అవధూతగీత-1

ఇన్నేళ్ళు గడిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో అంతర్వాహినులుగా ఉండి నన్ను నడిపిస్తున్న ప్రభావాలు మూడు కనబడ్డాయి. ఆ కొండ కింద పల్లెలో ఆ ఇంట్లో మా బామ్మగారు నాకు చిన్నప్పుడే వినిపించి కంఠస్థం చేయించిన పోతన భాగవత పద్యాలు. రెండోది, మా నాన్నగారు ఎంతో అపురూపంగా చూసుకునే మహాభక్తవిజయం పుస్తకం, మూడోది, ఆ ఇంట్లో ఈశాన్యమూలన మా అమ్మ ప్రాణప్రదంగా చూసుకునే దేవుడిగది. ఆ దేవుడి గదిలో ఒక చిన్న చెక్కమందిరం ఉండేది. అందులో వంశపారంపర్యంగా వస్తుండే పంచాయతనంతో పాటు కొన్ని దేవీదేవతల మూర్తులు, కొన్ని పటాలు, వ్రతకల్పాలు ఉండేవి. నా జీవితంలో అరవయ్యేళ్ళు గడిచాక ఇప్పుడు నాకు అర్థమయిందేమంటే, మా బామ్మగారి ద్వారా భగవద్భక్తి కవిత్వం, మా నాన్నగారి ద్వారా భగవద్భక్తుల జీవితాలు పరిచయమైతే మా అమ్మ ద్వారా భగవత్ స్వరూపాలే పరిచయమయ్యాయని.

ఈశాన్యమూల ఉన్నా, ఇల్లు తాటాకుతో నేసిన కప్పు కావడంతో చూరు మరీ కిందకి దిగి ఉండటంతో, ఆ దేవుడిగది దాదాపుగా చీకటిగానే ఉండేది. కాని ఆ చీకట్లోనే మా అమ్మ నాకు గొప్ప వెలుతురుని పరిచయం చేసిందని ఇన్నేళ్ళయ్యాక పోల్చుకోగలుగుతున్నాను. నా మరీ పసితనంలో అంటే అయిదో తరగతిలోపే నాకు చదవడం బాగా వచ్చింది కాబట్టి మా అమ్మ తాను చేసుకునే వ్రతాలకి వ్రతకల్పాలు నాతో చదివించుకునేది. అలా రామదేవుని వ్రతకల్పం, శివదేవుని వ్రతకల్పం మా అమ్మ నాతో ఎన్నిసార్లు చదివించుకుందో. ఆ శివదేవుని వ్రతకల్పం లోపలి అట్టమీద శివపంచాక్షరీ స్తోత్రం, వెనక అట్ట మీద భ్రమరాంబికాష్టకం ఉండేవి. శ్రీశైలం ఎక్కడుందో తెలియని ఆ పసివయసులో ఆ స్తోత్రం పదే పదే వల్లెవేసినందుకు నా తదనంతర జీవితంలో దాదాపు ముప్ఫై ఏళ్ళకు పైగా శ్రీశైలంతో అనుబంధం స్థిరపడిపోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తూంటుంది. అలానే ఆ దేవుడి మందిరంలో ఎక్కణ్ణుంచి వచ్చాడో సాయిబాబా పటం కూడా ఒకటుండేది. తలమీదుగా తెల్లని కఫ్నీ ధరించిన ఆ మూర్తి ని చూసినప్పుడల్లా నాకు మా గంగమ్మ అమ్మమ్మగారే తలపుల్లో మెదిలేవారు. ఎందుకంటే బాలవితంతువు అయిన ఆమె ఎప్పుడూ తలమీదుగా కొంగుకప్పుకుని తెల్లని వస్త్రం ధరించి ఉండేవారు. మా అమ్మ చిన్నప్పుడే తన తల్లిని పోగొట్టుకుంది. కాబట్టి ఆమెనే మా అమ్మను పెంచి పెద్ద చేశారు. తల్లికే తల్లిప్రేమ చూపిన ఆమెని తలపిస్తూ సాయిబాబా ఆ నా పసితనంలో నా జీవితంలో ప్రవేశించడం మరొక ఆశ్చర్యం. అలా వచ్చినవాడు ఇప్పుడు ప్రతిరోజూ మా ప్రమోద్ రూపంలో సాయిబాబా అని పిలిపించుకుంటూ మా ఇంట్లో ఉండిపోయేడు.

