ఇద్దరు మహనీయులు

Reading Time: 2 minutes

22

ఇద్దరు మహనీయుల్ని తలుచుకోవాలి ఈ వేళ: ఒకరు సంజీవదేవ్.

ఆదివారం సంజీవదేవ్ శతజయంతి ఉత్సవాలు హైదరాబాదులో మొదలయ్యాయి. హైదరాబాదు స్టడీ సర్కిల్లో జరిగిన సమావేశంలో చాలామంది కవులు, కళాకారులు, పత్రీకాసంపాదకులు ఆయన్ని తలుచుకున్నారు. మాట్లాడిన వాళ్ళందరి జీవితాల్లోనూ ఎప్పుడో ఒకప్పుడు ఎంతోకొంత సంజీవదేవ్ సాన్నిహిత్యాన్ని, సహృదయాన్నీ అనుభవించిన జ్ఞాపకం ఉంది. వాళ్ళందరిలో నా అనుభవమే కొద్దిగా భిన్నం. వాళ్ళంతా యువకులుగా ఉన్నప్పుడో, ప్రపంచం కొద్దిగా తెలిసాకనో సంజీవ్ దేవ్ ని చూసారు.నేనింకా లోకంలోకి కళ్ళువిప్పుకోకముందే, తాడికొండలో హైస్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయనకు ఉత్తరాలు రాసాను. ఆ చిన్నవయసులోనే నాలుగైదేళ్ళపాటు ఆయన్నుంచి ఉత్తరాలు అందుకున్నాను. అందుకనే ఆయన్ని నేను నా బాల్యమిత్రుడని చెప్పుకుంటూ వుంటాను.

ఆ రోజు రావెల సాంబశివరావు రాసిన జీవితచిత్రణని కూడా ఆవిష్కరించారు. ఆ పుస్తకానికి ‘సంజీవినీరాగం’ పేరిట నేను కూడా ముందుమాట రాసాను. సంజీవదేవ్ తెలుగుసాహిత్యానికీ, తెలుగుసంస్కృతికీ అందించిన కాంట్రిబ్యూషన్ గురించి అందులో కొంత వివరించడానికి ప్రయత్నించాను.

ఆ రోజు మాట్లాడినవాళ్ళల్లో దర్భశయనం శ్రీనివాసాచార్య సంజీవదేవ్ తనకి రాసిన ఉత్తరాల్ని ‘మెత్తని ఉత్తరాలు’ (2012) గా తీసుకొచ్చినట్టు చెప్పాడు. మీటింగ్ అవగానే ఆ పుస్తకం అడిగి తీసుకున్నాను. సంజీవ్ దేవ్ రచనల్లో తాజాగా వచ్చిన ఆ పుస్తకం నన్ను నిరాశపరచలేదు. అనితరసాధ్యమైన, సంజీవ్ దేవ్ కే సొంతమనిచెప్పదగ్గ ఇన్ సైట్స్ ఆ ఉత్తరాల్లో చాలా కనబడ్డాయి. మచ్చుకి ఒకటి రెండు:

‘కొందరు ముఖ్యంగా రాజకీయాలూ మొదలైన ఆందోళనలకు దూరంగా ఉండటం ప్రశాంతికి భంగం కలుగుతుందని భయంతోనా అని (మీరు) అడిగారు. అశాంతి రాజకీయ ఆందోళనల్లోనే కాదు, సాహితీసాధనలో కూడా తడుతుంది.కనుక శాంతి, అశాంతి అన్న ప్రశ్నయే లేదు.’ (18-3-1986)

‘ఒక సత్యం బయటపడాలంటే ఒకటి కంటే మించిన సిద్ధాంతాలు కావాలి.'(5-8-1987)

కృష్ణమూర్తి గురించి రాసిన కవితలో

‘Krishnamurti was not a figment, but a luminous pigment.’ (20-3-1989)

*

మరొకరు గిడుగురాజేశ్వర రావు. ఆదివారం ఉదయం డిల్లీలో అనాయాసంగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిన రాజేశ్వరరావు గారితో నా పరిచయం మరీ ఇటీవలిది.

ఆయన రాసిన ‘ఉదాత్తచరితుడు గిడుగు’ చదివినప్పుడు ఈయన్ని ఎలాగైనా చూడగలనా అనుకున్నాను.పోయిన ఏడాది ఆగష్టులో గిడుగురామ్మూర్తి జయంతి సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయనకు సత్కారం చేసారు. ఆ రోజు గిడుగు మీద నేను మాట్లాడేను. ఆ రోజే ఆయన్ని మొదటిసారి చూడటం, మాట్లాడం. ఆ ముఖంలో గొప్ప ప్రశాంతి, చెరగని చిరునవ్వు.

ఆశ్చర్యంగా కొన్నాళ్ళ తరువాత ఆయన మా ఆఫీసుకి వచ్చారు. తాను ‘సృష్టిలో మధురిమలు’ పేరిట ఫొటోలతో, పద్యాలతో తీసుకువస్తున్న పుస్తకాన్ని చూపించి ఆ రచనకు నన్ను ముందుమాట రాయమని అడిగారు. ఆ పుస్తకాన్ని చూసిన తరువాత ఆయన మనోభూమిక తపోలోకాన్ని అందుకుందని అర్థమయింది నాకు. ‘భగవంతుడితో సంభాషణ’ పేరిట నేను రాసిన నాలుగు వాక్యాలూ ఆయన్నెంతో సంతోషపర్చడం నన్నెంతో సంతోషపరిచింది.

గిడుగు వారసుడిగా ఆయన మన గౌరవానికి పాత్రుడేగాని, ఆయనకు తనదంటూ ఒక విశిష్ట వ్యక్తిత్వం ఉంది. పుట్టినందుకు మనిషి ఈ జీవితంలో చూడవలసిన సత్యాన్ని ఆయన మౌనంగా చూసాడనీ, దానితో ఎంతోకొంత తనను తాను కలుపుకున్నాడనీ నేను చెప్పగలను. పువ్వులాగా చిరునవ్వుతో నా ముందు కూచుని మాటాడుతున్న ఆ మనిషి నా జీవితమంతా నాకు గుర్తుంటాడు.

22-7-2013

 

Leave a Reply

%d bloggers like this: