ఇద్దరు ఆదికవులు

ఎంతమంది తెలుగువాళ్ళు, ఎంతమంది భారతీయులు అమెరికా వెళ్ళలేదు, ఎంత మంది అక్కడ నివసించడం లేదు! కాని ఈ స్ఫురణ, ఆదికవి వాల్మీకికీ, అమెరికన్ మహాకవి వాల్ట్ విట్మన్ కీ ఉన్న ఈ పోలిక ఇప్పటిదాకా ఎవరికీ తోచకపోవడం ఎంత ఆశ్చర్యం! నేను కూడా చదివాను, Out of the Cradle Endlessly Rocking- కానీ నాక్కూడా తట్టలేదు. ఇది విజయసారథి వంటి రసాన్వేషికి మాత్రమే తట్టే స్ఫురణ. ఒక్కమాటలో చెప్పాలంటే, a once in a lifetime insight!


జీడిగుంట విజయసారథి

విట్మన్ స్మారక ప్రదేశాల సందర్శన – 5

జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ..
తన కంటిలో పొంగ… మనసు కరగంగ…
ఆ శోకంలో ఒక శ్లోకం పలికే.
ఆ చీకటి ఎదలో దీపం వెలిగే…
చిలిపి బాలుడే పులకరించగా…
కవిగా ఆతడు అవతరించగా…
మనిషి అతనిలో మేల్కొన్నాడు.
కడకు మహాకవి అయినాడు.
నవరసభరితం గఱికల హరితం.
జగతికి ఆతడు పంచిన అమృతం
ఆ విట్మన్ మీవాడూ…
మీలోనూ వున్నాడు…
అక్షరమై మీ మనసు వెలిగితే…
మీతోనే వుంటాడు.

ఏమిటిది? ఎప్పుడో అడవిరాముడు సినిమాకోసం వాల్మీకిని స్మరిస్తూ రాసిన పంక్తులను విట్మన్ (Whitman) స్మారక ప్రదేశాల సందర్శన ట్రావెలాగ్ లో అసందర్భ ప్రేలాపన గా తెచ్చాననుకుంటున్నారా.. అక్కడకే వస్తున్నా.. సరిగ్గా గమనించండి కొన్ని పంక్తులు మార్చాను. ‘కడకు బోయడే అంతరించగా’ ను చిలిపి బాలుడే పులకరిచంగా.. గాను , ‘మహర్షి’ ని మహాకవి గా, ‘రాముని చరితం’ ను గఱికల హరితం ( Leaves of Grass కి నా తర్జుమా శీర్షిక ) పదాలతో ఎక్చేంజ్ చేసి ఆ పాట చరణం విట్మన్ కి వర్తించేలా చేసాను. దానికి చాలా ఆశ్చర్యమనిపించే కారణం మూడు రోజుల క్రితమే తెలిసింది.

నా ట్రావెలాగ్ లో చాలా రోజులు గ్యాప్ రావడానికి కారణం Whitman Birthplace విజిట్ గురించి రాయడానికి ఉపక్రమించినపుడు నేను ఆ ప్రదేశంలో చూసిన, చదివిన అనేక విట్మన్ సంబంధిత కథనాలు, ఆ తరువాత నా దగ్గర ఉన్న విట్మన్ సంబంధిత సాహిత్యం, విమర్శ, కథనాలు, బయోగ్రఫీలు, ఆటోబయోగ్రఫీల లాంటి స్పెసిమెన్ డేస్ డైరీ నోట్స్ చదవడం లో నిమగ్నమై పోయి ఆ సంగతులన్నీ మీతో పంచుకోవాలన్న ఆనందం ఎక్కువైన ఈ భాగాన్ని ఎలా ప్రారంభించాలో చాలా రోజులుగా అర్థం కాక ట్రావెలాగ్ రాయడానికి బాగా బద్దకిస్తూ వచ్చాను.

అలాంటిది రెండు రోజుల క్రితం.. భద్రుడు గారు తన ఆత్మోత్సవగీతం పరిచయ వాక్యాల లో సూచించిన అమెరికన్ సాహిత్య విమర్శ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన సాహిత్య విశ్లేషకుడు, హెరాల్డ్ బ్లూమ్ (1930–2019) రాసిన నలభై పైగా పుస్తకాలలో అత్యంత ప్రసిద్ధ గ్రంథం ది వెస్ట్రన్ కేనన్ (The Western Canon) లో విట్మన్ పైన రాసిన వ్యాసం ‘వాల్ట్ విట్మన్ యాజ్ సెంటర్ ఆఫ్ ది అమెరికన్ కానన్’ చదివాను. ఈ పుస్తకం లో హెరాల్డ్ బ్లూమ్ ప్రపంచ సాహిత్యంలో తప్పనిసరిగా చదవాల్సిన 26 మంది రచయితలను గురించి ప్రతిపాదిస్తూ షేక్స్‌పియర్ కు, పాశ్చాత్య సాహిత్యానికి కేంద్రబిందువు అగ్రతాంబూలం ఇచ్చి దాంతే, మిల్టన్, టాల్‌స్టాయ్ వంటి వారితో పాటు వాల్ట్ విట్మన్ (Walt Whitman) పేరు ను కూడా ఆ జాబితాలో చేర్చారు. ఈ ‘వాల్ట్ విట్మన్ యాజ్ సెంటర్ ఆఫ్ ది అమెరికన్ కానన్’ వ్యాసం లో Whitman రాసిన మహా కావ్యం లీవ్స్ ఆఫ్ గ్రాస్ లో ‘సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్’ దీర్ఘ కవిత తో పాటు మరో ఐదు చిన్న ఖండికలు అసాధారణమైన ధ్యాన కవితలుగా, అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తూ పాశ్చాత్య దేశాలలో వీటికి సరి సమానమైనవి లేవని చెప్పారు. వాటిలో ఒక కవిత 1860 నాటి లీవ్స్ ఆఫ్ గ్రాస్ మూడవ ముద్రణ లో మొదటిసారి ప్రచురించిన ‘అవుట్ ఆఫ్ ది క్రాడిల్ ఎండ్‌లెస్లీ రాకింగ్’ అన్నారు. ఆ కవిత కంటెంట్ ఏమిటా అని చదివితే నాకు కలిగిన సంభ్రమాశ్చర్యాలు అంతింత కావు. స్థలాభావం చేత పూర్తి కవిత ఇంగ్లీష్ వెర్షన్ లో పంచుకోవట్లేదు గాని ఉదాహరణకి ఆ కవిత మొదట్లోనే ఉన్న ఈ భాగం చూడండి. మీరు కూడా అబ్బుర పడక మానరు.

Out of the Cradle Endlessly Rocking

Once Paumanok,
When the lilac-scent was in the air and Fifth-month grass was growing,
Up this seashore in some briers,
Two feather’d guests from Alabama, two together,
And their nest, and four light-green eggs spotted with brown,
And every day the he-bird to and fro near at hand,
And every day the she-bird crouch’d on her nest, silent, with bright eyes,
And every day I, a curious boy, never too close, never disturbing them,
Cautiously peering, absorbing, translating.
“Shine! shine! shine!
Pour down your warmth, great sun!
While we bask, we two together.
Two together!
Winds blow south, or winds blow north,
Day come white, or night come black,
Home, or rivers and mountains from home,
Singing all time, minding no time,
While we two keep together.”
Till of a sudden,
May-be kill’d, unknown to her mate,
One forenoon the she-bird crouch’d not on the nest,
Nor return’d that afternoon, nor the next,
Nor ever appear’d again.
And thenceforward all summer in the sound of the sea,
And at night under the full of the moon in calmer weather,
Over the hoarse surging of the sea,
Or flitting from brier to brier by day,
I saw, I heard at intervals the remaining one, the he-bird,
The solitary guest from Alabama
“Blow! blow! blow!
Blow up sea-winds along Paumanok’s shore;
I wait and I wait till you blow my mate to me.
Yes, when the stars glisten’d,
All night long on the prong of a moss-scallop’d stake,
Down almost amid the slapping waves,
Sat the lone singer wonderful causing tears.
He call’d on his mate,
He pour’d forth the meanings which I of all men know.

(పూర్తి కవిత కోసం ఇక్కడ చూడండి. తప్పకుండా చదవండి. Harold Bloom చెప్పినట్టు ‘ఆత్మోత్సవగీతం ( Song Of Myself)’ కవితకు ఏ మాత్రం తీసిపోదు.)

48 ఏళ్ల వయసొచ్చాకా, చిన్నప్పుడెప్పుడో లాంగ్ ఐలాండ్ (Paumanok) లో సముద్రపు ఒడ్డున తిరుగుతూ తనను అత్యంత ప్రభావితం చేసిన ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ, ఒక జంట బాసిన పక్షి శోక వేదనలో తన స్వరాన్ని ఎలా కలుపుకున్నాడో వివరిస్తూ అక్షరబద్ధం చేసిన ఈ ‘అవుట్ ఆఫ్ ది క్రాడిల్ ఎండ్‌లెస్లీ రాకింగ్’, విట్‌మన్ కవిత్వంలో అత్యంత కీలకమైన, ఒక భావోద్వేగపూరితమైన కావ్యంలా సాగే దీర్ఘ కవిత.

సముద్రాన్ని ఒక ఊయల గా భావిస్తూ, ఆ తీరం చేరేటప్పుడు, త్రోవలో ఇతర పక్షులు చేసే శబ్దాలను అనుకరిస్తూ ఉత్తర అమెరికాలో ఎక్కువగా కనబడే ‘మాకింగ్ బర్డ్’ ను సంబోధిస్తూ విట్మన్ తనలో కవి ఎలా మేల్కొన్నాడో అద్భుతంగా వివరించిన కవితాఝరి ఈ ఖండ కావ్యం. సాహిత్యంలో, మాకింగ్ బర్డ్ అమాయకత్వాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు, హాని చేయకూడని అమాయక జీవులను సూచిస్తూ హార్పర్ లీ ‘టు కిల్ ఎ మాకింగ్‌బర్డ్’ నవల టైటిల్ లో ఈ పక్షి పేరు వాడారు.

విట్మన్ ఈ కవిత ప్రారంభిస్తూ ఇలా అంటున్నాడు:

ఏమిటా స్మృతి? తరువాత భాగం లో Whitman రాసిన ఈ వాక్యాలను చూడండి. అవి చదివితే, ఏ భారతీయ సాహిత్య పిపాసి అయినా నాలాగా దిగ్బ్రాంతికి లోను గాక మానడు. అమెరికా కి వలస వచ్చిన బ్రిటిషర్లు పెట్టిన లాంగ్ ఐలాండ్ పేరు బదులు నేటివ్ అమెరికన్స్ వాడుకున్న పేరు పామనక్ (Paumanok). ఆ పేరే ఇష్టపడే Whitman as బాల్య స్మృతి ఏమిటో ఇలా చెబుతున్నాడు.

ఇప్పుడు చెప్పండి విట్‌మన్ రాసిన ‘లీవ్స్ ఆఫ్ గ్రాస్’ అమర కావ్యం లో ఈ ఖండిక చదివితే భారతీయ సంస్కృతిలో ఆదికవి వాల్మీకి అయితే అమెరికా సాహిత్య సంస్కృతికి విట్మన్ ఏమవుతాడో. ఒక కవి తన గతాన్ని నెమరువేసుకుంటూ, ఒక పక్షి వేదన ద్వారా తనలో కవిత్వం ఎలా ఉద్భవించిందో వివరించి కావ్యానికి అంకురార్పణ చేసిన Whitman ను ఏమని సంబోధించాలో..

కవితలో విట్మాన్ ‘Ninth-month’ (తొమ్మిదవ నెల) అని అన్నారు, అంటే క్వేకర్ల (Quakers) క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నెల. ఇది శరదృతువు ప్రారంభాన్ని, అంటే మార్పును సూచిస్తుంది. ఈ కవితలోని ‘Barefoot’ (చెప్పులు లేకుండా) అనే పదం ఎంత లోతైనదో మీకు అర్థమై ఉంటుంది—అంటే ప్రకృతితో ఎటువంటి అడ్డంకులు లేకుండా నేరుగా స్పర్శించడం.

పక్షిని విట్‌మన్ ‘Lone Singer’ అని పిలిచారు. ఇది కవికి కూడా వర్తిస్తుంది. లోకంలో ఎందరో ఉన్నా, తన బాధను కవిత్వంగా మార్చి పాడేవాడు కవి ఒక్కడే.

ప్రకృతిలోని మూగ వేదనను గుర్తించగలిగిన రోజే ఆ బాలుడు ఒక కవిగా పరిణతి చెందాడు.

ఆ శోకాన్ని కవితా పదాలుగా మనుషుల భాషలోకి మార్చే బాధ్యత కవిదేనని చెప్పడం వాల్ట్ విట్‌మన్ ఉద్దేశ్యం. అందుకే తన జంట పక్షికి దూరమైన మగ పక్షి ప్రకృతితో కూజిత సంభాషణ చేస్తూ తన బాధను సముద్రానికి, చంద్రుడికి, నక్షత్రాలకు, గాలికి, అలలకు, ప్రకృతిలోని ప్రతి అణువణువుకూ చెప్పుకున్నట్టుగా భావించాడు.

ఆ పక్షి శోకం ఆ చిన్నపిల్ల వాడిలో ‘కవిని’ ఎలా నిద్రలేపిందో, అతన్ని ఒక బాలుడి నుండి ఒక ‘Bard’ (మహాకవి) గా ఎలా మార్చిందో విట్మన్ పదాల్లోనే చదివేసరికి, క్రౌంచ పక్షుల జంటను విడగొట్టినప్పుడు ఆడపక్షి శోకాన్ని చూసి చలించి పోయిన కరకు బోయడు తనలో ఒక మహా కవితా విస్ఫోటనం జరిగి తాను వాల్మీకి మహర్షి గా రూపాంతరం చెందిన ఘట్టమే నన్ను పూర్తిగా కమ్మేసింది. వాల్మీకి ఆ సంఘటనను చూసినప్పుడు కలిగిన ఆకస్మిక ఉద్వేగమే ‘రామాయణ’ కావ్యానికి పునాది వేసి ఆయనను ఆదికవి చేస్తే, పామనక్ తీరంలో నిలబడి ‘మాకింగ్ బర్డ్’ విరహ వ్యధ ను గమనించిన విట్మన్ లో ఒక ‘మహాకవి’ (Bard) మేల్కొని అమెరికా కవిత్వ సామ్రాజ్యానికి ఆదికవిని చేసిందనిపించింది. ఇద్దరి మహాకావ్యాలు పక్షి పడే విరహ వేదన (Aria) నుండే ఆవిర్భవించాయి.

అంతే కాదు ఇద్దరూ నీటిని తల్లిలా ఊహించి వర్ణించారు. ‘అవుట్ ఆఫ్ ది క్రాడిల్ ఎండ్‌లెస్లీ రాకింగ్’ (Out of the Cradle Endlessly Rocking) అనే కవిత పేరులోనే విట్మాన్ సముద్రాన్ని ఒక ఊయలగా వర్ణిస్తూ ఒక తల్లి బిడ్డను నిద్రపుచ్చడానికి ఎలాగైతే ఊయల ఊపుతుందో, సముద్రం తన అలలతో ఈ ప్రపంచాన్ని అలానే లాలిస్తోందని విట్మన్ భావిస్తే, వాల్మీకి తమసా నదిని చూసి ‘ప్రసన్నానివ సంత్వునాం మనః’ (మంచి మనుషుల మనస్సు లాగా ఈ నది నీరు ఎంత నిర్మలంగా ఉందో!) అని భావించాడు. ఒక తల్లి మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఆ నది కూడా అంతే స్వచ్ఛంగా ఉందని ఆయన నమ్మకం.

ఇంక వాల్మీకి నోటి వెంట అప్రయత్నంగా వెలువడిన పలుకులు

(ఓ కిరాతుడా! మైథునంలో ఉన్న పక్షుల జంటలో ఒకదానిని చంపిన నీకు శాశ్వత కాలం ప్రతిష్ఠ లభించదు గాక!)

ఆయనకు అప్రతిష్ట కలుగుతుందని ఎందుకు సూచించాయో విశ్లేషించి చర్చించే అంత విద్వత్తు నాకు లేదు కానీ అవి ఒక క్రమబద్ధమైన లయలో ( అనుష్టుప్ ఛందస్సులో) ఉండడం,

‘శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా’ (నా శోకం నుండి పుట్టినది కాబట్టి ఇది ‘శ్లోకం’ అవ్వాలి) అని ఆయన ప్రకటించడం.. అదే భావాన్ని వేటూరి తన పాటలో ఉపయోగించడం నేను ఈ విట్మన్ స్మారక ప్రదేశాల సందర్శన ట్రావెలాగ్ అడవి రాముడు సినిమా పాట తో మొదలు పెట్టడానికి కారణ భూతమయ్యింది.

వాల్మీకి తమసా నదీ తీరంలో పక్షి వేదనను గమనించి పక్షి రోదనను సంస్కృత శ్లోకంగా మార్చగా, విట్‌మన్ అట్లాంటిక్ సముద్ర తీరం లో పామనక్ ద్వీపం మీద ఆ పక్షి పాటను తన ‘ముక్త ఛందస్సు,’ (Free Verse) వచన కవితగా మార్చారు. వాల్మీకి నోటివెంట ‘మా నిషాద ప్రతిష్ఠాం…’ శ్లోకం వెలువడిన తర్వాతే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రామాయణం రాయమని ప్రేరేపిస్తాడు. విట్‌మన్ కూడా “ఇన్నాళ్లూ నా నాలుక నిద్రపోయింది, ఈ పక్షి పాట విన్నాకే నేను మేల్కొన్నాను” అని చెప్పాడు. వాల్మీకికి తమసా నది సాక్షిగా నిలిస్తే, విట్‌మన్ కు అట్లాంటిక్ మహాసముద్రం సాక్షిగా నిలిచింది. నది ప్రశాంతత వాల్మీకి కవిత్వంలో కనిపిస్తే, సముద్రపు ఉధృతి విట్‌మన్ కవిత్వంలో కనిపిస్తుంది.

ఒక పక్షి ప్రాణం పోవడం లేదా ఒక పక్షి తన తోడు కోసం ఏడవడం అనేది లోకానికి చిన్న విషయమే కావచ్చు. కానీ ఒక మహాకవికి అది విశ్వమంత బాధ. వాల్మీకి అయినా, విట్‌మన్ అయినా.. ప్రకృతిలోని ఆ చిన్న జీవి మూగ బాధను తమదిగా భావించినందుకే దానిని అద్భుతంగా వ్యక్తపరచి అజరామరైన కావ్యాలు గా మార్చారు. ఒక విధంగా సీతారాముల వియోగం కూడా ఆ పక్షుల వియోగం లాంటిదే. రాముడి శోకం కూడా ఆ జంట బాసిన పక్షి శోకం లాంటిదే.

శోకం నుండి ఉద్భవించేది కరుణ రసం. విరహం నుండి విలసిల్లేది విశ్వజనీన ప్రేమ. విట్‌మన్ తన జీవితాంతం తనను తాను ‘Chanter of pains and joys’ (విషాద, వినోదాలను చాటిచెప్పే గాయకుడు) అని పిలుచుకున్నాడు, ఇది సరిగ్గా వాల్మీకి మహర్షి ఆ శోకాన్ని శ్లోకంగా మార్చిన సందర్భానికి సరిపోతుంది. అందుకే వారిద్దరూ తమ తమ భాషల్లో ‘ఆదికవులు’గా మిగిలిపోయారు.

(కొనసాగింపబడుతుంది )

PS : ట్రావెలాగ్ లో ఇదంతా రాయడం అవసరమా అనిపించినా, ఎందుకో విట్మన్ స్మారక ప్రదేశాల సందర్శన మ్యూజింగ్స్ లో నాకు నచ్చిన ఈ మహాకవి సాహిత్యాన్ని, ఆయన జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల్ని, ఆయన నివసించిన, సంచరించిన ప్రదేశాల గురించి ఆసక్తికరమైన విషయాల్ని కూడా ఇలాంటి పోస్టుల ద్వారా మీతో పంచుకుందామనుకుంటున్నాను. ఏమనుకోరు కదా.

ఈ ట్రావెలాగ్ మునుపటి భాగాలు చదవాలంటే ఈ లింకులు క్లిక్ చెయ్యండి.

విట్మన్ స్మారక ప్రదేశాల సందర్శన – 1 https://www.facebook.com/share/1CE4GxfKnQ/

విట్మన్ స్మారక ప్రదేశాల సందర్శన – 2

విట్మన్ స్మారక ప్రదేశాల సందర్శన – 3 https://www.facebook.com/share/v/1C3iABYJh6/

విట్మన్ స్మారక ప్రదేశాల సందర్శన – 4

#WhitmanMemorialsTravelouge


Featured image photography by David Kanigan, courtesy: pexels.com

ఫేస్ బుక్, విజయ్ జీడిగుంట వాల్ నుంచి, 4-4-2026

5 Replies to “ఇద్దరు ఆదికవులు”

  1. భద్రుడు గారు.. కృతజ్ఞతలు.. ధన్యవాదాలు అనేవి చాలా చిన్న మాటలు. మీరు నా పోస్ట్ కి ఇచ్చిన గౌరవం మీకు ఏమిచ్చినా తీర్చుకోలేని రుణం… నాకు మీ ఈ ప్రశంస ల, సాహిత్య అకాడమీ పురస్కారం తో సమానం.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%