అవధూత గీత-2

భారతదేశాన్ని అర్థం చేసుకోవాలనుకునేవాళ్ళు, ముఖ్యంగా ఆధునిక చరిత్ర, సామాజిక శాస్త్రాల విద్యార్థులు భారతీయ సంస్కృతినీ, పూర్వగ్రంథాల్నీ, వివిధ రకాల ఆచారాల్నీ, సంప్రదాయాల్నీ పక్కనపెట్టి వర్గం, కులం, లింగం లాంటి ఒకటి రెండు ప్రాతిపదికలమీదనే అధ్యయనం చేస్తుంటారు. అలానే భారతీయ సామాజిక నిర్మాణాల్ని, అధికారవ్యవస్థల్నీ మార్చాలనుకున్నవాళ్ళు, ఆలోచనావిధానాల్లో సమూల పరివర్తన తేవాలనుకునేవాళ్ళూ అన్నిటికన్నా ముందు మతాన్ని పక్కనపెట్టి ముందుకుపోవాలనుకుంటారు. కాని ఈ ప్రయత్నాల్లో చాలావరకూ వారు ప్రజాసామాన్యాన్ని ఏ విధంగానూ ప్రభావితం చెయ్యలేకపోగా, చాలాసార్లు తాము ఏ ఆధికారికవ్యవస్థలతో, శక్తులతో తలపడుతుంటారో, చివరికి వారి లక్షణాల్నే తాము కూడా పుణికిపుచ్చుకుంటూ ఉంటారు. మరోవైపు అత్యధిక ప్రజాసమూహాల్ని ప్రభావితం చెయ్యగలిగిన సామాజిక, రాజకీయ శక్తులు  విస్తృత ప్రజా సమూహాల మీద ఆ ప్రభావాన్ని ఎలా నెరపగలుగుతున్నాయో వారికి అర్థం కాదు.

భారతదేశంలో సామాజిక, రాజకీయ పరివర్తనని కోరుకునేవాళ్ళూ, అత్యధిక సంఖ్యాకుల హితాన్నీ, సుఖాన్నీ కోరుకునేవారూ ముందు గమనించవలసిందేమంటే, గత అయిదువేల ఏళ్ళుగా ఈ దేశంలో ఎందరో ఈ ప్రయత్నమే చేస్తూ వచ్చారనీ, ఆ ప్రయత్నాల్లో భాగంగా ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చారనీ, వారు మనకన్నా నిస్వార్థులూ, మనకన్నా ఎక్కువ సత్యాన్వేషులూ, మనకన్నా ఎక్కువగా తోటిమనిషిని ప్రేమించినవారూ అని. ఇంకా చెప్పాలంటే మనం కొత్తగా చేస్తున్నామనుకునే ప్రయోగాలూ, ప్రయత్నాలూ, భాషలోనూ, కొన్ని భావనలలోనూ కొత్తవి కావచ్చు తప్ప, వాటి అంతస్సారంలో, అంతర్గత నిర్మాణాల్లో ఎంత మాత్రం కొత్తవి కావు. మనకన్నా ముందు యుగాల్లో జరిగిన ప్రయోగాలు, వాటి సాఫల్యవైఫల్యాల్ని మనం అర్థం చేసుకోగలిగితేనే మనం చేపట్టే ప్రయత్నాల్లో వైఫల్యాన్ని నివారించుకోగలుగుతాం.

ఉదాహరణకి భారతదేశ చరిత్రను నిరంతరవిదేశీ దండయాత్రల చరిత్రగా చూసే ఒక పద్ధతి ఉంది. కాని ఆ దృష్టి ఉపరితల వివరాల్ని పరిశీలించడానికి మాత్రమే పనికొస్తుంది. అలాకాక, భారతదేశ చరిత్రని విరుద్ధ, విభిన్న శక్తుల్నీ, ప్రభావాల్నీ, దృక్పథాల్నీ నిరంతరం సమన్వయం చేసుకునే చరిత్రగా చూడగలగడం మనకి ఎక్కువ ఉపకారి కాగలుతుంది. శతాబ్దాల తరబడి ఈ దేశంలో అమానుష వ్యవస్థలు ఎందుకు కొనసాగుతున్నాయో, ఆ అమానుషత్వాన్ని ఎప్పటికప్పుడు సవరించుకోడానికీ, సరిదిద్దుకోడానికీ ప్రజాబాహుళ్యాలు తమదైన సామాజిక-తాత్త్విక ప్రయత్నాలు ఎలా చేపడుతూ ఉన్నాయో పరిశీలించడం ఎక్కువ అవసరమనిపిస్తుంది.

మన పూర్వగ్రంథాలూ, దర్శనాలూ, దేవీదేవతలూ- ఏ ఒక్కటీ కూడా పైకి కనిపిస్తున్నట్టుగానో లేదా మనం భావిస్తున్నట్టుగానో పరలోకచింతనప్రధానంగా ప్రభవించినవి కావు. అలాగే అవన్నీ కూడా ఆధిపత్య వర్గాలు కింది కులాల్నీ, వర్గాల్నీ, జనసమూహాల్నీ నిరంతరం అణచిపెట్టడానికో, దోచుకోడానికో రాసినవి కావు. అంటే వాటిలో ఒకవైపు పీడక పార్శ్వం ఎంతగా ఉందో, విమోచన పార్శ్వం కూడా అంతగానూ ఉంది. నిజానికి ఏదో ఒక కాలంలో, ఏదో ఒక ప్రజాసమూహానికి, ఏదో ఒక రూపంలో ఆర్థిక-సామాజిక-రాజకీయ విమోచనను వాగ్దానం చెయ్యకుండా ఏ ఒక్క గ్రంథం, ఏ ఒక్క దేవుడూ, ఏ ఒక్క దేవతా, ఏ ఒక్క మంత్రం, ఏ ఒక్క తంత్రం కూడా మన చరిత్రలో ప్రవేశించలేదని మనం గ్రహించాలి. ఇప్పటి రాజకీయ పక్షాల మానిఫెస్టోల్లాగా వాటికి కూడా ఒక ఆశ్రిత వర్గం, ఒక వైరి వర్గం ఉన్నాయి. కాని ఆ ఆశ్రితులూ, ఆ అనాశ్రితులూ మాత్రం ఎల్లకాలాల్లోనూ ఒక్కరే కాదని మనం గుర్తుపెట్టుకోవాలి.

అంటే దాని అర్థం మత గ్రంథాలు పఠిస్తూ ఉండమనీ, మతవాదులుగా మారమనీ కాదు. భారతదేశ చరిత్రలో మతాలు పోషించిన పాత్ర ఇప్పుడు రాజకీయ పక్షాలు పోషించే పాత్ర లాంటిదని మనం తెలుసుకోగలిగితే చరిత్రలో వాటి స్థానాన్ని మరింత బాగా అర్థం చేసుకోగలుగుతాం.

భారత దేశ చరిత్రలో, తాత్త్విక పరిణామంలో ఏదో ఒక పక్షానికో, ఒక సమూహానికో ప్రాతినిధ్యం వహించే గ్రంథాలూ, రచయితలూ, సిద్ధాంతాలూ కోకొల్లలుగా కనిపిస్తాయి. అందులో ఆశ్చర్యం లేదు. కాని రెండు బలమైన దర్శనాల్నీ, లేదా పరస్పర విరుద్ధంగా ఉండే జీవితదృక్పథాల్నీ సమన్వయపరిచే ప్రయత్నం ఎవరు చేస్తారో వారికి భారతదేశం పెద్దపీట వేసింది. భారతీయ చరిత్రలో ఆ రచనల్నే, ఆ బోధల్నే మైలురాళ్ళుగా గుర్తుపెట్టుకుంది. అత్యధిక ప్రజానీకాన్ని అటువంటి సమన్వయకారులు మాత్రమే దీర్ఘకాలం పాటు ప్రభావితం చెయ్యగలిగారు.

ఉదాహరణకి, మానవ చరిత్రలో, చరిత్రయుగం మొదలుకాడానికి ముందు వేల ఏళ్ళ పాటు రాతియుగాల సంస్కృతులు వర్థిల్లాయి. ఆ కాలంలో ఆదిమానవుడికి భూమీ, ఆకాశమూ వేరువేరు కావు. కాని చరిత్ర యుగం మొదలుకాగానే కాంస్యయుగాల ఇతిహాసాల్లో భూమీ, ఆకాశమూ వేరుపడటమేకాక, ఆకాశదేవతలు పృథ్వీదేవతల్ని అణచిపెట్టే క్రమం కూడా మొదలయ్యింది. ప్రాచీనకాలంలో వాయవ్య భారతదేశంలో తొలివేదకాలం మొదలైనప్పుడు, వైదిక ఋషులు అలా అకాశాన్నీ, భూమినీ పరస్పర విరుద్ధ ద్వంద్వంగా చూడకుండా, భూమీ, అంతరిక్షమూ, ఆకాశమూ అనే త్రిలోకాలతో కూడిన cosmology ని నిర్మించుకున్నారు. ఆ ఋషులు భారతదేశానికి చెందినవారా, బయటినుంచి వచ్చినవారా అన్న వాదాన్ని పక్కనపెట్టి మనం చూడవలసిందేమంటే, ఈ మూడులోకాల కాస్మాలజిని సంభావించడం భారతదేశానికి మాత్రమే సాధ్యమయిందని. ఎందుకంటే ఋగ్వేదానికి అత్యంత సన్నిహితమని చెప్పే అవెస్తాలో మూడులోకాల్లేవు.

వైదిక ఋషి దృష్టిలో పరమసత్యం కేవలం భూమికి చెందినది కాదు. అంటే కేవలం matter కాదు. అలానే కేవలం ద్యులోకానికి చెందిందీ కాదు. అంటే కేవలం spirit కాదు. ఆ రెండూ పరస్పరం మిలనమయ్యే ఒక dynamic principle గా అతడు పరమసత్యాన్ని దర్శించాడు.

పాదార్థిక ప్రపంచాన్ని, భావనామయ ప్రకాశాన్ని  అంతరిక్షమనే ఒక రససేతువుద్వారా ఋగ్వేదం సమన్వయం చేయడానికి ప్రయత్నించింది. కాని తర్వాత రోజుల్లో బ్రాహ్మణాలు దాన్ని ఒక క్రతువుగా మారుస్తూ, ఆ క్రమంలో ఒక organized hierarchy ని ప్రతిష్ఠించే ప్రయత్నం చేపట్టగానే దాన్ని ప్రశ్నిస్తూ ఉపనిషత్తులు ముందుకొచ్చాయి.

వేదాలకు పూర్వకాలం నుంచీ ఈ దేశంలో యోగమార్గం ఉంది. ఉపనిషత్తులు వేదాల్లోని యాగలక్ష్యాల్ని యోగమార్గంతో సమన్వయించే ప్రయత్నం చేసాయి. ఉదాహరణకి, అందుకనే ఆ పరమసత్యం ఎలా ఉంటుంది అని ప్రశ్నించినప్పుడు బృహదారణ్యక ఉపనిషత్తు ఇలా జవాబిచ్చింది:

తస్య హైతస్య పురుషస్య రూపమ్. యథా మహారజనమ్ వాసః, యథా పాండ్వావికమ్, యథేంద్రగోపః, యథాగ్న్యర్చిః, యథా పుండరీకమ్,యథా సకృద్విద్యుత్తమ్, సకృద్విద్యుత్తేవ హ వా అస్య శ్రీర్భవతి య ఏవమ్ వేద-(2-3-6)

(ఆ పరమపురుష స్వరూప రూపం ఇటువంటిది: అది పసుపు అద్దిన వస్త్రంలాంటిది, తెల్లని గొర్రె ఉన్నిలాంటిది, ఆరుద్రపురుగులాంటిది, అగ్నికీలలాంటిది, లేదా తెల్లని తామరపువ్వులాంటిది, లేదా మెరుపుతీగలాంటిది. ఆ రూపాన్ని ఎవరు తెలుసుకోగలుగుతారో అతడి శోభ విద్యుత్ కాంతి లాగా ఉంటుంది.)

ఇక్కడ మనం చూడవలసింది, పసుపు అద్దిన వస్త్రం, గొర్రెల ఉన్ని, ఆరుద్రపురుగులు, అగ్నికీలలు, శ్వేతపద్మాలూ, మెరుపులూ- ఇవేవీ కేవలం అకాశానికి చెందినవి కావు లేదా కేవలం పదార్థానికి చెందినవి కావు. అగ్నినే తీసుకోండి. పాదార్థిక ఇంధనం లేకుండా నిప్పుపుట్టదు. కానీ ఆకాశం నుంచి వాయుప్రసారం లేకుండా ఆ అగ్ని కీలపైకి రానేరాదు.

ఇక్కడ గమనించవలసిందేమంటే ఈ దర్శనం ఒక సౌందర్య దర్శనం. ఒక రసదృక్పథం. కంటిముందు కనిపించే ఒక దృశ్యంలో, తత్కాలీన phenomenon న్ని దాటి ఒక సార్వత్రిక సౌందర్యాన్ని, శాశ్వత సంజ్ఞని చూడటానికి ప్రయత్నించే ఒక అపురూప భావన. మనం ప్రధానంగా చెప్పుకునే పదకొండు ఉపనిషత్తులూ ఇటువంటి సమన్వయ శీలాన్నే చూపించాయి.

ఆ తరువాతిరోజుల్లో బ్రాహ్మణ, శ్రమణ మార్గాల్ని సమన్వయిస్తూ ఒక మధ్యేమార్గాన్ని ప్రతిపాదిస్తూ బుద్ధుడు ప్రభవించాడు. మరికొన్నాళ్ళకు బౌద్ధంలోని వ్యక్తివిముక్తిని అత్యధిక ప్రజానీకపు విముక్తి అవసరాలతో సమన్వయిస్తూ బోధిసత్త్వయానం ప్రభవించింది.

అలానే కర్మనిర్వహణకీ, కర్మ పరిత్యాగమనే సన్యాసానికీ మధ్య ఉన్న వైరుధ్యాన్ని సమన్వయిస్తూ శంకరాచార్యుడు అద్వైతాన్ని ప్రతిపాదించాడు. అద్వైతం బోధించే అంతిమసత్యం జ్ఞానం ద్వారా మాత్రమే చేరుకోగలిగేది కావడం వల్ల దానికీ, తిరిగి అత్యధిక ప్రజానీకపు ఆధ్యాత్మిక అవసరాలకూ మధ్య లంకె కుదురుస్తూ రామానుజులు విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించాడు. ఆయన చూపిన దారిలో వికసించిన భక్తిఉద్యమాలు శైవ, వైష్ణవ ప్రభావంలో సగుణ మార్గంగానూ, ఇస్లాం ప్రభావంతో నిర్గుణ మార్గంగానూ చీలిపోయినప్పుడు ఆ రెండింటినీ సమన్వయపరుస్తూ కబీరు కవిత్వం చెప్పాడు. 

తిరిగి ఆధునిక యుగంలో పాశ్చాత్య ప్రభావంతో బ్రహ్మసమాజం విగ్రహారారాధని తిరస్కరించినప్పుడు, ఆ దర్శనాన్ని అత్యధిక ప్రజానీకపు ఆధ్యాత్మిక అవసరాలతో సమన్వయిస్తూ టాగోర్ సాహిత్యం సృష్టించాడు.

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. విస్తృత భారతదేశమంతటా వైదిక, శ్రమణ, బౌద్ధ, జైన, హిందూ, మహ్మదీయ, పార్శీ, క్రైస్తవ, చార్వాక, లోకాయత సంప్రదాయాలు పరస్పరం సంఘర్షిస్తున్నప్పుడల్లా వాటిని సమన్వయపరుచుకుంటూ ఎన్నో స్థానిక ఉద్యమాలు, దార్శనిక విప్లవాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఉదాహరణకి, చైతన్యుడు, బసవన్న, సూఫీలు. వాటన్నిటినీ మతపరంగా చూసి పక్కన పెట్టేయడం ఒక పద్ధతి. అలాకాక, వాటి వెనక ఉన్న సామాజిక-సాంస్కృతిక-దార్శనిక సమన్వయాల్ని అధ్యయనం చేయడం మరోపద్ధతి. నా వరకూ నాకు వీటిని, మరింత మరింత లోతుగా, చదవడంకోసం మరో నూరేళ్ళైనా బతకాలనిపిస్తుంది.

అయితే ఇలా సమన్వయించుకునే క్రమంలో ముఖ్య గ్రంథాలు, సంస్కర్తలు, సాధువులు, రెండు పరస్పర విరుద్ధ సంప్రదాయాల్ని సమన్వయించుకున్నట్టు మనకి పైకి కనిపిస్తుందిగానీ, నిజానికి వాళ్ల వాళ్ళ కాలాల్లో వాళ్ళు ఎన్నో సంప్రదాయాలతో సంఘర్షించి మరెన్నో సంప్రదాయాల నుంచి తామెంతో సంగ్రహించారనే చెప్పవలసి ఉంటుంది. ఉదాహరణకి బుద్ధుడు శ్రమణ, బ్రాహ్మణ జీవనవిధానాల్ని సమన్వయించుకున్నాడని చెప్పినప్పుడు అవి కేవలం రెండు సంప్రదాయాలు మాత్రమే అని అనుకోకూడదు. బుద్ధుడి కాలం నాటికి కనీసం 363 శ్రమణ శాఖలు ఉండేవని జె.ఎన్.మొహంతి (Classical Indian Philosophy, 2000) రాస్తాడు. వాళ్ళల్లో 180 శాఖలు క్రియావాదులట, 84 శాఖలు అక్రియావాదులట, 67 శాఖలు అజ్ఞానికులట, 32 మంది వైనయికులట!

ఏదేనా ఒక నూతన ఆలోచనా విధానాన్ని పరస్పర వ్యతిరిక్తమైన రెండు ఆలోచనల సమన్వయంగా మాత్రమే చూసే dialectic thinking కూడా నా దృష్టిలో ఒక రకంగా యాంత్రికపద్ధతినే. తన కాలం నాటి ప్రజానీకాన్ని ప్రభావితం చేసి, ఆ ప్రభావం దీర్ఘకాలం పాటు నిలిచి ఉండేలాంటి కృషి చేసిన,  గురువు లేదా ప్రవక్త లేదా సంస్కర్త లేదా తత్వవేత్త ఎవరేనా గానీ ప్రధానంగా syncretic గా ఉంటారు. అంటే వారు అనేక సంప్రదాయాలనుంచి తీసుకుంటారు, తిరిగి వారినుంచి అనేక సంప్రదాయాలు స్వీకరిస్తాయి.

ఇప్పుడు inclusive అనే మాటను ఎక్కువమంది ప్రయోగిస్తున్నారు. కానీ inclusive అనే మాట నా దృష్టిలో నిర్దోషం కాదు.  ఒక ప్రధాన స్రవంతి ఉందనీ,  అది తక్కిన చిన్న చిన్న స్రవంతులకు కూడా తన ప్రయాణంలో చోటు కల్పిస్తోందని అర్థం వచ్చే ఆ మాటలో కనిపించని ఒక hegemony ఉంది.

కానీ syncretism అటువంటిది కాదు. అందులో ఏది ప్రధాన స్రవంతినో, ఏది ఉపస్రవంతినో విడదీసి చూడలేము. అనేక స్రవంతులు మేళవించిన ఆ దృక్పథం దానికి అదే వీలైనన్ని పక్షాలకు అంగీకార యోగ్యంగా ఉండే నూతన దృక్పధంగా మారుతుంది.

అయితే రానురాను ఆ గురువుల అనుయాయులు ఆ syncretic లక్షణాన్ని మరుగుపరిచి వారిని కేవలం రెండు పరస్పర విరుద్ధమైన ప్రభావాల్ని సమన్వయ పరిచినవారిగానే గుర్తుపెట్టుకుంటారు, మనల్ని కూడా గుర్తుపెట్టుకోమంటారు. ఉదాహరణకి భగవద్గీత అటువంటి syncretic text. కాని తదనంతర కాలంలో  వేదాంత గ్రంథంగానే గుర్తుండిపోయింది.

కాని తమ అనుయాయులు చేసే అటువంటి ప్రయత్నాల్ని దాటి తమ syncretic  స్వభావాన్ని నిలబెట్టుకోగలిగిన దేవతలూ, యోగులూ, రచనలూ, చారిత్రిక వ్యక్తులూ భారతదేశంలో లేకపోలేదు. అటువంటి దేవతల్లో మొదట చెప్పుకోవలసింది శివుడి గురించి. ఋగ్వేద రుద్రుడు, అవైదిక పశుపతితో కలిసి యజుర్వేద శివుడుగా మారి, తదనంతరం తంత్ర సాహిత్యంలో సదాశివుడిగా పరిణమించి నిన్న మొన్నటి రామలింగ అడిగలార్, రమణ మహర్షి దాకా ఎంతమందిని కలుపుకుంటూ ప్రయాణించాడని!

అలానే అటువంటి రచనల్లో చెప్పుకోవలసింది లలితాసహస్రనామావళి. భారతీయ దర్శనాల్లో వేదాంతం పూర్తిగా వికసించాక, కుడి, ఎడమ మార్గాలు రెండింటినీ సమన్వయించుకుంటూ వచ్చిన రచన లలితా సహస్రనామ స్తోత్రం.  ఆ ఒక్క స్తోత్రాన్ని అర్థం చేసుకుంటే దాదాపు శైవ, వైష్ణవ, శాక్త దర్శనాల కీలక భావనలన్నీ మనకు పరిచయమైనట్టే. నలభై ఏళ్ళుగా చదువుతూ ఉన్నప్పటికీ ఆ నామాల్ని పూర్తిగా అర్థం చేసుకున్నానని చెప్పలేను. ఉదాహరణకి ‘సవ్యాపసవ్యమార్గస్థా’ అనే నామం చూడండి.  శేషేంద్రశర్మ ఎత్తిచూపినదాకా ఆ నామం అంతరార్థం నాకు తెలియలేదు. ఆ భావన అర్థమేమిటంటే, ఆమెని నువ్వు సవ్యమార్గంలోనూ చేరుకోవచ్చు, అపసవ్యమార్గంలోనూ చేరుకోవచ్చు అని. అంటే సమయాచారం, వామాచారం- రెండు దారుల్లోనూ- ఒకటి గొప్పదీ, మరొకటి తక్కువదీ అనే వాల్యూ జడ్జ్ మెంట్ కి అవకాశమివ్వని నామం అన్నమాట.

ఇక చారిత్రికంగా అటువంటి syncretism ని చూపగలిగినవాళ్ళల్లో మొదటివాడు అక్బర్. ఆయన స్థాపించిన దీన్-ఇ-ఇల్లాహి హిందూ, మహ్మదీయ, పారశీక, యూదీయ, క్రైస్తవ సంప్రదాయాలనుంచి విలువైన అంశాల్ని మేళవించుకున్న ఒక దర్శనం. అయితే ఆయన వాటి నుంచి స్వీకరించ గలిగాడు కానీ తన దర్శనాన్ని విస్తృత ప్రజానీకానికి అందజేయలేకపోయాడు.

మన కాలంలో మనకు తెలిసిన గొప్ప syncretic మహాత్మాగాంధి. ఆయనలో వైష్ణవ, జైన, బౌద్ధ, క్రైస్తవ, మహ్మదీయ అన్వేషణలు అపూర్వంగా సమ్మిళితమయ్యాయి. వాటి నుంచి ఆయన ఎంత తీసుకున్నాడో అంత పంచి పెట్టాడు కాబట్టే మతాలకీ, ప్రాంతాలకీ అతీతంగా అత్యధిక ప్రజానీకానికి చేరువ కాగలిగాడు.

అటువంటి syncretic presences ల్లో దత్తాత్రేయులు కూడా ఒకరని చెప్పడానికే నేనింత వివరంగా ఇదంతా చెప్పవలసి వచ్చింది.


Featured image: Bheema river, Ganagapur

24-10-2024

11 Replies to “అవధూత గీత-2”

  1. ఉహలు- ఊసులు - సంధ్య – ... జీవితం ఏమిటి అన్న ప్రశ్న కు.... సమాధానం వెతుకుతూ... సాగుతున్న జీవితం...
    Sandhya Yellapragada says:

    నమస్కారం.

    మళ్ళీ మళ్ళీ చదివి తర్కించుకోవాలి.
    కృతజ్ఞతలు

  2. శుభోదయం సర్.. వేల పాయల సంగమం..భారతీయ పారమార్థిక జ్ఞాన దర్శనం. విశేషాలను విశేషించింగా సూచించారు.

  3. rammohanthummuri – I am a writer, a poet, a head master, a fater, a husband, and a creative person. I primarily in telugu language.
    Thummuri says:

    అవధూత -1 లోని నానినేదనకు జవాబు ఇలా అనూహ్యంగా లభిస్తుందని అనుకోలేదు. మీది పూర్వజన్మ పుణ్య విశేషమే. మిమ్మల్ని చదవడం నాకు లభించిన అదృష్టవరం .

  4. మీ పరిచయభాగ్యం ఆ దైవం ఇచ్చిన గొప్ప వరం. అశాంతం ఇప్పటికి 6 సార్లు నెమ్మదిగా చదువుతూ వచ్చాను. తమరొక విజ్ఞానఖని. నాకు కూడా మీరు చెప్పే వాటిని చదవడం కోసం మరొక నూరేళ్లు బతకాలని ఉంది. మనఃపూర్వక నమస్సులు.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%