించింది.

విద్య ఇప్పుడిప్పుడే సాహిత్యరంగంలో అడుగుపెడుతున్న యువతి. ఆమె సభనిర్వహించడానికి ముందుకొచ్చారు. సహజంగానే ఆ వయసు పిల్లల్లో ఉండే నిజాయితీ, ముక్కుసూటితనం, ఎలాంటి భేషజాలూ లేకపోవడంలాంటి లక్షణాలుండటంతో ఆమె ఆధ్వర్యంలో సభ చక్కగా నడిచిందని వేరే చెప్పక్కరలేదు కదా!

పుస్తకం మీద ఎవరు మాట్లాడితే బాగుంటుందని కూడా అనిల్ అడిగాడు. నాకు వెంటనే స్ఫురించిన పేరు స్వర్ణ కిలారి. ఆమె నాకు గత ఏడెనిమిదేళ్ళుగా తెలుసు. కాని ఈ మధ్య ఆమె కథాసంపుటి ‘గోడవతల: ఇవతల కథలు కూడా'(2025) చదివాక నేనామెకి అభిమానిగా మారాను. ఎందుకంటే ఆ కథల్లో ఒక సమగ్ర వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న నవీనమహిళ కనిపిస్తారు. మన కాలంలో కథలు రాస్తున్నవాళ్ళని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకరు, సామాజిక దాస్యాల్ని, అసమానతల్ని, అన్యాయాల్ని ఎత్తిచూపేవారు, ప్రశ్నించేవారు, ఆ ప్రయత్నాలతో తమ అస్తిత్వాన్ని నిర్ధారించుకునేవాళ్ళు. రెండో తరహా కథకులు, తమ వ్యక్తిగత జీవితాల్లో ఉత్తమ అభిరుచి, జీవనమూల్యాలు, తమ వేదన, తమ సంతోషం ప్రతి ఒక్కదాన్నీ మనతో పంచుకునేవారు. స్వర్ణ కిలారి కథల్లో ఈ రెండు పార్శ్వాలూ సమగ్రంగా మేళవించి కనిపించడం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. అందుకని ఆమె ఈ కథలు చదివి ఎలా స్పందిస్తారో వినాలనుకున్నాను. మా అదృష్టం కొద్దీ, ఆమె మా అభ్యర్థనని మన్నించారు.

ఇవాళ నేను లామకాన్ లో అడుగుపెడుతూనే ఆమె వదనంలో కనిపిస్తున్న సంపూర్ణదరహాసం చూడగానే నాకు అర్థమైపోయింది. ఈ కథలు ఆమెకి నచ్చాయని. కాని చాపల్యం ఆపుకోలేక, ‘ఎలా ఉన్నాయి కథలు’ అనడిగాను. ‘చెప్తాను సార్, చాలా చెప్పాలి’ అని, ఆమె కూడా, అప్పటిదాకా ఆగలేక, ‘ఇవి నన్ను వెన్నాడే కథలు కూడా సార్!’ అని అన్నారు. ఆ ఒక్క మాట చాలనిపించింది.

కాని ఆమె విపులంగానే మాట్లాడేరు. ‘మంజుల’, ‘కుక్క పిల్లను వెంటబెట్టుకున్న మహిళ’,’కుళాయిలో నీళ్ళు వచ్చినవి’, ‘పోస్ట్ మాస్టర్ ‘కథల గురించి చెప్పేటప్పటికి, తన తర్వాత మరొక వక్త ఉన్నాడని గుర్తు రావడంతో తన ప్రసంగం త్వరత్వరగా ముగించేసారు. కాని అంతకు ముందు నాతో మాటల్లో మపాసా, ఓ హెన్రీ కథల గురించి కూడా రెండు మూడు మాటలు చెప్పారు. ఆ కథల గురించి కూడా ఆమె చెప్తే వినాలనిపించింది. అసలు మొత్తం అన్ని కథల మీదా, ప్రతి ఒక్క కథమీదా ఆమె మాట్లాడితే వినాలనిపించింది. ఆమెకి వీలైతే వారం వారం ఒక్కొక్క కథమీద ఫేస్ బుక్ లైవ్ లో ప్రసంగిస్తే బాగుణ్ణని కూడా అనిపించింది.

రెండవ వక్త కమల్ మంజర్లపాటి రాలేకపోవడంతో ఆదిత్యని మాట్లాడమని అడిగాం. నిజానికి ఆదిత్య ఈ పుస్తకానికి co-author. ఎందుకంటే, ఎప్పుడో చాలా కాలం కితం నేను ఈ కథల్లో కొన్నింటి గురించి- ‘మొహం లేని సాయంకాలం’, ‘సాల్టు ఇన్ స్పెక్టరు’-లాంటి కథల గురించి చెప్పినప్పుడు, ఈ కథల్ని ఇలా పరిచయం చెయ్యమని ప్రోత్సహించిందే అతడు. అంతేకాక, కథలు మళ్ళా టైపు చెయ్యక్కరేకుండా పి.డి.ఎఫ్ నుంచే నేరుగా యూనీకోడ్ లోకి డౌనులోడు చేసుకోగల సాఫ్ట్ వేర్ కూడా నాకు అందచేసాడు. ఆ సాఫ్ట్ వేర్ లేకపోయుంటే, ఇన్ని కథల్ని టైపు చెయ్యడానికి బద్ధకించి ఈ ప్రయత్నమే మొదలుపెట్టి ఉండేవాణ్ణి కాదు.

ఆదిత్య ఎప్పుడు మాట్లాడినా, నన్ను ఏదో ఒక కోణంలో surprise చేస్తూనే ఉంటాడుగానీ, ఈ రోజు అతడి ప్రసంగం నన్ను నిరుత్తరుణ్ణి చేసింది. ఎంతో పరిణతితో, ఒక అత్యున్నత చింతనాభూమిక మీద నిలబడి అతడు ఈ పుస్తకం గురించి మాట్లాడేడు. సమకాలిక తెలుగు కథ తీర్చలేకపోతున్న అవసరమేదో ఉందనీ, చూపవలసిన కోణాలేవో మన కథకులు చూపలేకపోతున్నారనీ వాళ్ళ దృష్టికి తీసుకురావడం కోసం ఎంపికచేసిన కథలివి అని అన్నాడు. అంతేకాదు, ఈ కథలు చదువుతున్నప్పుడు, మనలో, మనకి తెలీకుండా ఉన్న innocence, మనం విస్మరిస్తున్న ఒక నిర్మల పార్శ్వాన్ని ఈ కథలు చదువుతున్నప్పుడు మనం చేరుకోవడం మనకి అనుభవంలోకి వస్తుందని చెప్పాడు. ఇంకా గొప్ప మాట, మనుషుల మధ్య ఉండవలసిన ఒక non-violent relation ని ఈ కథలు పట్టుకుంటున్నాయని చెప్పాడు. ఈ పుస్తకంలోని కథలు ఎంత విలువైనవో, ఆ కథల్ని పరిచయం చేస్తూ రాసిన నోట్సు కూడా అంతే విలువైందనీ, ఇవి కథాప్రక్రియకి సంబంధించి ఒక alternative canonని ప్రతిపాదిస్తున్నాయని కూడా అన్నాడు.

