
కొన్ని చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆ క్షణం కోసమో లేదా ఆ కల నెరవేరడంకోసమో ఏళ్ళకి ఏళ్ళు వేచి చూస్తూ ఉంటాం. ఈలోపు మనం కళ్ళు తెరిచిమూసేలోపే మన కల నిజమై సాక్షాత్కరిస్తుంది, మన కళ్ళని మనమే నమ్మలేనట్టుగా, మన చెవుల్ని మనమే నమ్మలేనట్టుగా.
బైరాగి ‘వర్షాయామిని’ కవిత మొదటిసారి ఎప్పుడు చదివాను! 1983 లో. నలభయ్యేళ్ళు గడిచాయి. ఆ గీతంలోని రసార్ద్రమనఃస్థితిని ఎవరేనా గాయిక తన గళంతో పునరావిష్కరిస్తారేమోనని ఎన్నేళ్ళుగా చూస్తూ ఉన్నాను! ఆ కల ఇన్నాళ్ళకు నిజమయ్యింది.
అది కూడా సురేశ్ కొలిచాల గారి పూనిక మీద. ఆయన ఆ పాటని పాడమని ప్రశాంతి చోప్రా గారిని అడగడం, ఆమె ఇలా ఆలపించడం అంతా ఒక్క రోజులో అయిపోయేయి.
ధన్యవాదాలు సురేశ్ గారూ! ధన్యవాదాలు ప్రశాంతిగారూ!
వర్షాయామిని
బైరాగి
మేఘాల మోహాలు ముసురుకొను నీరేయి
వీడి క్రొమ్ముడి చెదరి క్రమ్ముకొన్నవి కురులు
నల్ల త్రాచులవోలె ఒల్లమాలిన ఇరులు
చూపులందని పొరల చీల్చి మూగిన మరులు
ప్రాత తలపులు గుబులుకొన్నవి పయ్యెదల
ఊర్పుతావులు కొసరి విసిరి చనునీరేయి
మేఘాల మోహాలు ముసురుకొను నీ రేయి
ఆకాశదీపాలు ఆరిపోతున్నాయి
తెగినముత్తెపుసరులు తేలిపోతున్నాయి
రేగనుల నీలాలు కారిపోతున్నాయి
దెసలచెక్కిలినంటి కారుకాటుక చాయ
నొసటి వ్రాతలు చెరిగి చెమరుకొను నీ రేయి
మేఘాల మోహాలు ముసురుకొను నీ రేయి
మెరుపు మెరిసిన చోట తెరిచి మూసిన తలుపు
చిమ్మచీకటి బాట చేరనీయదు మలుపు
ఈ రేయి మీటినది ఏనాటిదో పిలుపు
మతులతీగెల నూపి, స్మృతుల గాయము రేపి
వెతల క్రొంజివురులను పసరుకొను నీ రేయి
మేఘాల మోహాలు ముసురుకొను నీ రేయి.
Featured image and top image: PC: Wikimedia commons
25-5-2025
Wow, మేఘాల మోహాలు ముసురుకున్న ఉదయమైంది…మొదట్లో వచ్చిన ఆలాపన మొదలుకుని పాటంతా అద్భుతంగా ఉంది.. cover pic is so apt for this post. The one with black clouds.
ధన్యవాదాలు మానసా!
ఉదయాన్నే ఎంత హాయిగా అనిపించిందో వినడం…
ఎత్తుగడతోనే మైమరిపించారు..
చాలా బాగుంది 🙏🙏❤️🌹
ధన్యవాదాలు సార్!
అద్భుతం సర్
ధన్యవాదాలు సార్!
ఉదయం విచ్చుకుంటున్నది.
నిదుర మబ్బు పూర్తిగా తొలిగిపోకున్నది
వర్షపు గాలి తనువంత తడుముతున్నది
సన్నగా రాలుతున్న వానచుక్కలు ఓ లయగా ఊగుతున్నవి
ఈ సమయంలో విన్న ఈ పాట
కాదు గుండె లోతుల ఊట….
హర్షాతిరేకం ముత్తెపు సరులై తెలిపోతున్నది . ఈ గాన సృష్టి కి పురుడు పోసిన అందరికి
కృతజ్ఞతలు …
అభినందనలు
ధన్యవాదాలు సార్!
కవిత ఎంత బాగుందో, ప్రియాంక గానం, ఛాయా చిత్రణం, అంత బాగున్నాయి. ధన్యవాదాలు!
ధన్యవాదాలు సార్!