
పాతికేళ్ళుగా ఏదో ఒక పుస్తక ప్రచురణ సంస్థ నా పుస్తకాలు ముద్రిస్తూనే ఉంది. కాని ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళూ నా పుస్తకాల గురించి సరిగా పట్టించుకోలేకపోయాను. తీరా రిటైరయ్యేటప్పటికి నాకు పుస్తకాలు ముద్రించడం మీద ఆసక్తి కూడా పోయింది. అందుకని నా పుస్తకాలు వీలైనన్ని పి.డి.ఎఫ్ లుగా మార్చి నా బ్లాగులో అందరికీ అందుబాటులో పెడుతూ వస్తున్నాను.
అయితే ఈ ఏడాది నలుగురు ప్రచురణ కర్తలు నా పుస్తకాల్లో పదకొండు ముద్రించారు. అన్నీ లిమిటెడు ప్రచురణలే. వంద కాపీలకు మించని ముద్రణలే. వాటిలో అయిదు పుస్తకాలు మా బంధువులు శ్రీపాద లిటరరీ వర్క్స్ పేరిట ముద్రించారు. వారు పుస్తక ప్రచురణరంగానికి కొత్త. ఈలోపు 38 వ హైదరాబాదు బుక్ ఫెయిర్ మొదలుకావడంతో ఆ పుస్తకాలు ఎవరైనా ప్రచురణ కర్తల లేదా బుక్ సెల్లర్ల స్టాలులో పెడదామా అనుకున్నారు. కాని ఈలోపు రైటర్స్ స్టాల్లో ఒక టేబుల్ ఖాళీ అవడంతో ఆ టేబుల్ నాకు కేటాయించమని బుక్ ఫెయిర్ కమిటీ వారిని అడిగాను. వారు ఎంతో ఆదరంగా స్పందించి నాకూ, అనిల్ బత్తుల, కాకినాడకు చెందిన విజయ్ అనే యువరచయితకీ కలిపి ఒక స్టాలు కేటాయించారు.
స్టాలు నంబరు 360.
నలభయ్యేళ్ళ కిందట రాజమండ్రి బుక్ ఫెయిర్ లో వాలంటీరుగా పనిచేసాను. కానీ ఒక రచయితగా నా పుస్తకాలు నేనే అమ్ముకోగలిగే అవకాశం రావడం ఇదే మొదటిసారి. 19 న బుక్ ఫెయిర్ మొదలైన రోజునే డా. విరించి విరివింటి ఆ స్టాలు వెతుక్కుంటూ వచ్చారు. ఆయనకి నాలుగు పుస్తకాలు అమ్ముతూ నా చేతుల్తో బిల్లు రాసినప్పుడు నాకేదో చెప్పలేని అనుభూతి కలిగింది. నా జీవితంలో ఇదొక కొత్త అనుభవం. కానీ నిన్న సాయంకాలానికి బుక్ ఫెయిర్ పూర్తయ్యేటప్పటికి, ఇదెంతో విలువైన అనుభవమనిపించింది.
ఈ పదకొండు రోజుల్లో మా పిల్లలు అమృత, సౌందర్య తామే స్టాలు మొత్తం నిర్వహించారు. ఎవరేనా పుస్తకాలు కొనుక్కోడానికి వచ్చినప్పుడు ‘ఇక్కడ రచయిత ఉన్నారా’ అనడిగితే, నన్ను వారికి చూపించేవారు. అప్పుడు వారిని లోపలకి ఆహ్వానించడం, వారు కొనుక్కున్న పుస్తకాల మీద సంతకం చెయ్యడం, వారితో ఫొటో దిగడం, మరీ రద్దీ లేకపోతే, వారితో కలిసి వారి అభిప్రాయాలు వినడం- నా పాత్రని మా పిల్లలు ఇంతకే పరిమితం చేసారు. వారితో పాటు అనిల్ బత్తులు ప్రతి రోజూ తెలుగులో విడుదలైన కొత్త పుస్తకాలూ, ఎవరి చూపులకీ అందకుండా తప్పించుకుంటున్న పాతపుస్తకాలు తీసుకొస్తూ నాకు చూపించేవాడు. అలా హైదరాబాదు పుస్తక ప్రపంచాన్ని, పాతరూపంలోనూ, కొత్త రూపంలోనూ ఎప్పటికప్పుడు చూసే అవకాశం కూడా నాకు దక్కింది.
ఈ పదకొండు రోజులూ నాకు చాలా చాలా కొత్త insights ఇచ్చాయి. 1986 లో నా మొదటి పుస్తకం అచ్చువేసుకున్నాను. అంటే ఇప్పటికి నలభయ్యేళ్ళుగా, నా పుస్తకాలు అచ్చవుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా నేను రాసిన 74 పుస్తకాల్లో 50 పుస్తకాలు అచ్చులోకి వచ్చాయి. వాటిల్లో నా విద్యానుభవాలు ‘కొన్ని కలలు, కొన్ని మెలకువలు’, డా. కలాం పుస్తకాలకు నేను చేసిన అనువాదాలు విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయేయి కూడా. కాని ఇన్నేళ్ళల్లోనూ, ఏ ప్రచురణ కర్తా కూడా నా పుస్తకాల పైన పాఠకుల ప్రతిస్పందన ఎలా ఉందో నాకు చెప్పలేదు. తన పుస్తకాల మీద పాఠకులు ఏ విధంగా స్పందిస్తున్నారో ఒక రచయితకి నేరుగా తెలియవచ్చే వ్యవస్థ కూడా ఏదీ మనదగ్గర లేదు. కాబట్టి మొదటిసారిగా, నా పాఠకులెవరో (అంటే నా పుస్తకాలు కొనుక్కుని చదివేవాళ్ళు, వారు ఆ పుస్తకాల్లో దేన్నిష్టపడుతున్నారో, నానుంచి వారేమి కోరుకుంటున్నారో నాకు ఇప్పుడే తెలిసింది.
ఒకరోజు నా ఇంటర్మీడియేటు రోజులనాటి క్లాసుమేటు అక్కడ ఉన్న పుస్తకాల్లో అవధూతగీత గురించి నన్ను అడుగుతూ ఉన్నాడు. నేను చెప్తూ ఉన్నాను. ఇంతలో అక్కడ ఆ పుస్తకాలు చూడటానికి వచ్చిన తక్కినవారిలోంచి ఒకాయన ‘ ఆ పుస్తకం అల్టిమేట్ సార్, భగవద్గీత గురించైనా ఏమైనా చెప్పగలం. కానీ అవధూత గీత గురించి ఏం మాట్లాడగళం? ఆ పుస్తకం మిమ్మల్ని పూర్తి నిశ్శబ్దంలోకి తీసుకుపోతుంది ‘ అని అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఆయనకి నమస్కారం చేసి పలకరించాను. అప్పుడు ఆయన ‘సార్, నేను మీ పాటలు పుట్టిన తావులు అయిదువందలసార్లేనా చదివి ఉంటాను. చదవడం కాదు, పారాయణం చేసి ఉంటాను ‘ అని అన్నారు. నేను వింటున్నది నిజమా కలా నాకు తెలియలేదు. 2020 లో వచ్చిన పుస్తకం అది. దాదాపు ఆరేళ్ళవుతోంది. ఇటువంటి ఒక పాఠకుణ్ణి ఆ పుస్తకం చేరుకుందని బహుశా ఆ ప్రచురణకర్తకే తెలిసి ఉండదు. ఆ సందర్శకుడు ఇంకా ఇలా అన్నారు. ‘మీరు రాసింది చదివి, మేమొక బృందంగా, కారైక్కాలు నుంచి తిరువాలంగాడు ప్రయాణం చేసాం. అమ్మైయ్యారు దివ్యానుభూతిమహిమనుంచి మేమిప్పటికీ బయటపడనేలేదు ‘ అని! మై గాడ్! నా జీవితకాలంలో నా ఒక రచన మీద ఒక పాఠకుడినుంచి ఇటువంటి స్పందన వినగలనని నేనూహించలేదు. కాని నేనక్కడ ఒక స్టాలు తెరుచుకుని కూచుండకపోయి ఉంటే, ఆ పాఠకుణ్ణి నేను కలుసుకోగలిగి ఉండేవాణ్ణా?
పాతికేళ్ళుగా ప్రచురణకర్తలూ, బుక్ సెల్లర్లూ చెప్తూ వస్తున్న మాట: ‘కవిత్వం ఎవరూ కొనరు’ అని. నేను కూడా అది నిజమనే అనుకున్నాను. ఏ కవిత్వ సంపుటి వేసినా దాన్ని తోటికవులకి పంచిపెడుతూ వచ్చాను. నా ‘కోకిల ప్రవేశించే కాలం’ (2009) అలా ఉచితంగా పోస్టులో తనకి పంపినప్పుడు, పూర్వగవర్నరు, విదుషీమణి, వి.ఎస్.రమాదేవిగారు నాకు ఫోన్ చేసి నన్ను మందలించారు. పుస్తకాలు, ముఖ్యంగా కవిత్వం, అలా ఉచితంగా పంచవద్దని చెప్పారు. అక్కడితో ఆగకుండా ఆ పుస్తకం ఖరీదు నాకు చెక్కు పంపించారు కూడా. కాని నేనామె మాట వినలేదు. ప్రచురణకర్తలూ, బుక్ సెల్లర్లూ చెప్తున్నదే నిజమనుకున్నాను. నిజమే, కవిత్వం కొనరు. ఎవరు? కవులు కొనరు, రచయితలు కొనరు. కాని పాఠకులు కొనుక్కుంటారు. అపురూపంగా దాచుకుంటారు. తమ మిత్రులకి కానుకగా ఇస్తారు. ఈ పదకొండురోజుల్లోనూ నా స్టాలుకి వచ్చిన సందర్శకుల్లో సగానికి పైగా నా కవిత్వ సంపుటాల కోసం అడగడం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మనం కవులం, రచయితలం- తోటి కవుల రచయితల, సాహిత్యపేజీల, సాహిత్యసంఘాల మెప్పుదల కోసం చూసే ప్రయత్నంలో – మన పాఠకుల్ని మర్చిపోయాం, వాళ్ళని వదిలిపెట్టేసాం అనిపించింది.
ఒక రచయిత్రి నన్ను ‘మీరు పుస్తకాలు ప్రచురించారు కదా, అయినా ఇంకా పి.డి.ఎఫ్ లు అలానే ఉంచుతున్నారా?’ అనడిగారు. అవునని చెప్పాను. ఈ ఏడాది ప్రచురించిన పదకొండు పుస్తకాలవీ ఒక్క పిడిఎఫ్ కూడా నా బ్లాగునుంచి తొలగించలేదు. ఇంకో మాట కూడా చెప్పాలి. శ్రీపాద లిటరరీ వర్క్స్ తో సహా, ఏ ప్రచురణ కర్తనుంచీ నేను ఎటువంటి రాయల్టీ ఆశించింది లేదు. వారు ప్రచురిస్తామని అడిగినప్పుడు, రాయల్టీ వద్దని చెప్పడమే కాదు, ఆ పుస్తకాల ప్రింట్ రెడీ కాపీలు నేనే స్వయంగా డిజైను చేసి వారికిచ్చాను కూడా.
పుస్తకాలు పిడిఎఫ్ లు పెడితే పాఠకులు ప్రింటు పుస్తకాలు కొనడం మానేస్తారని ఒక ప్రచురణ కర్త నాతో అన్నాడు. కాని వాస్తవం వేరే విధంగా ఉంది. ఒక సందర్శకుడు నా స్టాలు దగ్గర నిలబడి నా పుస్తకాలన్నీ తాను తన మొబైల్లో డౌనులోడు చేసుకున్నవి చూపించాడు. కొన్ని పుస్తకాలైతే మూడు నాలుగు సార్లు కూడా చదువుకుంటూ ఉంటానని చెప్పాడు. మరి ప్రింటు పుస్తకాల కోసం ఎందుకొచ్చారని అడిగితే, ‘పుస్తకం పుస్తకమే, ఇది కూడా కావాలి నాకు’ అన్నాడు ఆయన!
నా ప్రతి ఒక్క పుస్తకానికీ కనీసం ఒక పాఠకుడేనా ఉన్నాడని అక్కడ తెలిసింది నాకు. ఒకరు ‘నిర్వికల్ప సంగీతం’ ఉందా అనడిగారు. ఒకరు ‘అరణ్యం’ కావాలన్నారు. ఒక యువతి ‘హైకూ యాత్ర’ పుస్తకం కోసం వెతుక్కుంటున్నానని చెప్పారు. ఒకరు నేను పిల్లలకోసం రాసిన పుస్తకాలు కావాలన్నారు. ఎక్కువమంది ‘నేను తిరిగిన దారులు’, ‘పాటలు పుట్టిన తావులు’, ‘ఆత్మోత్సవ గీతం’, ‘నీ శిల్పివి నువ్వే’, ‘ఉదారచరితులు’ పుస్తకాల గురించి అడిగారు. కొందరు నా కథల పుస్తకం కూడా కావాలని అడిగారు. నేను వారిని ఆయా ప్రచురణకర్తల స్టాళ్ళ నంబర్లు చెప్పి అక్కడికి వెళ్ళమని సూచించాను. నేను ఇటీవల పిడిఎఫ్ గా విడుదల చేసిన ‘తెలుగదేలయన్న’ పుస్తకం గురించి చాలా మంది అడిగారు. ‘ఆషాడమేఘం’ ఎప్పుడు ముద్రిస్తున్నారని ఒక మిత్రురాలు శ్రీపాదలిటరరీ వర్క్సు వారినే నేరుగా అడిగేరు.
ఒక రచయిత పుస్తకాల స్టాలు పెట్టుకుని అక్కడికి వచ్చే పాఠకుల్ని స్వాగతించడం ఒక అనుభవం. ఇంత విజువల్ మీడియా రాజ్యమేలుతున్నా, ఇందరు సినిమాతారలు ఇన్ని లక్షలమంది అభిమానుల్ని ఆకర్షించగలుగుతున్నా, ఇంకా, ఒక రచయితని చూడగానే మెరిసే కళ్ళతో అతడితో ఒక ఫొటో దిగాలని కోరుకునే పాఠకుల్ని నేను ప్రతిరోజూ పదుల సంఖ్యలో చూసాను. నా ఒక్క స్టాలనే కాదు, అసలు మొత్తం బుక్ ఫెయిరు లోనే, ఈ పదకొండూ రోజులూ, రచయితలే , హీరోలుగా, చూపరుల కళ్ళు మిరుమిట్లు గొల్పుతూ ఉన్నారు.
ఒక పాఠకుడు పుస్తకం కొనుక్కోడానికి వచ్చినప్పుడు తాను ఆ పుస్తకంలో ఏదో వెతుక్కుంటాడు. ఏం వెతుక్కుంటాడో అతడికి తెలియదు. కానీ అటువంటి పాఠకుల్ని చూడగా చూడగా వాళ్ళు ఏది వెతుక్కుంటున్నారో నాకు అస్పష్టంగానైనా ఒక జాడ దొరికింది. రానున్న రోజుల్లో నా సాహిత్యసృజననీ, నా book-making నీ ఈ మెలకువ గాఢాతిగాఢంగా ప్రభావితం చెయ్యబోతున్నదని మాత్రం చెప్పగలను.
అవును. ఈ సారి బుక్ ఫెయిర్ యువతది. యువరచయితలదీ, యువ ప్రచురణకర్తలదీ, యువసందర్శకులదీ కూడా. ప్రింటు, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు సినిమా ప్రచారగణంగా మారిపోయిన కాలంలో ఆ లోటును పూరించింది ఫేస్ బుక్, ఇన్స్టా గ్రాం, వాట్సప్ లే. సోషల్ మీడియా (దాన్ని కూడా తొంభై శాతం రాజకీయ పార్టీల అనుచరగణం ఆక్రమించుకున్నాక కూడా ) వల్లనే నేను నా పాఠకుల్ని సంపాదించుకోగలిగాను. నా ఫేస్ బుక్ పేజీ, నా బ్లాగు, నా యూట్యూబు ఛానెలూ- నన్ను కలిసిన ప్రతి ఒక్క పాఠకుడూ వీటిద్వారానే నా రచనలకి, నా ప్రసంగాలకీ చేరువవుతున్నామని చెప్పారు.
ఒక మనిషి జీవితంలో ఉద్యోగజీవితం ముగిసేక ఇక చేయవల్సిందేమీ లేదనుకుంటాం. కానీ, నలభయ్యేళ్ళ ఉద్యోగ జీవితం ముగిసాక, నాకు ఈ అనుభవం వల్ల, నా సాహిత్య జీవితం ఇప్పుడిప్పుడే మొదలవుతున్నదని మరీ మరీ అనిపిస్తున్నది.
30-12-2025
చాలా గొప్ప అనుభవాలని అనుభూతులుగా పరిచయం చేసి,పాఠకులతో రచయిత లేదా కవులకున్న పరోక్ష- ప్రత్యక్ష సంబంధాల్లో ఉన్న మమేకతను,అభిమానాన్ని,గౌరవాన్ని సున్నితంగా పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది సార్.కాలక్రమంలో ఈ పరిణామం చాలా ఆవశ్యకం కూడా.మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అభినందనలు.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
మీ ముగింపు వాక్యం ” నా సాహిత్య జీవితం ఇప్పుడిప్పుడే మొదలవుతున్నదని మరీ మరీ అనిపిస్తున్నది.” నా లాంటి పాఠకులకు మహదానందం కలిగిస్తుంది.
హృదయపూర్వక ధన్యవాదాలు
గొప్ప అనుభవం సర్.. తోటి రచయితలతో పాఠకులతో మీరెప్పుడు మమేకమౌతూనే ఉంటారని నేను గుర్తించాను. అలాంటి మీరు book exhibition లో ఓ స్టాల్ లో కూర్చుని పాఠక కొనుగోలుదారులను కలుసుకోవడం.. వారిని చూసి ముచ్చటపడటం.. ముచ్చటించడం మధురం.. మీ ఈ స్పందన మరింత మధురం సార్
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
చాలా గొప్ప అనుభూతి సార్ 🙏
జనవరి 2 నుండి విజయవాడ లో జరగనున్న బుక్ ఫెయిర్ లో కూడా మీరు అందుబాటులో ఉంటే నా వంటి మీ అభిమాన పాఠకుల కళ్ళల్లో ఆనందం చూస్తారు 🙏❤️
బహుశా వీలుకాకపోవచ్చు. మీ ఆహ్వానానికి హృదయపూర్వక ధన్యవాదాలు.