వారిద్దరి ప్రసంగాలూ విన్నాక, ఇవి నన్ను వెన్నాడే కథలు మాత్రమే కాదు, అందర్నీ వెన్నాడే కథలు కూడా అని అర్థమయింది. ఆ తర్వాత నన్ను కూడా మాట్లాడమన్నారు. నేను కథల గురించి కాక, ఆ కథలు ఈ రోజు Digital Library of India వారి ద్వారా అందుబాటులోకి రావడం గురించీ, నలభయ్యేళ్ళ కింద నేను పుస్తకాలుగా చదివినవాటిని, ఈ రోజు పిడిఎఫ్ లుగా నాకు అందించిన రామాచారి బంగారు, అనిల్ బత్తుల, ఆదిత్య, అన్నమయ్య గ్రంథాలయం వారి ఔదార్యం గురించి చెప్పాను. సమావేశంలో ఎక్కువమంది కొత్త తరం యువతీయువకులు ఉండటంతో వారిని ఉద్దేశించి ఈ విషయాలు మరీ మరీ చెప్పాను. ఇలా అంతర్జాతీయ కథకులు తెలుగులోకి అందుబాటులో రావడంతో పాటు తెలుగు కథకులు కూడా ప్రపంచానికి అందుబాటులోకి రావాలని చెప్పాను. పబ్లిక్ డొమైను లో ఉన్న తెలుగు కథకుల కథల్ని ai tools ద్వారా ఇంగ్లిషులోకి అనువదించి వాటిని ప్రపంచానికి అందుబాటులోకి తీసుకురావాలని సూచించేను.

తెలుగు వికీపీడియా చూస్తున్న పవన్ సంతోష్ గారు ఈ మధ్య మా ఇంటికి వచ్చినప్పుడు మేమిద్దరం గురజాడ అప్పారావుగారి ‘దిద్దుబాటు’ కథని geminiai ద్వారా అనువదించి చూసాం. ఆ అనువాదం 90 శాతం కన్నా ఎక్కువ సబబుగా వచ్చింది. ఎందుకంటే ai ఇంగ్లిషు సింటాక్సులో అనితరసాధ్యమైన ప్రావీణ్యం సంపాదించింది. (తెలుగు నుడికారానికి అనుగుణంగా ఇంగ్లిషు నుంచి తెలుగు అనువాదం చేయటం దానికింకా పట్టుబడలేదు) కాబట్టి ఒక తెలుగు కథని ai ద్వారా ఇంగ్లిషులోకి అనువదించడం చాలా సులభం, సత్వరం కూడా. కావలసిందల్లా, తెలుగు, ఇంగ్లిషుల్లో సమానమైన అధికారం ఉన్న పండితులేవరేనా, ఒక్కసారి, ఆ డ్రాఫ్టు సరిచూసి, క్యురేట్ చేసి, దాన్ని పూర్తిగా పరిష్కరించడం. ఇటువంటి ప్రయత్నాలు యువత చేపట్టాలని కోరాను.

అనిల్ అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. అందరికీ అల్పాహారం విందు చేసాడు. అంతా ఒక గ్రూఫు ఫొటో తీసుకున్నాం. ఇరవై మంది మహనీయ కథకులు, నాతో సహా, పద్ధెనిమిది మంది అనువాదకులు కూడా ఆ గ్రూఫుఫొటోలో ఉన్నారనే అనుకోవచ్చు.

1-3-2026

2 Replies to “అందర్నీ వెన్నాడే కథలు”

  1. Missed it. మీరు ప్రతి కొత్త పుస్తకంతో వచ్చే ప్రతి కొత్త తరానికి, రచనా ప్రపంచంలోకి కొత్తగా వస్తున్న కొత్త రచయితలకి ఇంకా ఇంకా చేరువవుతున్నారు. Which is amazing. కానీ అదొక్కటే కూడా కాదు, వాళ్ళు మీ దగ్గరకొచ్చి నేర్చుకుంటున్నట్టే, మీరు కూడావాళ్ళని గమనించి వాళ్ళ ఆసక్తులు పట్టుకుంటున్నారు. గమనిస్తున్నారు.
    అందుకే బహుశా ఇన్నేళ్లుగా ఇంకా ఇంకా ఇంతలా రిలవెంట్ గా రాయగలుగుతున్నారు. Thank you sir! You are such an inspiration! ❤️

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%