రాల్ఫ్ ఎల్లిసన్

Reading Time: 4 minutes

95

ఏ భాషలో వికసించిన సాహిత్యానికైనా వెడల్పు, ఎత్తు, లోతు ఉంటాయి. ఆ భాష మాట్లాడే మనుషుల జీవితానుభవాల్ని బట్టి ఆ సాహిత్యానికుండే విస్తృతి రూపుదిద్దుకుంటుంది. ఆ అనుభవాల్ని ఆ రచయితలు ఎంత తీవ్రంగానూ, ఎంత పరిణతితోనూ చెప్పారన్నదాన్నిబట్టి, ఆ సాహిత్యమందుకునే ఎత్తులు అర్థమవుతాయి. ఆ అనుభవాల గురించి ఆ మనుషులు ఎంత గాఢంగా ఆలోచించారన్నదాన్నిబట్టి ఆ సాహిత్యం లోతు తెలుస్తుంది. అట్లా చూసినప్పుడు, రెండువందల ఏళ్ళ ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యం ఎంత లోతుకు పోగలదో రాల్ఫ్ ఎల్లిసన్ నవల Invisible Man (1952) ని బట్టి మనం ఊహించవచ్చు.

ఈ వ్యాసాలు మొదలుపెట్టినప్పుడు Invisible Man గురించి కూడా రాస్తున్నావు కదా అని కన్నెగంటి రామారావు అడిగినప్పటినుంచీ ఆలోచిస్తూనే ఉన్నాను, ఒక చిన్న పరిచయంలో ఆ నవలకు న్యాయం చేయగలనా అని. ఒక వ్యాసం కాదు, ఒక గోష్ఠి కావాలి. ఎందుకంటే, గత అరవై ఏళ్ళుగా ఆ నవల మీద చర్చ నడుస్తూనే ఉంది. ‘కిర్క్ గార్డ్ కారిడార్’ లాగా ఎల్లిసన్ నవల గురించి కూడా ఒక నిరంతర సంభాషణ కొనసాగుతూనే ఉంది.

ఇప్పటికి, ఆ నవల గురించి స్థూలంగా మూడు అంశాలు ప్రస్తావించగల ననిపించింది. ఒకటి, ఐడెంటిటీకి సంబంధించిన చర్చను ఆ నవల ఎట్లా మొదలుపెట్టిందీ, రెండవది, తన చర్చకోసం ఆ రచయిత నవలా ప్రక్రియనే ఎందుకు ఎంచుకున్నాడు, మూడవది, ఆ నవల్లో అతడు చూపించిన ప్రత్యేకమైన రచనాసంవిధానమేమిటన్నది.

డగ్లస్ తో మొదలైన ఆఫ్రికన్ అమెరికన్ ఆత్మకథనాలు 1845 నుంచి 1945 దాకా వందేళ్ళ పాటు నల్లజాతి స్వాతంత్ర్యం గురించి మాట్లాడేయి. ఆ రచయితలంతా నల్లజాతివారిగా తమ ఐడెంటిటీ ని గుర్తుపడుతూ, ఆ ప్రాతిపదిక మీద తమ హక్కుల గురించీ, స్వాతంత్ర్యం గురించీ రాస్తూ వచ్చారు. వాళ్ళ దృష్టిలో స్వాతంత్ర్యమంటే తాము కూడా మనుషులమేనని చెప్పుకోవడం, తమకి కూడా తక్కినవారిలాగా జీవించే హక్కు ఉందని వాదించడం. అంతకు మించి, స్వాతంత్ర్యమంటే ఏమిటనే, తాత్త్విక చర్చలోకి వాళ్ళు పోలేదు. తాము మాట్లాడుతున్న స్వాతంత్ర్యమంటే ఏమిటో దాని అర్థం అందరికీ తెలుసనే అనుకున్నారు.

కాని, స్వాతంత్ర్యమంటే ఏమిటి? ‘నిన్ను నువ్వు తెలుసుకోవడం’ అనేది ఒక సనాతన ఆధ్యాత్మిక నిర్వచనం. నిన్ను నువ్వు తెలుసుకోగలిగితే విముక్తి దొరుకుతుందనేది ప్రాచీన దర్శనాలు చెప్పిన మాట. నీ అవసరాలేమిటో తెలుసుకోగలగడమే స్వాతంత్ర్యం అనేది ఆధునిక కాలం చెప్పిన నిర్వచనం. పందొమ్మిదో శతాబ్దిలో ఎంగెల్స్ చెప్పిన మాట freedom is the recognition of necessity సుప్రసిద్ధం. కాని,నేనేవరో నాకు తెలియకుండా నా అవసరాలేమిటో నాకెలా తెలుస్తాయి? నేను నా అవసరాలుగా భావిస్తున్నవి నిజంగా నా అవసరాలేనా లేక బయటి ప్రపంచం, బయటి శక్తులు నా మీద ఆరోపిస్తున్నవా? నా అవసరాలుగా నన్ను నమ్మిస్తున్నవా? ఈ ప్రశ్నల్ని చర్చిస్తూ, 20 వ శతాబ్ది పూర్వార్థంలో యూరోప్ లో అస్తిత్వవాదం తలెత్తింది. అస్తిత్వవాదుల దృష్టిలో అస్తిత్వం దానికి మనం చెప్పుకునే అన్ని వ్యాఖ్యానాలకన్నా ముందటిది. ముందు అస్తిత్వం, తర్వాతే దానికి మనం చెప్పుకునే ప్రయోజనం. అంటే, అస్తిత్వం తనకన్నా ముందు నిర్వచించబడ్డ సూత్రాల ప్రకారం, పరమార్థాల ప్రకారం నిర్ణయించబడేది కాదు. అంతకు బదులు, అస్తిత్వమే తన ప్రయోజనాన్ని నిర్ణయించుకోగలదు. ఆ స్వాతంత్ర్యమే అస్తిత్వముఖ్య లక్షణం. అది అస్తిత్వం తాలూకు అనివార్య బాధ్యత కూడా.

రాల్ఫ్ ఎల్లిసన్ నవల ఈ తాత్త్వికనేపథ్యంలో వచ్చిన నవల. అలాగని అది నేరుగా, అస్తిత్వవాద తత్తవేత్తల ప్రభావంలోంచి రాసింది కాదు. ఆ ధోరణిని మనం Black Existentialism అనుకోవచ్చు. అస్తిత్వమూ, స్వాతంత్ర్యమూ, ఐడెంటిటీ ఒకదానికొకటి విడదీయలేని అంశాలనీ, నేనేమిటో నాకు తెలిస్తే తప్ప నా స్వాతంత్ర్యం నాకు సాధ్యం కాదనీ చెప్పడం ఆ రచనలో ఇతివృత్తం. ఉదాహరణకి, నేను నల్లజాతివాడిని అంటున్నప్పుడు, అది నా జాతి ఐడెంటిటీ కాని ఒక వ్యక్తిగా నా ప్రత్యేకతని సూచించేదేదీ అందులో లేదు. కాని నేను అమెరికన్ ని కూడా. అలాగని నేను పూర్తి అమెరికన్ గా వికసించకుండా నా నల్లజాతి ముద్ర నాకు అడ్డుపడుతోంది. కాని నేను నా నల్లజాతి ఐడెంటిటీని పక్కనబెట్టి ఎప్పటికీ ఒక అమెరికన్ ని కాలేను. కాని నా జాతి, నా దేశం ఆ రెండింటినీ దాటికూడా ఒక మనిషిగా నాకొక అస్తిత్వం ఉంది. ‘నేను’ కేవలం నామీద చుట్టూ ఉన్నవాళ్ళు ఆరోపిస్తున్న లక్షణాలు మటుకే కాదు. వాళ్ళు నన్ను చూస్తున్నతీరుని బట్టి వాళ్ళకి నేనెప్పటికీ నా నిజమైన వ్యక్తిత్వంతో కనిపించే అవకాశమే లేదు. ఒక విధంగా చెప్పాలంటే, నా వైయక్తిక, వైశేషిక దర్శనం వాళ్ళకి దొరకడం లేదు కాబట్టి, నేను వాళ్ళకి అగోచరంగా ఉన్నాను. అందుకని, Invisible Man నవల మొదలుపెడుతూనే కథకుడు I am an invisible man అంటాడు. ఆ తర్వాత 600 పేజీలపాటు చేసిందంతా, తన వివిధ అనుభవాలతో, ఆ వాక్యాన్ని వివరించుకుంటూ పోవడమే.

