
రెండవ రోజు: ఐదవ సంభాషణ
100 అంటే 132
ఎండ పూర్తిగా తగ్గింది. ప్రార్థనామందిరాన్ని ఆనుకుని వున్న వెదురుపొదల దగ్గర కూచుందామనిపించింది. గురూజీతో ఆ మాటంటే, పదండి అక్కడే కూచుందాం అన్నారు. ఆ వెదురుపొదల్ని ఆనుకుని ఉన్న అరుగుమీద కూచున్నాం. అలా వెదురుపొదల పక్కన, ఆయన దగ్గర కూచుంటే, ఏదో పూర్వకాలపు చీనాలో వెదుళ్ళ గుంపు కవులతోనో, లేదా మధ్యయుగాల జపాన్ లో జెన్ గురువుల ఎదటనో కూచున్నట్టుంది. మేము చోటు మారామే గాని, గురూజీ ఇంకా పూర్వ కాలపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దగ్గరే ఉన్నారు. ఆయన తన మాటలు మొదలుపెట్టారు.:
‘ మా చిన్నప్పుడు మామిడి పండ్లు అమ్మేవాళ్ళు వచ్చినప్పుడు వంద పండ్లు మూడు నాలుగు రూపాయలుండేవి అప్పుడు మూడు పండ్లు ఈ చేత్తో, మూడు పండ్లు ఆ చేత్తో అలా ఇరవై సార్లు వేసేవాడు. దాని తర్వాత పైనుండి రెండు చేతుల్తో మరికొన్ని వేసేవాడు. అలా వంద పండ్లిస్తానని చెప్పి 132 పండ్లిచ్చేవాడు. పూర్వకాలపు గ్రామాల లెక్కలో 100 అంటే 132 నా? 132 పండ్లను 100 గా లెక్కిస్తారా? 100 అంటే 100 కదా. అలా లెక్కపెట్టడానికి మరేమైనా బలవంతం ఉందా?’
‘ ఏ బలవంతమూ లేదు.’
‘ఇప్పటికీ పాలుపోసేవాడు లీటరుతో కొలిచిపోసాక పైనుండి మరికొన్ని పాలు పోస్తాడు. ఏదైనా బలవంతం ఉందా అతడికి? ఎందుకు పోస్తాడట్లా? ఇప్పటికి ఇరవై ఏళ్ళ కింద బజారులో కూరగాయలు కొనడానికి వెళ్తే పది కిలోల వంకాయలు తీసుకుంటే కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఊరికే వేసేవాడు, రెండు కిలోల వంకాయలు ఎక్కువే వేసేవాడు. మనకి అమ్మినవాటిలో కొన్ని పుచ్చులుండవచ్చేమో కదా అని. ఎందుకిచ్చేవాడతను? ఏమైనా బలవంతం ఉందా? ఎప్పుడైనా పశువుల మేత కొనడానికి బండ్లతో వచ్చినప్పుడు, మేత కొనేటప్పుడు, ఐదు ఒకవైపు వేసేవాడు, ఒకటి ఒక వైపు వేసేవాడు. ఇవి ఇరవై అయితే అవి 100 అయ్యేవి. దాని తర్వాత పైనుంచి కూడా మరికొన్ని వేసేవాడు. అప్పుడు కూడా మేత 100 కట్టలని చెప్పి 132 ఇచ్చేవాడు.’
‘ఎందుకంటే అతడు సమృద్ధుడు. అతడికి తెలుసు, ఇచ్చిన తరువాత కూడా తన దగ్గరమిగులుతుందని.’
‘ ఇవాళ కోటీశ్వరుడు కూడా ఒక క్వింటాలు అమ్మితే ఒక్క తులం కూడా ఎక్కువ తూచలేడు. ఎందుకంటే అతడు పేదవాడు. కోటీశ్వరుడు కావచ్చు, సంపన్నుడు కావచ్చు, కానీ పేదవాడు. ఎందుకంటే ఆ వస్తువు అతడి సొంతం కాదు. ఎవరికైతే ఇచ్చిన తరువాత కూడా తన దగ్గర మిగులుతుందని తెలుసో అతడే ఇవ్వగలిగే ధైర్యం చేస్తాడు. అందుకే ఎప్పుడైనా సరే, గ్రామాన్ని సమృద్ధం చేసే మాట నడిచింది మన దగ్గర, వ్యక్తిని సంపన్నుణ్ణి చెయ్యడం కాదు. వ్యక్తి ఇస్తున్న వస్తువు ఏముందో దాన్నతడు మరోచోట నుంచి సేకరిస్తున్నాడు. అది అతడి సొంతం కాదు. దానిమీదనే కదా ఇదంతా జమ చేస్తున్నాడు! అందుకే అతడు ఇవ్వడు, ఎప్పటికీ ఇవ్వలేడు. పైగా అందులోంచి ఇంకా తగ్గిస్తాడు. ఎందుకంటే అతడు వ్యక్తిగా సంపన్నుడు కావాలని కోరుకుంటున్నాడు.’
నా చిన్నప్పుడు మా ఊళ్ళో నేను కూడా ఇది చూశాను. డజను మామిడిపళ్ళు కొనుక్కుంటే పధ్నాలుగు పండ్లిచ్చేవారు. పరక అంటే చాలాకాలం నేను పధ్నాలుగు లేదా పదహారు అనుకునేవాణ్ణి. ఆ సత్యకాలం ధ్వంసం అయిపోయాక కూడా, ఇప్పుడు ఇంత గ్లోబలైజ్డ్ ప్రపంచంలో కూడా మెహిదీపట్నం రోడ్లమీద మామిడిపండ్లు అమ్ముకునే చిన్నచిన్న వ్యాపారస్థుడు కూడా పండ్లు కేజీల లెక్కన అమ్ముతున్నా కూడా, మనం రెండు కేజీలో మూడు కేజీలో ఇమ్మని అడిగినప్పుడు, బేరమాడినప్పుడు, ఏవేవో లెక్కలు చెప్తాడుగాని, తీరా తూకం వేసినప్పుడు ఒకటో అరో తాను చెప్పిన లెక్కకన్నా, ఆడిన బేరంకన్నా ఎక్కువే ఇస్తాడు. ఇంతచేసి కూడా పాశ్చాత్యదేశాల అర్థశాస్త్రం ఇక్కడి మానసిక సౌందర్యాన్ని పూర్తిగా భగ్నం చెయ్యలేకపోయింది.
ఇంతకీ పూర్వకాలపు గ్రామీణ అర్థ వ్యవస్థ అని గురూజీ చెప్తున్నది కూడా ఇప్పటికి డెభ్భై, ఎనభయ్యేళ్ళ కిందటి లెక్కలే. అదిలాబాదు నేరుగా బ్రిటిష్ పాలనలో లేదనీ, నైజాములో భాగంగానే ఉందనుకున్నా, 1768 లోనే నిజాం ఈస్టిండియా కంపెనీతో మొదటి ఒప్పందం కుదుర్చుకున్నాడని గుర్తుపెట్టుకుంటే, ఒక విధంగా ఇక్కడ కూడా పరోక్షంగా వలసపాలకుల ప్రభావం ఉందని చెప్పుకోవచ్చు. అలానే ఆ తర్వాత కూడా ఈస్టిండియా కంపెనీ ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీతోనూ, స్వదేశీ పాలకులతోనూ చేస్తూ వచ్చిన యుద్ధాలకి నిజామే ఆర్థిక సహాయం అందించేవాడు కాబట్టి ఇక్కడి ఆర్థిక వ్యవస్థను కూడా బ్రిటిష్ కంపెనీ, బ్రిటిష్ పాలకులు పరోక్షంగా ధ్వంసం చేస్తూనే వచ్చారు. అయినా కూడా ఇంకా అదిలాబాద్ పల్లెల్లో ఒక సత్యయుగం జాడలు గురూజీ చూడగలిగాడంటే, భారతీయ గ్రామాల అంతస్సత్వం ఎటువంటిదో మనం ఊహించవచ్చు.
గ్రామంలో రైతులకీ, వృత్తిపనివారికీ మధ్య ఉండే పరస్పర ఆధారిత అర్థవ్యవస్థని జాజ్ మాని అంటారని ఈరోజు ఎకనమిక్స్ చదివే ఏ విద్యార్థి అయినా చెప్పగలడు. కానీ గురూజీ చూసింది, ఆ సామాజిక ఒడంబడికని మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న డిజైన్ ని, ఆ డిజైన్ వెనక ఉన్న సౌందర్య దృష్టిని, ఆ సౌందర్య దృష్టి వెనక ఉన్న మనోసౌందర్యాన్ని.
గురూజీ ఇంకా కొనసాగిస్తున్నారు:
‘ఇప్పుడు మీరంతా పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటారు. డబ్బుంది. మీరందరూ నీళ్ళు కూడా కొనుక్కుని తాగుతున్నారు. సంపన్నుడు అయినప్పుడు వ్యక్తి నీళ్ళు కూడా కొనుక్కుని తాగుతాడు. అదే సమృద్ధుడైతే తానే నీళ్ళు పంచుతాడు. రాజస్తాన్ అంత ఎండ ప్రాంతం. మార్వాడీలు ఇక్కడికి వచ్చి జీవించేటప్పుడు వేసవి కాలంలో చలివేంద్రాలు పెడతారు. నీళ్ళు తాగిస్తారు. ఒక మనిషిని జీతానికి పెట్టి అతని ద్వారా దాహం తీరుస్తారు. నిజానికి వాళ్ళు అటువంటి ఎండ ప్రాంతం నుంచి వచ్చారు కదా, నీళ్ళు అమ్మి కూడా డబ్బు సంపాదించవచ్చు కదా! కాని వాళ్ళలా చేయరు. నీళ్ళు తాగిస్తారు.’
‘కాబట్టి సంపన్నుడైనా సరే అతడు నీళ్ళు కొనుక్కుని తాగుతాడు. అందుకే మన దగ్గర గ్రామాన్ని సమృద్ధం చేయాలనే భావన నడిచేది. ప్రతి ఒక్క వస్తువు గ్రామంలోనే తయారవ్వాలి, అందుకే మన గ్రామాల్లో ఏర్పడ్డ ఆర్థిక వ్యవస్థ్ పూర్తి భారతీయ ఆర్థిక వ్యవస్థ. అది ఆదాయం కోసం తయారయ్యింది కాదు, వ్యయం కోసం తయారయ్యింది. వ్యయ-ఆధారిత ఆర్థిక వ్యవస్థ అది. దాని గురించి ఇప్పుడు ఎవరూ ఊహించలేకపోతున్నారు. అందులో ప్రతి ఒక్కరి ఖర్చుపద్ధతిని రూపొందించారు. ప్రతి ఒక్క మనిషి ఒక ఏడాది కాలంలో ఇంత, ఇలా ఖర్చుచేస్తాడని ఊహించారు. వ్యక్తి ఖర్చుచేసే పద్ధతి సరిగ్గా ఉన్నప్పుడు సమాజం చాలా సరైన పద్ధతిలో జీవిస్తుంది. ఈ రోజు ప్రతి ఒక్కరిదీ ఖర్చుచేసే పద్ధతి మారిపోయింది, కాబట్టే ఇంత గందరగోళం ఏర్పడింది. ఒకరు ఒక పనికోసం వెయ్యి రూపాయలు ఖర్చుచేస్తుంటే మరొకరు అదే పని కోసం లక్ష రూపాయలు ఖర్చుచేస్తున్నారు. ఈ రోజు ఎవరి ఖర్చుపద్ధతి వారిదిగా అయిపోయింది. వేరువేరుగా అయిపోయింది. సంపాదించే విధానమూ, ఖర్చు విధానమూ రెండూ మారిపోయాయి.’
‘పూర్వం హిందుస్తాన్ లో ఉండేది కాదు. గ్రామ ఆర్థిక వ్యవస్థలో మొత్తం వ్యయాన్ని బట్టి ఆధారపడి ఉండేది. ఉత్పత్తి శూన్య-ఆధారితంగా ఉండేది. అంటే ఎంత అవసరమో, అంతే ఉత్పత్తి. అంతకంటే ఎక్కువ కాదు. ప్రతి ఒక్క వృత్తిపనివారి ఉత్పత్తి శూన్య- ప్రాతిపదికతో ఉండేది. అందుకే ఇప్పటికీ వాళ్ళు తమ ఇంట్లో ఏదైనా వస్తువు ఊరికే పడి ఉంటే తట్టుకోలేరు.’
‘ఎంత అవసరమో అంతే ఉత్పత్తి చేయాలి. ఒకవేళ ఎక్కువ ఉత్పత్తి చేస్తే ఇవాల్టి కంపెనీల్లగా, కార్ఖానాల్లాగా లోన్ ఇప్పించి మరీ కొనేలా చేయవలసి వస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఉత్పత్తి చాలా ఎక్కువ కదా! ప్రజలుకొనలేకపోతుంటే, వారికి లోన్ ఇప్పించడం ప్రారంభిస్తారు. లోన్ తీసుకుని మరీ కొనుక్కునేలా చేస్తారు. కాబట్టి ఎంత అవసరమో అంతే ఉత్పత్తి ఉండాలి. అందుకే మన ఉత్పత్తి శూన్య-ప్రాతిపదికతో నడిచేది. వారెప్పుడూ తమ దగ్గర వస్తువుల్ని స్టాకు చేసి ఉంచేవారు కాదు. అవసరం లేదు కూడా. ఎంత ఉందో అంతే చేయాలి మనం.’
నిజానికి గురూజీ చెప్తున్న శూన్య-ఆధారిత ఉత్పత్తి-వ్యయ వ్యవస్థలో కొంత మిగులు లేకపోలేదు. ఆ మిగులు రెండు విధాల ప్రవహించేది. ఒకటి, కరువురోజుల్లోనూ, గడ్డురోజుల్లోనూ గ్రామాన్ని కాపాడుకునే నిల్వల రూపంలో. బహుశా అది గురూజీ చెప్పిన ఏడెమినిది రకాల ధనాల్లోనూ వెండి, బంగారం, పశుసంపద లాంటి రూపాల్లోకి ప్రవహించేది. రెండోది, ప్రభుత్వాలకి చెల్లించే పన్నులు. మనకి తెలిసి మధ్యయుగాలనుండీ కూడా రైతులమీద పడ్డ పన్నుల భారం తక్కువేమీ కాదు. అయినా కూడా అటువంటి క్రూరపాలనని శతాబ్దాల పాటు తట్టుకుని కూడా గ్రామాలు మనుగడ సాగించాయంటే ఆశ్చర్యం కలుగుతుంది.
నేనే నా కళ్ళారా ఆదిమ గిరిజన తెగల్లో ఇందుకు నిరూపణ చూసాను. కొండవాలుల్లో పోడువ్యవసాయం చేసే గిరిజనుడు చాలా సార్లు నూటికి నూరుశాతం నుంచి రెండువందల శాతందాకా వడ్డీ చెల్లిస్తూ కూడా మనుగడసాగిస్తున్న ఎన్నో గ్రామాల్ని నేను కళ్ళారా చూసాను.
గురూజీ సంభాషణ కొనసాగుతోంది: ‘కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మనకి కనీసం 360 కులాల లేదా జాతుల వర్ణన కనిపిస్తుంది. 360 కులాల్లో చాలా కులాల వారు ఏదో ఒక చేతివృత్తిని అనుసరిస్తూ, ఏదో ఒక నైపుణ్యం కలిగి ఉండేవారు. వాళ్ళ దగ్గర ఏదో ఒక సాంకేతికత ఉండేది. వారి ఇల్లే ఒక కార్ఖానాలాగా ఉండేది. నిజానికి మనదగ్గర పెద్ద టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకని? వారు అనుకుంటే చేయలేరా? చేయగలరు. కానీ వారు కావాలనే పెద్ద టెక్నాలజీకి ప్రాధాన్యతనివ్వలేదు. ఎందుకంటే చాలా కారణాలున్నాయి. ఒకటి మనది అద్వైత సిద్ధాంతం. కాబట్టి మన టెక్నాలజీ కూడా అద్వైతం ప్రకారమే రూపొందేది. పాశ్చాత్యదేశాలది ద్వైత సిద్ధాంతం. ద్వైతం, అద్వైతాల్లో తేడా ఏమిటి? పాశ్చాత్యదేశాల్లో- ఈ ప్రకృతి మనకోసమే ఉంది, మనం దీన్ని అనుభవించేవాళ్ళం అని నమ్ముతారు. మన దగ్గర అలా లేదు. మన దృష్టిలో మనం ప్రకృతికి చెందినవాళ్ళం, ప్రకృతీ, మనం వేరువేరుకాదు. అందుకే పాశ్చాత్యదేశాల్లో నియంత్రణ అనే మాట నడుస్తుంది. అన్ని వస్తువుల్నీ కంట్రోల్ చెయ్యాలి అని అనుకుంటారు. మన దగ్గర నియంత్రణ అనే మాట ఎప్పుడూ నడవలేదు. అందుకు బదులు సంయమనం అనే మాట నడిచింది. మనం మనల్ని కూడా కంట్రోల్ చేసుకోకూడదు. మనలో మనం సంయమనం కలిగి ఉండాలి. పాశ్చాత్యదేశాల్లో ఎప్పుడూ నియంత్రణ అనే మాటనే నడుస్తుంది. ద్వైతంలో భావన అది-ఇదంతా మనకోసమే ఉంది, మనం దీనికి రాజులం, మనం దీన్ని అనుభవించేవాళ్ళం, మనం దీన్నెలాగైనా అనుభవించవచ్చు, ఇవన్నీ మనకి గులాములు అని. కాబట్టి ఆ దేశాల్లో చాలా పెద్ద సంఖ్యలో గులాములూ, యజమానులే ఉండేవారు. ఒకడు పనిచేసేవాడు, ఒకడు చేయించేవాడు. మన దగ్గర గులాముల ప్రథ లేదు. ప్రజల్ని కంట్రోల్ చేసి వాళ్ళతో పనిచేయించే వ్యవస్థ మన దేశంలో వేలాది సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు.’
