కలాం

66

మేం హొస్పేటలో ఒక రెస్టారెంటులో కూచుని ఉండగా అక్కనుంచి ఫోన్.

‘టివి చూసావా,పెద్దాయన వెళ్ళిపోయాడు’ అంటూ.

నిర్వికారంగా వింటున్నాను.

జాతస్యహి ధ్రువో మృత్యుః

అప్పుడు రెండవ వాక్యం.

‘షిల్లాంగ్ లో ఐ.ఐ.ఎం లో పిల్లలతో మాట్లాడుతూ అక్కడే కుప్పకూలిపోయారట.’

ఆ మాటలు వింటూనే చలించిపోయాను. ఎట్లాంటి వార్త అది! 67 సంవత్సరాల కిందట, ఢిల్లీలోఒక ప్రార్థనాసమావేశంలో అడుగు పెడుతూ గాంధీజీ అసువులు బాసారనే వార్తలాంటి వార్త.

బహుశా ఆ వార్త తరువాత మళ్ళా అటువంటి వార్త ఇదేనేమో.

ఒక మనిషి జీవిత సార్థక్యాన్ని జీవితకాల కృషి ఋజువు చేస్తుంది నిజమే, కాని మనీషుల విషయంలో జీవితంతో పాటు మృత్యువు కూడా ఆ సార్థక్యాన్ని రుజువు చేస్తుందనుకుంటే కలాం చివరి క్షణాలు అందుకు నిర్దుష్ట తార్కాణం.

నేను హోటల్ రూం కి వచ్చి టివి ఆన్ చేసే లోపు టివి9 నుంచి ఫోన్. కలాంగారి గురించి మీ నుంచి ఫోనో కావాలి అంటూ, నేను ఆలోచించుకునేలోపలే ఆ రిపోర్టర్ ఫోన్ కలిపేసాడు.

మరెవరో టివిలో తమ అభిప్రాయం చెప్పడం వినిపిస్తోంది. ఆ ఒక్క క్షణంలోనే కలాం గురించి నా భావాలన్నీ కూడదీసుకోవడానికి ప్రయత్నించాను.

లైన్లోకి వస్తూనే యాంకర్ అడిగిన మొదటి ప్రశ్న: ఈ క్షణంలో మీ భావాలేమిటి? రెండవ ప్రశ్న: ‘కలాం ఆత్మకథని ఒక విజేత ఆత్మ కథ పేరిట తెలుగు చేసారు కదా, ఆ పుస్తకంలో మీకు నచ్చిన అంశాలేమిటి?’

‘కలాం గురించి మా ప్రేక్షకులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు?’

2

2002 ఆగష్టు. ఒక రోజు ఎమెస్కో విజయకుమార్ నుంచి ఫోన్.

‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ అని ఒక పుస్తకం నా చేతుల్లోకి వచ్చింది. ఇది తమిళంలో ఇప్పటికే 80,000 కాపీలు అమ్ముడైందట. దీన్ని తెలుగులోకి తెస్తే బాగుటుందని ఎవరో అన్నారు. మీరొకసారి చదివి చూడండి’ అని.

ఆ పుస్తకం నాకు పంపిన గంటలోనే మళ్ళా ఫోన్.

‘ఆట్టే టైం లేదు. హక్కులు కొనుక్కోవాలి. ఒక్క గంటలో మీ అభిప్రాయం చెప్పగలరా?’

ఆఫీసులోనే ఆ పుస్తకం నాలుగు పేజీలు, అక్కడక్కడా, తిరగేసాను.

ఆ ఇంగ్లీషు ప్రింటులోంచి నా చేతుల్లోకి ఏది శక్తి ప్రసరిస్తున్నట్టనిపించింది.

‘పుస్తకం అనువదించవలసిందే. అంతేకాదు, ఆ అనువాదం కూడా నేనే చేస్తున్నాను’ అన్నాను విజయకుమార్ తో.

అప్పటిదాకా ఏ పుస్తకం నేను తెలుగులోకి అనువాదం చెయ్యలేదు. అదే మొదటి పుస్తకం.

164 పేజీలు.

నేరుగా లాప్ టాప్ లో తెలుగులో నేనే టైప్ చేసుకున్నాను.

పది రోజులు.

అంతకు ముందుగాని, ఆ తర్వాత గానీ, అంత ఆశ్చర్యకరమైన వ్యవధిలో నేను రాయలేదు, అనువాదం చెయ్యలేదు.

2002 నుంచి 2015 దాకా కలాం పుస్తకాలు మొత్తం 5 పుస్తకాలు అనువాదం చేసాను.

