టోనీ మారిసన్

94

ఒక భాష మాట్లాడేవాళ్ళూ, ఒక ప్రాంతంలో ఉండేవాళ్ళూ తమ దైనందిన జీవితంలో ఎన్నో అనుభవాలకు లోనవుతారు. అందులో కొన్ని అసాధారణంగా ఉంటాయి. వాటిని ఆ మానవసమూహం కథలుగానూ, కల్పనలుగానూ చెప్పుకోవడం మొదలుపెడుతుంది. కాలక్రమంలో అవి పురాగాథలుగా మారతాయి. కొన్నాళ్ళకు ఆ జాతి తన పురాగాథల్ని దగ్గర పెట్టుకుని, పోల్చి చూసుకుని, తరచి ప్రశ్నించుకుని, వాటిద్వారా తన తాత్త్విక దృక్పథాన్ని ప్రకటించడానికి ప్రయత్నిస్తుంది. ఆ విధంగా రూపొందేదాన్నే ఇతిహాసమనీ, epic అనీ పిలుస్తాం.

ఉదాహరణకి, ఒకప్పుడు గంగాగోదావరీ మధ్యప్రాంతంలో ఒక రాజు తన రెండవ భార్య మాటవిని, తనకెంతో ఇష్టమైన పెద్దకొడుకుని అడవికి పంపిచేసాడు. తండ్రి మాటకాదనలేక అడవికి వెళ్ళిన ఆ పెద్దకొడుకు భార్యని ఆ అడవిలో ఎవరో ఎత్తుకుపోయారు. ఇవి రెండూ అసాధారణ సంఘటనలు. ఒక జాతి అంతరంగాన్నిపదేపదే వేధించే వృత్తాంతాలు. వీటిని తమ తమ ఆదర్శాల నేపథ్యంలో అర్థం చేసుకోడానికి ప్రయత్నించి బ్రాహ్మణ, బౌద్ధ, జైన, జానపద సంప్రదాయాలు ఎవరి పద్ధతిలో వాళ్ళు కథలుగా, కావ్యాలుగా, ఇతిహాసాలుగా మలచడానికి ప్రయత్నించాయి. అలానే, నల్లటిద్వీపానికి చెందిన ఒక మానవుడు తన పూర్వీకులు కామాన్నీ, కోపాన్నీ అణచుకోలేకపోడం చూసాడు. తాను కూడా అట్లాంటి క్షణిక మోహోద్రేకపర్యవసానంగా పుట్టినవాడే. పోనీ, తన సంతతి అయినా మారతారా అనుకుంటే, వాళ్ళ విషయంలో కామం లోభంగానూ, కోపం చల్లారని పగగానూ మారడం చూసాడు. ఏమి చేసినా ఉపశమించని మానవప్రవృత్తి తీవ్రతను అతడు తరచి తరచి చూసి ఒక మహేతిహాసంగా రాసిపెట్టిపోయాడు.

టోనీ మారిసన్ అనే ఒక ఆఫ్రికన్-అమెరికన్ రచయిత్రి కూడా తన జాతికి సంబంధించిన ఇట్లాంటి కథలెన్నో వింది. కాని, రెండు సంఘటనలు మాత్రం ఆమెని వదలకుండా వెన్నాడేయి.

మొదటిది, 1856 నాటి ఒక వార్త. అప్పటికింకా బానిసత్వం రద్దుకాలేదు. ఆరోజుల్లో కెంటకీ కి చెందిన మార్గరెట్ గార్నర్ అనే ఒక నల్లజాతి మహిళ, ఆ దాస్యం భరించలేక, తన భర్త, నలుగురు పిల్లల్తో, కెంటకీనుంచి చించినాటి పారిపోయింది. కాని, ఆమె యజమాని ఆమెని వెతుక్కుంటూ తన బలగంతో వెంటపడ్డాడు. ఆమె పోయి ఒక గదిలో దాక్కుంది. వాళ్ళు ఆ గది బద్దలుకొట్టి తెరిచేటప్పటికి, ఆమె తన రెండేళ్ళ బిడ్డని ఆమె అప్పటికే పీక కోసేసింది. ఇద్దరు పెద్ద పిల్లల్ని పారతో మోదేసింది. వాళ్ళు రక్తపుమడుగులో కనబడ్డారుగాని, మరణించలేదు. ఒకబిడ్డ మటుకు పాలుతాగుతూ ఉంది. ఆమెని అరెస్టు చేసారు, కోర్టులో హాజరు పరిచారు. కాని న్యాయస్థానమూ, ప్రపంచమూ, చివరికి అబాలిషనిస్టులూ కూడా నివ్వెరపోయిందేమంటే ఆమె ప్రశాంతవదనంతోనూ, స్థిరచిత్తంతోనూ కనిపించడం. తన పిల్లలకి తనబానిసత్వం వారసత్వంగా దక్కకూడదని తాను ఆ హత్యచేసానని ఆమె చెప్పుకుంది.