ఆ రోజుల్లో మా అమ్మ అప్పుడప్పుడూ అరుదుగా త్రినాథవ్రతం కూడా చేసేది. ఆ వ్రతం మాత్రం నాకు కొంత కొత్తగానూ, విచిత్రంగానూ ఉండేది. ముఖ్యంగా ఆ వ్రతానికి కావలసిన సామగ్రి. మూడు కొమ్మలు కావలసి ఉండేవి. బహుశా మర్రిచెట్టు, రావిచెట్టు, మామిడి చెట్టు అనుకుంటాను. ఆ కొమ్మలు తీసుకురమ్మనేది మా అమ్మ. మా ఊరు ఉన్నదే అడవిలో కాబట్టి ఆ కొమ్మలు తేవడం కష్టంకాకపోగా, ఆ వంకన ఊరుదాటి అడవికి పోయే అవకాశం వచ్చినందుకు ఉత్సాహంగా ఉండేది. ఇక అ వ్రతంలో ఒక సన్యాసి  మూడు కానులు ఇచ్చి మూడు రకాల వస్తువులు తెమ్మంటాడు. అందులో ఒక కాను గంజాయి కూడా తెమ్మంటాడు. మేము ఆ వ్రతాలు చేసేనాటికే కానులు అదృశ్యమైపోయాయి. ఇక గంజాయి ఎలా ఉంటుందో నా ఊహకి కూడా అందని విషయం. మా అమ్మ వాటికి బదులు ఇన్ని అక్షతలు తీసుకుని పూజ పూర్తిచేసేది.

నా పదేళ్ళ వయసులో చదువుకోడానికి తాడికొండ వెళ్ళిపోవడంతో ఆ పూజలూ, ఆ వ్రతాలూ కూడా నా జీవితంలోంచి అదృశ్యమైపోయాయి. ఎప్పుడేనా రామదేవుడి కథనో, శివదేవుడి కథనో తలుచుకునేవాణ్ణేమోగాని, ఆ త్రినాథస్వామిని మాత్రం పూర్తిగా మర్చిపోయేను.

2

దాదాపు ఇరవయ్యేళ్ళ కిందట ఒకసారి షిర్డీ వెళ్ళినప్పుడు త్ర్యంబకం కూడా వెళ్ళాం.  సంత్ జ్ఞానేశ్వర్ రాసిన అమృతానుభవం అప్పటికి నాకు పరిచయమయ్యింది. అది కూడా దిలీప్ చిత్రే రాసిన Says Tuka చదివిన సంతోషంలో, చిత్రే అనువాదాలు మరేమున్నాయా అని వెతుక్కుంటూ ఉండగా, దొరికిన పుస్తకం. కాని తుకారాం లాగా సంత్ జ్ఞానేశ్వర్ నాకొకపట్టాన అంత సులభంగా బోధపడలేదు. అలాగని ఆయన నన్ను వదిలిపెట్టనూ లేదు. షిరిడీ వెళ్ళినప్పుడు త్ర్యంబకం వెళ్ళాలనుకోడానికి ముఖ్యకారణం సంత్ జ్ఞానేశ్వర్ సోదరుడు నివృత్తినాథుడికి త్య్రంబకం కొండగుహలోనే సాక్షాత్కారం అయిందని తెలియడం, ఆ నివృత్తినాథుణ్ణే జ్ఞానేశ్వరుడు తన గురువుగా స్వీకరించాడని తెలియడం. అందుకని ఆ కొండచరియల్లో కొంతసేపు తిరుగాడినా జ్ఞానేశ్వర్ నన్ను ఏదో ఒక రూపంలో తన స్ఫూర్తి నాకు అనుగ్రహిస్తాడనే ఒక ఆశ నాలో బలంగా ఉండింది.

త్య్రంబకం వెళ్ళాను. గోదావరి ఎక్కడ పుడుతున్నదో చూద్దామని ఆ కొండకొనదాకా వెళ్ళాము. అప్పుడు తెలిసింది నాకు, ఆ పర్వతశ్రేణి, ఆ సహ్యాద్రి, దత్తాత్రేయుల విహారభూమి అని! అప్పుడే నాకు పరిచయం అయింది అవధూత గీత. ఎలా? ఎవరు చెప్పారు ఆ పుస్తకం గురించి? చెప్పలేను. బహుశా జ్ఞానేశ్వరుడే ఆ పుస్తకాన్ని ఎవరి ద్వారానో నాకు పరిచయం చేసిఉంటాడు. త్య్రంబకం నుంచి తిరిగి వచ్చాక ఆ నా యాత్రానుభవాన్ని ఒక కథనంగా రాసేను. వాటితో పాటు మరికొన్ని కథనాల్ని, అనుభవాల్ని కలిపి ‘నేను తిరిగిన దారులు’ పుస్తకంగా వెలువరించాను. అందులో త్య్రంబకం గురించి రాసిన అనుభవకథనంలో అమృతానుభవం గురించీ, అవధూత గీత గురించీ కూడా ప్రస్తావించాను. అక్కడితో ఆ అనుభవం ముగిసిపోయిందనుకున్నాను.

కాని అందులో అమృతానుభవం నుంచి నేను చేసిన ఒకటి రెండు అనువాదాలు చదివి గంగారెడ్డి ఆ మొత్తం పుస్తకం నన్ను అనువాదం చెయ్యమని అడిగాడు. అది ఇంగ్లిషు నుంచి కాకుండా మరాఠీనుంచి చేస్తే బాగుంటుందేమో అని ఒక మరాఠీ ఉపాధ్యాయుణ్ణి వెతుక్కుంటూ అదిలాబాద్ కూడా వెళ్ళాం. కానీ ఆ తర్వాత అనూహ్యంగా మా జీవితాల్లోకి సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారు ప్రవేశించారు. అమృతానుభవాన్ని తెలుగు చెయ్యమని గంగారెడ్డి అడుగుతున్నాడంటే ఆ బాధ్యత ఆయన తీసుకున్నారు. ఎంతో అద్భుతంగా, ఎంతో అపూర్వంగా ఆ పుస్తకాన్ని ఆయన తెలుగులోకి తీసుకొచ్చారు. ఆ పుస్తకం మీద నా సమీక్ష ఇక్కడ మీతో పంచుకున్నాను కూడా. రాధాకృష్ణమూర్తిగారి చేతులమీదుగా అమృతానుభవం తెలుగులోకి రావడం వెనక  ఇంత చరిత్ర ఉంది. కాని ఈ కథ అక్కడితో పూర్తవలేదు.

కిందటేడాది కొందరు దత్తభక్తుల గురించి చెప్తూ వారు దత్తాత్రేయుల మీద ఒక పుస్తకం తీసుకురావాలనుకుంటున్నారనీ, నేను కూడా ఏదేనా వ్యాసం రాయగలనా అనీ విజ్జి అడిగింది. నేను త్య్రంబకం యాత్రకి వెళ్ళి వచ్చిన తరువాత దత్తాత్రేయుల గురించి తెలుసుకోడానికి చదివిన పుస్తకాల్లో Antonio Rigopoulos అనే ఒక ఇటాలియన్ రాసిన Dattatreya: The Immortal Guru, Yogin, and Avatara (1998) అనే గొప్ప గ్రంథం కూడా ఉంది. ఆ పుస్తకం మళ్ళా తిరగేసి ఏదేనా వ్యాసం రాయాలనుకున్నానుగాని, అంత సమయం లేకపోవడంతో, నా త్య్రంబకం యాత్రాకథనం నుంచే సహ్యాద్రికి సంబంధించిన భాగం ఒకటీ తీసి ‘సహ్యాద్రినుంచి’ అని పేరుతో వాళ్ళకి పంపించాను. పంపించాక ఆ విషయం కూడా మర్చిపోయేను.

కాని ఆ దత్తభక్తులు మమ్మల్ని వదల్లేదు. వారికి ఆ వ్యాసం నచ్చింది. దాంతో మమ్మల్ని ఒకసారి గాణ్గాపురం యాత్ర చేయమంటున్నారని విజ్జి చెప్పడంతో ఈ ఏడాది మార్చిలో మొదటిసారి గాణ్గా పురం వెళ్ళాను. గాణ్గాపురం దత్తక్షేత్రం. అక్కడ భీమా-అమరజా నదీ సంగమం దగ్గర  15 వ శతాబ్దిలో నృసింహ సరస్వతి అనే ఒక గురువు కొన్నేళ్ళపాటు నివసించారు.  ఆయన సాక్షాత్తూ దత్తాత్రేయుల అవతారమని దత్తభక్తులు విశ్వసిస్తారు. నృసింహ సరస్వతి స్వామి అక్కణ్ణుంచి శ్రీశైలం వెళ్ళిపోయేటప్పుడు ఆ ఊరివారికి తన గుర్తుగా తన పాదుకలు వదిలిపెట్టి వెళ్ళారు. ఆ నిర్గుణపాదుకలకు ఆ ఊళ్ళో ఒక మందిరం నిర్మించారు. అక్కడ దత్తాత్రేయులు కూడా కొలువున్నారు. ప్రతి మధ్యాహ్నం అక్కడికి ఏదో ఒక రూపంలో దత్తాత్రేయులు భిక్షకి వస్తారనే నమ్మకంతో అక్కడ మధుకరి అనే ఒక సేవ జరుగుతుంది. ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి తమని అనుగ్రహిస్తాడన్న నమ్మకంతో ఎవరెవరో ఆ మధ్యాహ్న వేళ అక్కడ ఆకలిగొన్నవారందరికీ భిక్ష సమర్పిస్తుంటారు. నృసింహసరస్వతి జీవితం, ఆయన బోధలు, చూపించిన లీలల్ని వివరిస్తూ 16 వ శతాబ్దంలో సరస్వతీ గంగాధరుడనే కవి మరాఠీలో గురుచరిత్ర అనే పుస్తకం రాసాడు. ఆ పుస్తకం దత్తభక్తులకి ఒక పారాయణ గ్రంథం. (తర్వాత రోజుల్లో ఆ పుస్తకం నమూనామీదనే హేమాత్పంత్ సాయి సచ్చరిత్ర రాసాడు.) అక్కడ భీమా-అమరజా సంగమం ఒడ్డున  నృసింహ సరస్వతీ స్వామి  ఒక మేడిచెట్టు నాటారు. ఆ చెట్టునీడన ఇప్పటికీ అహర్నిశలు గురుచరిత్ర పారాయణం జరుగుతూనే ఉంటుంది. ప్రతి రాత్రీ నిర్గుణ పాదుకామందిరంలో పల్లకీ సేవ జరుగుతూ ఉంటుంది. నేను మొదటిసారి వెళ్ళినప్పుడు భీమా-అమరజా సంగమంలో స్నానం చేసేను. సాయంకాలం పల్లకీ సేవ చూడగలిగేను. ఆ మొదటి దర్శనం, ఆ రోజు నా జీవితంలో నేను మరవలేనివి.

3

మొదటిసారి గాణగాపురం వెళ్ళి వచ్చాక మళ్ళా అవధూతగీత మీదకు దృష్టి మళ్ళింది. ఆ గీతను మరింత బాగా అర్థం చేసుకోడానికి ఎవరితోనేనా కలిసి చదవాలనుకున్నాను. లేదానాకు నేను మరింత బోధపరుచుకోడానికి కొన్ని ప్రసంగాలేనా చెయ్యాలనుకున్నాను. అందుకని ఆ పుస్తకం వెంటనే తెప్పించుకున్నాను. అది పురోహిత్ స్వామి చేసిన ఇంగ్లీష్ అనువాదం. శంకర్ మోకాషి-పుణేకర్ సంపాదకత్వంలో వెలువడ్డ ప్రతి (1979). పుస్తకం తెప్పించాక మరొకసారి చదవడమైతే చదివానుగాని, ప్రసంగాలు మొదలుపెట్టలేకపోయాను.

ఇదిలా ఉండగా ఈ మధ్య గంగారెడ్డి ఫోన్ చేసాడు. చాలా రోజుల తర్వాత, ఇంకా చెప్పాలంటే చాలా నెలల తర్వాత. ఫోన్ చేస్తూనే ‘సార్, నాదో రిక్వెస్టు, మీరు ఒప్పుకుంటానంటే చెప్తాను’ అన్నాడు. ఏమిటన్నాను.

‘మీరు నా కోసం అవధూత గీత తెలుగు చెయ్యగలరా?’

ఆ ప్రశ్న వింటూనే నా చెవుల్ని నేను నమ్మలేకపోయాను. నేను ఆ పుస్తకం తెప్పించుకుని కూడా అయిదారునెలలు గడిచిపోయాయని దత్తాత్రేయులు ఇప్పుడిలా గంగారెడ్డి ద్వారా గుర్తుచేస్తున్నారా?

నేను ఆ పుస్తకం ఈ మధ్యనే తెప్పించుకున్నాననీ, దానిమీద మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాననీ, ఈలోపు అతణ్ణించి ఆ ఫోన్ కాల్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోందనీ చెప్పాను అతడితో.

‘సార్ మీకు గుర్తుందా! మీ త్య్రంబకం యాత్రానుభవం చదివినప్పుడే నేను మిమ్మల్ని ఆవధూత గీత అనువాదం చెయ్యమని అడిగాను’ అని అన్నాడు గంగారెడ్డి.

గుర్తుంది. ఆ రోజు అతడు ఆర్మూరు వెళ్తూ ఎక్కడో రోడ్డు పక్క ఓ టీషాపు దగ్గర ఆగి అక్కణ్ణుంచే ఆ పద్యాలు వినిపించాడు. ‘ఈ పుస్తకం మొత్తం తెలుగులోకి రావాలి సార్’ అని అప్పుడే అన్నాడు. అక్కడితో ఆగకుండా స్వామి అభయానంద అనే ఆయన చేసిన ఇంగ్లిషు అనువాదం కూడా నాకు పంపించాడు. ఆ అభయానందనే అమృతానుభవం కూడ ఇంగ్లిషులోకి అనువదించాడని చెప్పి ఆ కాపీ కూడా అప్పుడే నాకు పంపించాడు.

దాదాపు పుష్కర కాలం గడిచిపోయింది. అమృతానుభవమయితే రాధాకృష్ణమూర్తిగారిని వెతుక్కుంది. కాని అవధూత గీత ఇన్నాళ్ళూ నా కోసమే ఎదురుచూస్తూ ఉందని నాకు అర్థమయింది. ఇంకా చెప్పాలంటే, నా పసితనంలో నేను మా అమ్మకోసం కొలిచిన ఆ త్రినాథ స్వామి, నేను మర్చిపోయినా, నన్ను మర్చిపోలేదని!


Featured image: Bhima-Amaraja Sangam, Ganagapur

23-10-2024

15 Replies to “అవధూతగీత-1”

  1. కొన్నాళ్ళ కిందట ఒక దత్తగీత శ్లోకానికి ఓషో ఆంగ్లానువాదం- ఒక ఫ్రెండ్ వాట్సాప్ లో పంపింది. గ్రూప్ లో మరో ఫ్రెండ్ నన్ను అది తెలుగులో చెప్పగలవా అని అడిగింది.
    నాకూ ఆసక్తి కలిగి అవధూత గీత కోసం ఇంటర్నెట్ వెతికితే తెలుగులో అనువాదం తో సహా లభించింది. ఆ రోజే కూర్చుని మొత్తం ఎనిమిది అధ్యాయాలు, దాదాపు 290 శ్లోకాలు చదివాను. చాలా అద్భుతం గా అనిపించింది. మీరన్నట్టు దత్తాత్రేయు లవారి అనుగ్రహం అని అనుకున్నా.

    అవధూత గీత ను – song of free soul అంటారు ట.
    అంతా బాగుంది కాని అందులో ఎనిమిదవ అధ్యాయం ఎవరో చొప్పించినట్లు అనిపిస్తుంది- స్త్రీల ను కించపరచేలా ఉంది. ఇలా చాలా గ్రంథాలలో జరిగింది అనుకోండి.

    ఏమైనా ఈ song of free soul గీతాన్ని మీరు తెలుగులో అనువదించడం సంతోషంగా ఉంది.

    1. అవును. ఎనిమిదవ అధ్యాయం ప్రక్షిప్తం.

  2. అనికేతకుటీ పరివారసమం
    ఇహ సంగవిసంగవిహీనపరమ్
    ఇహబోధ విబోధ విహీనపరం
    కిమురోదిషి మానసి సర్వసమమ్

    “It is all One,
    whether we live in a hut in retirement,
    or in a house with many kinfolk,
    for Self is free from the multitude
    as from solitude.
    Free also is It from knowledge,
    theoretical and practical,
    Self being all,
    my mind,
    do not cry.” – Sage Dattatreya.
    Avadhuta Gita.

  3. నమస్కారం
    మీ ఈ పోస్ట్ చదివి, ఎంతో సంతోషపడ్డాను.
    దాదాపు ఐదు సంవత్సరాల క్రితం అనుకుంటా ఇంకా మునుపు ఒక అధ్యాయం తెలుగులో తర్జుమా చేసుకున్నా. నా కోసం. మీ ఇది చదివి, దాని కోసం ఇంత వరకు పాత ఫైల్స్, డ్రైవ్ వెతికాను.. దొరకలేదు. మీరు రాయడం సరి అయినది. అది చదవడానికి ఉవ్విళ్ళూరుతున్న.

    1. మీరు కూడా తెలుగు చేయండి. నేను కూడా తెలుగు చేస్తాను. ఇద్దరం పంచుకుందాం.

  4. rammohanthummuri – I am a writer, a poet, a head master, a fater, a husband, and a creative person. I primarily in telugu language.
    Thummuri says:

    అన్నీ వింటూ ఉంటాను. కానీ ఏదీ తలకెక్కలేదు ఇంతవరకు.పూజలూ , వ్రతాలు, నోములు, పరాపర కర్మ విశేషాలు ( మా తాత గారు వాటిలో అనుభవజ్ఞులు), ఆచారాలు, వ్యవహారాలు , నియమాలు, నిష్ఠలు, దీక్షలు, యోగులు, బాబాలు, అన్నిటి గురించి అంతో ఇంతో తెలిసినా ,
    ఏదీ అంటకుండానే గడచిపోయింది. సాయిబాబా తత్వం ఇష్టం . జేకే ఓషోల ప్రభావం కొంత మానసిక చింతనను మార్చింది. మీ రచనలు చదువుతున్నప్పుడు ఆ స్ఫూర్తి ఉల్లాసం కలిగిస్తుంది.సాంఘిక చైతన్య దిశలో , సమాజ శ్రేయఃకాములై మన పెద్దలు ఏర్పరచారనే గౌరవం ఉంది. రోజూ వాకింగ్ చేయమంటే చేయరు. కానీ 108 ప్రదక్షిణలు చేయమంటే
    నిష్ఠ గా ఆచరిస్తారు . ఇలాంటి వాటి గురించి సదాశివ గారితో అంటే పుస్తకం రాయకూడదా అన్నారు . అంత శక్తి లేదని తెలుసు. ముచట్లు చెప్పగలను .
    ఇవాళ మీరు రాసిన వన్నీ చదువుతుంటే కార్యకారణ సంబంధం గుర్తుకు వచ్చింది. అది అంతస్సూత్రంగా ప్రతి మనిషి జీవితంలో జరిగే సంఘటనల సమాహారమౌతుంది.మీ ప్రతి వ్యాసమూ స్ఫూర్తిని కలిగిస్తుంది.నాకు తెలిసిందల్లా ఒకటే . ఎవరైనా ఏదైనా అడిగితే అది చేసి పెట్టడమే. అదృశ్యశక్తిరూప ఈశ్వరుని పై మాత్రం అచంచల విశ్వాసం. ఎందుకో గాని మనసు విప్పుకోవాలనిపించింది.

    1. మీరు ఇట్లా మీ తలపులు పంచుకోవడం నాకు సంతోషంగా అనిపించింది.

  5. సార్. నమస్కారాలు…నేను( నాపేరు) మహంకాళీ అర్జున్ ప్రసాద్..నేను మిమ్ములను కలిసిన సందర్భం : AP లో Students Hygiene program in AP state లో అనుమతి అలాగే ఇంప్లిమెంటేషన్ కొరకు మిమ్ములను SSA patamata office లో కలవడం జరిగింది…మీరు వెంటనే అనుమతి ఇవ్వడం చాలా ఆనదననిపియించింది…ఇది మీతో నేను కలిసిన office సంబంధిత సమయం/ పరిచయం….ఇక నా వ్యక్తిగత విషయానికి వస్తే ..మాది చెన్నూరు . అదిలాబాద్ ఇప్పుడు మంచిర్యాల జిల్లా…మా ఇలవేల్పు దత్తాత్రేయుడు. మా నాన్న గారి పేరు కూడా దత్తాత్రేయ రావు..అదిలాబాద్ జిల్లాలో HM గా పనిచేసారు ( ఇప్పుడు లేరు)..ప్రతి సంవత్సరం మా ఇంట్లో దత్తాత్రేయ నవరాత్రులు చేస్తాము…మా నాన్న గారు “గురుచరిత్ర” పాఠం మరాఠీ మూలం లో చదివే వారు. మేము వినే వాళ్ళం..నేను నా కుటుంబం 2022 లొ గానగాపురం దర్శించించాము …మీ ఈ రచన చదువుతుంటే బహు ఆనందంగా ఉంది.ఒకసారి హైద్రాబాద్ లో మిమ్ములను కలవాలని ఉంది… ప్రస్తుతం నేను Delhi లో జలశక్తి మినిస్ట్రీ లో స్వచ్ఛ భారత్ గ్రామీణ లో పనిచేస్తున్నాను… నమస్సులు….

    1. చాలా సంతోషం. నేను హైదరాబాదులో ఉంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు కలవవచ్చు. నా ఫోన్ నెంబర్ 9490957129.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%