19 వ శతాబ్దం చివర్లో, 20 వ శతాబ్దం ప్రారంభంలో ఆఫ్రికన్-అమెరికన్ల విద్య గురించి బుకర్ వాషింగ్టన్ చేసిన ప్రయత్నాల్నీ, మార్కస్ గార్వే నల్లజాతీయత గురించి చేసిన వాదనల్నీ, 30 ల తర్వాత ఉవ్వెత్తున చెలరేగిన వామపక్ష ఉద్యమాల్నీ ఎల్లిసన్ ఈ నవల్లో నిశిత పరీక్షకి గురిచేసాడు అని చెప్పవచ్చుగానీ అది పాక్షికమే అవుతుంది. అతడు చెప్పదలుచుకున్నది చాలా స్పష్టం. ఇతరులు నిన్నెలా చూస్తున్నారన్నదాన్నిబట్టి, వాళ్ళ perceptions ని బట్టి నీ గురించిన సత్యం నీకెప్పటికీ బోధపడదు. నిజానికి, నీకొక స్థిరమైన ఐడెంటిటీ ఉందనుకోడం కూడా సరైనది కాదు. అది ఎప్పటికప్పుడు మారుతూ, కొత్తగా నిర్మితమవుతూ, ధ్వంసమవుతూ, మళ్ళా పునర్నిర్మితమవుతూ ఉంటుంది. నువ్వెవరో నీకు తెలిస్తేనే నువ్వు స్వతంత్రుడవుతావు, నిజమే కాని, అంతిమంగా, నీ స్వాతంత్ర్యాన్ని నువ్వే అనుక్షణం సముపార్జించుకోవలసి ఉంటుంది, నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు నిర్మించుకుంటూ, దర్శించుకుంటూపోవలసి ఉంటుంది.

ఈ విధ్వంసానికీ, ఈ పునర్నిర్మాణానికి అతడు నవలని ఒక సాధనంగా వాడుకోవడంలో ఆశ్చర్యంలేదు. ఎందుకంటే, ఆధునిక యుగంలో, మనిషి తన self-consciousness ని వ్యక్తం చేసుకోవడానికి నవలనే ఆశ్రయించాడు. కాని,18, 19 శతాబ్దాల్లో నవల కొత్త మధ్యతరగతి, బూర్జువా చైతన్యాన్ని వ్యక్తంచేయడానికి మాత్రమే పనికొచ్చింది. జీవితం స్థిరంగానూ, ఆశావహంగానూ నడుస్తోందన్న భ్రాంతికలిగించింది. కాబట్టి నవలలో కనిపిస్తున్న స్వీయచైతన్యం భ్రాంతి పూర్వక చైతన్యమని ఎద్దేవా చేస్తో డాస్టవిస్కీ Notes from the Underground (1864) రాసాడు. ఆ కథనాన్ని I am a sick man అంటో మొదలుపెడతాడు. ‘నేనొక ద్వేష పూరితమానవుణ్ణి కాలేకపోవడమే కాదు, అసలు నేనేదీ కాలేకపోయాను. ద్వేషపూరితమానవుణ్ణీ కాలేకపోయాను, దయాపూరితమానవుణ్ణీ కాలేకపోయాను. నిజాయతీపరుణ్ణీ కాలేకపోయాను, దుర్మార్గుణ్ణీ కాలేకపోయాను. ఒక వీరుణ్ణీ కాలేకపోయాను, ఒక కీటకాన్నీ కాలేకపోయాను..’ అంటాడు డాస్టవస్కీ కథానాయకుడు. 20 వ శతాబ్దంలో, యూరోప్ లో, కాఫ్కా వంటి రచయితలు ఈ ధోరణినే మరింత లోతుగా కొనసాగించారు. కాని, వాళ్ళ ధోరణిలోనే ఎల్లిసన్ తన నవల మొదలుపెట్టినా, వాళ్ళల్లాగా, జీవితం పూర్తిగా అసంబద్ధంగా ఉందని అనడు. అతడు చెప్పేదల్లా స్వేచ్ఛ అంటే recognition of necessity మాత్రమే కాదు, recognition of possibility అని కూడా.

‘..నిన్ను నువ్వు నిజానికి ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకుంటూపోవచ్చు. ఈ భావన భయపెట్టేదిగా ఉంది. ఎందుకంటే, ఇప్పుడు ప్రపంచం నా కళ్ళముందే ప్రవావహసదృశంగా కనిపిస్తోంది. అన్ని సరిహద్దులూ అంతమైపోయాక, స్వాతంత్ర్యమంటే అవసరాన్ని గుర్తించగలగడమే కాదు, సంభావ్యతని గుర్తుపట్టగలగడం కూడా (2014, పే. 499)
అని గ్రహిస్తాడు ఆ నవల్లో కథానాయకుడు.

(ఆవలనున్న సాగరంలో, రజనీ నైశ్శబ్ద్యంలో నేనెవణ్ణి, ప్రభువునా, బానిసనా? మెదులుతున్న మాసం ముద్దనా, మానిసినా? ఈ అగ్నిశిఖల్లోంచి, ఈ రక్తమఖంలోంచి నూతనజననమా, ప్రాక్తనమరణమా?-బైరాగి)

ఇంతవరకూ తనముందు ఎందరో వ్యక్తులూ, శక్తులూ ప్రతిపాదిస్తున్న మూసలే (stereotypes) తన ముద్రలు కావనీ, తన యథార్థ స్వరూపాన్ని తాను గుర్తించడానికి మరెన్నో అసంఖ్యాకమైన అవకాశాలు లేకపోలేదనీ తన కథానాయకుడి ద్వారా చెప్పించడం ద్వారా , రాల్ఫ్ ఎల్లిసన్, ఆఫ్రికన్ అమెరికన్ స్వాతంత్ర్యాన్వేషణని ఊహించని మలుపు తిప్పాడు.

ఇక, తన ఐడెంటిటీ, తన స్వేచ్ఛ స్థిరరూపాల్లో గోచరించేవి కావని తెలిసిన తర్వాత, తన కథనానికి మటుకు స్థిరరూపం ఎలా ఉంటుంది? అందుకని, Invisible Man నవల మనకి సాంప్రదాయికంగా పరిచయమైన నవలారూపంలో కనిపించదు. అది ఏకకాలంలో రియలిస్టునవల, సర్రియలిస్టు నవల కూడా. గంభీరం, అవహేళనాత్మకం కూడా. సంభాషణాత్మకమూ, సుదీర్ఘ స్వగతమూ కూడా. ఈ లక్షణాల్ని బట్టి దీన్ని improvisational jazz నవల అన్నారు విమర్శకులు. అంటే అప్పటికప్పుడు ఆశువుగా నిర్మించుకుంటూ పోయే సంగీతరూపకంలాంటి నవల అన్నమాట.

27-2-2018

Leave a Reply

%d bloggers like this: