
బైరాగి శతజయంతి ఉత్సవం సందర్భంగా ఆయన కవితలు మూడింటిని పరిచయం చేస్తూ ఉన్నాను. నూతిలో గొంతుకలు కావ్యంలో వచ్చిన మూడు కవితలు-హామ్లెట్ స్వగతం, అర్జున విషాదయోగం, రాస్కల్నికోవులను- పరిచయం చేసే క్రమంలో ఇప్పటిదాకా అయిదు ప్రసంగాలు చేసాను. ఆ మూడింటిలో చివరగా అర్జున విషాదయోగం కవితను పరిచయం చేస్తూ గతవారం మహాభారతం గురించీ, భగవద్గీత గురించీ నా ఆలోచనలు కొన్ని పంచుకున్నాను. 28-2-2025 న ఫేస్ బుక్ లైవ్ ప్రసంగంలో ఆ కవితను వినిపించి, అస్తిత్వ విచికిత్సకు లోనైన మానవుడి జీవన్మరణ ప్రశ్నలను బైరాగి ఏ విధంగా పరిశీలనకు పెట్టాడో మరొకసారి వివరంగా చర్చించాను. ఈ ఆరు ప్రసంగాలతో బైరాగి మూడు కవితలపైన చర్చ పూర్తయ్యింది.
Featured image: Geetagyan, Madhubani painting
28-2-2025
మీ ప్రసంగాల ద్వారానే బైరాగి కవిత్వం పరిచయం అయ్యింది. అంతకు ముందు బైరాగి పేరు విని ఉన్నాను కానీ, కవిత్వం చదువుకోలేదు.
హామ్లెట్ తన తండ్రిని పినతండ్రి చంపాడని ప్రతీకారం తీర్చుకుంటాడు. తనకి ఎవరి సహాయం లేదు. తనలో తానే తర్కించుకుంటాడు.
అర్జునుడు లేదా పాండవులు ద్రౌపదికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నారు. ఇది వాళ్లకు తెలిసి చేసినిది. వాళ్ళకి కృష్ణుడు స్వయంగా సహాయం చేశాడు.
రాస్కల్నికోవ్ పదిమందికి మంచి జరగాలన్న ఉద్దేశంతో హత్య (లు) చేశాడు. సోనియా వల్ల ఆ నేరం తానే చేసానని ఒప్పుకుని ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకున్నాడు.
నాకేమనిపిస్తున్నదంటే, మన జీవితం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు దానిని దాటి ముందుకు సాగాలంటే, భగవంతుడు లేదా ఒక కరుణామయ మూర్తి సాయం చుక్కనిలా ఉంటే అప్పుడు మనం ఒక ప్రశాంతమైన తీరాన్ని చేరగలుగుతాము అని.
మానవ జీవితం చాలా సంక్లిష్టమైనది. మనిషి తనంతట తానే ఆ చట్రం నుండి బయటపడటం అనేది ఒక కష్టమైన వ్యవహారం. దాని నుండి తేలికగా విడివడాలంటే – తెడ్డులా ఒక భగవంతుడు లేదా జీవిత కష్ట, సుఖాలని దాటి వెలుగుని చూసి దానిని ఎదుట వారికి పంచే వ్యక్తి ఒకరు మన జీవితంలో తారసపడాలి. అప్పుడు, ప్రశ్న, ప్రత్యుత్తరం రెండూ ఒప్పవుతాయని తెలుస్తుంది.
ధన్యవాదాలు స్వాతీ! చాలా చక్కగా రాశారు.
మీకు చాలా ఇష్టమైన బైరాగి కవిత్వం శ్రోతలందరకూ కూడా ఎంతగానో నచ్చే విధంగా వివరించారు. పదాల్లో సింప్లిసిటీ,భావాల్లో లోతు, చాలా చక్కగా చూపించారు. ధన్యోస్మి.
ధన్యవాదాలు