మహాకావ్యపరిచయం

మొన్న సాయంకాలం నేనేదో పాత హిందీ పాటలు వింటూ ఉండగా యెర్రాప్రగడ రామకృష్ణ నుంచి వాట్సప్ మెసేజి. తెరిచి చూద్దును కదా- విశ్వనాథ సత్యనారాయణ గారి శతజయంతి సందర్భంగా,మా మాష్టారు శరభయ్యగారు 1995 లో, చేసిన ప్రసంగం.

అటువంటి ఒక ప్రసంగం లభ్యంగా ఉందని నాకిప్పటిదాకా తెలీదు. వెంటనే ఆన్ చేసి విన్నాను. ప్రసంగం మొదలై ఆయన ఏమి చెప్తున్నారో అవగాహన చేసుకునేలోపు ఈ పద్యం దగ్గరికి వచ్చేటప్పటికి నా హృదయం ఆర్ద్రమైపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. కొంతసేపటికి మనసు మొద్దుబారిపోయింది. ఆ తర్వాత ప్రసంగం వినబడుతూ ఉందిగాని, నా మనసు ఆ పద్యం దగ్గరే ఆగిపోయింది.

నా ప్రాణమ్ములకు నీ పొగమబ్బుల
కేమి సంబంధమో! యేను గూడ
పొగమబ్బునై కొండ చిగురు కోనల పైన
బురుజులపైని కొమ్ములకు పైని
వ్రాలిపోనో మధ్య వ్రీలిపోనో నేల
రాలిపోనో గాలి తేలిపోనో
నా యూహ చక్రసుందరపరిభ్రమణమై
యీ పొగమబ్బులనే వరించె

ఎన్ని పొగమబ్బులెరిగిలే నేను మున్ను?
తూర్పుకనుమలు విడుచు నిట్టూర్పులట్టి
విచటి ఈ పొగమబ్బులే యెడదలోని
లలితము మదీయగీతి నేలా వెలార్చు!!??

విశ్వనాథ ఒక స్కూల్లో పనిచేస్తున్నప్పుడు పిల్లల్ని ఎక్స్ కర్షనుకి కొండవీడు తీసుకువెళ్ళినప్పుడు దూరంగా రైల్లోంచే కొండవీడుమీద మబ్బుల్ని చూసాడట. వెంటనే ఈ పద్యాలు ఆయనలోంచి పొంగుకొచ్చాయి అని మాష్టారు చెప్తున్నారు. నాలుగేళ్ళ కిందట నేను మొదటిసారి కొండవీడు వెళ్ళినప్పుడు, ఆ కోట శిథిలాలపైకి ఆకాశం వచ్చి వాలడమూ, దూదిపింజల్లాంటి మేఘాలు ఆ సీమచుట్టూ హంసల్లాగా తేలియాడటమూ చూసినప్పుడు ఈ పద్యాల్నే తలుచుకున్నాను. అంతేకాదు, నెరూదా రాసిన The Heights of Machu Pichu కూడా తలుచుకున్నాను. అంత ఎత్తున ఆ కొండవీడు గిరిదుర్గం మీద వాలిన మేఘాలమందల్ని చూసినప్పుడు ఎవరికేనా ఒక loftiness అనుభవంలోకి రాక తప్పదనీ, బహుశా విశ్వనాథ ఏ తొలకరి వేళలోనో ఆ మబ్బుల్ని చూసి ఉంటాడని అనుకున్నానని కూడా రాసాను. కాని ఆయన ఎక్కడో దూరంగా రైల్లోంచే ఆ మబ్బుల్ని చూసి ఆ మేఘ విహాయస విహారాన్నిట్లా వర్ణించాడంటే చాలా ఆశ్చర్యం వేసింది. మాష్టారు దాన్నే తన్మయీభావం అన్నారు. ఆయన ప్రసంగంలో కల్పవృక్షసౌందర్యం గురించి వివరించడానికి దీన్నే ప్రాతిపదికగా తీసుకున్నారని తర్వాత అర్థమయింది.

కానీ మొదటిసారి విన్నప్పుడు నామనసుకి ఇవేవీ ఎక్కలేదు. ఆయన ఆ పద్యాలు శతజయంతి సభలో చదివి వినిపిస్తున్నప్పటికీ అవి గుంటూరుసీమలో కొండవీడు మీద రాసినవైనప్పటికీ నాకు మాత్రం ఆ పద్యాలు విన్నంతసేపూ మేఘాలు కాదు, గోదావరి కనిపిస్తూ ఉంది. ఆయన సదనంలో తన ‘వాల్మీకి నిలయం’ లో కూచుని ఆ పద్యాలు వినిపిస్తూ ఉంటే మేము వింటున్నట్టూ, అక్కడికి ఇరవై ముప్ఫై అడుగుల దూరంలోనే కొవ్వూరు లాంచీల రేవూ, ఆ పైన సముద్రపు పాయలాగా ప్రవహించే గోదావరీ నా కళ్ళముందు కనిపిస్తూ ఉన్నాయి. వంతెన మీంచి పాతకాలపు బొగ్గు రైళ్ళు పొగలు చిమ్ముతూ ప్రయాణిస్తున్నాయి. మార్కండేయుడూ, వేణుగోపాలుడూ తప్ప తక్కిన కొవ్వూరూ, రాజమండ్రీ ఎప్పట్లానే నిద్రపోతూ ఉన్నాయి. ఆ ఆకాశమంతా మాష్టారి కంఠస్వరం ఒక్కటే మేఘనిర్ఘోషంలాగా ప్రతిధనిస్తూ ఉంది.  నత్త గుల్లని మోసుకుంటూ తిరిగినట్టు నా సంసారాన్ని వెంటబెట్టుకుని ఊరినుంచి ఊరికి తిరుగుతూనే ఉన్నానుగాని, నా హృదయాన్ని మాత్రం అక్కడి రావిచెట్టుకే వేలాడగట్టి అక్కడే వదిలిపెట్టేసాననిపించింది.

ఆ పద్యం నా హృదయాన్ని రాపాడి రాపాడి వదిలిపెట్టాక, మళ్ళా నన్ను నేను కూడదీసుకుని ఆ ప్రసంగం మరోసారి విన్నాను. అది చాలా ముఖ్యమైన ప్రసంగమని నాకు తెలుసు. ఎందుకంటే మాష్టారికి విశ్వనాథ ‘గురువు గారు.’ ఆయన కాటూరి వెంకటేశ్వరరావుగాని ‘మాష్టారు’ అనే వారు. ఇదొక సున్నితమైన ఆచార్యభేదం. (చలంగారికి భగవాన్ అంటే రమణ మహర్షీ, ఈశ్వరుడంటే సౌరిసు ద్వారా పలికే దివ్యవాణి అన్నట్టు.) ఈ ప్రసంగం మొదలుపెట్టడమే కాటూరి వారి పద్యంతో మొదలుపెట్టారు. వెంకటేశ్వరరావుగారు ‘మంత్రమయవాణీ సత్యనారాయణా’ అని అన్నారట. మంత్రమయవాణి అనే ఆ పదబంధాన్ని మాష్టారు మరొకసందర్భంలో శ్రీనాథుడి కవిత్వానికి వర్తింపచెయ్యడం విన్నాను. మా మాష్టారు విశ్వనాథతో సమానంగా ప్రతిభావంతుడైనప్పటికీ, విశ్వనాథని చదివి ఆనదించడమే జీవితవ్యాపకంగా గడిపేసారనీ, తాను స్వయంగా ఒక మహాకావ్యం రాయగలిగి ఉండీ, కల్పవృక్ష ఛాయలో ఉండిపోడానికే ఇష్టపడ్డారనీ ఆయన పట్ల మాటల్లో పెట్టలేని ఒక నిరసన నాలో చాలాకాలంగా ఉంది. అందుకనే మా మాష్టారు ఎవరిమీద ప్రసంగించినా వినడానికి చెవికోసుకునే నేను ఆయన విశ్వనాథ మీద మాట్లాడినప్పుడు వినడానికి అంత సుముఖత చూపించేవాణ్ణి కాదు.

కాని ఈ ప్రసంగం, ఇందులో విషయాలు నేనింతకుముందే ఆయన్నుంచి, మరెన్నో సందర్భాల్లో విన్నవే అయినప్పటికీ, మళ్ళీ ఇలా వింటున్నప్పుడు నన్ను ఆలోచనలో పడేసాయి. ముఖ్యంగా కవిగా విశ్వనాథ ప్రతిభ కల్పవృక్షంలోకన్నా, ‘భ్రష్టయోగి’ ఖండకావ్యాల్లోనూ, నవలాకారుడిగా ఆయన ప్రతిభ వేయిపడగల కన్నా ‘ఏకవీర’ లోనూ కనిపిస్తుందని నా నమ్మకం. ఇందులో రెండో పరిశీలన నాది కాదు, సుదర్శనంగారిది. కాని ఆ వాక్యంతో నాకు పూర్తి ఏకీభావముంది.

కల్పవృక్షంలో విశ్వనాథ పూర్వాంధ్ర కవుల కావ్యప్రతిభనీ, సంస్కృత నాటక కర్తల శిల్పనైపుణ్యాన్నీ ఒకచోట ప్రోది చేసాడని మా మాష్టారు ఈ ప్రసంగంలో చెప్తూ ఉన్నారు. పూర్వాంధ్రకవులదృష్టిలో కవిత్వమంటే వర్ణన రామణీయకత. వర్ణన ద్వారా శ్రోతలో రససిద్ధి కలిగించడం. సంస్కృత నాటక కర్తల నాటక శిల్పమంటే తాను ఏ పాత్రల్ని వర్ణిస్తుంటే, ఏ పాత్రతో మాట్లాడిస్తుంటే ఆ పాత్రతో తన్మయీభావం చెందడం. అప్పుడు మాత్రమే ఏ రెండు పాత్రల సంభాషణలోనైనా ఒక నాటకీయత సిద్ధిస్తుంది. రెండింటిద్వారానూ కవి తానే స్వయంగా మాట్లాడుతుంటాడు కాబట్టి అది మనలోకూడా ఎటువైపు మొగ్గాలో తెలీని ఒక నాటకీయ ఉత్కంఠని కలగచేస్తుంది. మనం కూడా కవితో పాటు ఆ పాత్రల్లోకి ప్రవేశించి, ఆ నాటకాన్ని మన హృదయంలోకి తీసుకుపోతాం. తెలుగు కవుల్లో తిక్కన చేసింది ఇదే అని మాష్టారు ఈ ప్రసంగంలో ఒకటి రెండు సార్లు గుర్తుచేస్తూ ఉన్నారుకూడా.

వీటిలో మొదటిదాన్ని lyrical అనీ, రెండోదాన్ని dramatic అనీ, epic ఈ రెండింటినీ మేళవించుకుంటుందనీ అరిస్టాటిల్ అన్నాడని మనకు తెలుసు. ఆధునిక కాలంలో నవల modern popular epic గా మారిందని హెగెల్ అన్నాడని కూడా మనకు తెలుసు.