రెండవది, ఒక నల్లజాతి యువతి కథ. ఆమె ఒక పార్టీకి వెళ్ళింది. అక్కడ విందుమధ్య, నాట్యం మధ్య ఆమె హటాత్తుగా నెత్తురుకక్కుకుంది. ఏమయిందని అడిగారందరూ, ‘రేపు చెప్తాను’, ‘రేపు చెప్తాను’ అందామె. కాని ఆ రాత్రే మరణించింది. జరిగిందేమంటే ఆమె ప్రేమికుడు, బహుశా, ఆమె నుంచి తిరస్కారానికి గురైనవాడు, ఆ రాత్రి విందులో ఆమెని ఒక సైలెన్సరు తుపాకితో దగ్గర్నుంచి కాల్చేసాడు. కాని, ఆమె అతణ్ణి కాపాడాలనుకుంది. అందుకని అతడు అక్కణ్ణుంచి తప్పించుకునిపోయేదాకా ఒక్కమాట కూడా మాట్లాడలేదు.

‘ఇప్పుడు ఆలోచిస్తుంటే, ఆ రెండు సంఘటనల్నీ నా మనసు దేనితో కలిపిచూసుకుంటోందో నేను వివరించలేనుగాని, ఒక విషయం మాత్రం నాకు స్పష్టంగా బోధపడింది’ అంటోంది టొనీ మారిసన్ ఒక ఇంటర్వ్యూ లో.’ ఆ స్త్రీలు తమకన్నామించినదాన్ని దేన్నో ప్రాణాధికంగా ప్రేమించారని నేను గ్రహించాను. అక్కడ ఆ స్త్రీలు తమ జీవితసారాంశం మొత్తాన్ని తమ కన్నా బయట మరెక్కడో దాచుకున్నారు. తన పిల్లని చంపుకున్న ఆ స్త్రీ తన పిల్లల్ని ఎంత ప్రేమించిందంటే, వాళ్ళు ఆమె జీవితంలోని ఎంత విలువైన అంశమైపోయారంటే, ఆ నిర్మలత్వం భంగపడటాన్ని ఆమె సహించలేకపోయింది. వాళ్ళు అవమానానికి గురికావడం ఆమెకి భరించలేని విషయం. అందుకని ఆమె వాళ్ళని చంపెయ్యడానికి కూడా సిద్ధపడింది. అంటే దానర్థమేమిటో తెలుసా నీకు?’

అని అడిగింది ఆమె తనను ఇంటర్వ్యూ చేస్తున్న ప్రసిద్ధ ఆఫ్రికన్ -అమెరికన్ రచయిత్రి గ్లోరియా నేలర్ తో.

ఆమె ఇంకా ఇలా చెప్పుకొచ్చింది:

‘ఈ రెండు సంఘటనల్లోనూ చాలా ఉదాత్తమైనదేదో నాకు కనిపించింది..అది స్త్రీలకు మాత్రమే సాధ్యం కాగలిగే సంగతి. ఆ విషయం గురించి ఆలోచిస్తే నాకేమనిపించిందంటే, అది మనలోని అత్యంత విలువైన అంశం, కాని మనకి మనమే ద్రోహం చేసుకునేలా చేసేదీ అదే అనిపించింది. ద్రోహం అంటే మన జీవితం మనకేమంత ముఖ్యంకాదనే భావన కలిగించడం.. ఆ రెండు సంఘటనల మీంచి నేను పదిహేను, ఇరవై ప్రశ్నలదాకా మనసులో రాసుకున్నాను. ఒక స్త్రీని తనని తాను పక్కనపెట్టేసుకునేలా, తనని తాను విస్మరించుకునేలాగా చేసేదేది అన్నదాని గురించే ఆ ప్రశ్నలు. ఆ తర్వాత ఒక ఏడాది పాటు, నేను స్త్రీలోని ఆ self ని అంటే, yourself లో self అన్నట్టుగాకాక, ఆ రెండు పదాలకీ మధ్య ఒక స్థలంలో పెట్టిచూడటానికి ప్రయత్నించాను. అంటే ఆ self అనేది నిజానికి ఒకటికాదనీ, అదొక కవల అన్నట్టుగా, లేదా అదొక దాహంలాగా లేదా ఒక స్నేహితురాలిలాగా, నీ పక్కనే కూచుని, నిన్నే పరికిస్తున్నట్టుగా అన్నమాట. ముఖ్యంగా, ఆ తల్లిచేతుల్లో చనిపోయిందే, ఆ రెండేళ్ళ పిల్ల. ఆమెని నేను మళ్ళా ఈ భూమ్మీదకు తీసుకొచ్చాను. ..’

అప్పుడు ఆ చనిపోయిన పిల్ల మళ్ళా భూమ్మీదకు వచ్చినప్పుడు తనకెలా అనిపించిందో మారిసన్ తన పుస్తకానికి రాసుకున్న ముందుమాటలో ఇలా చెప్తున్నది:

‘విముక్తికి సంబంధించిన ఆలోచనలు నన్ను ఒక్కసారిగా ఒక ఆఘాతంలాగా తాకాయి. స్త్రీలకి సంబంధించి ‘స్వాతంత్ర్యం’ తాలూకు అర్థమేమై ఉండవచ్చా అన్న ఆలోచనలు ముసురుకున్నాయి. ’80 ల్లో , చర్చ ఇంకా నడుస్తూనే ఉండేది, సమానజీతం, సమానంగా చూడబడటం, వృత్తిఉద్యోగావకాశాలు, పాఠశాలలు. ఎట్లాంటి వివక్షకీ తావులేకుండా ఏదన్నా ఎంచుకోగలగడం. పెళ్ళి చేసుకోవడం లేకపోతే మానెయ్యడం. పిల్లలు కావాలనుకుంటే కనడం, లేదా మానెయ్యడం. ఈ ఆలోచనలు నాకు అనివార్యంగా ఈ దేశానికి చెందిన నల్లజాతి స్త్రీల మరోచరిత్రదగ్గరికి పోయి ఆగేయి- ఒక విభిన్న చరిత్ర-అక్కడ పెళ్ళి నిషిద్ధం, లేదా అసాధ్యం, లేదంటే చట్టవిరుద్ధం, ఆ చరిత్రలో పిల్లల్ని కనాలి, కాని వాళ్ళని ‘నీ దగ్గరే ఉంచుకోడం’ , వాళ్ళ ఆలనా పాలనా చూడటం, ఒక్క మాటలో చెప్పాలంటే, వాళ్ళకి తల్లిగా బతకడం -ఊహించడానికి వీల్లేని విషయం, స్వాతంత్ర్యం లానే దుస్సాధ్యం. ఆ కాలపు బానిసత్వపు చట్టాల వల్ల వాళ్ళు తల్లులమని చెప్పుకోడమే ఒక నేరం…’

ఆ slave experience ని ఆమె తిరిగి మానసికంగా జీవించడానికి ప్రయత్నించింది. ఒక బానిసగా, పిల్లల్ని పెంచుకోడం నేరంగా భావించబడ్డ కాలంనాటి ఒక తల్లిగా. కానీ, ఆనాడు ఆ తల్లి పొందలేని ఆ పిల్లల సాన్నిహిత్యాన్ని ఇప్పుడు తాను మానసికంగా ఆ తల్లికి అందించడానికి తన హృదయాన్ని ధారపోసింది. మరణించిన తన పూర్వీకులకి మళ్ళా ప్రాణంపోయడానికి వాళ్ళ చరిత్రని ఆమె తిరగరాసింది, వట్టి నవలగా కాదు, ఒక మహేతిహాసంగా.

‘వట్టి నవల మటుకే కాదు, అది కథలాగా, కావ్యంలాగా, నాటకంలాగా కూడా ఉండాలి,అట్లాంటి రచన ఒకటి రాయాలనుకుంటున్నాను’ అని చెప్పాడట టాల్ స్టాయి ‘వార్ అండ్ పీస్’ నవల రాయబోతూ. టోనీ మారిసన్ నవల Beloved (1987) ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యానికొక వార్ అండ్ పీస్, ఒక ఒడెస్సీ, ఒక పారడైజ్ లాస్ట్.

అది భయానకమైన కథ, ప్రాణాలు తోడేసే కథ, చదువుతున్నంతసేపూ హృదయాన్ని పిండేసే కథ. 300 పేజీల ఆ పుస్తకంలో మరణించిన ఒక సమాజమంతా మళ్ళా సజీవంగా మనకి కనిపించడం మొదలుపెడతారు. అపారమైన ప్రేమతో, జీవితం పట్ల అనూహ్యమైన మమకారంతో ఒక తల్లి రంపంతో పీక కోసేసిన రెండేళ్ళ పిల్ల ఇరవయ్యేళ్ళ తరువాత మళ్ళా ఆ తల్లితో జీవించడానికి వస్తుంది. అప్పటికి బానిసత్వం నిర్మూలన జరిగింది. కాని, బానిసత్వం చట్టవిరుద్ధమని ప్రకటించినంత మాత్రాన, మనుషులు తమ జ్ఞాపకాలనుంచి, తమ గతం నుంచి, తమ జాతి చరిత్ర నుంచీ బయటపడగలుగుతారా? ఇప్పుడు మళ్ళా ఆ ఇంట్లో ఆ తల్లిని కలవడానికి వచ్చిన ఆ పిల్ల వాస్తవమా? ఒక భయానక స్మృతినా లేదా ఆఫ్రికన్ తెగలవాళ్ళు నమ్మే revenant నా ? ఆ విషయం మన ఊహకి వదిలిపెట్టేస్తుంది రచయిత్రి.

కాని ఆ గతం నుంచి, ప్రాణం పోసుకుని నీ ఇంటితలుపు తట్టే నీ ఒకప్పటి జీవితం నుంచి, దాంతో పెనగులాడకుండా ఉండలేని నీ predicament నుంచి నిన్ను రక్షించేదెవ్వరు? నీ మానవత్వాన్ని కాపాడెవ్వరు? బహుశా నిన్ను ప్రాణాధికంగా ప్రేమించే మరొక మనిషి మటుకే. ఆ తల్లి తన ఒక పిల్లను చంపేసినప్పుడు, ఆమె చంకన పాలుతాగుతున్న మరొక బిడ్డ, ఇప్పుడు పెరిగి పెద్దదై, ఆమెతో పాటే ఉంటున్న యువతి, ఆమె తన ప్రేమతో తన తల్లిని కాపాడుకోడమే, ఆ నవలను Paradise Regained గా మారుస్తుంది.

అత్యంత ప్రౌఢమైన శైలి వల్లా, ఇతివృత్తం వల్లా, గతం, వర్తమానం విడదీయలేనంతగా పెనవేసుకున్నందువల్లా, ఆఫ్రికన్ తెగల పురాతన మంత్రోచ్చాటనలాగా, ఆ నవల పఠనానుభవం అంత సరళం కాదు. టొనీ మారిసన్ తన పాఠకుల పట్ల కనికరం చూపించదు. ఎందుకంటే అది కనికరం అనే మాట వినడానికి కూడా నోచుకోని ఒక మానవసమూహం కథ. బానిసలుగా అమ్ముడుపోయి ఓడల్లో పశువుల్లాగా రవాణా అవుతున్నప్పుడూ, బానిసత్వకాలంలోనూ, అంతర్యుద్ధంలోనూ, ప్రపంచయుద్ధాల్లోనూ మొత్తం 6 కోట్ల నల్లజాతివాళ్ళు మరణించారట. తన పుస్తకాన్ని ఆ 600 లక్షలమందికీ అంకితం చేసింది మారిసన్.

ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యం Beloved నవలతో మనం తేరిపారచూడలేని ఎత్తులకు చేరుకుంది. అది ఒక మానవసమూహం తాలూకు అమానుష అనుభవం గురించిన కథ, కాని, ఒక తల్లికి సంబంధించిన కథ కూడా. ప్రపంచమంతా తల్లులందర్నీ కన్నీళ్ళు పెట్టించే కథ. ఆ నవలకి నోబెల్ పురస్కారం (1993) ప్రకటించడం, అటువంటి పురస్కారానికి ఎంపికైన ఏకైక ఆఫ్రికన్-అమెరికన్ టోనీ మారిసన్ కావడంలో ఆశ్చర్యంలేదు. ఆ బహుమతి ప్రకటించినప్పుడు, మారిసన్ మిత్రురాలొకామె ఆమెకి సందేశం పంపించిందట: ‘నీకు లభిస్తున్న పురస్కారం మాది కూడా. దాన్ని అందుకోడానికి ఇంతకన్నా అర్హమైన హస్తాలు మరేవీ లేవు’ అని. బహుశా టోనీ మారిసన్ గురించీ, ఆ నవల గురించీ అంతకు మించి మరొక వాక్యం కూడా అదనంగా చెప్పలేం.

రెండువందల ఏళ్ళ ఆఫ్రికన్-అమెరికన్ అనుభవం వెంబడే ప్రయాణిస్తో వచ్చాక, చదివిన ఈ పుస్తకాల పుటలన్నీ మూసేసాక కూడా, Beloved లోని ఈ సంభాషణా శకలం ఒకటి నా చెవుల్లో గింగురుమంటోనే ఉంది.

*

‘ఒక సంగతి చెప్పు స్టాంప్’ అన్నాడు పాల్ డి. అతడి కళ్ళల్లో కన్నీటిపొర. ‘ఒక్క సంగతి చెప్పు, ఒక నీగ్రో ఎంత భారం భరించవలసిఉంటుంది? చెప్పు? ఎంత బరువు మొయ్యాలి?’

‘అతడు ఎంత మొయ్యగలిగితే అంత’ అన్నాడు స్టాంప్ పైడ్. ‘అతడు మొయ్యగలిగేదంతా.’

‘ఎందుకు? ఎందుకు? ఎందుకు? ఎందుకు? ఎందుకు?’

28-2-2018

Leave a Reply

%d bloggers like this: