ఇద్దరు ఆత్మీయులు

52

రెండు రోజుల్లోనే ఇద్దరు ఆత్మీయుల్ని పోగొట్టుకున్నాను. శివలెంక రాజేశ్వరీ దేవి, డా. యు.ఏ.నరసింహమూర్తి.

1

ఆదివారం ఉదయం. వసంతకాలపు వెలుతురు. ఇంటిముందు వీథిలో పసుపు పూల వాన. ఎక్కణ్ణుంచో కోకిల విరామం లేకుండా కూస్తూనే ఉంది. అపారమైన తీరికదనం తూర్పునుంచి పడమటదాకా వ్యాపించి ఉంది. అప్పుడు, అటువంటి మననీయ నిశ్శబ్దంలో మొబైల్లో ఒక మెసేజి.నామాడి శ్రీధర్ నుంచి. ‘శివలెంక రాజేశ్వరీదేవి నిన్న విజయవాడలో ఒక ఆస్పత్రిలో మరణించారు ‘ అని.

ఆ మెసేజి నాలో కలిగించిన స్పందనల్ని నేనొక పట్టాన అర్థం చేసుకోలేకపోయాను. ఒక అభిశప్తురాలికి శిలువలాంటి జీవితం నుంచి మృత్యువు విముక్తినిచ్చిందని సంతోషించనా? లేకపోతే ఇంత అపారమైన వసంత సంతోషాన్ని నిలువెల్లా పీల్చుకుంటూ, కేవలం కవిత్వాన్ని మాత్రమే తిని, తాగి,ఊపిరి తీసి బతికే ఒక యథార్థ కవిత్వ ప్రేమికురాల్ని పోగొట్టుకుని నేనూ, ఈ లోకమూ కూడా పేదవాళ్ళమైపోయామని విలపించనా?

ఒకప్పుడు ఒక రేవతీదేవి ఈ లోకంలో పుట్టి, తననీ, మననీ కూడా ప్రేమించి అద్భుతమైన కవిత్వం చెప్పిందని ఆమె చనిపోయినదాకా మనకు తెలియనే లేదు. కాని ఆమె అదృష్టవంతురాలు. ఆమె ప్రేమకు ఆనవాలుగా ‘శిలాలోలిత ‘కవితలున్నాయి. కాని రాజేశ్వరి కి ఆనవాలుగా ఏమి మిగిలింది? ఏమి మిగుల్చుకుంది? ఆమె ఎంతగానో ప్రేమించిన కవులు, ఆమెను ఎంతగానో ప్రేమించిన కవులు ఎందరో ఉండి కూడా ఆమె కవిత్వం గురించి ప్రపంచానికేమీ తెలియకుండానే పోయిందే.

ఆదివారం అక్క మాట్లాడుతూ ‘ఆమె అనామకంగానే బతికి అనామకంగానే వెళ్ళిపోయింది ‘ అంది. ఆమె కవిత్వం పుస్తకంగా తేవాలని నాలుగైదునెలలుగా అక్క మాట్లాడుతూనే ఉంది. కాని రాజేశ్వరీ దేవి దృష్టి కవిత్వం రాయడం మీదా, తన కవిత్వం పుస్తకంగా తేవడం మీదా లేదు. ఆమె పిపాస అంతా కవిత్వం చదువుకోవడం మీదనే.

కొంతకాలం కిందట అడిగింది ‘ఫేస్ బుక్ అంటూ ఒకటి ఉంటుందట కదా, అందులో రోజూ కవిత్వం వరదలాగా వస్తుందట కదా అని. కాని ఇంట్లో ఒక కంప్యూటరూ, ఇంటర్నెటూ లేదా చేతిలో ఒక స్మార్ట్ పోనూ పెట్టుకోగలిగే జీవితం కాదామెది. మన సమాజంలోని అసంఖ్యాక సాహితీప్రేమికుల్లానే ఆమెకి కూడా వార్తాపత్రికల్లో ప్రచురించే అరకొర కవిత్వమే ఆహారం. కాని ఆ ఆహారం ఆమె ఆకలి తీర్చక, అందిన ఆ కొద్దిపాటి కవిత్వం కూడా పౌష్టికాహారం కాక, దేశదేశాల కవిత్వాన్ని ఇంగ్లీషులో చదువుకునే అవకాశం ఎటూ లేక, ఆమె తో ఎప్పుడు మాట్లాడినా ఆ ఆకలి ఆ గొంతులోనే గూడుకట్టుకున్నట్టు వినిపించేది.

ఎవరూ పట్టించుకోని, ఎవరికీ అక్కర్లేని,ఎవరూ తోడు నిలవని అత్యంత దుర్భర దయనీయ జీవితం జీవించిందామె. ముఫ్ఫై ఏళ్ళ కిందనైతే ఈ చినవీరభద్రుడు ఆమెకి ఉత్తరాలు రాసేవాడు. ‘ప్రియమైన రాజూ ‘ అని పిలిచేవాడు. కాని జీవితం చినవీరభద్రుణ్ణి చినవీరభద్రుడికే దూరం చేసేసింది. కాని రాజేశ్వరీదేవి ముఫ్ఫై ఏళ్ళుగానూ అట్లానే ఉంది.ఇప్పటికీ ఏ అర్థరాత్రి వేళనో ఫోన్ వచ్చిందంటే అది ఆమె ఫోనే అవుతుంది. ‘చిన్నా’ అని పిలిచే ఆ పిలుపు చెక్కుచెదరకుండా అలానే ఉండేది. రెండుమూడు మాటలు మాట్లాడి ఫోన్ పెట్టెయ్యబోతే ఆమె తన ఆగ్రహాన్నీ, అసహనాన్నీ అణచుకునేదికాదు. ‘నాకు టైము తెలీదు, ఇప్పుడెంతైందో. కాని ఇంకొక్క రెండు మాటలు మాట్లాడలేవా. ఏదన్నా కొత్త కవిత చదివావా, ఎవరన్నా కొత్త కవులు కలిసారా ‘అని అడిగేది.

వెర్రిది. కవిత్వం సంగతి తెలీదు కానీ, కవులు, నాతో సహా, మనుషుల్ల్లాగా బతకడం ఎప్పుడో మానేసారని ఆమెకి తెలీదు.

రాజూ, ఇదిగో, ఇప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు ఉబుకుతున్నాయి. కనుకొలకులనుండి గొంతుదాకా ఆసిడ్ పోసినట్టనిపిస్తోంది. నేను నీకోసం ఏమీ చెయ్యలేకపోయాను. కనీసం కొన్నేళ్ళుగా అవకాశముండికూడా నిన్ను చూడలేకపోయాను. నీ వంటి కవితా పిపాసి వెళ్ళిపోయాక కూడా నేనింకా బతుకుతున్నానంటే ఏదో తప్పు చేస్తున్నట్టుగానూ, చాలా దిగులుగానూ ఉంది.

1988 లో మలేరియా వచ్చి నేను రెండు నెలలు మంచం మీద ఉన్నప్పుడు ఆ వార్త తెలియగానే హుటాహుటిన జగ్గయ్యపేటనుంచి వచ్చేసింది. ప్రయాణానికి ఛార్జీలు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఆమెది. కాని ఇప్పుడామె నాకు తెలియకుండానే వెళ్ళిపోయింది. ఆమె ఆస్పత్రిలో ఉందని నాకు చెప్పేవాళ్ళు కూడా లేరు. ఆమె ఈ లోకాన్ని వదిలిపెట్టేసాక, ఆ వార్త చెప్పడానికి కూడా ఎవరూ లేరు.

బహుశా కవిత్వమే శ్వాసగా బతికిన ఆ ప్రాణాలు గాల్లో కలిసాయని కోకిలకీ, ఆకాశానికీ, పూలకీ తెలిసిందేమో, అందుకనే ఆ ఉదయమంత ప్రోజ్జ్వలంగా ఉందని నాకు నేను సర్దిచెప్పుకున్నాను.