గత 14 సంవత్సరాలుగా ఆయన భావనాపథాన్ని చాలా దగ్గరగా గమనిస్తూ ఉన్నాను. చాలా సార్లు ఆయన మాటలకీ, ఆయన జీవితకాలం పాటు సాధించుకున్న స్పష్టతకీ కైమోడ్చాను.

ఆ ఒక్క క్షణంలో టివి యాంకర్ ప్రశ్నలకి జవాబు ఇవ్వడానికి 14 ఏళ్ళుగా కలాం గురించి నేను తెలుసుకున్నదీ, ఆలోచించిందీ, అర్థం చేసుకున్నదీ ఒక్క గుక్కలో నెమరు వేసుకున్నాను. నాకై నేను మాటల్లో పెట్టుకోడానికి ప్రయత్నించాను.

3

‘ఇగ్నైటెడ్ మైండ్స్’ పుస్తకంలో(తెలుగులో నాదేశ యువజనులారా, 2002) కలాం తన జీవితాన్ని రాకెట్ తో పోల్చుకున్నాడు. రాకెట్ ప్రయోగానికి కూడా మూడు నాలుగు దశలున్నట్టే తన జీవితంలో కూడా నాలుగు దశలున్నాయని చెప్పుకున్నాడు.

ఒక రాకెట్ సమర్థవంతంగా భూకక్ష్య దాటాలంటే, ఆ రాకెట్ ప్రతి దశలోనూ సమర్థవంతంగా పనిచెయ్యాలి, ప్రతి దశా సక్రమంగా దగ్ధమయ్యాక, తర్వాతి దశ మొదలవుతుంది.

కలాం జీవితంలో 1962-83 మధ్యకాలంలో అంతరిక్షరంగంలో చేసిన కృషి, పరిశోధన మొదటి దశ. 1980 లో ఎస్.ఎల్.వి 3 ను అంతరిక్షంలో ప్రవేశపెట్టడం ఆ దశకి పతాక. 1981 లో ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ గౌరవంతో సత్కరించింది.

1983 లో ఆయన రక్షణ మంత్రిత్వశాఖలో రక్షణాయుధాల పరిశోధన, తయారీ రంగంలో అడుగుపెట్టడం రెండవదశ. ‘పృథ్వి’, ‘అగ్ని’, ‘త్రిశూల్’ వంటి మిస్సైళ్ళ రూపకల్పనలో దేశానికొక ఆయుధప్రదాతగా మారిన దశ. 1990 లో భారతప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్ తో సత్కరించడంతో రెండవ దశ పూర్తయిందని చెప్పవచ్చు.

1991 లో ఆయనకు 60 ఏళ్ళు నిండాయి. ఉద్యోగవిరమణ చేసి ఉపాధ్యాయుడిగా శేష జీవితం కొనసాగించాలనుకున్నాడు. కాని అప్పటి ప్రధానమంత్రి అంగీకరించలేదు. 1999 లో భారతప్రభుత్వానికి రక్షణ వ్యవహారాల్లో ప్రధానసలహదారుగా నియమించబడ్డాడు. ఈ మూడవ దశ గురించి ఆయనిట్లా రాసుకున్నారు:

‘నా మూడవదశ భారతదేశం అణ్వాయుధ పాటవం కలిగిన రాజ్యంగా రూపొందడానికి పెట్టుకున్న ధ్యేయాన్ని నెరవేర్చడంలో నాకు లభించిన భాగస్వమ్యానికి సంబంధించిన దశ. సైనిక దళాల సహకారంతో, రక్షణ పరిశోధనా సంస్థ,అణుశక్తి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం అది. ఆ ధ్యేయం అన్ని విధాలా సక్రమంగా అమలు చెయ్యబడిందని చెప్పవచ్చు ‘ అని.

ఈ దశలో ఆయన్ని ప్రభుత్వం ‘భారతరత్న’ గౌరవంతో (1997) సత్కరించింది. 2001 నాటికి ఆయన తన పదవీ బాధ్యతలనుంచి తప్పుకుని ఉపాధ్యాయుడిగా గడపడానికి అన్నావిశ్వవిద్యాలయానికి వెళ్ళిపోయారు.

ఆయన జీవితం సార్థకమైందని చెప్పడానికి ఇంతవరకూ చాలు. ఈ మూడు దశల్లోనూ ఒక నిష్కళంక దేశభక్తుడిగా ఆయన దేశానికి అందించిన ఉపాదానం చాలు ఆయన తన తక్కిన జీవితంతా నిశ్చింతగా వీణ వాయించుకుంటూ, ‘లైఫ్ డివైన్’ చదువుకుంటూ గడిపెయ్యడానికి.

కాని, ఆశ్చర్యంగా, సరిగ్గా అప్పుడే, 2001 లో, ఆయన జీవితంలో అనూహ్యమైన నాలుగవ దశ మొదలయ్యింది.

2001 సెఫ్టెంబరులో, డెభ్భై ఏళ్ళ వయసులో, ఆయన బొకారో లో విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించడానికి వెళ్తున్నప్పుడు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. కాని ఆ నేలమీద ఒక క్షణం ఆగి తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఒక జీవితకాల కృషి పూర్తయిందనుకున్నాక, తను మళ్ళా ఎందుకు బతికినట్టు? ఈ పునర్జన్మని దేవుడు తనకెందుకు ప్రసాదించినట్టు?

సెప్టెంబర్ 30 న ప్రమాదం జరిగితే, అక్టోబరు 2 వ తేదీకల్లా ఆయన కొల్లంలో మాతా అమృతానందమయి దగ్గరకి వెళ్ళి ఈ ప్రశ్నే అడిగాడు. ‘కొత్త తరం నాయకుల్నీ, సాహసికుల్నీ రూపొందించడానికి విద్యని ఆధ్యాత్మికతతో అనుసంధానింవలసిన అవసరం ఏర్పడిందని’ చెప్పారామె.

అక్కడితో నాలుగవ దశ మొదలయ్యింది. 2001 నుంచి 2014 దాకా ఈ పధ్నాలుగేళ్ళ పాటు ఆయన నిజమైన కలాంగా, మనకందరికీ తెలిసిన కలాంగా, మనందరం గుర్తుపెట్టుకునే కలాంగా రూపొందాడు.

2002 లో భారత రిపబ్లిక్ కి ఆయన పన్నెండవ అధ్యక్షుడు కావడాన్ని కూడా ఆయన తానెంచుకున్న కర్తవ్యానికి దొరికిన అవకాశంగానే భావించాడు. దాదాపు ఒకటిన్నర దశాబ్దంపాటు ఆయన విస్తృతంగా అధ్యయనం చేసాడు. విస్తృతంగా తిరిగాడు, వేలాది పాఠశాలలు, కళాశాలలు పర్యటించి లక్షలాది విద్యార్థులతో సంభాషించాడు. దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలతో, ఆధ్యాత్మిక నాయకులతో, సంస్కర్తలతో, రచయితలతో చర్చలు చేసాడు. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక వైజ్ఞానిక వేత్తలతో మాట్లాడేడు. 21 వశతాబ్దంలో ప్రపంచం విజ్ఞానసమాజం కావడానికి సమాయత్తపడుతున్నదని గుర్తించాడు. ఆ పిలుపుని భారతదేశం అందుకోవాలని తపించాడు.

4

కలాం సంస్కర్త కాడు, విప్లవకారుడు కాడు, రాజనీతిజ్ఞుడు కాడు, ఆర్థికశాస్త్రవేత్తకాడు, కవిత్వం రాసినప్పటికీ గొప్ప కవి కాడు, సంగీతవాద్యం శ్రుతిచేసినప్పటికీ కళాకారుడు కాడు. కాని ఆయన ఈ పాత్రలన్నిటినీ మించిన అద్వితీయమైన, అత్యవసరమైన పాత్ర నిర్వహించాడు.

ఆయన్ని ఒక్కమాటలో చెప్పాలంటే దార్శనికుడు అనవచ్చు.

ఒకప్పుడు స్వామి వివేకానందులు, ఆ తర్వాత మహాత్మాగాంధీ, మనకాలంలో కలాం.

1893 లో చికాగో ప్రసంగం తర్వాత,స్వామి వివేకానందులు యూరోప్ పర్యటించి మద్రాస్ ఓడరేవులో అడుగుపెట్టగానే విలేకరులు ఆయన్ను చుట్టుముట్టారు. పడమటి దేశాలెలా ఉన్నాయని అడిగారు. అవి ఎంతో అభివృద్ధి చెందాయన్నాడు స్వామీజీ. ఎందుకన్నారు వాళ్ళు. ‘అందుకొకటే కారణం’ అంటూ తన సహజసిద్ధమైన భావతీవ్రతలో’ విద్య, విద్య, విద్య’ అన్నారు వివేకానందులు. ఈ దీన బానిసదేశంలో సార్వత్రిక విద్య గురించి మాట్లాడిన మొదటి దార్శనికుడాయన.