వర్ణనా, నాటకీయతా అనే ఈ రెండు కౌశల్యాల్నీ స్వంతం చేసుకుని, ఆధునిక కాలంలో నవల ముందుకొచ్చి ప్రాచీన కావ్యాన్ని పక్కకు నెట్టేసింది. కాబట్టి ఆధునిక కవి ఎంత అద్భుతమైన శిల్ప ప్రతిభను చూపించినా మహాకావ్యనిర్మాణం ఆధునిక జీవితానికీ, ఆధునిక శ్రోతకీ అనువైంది కాదు. కాని ఇవే నైపుణ్యాల్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని ఒక నవల రాసినట్లయితే ఒక మహాకవి కన్నా ఎక్కువగా అతడు విస్తృతపాఠకలోకాన్ని చేరగలడు. కల్పవృక్షం మీద నా అభియోగం ఏమిటంటే అది నవలగా రావలసింది మహాకావ్యంగా వచ్చిందని. ఈ పరిశీలన నిజానికి శ్రీశ్రీది. కల్పవృక్షం విశ్వనాథ రాసిన పెద్ద నవల అని అన్నాడాయన.

ఆధునిక పాఠకుడికి ఒక మహాకావ్యాన్ని చదివే తీరికా, దానిలోని రహస్యాల్ని ఆకళింపు చేసుకుంటూ ప్రయాణించే ఓపికా ఉండవు. ఆధునిక జీవితం దానికి అనుకూలించదు. సౌందర్యాన్ని శకలాల్లోనే చూడగలడు, స్వీకరించగలడతడు. ఈ రహస్యం ఆధునిక శిల్పులకి తెలుసు. అందుకనే వారొక చిన్న దారుశిల్పాన్నే, కాంస్యశిల్పాన్నో తీరుస్తారుగాని, ఒక మహాబలిపురం రాతిదేవాలయాన్ని తిరిగికట్టాలనుకోరు.

విశ్వనాథ ఖండకావ్యాలు, ‘భ్రష్టయోగి’, ‘గిరికుమారుని ప్రేమగీతాలు’ వంటివాటిల్లో ఆధునిక జీవితానికి సరిపోయే కవిత్వముంది. ఆ కవితలు ఇంగ్లిషులోకి సమర్థవంతంగా అనువాదమైతే విశ్వనాథని అత్యంత ప్రతిభావంతుడైన కవిగా ప్రపంచం గుర్తించగలదని నా నమ్మిక.

ఇవీ-ఇప్పటిదాకా నా అభిప్రాయాలు.

కాని ఈ ప్రసంగం మళ్ళా రెండోసారి విన్నాక, ముఖ్యంగా మాష్టారి గొంతులో ఈ కల్పవృక్ష పద్యాలు విన్నాక, నేను కొత్త ఆలోచనల్లో పడ్డాను. ఉదాహరణకి, ఈ పద్యం చూడండి. సుమంత్రుడు రాముణ్ణి అడవిలో వదిలిపెట్టి అయోధ్యకు తిరిగి వచ్చాక దశరథుడితో చెప్తున్న ఈ మాటలు మాష్టారి గొంతులో వినండి:

ఓ మహారాజ! నీ యూళ్ళలో, నీళ్ళలో
జెరువులందున నొక్క చేపలేదు
భూలోకమఘవ! నీ నేలలో, బూలలో
దోటలందున నొక్క తేటిలేదు
పృథ్వీశ! నీ రాజ్య వీథిలో వీథిలో
బురములందున నొక్క పురుగులేదు
ప్రభు! మీరు చను నసివాళ్ళలో బీళ్ళలో
పసిమి మేసేడు నొక్క పశువు లేదు

చిన్నికోడలితోడ రామన్నవదలి
వచ్చుచున్నట్టి నాదు దౌర్భాగ్యముఖము
పరిహరించిరొ నాదు సేవకతపొంటె
బృధ్విపతి! యెంతగా బ్రతారించినావు? (అయో.మునిశాప.95)

కల్పవృక్షం చదువుకుంటూపోతున్నప్పుడు నేనైతే ఈ పద్యం దగ్గర ఆగి ఉండేవాణ్ణి కాను. ఎవరేనా ఈ పద్యాన్ని ఎత్తిచూపి ఉంటే, నాకు వెంటనే వాల్మీకి రామాయణంలో భరతుడు అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు చూసిన అయోధ్య (2:114-1-27) గుర్తొచ్చి ఉండేది. ఆ దృశ్యాన్ని విశ్వనాథ కూడా వర్ణించకపోలేదు (అయో.మునిశాప, 364-370). కాని ఆ వర్ణన వాల్మీకి ఎదట నిలబడగలిగేదికాదు. నిలబడలేదని విశ్వనాథకి కూడా తెలుసు. అందుకనే ఆయన రాముడిలేని అయోధ్యను భరతుడి కళ్ళతో కాక సుమంత్రుడి కళ్ళతో వర్ణించడానికి పూనుకున్నాడని అనుకోవచ్చు. కాని మా మాష్టారి గొంతులో పై పద్యం విన్నప్పుడు నాలో కలిగిన భావసంచలనం మాటల్లో పెట్టలేనిది. ఈ మామూలు తెలుగుమాటలు, ఈ predictable description మాష్టారి గొంతులో వినగానే అపూర్వరామణీయకతను, ఒక అలౌకిక శోకసమ్ముగ్ధతను సంతరించుకుంది.

అలానే రాముడి అందాన్ని వర్ణించాలంటే కవి సీత కళ్ళతో కాదు, శూర్పణఖ కళ్ళతో చూడమంటున్నాడు అని వినిపించిన ఈ రెండు పద్యాలూ చూడండి:

తొలకరిన్ మొయులు తూగుచున్నదో
యలసతన్ నెమలి యాడుచున్నదో
సొలయకన్ జివురు చూచుచున్నదో
యలరువింటిదొర వౌదువా మునీ! (అరణ్య, పంచవటి.95)

నేరేటి పండ్లెరుపు నీలిపగుళ్ళ రంగై
యౌరర నీ తనువునందము చిందిపోవున్
రారా మనోభవశరప్రమితాకృతీ ప్రా
వారాంతదేశమున బట్టెద జిందకుండన్ (96)

మొదటి పద్యం ప్రియంవద వృత్తమట, రెండోది వసంతతిలక వృత్తమట. సరే. ఆ ఛందస్సులే ఎంచుకోడంలోని అందం అలా ఉంచి, ఆ రెండు చిన్న పద్యాల్నీ మాష్టారు చదువుతుంటే, కవి శూర్పణఖతో పొందిన తన్మయీభావాన్ని తిరిగి సహృదయుడు తాను కూడా పొంది ఆ తన్మయీభావప్రపంచంలోకి మనల్ని కూడా లాక్కుపోతున్నాడని తెలుస్తోంది. నేను ఎంత reluctant గానైనా ఆ పద్యాలు వింటూ  ఉండవచ్చుగాక, కాని ‘ నేరేడు పండులాంటి నీ దేహం అడవుల్లో నడిచినప్పుడు కందినచోట, ఆ పండ్ల నీలిపగుళ్ళలోంచి ఎర్రని రంగు ఒలికిపోతోంది, అది నేలపాలు కాకుండా నా పైట పరిచి పట్టుకోనివ్వు’ అని శూర్పణఖ చెప్తోందని మా మాష్టారు చెప్తున్నప్పుడు, ఆ మాటలనే మత్తులో పడిపోకుండా ఎలా ఉండగలను?

దీన్ని ఆయన రసధ్వని అంటున్నారు. అంటే కేవలం వర్ణన రసాన్ని మాత్రమే ఉద్దీపింపచేయగలుగుతుంది. కాని ఒకటి వర్ణిస్తున్నప్పుడు ఆ వర్ణన ఏకకాలంలో రసోద్దీప్తినీ, దాన్ని దాటిన ఒక సూక్ష్మ అనుభూతినీ మనలో మేల్కొల్పినప్పుడు దాన్ని రసధ్వని అంటాం. ఉదాహరణకి ఆయనే వినిపించిన ఈ పద్యం వినండి:

ఏదీ రావణుడన్న రాక్షసధరాభృత్స్వామి విన్నావటో
యా దైత్యేశ్వరు పట్టపేన్గువలె నీయాకారమేపారు గా
దా దైత్యద్విపరాజు హొంజిలుగు హౌదా వోలెనున్నాను నే
నీ దాంపత్యపు హౌసు చూడగదవోయీ! మౌనిరాణ్మన్మథా! (97)

మాష్టారు ఈ పద్యానికి అర్థం వివరించలేదుగాని, మనం ఊహించవచ్చును, రాముడు రావణుడి పట్టపుటేనుగలాగా ఉన్నాడనీ, తాను ఆ పట్టపుటేనుగ పైన నిలబెట్టిన బంగారు అంబారీలా ఉన్నాననీ, తామిద్దరి దాంపత్యం ఎంత శోభించగలదో చూడమనీ శూర్పణఖ చెప్తున్నప్పుడు, ఆ వర్ణనలోని చమత్కారాన్ని దాటి, అటువంటి grotesque ఊహ ఒక తామసి మాత్రమే చెయ్యగలదని మనకి కవి చెప్పకుండానే తెలుస్తూ ఉన్నదికదా, ఇది ధ్వని.

ఇలానే ఈ ప్రసంగంలో ఆయన వినిపించిన ఎన్నో పద్యాలు, ముఖ్యంగా జటాయువు మాట్లాడిన మాటలు, రావణుడి మాటలు-కొంతసేపు పోయేటప్పటికి, ఆ ప్రసంగం పున్నమినాటి సముద్రంలాగా కెరటాల హోరుతప్ప మరేమీ వినిపించని స్థితికి చేరుకుందని మనకు తెలుస్తూనే ఉంటుంది.

సాధారణంగా మనుషులు స్త్రీపట్లా, కవిత్వం పట్లా తొందరగా మాట తూలతారని భవభూతి అన్నాడని గుర్తు చేస్తూ, తన ప్రసంగసారాంశంగా ఆయన చెప్తున్నదేమిటంటే, గొప్ప కవిత్వాన్ని సమీపించడానికి, అనుభవమూ, మననమూ కావాలి తప్ప bookish knowledge కాదని. ఈ ప్రసంగమంతా విన్నాక నాకేమి అర్థమయిందంటే ఒక మహాకావ్యానికి కాలనియంత్రణ లేదని. ఒక సహృదయుడెవరేనా ఆ కావ్యానుభవాన్ని పొంది, ఆ అనుభూతినే పదే పదే మననం చేసుకుంటూ ఉన్నప్పుడు, మనం అతడి ద్వారా ఆ కావ్యం గురించి వింటున్నప్పుడు, దేదీప్యమానమైన హారతివెలుగులో మూలవిరాట్టు దర్శనం లభించినట్టు ఆ మహాకావ్యసౌందర్యదర్శనానికి క్షణమేనా నోచుకుంటామని!

మహాకావ్యమంటే మనం ప్రతిసారీ మొత్తం కావ్యం చదవాలి అని అనుకోనక్కరలేదు. ఆ కావ్యంలో ప్రతి ఖండమూ, ప్రతి సర్గా, ప్రతి పద్యమూ దానికదే ఒక సంపూర్ణసౌందర్యంతో వికసించి ఉంటుందని చెప్పడానికి ఆయన ఈ వాల్మీకి శ్లోకాన్ని ఉదాహరించడం నిరుపమానమైన రసజ్ఞత.

మహీకృతా పర్వతరాజి పూర్ణా
శైలాః కృతా వృక్షవితానపూర్ణాః
వృక్షాః కృతాః పుష్పవితానపూర్ణాః
పుష్పం కృతం కేసరపత్రపూర్ణమ్ (సుందరకాండ, 7-9)

ఈ శ్లోకాన్ని ఇంతకు ముందు ఆయన ఒకసారి రామాయణ సౌందర్యాన్ని అర్థం చేసుకోడానికి ఉపయోగించినట్టు గుర్తు. ఇప్పుడు అదే శ్లోకంతో కల్పవృక్షం గురించి చెప్తున్నారు. నిజానికి ఏ మహాకావ్యాన్ని సమీపించడానికేనా ఉపకరించగల ఫోకసులైటు ఇది.

వినండి ఈ ప్రసంగాన్ని.  ప్రసంగం వినడం పూర్తయ్యేటప్పటికి మీరు కూడా నాకులానే కెరటాలు మీ ఇంటిదాకా వచ్చిన చప్పుడు వింటారు.

4-3-2025

12 Replies to “మహాకావ్యపరిచయం”

  1. ఇలాటి అద్భుత ప్రసంగ రచనలు మీ ద్వారా విని చదవ గలగటం మా అదృష్టం సర్.
    ధన్యోస్మి.
    విజయ్ కోగంటి

  2. భద్రుడు గారు.. మీ ఈ పోస్టు ఎంత అద్భుతంగా వుందో, ఎంత సంతోష పెట్టిందో మాటల్లో వ్యక్త పరచలేను. మీరు పంచుకున్న మల్లంపల్లి శరభయ్య గారి ప్రసంగం మరో ప్రపంచానికి తీసుకుపోయి అలౌకిక ఆనందంలో ముంచెత్తింది.నాలాంటి విశ్వనాథ రామాయణ కల్పవృక్ష అభిమానులకి మీరు చేసిన కావ్య పరిచయం, ఎంచుకున్న పద్యాల విశ్లేషణ రెండు మూడు సార్లు చదివినా తృప్తిగా లేదు.. మీకు అనేక ధన్యవాదాలు ..

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్! ఇది రాస్తున్నప్పుడు, షేర్ చేస్తున్నప్పుడు మీరు నా మనసులో ఉన్నారు.

  3. ఆ ప్రసంగం విన్నాను. మీ అనుభవ పూర్ణ వాక్యాలు ఇప్పుడు చదివాను. రాజమహేంద్రవరం లో మాష్టారితో సమకాలంలో “జీవించి” ప్రత్యక్షంగా ఆయన ” రసమయ వాణి”ని విన్న మన కన్నా అదృష్టవంతులైన సాహిత్య విద్యార్థులు ఇంకెరున్నారు?

    1. అవును సార్! మీరు కూడా ఆ యూట్యూబ్ వీడియో కింద పెట్టిన వ్యాఖ్య చదివాను. అందులో మీరు నన్ను కూడా తలుచుకోవడం నాకు చాలా సంతోషం అనిపించింది.

  4. rammohanthummuri – I am a writer, a poet, a head master, a fater, a husband, and a creative person. I primarily in telugu language.
    Thummuri says:

    You made my day sir. పది పన్నేండ్లకే పత్రికలు తిరగేస్తూ ఆపై అనేక ఆధునిక నవలలు సీరియళ్లుగా చదివే వ్యసనం అలవడిన నాకు తొలిసారిగా చదివిన ఆయన దూతమేఘం ఒక కొత్తదారి చూపింది. ఆ తరువాత , వీరవల్లడు, మ్రోయుతుమ్మెద, బాణామతి,ఏకవీర, భ్రమరవాసిని ,వేయిపడగలు,ఇంకా చాలా నవలలు చదివి ఆయనంటే ఒక ప్రత్యేక అభిమానం ఏర్పడి పోయింది. ఆ పేరు ఎక్కడ విన్నా తన్మయించే లాగా. జువ్వాడి గౌతమరావుగారనగా విన్నట్లు గుర్తు. వేయిపడగలు నవలారూపకావ్యం, కల్పవృక్షం కావ్యరూప నవల అని. చాలా మందికి నచ్చకపోవచ్చుకాని ఆయన వచనం చదువుతుంటే ప్రవాహం లో పయనించే నావలో ప్రయాణిస్తున్న అనుభూతి కలగటం నా కు మాత్రమే కావచ్చు. మీ గురువుగారి ప్రసంగం వింటాను. నమస్సులు.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%