క్రాఫ్ట్స్ మూజియం

49

శిథిలాలూ, సమాధులే కాకుండా ఢిల్లీలో చూడవలసిన స్థలాల్లో మూజియాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు కొన్ని ప్రదర్శన శాలలు చూసేను కాబట్టి, ఈ సారి ఏవైనా కొత్త మూజియాలు చూడాలని ఒక టాక్సీ ఎక్కిన మాకు పురానా ఖిలా మలుపు తిరుగుతుండగానే క్రాఫ్ట్స్ మూజియం కనిపించింది. పక్కనే శిల్పసంగ్రహాలయమని దేవనాగరిలిపిలో అక్షరాలు. నేనెప్పుడూ వినిఉండని ఆ సంగ్రహాలయమెట్లా ఉంటుందోనని లోపల అడుగుపెట్టినవాళ్ళం అక్కడే మూడు గంటల పాటు ఉండిపోయాం.

శరత్కాలపు ప్రభాతం. లోపల వీథుల్లో చెట్లమీంచి, ఇళ్ళ కప్పులమీంచి వెలుగు పొడి చల్లుతున్నట్టు రాలుతున్న ఎండ. గోరువంకలు, ఉడతల కిచకిచలు, మహానగరం మధ్యంలోంచి ఒక గుహలో అడుగుపెట్టి అప్పుడే బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటున్న ఒక భారతీయగ్రామంలోకి మేలుకున్నట్టుగా అనిపించింది నాకు.

రెండు రోజుల కిందట ఇండో-ఆఫ్రికన్ సమ్మిట్ లో భాగంగా ప్రధానమంత్రి అక్కడొక విందు ఏర్పాటు చేసారట. ఊళ్ళల్లో పెళ్ళినో, దేవుడి పండగనో అయిపోయిన మర్నాడు కనబడే అలసట, ఇంకా ఎత్తని చెత్త, తీరిగ్గా కూచుని జరిగిన సందడినే నెమరేసుకునే పల్లెటూరి పోకడ.

జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ నేషనల్ హాండ్లూంస్ అండ్ హాండిక్రాప్ట్స్ మూజియం ఆలోచనకి 1950 ల్లోనే అంకురార్పణ పడింది. ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధురాలు కమలాదేవి ఛటోపాధ్యాయ ఊహల్లో రూపుదిద్దుకున్న మూజియం ఒక ఆకృతి సంతరించుకోవడానికి ముఫ్ఫై ఏళ్ళు పట్టింది.

మూజియంలో అడుగుపెడుతూనే సవివరమైన లే ఔట్ పటం మనకు దర్శనమిస్తుంది. కాని మొదటిసారి చూసినప్పుడే మనకై మనంగా ఆ మూజియం మొత్తాన్ని ఆకళింపు చేసుకోవడం కష్టం.

అందులో రెండు ముఖ్యమైన భాగాలున్నాయి. ఒకటి, 1972 లో గ్రామీణ భారతదేశాన్ని ప్రతిబింబించాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన ఒక ప్రదర్శనకు సాక్షిగా మిగిలిన గ్రామీణ నిర్మాణసముదాయం. రెండవది, ఛార్లెస్ కోరియా అనే వాస్తు శిల్పి రూపొందించిన సంగ్రహశాల.

ట్రేడ్ ఫెయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా కోసం రూపొందించిన సంగ్రహశాల మొదటిదశ 1977 లో పూర్తయ్యింది. అందులో గ్రామీణప్రాంగణం, కార్యాలయ మందిరాలు ఉన్నాయి. తుదిదశ నిర్మాణం 1991 నాటికి పూర్తయ్యేటప్పటికి దేవాలయ ప్రాంగణాలు, దర్బాలు ప్రాంగణాలు కూడా వచ్చి చేరాయి.

తన నిర్మాణ ఇతివృత్తాన్ని వివరిస్తూ ఛార్లెస్ కోరియా ఇట్లా రాసాడు:

‘ ప్రాచీన కాలానికి చెందిన మహాదేవాలయాలు (బాలి, బోరోబొదూరు, శ్రీరంగం మొదలైనవి) నడి ఆకాశానికి తెరుచుకున్న ఒక ఉత్సవవీథి చుట్టూ నిర్మితమై ఉంటాయి. ఉష్ణమండల దేశాల్లో వాస్తు నిర్మాణానికి ఈ విషయం ఇప్పటికీ మనం పాటించదగ్గదే.క్రాఫ్ట్స్ మూజియాన్ని కూడా గ్రామీణ కళాకారుల నిరాడంబర జీవితసరళిని అనుసరిస్తూ అటువంటి ఒక ప్రధానవీథి చుట్టూ నిర్మించడం జరిగింది. వెన్నెముకలాంటి ఆ వీథిలో నడుస్తూ సందర్శకుడు అటూ ఇటూ ఉన్న వివిధ ప్రాంగణాల్ని చూస్తూ, ఖాళీ స్థలాల దగ్గర ఆగుతూ, చూసింది నెమరువేసుకుంటూ పోవచ్చు. లేదా వరసగా ఒక్కొక్క ప్రాంగణాన్నే సవివరంగా అధ్యయనం చేసుకుంటూ కూడా పోవచ్చు.’ (ఆర్కిటెక్చర్: డిజైన్, సెప్టెంబర్-అక్టోబర్, 1991)

క్రాఫ్ట్స్ మూజియంలో మేం రెండు పనులూ చేసాం. కాని పూర్తిగా చెయ్యలేకపోయాం. కాని తొలిసారి ఆ మూజియం మన మీద వెయ్యగల ముద్రలకి మనసప్పగించేసాం. ఆ ముద్రలెట్లాంటివో పోల్చుకునే ప్రయత్నంలో మనం చెప్పుకోగల మాటలు, ఆ మూజియంకి ఒకప్పుడు డైరక్టర్ గా పనిచేసిన జ్యోతీంద్ర జైన్ అనే ఆయన రాసిన మాటలే అనిపించింది.

ఆర్కిటెక్చర్, డిజైన్ సెప్టెంబర్-అక్టోబర్, 1991 పత్రికలో Metaphor of an Indian Street అనే పేరిట ఆయన రాసిన వ్యాసంలో ఇలా రాసాడు:

‘… (క్రాఫ్ట్స్ మూజియం) ను మనం మూజియం అని పిలవడానికి కారణం చాలాకాలంగా దాన్నందరూ మూజియం అంటూండటమే. కాని వాస్తవానికి అది మూజియంలాగా కనిపించదు. అట్లాంటి ఒక సాంప్రదాయిక మైన పేరుని, పాత్రనీ అంగీకరించడానికి ఇష్టపడకపోగా, తన గురించి తనే చాలా ప్రశ్నలు వేసుకుంటూటుంది. తనేమిటో తాను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అలాగని ఏదో ఒక నిర్వచనాన్ని ఇప్పటికిప్పుడు వెతుక్కోవాలన్న ఆతృత లేదు దానికి.’

‘అక్కడి మందిరంలో నిల్చుని చాలామంది సందర్శకులు ‘ఇంతకీ మూజియం ఏది, ఎక్కడుంది? అని అడుగుతుంటారు. అట్లాంటి ప్రశ్న విన్నప్పుడల్లా, ఆ ప్రాంగణం నుంచి మూజియం అనే భూతాన్ని దాని సాంప్రదాయిక అర్థంలో బయటికి వెళ్ళగొట్టగలిగామని మేం గర్వపడుతుంటాం. అందుకు బదులుగా, ఏదో ఒక పేరుపెట్టి సులువుగా ఒక గాటన కట్టడానికి అనుమతించని ఒక వాతావరణాన్ని అక్కడ నిర్మించగలిగాం. గుజరాత్ నుంచీ, రాజస్థాన్ నుంచీ తెచ్చిన నగిషీ చెక్కిన పాతకాలపు తలుపులు, ద్వారబంధాలు, చంపకవృక్షాలతోనూ, తులసికోటలతోనూ కనవచ్చే ముంగిళ్ళు, ఈ ‘ఆధునిక’ నిర్మాణం మధ్యలో కనవచ్చే దేవాలయ రథం, అది కూడా ఏదో జీర్ణావశేషాన్ని పునరుద్ధరిస్తున్నట్టు కాకుండా, ఆధునిక, ప్రాచీన సంప్రదాయాల జమిలినేతలాగా కనిపిస్తుంటుంది. టెర్రకోటా ఇండ్లకప్పులు, కుడ్యచిత్రాలు, రాతికటాకటాలు, దారుశిల్పతోరణాలు, ఝరోకాలు, హవేలీలు, ప్రాచీన వృత్తికళాకారులకూ, వారి సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ వారికోసమొక దివ్యభవనాన్ని సమకూర్చిపెట్టాయి.’

ఆయనింకా ఇలా రాసాడు:

‘క్రాఫ్ట్స్ మూజియం లో సగం తెరుచుకున్న, పూర్తిగా తెరుచుకున్న దారుల్లో విభాత సంధ్యల్లో నడుస్తుంటే, నగిషీ చెక్కిన కొయ్య ఝరోకాలు, ఇండ్లపైకప్పులు, తలుపులు, గుమ్మాలు, రాగి పాత్రలు, కళాయిలు, ఇనుపకటకటాలు,తడకల్లాగా అల్లిన తోరణాల దిగువ, గోడల మధ్య పావురాళ్ళ గూళ్ళు, ఎర్రమట్టితో కట్టిన తులసికోటలు, దేవుడి పండగతేర్లు, సిందూరం జల్లిన అర్చావేదికలు కనిపిస్తుంటాయి. వాటి మధ్యనుంచి అటూ ఇటూ కిటికీలోంచో, కంతల్లోంచో తొంగిచూస్తే లోపల కథాచిత్రాలు, మణిపూర్ మృణ్మయపాత్రలు, రాక్షసప్రమాణాల భూతప్రతిమలు, మొక్కు చెల్లించడానికి కట్టుకున్న ముడుపులు కనిపిస్తాయి. వాటితో పాటు బహుభుజాలు కలిగిన దుర్గామాత, కాళీమాత విగ్రహాలొక తాంత్రిక ప్రపంచంలోకి తీసుకుపోతుంటే, నిర్వాణ దిశగా, కాయోత్సర్గ భంగిమలో నిల్చున్న జినమూర్తి కాలాతీత స్ఫూర్తిని కలిగిస్తుంటాడు… వివిధ ఆకృతుల ఈ వస్తుసముదాయం సందర్శకుణ్ణి కాలమధ్యం నుంచి కాలాతీత స్థితిలోకి, వాస్తవ ప్రదేశం నుంచి ఒక కాల్పనిక లోకం లోకి తీసుకుపోతుంది…’

ఈ మూజియం నిర్మాణపరంగా పూర్తయిందనీ, ఒక స్థిర రూపాన్ని సంతరించుకుందనీ చెప్పలేమని చెప్తూ జ్యోతీంద్ర జైన్ దాన్ని మన గ్రామాల్లోని వీథుల్తో పోలుస్తూ ఇట్లా అంటాడు:

‘..ఒక భారతీయ గ్రామవీథి ఎంత స్నేహపూర్వకంగా, సరళంగా, ఆత్మీయంగా, సాదాసీదాగా, ఉత్సాహపూరితంగా ఉంటుందో, ఈ నిర్మాణం కూడా అంతే. వాస్తుపరంగా చూస్తే ఏ వీథీ కూడా పూర్తిగా నిర్మాణం పూర్తయిపోయిందని చెప్పలేం. అది ఒక నిర్దిష్టాకృతికి చేరుకుందనీ, అది పూర్తిగా మన చెప్పుచేతల్లోకి వచ్చేసిందనీఅనుకోలేం. ఏ వీథైనా ఎప్పటికప్పుడు సంచలించే ఒక దృశ్యం. దాన్ని ఎవరో ఒక వాస్తు శిల్పి కాగితం మీద నమూనా గీసి రూపొందించాడని ఎప్పటికీ అనుకోలేం. క్రాఫ్ట్స్ మూజియం కూడా అంతే.’

ఆ మాటలు అక్షర సత్యాలు. ఆ మూజియం (లేదా ఆ కళాప్రాంగణం) ఒక చుట్టు తిరిగి వచ్చేటప్పటికి నాగాలాండ్ కోన్యక్ తెగల కుటీరాలనుంచి సౌరాష్ట్ర కుటుంబాల ముంగిళ్ళ దాకా ప్రయాణించినట్టు ఉంటుంది. తమిళనాడులో తోడా తెగల ప్రార్థనాలయాలనుండి బృందావనపు గోపగృహాలదాకా యాత్ర చేసినట్టు ఉంటుంది.

అప్పుడు నీక్కూడా అట్లాంటి ఒక మట్టి ఇల్లూ, ఎత్తైన అరుగులూ, గోడల మీద మధువని, వర్లి చిత్రలేఖనాలు, ఇంటిముంగట ఒక వేపచెట్టు, దాని చుట్టూ ఎర్రమట్టి అలికిన ఒక వేదిక, పక్కన ఒక పిచికలగూడు.. అక్కడ, అప్పుడు ఆ ముంగిట్లో సాయం సంధ్యావేళ రామచరిత మానస్ నీ, వెన్నెలవేళ గీతగోవిందాన్నీ, సుప్రభాతవేళ త్యాగరాజస్వామినీ వింటూ గడపాలనే కోరిక రాకుండా ఉండటం అసాధ్యం. అట్లాంటి అరుగుమీద ఉష్ణమండలదేశాల మధ్యాహ్నవేళల సోమరి కునుకు తీస్తో, మల్లికార్జున మాన్సుర్ ఆలపించే ఒక అపరాహ్ణ రాగాన్ని వినడం- భారతదేశంలో పుట్టినందుకు నువ్వు కోరుకోగల గొప్ప వరదానం అంతకన్నా ఏముంటుంది?

30-10-2015

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading