
భారతప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఎన్.సి.ఇ.ఆర్.టి వారికి దేశవ్యాప్తంగా రీజనల్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నాయి. కరికులం నిర్దేశం, పాఠ్యపుస్తకాల రూపకల్పన, విద్యాప్రమాణాల పెంపుదలకోసం చేపట్టవలసిన చర్యలు, ఉపాధ్యాయ శిక్షణ మొదలైన అంశాల్లో ఆ ఇన్స్టిట్యూట్స్ ఆయా రాష్ట్రప్రభుత్వాలకు సహకరిస్తుంటాయి. ఇన్నాళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అవసరాల్ని మైసూరులోని ఆర్.ఐ.ఇ చూస్తుండేది. ఇప్పుడు నెల్లూరులోనే కొత్తగా ఒక ఆర్. ఐ. ఇ ప్రారంభించారు.
ప్రముఖవిద్యావేత్త విశ్వనాథప్ప అందులో ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. గతంలో మేమిద్దరం కలిసి పనిచేసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఆధ్వర్యంలోని సిమాట్ కు ఆయన డైరక్టరుగా ఉండేవారు. ఇప్పుడు ఆర్.ఐ.ఇ ద్వారా జిల్లా విద్యాశిక్షణా సంస్థల సిబ్బందికి, సమగ్రశిక్షలోని అకడమిక్ సిబ్బందికి ఆయన ఒక అవగాహనా సదస్సు ఏర్పాటు చేసారు. ఆ సదస్సులో భాగంగా విద్యారంగంలో ఇన్నొవేషన్ మీద నాతో మాట్లాడించారు.
ఇన్నొవేషన్, కొలాబొరేషన్
ఇన్నొవేషన్ అంటే కొత్తపుంతలు తొక్కడం. ఏ వ్యవస్థ అయినా ఎప్పటికప్పుడు కొత్తదారుల్లో నడవకపోతే ఆ సంస్థ పనితీరులో పురోగతి ఉండదు. ఇప్పటి కాలంలో, ఏ కొత్త పనిచేపట్టాలన్నా, లేదా చేస్తున్న పనులే సరికొత్తగా చెయ్యాలన్నా, అది ఏ ఒక్క సంస్థా తనకై తాను విడివిడిగా చేపట్టగలిగే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క సంస్థా తనలాంటి ఉద్దేశ్యాలు, లక్ష్యాలు, ఆచరణ విధానాలు ఉన్న సహసంస్థలతో భాగస్వామ్యంతో పనిచేయవలసి ఉంటుంది. దాన్నే మనం కొలాబొరేషన్ అంటాం. ప్రైవేటు రంగంలో, పారిశ్రామిక రంగంలో, టెక్నాలజీ మీద ఆధారపడి వాణిజ్యకార్యక్రమాలు చేపట్టే సంస్థల్లో ఇన్నొవేషన్ కీ, కొలాబొరేషన్ కీ చాలా పెద్ద పీట వేస్తారు. రిసెర్చి, డెవలప్ మెంటు పేరిట ప్రైవేటు రంగం తన పరికరాల్నీ, ఉత్పత్తిపద్ధతుల్నీ, సాంకేతికతనీ ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూ ఉంటుంది. కాని ప్రభుత్వంలో ఇన్నొవేషన్ కి ప్రోత్సాహానికి బదులు నిరుత్సాహమే ఎదురవుతుంటుంది. ఎందుకంటే, కొత్త పుంతలు తొక్కడమంటే, కొత్త ప్రయోగాలు చేపట్టడం. విస్పష్టంగా ఇదీ అని నిర్ధారించలేని దారుల్లో అడుగుపెట్టడం. అందుకు సాహసం కావాలి. రిస్క్ తీసుకోగలగాలి. ఆ రిస్క్ వల్ల ఏదన్నా నష్టం వస్తే దాన్ని భరించగలగాలి. కాబట్టి ప్రభుత్వం తన సంస్థల్లో, వాటి పనితీరులో గతానుగతిక ఆచరణమీదానే ఆధారపడుతుంది తప్ప కొత్తదారులు తియ్యడానికి సిద్ధపడదు.
విద్యారంగంలో ఇన్నొవేషన్
ఏ రంగంలోనైనా కొత్త దారులు తొక్కవలసిన ఆవశ్యకత అత్యవసరంగా ఉందీ అనుకుంటే, అది పారిశ్రామిక రంగంలోకన్నా కూడా ముందు విద్యారంగంలోనే అని చెప్పక తప్పదు. ఒకవేళ రిప్ వాన్ వింకిల్ ఇప్పుడు మన నగరాల్లోకి వస్తే, తక్కిన జీవితమంతా మారిపోయినట్టు గమనిస్తాడుగాని, స్కూళ్ళు మాత్రం తన కాలంలో నడిచినట్టే నడుస్తున్నాయని గమనిస్తాడు అని ఒక విద్యావేత్త చమత్కరించాడు. అందులో అసత్యం లేదు. నా చిన్నప్పుడు పాఠశాలలు ప్రగతిసోపానాలు అని అనుకునేవాణ్ణి. కాని అవి యథాతథవాదానికి పట్టుగొమ్మలు అని తెలియడానికి ఆట్టే కాలం పట్టలేదు. అందుకనే విద్యారంగంలో కొత్త ప్రయోగాలు, ప్రయత్నాలు ఎవరు చేపట్టినా వారు నాకు సామాజిక సంస్కర్తలుగా కనిపిస్తారు. అటువంటి ప్రయత్నాలు ఎక్కడ జరిగినా వాటిని వెంటనే పోయి సందర్శించాలనిపిస్తుంది. తక్కిన సమాజమంతా వినేలా వాటి గురించి ఎలుగెత్తి చెప్పాలనిపిస్తుంది.
పాఠశాలల్లో ప్రయోగాలు కొత్తకాదు
అలాగని పాఠశాలల్లో కొత్త ప్రయోగాలు చేపట్టడం లేదని కాదు. నిజానికి మన పాఠశాలలన్నిటా మనం చూస్తున్న ఎన్నో ఆచరణలు ప్రభుత్వం ఉత్తర్వులిస్తే ప్రవేశపెట్టినవి కావు. ఎవరో ముందుచూపుకలిగిన ఉపాధ్యాయులో, ప్రధానోపాధ్యాయులో, విద్యాధికారులో వాటిని ఎప్పుడో ప్రవేశపెట్టి ఉంటారు. వాటిల్లోని సౌలభ్యం, సంస్కారం తక్కిన పాఠశాలల్ని కూడా ఆకర్షించి ఉంటాయి. ఎవరి నిర్బంధమూ లేకుండానే ఇప్పుడవి అన్ని పాఠశాలల్లోనూ సామాన్యమైన విషయాలుగా మారిపోయేయి. ఉదాహరణకి, మన పాఠశాలల్లో మార్నింగ్ అసెంబ్లీలో పిల్లలతో చెప్పించే ప్రతిజ్ఞనే చూడండి. అది అటువంటి ఇన్నొవేషన్ నే. ఆ తర్వాత ఆ ప్రతిజ్ఞాపాఠం పాఠ్యపుస్తకాల్లో కూడా ఒక భాగమై పోయింది. ప్రధానోపాధ్యాయుడి గదిలో సిబ్బంది వివరాలు, స్కూలు ఎన్ రోల్ మెంటు, పదవతరగతి పరీక్షల ఫలితాలు చూపించే పట్టికలు గోడమీద రాసి పెట్టడం కూడా అటువంటి ఇన్నొవేషన్ నే. అవి అలా చెయ్యమని ప్రభుత్వం ఉత్తర్వులిస్తే చేస్తూ వచ్చినవి కావు.
బోధన–అభ్యసన ప్రక్రియలో ఇన్నొవేషన్
కాని పాఠశాలల ఆచరణలో అత్యంత దుర్భేద్యమైన అంశం బోధన-అభ్యసన ప్రక్రియ. నిజానికి పాఠశాలలు ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూ పోవలసిన ఆ ప్రక్రియ మాత్రం చాలా గతానుగతికంగా సాగుతూ ఉంటుంది. దానిలో ఏ చిన్న మార్పు ప్రవేశపెట్టాలన్నా మొత్తం వ్యవస్థనంతటినీ మార్చవలసి ఉంటుంది. గిజూభాయి రాసిన ‘పగటికల’ చదివినవారికి అందులో ఆ ఉపాధ్యాయుడు తాను చేపడుతున్న ప్రయోగాలకి ప్రధానోపాధ్యాయుడి అనుమతి దొరికానే వాటిని మొదలుపెట్టిన సంగతి మర్చిపోలేం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎందరో విద్యాసంస్కర్తలు, విద్యావేత్తలు బోధన-అభ్యసనంలో ఎన్నో ప్రయోగాలు చేపడుతూ ఉన్నారు. ప్రభుత్వ రంగంలో నడిచే పాఠశాలలూ, ప్రైవేటు పాఠశాలలూ కూడా ఆ ప్రయోగాల గురించి తెలుసుకోవలసి ఉంది. వాటిని గుర్తు పట్టడం, అధ్యయనం చేయడం, ఆ ప్రక్రియ మొత్తం డాక్యుమెంటు చెయ్యడం, తిరిగి ఆ ప్రయోగాల గురించి విస్తృతంగా మాట్లాడుకోవడం అత్యంత అవసరం.
పదిమందీ అనుసరించదగ్గ కొన్ని కార్యాచరణలు
హైదరాబాదులో సెంటర్ ఫర్ ఇన్నొవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ అనే ఒక ప్రభుత్వ సంస్థ ఉంది. నేను కొన్నాళ్ళు ఆ సంస్థకు సలహాదారుగా పనిచేసాను. దేశవిదేశాల్లో ప్రభుత్వ సంస్థల్లో ఇన్నొవేషన్ ని పెంపొందించడం ఆ సంస్థ లక్ష్యం. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో కొత్త ప్రయోగాల్నీ, ఉత్తమ కార్యాచరణల్నీ ఆ సంస్థ గుర్తించింది. వాటి గురించిన సమాచారాన్ని రాష్ట్రప్రభుత్వాలకి అందచేస్తూ ఉంది. రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచే ఎస్.సి.ఇ.ఆర్.టిలు, జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశిక్షణా సంస్థలు ఇటువంటి ప్రయత్నం చేపట్టాలి. రీజనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో కూడా ఇందొక ప్రత్యేకమైన విభాగం ఉండాలి. వారి వారి వెబ్ సైట్లలో ఇన్నొవేషన్ల పైన ప్రత్యేకంగా పేజీలు ఉండాలి. ఉదాహరణకి అటల్ టింకరింగ్ లాబులు ఉన్నాయి. ఇవి పిల్లల్లో ప్రయోగశీలత్వాన్నీ, సైన్సులో పిల్లలు తమంతట తామే కొత్త ఆవిష్కరణలు చేపట్టడాన్నీ ప్రోత్సహిస్తాయి. ఇటువంటి లాబుల్లో ఏ కొత్త ఆవిష్కరణలు జరిగినా వెంటనే దేశవ్యాప్తంగా వాటిని పంచుకోవాలి. అప్పుడు దాన్ని చూసి తక్కిన పాఠశాలలు కూడా ఉత్సాహం చూపిస్తాయి.
అలాగే పూర్వప్రాథమిక విద్యలో చీపురుపల్లిలో పి.డి.కామేశ్వరరావుగారు ‘బాలబడి’ పేరిట చేస్తున్న ప్రయోగాలు నలుగురూ అనుసరించదగ్గవి. విజవాడలో గుణదల దగ్గర నడుస్తున్న ‘అభ్యాస’ విద్యాలయంలో, ప్రి-ప్రైమరీ పిల్లలకోసం తయారు చేసిన టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్ చాలా కొత్త తరహా సామగ్రి. దాని వెనక ఉన్న అనుభవం, దృక్పథం సామాన్యమైనవి కావు. అలానే గుంటూరు దగ్గర చోడవరంలో డా.నన్నపనేని మంగాదేవిగారు నడుపుతున్న చేతన పాఠశాల ఒక అసామాన్యమైన ప్రయత్నం. మాంటిస్సోరి ఎటువంటి పాఠశాలని కలలుగన్నదో మంగాదేవి గారు ఆ కలని నిజం చేసారు. ఇటువంటి ఉత్తమ ఉదాహరణల్ని నేను వందలాదిగా ఇవ్వగలను. వీటి గురించిన సమాచారం మరింత విస్తృతంగా పదిమందికీ అందుబాటులోకి రావాలి. అందుకు జిల్లా విద్యాశిక్షణాసంస్థలు పూనుకోవాలి.
నేను కలగంటున్న మరికొన్ని కొత్తపుంతలు
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేపడుతున్న ప్రయోగాలే కాక, ఇంకా మరెన్నో ప్రయోగాలు చేపట్టాలి. ఉదాహరణకి, పాఠశాలల సంస్థాగత ప్రణాళికల్ని తల్లిదండ్రుల్తో కలిసి తయారుచేయడం కొన్ని చోట్ల జరుగుతున్నది. కాని నేను కలగనేది, అసలు పాఠశాలల మాసవారీ బోధన ప్రణాళికలే తల్లిదండ్రుల్తో కలిసి రూపొందించుకోవడం. కోయంబత్తూరు దగ్గర ఆనైకట్టిలో ‘విద్యావనం’ వారు ప్రతి నెలా తమ పాఠశాల సిలబస్ ని ఆ పిల్లల తల్లిదండ్రుల్తో కలిసి రూపొందించుకుంటారు. ఆ తల్లిదండ్రులు ఎంతో వెనకబడ్డ ఇరుళ గిరిజన తెగ వారు కావడం వారి ప్రయోగాలకి ఎంత మాత్రం అడ్డుకాలేదు. అలానే కథలు చెప్పడం బోధనలో భాగం కావడం. ప్రాథమిక స్థాయిలో మన పాఠాలన్నీ కథలరూపంలోకి మార్చుకోవాలి. అసలు ఆ మాటకొస్తే, పాఠ్యపుస్తకాలు కూడా ఏ పాఠశాలకి ఆ పాఠశాల రూపొందించుకోవాలంటాను. అలానే హైస్కూలు స్థాయిలో కరికులం మొత్తం ప్రాజెక్టు-బేస్డ్ కరికులంగా మారాలి. తరగతిగదులు ప్రయోగశాలలుగా మారాలి. పాఠ్యపుస్తకాలు పిల్లలు ఇంట్లో చదువుకునేవి కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సు వినియోగించడం ద్వారా ప్రతి ఒక్క పిల్లవాడికీ అతడి అభ్యసనవేగాన్ని తగ్గట్టుగా అభ్యసన ప్రక్రియ చేపట్టాలి. ఇటువంటివే ఎన్నో ఆలోచనలున్నాయి.
జాతీయ విద్యావిధానం 2020
అదృష్టవశాత్తూ జాతీయ విద్యావిధానం ఇన్నొవేషన్ కి అపారమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. తరగతి గదుల్లో పిల్లలు పాఠ్యపుస్తకాల్లో రాసిందాన్ని బట్టీపట్టే ప్రస్తుత పరిస్థితి నుంచి పోటీప్రపంచంలో నెగ్గే విధంగా పిల్లల అభ్యసన ప్రమాణాలు పెరగడం మీదనే జాతీయ విద్యావిధానం దృష్టిపెట్టింది. ఇందుకోసం అది ఉత్తమ కార్యాచరణలు ఎక్కడ ఉన్నా వాటిని whole system integration దిశగా ప్రోత్సహిస్తున్నది. కాబట్టి పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక తరగతుల్లో ఉత్తమ కార్యాచరణలు ఎక్కడున్నా వాటిని గుర్తించడం మీద జిల్లా విద్యాశిక్షణాసంస్థలు దృష్టిపెట్టాలి. వాటిని స్వయంగా పోయి సందర్శించాలి. వాటిని తమప్రాంతాల్లోని పాఠశాలల్లో తిరిగి చేపట్టడానికి ప్రయత్నం చేయాలి. ఆ రోజు జిల్లా విద్యాశిక్షణా సంస్థల సిబ్బందికి నేను ప్రధానంగా చెప్పింది ఇదే.
తెలుగు ప్రభ దినపత్రిక, స్కైబాబకి ధన్యవాదాలతో, 6-2-2026
Good morning sir, today your article about school & recent trends & innovation methods & schemes of our education system it is very important now a days. Thank u so much sir from Srinidhi dept of heritage museum employee
Thank you
విద్యారంగాన్ని లోతుగా అర్థం చేసుకున్న అనుభవంతో, స్పష్టమైన దృష్టితో ఆలోచనాత్మకంగా రాసారు సార్.
ధన్యవాదాలు మేడం!