
విజయనగరంలో కొత్తగా నెలకొల్పిన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం వారు ఈ మధ్య ‘గిరిజనుల సమస్యలు, భావి అవకాశాలు’ అన్న అంశం మీద ఒక జాతీయగోష్ఠి నిర్వహించారు. అందులో నా అనుభవాలు, ఆలోచనలు కూడా పంచుకొమ్మని అడిగారు.
అన్నాకెరినినా నవల్లోని మొదటివాక్యాలు సుప్రసిద్ధం. ‘సుఖంగా ఉండే కుటుంబాలన్నీ ఒక్కలానే ఉంటాయి. సుఖశాంతులకి నోచుకోని కుటుంబాలు ప్రతి ఒక్కటీ ఎవరిదారిన వారు అవస్థపడుతుంటారు ‘ అంటాడు టాల్ స్టాయి. గిరిజనుల గురించి ఆలోచించినప్పుడల్లా నాకు ఈ వాక్యం స్ఫురిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే తీసుకుంటే, ఇప్పుడు దాదాపు ముప్ఫై లక్షల మంది జనాభా ఉన్నారని అంచనా. వారిలో సగం మంది షెడ్యూల్డు ప్రాంతాల్లో జిల్లాల్లో ఉండగా, మరొక సగం మంది మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరిద్దరి సమస్యలూ ఒక్కలాంటివి కావు. పేదరికం, దోపిడీ, నిరక్షరాస్యత, నిరుద్యోగం లాంటి సమస్యలు భారతదేశంలోని అత్యధికప్రజానీకానికి చెందిన సమస్యలే. కాని ఆ సమస్యల్తో ఈ ప్రజాసమూహాల్లో ఏ విధంగా తలపడుతున్నాయో, ఆ ప్రత్యేక పరిస్థితుల్ని అధ్యయనం చెయ్యకుండా వారికి మనం ఒక సుందరభవిష్యత్తుని కలగనలేం.
గిరిజన ప్రాంతాల పాలన
అందుకని నేను నా ప్రసంగంలో కొన్ని ముఖ్యరంగాల్లో గిరిజనుల ప్రస్తుత పరిస్థితిని స్థూలంగా విశ్లేషించే ప్రయత్నం చేసాను. మొదటిది, షెడ్యూల్డు ప్రాంతాల్లో పాలన. ఐదవషెడ్యూలు ప్రాంతాల జిల్లాల్లో జిల్లాకలెక్టరుది చాలా కీలకమైన బాధ్యత. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్వ్యవస్థీరణలో ఐటిడీఎలు చెక్కుచెదరకుండా, గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకంగా జిల్లాలు ఏర్పాటుచెయ్యడం జరిగింది. ఇలా జిల్లాకలెక్టరు గిరిజన ప్రాంతాల మధ్యకే జరిగినందువల్ల గిరిజనప్రాంతాల పాలన ఏ విధంగా మెరుగుపడిందో మనమింకా పరిశీలించవలసి ఉంది. కాని మనకి లభ్యంగా ఉన్న మూడు ముఖ్యమైన సూచికలు మాత్రం నిరాశాజనకంగానే ఉన్నాయి. వాటిల్లో మొదటిది, పెసా చట్టం కింద ఏర్పాటుచేసిన గ్రామసభల పనితీరు. ఆంధ్రప్రదేశ్ లో రెండువేలకు పైగా ఉన్న గిరిజన గ్రామసభలకు ఇంకా పూర్తిస్తాయి అధికారాలు దఖలు పడలేదు గిరిజన ప్రాంతాల స్థానిక పాలనమీద గ్రామసభలకి ఇంకా పూర్తి పట్టురావాలి.
రెండోది, సాముదాయిక అటవీ హక్కుల్ని దఖలు పర్చడంలో ఆంధ్రప్రదేశ్ ఇంకా వెనకబడి ఉంది. ఆ హక్కులు ఇప్పటికీ 55 శాతం మాత్రమే గుర్తింపుకి నోచుకున్నాయి. మూడోది, ఎల్.టి.ఆర్ అమలు. ఇంకా పన్నెండువేల కేసులకు పైగా పరిష్కారానికి నోచుకోవలసి ఉండగా, గిరిజనులకు అనుకూలంగా తీర్పులిచ్చినకేసుల్లో 62 శాతం కేసుల్లో మాత్రమే భూమి గిరిజనులకు అప్పగించారు. ఎల్.టి.ఆర్ అమలు చేయవలసిన ప్రత్యేక యంత్రాంగంలో ఇంకా మూడో వంతు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అయితే, ఈ చట్టాల్ని సాధారణ యంత్రాంగం కూడా అమలు చెయ్యవచ్చు. కావలసిందల్లా, చొరవచూపించే కలెక్టర్లు.
ఇక ఐ టిడి ఏ కేంద్రానికే జిల్లా కేంద్రం కూడా తరలివచ్చినా, ఐటిడిఎ పాలకమండలి సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నట్టు కనిపించడం లేదు.. ఆ సమావేశాలు ఏడాదికి నాలుగు సార్లు జరగకపోతే, గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక జిల్లాలు ఏర్పడి కూడా ఉపయోగం లేదు.
అభివృద్ధి ప్రమాణాలు
భౌతిక అభివృద్ధి ప్రమాణాలు, అంటే పరిశుభ్రమైన తాగునీరు, శాశ్వత గృహవసతి, రోడ్లు, పాఠశాలలకీ, ఆసుపత్రులకీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకీ భవనాలు, సౌకర్యాలు, కనెక్టివిటి వంటి వాటిల్లో గిరిజన ప్రాంతాలు వెనకబడి ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలు ముందు వాటిపైన ప్రత్యేక శ్రద్ధ కనపరచడం సహజం. ముఖ్యంగా గిరిజన ఉప ప్రణాళిక నిధుల్లో కనీసం మూడో వంతు ఈ సౌకర్యాల కల్పనకి ఖర్చుచేయవలసి ఉంది. కానీ వీటన్నిటిలోనూ రహదారుల నిర్మాణానికే పెద్దపీట వేస్తూండటం సముచితం కాదు.
కాలంతో పాటే అభివృద్ధికి మనం లెక్కేసుకునే ప్రమాణాలు కూడా మారాలి. ఉదాహరణకి గిరిజన ప్రాంతాల్లోని నేలల సగటు ఉత్పాదకత మైదానప్రాంతాల్లోని నేలల కన్నా ముప్ఫై శాతం తక్కువగా ఉందిమైదానప్రాంతాల్లో నూటికి యాభై మంది రైతులకి పంపుసెట్లు అందుబాటులో ఉండగా , గిరిజన రైతుల్లో కేవలం నూటికి ఇద్దరికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగని గిరిజన ప్రాంతాల్లో ఉత్పాదకత పెంచడానికి ఆ నేలల్ని కొత్త వంగడాలతో, రసాయినిక ఎరువులతో, క్రిమిసంహారక మందులతో నింపనక్కరలేదు. గిరిజనులు తరతరాలుగా చేపడుతూ వస్తున్న సాంప్రదాయిక విత్తనాల్నీ, సేంద్రియ వ్యవసాయాన్నీ అత్యవసరంగా కాపాడుకోవాలి. పాడేరులో కాఫీ తోటలకు ఏర్పడ్డట్టుగా, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్సు ఏర్పడి తమ వ్యవసాయాన్నీ, తమ ఉత్పత్తుల మార్కెటింగ్ నీ తామే నిర్వహించుకోగలగాలి. ఇందుకు అవసరమైన బ్రాండింగ్ సపోర్టు ఇచ్చే సంస్థగా గిరిజన కార్పొరేషన్ తనను తాను పునర్నిర్మించుకోవాలి.
ఋణగ్రస్తత, పొదుపుసంఘాలు
గిరిజన ప్రాంతాల్లో 43 శాతం గిరిజన కుటుంబాలు ఋణగ్రస్తతలో ఉన్నాయి. మొత్తం కుటుంబాల్లో ఇంకా 46 శాతం స్థానిక వడ్డీవ్యాపారుల వైపే చూస్తున్నారు. కాని మరోవైపు మహిళా స్వయంసహాయక సంఘాలు పొదుపు చేసుకుంటున్న మొత్తాలు కూడా చిన్నవేమీ కావు. ఒక్క ఆల్లూరి సీతారామరాజు జిల్లాలోనే దాదాపు 18000 పొదుపు సంఘాలు ఈ జనవరి నెలాఖరుకి 300 కోట్లమేరకు పొదుపు చేసుకున్నారు. వారిలో 98 శాతం సంఘాలకు బాంకులింకేజి ఉంది. అయితే ఇలా పొదుపు చేసుకుంటున్న సొమ్ములో 46 శాతం దాకా, అంటే సగానికి సగం, వేడుకలకీ, వైద్య అవసరాలకీ తక్షణ ఋణాలుగా వెళ్ళిపోతోంది. పొదుపు సంఘాలు దాచుకున్న సొమ్ముని మరింత ఉత్పాదకమైన పెట్టుబడిగా మార్చే మార్గాలు అన్వేషించాలి. అలానే ఎప్పుడో రూపొందించిన మనీలేండర్స్ రెగ్యులేషన్ నీ, డెబ్ట్ రిలీఫ్ రెగ్యులేషన్ నీ సవరించి, వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి.
విద్య, ఉపాధికల్పన, ఉద్యోగావకాశాలు
గిరిజనప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందిన రంగం ఏదని అడిగితే విద్యారంగం వైపు చూపిస్తారు. పాఠశాలల్ని అందుబాటులోకి తీసుకురావడం, పిల్లల్ని బళ్ళో వెయ్యడం, పదవ తరగతి లేదా ఇంటర్మీడియేటుదాకా పిల్లలు చదువుకోడానికి చేసిన ఏర్పాట్లు గిరిజన ప్రాంతాల్లో విద్యను ముందుకు తీసుకువెళ్ళాయి, సందేహంలేదు. గిరిజన ప్రాంతాలనుంచి ఏడాదికి కనీసం 400 మంది విద్యార్థులు ఐ.ఐ.టి.ఎన్.ఐ.టి వంటి ఉన్నతస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారు. ఇది మామూలు విషయంకాదు. అదే సమయంలో 40 శాతం మంది విద్యార్థులు ఉన్నత విద్య పూర్తిచేసుకోలేక డ్రాప్ ఔట్ అవుతున్నారు. కాబట్టి గిరిజనుల ఉన్నత విద్యకు సాధారణ ఉపకారవేతనాల మద్దతు సరిపోదు. అందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. ప్రి-ప్రైమరీ స్థాయిలో ఇంగ్లిషు లిపితో కూడిన గిరిజన మాతృభాషల్లో ఎఫ్.ఎల్.ఎన్ అమలు చెయ్యడంతో బాటు, ప్రాథమిక స్థాయినుంచీ ఇంగ్లిషు మీడియం విద్యాబోధన బలోపేతం కావాలి.
మొన్నటిదాకా గిరిజన ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు నూటికి నూరు శాతం ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండేవి. సుప్రీం కోర్టు తీర్పు వల్ల ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడం గిరిన ప్రాంతాలకు తీవ్రమైన అఘాతంగా పరిణమించింది. ఆ లోటును భర్తీ చేసుకోవడం కోసం, వ్యవసాయ-ఆధారిత పరిశ్రమలు, మైనింగు, అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధికల్పన, అందుకు అవస్రమైన నైపుణ్యాల కల్పన చేపట్టాలి. గిరిజన ప్రాంతాల్లోని సేవలు, ఉదాహరణకి, చిన్నతరహా ట్రాన్సుపోర్టు వంటివి పూర్తిగా స్థానిక గిరిజనులకే కేటాయించేలాగా చట్టాలు తయారుచేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లో గిరిజనుల ప్రస్తుత పరిస్థితి ఒకవైపు చాలా ఆశావహంగా ఉంది. ముఖ్యంగా క్రియాశీలక పొదుపుసంఘాలు, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు, కాఫీపంటకు లభిస్తున్న అంతర్జాతీయ బ్రాండింగ్ వంటివి కొత్త నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. మరో వేపు సాంప్రదాయిక పాలన, వ్యవసాయం, అభివృద్ధి విధానాల్లో structural stagnation కనిపిస్తున్నది. ఈ రంగాల్లో కూడా కొత్త చైతన్యం పుంజుకునేలా చూడటం వల్లనే గిరిజనుల భవిష్యత్తు బలపడుతుంది.
13-2-2026
Good morning sir today your article about tribal people &his life style & development it is very nice good informative . Happy shivratri to u and your family members sir from Srinidhi dept of heritage museum employee
చాలా ముఖ్యమైన విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా వారికి అవసరమైనవి వైద్యం, విద్య, రాకపోకల సదుపాయం-వారి అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం-పోడు భూముల వ్యవసాయం, అందుకు ప్రభుత్వ సహకారం మొదలైనవి. ప్రస్తుతం గిరిజన కార్పొరేషన్ పనిచేయటం లేదా? ఒకప్పుడు అనుకొనేవారు, నక్సల్ ప్రాబల్యం వున్నచోట అభివృద్ధికి సహకరించరని. ఇప్పుడు ఆ సమస్య కూడా లేదు కదా. గిరిజనుల సంక్షేమం కోసం జిల్లా కలెక్టర్లు నిజాయితీగా శంకరన్ గారిలాగా పనిచేయాలి. ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు, వ్యాపారులకు, అటవీ ప్రాంతాల దోపిడీని అరికట్టాలి.