2

డా.యు.ఏ. నరసింహమూర్తి పూర్ణమానవుడు. తెలుగు రసజ్ఞ ప్రపంచంలో మన సమకాలికుల్లో సాలప్రాంశువు. ఏ సాహిత్యం ప్రశంసలోనైనా, సాహిత్యమీమాంసకైనా ఏ సంతోషం వచ్చినా, సందేహం వచ్చినా నాకొక పెద్దదిక్కుగా నిలబడ్డ మనిషి.

నరసింహమూర్తిగారిని నేను మొదటిసారి 1985 లో చూసాను. మిత్రుడు రామసూరి ‘యువస్పందన ‘ తరఫున విజయనగరంలో గురజాడమీద నాదొక ప్రసంగం ఏర్పాటు చేసాడు. ఆ ప్రసంగం పూర్తవగానే నరసింహమూర్తిగారు నన్నొక అయస్కాంతంలాగా లాక్కున్నాడు.

1987 లో నేను గ్రూప్ 1 సర్వీసుకి సెలక్టయ్యి, ట్రయినింగ్ కోసం విజయనగరం జిల్లాకి వెళ్ళడం నా అదృష్టం. నా ట్రయినింగ్ లో భాగంగా నేను పార్వతీపురంలో కోంతకాలం,విజయనగరంలో కొంతకాలం ఉండేవాణ్ణి. విజయనగరంలో ఉన్నంతకాలం,కొన్ని నెలలపాటు రామసూరి ఇంట్లోనే ఉన్నాను. అప్పటి ఆ సాయంకాలాలన్నీ ఎంతో మహిమాన్వితంగా గడిచేయి. మరొక విధంగా నైతే ఎంతో నిస్సారంగా గడవవలసిన నా శిక్షణాకాలం సాహిత్యసుశోభితంగా గడవడానికి ఆ ఇద్దరూ మిత్రులూ కారణం. ముఖ్యంగా నరసింహమూర్తిగారి వైదుష్యం, ఆ వివేచనా పటిమ, ఆ అధ్యయనం,ప్రాచీన, ఆధునిక సాహిత్యాలపట్ల ఆయనకున్న అధికారం.

మేఘసందేశకావ్యంలో కాళిదాసు ఉజ్జయినిలో ఉదయనపండితులుండేవారని చెప్తాడు. కాళిదాసుకి విజయనగరం తెలిసిఉంటే అక్కడ గురజాడ పండితులు, నారాయణదాసు పండితులు, నారాయణబాబు పండితులూ ఉండేవారని కూడా చెప్పి ఉండేవాడు. నరసింహమూర్తిగారు అట్లాంటి అరుదైన గురజాడపండితుడు, నారాయణదాసు పండితుడు, నారాయణబాబు పండితుడు. గురజాడనీ, ఫకీర్ మోహన సేనాపతినీ, నారాయణబాబునీ, శ్రీశ్రీనీ పోల్చుకుంటూ ఆయనతో గంటలు గంటలు మాట్లాడుకునే అపురూపమైన అదృష్టానికి నోచుకున్నానన్నదే ఇప్పుడు నాకు మిగిలిన ఊరట.

నేను విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో పనిచేసినకాలంలో నరసింహమూర్తిగారిని తరచు కలుసుకునే అవకాశముడేది. గత ఇరవయ్యేళ్ళుగా ఆ అవకాశాలు చాలా స్వల్పంగా లభించినా అవి మరవలేని అవకాశాలే.

మొదటిది, కన్యాశుల్కం మీద ఆయన రాసిన పుస్తకావిష్కరణకు నేనూ,మృణాళినిగారూ వెళ్ళడం. ఆ పుస్తకాన్ని వెలువరించే సందర్భంగా ఆయనకు నేను గుర్తు రావడం నా అదృష్టమనే భావిస్తాను.

‘కన్యాశుల్కం: 19 వ శతాబ్ది ఆధునిక భారతీయ నాటకాలు’ (2007) పేరిట ఆయన వెలువరించిన అధ్యయనం నూరేళ్ళకొక్కసారి మాత్రమే రాగల అధ్యయనం. ఆ ఒక్క పుస్తకంతో ఆయన గురజాడకి ఆంధ్రదేశమూ, కళింగాంధ్రా పడ్డ బాకీని పూర్తిగా తీర్చేసారని చెప్పవచ్చు. కేవలం సాహిత్యపరిశోధనలోనే కాదు, తులనాత్మక సాహిత్య వివేచనలో కూడా తెలుగులో అటువంటి పుస్తకాలు బహుశా రెండో మూడో మాత్రమే.

పోయిన ఏడాది తన ‘ఆధునిక వచనశైలి ‘ఆవిష్కరణ సభకి కూడా నన్ను ఆహ్వానించేరు. ‘మండలి బుద్ధ ప్రసాద్ గారు, గొల్లపూడి మారుతీరావుగారూ, మీరే, వేదిక మీద మరెవరూ ఉండరు ‘అన్నారాయన నన్ను పిలుస్తూ. అన్నట్టుగానే ఆ సమయమంతా నాకే కేటాయించారు, చివరికి వేదిక మీద తాను కూడా కూచోకుండా.

ఇక ఇటీవల వెలువరించిన ‘గిరాంమూర్తి ‘ ఆయన కృషిలో మరొక పతాక. ఆ పుస్తకానికి నేనొక విపుల పరిచయం రాస్తానని వాగ్దానం చేసి కూడా రాయలేక ఆలస్యం చేస్తూ ఉంటే ‘ మీరు నాలుగు వాక్యాలు రాసినా చాలు, అది కూడా రాయడానికి టైం లేకపోతే కవర్ డిజైన్ చేసినా చాలు ‘ అన్నారాయన. అన్నట్లే ఆ పుస్తకం కవర్ డిజైన్ చేసి ఆ వెనక అట్టమీద ఆయన గురించి నాలుగు వాక్యాలు కూడా రాసాను.

ఇక తన బృహత్పరిశోధనల్లో అన్నిటికన్నా బృహత్తరమైన జీవితకాల పరిశోధన, ప్రపంచ ఇతిహాసాల మీద ఆయన చేపట్టిన పరిశోధన. జపనీయ గెంజిగాథ, పారశీక షానామా, హోమర్ ఇలియడ్ ఒడెసీల తో సహా భారతీయ ఇతిహాసాలన్నిటినీ కలిపి తులనాత్మకంగా ఒక అధ్యయనానికి పూనుకున్నారాయన. వారం రోజుల కిందట ఫోన్ చేసి కొన్ని పుస్తకాలు కావాలంటే ‘ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఎపిక్స్ ‘, ఎన్సైక్లో పీడియా ఆఫ్ మైథాలజీ ‘, జోసెఫ్ కాంప్ బెల్ రాసిన ‘ద హీరో విత్ థౌసండ్ పేసెస్ ‘ పంపించాను. ఆ పుస్తకాలు అందుకోగానే ఫోన్ చేసారు. ఆ మాటల్లో మరిన్ని పుస్తకాలు, మరిన్ని విశేషాలు. విజయనగరం వీథుల్నించి విశ్వవీథులదాకా ప్రయాణమది.

ఇంతలోనే ఈ వార్త. రామసూరిగారు విజయనగరం నుంచి ఫోన్ చేసి చెప్పగానే నరసింహమూర్తిగారి శ్రీమతి వెంకటరమణమ్మగారినే తలుచుకున్నాను. ఆయన ఆమె కళ్ళతోనే సాహిత్యం చదివారు, ఆమె చేతుల్తోనే తన రచనలు చేసారు. ఇద్దరూ ఒక్క హృదయంతో సాహిత్య రసాస్వాదన చేసారు. తమ ఇల్లే వేదికగా సారస్వతసత్రయాగం చేసారు.

ఇప్పుడు విజయనగరంతో పాటు తెలుగుసాహిత్యం కూడా నిరాశ్రయురాలైపోయింది.

27-4-2015

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading