
మొదుగు లక్ష్మా రెడ్డిది రెంటచింతల. ఆయన చాలాకాలం పాటు దాచేపల్లి జిల్లాపరిషత్ హైస్కూల్లో ప్రధానోపాధాయుడిగా పనిచేసారు. ఆయన క్రమశిక్షణ, అంకితభావం ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్దాయి. ఆయన పిల్లలు ఉన్నతవిద్య పొంది ఇప్పుడు ఖండాంతరాల్లో ఉన్నతస్థానాల్లో ఉన్నారు. తమ తండ్రి వల్ల స్ఫూర్తి పొందినవాళ్ళల్లో బయటివాళ్ళే కాదు, ఆ పిల్లలు కూడా ఉన్నారు. అందుకని తమ తండ్రి పేరుమీద ఎం.ఎల్.ఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసారు. ఆ పిల్లల్లో పెద్దవాడైన మధుసూధన్ రెడ్డి తన కంపెనీ సి ఎస్ ఆర్ లో భాగంగా తన సిబ్బంది మొత్తాన్ని మోటివేట్ చేసి నెలకొకసారైనా రెంటచింతల తీసుకువస్తాడు.
ఉన్నతవిద్యావంతులు, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ లోనూ, మేనేజిమెంటులోనూ నిపుణులైన ఆ ఉద్యోగులు రెంటచింతలల్లోనూ, చుట్టుపక్కల గ్రామాల్లోనూ యువతకి ఒక దిశానిర్దేశం చెయ్యడానికి ఉత్సాహపడుతుంటారు.
లక్ష్మారెడ్డిగారి పిల్లల్లో ప్రసిద్ధ కవయిత్రి, కథకురాలు మొదుగు శ్రీసుధ కూడా ఉన్నారు. ఆమె వృత్తిరీత్యా వైద్యురాలు. జమైకాలో పనిచేస్తున్నారు. ఆమె రెండువారాల కిందట నాకు ఫోన్ చేసి తమ నాన్నగారి పేరిట కొందరు ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం తలపెట్టామనీ, ఆ వేడుకలో నన్ను కూడా వచ్చి పాల్గోమనీ ఆహ్వానించేరు.
నేను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖని వదిలిపెట్టి రెండున్నరేళ్ళు దాటింది. ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి కూడా రెండేళ్ళు దాటింది. ఇప్పుడు ఆ పాఠశాలలు ఎలా ఉన్నాయో, ఆ ఉపాధ్యాయులు ఏ కొత్త ప్రయోగాలు చేస్తున్నారో, అక్కడి విద్యారంగంలో ఏ కొత్తపుంతల మీద చర్చలు నడుస్తున్నాయో తెలుసుకోవచ్చుకదా అని ఆమె ఆహ్వానానికి సరేనన్నాను.
మొన్న ఆదివారం రెంటచింతలలో ఎం.ఎల్.ఆర్ ఫౌండేషన్ వార్షికోత్సవ సభలో నాతో పాటు పిల్లల ప్రేమికుడు, బాలబంధు సి.ఎస్.ప్రసాద్ గారు, ప్రసిద్ధ నాటకరచయిత పిన్నమనేని మృత్యుంజయ రావు గారు కూడా పాల్గొన్నారు. కోసూరి లోలా రవికుమార్ గారు, చిన్నమ్మగారు మొత్తం కార్యక్రమం నిర్వహించారు. భాస్కర్ కొండ్రెడ్డి ఆ కార్యక్రమమంతా తన కెమెరాతో బంధిస్తూనే ఉన్నారు. మధుగారి టీమ్ కి చెందిన భార్గవ్, శ్రీలత లు కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మీద, మైండ్ ఫుల్ నెస్ మీదా తమ ఆలోచనలు ఉపాధ్యాయుల్తో పంచుకున్నారు. ఎం.ఎల్.ఆర్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ కల్యాణ్ మొత్తం ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు.
రోజంతా జరిగిన ఆ వేడుకల్లో నాకు బాగా సంతోషం కలిగించింది ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమం. ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయడానికి ఫౌండేషన్ గతంలో విద్యార్థుల అభిప్రాయాలు తీసుకునేదనీ, ఈసారి అలాకాక, తరగతి గదిలో బోధనని వీడియోగ్రాఫు చెయ్యడం ద్వారా ఎంపిక చేసామనీ శ్రీ సుధ చెప్పారు.
ఆ మాట వినగానే నాకు కొన్నేళ్ళ కిందట్ రుషీవేలీ స్కూల్లో టీచర్ మెంటరింగ్ టీమ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆ టీమ్ ట్రయినింగ్ అనే మాట వాడటానికి ఇష్టపడలేదు. దానికి బదులు మెంటరింగ్ అనే పదం ఎక్కువ గౌరవప్రదమైన పదమే కాక, ప్రయోజనకరమైన పదం అని కూడా చెప్పారు వాళ్ళు. తమ దగ్గరికి సూచనలకోసం, గైడెన్స్ కోసం ఉపాధ్యాయులు వచ్చినప్పుడు వారికి మెంటరింగ్ చెయ్యడానికి తాము వాడుకునే టూల్స్ లో వీడియోగ్రాఫింగ్ కూడా ఒకటని చెప్పారు వారు.
ఎందుకంటే, ఉపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు, అతడి verbal communication ఎంత ప్రభావం చూపగలదో, అతడి non-verbal communication అంతకన్నా ఎక్కువ ప్రభావం చూపగలదు. ఉపాధ్యాయుడంటే ఒక లెసన్ ప్లాన్ కాదు, ఒక డెమాన్స్ట్రేటర్ కాడు, వట్టి వక్త కాడు. ఉపాధ్యాయుడు అన్నిటికన్నా మించి ఒక presence. అతడు తరగతి గదిలో అడుగుపెట్టగానే ఒక సువాసన ఆ గదిలో వీచినట్టుగా ఉండాలి. అతడు నోరుతెరవకముందే అతడి చూపులే పిల్లల్తో మాట్లాడటం మొదలుపెట్టాలి. అతడు చెప్పే పాఠంలోని విషయంకాదు పిల్లల్ని కట్టిపడేసేది, అసలు అతడు ఏం మాట్లాడినా పిల్లలు మంత్రముగ్ధులై పోగలగాలి.
‘మీరు చూసిన వీడియోలన్నిటిలోనూ ఏ ఉపాధ్యాయుడి పనితీరు మీకు ఎక్కువ ప్రశంసనీయంగా అనిపించింది?’ అనడిగాను సుధగారిని. ఆమె ఒక ఉపాధ్యాయిని గురించి చెప్పారు. ‘ఆమె తరగతి గదిలో అడుగుపెట్టగానే పిల్లల్లో ఒక సంతోషకరమైన కదలిక చూసాం మేం’ అన్నారామె. ‘వైబ్స్ అంటారే ఇప్పటి భాషలో, అవన్నమాట. ఒక సంతోషప్రకంపన ఆ తరగతిగదిని చుట్టేసింది’ అన్నారామె.
రెంటచింతల మండలంలో దాదాపు రెండువందల నుంచి మూడువందల దాకా ఉపాధ్యాయులు ఉండవచ్చు. అందులో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు వందా నూటయాభై మందిదాకా ఉండవచ్చు. కాని తమ పనితీరుని వీడియోగ్రాఫు ద్వారా పరిశీలిస్తారని చెప్పగానే దాదాపుగా డెబ్భై, ఎనభై శాతం మంది ఉపాధ్యాయులు విముఖత చూపించారు. కేవలం 33 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఒక ఎన్.జి.ఓ తమ పనితీరుని వీడియోగ్రాఫు చేస్తుందంటే సుముఖత చూపించారు. వారిలోంచి తొమ్మిదిమందిని సత్కారానికి ఎంపికచేసారుగాని, నా దృష్టిలో ఆ ముప్ఫై ముగ్గురూ కూడా సమ్మాన్యులే.
ఆ విధంగా ఉపాధ్యాయుల బోధననీ, పిల్లల్తో interaction నీ వీడియో తీసాక ఇద్దరు సీనియర్ ఉపాధ్యాయులు ఆ వీడియోలన్నీ చూసి సత్కారానికి అర్హులుగా భావించినవారిని ఎంపిక చేసారు. న్యాయనిర్ణేతలైన ఆ ఇద్దరు ఉపాధ్యాయులూ ప్రకాశం జిల్లావారు. వారిలో ఒకరు రమణారెడ్డి జీవితమంతా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీవిరమణ చేసారు. పదవీవిరమణ తర్వాత కూడా ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉచితంగా బోధన చేస్తున్నారు. తనకి కనిగిరిలో సొంత ఇల్లు ఉన్నా కూడా, తాను ఉచితంగా చదువుచెప్తున్న పాఠశాల ఉన్న గ్రామంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకు మరీ అక్కడే నివాసముంటున్న వ్యక్తి. మరొక న్యాయనిర్ణేత కవితగారు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని. ప్రాథమిక పాఠశాలల్లోనే పనిచేయడం కోసం ప్రమోషన్లు వదులుకున్న ఉపాధ్యాయురాలు. ‘నేను క్లాసు రూములోకి వెళ్ళగానే పిల్లల్తో పాటు కింద నేలమీదనే కూచుంటాను. టీచర్ ఛైర్ తో నాకెప్పుడూ పనిపడలేదు’ అన్నారామె. వారిద్దరినీ చూసిన తర్వాత ఎం.ఎల్.ఆర్ ఫౌండేషన్ చాలా సరైన వ్యక్తుల్నే న్యాయనిర్ణేతలుగా ఎంపికచేసారని అర్థమయింది.
ఉపాధ్యాయుల్తో పాటు పిల్లలకి కూడా బహుమతి ప్రదానం జరిగింది. పిల్లలకి కథారచనలో, వ్యాసరచనలో పోటీలు పెట్టి సీనియర్, జూనియర్ విభాగాలకింద ఎంపికచేసి బహుమతులిచ్చారు. నాకు చాలా సంతోషంగా అనిపించిందేమంటే, ఆ పిల్లలంతా దాదాపుగా గిరిజన విద్యార్థులు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లోనూ, కె.జి.బి.విల్లోనూ చదువుతున్న విద్యార్థులు. కథా రచన సీనియర్ విభాగంలో మొదటి బహుమతి పొందిన బాలిక ఒక ముస్లిం బాలిక. ఆమె తన డ్రీమ్ గురించి రాసుకున్న కథకి ప్రథమ బహుమతి లభించింది.
పిల్లలే కాదు, సత్కారం పొందిన ఉపాధ్యాయుల్లో కూడా గిరిజన ఉపాధ్యాయులున్నారు. వారిలో కొమరగిరి రమేష్ గురించి మరీ ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన యానాది తెగకు చెందిన ఉపాధ్యాయుడు. గిరిజన సంక్షేమశాఖ యానాదులకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రాథమిక పాఠశాలలో నియామకం పొందాడు. గత రెండు దశాబ్దాలుగా రెంటచింతలలోనే యానాది ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఆయన శ్రీమతి చదువుకున్నది అయిదో తరగతి మాత్రమే. కాని తాను కూడా తన భర్తకి సాయంగా ఆ పాఠశాలలో పిల్లలకి చదువుచెప్తున్నది. ఉచితంగా. రెండు దశాబ్దాల నిరుపమానమైన సేవ ఆమెని ఉత్తమ ఉపాధ్యాయినిగా తీర్చిదిద్ది ఉంటుందని వేరే చెప్పాలా!
కాని మా అందర్నీ ఆకర్షించింది ఆ పాఠశాల పిల్లలు. పొద్దుణ్ణుంచీ రోజంతా ఆ పిల్లలు ఆ ఉపాధ్యాయ దంపతుల్ని అంటిపెట్టుకునే ఉన్నారు. ఒక అయస్కాంతానికి అతుక్కుపోయినట్టుగా అతుక్కుపోయి ఉన్నారువాళ్ళు. నిజానికి మనమేదైనా ఒక ఫంక్షన్ కి వెళ్తే, మన పిల్లల్ని కూడా మనతో పాటు తీసుకువెళ్లినా, మన పిల్లలు కూడా మనతో పాటు అంతగా అతుక్కుపోరు. ఒక ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడని చెప్పడానికి అటువంటి ఒక దృశ్యం మనకంటపడితే చాలు. నిజానికి అటువంటి ఒక ఉపాధ్యాయుణ్ణీ, అతణ్ణే అంటిపెట్టుకుని ఉన్న అతడి శ్రీమతినీ, వాళ్ళిద్దరికీ అతుక్కుపోయి ఉన్న ఆ పిల్లల్నీ చూడటంకోసమే రెంటచింతల పోయి రావొచ్చనిపించింది.
నాకు ఇంకో సంగతి కూడా అర్థమయింది. ఉత్తమ ఉపాధ్యాయుల్ని చూడాలంటే నువ్వు ఏ అధికార స్థానంలోనూ ఉండకూడదని. అధికార బాధ్యతలు భుజాలమీద ఉన్నప్పుడు మన దృష్టి ఎంతసేపూ- బడికి రాని ఉపాధ్యాయులమీదా, బడికి డుమ్మా కొట్టి రాజకీయాలు చేసే ఉపాధ్యాయ నాయకులమీదా, బదిలీల కోసం పైరవీలు చేసే వాళ్ల మీదా మాత్రమే ఉంటుంది. కాని నీ కార్యాలయానికి ఒక్కసారి కూడా రాకుండా, రావలసిన పనిలేకుండా తమ తమ పాఠశాలల్లో నిశ్శబ్దంగా, తదేకంగా, పిల్లలే సర్వస్వంగా పనిచేసే ఉపాధ్యాయులు కొందరుంటారని నీకు తెలిసినా వాళ్ళని కలుసుకునే అవకాశం దొరకదు. ఇదుగో, ఏ పదవీ బాధ్యతల బరువులూ, సంకెళ్ళూ లేని స్వేచ్ఛాజీవిగా ఉన్నప్పుడే నీకు అటువంటి ఉపాధ్యాయుల దర్శనభాగ్యం లభిస్తుంది.
ఇంకో మాట కూడా అనిపించింది. ఎం.ఎల్.ఆర్ ఫౌండేషన్ వంటి సంస్థ గుంటూరులో పనిచేస్తున్నట్లయితే వారి సేవలు మధ్యతరగతికో లేదా అధిక ఆదాయ వర్గాలకు చెందిన పిల్లలకో, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకో అంది ఉండేవి. కాని ఆ సంస్థ తన కార్యక్షేత్రంగా రెంటచింతలని ఎంచుకున్నందువల్ల గిరిజనులకీ, దళితులకీ, ముస్లిం పిల్లలకీ ఆ సేవలూ, ఆ దిశానిర్దేశమూ అందుతున్నాయి. లక్ష్మారెడ్డిగారు ధన్యులు.
5-8-2024
చిన్నవీరభద్రుడు అన్నయ్య గారికి నమస్కారములు.ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఎలా ఎంపిక చేయాలో చక్కగా చెప్పారు. కేవలం ప్రభుత్వం ఇచ్చే జీతానికి మాత్రమే కాకుండా మారుమూల పల్లెటూర్లలో వున్న బీద విద్యార్థులను చైతన్య పరిచి, వారి ఉన్నతి కోసం జీవితాంతం శ్రమించిన ఉపాధ్యాయులకు శిరస్సు వంచి పాదాభివందనం చెయ్యాలనిపిస్తుంది. పిల్లల బాగు కోసం నిజాయితీగా పనిచేసే ఉపాధ్యాయులు అరుదైన ఈ రోజుల్లో ఎక్కడో ఒక చోట ఇలాంటి ఉపాధ్యాయుల గురించి చదివినప్పుడు కళ్ళు చెమ్మగిల్లుతాయి. ధన్యవాదములు అన్నయ్యా 🙏
ధన్యవాదాలు!
ఆ అద్భుతమైన ఉపాధ్యాయుల బాటలోనే తడబడుతూ అయినా, నడుస్తున్నానని భావిస్తూ….
అవును. నాకు తెలుసు.
ఒక చక్కటి అనుభవాన్ని పంచుకున్నారు.అంతా అక్కడ ఉండి చూసినట్లే ఉంది.అందరికీ అభినందనలు💐💐💐
ధన్యవాదాలు సోదరీ!
ఉపాధ్యాయుడు తరగతి గదిలో అడుగుపెట్టగానే ఒక సువాసన ఆ గదిలో వీచినట్టుగా ఉండాలి. అతడు నోరుతెరవకముందే అతడి చూపులే పిల్లల్తో మాట్లాడటం మొదలుపెట్టాలి. అతడు చెప్పే పాఠంలోని విషయంకాదు పిల్లల్ని కట్టిపడేసేది, అసలు అతడు ఏం మాట్లాడినా పిల్లలు మంత్రముగ్ధులై పోగలగాలి.
నాకు మీరు చెప్పిన ఇంకో సంగతి కూడా ఎంతో బాగుంది.
కార్యాలయానికి ఒక్కసారి కూడా రాకుండా, రావలసిన పనిలేకుండా తమ తమ పాఠశాలల్లో నిశ్శబ్దంగా, తదేకంగా, పిల్లలే సర్వస్వంగా పనిచేసే ఉపాధ్యాయులు కొందరుంటారని నీకు తెలిసినా వాళ్ళని కలుసుకునే అవకాశం దొరకదు. ఇదుగో, ఏ పదవీ బాధ్యతల బరువులూ, సంకెళ్ళూ లేని స్వేచ్ఛాజీవిగా ఉన్నప్పుడే నీకు అటువంటి ఉపాధ్యాయుల దర్శనభాగ్యం లభిస్తుంది.
నాకు నా గురువు అంటే నాన్నగారు.
వారి మీద నేనొక కవిత రాస్తూ విన్నవించాను.
చిట్టి చేతుల్లో ఈ చిన్ని గీతలెవరు గీశారంటే–
చిలకపలుకుల్తో గీతామృతాన్ని పలికించి రక్షణ నిచ్చే నీ ఒడి
విద్య వలన జాతికి బలం కలుగుతుందని చెప్పింది.
గతకాలపుదమ్మిడీ కానీలని ఒద్దికగా మూటగట్టి
వాస్తవపు రూపాయి గా మార్చి
బంగారు నాణెం కోసం ఆశపడవద్దని జాగ్రత్తచెప్తూ
కడుపు తీపిని పంచి ఇచ్చినట్టు
పట్టుకున్న దాన్ని సులభంగా వదిలే త్యాగం
దేహం కణంకణం లోంచి
వెల్లువలై పెల్లుబికే ఉత్సాహస్ఫూర్తి చెప్పింది
జఢత్వం లో నుంచే మానవత్వం వెల్లి విరుస్తుందని.
ఈ రోజు తమరి మాటలు అక్షరాలు దిద్దించిన మా నాన్నగారిని గుర్తు చేస్తూ…ఉపాధ్యాయుని మీద నిజ భక్తి ని కలిగించే అమృతమయమైన పలుకులు.
నమోనమః
ధన్యవాదాలు మేడం!
చాలా మంచి అనుభవాన్ని పంచారు. మా మిత్రుడు అల్లం వీరయ్య అని ఉపాధ్యాయుడు ఉన్నారు. ప్రస్తుతం పదవీ విరమణ చేసారు. ఎక్కడ పనిచేసినా, పిల్లలు వారి తల్లితండ్రులు వీరి బదిలీని ఆపమని పలు రకాలుగా విజ్ఞప్తులు చేసేవారు. ఉత్తమ ఉపాద్యాయులు వీరు. వారు పనిచేసే స్కూల్స్ లో పలు మార్పులు తీసుకువచ్చే వారు. కృతజ్ఞతలు సార్.
మీ స్పందనకు ధన్యవాదాలు. అటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వారి గురించి నలుగురికి తెలియాలి.
సుమారు 60 సవత్సరాల క్రితం గుంటూరు జిల్లాలో కొత్త రాజబాపయ్యగారు, తాళ్ళూరి వెంకటేశ్వరరావు గారు ఆదర్శవంతమైన బోధనా పద్ధతులేకాక మంచి పౌరులుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి అలుపెరగని పరిశ్రమ చేశారు. ఇంకా ఎందరో ఉండి ఉంటారు. నాకు తెలియదు. వెంకటేశ్వరరావుగారు మా హైస్కూల్ ఏర్పడడానికి కారణమైన ఆదర్శమూర్తి. (నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ మునిసిపల్ హైస్కూల్, ఐతానగర్, తెనాలి)
ఆయన ద్వారా రాజబాపయ్యగారి గురించి తెలిసింది. ఆరోజుల్లో ఉపాధ్యాయులందరూ విద్యార్థుల్ని కన్నబిడ్డలలానే చూసుకునేవారు. బోధించడం, ప్రేమించడం, దండించడం కూడా.
ఇంత మంచి ఉపాధ్యాయుల గురించి, వారిని గుర్తించి సత్కరించిన మహానుభావులగురించి, ప్రోత్సహించిన అధికారుల గురించి తెలుసుకుని ధన్యులమయ్యాము.
మీ గురువుల గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉంది.
Thank you sir, It‘s an honour to have you .
ధన్యవాదాలు మేడం!
ఇలాంటి ఉపాధ్యాయులు కదా మా అందరికీ స్ఫూర్తి.. మీరు ప్రతి విషయంలోనూ మాకు స్ఫూర్తిదాయకమే సార్
ధన్యవాదాలు మేడం