విద్య ప్రజాస్వామికం కావాలంటే ఆ పౌరులు అన్నిటికన్నా ముందు స్వతంత్రులు కావాలన్నాడు గాంధీజీ. ఆ విద్య స్వదేశీయం కావాలన్నాడు. స్వావలంబన కావాలన్నాడు. దాన్ని స్వరాజ్యమన్నాడు.

స్వతంత్రభారతదేశంలో, ఒక జాతి స్వతంత్రంగా ఉండాలంటే, ఆ జాతి సమర్థవంతం కావాలన్నాడు కలాం.

ఒక జాతిని నిజంగా సమర్థవంతం చేసేదేది? గత దశాబ్దకాలంగా ఆయన ఈ ప్రశ్న పదేపదే వేసుకుంటూ వచ్చాడు.

తను వేసుకున్న ప్రశ్నకి జవాబుకోసమే ఆయన దేశమంతా తిరిగాడు. మొదట్లో ఆయన ఇందుకు టెక్నాలజీ పరిష్కారమనుకున్నాడు. సైన్సు, టెక్నాలజీలవల్ల దేశం సమర్థదేశంగా బలపడి స్వాలంబన సాధిస్తుందని భావించాడు. ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’, ‘ఇగ్నైటెడ్ మైండ్స్’ పుస్తకాల్లో ఈ భావధోరణి ప్రధానంగా కనిపిస్తుంది. నేటి యువతకి విలువైన అవకాశాలు లభ్యమైతే, వాళ్ళొక సంపన్న, సమర్థ భారతదేశాన్ని స్వప్నిస్తే ఆ స్వప్నం సాకారం కాగలదని విశ్వసించాడు.

కాని భారతరాష్ట్రపతిగా పనిచేసి బయటికి వచ్చిన తరువాత ఆయన భావాల్లో మరింత పరిణామం మనకి గోచరిస్తుంది.

గత అయిదారేళ్ళుగా ఆయన సంపన్న, సమర్థ భారతదేశం గురించి కాకుండా, ఉదాత్త భారతదేశం (Noble Nation) గురించి మాట్లాడటం మొదలుపెట్టారు.

ఒక జాతి స్వతంత్రం ఎందుకు కావాలి? ఎందుకంటే స్వాతంత్ర్యంవల్ల అది తన శీలాన్నికాపాడుకోగలుతుంది. ఆ శీలాన్నే ఆయన ఆ జాతి నైతికతగా భావించాడు. నైతికంగా వికసించని జాతి ఎంత సుసంపన్నమైనా ఉపయోగం లేదని ఆయన గ్రహించాడు.

ఒక ఉదాత్త దేశం, ఉదాత్త జాతి ఎట్లా రూపొందుతాయి?

ఉదాత్త దేశం ఉదాత్త కుటుంబాలవల్లా , ఉదాత్త కుటుంబాలు ఉదాత్త వ్యక్తుల వల్లా రూపొందుతారన్నది ఆయన జీవితంలో చివరికి చేరుకున్న మెలకువ. పదేళ్ళ కిందట ఆయన యువతీ యువకుల్ని కలలు కనమని చెప్పేవాడు. ఇప్పుడాయన ‘నిజాయితీగా పనిచేయాలి, నిజాయితీగా నెగ్గుకురావాలి’ అని చెప్పడం మొదలుపెట్టాడు.

ఈ దేశంలో మన సమకాలికుల్లో గొప్ప శాస్త్రవేత్తలు, రాజకీయవేత్తలు, సాహిత్యవేత్తలు, ఆర్థికవేత్తలు, విప్లవకారులు ఎందరో ఉన్నారు. కాని ఎక్కువసంఖ్యలో లేనిదల్లా కలాం లాంటివాళ్ళు మాత్రమే. ఎక్కడికైనా వెళ్తే ముందు అక్కడి పాఠశాలలకి వెళ్ళాలనీ, పిల్లలతో మాట్లాడాలనీ, వాళ్ళతో తన ఆవేదన పంచుకోవాలనీ కోరుకునే కలాం లాంటి వాళ్ళు ఎంతోమంది లేని భారతదేశం, కలాం నిష్క్రమణతో, పూర్తిగా పేదదై పోయింది.

5

కాని ఒక్క ఆశ. ఇందరు లక్షలాదిమంది పిల్లలతో కలాం మాట్లాడాడే, ఒక వందమందైనా, పదిమందైనా, ఇద్దరైనా, కనీసం ఒక్కరైనా ఆయన స్ఫూర్తిని అందిపుచ్చుకుని ఉండరా!

30-7-2015

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading