
తాడికొండలో మా క్లాసులో జె.వి.ఎస్.డి.పి.రాజు అని ఒక మిత్రుడుండేవాడు. గొప్ప తెలివైన విద్యార్థి. వాళ్ళ నాన్నగారు మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేస్తుండేవారు. అందుకని వాడు సెలవులకి ఇంటికి వెళ్ళేటప్పుడు కర్నూలుమీంచి వెళ్ళేవాడు. ఒకసారి అలా వెళ్ళినప్పుడు కర్నూల్లో మా హీరాలాల్ మాష్టారి ఇంటికి వెళ్ళాడు. సెలవులనుంచి తిరిగి స్కూలుకి వచ్చాక మాటల మధ్యలో ‘హీరాలాల్ మాష్టారి ఇంట్లో ఎన్ని పుస్తకాలనుకున్నావు! ఇల్లంతా పుస్తకాలే! అలమారుల్లో, మంచాలమీద, కిటికీల్లో, ఎక్కడు చూడు ఎన్ని పుస్తకాలో’ అని అన్నాడు.
ఆ మాటలు వినగానే వాడి పట్ల నాకు గొప్ప ఈర్ష్య కలిగింది. మాష్టారి ఇంటికి వాడు వెళ్లగలిగాడే, ఆ పుస్తకాలు నేను చూడలేకపోయానే అన్న బెంగ చాలాకాలమే ఉండింది. ఆ తర్వాత స్కూలు వదిలిపెట్టిన పది పన్నెండేళ్ళకి గాని నాకు ఆ అవకాశం దొరకలేదు. నా ఉద్యోగ జీవితంలో నాకు కర్నూలు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఊళ్ళో అడుగుపెట్టగానే నేను చేసిన మొదటిపని మాష్టారి ఇంటికి వెళ్లడమే.
అలాగే కిందటేడాది కన్నెగంటి రామారావు ఇండియా వచ్చినప్పుడు గుంటూరు వెళ్తూ తాను తెనాలి కూడా వెళ్తున్నాననీ నన్ను కూడా రమ్మనీ అడిగాడు. ఎందుకంటే మా చిన్నప్పుడు హైస్కూల్లో మాకు సాంఘిక శాస్త్రం బోధించిన నాగళ్ళ వెంకట రత్నం మాష్టారుండేది తెనాలిలోనే. నేను కూడా తెనాలి వస్తే ఇద్దరం కలిసి మాష్టారి ఇంటికి వెళ్ళాలని రామారావు ఆలోచన. అది కిందటేడాది సాధ్యం కాలేదు. ఈ ఏడాది కూడా మళ్ళా తాను తెనాలి వెళ్తున్నాననీ, నేను కూడా వస్తే మాష్టారి ఇంటికి వెళ్ళొచ్చు కదా అని అన్నాడుగాని, నాకు వీలు చిక్కలేదు. తీరా అతను తెనాలి వెళ్ళి మాష్టార్ని కలిసి, కలిసానని నాకు చెప్తూ, ‘అబ్బా, మాష్టారి ఇంటినిండా పుస్తకాలే, ఎన్ని పుస్తకాలో’ అని అన్నాడు!
రామారావుకి తెలీదు, దాదాపు యాభై ఏళ్ళ కిందట నా క్లాస్ మేట్ ఒకడు ఇలాంటి మాటలు చెప్పే నాలో గొప్ప దిగులు పుట్టించాడని! వాడు చెప్పినమాటల్ని బట్టి హీరాలాల్ మాష్టారి ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్తానా, ఆ పుస్తకాలు ఎప్పుడెప్పుడు చూస్తానా అని దాదాపు పన్నెండేళ్ళు ఎదురుచూసానని! ఈసారి రామారావు వెంకటరత్నం మాష్టారి గురించి ఆ మాటలు చెప్పినప్పుడు నా పట్ల నాకే చాలా ఆశ్చర్యం కలిగింది. కనీసం ఈ విషయం వరకూ కాలం నాలో ఏ మార్పూ తేలేదు. చిన్నప్పుడు హీరాలాల్ మాష్టారి ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఎదురుచూసినట్టే ఇప్పుడు వెంకటరత్నం మాష్టారి ఇంటికి ఎప్పుడెప్పుడు పోయి ఆ పుస్తకాలు చూస్తానా అని నాలో ఒక ఆత్రుత మొదలయ్యింది.
కాని ఈసారి పన్నెండేళ్ళు వేచి ఉండనవసరం లేకపోయింది. కిందటి నెలలో సచ్చిదానందమూర్తిగారి శతజయంతి సభలో పాల్గోడానికి తెనాలి వెళ్ళినప్పుడు ఆ సమావేశానికి మాష్టారు కూడా వచ్చారని రాసాను కదా. ఆయనతో వెంటనే చెప్పాను, ‘సాయంకాలం మీ ఇంటికి రావాలను కుంటున్నాను, ఒకటి మేడం గారికి నమస్కారాలు చెల్లించడంకోసం, రెండోది మీ పుస్తకాలు చూడటంకోసం. అందుకనే రాత్రి బస్సుకి టిక్కెట్టు తీసుకున్నాను’ అని.
మా చిన్నతనంలో, నేనూ, రామారావు, మా లాంటి ఎందరో విద్యార్థులకి వెంకట రత్నం మాష్టారు ఒక ఇన్స్పిరేషన్. ఆయనతో నా అనుబంధానికి ఇప్పటికి 52 ఏళ్ళు. 1972 ఆగస్టు 25 న అయిదో తరగతి విద్యార్థిగా తాడికొండ పాఠశాలలో చేరినప్పుడు మమ్మల్ని చేరదీసిన ఆ తొలి ఉపాధ్యాయుల్లో ఇప్పుడు మిగిలింది వెంకటరత్నం గారే. ఆ మొదటి నాలుగేళ్ళూ అంటే అయిదో తరగతినుంచి ఎనిమిదో తరగతిదాకా ఆయన మాకు సోషల్ స్టడీస్ చెప్పారు. ఆ తర్వాత తొమ్మిది, పది తరగతుల్లో సి.ఎస్.ఎన్ గారనే మరొక మాష్టారు మాకు సాంఘికశాస్త్రాలు బోధించారు.
ఆ నా పసితనంలో తాడికొండలో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడూ నన్ను గాఢంగా ప్రభావితం చేసినవారేగాని, నలుగురు ఉపాధ్యాయుల్ని మాత్రం ప్రత్యేకంగా పేర్కోవాలి. మొదటిది, మా ఆర్ట్ మాష్టారు వారణాసి రామ్మూర్తిగారు. ఆయన నా మీద ఎందుకంత వాత్సల్యం కురిపించేరో నాకిప్పటికీ తెలియదు. ఆ చిన్నతనంలో తల్లిదండ్రులకు దూరంగా ఉన్న నాకు ఆయనే అమ్మ, ఆయనే నాన్న. అందుకనే మా అమ్మా, నాన్నా ఇద్దరూ వెంటవెంటనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, మా మాష్టారే తిరిగి మళ్ళా చిత్రకళ రూపంలో నన్ను ఆదుకున్నారు. మరొక మాష్టారు రాళ్ళబండి కృష్ణమూర్తిగారు. ఆర్.కె.ఎం అనేవాళ్లం ఆయన్ని. ఆయన నాకు మోనో యాక్షన్ గురువు. ఆ రోజుల్లో తాడికొండ స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా నా మోనో యాక్షన్ ఒక తప్పనిసరి ఈవెంట్. అదంతా ఆయన దర్శకత్వంలో, పర్యవేక్షణలో జరిగేది. ఇక మిగిలిన ఇద్దరు ఉపాధ్యాయులూ, ఒకరు వెంకట రత్నం గారు మరొకరు హీరాలాల్ మాష్టారు. వెంకట రత్నంగారి వల్ల నా సామాజిక చైతన్యానికి ఒక దిశానిర్దేశం దొరికింది. హీరాలాల్ గారి వల్ల నా సాహిత్య వ్యాసంగానికొక మార్గం దొరికింది.
ఎక్కడో అడవుల్లో చిన్న గిరిజన గ్రామంలో పుట్టిపెరిగిన నాకు మాష్టారి వల్లనే విస్తృతప్రపంచం పరిచయమయ్యింది. ఆయన మాకు చెప్పిన చదువు పాఠ్యపుస్తకాలకు పరిమితమైంది కాదు. నిజానికి ఆయన తరగతిగదిలో ఎప్పుడూ టెక్స్ట్ బుక్ తెరిచింది లేదు, పుస్తకం చూసి చెప్పింది లేదు. ఆయన మాకు జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనమిక్స్, సోషియాలజీ- ప్రతి ఒక్క సాంఘిక శాస్త్రాన్నీ పరిచయం చేసారు. మా వయసెంత, మా తరగతి ఏమిటి లాంటివాటితో ఆయనకు నిమిత్తం లేదు. కొన్నిసార్లు మా స్థాయికి దిగివచ్చి చెప్తున్నట్టు కనిపిస్తూనే మమ్మల్ని తన స్థాయికి తీసుకుపోయేరు.
ఆ పసితనంలో ఆయన నా హీరో. ఒకసారి ఆయనకు జ్వరం వచ్చి రెండుమూడురోజులు స్కూలుకి రాలేదు. ఆ రెండుమూడు రోజులూ నేను ఆయనకోసం ఎంత ఎదురుచూసేనో చెప్పలేను. తీరా ఆయన స్కూలుకి రాగానే పరుగెత్తుకుని వెళ్ళాను. వెళ్ళి ఏం చెప్పాలని? ఏం మాట్లాడాలో తెలీదు. ఆయన్నే చూస్తూ ఉన్నాను. ఆయన నన్ను చూస్తూనే ‘హౌ డు యు డు’ అంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగేయి.
ఆయన పాఠం చెప్పే తీరు చాలా ప్రత్యేకంగా ఉండేది. క్లాసులోకి రాగానే మొదటి అయిదు నిమిషాలు జీరో అవర్ అనే వారు. అసెంబ్లీలో జీరో అవర్ లో ఎవరేనా ఏదేనా ప్రస్తావించవచ్చుననీ, అలాగే మేము కూడా ఏదన్నా అడగొచ్చనీ అనేవారు. అప్పుడు ఎవరో ఏదో ప్రశ్న అడిగేవారు. అంతే, ఆ ప్రశ్న ఏదేనాగానీ, ఆయన జవాబిస్తున్నట్టే ఉండి, ఆ రోజు తాను చెపాలనుకున్న పాఠంలోకి మమ్మల్ని తీసుకుపోయేవారు. క్లాసు అయిపోయినట్టు బెల్లు మోగేదాకా మాకు మరేమీ తెలిసేది కాదు.
తాడికొండ రాకముందూ, అక్కణ్ణుంచి వెళ్ళిపోయేకా కూడా ఆయన జిల్లా పరిషత్తు హైస్కూళ్ళలో పనిచేసారు. కాని నా వరకూ ఆయన ఒక యూనివెర్సిటీ ప్రొఫెసరుగానే కనిపిస్తారు. ఆయన దగ్గర చదువుకున్నాక, నాకు ఇక ఏ యూనివెర్సిటీలోనూ చదువుకోవలసిన అవసరం లేకపోయింది. లేకపోతే, ఎవరు చెప్తారు, ఆరో తరగతి పిల్లలకి భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి? ‘వియ్ ద పీపుల్ ..’ అంటో ఆ ప్రియాంబుల్ లోని ప్రతి ఒక్క పదం, ప్రతి ఒక్క వాక్యం ఆయన వివరించిన తీరు ఎలాంటిదంటే ఆ రోజే మాకు ఆ ప్రవేశిక మొత్తం కంఠతా వచ్చేసింది. ప్రియాంబుల్ ముద్రించి ఉన్న ఒక పెద్ద చార్టు నా చేతికిచ్చి దాన్ని ఎక్స్ ప్లెయిన్ చెయ్యమనేవారు. Justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity లాంటి భావనల్ని నా పసినోటితో వివరిస్తుంటే వింటూ మురిసిపోయిన ఆ ఔదార్యానికి నేను జీవితకాల ఋణగ్రస్తుణ్ణి. గత యాభై ఏళ్ళుగా ప్రతి ఒక్క పాఠశాలలోనూ, ప్రతి ఒక్క సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడూ పిల్లలకి రాజ్యాంగ ప్రవేశికని అలా వివరించి ఉంటే, ఈ రోజు దేశముఖచిత్రం ఇలా ఉండి ఉండేది కాదు కదా!
ఆయన వల్లనే నాకు యూరప్ చరిత్ర తెలిసింది. ఫ్రెంచి, అమెరికన్, రష్యన్ విప్లవాల గురించి తెలిసింది. నేనొక రోజు మా స్కూలు అసెంబ్లీలో శ్రీ శ్రీ దేశచరిత్రల గురించి మాట్లాడితే ఆ మధ్యాహ్నం డైనింగ్ హాల్లో నా పక్కన కూచుని ‘ఎక్కడ సంపాదించావు ఆ కవిత, మార్క్సిజం మొత్తం కూరిపెట్టాడు దాంట్లో’ అని అన్నారు. మార్క్సిజం అనే మొదట, అదిగో, అలా మొదటిసారి ఆయన నోటివెంట విన్నాను.
గ్రీసు, రోమ్‌ల చరిత్ర గురించి ఆయన ద్వారానే తెలిసింది. పెరిక్లిజ్ గురించీ, ప్లేటో రిపబ్లిక్ గురించీ ఆయన దగ్గరే విన్నాను. సుమేరు గురించీ బేబిలోన్ గురించీ ఆయన చెప్తేనే తెలిసింది. టాగోర్ గీతాంజలి పుస్తకాన్ని ఆయనే మొదటిసారి మాకు చూపించింది. ఆయన మాకు రోమ్ చరిత్ర గురించి చెప్తున్నప్పటి ఒక ముచ్చట. ఆయన పాఠాలు చెప్పేక, రోమ్ గురించి మా లైబ్రరీలో ఏం పుస్తకాలున్నాయా అని వెతికేను. Ancient Rome అనే పుస్తకం దొరికింది. అది పిల్లలకోసం రాసిన ఒక ఇలస్ట్రేటెడ్ బుక్. ఆయన మాకు చెప్పినదానికన్నా అదనంగా ఆ పుస్తకంలో ఏమీ లేదుగానీ, ఆ పుస్తకం నా చేతుల్లో ఉండగా ఆయన కంటపడ్డాను. ఆ నెలాఖరున యూనిట్ టెస్ట్ లో రోమ్ గురించి ఆయన అడిగిన ప్రశ్నలకు నేను రాసిన జవాబులు ఆ పుస్తకం చదివి రాసినవి అనుకున్నారు ఆయన. ఊహించగలరా? ఆ పేపరు ఆయన ఎలా దిద్దారో? ఆ ఆన్సరు షీటు పొడుగునా మార్జిన్ లో ఆయన మార్కులు కాదు, కామెంట్లు రాసారు. ‘ఇది ఎప్పుడు చదివావు? ఈ విషయాలు నాకు తెలీదే!’ అని ఒకచోట. ‘ఓహ్! చాలా బాగా రాసావు’ అని ఒకచోట. ‘ఈ విషయంలో నేను నీతో పూర్తిగా అంగీకరించలేకపోతున్నాను’ అని మరోచోట. అసలు, ఒక ఉపాధ్యాయుడు తన పిల్లవాడి ఆన్సరు షీటుని అలా దిద్దగలడని ఎవరేనా ఊహించగలరా?
మేం ఎనిమిదో తరగతిలో ఉన్నప్పటి మాట. అప్పుడు మా స్కూల్లో ఒక పానెల్ ఇన్స్పెక్షన్ జరిగింది. యూనివెర్సిటీ ప్రొఫెసర్లు, రీడర్లు ఆ పానెల్ సభ్యులు. నాకు తెలిసి అంతకుముందుగాని, ఆ తర్వాత గాని, ఒక హైస్కూలుకి ఒక యూనివెర్సిటీ బృందం పానెల్ ఇన్ స్పెక్షన్ రావడం నేనెప్పుడూ వినలేదు, కనలేదు.
ఆ ఇన్ స్పెక్షన్ లో భాగంగా, మా తరగతిలో వెంకట రత్నం మాష్టారి క్లాసు కూడా ఇన్ స్పెక్ట్ చేసారు. ఆ రోజు మాష్టారు సోషలిజం గురించి పాఠం చెప్పారు. ఆ ఏడాదే ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాలు మారేయి. ఆ కొత్త పుస్తకంలో సోషలిజం కూడా ఒక పాఠ్యాంశం. వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొ.కమలనాథన్ ఆ టెక్స్ట్ బుక్ కి సంపాదకులు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకి సోషలిజం లాంటి విషయాలు చెప్పడం చాలా అవసరం అని ఆ అంశాల్ని ఆయన టెక్స్ట్ బుక్ లో పొందుపరిచారుగానీ, ఉపాధ్యాయులూ, విద్యార్థులూ ఆ కొత్త సిలబస్ ని ఏ మేరకు అందుకోగలరనే సందేహం ఆయనకు ఉండనే ఉండింది. ఇంతకీ ఆ రోజు చిత్రమేమిటంటే, ఆ పానెల్ ఇన్ స్పెక్షన్ లో భాగంగా, వెంకట రత్నం మాష్టారి క్లాసు వినడానికి వచ్చిన బృందంలో కమలనాథన్ కూడా ఒకరు! ఆయన మాష్టారి క్లాసు ఆద్యంతం ముగ్ధుడైపోయి విన్నాడు. తాను ఆ పాఠ్యాంశాలు ప్రవేశపెట్టినందుకు గర్విస్తున్నానని చెప్పాడు. అదొక అపురూపమైన దృశ్యం. నాకు తెలిసి, అంతకు ముందు ఎలానూ జరగలేదు, కనీసం ఈ యాభై ఏళ్ళల్లో మళ్ళా అటువంటి సంఘటన మన పాఠశాలల్లో జరిగినట్టు నేను వినలేదు!
వెంకటరత్నం మాష్టారి వల్లనే మాకు క్విజ్ అంటే తెలిసింది. ఎప్పుడేనా నెలకొకసారి మొత్తం స్కూలు అంతటినీ అసెంబ్లీ గ్రౌండ్ లో కూచోబెట్టి అక్కడే ఒక నల్లబల్ల ఏర్పాటు చేసి ఆయన క్విజ్ నిర్వహించే దృశ్యాలు ఇప్పటికీ నా కళ్ళముందు కదలాడుతున్నాయి. ఆ క్విజ్ లో పిల్లల్తో పాటు క్విజ్ మాష్టర్ అని కూడా ఒక పార్టిసిపెంట్ ఉండేవాడు. ఏదన్నా ప్రశ్నకి ఎవరూ జవాబు చెప్పలేకపోతే తనే జవాబు చెప్పి ఆ మార్కులు క్విజ్ మాష్టరుకి వేసేవారు. కాని అలా క్విజ్ మాష్టర్ కి మార్కులు వెయ్యవలసి వచ్చినప్పుడల్లా ఆయన ఎంత బాధపడుతూ ఉండేవారని!
అలాగే మాక్ పార్లమెంట్ నడిపే సెషన్లు. ట్రెజరీ బెంచెస్, ఫైనాన్స్ బిల్, కాస్టింగ్ ఓట్, లీడర్ ఆఫ్ ద హౌజ్, లీడర్ ఆఫ్ అప్పొజిషన్ లాంటి పదాలు ఆ చిన్న వయసులోనే ఆయన మాకు పరిచయం చేసారు. ఆ తర్వాత నా ఉద్యోగ జీవితంలో ఇరవయ్యేళ్ళ పాటు అసెంబ్లీ సమావేశాలు చూస్తూ వచ్చినప్పుడల్లా ఆయన చిన్నప్పుడు చెప్పిన పాఠాలు గుర్తు రాని రోజు లేదంటే అతిశయోక్తి కాదు.
నేను తరచు చెప్తుంటాను, నేనొక trained orator ని అని. గుంటూరుజిల్లాలో ఎక్కడ ఏ వక్తృత్వ పోటీ జరిగినా అక్కడికి నన్ను తీసుకుపోయేవారు ఆయన. ఆయన వల్లనే ఎలక్యూషన్, డిబేటింగ్ ల్లో నాకు శిక్షణ దొరికింది. ఆ రోజుల్లో గుంటూరు జిల్లాలో ఎలక్యూషన్ పోటీలు మామూలుగా ఉండేవి కావు. వందలకొద్దీ పిల్లలు పార్టిసిపేట్ చేసేవారు. కొన్నిసార్లు మరీ చిత్రంగా ఉండేది. నీ ముందు పిల్లవాడు మాట్లాడటానికి హాల్లోకి వెళ్ళినప్పుడు నిన్ను పక్కగదిలోకి పిలిచి నీ చేతికొక స్లిప్పు అందించేవారు. నువ్వు దేనిమీద మాట్లాడాలో ఆ స్లిప్పు మీద రాసి ఉండేది. నువ్వు ప్రిపేరవడానికి మూడు నిమిషాలు మాత్రమే టైము ఉండేది. అంటే నీ ముందు పిల్లవాడు ఆ హాల్లో మాట్లాడు తున్నంతసేపే అన్నమాట. నీ వక్తృత్వ ప్రావీణ్యానికి అది నిజంగా పరీక్ష. ఒకసారి ‘మద్యపాన నిషేధం’ గురించి పోటీ. మద్యపాన నిషేధం మంచింది అని కదా మాట్లాడాలని ప్రిపేరవుతాం. తీరా ఆ పక్కగదిలోకి నన్ను తీసుకువెళ్ళి నా చేతిలో పెట్టిన స్లిప్పులో ‘మద్యపాన నిషేధం మంచిది కాదు’ అని రాసి ఉంది. నా ఆలోచనలు మొత్తం స్తంభించిపోయాయి. ఏం మాట్లాడేనో గుర్తులేదు. కాని నాకు మొదటి బహుమతి వచ్చింది. అప్పటి గవర్నరు శారదాముఖర్జీగారి చేతులమీదుగా బహుమతి అందుకున్నాను. నా పక్కన వెంకట రత్నం మాష్టారు లేకపోయుంటే అది నాకు సాధ్యం అయి ఉండేది కాదని మాత్రం నిశ్చయంగా చెప్పగలను.
సమాచారం, పరిజ్ఞానం, పోటీతత్త్వం-ఇవి కాదు ఆయన్నించి నేను నేర్చుకున్నవి. మాకు ఫ్రెంచి విప్లవం గురించి చెప్తూ, Liberty, Equality, Fraternity అనే మూడు పదాలు పరిచయం చేసారు ఆయన. అవి నాలాంటి వాళ్లందరికీ మంత్రాలుగా మనసులో ముద్రపడిపోయాయి. నువ్వొక స్వతంత్ర వ్యక్తిగా ఎదగాలి, నిర్భయుడివిగా ఉండాలి, నీతోటి మనుషులకన్నా అధికుడివీ కావు, అల్పుడివీ కావు- ఇవీ ఆయన మాకు నూరిపోసిన చదువు. తర్వాత రోజుల్లో నేను నాగార్జున సాగర్ లో ఇంటర్ చదువుతున్నప్పుడు ఎవరో ఆయనతో నా మీద ఏదో ఫిర్యాదుగా చెప్పారట. మీ శిష్యుడు ఎవరి మాటా వినడు, తలపొగరు లాంటిమాటలేవో. ఆయన అన్నారట, ‘మా వాడికి నేను ఫ్రెంచి విప్లవం గురించి పాఠాలు చెప్పాను. స్వతంత్రుడిగా ఎదగమన్నాను, ఎవరికీ తలవంచొద్దని చెప్పాను. మీరు ఇండిపెండెన్స్ కీ, యారొగెన్స్ కీ తేడా తెలుసుకోండి’ అని.
ఆ సాయంకాలం తెనాలిలో మాష్టారి ఇంటికి వెళ్ళినప్పుడు ముందు చూసింది ఆ పుస్తకాల అల్మైరానే. సాధారణంగా మనకు ఎలిమెంటరీ స్కూల్లో, హైస్కూల్లో పాఠాలు చెప్పిన టీచర్లు ఆ చిన్నవయసులో మనకి గొప్ప పండితులుగా కనిపించినవారు, ఆ తర్వాత రోజుల్లో అక్కడే ఆగిపోయినట్టుగా, వాళ్ళకన్నా మనం ఎంతో దూరం ముందుకు వచ్చేసినట్టుగానూ అనిపించడం పరిపాటి. కాని హీరాలాల్ మాష్టారి దగ్గర చూసాను, ఆ రోజు మళ్ళా వెంకట రత్నం మాష్టారి దగ్గర చూసాను, వాళ్ళు ఇప్పుడు అంటే యాభై ఏళ్ళ తరువాత కూడా నాకన్నా ఒక యోజనం ముందే ఉన్నారు. ఇన్నేళ్ళుగా ఎంతో చదివాననీ, ఎన్నో తెలుసుకున్నాననీ అనుకుంటున్న నాకన్నా ఎంతో ముందుకి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ పోతోనే ఉన్నారు. లేకపోతే, ఆ పుస్తకాల అల్మైరాలో, సగం పుస్తకాలు నేను చదవనివీ, చాలా పుస్తకాలు నాకు తెలీనివీ కూడా ఉండటమేమిటీ! ఎన్నో పుస్తకాలు నిన్నా మొన్నా విడుదలైనవి కూడా అక్కడ కనిపించాయి. అంటే ఆయన అంత అప్-టు-డేట్ గా ఉన్నారన్నమాట!
నేను తాడికొండలో ఉన్నప్పుడు ఆయన చేతుల్లో ఎప్పుడూ Time మాగ్ జైన్ ఉండేది. ఆ రోజుల్లో అది ఒక ఎడిషన్ పాతిక రూపాయలు ఉండేదన్నట్టు గుర్తు. అలా ప్రతి వారం టైమ్ మాగజైన్ కొత్త పత్రిక చేతుల్లో కనిపించే మనిషి మళ్ళా నాకెవరూ తారసపడలేదు.
ఇప్పుడూ అలానే ఉన్నారు. ‘నీకేం పుస్తకాలు కావాలో తీసుకో’ అన్నారు. నేను చూస్తూ ఉన్నాను. ‘ఇదుగో ఈ పుస్తకం చదువు’ అని Thomas Piketty రాసిన Capital in the Twenty-First Century(2017) చేతిలో పెట్టారు. దాదాపు 800 పేజీల పుస్తకం. ఆ రచయిత రాసిన మరో పుస్తకం Nature, Culture, and Inequality కూడా ఆ రోజు ఆ అల్మైరాలో చూసినట్టున్నాను. ‘ఆ రెండు పుస్తకాలూ చదివేసాను. ఈ పుస్తకం నువ్వు చదువు, మారుతున్న ప్రపంచంలో కాపిటల్ స్వరూప స్వభావాలు ఎలా మారుతున్నాయో వివరంగా చెప్పాడు’ అన్నారు. Thomas Piketty ఒక ఫ్రెంచి ఎకనమిస్ట్. యాభై ఏళ్ళ కిందట ఫ్రెంచి విప్లవం గురించి చెప్పిన ఉపాధ్యాయుడే మళ్ళా ఈ ఫ్రెంచి ఎకనమిస్ట్ నీ పరిచయం చేస్తున్నాడు!
మాష్టారికీ, మాష్టారి శ్రీమతికీ పాదాభివందనం చేసాను. ‘ఈ రోజు నేనింత అన్నం తింటున్నానంటే మాష్టారే కారణం’ అన్నాను ఆమెతో. ఎప్పుడూ చెప్పేమాటనే, ఎన్నిసార్లు చెప్పుకున్నా ఋణం తీరని మాటనే.
22-10-2024
I wish I took advantage of being his student in those days. Nevertheless he showed me how to question and how to let imagination fly. In fact, he made us think about us in relation to the larger world we lived in. Btw, he is very proud of you, for the person you became. He told that he will leave his library for both of us 😀
Thank you for reading this. He is our mentor in the truest sense.
ఒళ్లు పులకరింపు కొనసాగింది చదువుతున్నంత సేపు. ఒక మంచి ఉపాధ్యాయుడి పాత్రకు ఆయన నిలువెత్తు రూపమైతే , ఒక ఆదర్శ శిష్యుడికి అచ్చమైన ఆనవాలు మీరు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి సన్నివేశము కనులముందు స్కెచ్ లతో డెమో చూపుతూ పాఠం చెప్పినట్టున్నది. తక్షణం ఎవరైనా ఈ వ్యాసం గురించి అడిగితే 80 శాతం విషయాలు ఏకబిగిన చెప్పగలను. 50 శాతం ఎప్పుడైనా చెప్పగలను. అది మీ రచనా సంవిధానం విశిష్టత.1979 కాగజ్ నగర్ శిశుమందిర్ హైస్కూల్ వార్షికోత్సవ సంచికలో సదాశివగారి ముఝే మెరే దోస్తోంసే బచావ్ వ్యాసం ఇచ్చిన థ్రిల్లు మళ్లీ ఇప్పుడిచ్చింది. దానిక్కారణం ఆ వ్యక్తుల గొప్పతనం, గొప్పతనాన్ని తెలిపిన మీ వైనం. నేను ఎప్పుడు స్పందించినా కొంత వివశుడనవటం మామూలే. కానీ ఇలాంటి ఉపాధ్యాయుల గురించి నేటి తరం ఉపాధ్యాయులు నేర్వవలసింది ఎంతో ఉంది. అది మీ ద్వారా వారికి అందాలని మీ గురువులకూ మీకూ నమస్కరిస్తు ముగిస్తున్నాను.
మీ స్పందన నాకెప్పుడూ 1000 కిలోవాట్ల విద్యుత్ అందిస్తుంది.
ఆచార్య దేవోభవ అని మనసా వాచా కర్మణా మీ పసితనం లోనే నమ్మారు.. ఆ లక్షణాలు వారి నుండి మీకు సంప్రాప్తించాయి.. అందుకే మీ నిరాడంబరత. తనువు పులకరించింది ఈ రోజు మీరు రాసిన ఈ మీ వెంకట రత్నం మాష్టారు చదువుతుంటే 🙏
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
ఎంతో ఆదర్శవంతమైన మీ జీవిత ప్రయాణానికి ఇరుసు ఏమిటా అనుకునే వాణ్ణి.ఇదిగో ఈరోజుతో తేటతెల్లం అయింది.ఎంత గొప్ప అదృష్టవంతులు కదా మీరు అలాంటి మాస్టారు దొరకడం..
ఈ వ్యాసం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు చదవాల్సి వుంది.
ఈ ఉదయాన్ని పూర్ణోదయాన్ని చేశారు.
నమస్తే🙏💐
ధన్యవాదాలు సురేష్! ఆరోజు సమావేశంలో మీ తాసిల్దార్ మిత్రుడు (ఆయన పేరు హరికృష్ణ నా?) భారత రాజ్యాంగ ప్రవేశిక అప్పజెప్పినప్పుడు నాకు మా మాస్టారే గుర్తొచ్చారు
ఆ కృతజ్ఞత వెలకట్టలేనిది
స్ఫూర్తి వంతం గా ఉంది సార్
ధన్యవాదాలు గోపాల్!
“కొన్నిసార్లు మా స్థాయికి దిగివచ్చి చెప్తున్నట్టు కనిపిస్తూనే మమ్మల్ని తన స్థాయికి తీసుకుపోయేరు.”
పతాక స్థాయి అనుభూతికి అద్దం!
అభినందనలు, సర్.
ధన్యవాదాలు రామ్ భాస్కర్!
1.పసితనంలో ఆయన నా హీరో. ఒకసారి ఆయనకు జ్వరం వచ్చి రెండుమూడురోజులు స్కూలుకి రాలేదు. ఆ రెండుమూడు రోజులూ నేను ఆయనకోసం ఎంత ఎదురుచూసేనో చెప్పలేను. తీరా ఆయన స్కూలుకి రాగానే పరుగెత్తుకుని వెళ్ళాను. వెళ్ళి ఏం చెప్పాలని? ఏం మాట్లాడాలో తెలీదు. ఆయన్నే చూస్తూ ఉన్నాను. ఆయన నన్ను చూస్తూనే ‘హౌ డు యు డు’ అంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగేయి.
2. వివరించిన తీరు ఎలాంటిదంటే ఆ రోజే మాకు ఆ ప్రవేశిక మొత్తం కంఠతా వచ్చేసింది. ప్రియాంబుల్ ముద్రించి ఉన్న ఒక పెద్ద చార్టు నా చేతికిచ్చి దాన్ని ఎక్స్ ప్లెయిన్ చెయ్యమనేవారు. Justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity లాంటి భావనల్ని నా పసినోటితో వివరిస్తుంటే వింటూ మురిసిపోయిన ఆ ఔదార్యానికి నేను జీవితకాల ఋణగ్రస్తుణ్ణి.
3.గత యాభై ఏళ్ళుగా ప్రతి ఒక్క పాఠశాలలోనూ, ప్రతి ఒక్క సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడూ పిల్లలకి రాజ్యాంగ ప్రవేశికని అలా వివరించి ఉంటే, ఈ రోజు దేశముఖచిత్రం ఇలా ఉండి ఉండేది కాదు కదా!
4.ఆయన అడిగిన ప్రశ్నలకు నేను రాసిన జవాబులు ఆ పుస్తకం చదివి రాసినవి అనుకున్నారు ఆయన. ఊహించగలరా? ఆ పేపరు ఆయన ఎలా దిద్దారో? ఆ ఆన్సరు షీటు పొడుగునా మార్జిన్ లో ఆయన మార్కులు కాదు, కామెంట్లు రాసారు. ‘ఇది ఎప్పుడు చదివావు? ఈ విషయాలు నాకు తెలీదే!’ అని ఒకచోట. ‘ఓహ్! చాలా బాగా రాసావు’ అని ఒకచోట. ‘ఈ విషయంలో నేను నీతో పూర్తిగా అంగీకరించలేకపోతున్నాను’ అని మరోచోట. అసలు, ఒక ఉపాధ్యాయుడు తన పిల్లవాడి ఆన్సరు షీటుని అలా దిద్దగలడని ఎవరేనా ఊహించగలరా?
5.నువ్వొక స్వతంత్ర వ్యక్తిగా ఎదగాలి, నిర్భయుడివిగా ఉండాలి, నీతోటి మనుషులకన్నా అధికుడివీ కావు, అల్పుడివీ కావు- ఇవీ ఆయన మాకు నూరిపోసిన చదువు.
6.‘ఈ రోజు నేనింత అన్నం తింటున్నానంటే మాష్టారే కారణం’ అన్నాను.
ఇది చదివాక మేరుపర్వతమై పోయారు. కన్నులు విప్పార్చి మీ రూపాన్ని తలుచుకుంటే ఆనందమృత వర్షం .కన్నులవెంట.
ఒక్కో పదం ఒక్కో అమృత గుళిక.
ఇప్పుడు నాకు సంగీతం అబ్బలేదనే దిగులేపోయింది. అనంత రాగాలు గట్టిగా పాడుతున్నాను. నమోనమః
ధన్యవాదాలు మేడం
Touching….
ధన్యవాదాలు
నాకు చదువుతున్నట్టు లేదు కళ్ళముందు సాక్షాత్కారం అయింది .మంచి మాస్టారు విద్యార్ధి జీవితంలో పెంపొందించే జ్ఞానం ఆ పిల్లాడి లైఫ్లో ఎంతో మార్పు తీసుక వస్తుంది .ఆ విధంగా తాడికొండ మీకు కొండంత అండ.మీరు రాసిన రచనల నుండి ఇంతో అంతో స్పూర్తి పొందుతున్న మాకు మీరు వెంకటరత్నం మాస్టారు .లేకపోతే మార్కస్ అరీలియస్ మెడిటేషన్స్ తెలుగులో అంత మంచి అనువాదం చదివి ఉండేవాళ్ళం కాదు .ఒకసారి మొత్తం చదివినా ..రోజూ పుస్తకం తెరచి ఏ ఒక్క అధ్యాయం చదివినినా మన వ్యక్తిత్వ ఎదుగుదలకు ఎంతో మేలుచేస్తుంది .అలా మీ నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటున్నాం .మీ కుటీరం మాకు ఓకే గ్రంధాలయం 🙏.
ధన్యవాదాలు సార్
Feeling blessed…
ధన్యవాదాలు
సార్ టైపింగ్ మిస్టేక్ .మీ కుటీరం మాకు ఒక గ్రంధాలయం 🙏.
మధురం.. మధురాక్షరం.. మీ ప్రతి వాక్యమూ చదివినా వాడికి తన స్కూలు టీచర్లు గుర్తుకు వస్తారు. నాకు కూడా. అందులోనూ బందరు స్కూల్స్.. ఎంతోమంది మహా మహా మేధావులు.. పిల్ల పట్ల ఆప్యాయత.. మాత్రమే కాదు. వాళ్ళలో ప్రతిభను గుర్తించి ఆనందించే మాస్టర్లు. గొప్ప స్పందన సర్.
ధన్యవాదాలు సార్
Excellent narration about our great Social Studies Teacher and motivator. He taught us all the three years 75-77 and participated in many mock UNO assembly, Parliament sessions. I appreciate china Veera Bhadrudu for reminding our childhood memories. I salute Venkata Ratnam Sir for inspiring me and motivating me.
చాలా సంతోషం. మీరు ఇది చదివినందుకూ! స్పందించినందుకూ!
I hated Social Studies; it didn’t make any sense to me. Geography, history, civics- they all seemed no more than some dry facts. Well, until I attended to Venkatratnam garu’s class.
Having moved from a rural Upper Primary school to APRST in my 8th grade, sitting through Venkatratnam garu’s social studies class was a total culture shock to me. I was puzzled when he walked into the classroom with a globe and a bunch of large rolled maps. Suddenly Social Studies made sense, it’s more than a bag of dry facts 🙂
My humble salutes to Venkatratnam garu!
Thank you so much!
It is a wonderful narration.
All three years we were taught social studies by CSN sir.
But we know sir very well and participated in quiz competitions.
I still remember one quiz urgent.
The question was in Tanjore, there is a library which contains only తాళపత్ర గ్రంధములు.
What is the name of the library.
Bhadrudu was quick to get up and answer Saraswati Mahal.
Sri Heeralal garu used to teach us Hindi and always used to focus to motivate keast merited suddnga in the class.
We are so much fortunate to get an opportunity to study in that school and under such teachers
Thank you for reading this and for responding in such a nice manner!
Boss a very lively presentation. All the incidents are moving in front of my eyes just as fresh as they were in 1970s.
Yes He was a great teacher.He always tried to keep his students
On the top of the world. He inspired us in such a way that there was no inspirer like him for quite a longtime,until Bharani entered.
Very Very nice.
RAJENDRA PRASAD PVSS
Thank you so much for reading this and for your heartfelt response!
Excellent narration..thank u VCH for bringing old golden memories to live presentation
Thank you Boss!
Nice write up. You have taken me to my good olden days again. Thank you. Please continue your musings .
They will rejuvenate us.
Thank you Raja Sekhar! After a long time!
దృశ్యం చూస్తున్నట్లు ఉంది కానీ,చదువుతున్నట్లు లేదు సార్..మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులపై మీ గౌరవానికి పాదాభివందనాలు..మీరు అధికారిగా ఉన్న సమయంలో నేను ఉపాధ్యాయుడిగా పని చేసినందుకు గర్విస్తున్నాను🙏
ధన్యవాదాలు సార్!
వీరభద్రుడు గారూ ఎంత గట్టి పునాది! దానిపై ఎన్ని భవనాలు ! అలాంటి మాష్టార్లు లభించటం సుకృతం. చదువుతుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది! పులకరిస్తుంది! మీలో నిలిచిపోయిన ఆ మాష్టర్లందరికీ 🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు మేడం!