
ఆరవ రోజు: మొదటి సంభాషణ
గురువుకి ఓటమి లేదు
ఆ రోజు పొద్దున్నే, అంటే తెల్లవారకుండానే గురూజీ ఆశ్రమానికి వెళ్ళాను. పొద్దున్నే ఆరింటికి ఆయన గురుస్థానం దగ్గర దీపం వెలిగించి, రామచరిత మానస్ నుంచి కొంత పారాయణం చేస్తారని చెప్పాను కదా. ఆ క్షణాల్లో ఆయన దగ్గర కూర్చుందామనిపించింది. మామూలుగానే ఎంతో నిశ్శబ్దంగా ఉండే ఆ పరిసరాలు ఆ ప్రత్యూషవేళ మరింత ప్రశాంతంగా ఉన్నాయి. వెదురుపొదల్లోనూ, వేపచెట్టుమీద కూడా పక్షులు తొందరగా మేల్కొని గురూజీ పారాయణం కోసం చెవి ఒగ్గి ఉన్నాయి.
ప్రాతఃకాల ప్రార్థన, పారాయణం ముగించాక, ఆయన నేత్రాల్లో ఒక అలౌకికమైన తేమ కనిపించింది. ఆయన తనకు తాను చేరువగా జరిగిన క్షణాలవి అనిపించింది. ఇక రోజు మొదలయ్యాక తనని చూడవచ్చేవారి జిజ్ఞాసని బట్టీ, సామర్థ్యాన్ని బట్టీ ఆయన వారికి దగ్గరగా జరగడం మొదలుపెడతారు. ఆ రెండు మనఃస్థితులకీ మధ్య ఉండే ఒక తావులో నేనాయన్ని కలుసుకున్నాను. నాకేసి సాలోచనగా చూసి చెప్పడం మొదలుపెట్టారు.
‘ఈ రోజుల్లో ఒక రకమైన గందరగోళం నడుస్తోంది. అదేమంటే మనం మన జీవనశైలిని మర్చిపోయాం. మన జీవనశైలి విలువల్ని మనం మర్చిపోవడం వల్లనే ఈ గందరగోళం తలెత్తింది. మన జీవనవిధానానికి సంబంధించిన ప్రతి ఒక్క విలువనీ మనం మర్చిపోతూ వస్తున్నాం. డబ్బున్నవాళ్ళుగా బతకడం అనేది మనకు ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు కదా! డబ్బు ఇప్పుడేమీ రాలేదు కదా మన దగ్గరకి కొత్తగా?’
‘వేల సంవత్సరాలుగా మన దగ్గర చాలానే ఉంది. అంత ఉన్నప్పటికీ వాళ్ళు ప్రతి ఒక్క వస్తువుకీ, విషయానికీ కొన్ని పరిమితులు పెట్టుకున్నారు. మనిషికి సౌకర్యాలు ఎంతవరకూ అవసరమో అంతే ఉంచుకున్నారు. కానీ ఈ రోజు సౌకర్యానికి కొలమానం ఏమిటి? అభివృద్ధికి కొలమానం ఏమిటి? ఏం జరిగితే మనిషి అబివృద్ధి చెందినట్లు? దానికేదైనా కొలమానం ఉందా? ఎంత సౌకర్యం ఉంటే నాకు సరిపోతుంది అనుకోడానికి ఈ రోజు ఏదైనా లెక్క ఉందా? లేదు. ఈ రోజు చేతిలో అయిదులక్షలుంటే లక్ష పెట్టి కారు కొంటాడు. అయిదు కోట్లు ఉంటే రెండు కోట్ల విలువచేసే కారు కొంటాడు. లేదా ఇరవై కోట్ల కారు కొంటాడు. మహా అయితే ఇదే కదా జరిగేది? ఇంతకన్నా ఇంకేముంటుంది? అదీ సౌకర్యమే, ఇదీ సౌకర్యమే. దానికి యాక్సిడెంటు అయినా చనిపోతాడు, దీనికైనా చనిపోతాడు. ఇందులో చనిపోడని ఏమీ లేదు కదా. చనిపోవాల్సి వస్తే ఇందులోనూ చనిపోతాడు.’
‘కాని ఇలా ఎందుకు జరిగింది? ఆయన ఢిల్లీలోనో లేదా మరెక్కడుంటాడో అక్కడ ఆ కారు లేకపోతే ఆయనతో ఎవరూ మాట్లాడరు. అవునా? ఆయన దగ్గర సూటూ, బూటూ లేకపోతే అప్పుడు కూడా ఎవరూ మాట్లాడరు. అక్కడ ఇవన్నీ కావాలి. కాని ఒకప్పుడు మన దేశంలో దీనికి పూర్తిగా విరుద్ధంగా నడిచేది. ఎవరైతే దిగంబరంగా, అంగీలేకుండా కూర్చుంటారో వాళ్ళు అంతగా పూజనీయులయ్యేవారు. వాళ్ళే ఆదర్శంగా ఉండేవారు. ‘చూడండి, ఇంత ఉన్నా కూడా ఇలా ఉన్నారు, వీళ్ళకేం తక్కువ? వీళ్ళకేం లోటు వచ్చింది? ఇంత ఉన్నా కూడా ఇలా ఉన్నారంటే దీనికంటే భిన్నమైంది ఇంకేదో ఉంది’ అనుకునేవారు.
ఒక యువకుడు చాలా తపస్సుచేసాడు, తనకు పరుసవేది దొరకాలని. పరుసవేది అంటే తెలుసు కదా, దాన్ని ఇనుముకి తాకిస్తే ఆ ఇనుము బంగారమైపోతుంది. అప్పుడొక పెద్ద మహాత్ముడు వచ్చి ‘ఎందుకు ఇంతలా ఇబ్బంది పడుతున్నావు, వెళ్ళు. నది ఒడ్డున ఒకాయన కూర్చున్నాడు. అతని దగ్గర పరుసవేది ఉంది, పోయి అడుగు, నీకు ఇచ్చేస్తాడు ‘ అని చెప్పాడు.
‘ఈ యువకుడు ఆయనదగ్గరకు వెళ్ళాడు. తీరాచూస్తే అతను తనకన్నా వయసులో చిన్నవాడు, ఒక కుటీరం వేసుకుని, అక్కడ తన ధ్యానంలో తాను మునిగిపోయి ఉన్నాడు. ఇతను ఆయన దగ్గరకి వెళ్ళి ‘నాకు పరుసవేది కావాలి’ అని అడిగాడు. అతను ‘అదిగో చూడు మట్టిలో ఒక రాయి పడి ఉంది. నేనటూ ఇటూ వెళ్తున్నప్పుడు అది కాళ్ళకు తగుల్తుంటే తీసి పక్కన మట్టిలో పడేసాను. అది కొద్దిగా ప్రత్యేకంగా కనబడుతోంది కదా, అదే అయి ఉంటుంది, చూసి తీసుకో’ అని అన్నాడు.’
‘ఇతడు వెళ్ళి ఆ మట్టిలోంచి ఆ రాతిని బయటికి తీసాడు. తన దగ్గరున్న ఇనుముకి తాకించాడు. ఆ ఇనుము బంగారమైపోయింది. ఆ రాతిని తీసుకున్నాడు. తీసుకుని వెళ్ళబోతూ మళ్ళీ అతణ్ణి అడిగాడు ‘ఇది పరుసవేది అని మీకు తెలుసు కదా?’ అని. ‘హాఁ నాకు తెలుసు ఇది పరుసవేది అని ‘ అన్నాడతను. ‘నాకు తెలుసు, అయినా నేనేం చేసుకుంటాను దీన్ని?’ అని కూడా అన్నాడు.’
‘ఇతనికి కొంచెం దూరం వెళ్ళాక అనిపించింది: ‘ఈ పరుసవేది కన్నా కూడా పెద్ద వస్తువు ఏదో ఇతని దగ్గర ఉంది కదా? అందుకే దీన్నిలా పక్కన పారేసాడు’ అని. అయితే ‘ఆ గొప్ప వస్తువు ఏమయ్యుంటుంది? నేనేమో దీని కోసం పిచ్చివాడిలా తిరుగుతున్నాను, అతడేమో దీన్ని పక్కన పారేసాడు. తెలిసి కూడా పారేసాడు’ అనుకుని మళ్ళా వెనక్కి వచ్చాడు. ‘మహరాజ్, మీ దగ్గర దీనికంటే మరేదో పెద్ద వస్తువు ఉంది కదా, అందుకేనా మీరు దీన్ని అంతగా పట్టించుకోలేదు?’ అనడిగాడు.’
‘అప్పుడు ఆయన ‘నీకు ఆ వస్తువే కావాలనుకున్నప్పుడు ఇంక ఇదెందుకు? పక్కన పారెయ్యి, ఆ గొప్ప వస్తువేమిటో నేను చెప్తాను’ అన్నాడు. ఇతను దాన్ని పారేసాడు. అప్పుడు ఆయన ఆత్మజ్ఞానం గురించి మాట్లాడేడు.’
ఇలాంటి కథలు మన దగ్గ్గర చాలా ఉన్నాయి. అవి మనల్ని ఆలోచింపచేస్తుంటాయి. సమృద్ధి కావాలి, కాని అదే మనకి సర్వస్వం అయిపోకూడదు అనే భావన మన మనసులో ఉండాలి. దానికంటే భిన్నమైన, నిర్లిప్త భావం ఏదో ఒకటి ఉండనే ఉండాలి.’ఇదే మనది, ఇది లేకుండా మనం బతకలేం’ అనేది ఏదీ ఉండకూడదు. సరే, ఉంటే ఉంది భయ్యా! ఉంది అంటే అర్థం ఏమిటి? దాన్ని కట్టుకుని తిరుగుతామా? లేదా దాన్ని గొప్పగా ప్రదర్శిస్తామా? అలా చెయ్యలేం కదా.
ఒక రాజుండేవాడు. అతని దగ్గర అష్టలక్ష్ములుండేవారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, సంతానలక్ష్మి, వైభవ లక్ష్మి, గజలక్ష్మి, ధైర్యలక్ష్మి- అందరూ లక్ష్ములే. అయితే ఈ అష్టలక్ష్ములు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళల్లో వాళ్ళకు ఒక చిన్న గొడవ వచ్చింది.’ నేనుండబట్టే ఇతని దగ్గర అంతా ఉంది’ అని ధనలక్ష్మి అంది. ‘కాదు, కాదు నేనుండబట్టే అంతా ఉంది’ అని ధాన్యలక్ష్మి అంది. అలా అని ఎవరి మటుకు వారు వాదించుకోవడం, దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు. పోయి ‘రాజునే అడిగి తెలుసుకుంటే మంచిది కదా’ అనుకున్నారు. రాజు తన మంచం మీద పడుకుని ఉన్నాడు పాపం. వీళ్ళంతా వెళ్ళి చుట్టూ నిలబడ్డారు.
‘ఓ రాజా, చెప్పు, నీ ధనలక్ష్మిని, నేనుండబట్టే నీ దగ్గరంతా ఉంది. ఇది నువ్వు ఒప్పుకుంటావు కదా’ అని అడిగింది ధనలక్ష్మి. అతనెలాంటి జవాబూ ఇవ్వలేదు. ‘సరే, నా అవసరం నీకు లేకపోతే నేను వెళ్తాను’ అని ధనలక్ష్మి వెళ్ళిపోయింది. ధాన్యలక్ష్మి కూడా అలాగే అడిగింది. ‘నేనుండబట్టే నువ్వు తింటున్నావు, తాగుతున్నావు’ అంది. అతను ఏమీ మాట్లాడలేదు.’సరే, మా అవసరం లేనప్పుడు మేముందుకుంటాం ఇక్కడ?’ అని ఆమె కూడా వెళ్ళిపోతుంది. అ లా అలా ఏడుగురు లక్ష్ములూ వెళ్ళిపోయారు.
చివరకు ఒక లక్ష్మి మాత్రం అక్కడే ఉంటుంది. ఆమె ‘ఓ రాజా నీకు ఏ లక్ష్మీ అవసరం లేనప్పుడు నా అవసరం కూడా నీకుండదు కదా, అందుకే నేను కూడా వెళ్తున్నాను’ అని అన్నప్పుడు రాజు ఆమె చేయి పట్టుకున్నాడు. ‘నువ్వు వున్నావు కాబట్టి కదా వీళ్ళందర్నీ పంపించేసాను’ అన్నాడు. కాబట్టి మన దగ్గర ధైర్యలక్ష్మిని అన్నిటికంటే పెద్ద లక్ష్మిగా భావిస్తారు. ధైర్యం ఉంటే అంతా ఉన్నట్లే. కానీ ఈ రోజు మనం ఆ లక్ష్మిని వదులుకున్నాం. రామచరిత మానస్ లో విభీషణుడు
రావను రథి బిరథ రఘువీరా
దేఖి బిభీషన భయఉ అధీరా
‘రావణుడు రథం మీద ఉన్నాడు, రాముడేమో కాలినడకన ఉన్నాడు, శరీరానికి ఎటువంటి కవచమూ లేదు, కాళ్ళకు చెప్పుల్లేవు, తలకి రక్షణ లేదు, ఈయన రావణుడితో ఎలా పోరాడగలరు?’ అని విభీషణుడు చాలా ప్రేమతో, ఆందోళనతో రాముడి ద్గ్గరకి వెళ్ళి ‘ప్రభూ! మీరు వీళ్ళతో ఎలా పోరాడగలరు?’ అని అడుగుతాడు. అప్పుడు రాముడు ఒక మాట చెప్తాడు:
సౌరజ ధీరజ తేహి రథ చాకా
సత్యసీల దృఢ ధ్వజా పతాకా
‘నా శౌర్యం, నా ధైర్యమే. నా రథచక్రాలు, నా సత్యశీలత నా ధ్వజం, పతాకం, యమనియమాలు నా గుర్రాలు, బుద్ధి నా సారథి, వైరాగ్యం నా డాలు, సంతోషం నా కత్తి, శ్రేష్ఠమైన విజ్ఞానమే నా ధనుస్సు, నా గురుభక్తినే నా కవచం. ఇవన్నీ నా దగ్గర ఉన్నప్పుడు నేనెందుకు ఓడిపోతాను?’ అని అంటాడు.’
‘మన దగ్గర 1857 తర్వాత గురుపరంపరలు తెగిపోయాయి. పూర్వం ఇక్కడ ప్రతి వ్యక్తికీ ఒక గురువు, ప్రతి ఇంటికీ ఒక గురువు ఉండేవారు. కులగురువు. వారు సరైన సమయానికి వస్తూ ఉండేవారు. ఆ గురువులు ఎలా ఉండేవారు? మనదగ్గర వాళ్ళను ఎలా భావించేవారు?’
‘ఒకరు అధ్యాపకుడు, ఒకరు ఆచార్యుడు, ఆ తర్వాత ఒక గురువు. అధ్యాపకుడు అందంగా ఉండాలి, స్వచ్ఛమైన భాష మాట్లాడే వాడై ఉండాలి. అతని నోటివెంట ఎప్పుడూ చెడుమాట రాకూడదు. ఇవి అధ్యాపకుడికి ఉండవలసిన లక్షణాలు. అతడు వికారంగానో, మురిగ్గానో ఉండకూడదు. పిల్లకి అందంగా కనిపించాలి. కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాదు, ప్రశాంతమైన ముఖవర్చస్సు, పిల్లలను ఆకట్టుకునే ఆహ్లాదకరమైన రూపంతో కనిపించాలి. ఎందుకంటే చిన్నపిల్లలు అతని ముందు కూర్చుంటారు కదా.’
‘మనిషి ఎవరి దగ్గరైతే విద్య నేర్చుకుని దాన్ని ఆచరిస్తాడో అతణ్ణి ఆచార్యుడంటారు. అందుకే మనదగ్గర శిల్పాచార్యుడు అంటాం, నాట్యాచార్యుడు అంటాం, వడ్రంగులు, స్వర్ణకారులు, కమ్మరులు-వీళ్ళందరి పేర్ల పక్కన ‘ఆచార్య’ అని ఉంటుంది. చారి, గోవిందాచారి, ఆచారి,- వంట వండేవాణ్ణి కూడా ఆచార్యుడనే అంటారు. ఎందుకంటే అతని శిష్యులు అతని నుండి నేర్చుకుని దాన్ని ఆచరిస్తారు కదా.’
‘ఆ తర్వాత గురువు. గురువు వికారంగా కూడా ఉండవచ్చు, మురికిగా కూడా ఉండవచ్చు, అతని భాష సరిగా లేకపోవచ్చు. ఇవన్నీ లెక్కలోకి రావు, అక్కడ అతని జ్ఞానం ముఖ్యం. నువ్వు దేన్ని తీసుకోవాలో ఆ జ్ఞానం ఒక్కటే ముఖ్యం.’
‘గురువుల్లో మళ్ళా మూడు రకాలు చెప్పారు: ఒకరు పక్షి లాంటి వాడు, ఒక గురువు తాబేల్లాంటివాడు, ఒక గురువు చేపలాంటివాడు. పక్షి చూడండి, గుడ్డుపెట్టి దానిమీదనే కూర్చుంటుంది. అది తనంతట తానుగా ఎదిగేటంతవరకు దానికి పూర్తి పోషణ అందిస్తుంది. పక్షిలాంటి గురువు తన శిష్యుల్ని అలానే దగ్గరకు చేర్చుకుని కూర్చుంటాడు.’
‘తాబేలు గుడ్లు ఎక్కడో పెడుతుంది. ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ గుడ్లనుండి పిల్లలు బయటికి వచ్చి నేరుగా మళ్ళీ దానిదగ్గరికే వెళ్తాయి. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటుంది. మళ్ళీ దాని దగ్గరికే వెళ్తాయి. కొందరు గురువులుంటారు, కులగురువులాగా. వాళ్ళు శిష్యుల్ని తయారుచేస్తారు. కానీ నిరంతరం వాళ్ళతోనే అతుక్కుని ఉండరు కదా. వాళ్ళు ఎక్కడో ఉంటారు. అప్పుడప్పుడు ఆయన వీళ్ళ దగ్గరికి వస్తుంటాడు. అంతే తప్ప అతుక్కుని ఉండరు.’
‘ఇక చేప గుడ్లు పెట్టి దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఒక రకమైన గురువులు అలా కూడా ఉంటారు, శిష్యుల చుట్టూనే తిరుగుతూ ఉంటారు.’
‘ఈ విధంగా మన దగ్గర గురువుల పద్ధతులుండేవి. ఇప్పుడు ఆ కులగురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రకాంకి చెందినవాళ్ళు. ఏడాదికో, రెండేళ్ళకో ఒకసారి రావడం, వీళ్ళ ఇంట్లో బసచేయడం- వాళ్ళు వీళ్ళ ఇంటిచేతివంట తినేవారు కాదు.వీళ్ళు రేషన్, సామాన్లు అన్నీ పెడితే కులగురువులు వండుకుని వీళ్ళకి కూడా తినిపించి వాళ్ళు తినేవారు. వాళ్ళు ఏ యజమాని ఇంటికి వచ్చారో వాళ్ళకే వండిపెట్టేవారు. ‘మీ కోసం మీరేం వండుకుంటారు? మేమే వండుతాం మీ అందరికోసం. తీసుకోండి, మహాప్రసాదం’ అని. అది మహాప్రసాదం. అలా కులగురువులు రావడం, వండి ఆ కుటుంబాలకు తినిపించడం, చాలామందిని చూసాను.
‘ఆ గురువులు ఉన్నంతకాలం ఆ కుటుంబానికి సంబంధించిన ఎన్నో సమస్యలు, ఇబ్బందులు సరిచేసేవారు. ‘ఏదైనా పిల్లాడు మాట వినటంలేదంటే, ‘ఇలా కుదరదు, ఇలా ఉండాలి, లేదంటే కుదరదు’ అని చెప్పేవారు. గురువు డిక్షనరీలో ‘ఓటమి’ అనే పదమే ఉండదు. గురువు ఎప్పుడూ ఓడిపోడు. ఒక రాజు ఓడిపోవచ్చు, అతని శిష్యుడు ఎవరైనా రాజు అయితే అతడు ఓడిపోవచ్చు. కానీ అతణ్ణి మళ్ళీ ఎక్కడో ఒకచోటనుండి గురువు నిలబెట్టుకుంటూ వస్తాడు. గురువులో ఆ దమ్ముంది. ఆయన మార్గాలు వెతుకుతాడు. ప్రతి విషయానికీ ఒక ప్రత్యామ్నాయం ఆయన దగ్గరుంటుంది. మార్గాలు వెతుకుతాడు. మళ్ళీ ఇతణ్ణి నిలబెడతాడు. శుక్రాచార్యుడు ఉన్నాడు, యుద్ధంలో రాక్షసులు చనిపోతుంటే ఆయన మళ్ళీ వాళ్ళను బతికించి నిలబెట్టేవాడు కదా. ఆయనే గురువు, ఎవరి దగ్గరైతే ఓటమి అనే పదమే ఉండదో ఆయనే.’
‘అలా కులగురువు ఎప్పటికప్పుడు వచ్చి ఈ కుటుంబాన్ని, ఈ కులాన్ని మళ్ళీ బలోపేతం చేసేవాడు. సరే, సమస్యలుంటాయి, సమస్యలంటే దుఃఖం కాదు కదా. సమస్యలకు పరిష్కారాలు వెతకవచ్చు. గురువులు అలాంటి పరిష్కారాలు చెప్పేవారు: ‘ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, బతుకుతావు, సంతోషంగా’ అని చెప్పేవారు.’
‘1857 తర్వాత నుంచి మనకి నెమ్మదినెమ్మదిగా గురుపరంపరలు తెగిపోవడం కనిపిస్తుంది. ఆ తర్వాత నుంచే ఏదో అయ్యింది. ఈ గందరగోళం మొదలయ్యింది. అంతకుముందు 27 పెద్ద పెద్ద విప్లవాలు జరిగాయి. అవన్నీ ఇలాంటి వర్గమే చేసారు. ఆ పరంపర ఎన్నో రకాలుగా విచ్ఛిన్నమయ్యింది. గురువులు దూరం కాగానే ప్రతి ఒక్క మనిషీ తనను తాను అరక్షితంగా భావించడం మొదలుపెట్టాడు. ఎన్నో రకాల అభద్రతా భావాలు చుట్టు ముట్టాయి మనల్నిప్పుడు. సామాజిక అభద్రత, ఆహార అభద్రత. ఆ తర్వాత ధైర్యానికి కూడా రక్షణ లేకుండా పోయింది మనకు.’
‘కొన్ని మతాల్లో ఒక మాట నడుస్తుంది: భగవంతుడు నిన్ను పేదవాడిగా చేసి కూడా నీకు పరీక్ష పెడతాడు లేదా నిన్ను ధనవంతుడిగా చేసి కూడా నిన్ను పరీక్షిస్తాడు అని. ధనవంతుడైన తర్వాత కూడా నువ్వు నీ నిజాయితీమీద ఉన్నావా లేదా అని పరీక్షిస్తాడు. అలాగే పేదవాడిగా కూడా నిన్ను పరీక్షిస్తాడు, నువ్వు ఇంత పేదరికంలో కూడా నీ నిజాయితీ కాపాడుకుంటున్నావా లేదా అని చూస్తాడు. ధనవంతుణ్ణి చేసి పరీక్షిస్తున్నాడు అన్నప్పుడు అతడు చాలా ఆలోచిస్తాడు ‘నేను చేస్తున్నది మళ్ళీ తప్పు కాకూడదు’ అని. పేదరికంలో అయితే ఇక ధైర్యమే అతనికి సర్వస్వం అవుతుంది. ‘భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, అందుకే ఈ పరీక్షలో పాసవ్వాలి, నిజాయితీ నుండి పక్కకి తప్పిపోకూడదు’ అనుకుంటాడు. కానీ ఇప్పుడు మన సమాజంలో అటువంటి మాటలేవీ నడవడం లేదు. ధైర్యమైతే ఎవరూ ఎవరికీ ఇవ్వడం లేదు. అందరూ ధైర్యాన్ని తగ్గించేవాళ్ళే ఉన్నారు.’
‘చివరికి నాస్తికుడు కూడా తనకంటూ ఒక పద్ధతి ఏర్పరచుకుంటాడు. అతనికి కూడా తెలుసు, నిజాయితీ ఏమిటి, అవినీతి ఏమిటనేది. ఒక సమాజంలో బతకాలంటే భగవంతుడి బలంతోనే బతకాలని ఏమీ లేదు కదా. మన ప్రజలు అదృష్టాన్ని నమ్ముతారు. కానీ అదృష్టం మీదనే ఆధారపడి బతకరు కదా. అదృష్టంకొద్దీ ఏది దొరుకుతుందో దాన్ని సరిగ్గా ఉపయోగించడం తెలియాలి. సరే, మనకీ మనుష్య దేహం లభించింది. దీన్నే అదృష్టంగా భావిస్తారు మనవాళ్ళు. చాలామంది ఋషులు నాస్తికులే. రాముడు వనవాసం మొదలుపెట్టినప్పుడు జాబాలి అంటాడు ‘స్వర్గం ఏమిటి? నరకం ఏమిటి? ఏ మోక్షం గురించి మాట్లాడుతున్నావు? ఇవన్నీ ఏమీ ఉండవు, ఇవన్నీ పనికిరాని మాటలు ‘ అంటాడు. ‘ఇంతమంది నిన్ను రమ్మని బతిమాలుకోడానికి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళ మాటలు విని చక్కగా వెళ్ళి రాజ్యం చెయ్యి. నువ్వు ఇహలోకం, పరలోకం అనే మాటల చక్రబంధంలో పడిపోయావు. అసలు లేనేలేనివాటి కోసం’ అని అంటాడు. ఇదంతా జాబాలి కేస్. మన సంస్కారాల్లో చాలా సంస్కారాలు జాబాలి లాంటివే ఉంటాయి. చాలామంది ప్రజలు మనదగ్గర అలాగే ఉండేవారు. ‘నువ్వు తథాగతుడి లాగా మాట్లాడుతున్నావు’ అంటాడు జాబాలి రాముడితో.’
‘విషయమేమిటంటే మనకు ధైర్యాన్నిచ్చే వ్యవస్థలేవీ లేవిప్పుడు. ఒక కాలం ఉండేది, రెండు మూడు తరాల కిందట, ఎవరైనా నాలుగణాల లంచం తీసుకుంటే అతని తండ్రి తిట్టేవాడు ‘ఖాన్ దాన్ గౌరవం మంటకలిపావు’ అని. అతని తల్లి తిట్టేది. చుట్టుపక్కల వాళ్ళు ‘జాతి గౌరవం తీసేసావు’ అని అనేవారు. కాని ఈ రోజు అలా లేదు. ఈ రోజు ఎవరైనా లంచం తీసుకోకపోతే ‘చూడు, సత్యహరిశ్చంద్రుడు పుట్టాడు మన ఇంట్లో అంటారు’. ‘ప్రపంచంలో నువ్వొక్కడివే హరిశ్చంద్రుడివా? నీలాంటి వాడు మా ఇంట్లో పుట్టాల్సి వచ్చిందే’ అంటారు. ‘పిల్లలున్నారు, ఎలా పెంచుతాడు? ఇవి చేయకపోతే ఎలా?’ అంటారు.
‘కాబట్టి ఇప్పుడు మన సమాజంలో ధైర్యం అనే మాట లేదు. పూరన్ భగత్ తపస్సుకోసం వెళ్ళినప్పుడు పన్నెండేళ్ళు తపస్సు చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు అతను తండ్రికి ప్రణామం చేసాడు. అతని తల్లి అతణ్ణి లేపి ‘ఏమి తిని తపస్సు చేసావు?’ అనడిగింది. ‘చెట్ల లేతలేత ఆకులు కోసి తినేవాణ్ణి. వాటితోనే బతికాను’ అన్నాడు. ఆ మాట అనగానే ఆమె అతని జుట్టు పట్టుకుని గట్టిగా లాగింది, గట్టిగా అరిచింది, ‘ఏం? కష్టంగా ఉందా? చెట్లకు కాలేదా కష్టం? వెళ్ళు, మళ్ళీ తపస్సు చెయ్యి’ అంది. ఆమె అలా అంటే, అతడు మళ్ళీ తపస్సుకు వెళ్ళాడు. ఎండిపోయిన ఆకులు తిని మళ్ళీ తపస్సు చేసాడు. మన దగ్గర ఒక తపస్సు అంటే పన్నెండేళ్ళ లెక్క.’
‘ఇక్కడి స్త్రీలలో ఎంత దమ్ముండేదంటే, గోపీచంద్ ని సన్యాసం వైపు నెట్టినది అతని తల్లినే. గోపీచంద్ కు రాజ్యాభిషేకం ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు అతనికి స్నానం చేయిస్తున్నారు. ఏడో అంతస్తు నుండి కూర్చుని అతని తల్లి అతణ్ణి చూస్తోంది. ఆమె కంటి నుండి ఒక నీటి చుక్క కింద పడింది, అది ఇతని శరీరం మీద పడి బొబ్బెక్కింది. ‘ఈ రోజు ఆకాశంలో మేఘాలులేవు కదా, ఈ నీటి చుక్క ఎక్కడి నుండి పడింది? అది కూడా ఎంత వేడిగా ఉందంటే నా శరీరం బొబ్బెక్కింది’ అని అతను పైకి చూస్తే తల్లి కూర్చుని ఉంది. అతను ఆమె దగ్గరికి వెళ్ళి, ‘ఎందుకు ఏడుస్తున్నావు, చెప్పు’ అని అడిగాడు. ‘నిన్ను స్నానం చేయించడానికి కూర్చోబెట్టినప్పుడు నేను చూశాను, ఇంత అందమైన నీ శరీరం ఒకరోజు కాలిపోతుంది కదా. అందుకే నా కళ్ళమ్మట నీరొచ్చింది. ఇంత అందమైన శరీరాన్ని కూడా ఒకరోజు అందరూ కలిసి తగలబెట్టేస్తారు. దీనికంటే మంచిది ఏంటంటే, నువ్వు నీ మోక్షం కోసం ఏదైనా చేసుకో’ అని అందామె. అని అతణ్ణి సన్యాసం వైపు ప్రేరేపించింది. ఇటువంటి ఒక చరిత్ర మనదగ్గర ఉంది.’
సిద్ధార్థుడు రాత్రికి రాత్రే వెళ్ళిపోయినప్పుడు ఉదయాన్నే లేచి యశోధర ‘ఆయన రాత్రి ఎక్కడికో వెళ్ళిపోయారు’ అని గమనించి తన సఖులతో చెప్తుంది. యశోధర పేరిట మైథిలీ శరణ్ గుప్త రాసిన చాలా అందమైన కవితలో .
సిద్ధి హేతు స్వామి గయే
యహ్ గౌరవ్ కీ బాత్
పర్ చోరీ చోరీ గయే
యహీ బడా వ్యాఘాత్
‘నా స్వామి సిద్ధికోసం వెళ్ళారు, ఇది గౌరవించదగ్గ విషయమే. కానీ దొంగచాటుగా వెళ్ళారు. అదే పెద్ద బాధ.’
సఖీ, వే ముఝ్ సే ఖ కర్ జాతే
‘సఖీ! ఆయన నాతో చెప్పి వెళ్ళి ఉంటే బాగుండేది.’
తో క్యా వే ముఝ్ కో అప్నీ పథ్ బాధా హీ పాతే
‘నాతో చెప్తే నేను ఆయనకి అడ్డుపడేదాన్ని ఔనుకున్నారా? స్వయంగా అలంకరించి క్షత్రియ ధర్మం ప్రకారం మా భర్తలను యుద్ధరంగానికి పంపించే స్త్రీలం మేం. ఆయన తపస్సు కోసం వెళ్తుంటే నేను ఆపేదాన్నా ఏమిటి? అది దీనికంటే శ్రేష్ఠమైన విషయం కదా. మమ్మల్ని ఇంత బలహీనంగా ఎలా ఊహించుకున్నారు ఆయన?’ అని అడుగుతుంది
ఒకసారి ఒకతను తపస్సుకోసం వెళ్ళాడు. పన్నెండేళ్ళు తపస్సు చేసాడు. ఆ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు నది మీద నడుస్తూ వచ్చాడు. వచ్చి తన తండ్రి కాళ్ళమీద పడ్డాడు. పడగానే తండ్రి అతణ్ణి లేపి గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. ‘ పన్నెండేళ్ళ తపస్సుచేసి రెండు పైసల విద్య నేర్చుకుని వచ్చావా? రెండు పైసలిస్తే ఆ నావవాడు నిన్ను నదిదాటించేవాడు కదా! వెళ్ళు, మళ్ళీ తపస్సు చెయ్యి’ అన్నాడు.
అంటే, ఇంత కూడా వివేకం లేదు, ఈ పన్నెండేళ్ళు ఎందుకు గడిపానో అని. అక్కడ చూడవలసింది వివేకం గురించిన మాట. విద్య నేర్చుకున్నా, తపస్సు చేసినా అందులో వివేకం ఉండాలి కదా. ఒక గురువు దగ్గరకి నలుగురు శిష్యులు వెళ్ళారు. ఈ కథ అందరికీ తెలిసే ఉంటుంది. నలుగురు శిష్యులు వెళ్ళి ఒక గురువు దగ్గర బాగా విద్య నేర్చుకున్నారు. అందులో ఒకడు కొంచెం చదువు అబ్బనివాడు. ‘నా వల్ల కాదు, ఇవన్నీ చదవడం రాయడం నేను అడవికి వెళ్ళి కట్టెలు తెస్తాను, చెట్టెక్కి పండ్లు కోసుకొస్తాను’ అన్నాడు. అతను అదే పని చేసాడు పాపం. చెట్లు ఎక్కడం, పండ్లు కోయడం, కట్టెలు పోగుచెయ్యడం లాంటి పనులు.’
‘మిగతా ముగ్గురూ బాగా విద్యనేర్చుకున్నారు. విద్యపూర్తయ్యాక వాళ్ళు తిరిగి బయలుదేరారు. దారిలో వెళ్తుండగా ఒక ఎముక ముక్క కనిపించింది. ఒకడు ఆ ఎముక తీసుకుని అది సింహం ఎముక అని గుర్తుపట్టి దాంతో దాని అస్థిపంజరం తయారుచేసాడు. రెండోవాడు దానికి చర్మం, మాంసం చేర్చి రక్తం నింపాడు. మూడోవాడు దానికి ప్రాణం పొయ్యగలనని చెప్పాడు. అప్పుడు ఆ కట్టెలు కొట్టేవాడు ‘నాకు మరే విద్యలూ రావు, నాకు వచ్చింది చెట్టెక్కే విద్య ఒకటే, ముందు నన్ను చెట్టెక్కనివ్వండి, ఆ తర్వాత మీకేం కావాలో అది చేసుకోండి’ అన్నాడు. అని చెట్టెక్కేసాడు. ఆ మూడో వాడు ఆ కళేబరంలో ప్రాణం పోసాడు. సింహం లేచింది. ముగ్గుర్నీ చంపేసింది. కథ ఖతం!’
‘కాబట్టి ఈ విద్యలేవైతే ఉన్నాయో, వివేకం లేకపోతే వాటి వల్ల ఇలాంటి దుర్వినియోగమే జరుగుతుంది. అందులో తమ ప్రాణాలే కోల్పోతారు వీళ్ళు. కాబట్టి వివేకం లేకుండా విద్యాదానం జరగకూడదు. అసలు ముందు పుట్టించవలసింది వివేకమే. రామచరిత మానస్ లో శూర్పణఖ రావణుడితో చెప్తుంది: ‘ఓ రావణా, నువ్వు వివేకం పుట్టించకుండా విద్యాదానం చేసేవాడిలా ఉన్నావు. చివరికి ఇద్దరి చేతుల్లోనూ శ్రమ మాత్రమే మిగుల్తుంది, అందుకే విద్యాదానానికి ముందు వివేకం కలిగించు’ అని చెప్తుంది. ఆమె సభకు వచ్చి మరీ చెప్పిన రాజధర్మం ఇది. ఒక రాజు ఎలా ఉండాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదని. చాలా అందమైన వర్ణన అది. ‘నువ్వేమో మద్యం తాగుతూ, మాంసం తింటూ ఒక్కడ పడి ఉన్నావు, నీకివేమీ తెలియడం లేదు, నువ్వు నీ రాజధర్మం పాటించడం లేదు’ అని చెప్తుంది.
కాబట్టి వివేకం కలిగించకుండా విద్యాదానం చేయడం శ్రేష్టమైనది కాదు. అందుకే ట్రైనింగ్ అన్నప్పుడల్లా నేను చెప్తుంటాను. ట్రైనింగ్ అంటే శిక్షణ కదా. ట్రైనింగ్ జంతువులకిచ్చేది. మనిషికి ట్రైనింగ్ ఏమిటి? గుర్రానికి, కుక్కకి, కోతికి, ఎలుగుబంటికి, కోడికి ట్రైనింగ్ ఇస్తారు. వాటికి నేర్పిస్తారు. వాటి మాస్టర్ వాటి ముందున్నంతవరకూ అవి అన్నీ చేస్తాయి. కోతిని ‘నాచ్’ అంటే డాన్స్ చేస్తుంది. ఎలుగుబంటిని ‘సలాం చెయ్’ అంటే సలాం చేస్తుంది. కాని వాటి మాస్టర్ పక్కకి వెళ్ళగానే అవి మళ్ళీ తమ అసలు స్వభావానికి వచ్చేస్తాయి. ట్రైనింగ్ అంటేనే ఇంత. అందుకే మనదగ్గర ట్రైనింగ్లన్నీ విఫలమవుతుంటాయి.’
‘ఒకటి రెండు ట్రైనింగ్ లు మేం కూడా చేసి చూసాం. అదంతా వేస్ట్ అనిపించింది. ట్రైనింగ్ ఇవ్వడం కాదు, ట్రైనింగ్ ఇచ్చే ముందు వారిలో వివేకాన్ని ఎలా పుట్టించాలో అది ఆలోచించాలి. ఎందుకంటే మనం ట్రైనింగ్ ఇచ్చి వదిలేస్తాం, ఆ తర్వాత వాళ్ళతో పని చేయించుకుంటాం కదా. ఇంగ్లిషు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి కొట్టి కొట్టి పనిచేయించుకునేవారు. ఆ తర్వాత పని అయిపోగానే వదిలేసేవారు. కానీ మనం ఒక ట్రయినింగ్ ఇచ్చి వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం కదా.’
‘ఒకాయన వచ్చాడు. నా దగ్గరకొచ్చి ‘మూడు నెలల ట్రయినింగు తర్వాత ఇతను ఆ పని మీద బతుకుతాడని మీరు గారంటీ ఇవ్వగలరా?’ అనడిగాడు. ‘మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు?’ అని అడిగాను. ఏదో చెప్పాడు. ‘ఇరవై ఏళ్ళు చదివాడు కదా, ఆ చదివిన చదువు మీద అతడు బతుకుతాడు అని గారంటీ ఉందా’ అనడిగాను. ఇరవై ఏళ్ళు ఖర్చుచేసినదానికే గారంటీ లేదు, మూడు నెలల ట్రైనింగ్ మా దగ్గర చేయడానికి గారంటీ అడుగుతున్నారు. మూడునెలల్లో, ఆరునెలల్లో నేర్చుకుని ఎవరైనా బతుకుతారా? ఇరవై ఏళ్ళు, పాతికేళ్ళు చదివినవాళ్ళకే గారంటీ లేదు. వాళ్ళు అదే చదువుమీద చదువుతారని. ఒక చదువు చదువుతారు. మరేదో ఉద్యోగం చేస్తారు. చదివిన చదువుకీ, ఆ ఉద్యోగానికీ అసలు సంబంధమే ఉండదు. కాబట్టి, ట్రైనింగ్ కాదు, వివేకం పుట్టించడం ముఖ్యం-‘
అప్పుడు మళ్ళా రామచరితమానస్ తెరిచారు.
2-7-2026


భద్రుడు గారు, మీరు ఈ సంభాషణల పరంపర లో ప్రతి భాగాన్ని మీదైన శైలిలో భలే సెటప్ చేసి పాఠకులని గురూజీ కళాశ్రమానికి ట్రాన్స్పోర్ట్ చేసి చుట్టూరా ఒక ప్రశాంత వాతావరణం సృష్టించి మరీ చదివిస్తున్నారు. తెల్లవారకముందే ఆశ్రమానికి వెళ్ళడం, గురూజీ దీపం వెలిగించి రామచరిత మానస్ పారాయణం చేయడం, వెదురుపొదలు, వేపచెట్టు మీది పక్షులు కూడా పారాయణం కోసం చెవి ఒగ్గి ఉండటం — చదువుతుంటే మా మనసులో ఒక ఒక అలౌకికమైన ప్రశాంతత చోటు చేసుకుంది.
ఈ సంభాషణలో గురూజీ గురు పరంపర గురించి చెప్పిన ఎన్నో విషయాలు, సందర్భాన్ని బట్టి లేవనెత్తిన ఎన్నో ప్రశ్నలు, చెప్పిన కథలు, అత్యంత విలువైన భారతీయ సంస్కృతి మూలాలతో పాటు అవన్నీ పతనమైన ఈనాటి గందరగోళ సమాజాన్ని కూడా ఏకకాలంలో ఆవిష్కరించాయి. గురూజీ చెప్పినట్టు “ఈ రోజుల్లో ఒక రకమైన గందరగోళం నడుస్తోంది. అదేమంటే మనం మన జీవనశైలిని మర్చిపోయాం. మన జీవనశైలి విలువల్ని మనం మర్చిపోవడం వల్లనే ఈ గందరగోళం తలెత్తింది. వేల సంవత్సరాలుగా మన దగ్గర చాలానే ఉంది. అంత ఉన్నప్పటికీ వాళ్ళు ప్రతి ఒక్క వస్తువుకీ, విషయానికీ కొన్ని పరిమితులు పెట్టుకున్నారు. మనిషికి సౌకర్యాలు ఎంతవరకూ అవసరమో అంతే ఉంచుకున్నారు. కానీ ఈ రోజు సౌకర్యానికి కొలమానం ఏమిటి? అభివృద్ధికి కొలమానం ఏమిటి? ఏం జరిగితే మనిషి అబివృద్ధి చెందినట్లు? దానికేదైనా కొలమానం ఉందా? ఎంత సౌకర్యం ఉంటే నాకు సరిపోతుంది అనుకోడానికి ఈ రోజు ఏదైనా లెక్క ఉందా? లేదు.”
దేనికీ తృప్తి పడని, పడలేని నేటి షో-ఆఫ్ చేసే సమాజాన్ని గురూజీ ఎంత కరెక్ట్ గా వ్యక్తపరిచారో. Whitman ‘Song Of Myself’ Section 32 లో జంతువుల జీవనశైలి గురించి చెబుతూ మానవుల్లాగా వస్తువుల కోసం, లౌకిక సంపద కోసం పిచ్చివాళ్ళలా ప్రాకులాడవంటాడు. “Not one is dissatisfied, not one is demented with the mania of owning things.” గురూజీ
మన ప్రాచీన భారతీయ ‘పరిమితుల సంస్కృతి’ గురించి చెబుతుంటే ఇదే గుర్తొచ్చింది.
నేనెప్పుడో, ఎక్కడో విద్యాభ్యాసం లేదా జ్ఞాన సముపార్జన కోసం బోధకుడు, ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఆచార్యుడు, గురువు ఇలా వేర్వేరు వ్యక్తులు ఉంటారని చదివినట్టో, విన్నట్టో గుర్తు. గురూజీ అధ్యాపకుడు, ఆచార్యుడు, గురువు గురించి ఎప్పుడూ కనీ విని ఎరుగని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెబుతుంటే అవన్నీ గుర్తొచ్చాయి.
పరుసవేది కథ; చేప, తాబేలు, పక్షి కథ; అష్టలక్ష్ములలో ధైర్యలక్ష్మి ప్రాముఖ్యత గురించిన కథ; రామ చరిత మానస్ లో రామ-రావణ రథాల గురించి విభీషణుడి సంశయము , రాముడి ధైర్యానికి సంబంధించిన శ్లోకాలు; ఇవన్నీ ఈ జీవన శిల్పి ఇరవై తొమ్మిదో భాగం చదివిన తరువాతే తెలిసాయి.
నేను విన్న ప్రకారం బోధకుడు విద్యార్థిని తయారు చేస్తాడట ( LKG & UKG ఏమో లేదా తల్లి తండ్రులు పిల్లల్ని స్కూల్ కి పంపే ముందర చేసే బోధన ). అధ్యాపకుడు సమాచారాన్ని ఆ విద్యార్థి తలలో పెడతాడట. ఉపాధ్యాయుడు (లేదా ఉపాధ్యాయురాలు): అధ్యాపకుడి కన్నా పై స్థాయిలో ఉండి చదువు మాత్రమే కాకుండా, విద్యార్థి వ్యక్తిత్వాన్ని కూడా గమనిస్తూ, అతని ప్రవర్తనను సరిదిద్దే ప్రయత్నం చేస్తాడు. ఆచార్యుడు కేవలం చెప్పడమే కాదు, తాను చెప్పిన విలువలను ఆచరించి చూపిస్తాడట.
అయితే అత్యున్నతమైన స్థానం గురువుది ( Mentor అనుకోవచ్చేమో) అందుకే కొన్ని విద్యలు గురుముఖతః నేర్చుకోవాలంటారనుకుంటా. గురువు విద్యార్థిలోని అంతర్గత శక్తులను మేల్కొలిపి తొలగించి జ్ఞానోదయం కలిగిస్తాడు.
గురూజీ చెప్పినట్టు “గురువు డిక్షనరీలో ‘ఓటమి’ అనే పదమే ఉండదు. గురువు ఎప్పుడూ ఓడిపోడు. ఒక రాజు ఓడిపోవచ్చు… కానీ అతణ్ణి మళ్ళీ ఎక్కడో ఒకచోటనుండి గురువు నిలబెట్టుకుంటూ వస్తాడు. గురువులో ఆ దమ్ముంది.”
మన చరిత్రలో ఉదాహరణలెన్నో ఉన్నాయి. చంద్రగుప్తుడి వెనుక చాణక్యుడు, హరిహర బుక్కరాయల వెనుక విద్యారణ్యస్వామి, శివాజీ వెనుక సమర్థ రామదాసు నిలబడి సామ్రాజ్యాలకు సామ్రాజ్యాలనే నిర్మించారు. గురూజీ చెప్పినట్టు రాజులు భౌతికంగా ఓడిపోయినా, నైతికంగా, ఆధ్యాత్మికంగా సమాజాన్ని గెలిపించే శక్తి గురువుకు మాత్రమే ఉంటుందన్న సంగతి నిర్వివాదాంశం.
గురువుల పదజాలం లో ఓటమి అనే పదం ఉండదు అని గురూజీ చెబుతుంటే నేను గురువు గారిలా భావించే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ పాట పల్లవే నా చెవిలో మార్మోగింది….
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..
ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి..
విశ్రమించవద్దు ఏ క్షణం..
విస్మరించవద్దు నిర్ణయం..
అప్పుడే నీ జయం నిశ్చయంరా..
మరొక అద్భుతమైన గురూజీ సంభాషణ మాకందించినందుకు మీకు కృతజ్ఞతాభివందనములు భద్రుడు గారు.
చాలా సంతోషం సార్! ధరమ్ పాల్ గారు ఇందుకనే గురూజీని ఆయన భావాలు ఎప్పటికప్పుడు రికార్డు చేసి పెట్టమన్నారు. ఎందుకంటే ధరమ్ పాల్ గారికి తెలుసు మీ బోటి శ్రోతలు ఉంటారని! మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.