ఉదారచరితులు పుస్తకం మీద మిత్రులు కల్లూరి భాస్కరంగారు రాసిన సహృదయ స్పందన. వారికి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. నా పుస్తకాల్లో ఇంత సమగ్రమైన సమీక్ష ఇదే మొదటిసారి నేను చదవడం!
మరో నాలుగు పుస్తకాలు
ఇప్పుడు నా రచనలలో సరికొత్తగా మరో నాలుగు పుస్తకాలు మొన్ననే ప్రింటు కాపీలు విడుదల అయ్యాయి. Shri Pada Literary Works వారు వెలువరించిన నాలుగు పుస్తకాలూ ఇవి. ఇందులో బసవన్న వచనాలు కిందటేడాది వెలువరించినప్పటికీ ఆ 100 కాపీలు అయిపోవడంతో, చాలామంది మిత్రులు పదేపదే అడుగుతుండటంతో, ఆ పుస్తకం కూడా మరోసారి ముద్రించి విడుదల చేస్తున్నారు. ఒక్కొక్క పుస్తకం 100 కాపీల చొప్పున మాత్రమే ప్రింటు చేయించారు కాబట్టి ఆసక్తి ఉన్నవారు తెప్పించుకోవచ్చు.
Song of My Village
నిర్వికల్ప సంగీతం వెలువడి నలభై సంవత్సరాలు పూర్తవుతున్నాయి. అందుకని అందులోంచి గతంలో అనువదించిన కొన్ని కవితలతో పాటు మరికొన్ని ఇంగ్లిషులోకి అనువదించాను. దానితో పాటు, ఒంటరిచేల మధ్య ఒక్కత్తే మన అమ్మ సంపుటినుంచి కూడా గతంలో అనువదించిన కవితలతో పాటు మరికొన్ని కవితలు అనువదించాను. మొత్తం 45 కవితలు. వీటిని ఇలా Song of My Village: Selected Poems, 1982-1992 పేరిట ఒక ద్విభాషాసంపుటిగా వెలువరిస్తున్నాను. ఈ పుస్తకాన్ని ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు.