‘అందుకే మన టెక్నాలజీ ఏదైతే ఉందో, ఎంతైతే ఉందో, అది అద్వైత సిద్ధాంతం మీద ఉంది. వారు అనుకుంటే పెద్ద పెద్ద కార్ఖానాలు పెట్టగలరు. కానీ పెట్టలేదు. పెద్దపెద్ద కార్ఖానాలు పెట్టడం వల్ల అది ఒక్కరిదే అవుతుంది. మిగిలినవారందరినీ గులాములుగానో నౌకర్లుగానో మారుస్తుంది. లేదా గుత్తేదారీ పద్ధతి నడుస్తుంది. అంతా కాంట్రాక్ట్ పై నడుస్తుంది. అలా ఎందుకు జరగాలి? మన వాళ్ళ ఉద్దేశ్యం ఏమంటే, ఒక పరికరం లేదా ఆయుధం ఏదుందో అదీ, దాంతో పాటు మన శరీరం కూడా ఒక పరికరం, ఒక ఆయుధం- ఆ రెండూ కలిసి ఉత్పత్తిలో పాల్గోవాలి. అందుకే మన దగ్గర ప్రతి ఒక్క వృత్తిపనివాడూ చేతులూ, కాళ్ళూ, పూర్తి శరీరాన్నీ తన పనిలో ఉపయోగిస్తాడు. కేవలం పరికరం మీద నియంత్రణ కాదు. ‘నువ్వు అది చెయ్, ఇది చెయ్’ అని పరికరాన్ని శాసించడం కాదు. రెండూ కలిసినప్పుడే సృష్టి జరుగుతుంది. కాబట్టి ఆ పరికరం, ఆ ఆయుధం అతణ్ణి సంయమనం వైపు నడిపిస్తాయి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా అతడి చెయ్యి తెగుతుంది, కాలు తెగుతుంది. ఏమైనా అవుతుంది. అందువల్ల అతడి పరికరాలు, ఆయుధాలు అతణ్ణి తనలో తాను సంయమనంగా ఉంచుతాయి. ఈ ఉద్దేశ్యంతోనే ఆ పూర్తి టెక్నాలజీని మన దగ్గర చాలా చిన్నదిగా, చాలా సరళంగా చేసేసారు. ప్రతి ఒక్క మనిషి తన కార్ఖానాను తన పక్కనే పెట్టుకుని తిరిగేవాడు, దానికోసం పెద్ద పెద్ద షెడ్లు, పెద్ద పెద్ద వర్క్ షాపులు అవసరం ఉండేది కాదు.’
‘మేమొక గ్రామంలో ఒక పెద్ద చద్దరు చూసాం. అది 25 గజాల (22.86 మీటర్లు) వెడల్పూ, 45 గజాల (41.15 మీటర్లు) పొడవూ ఉంది. అది ముక్కల్ని కలిపి కుట్టింది కాదు. ఒకేసారి నేసింది. 1902 లో ‘వణి’ లో దానిమీద అద్దకం పని జరిగింది. రంగులు వేసారు దానికి. ఇక్కడ ఉమ్రిలో దేశ్ పాండే గారి దగ్గరుండేది. పెళ్ళిళ్ళల్లో మైదానంలో పరచడానికి ఉపయోగించేవారు దాన్ని. ఇవాళ్టి కార్ఖానాలకి అంత పెద్ద వస్త్రాన్ని తయారు చేయడం సాధ్యం కాదు. మరి అప్పటివాళ్ళు ఎలా తయారుచేయగలిగారు? చేయగలరు. చేసారు. వారు ఒక ఇంచి వస్తువునైనా తయారు చేయగలరు, 100 గజాల వస్తువునైనా తయారు చేయగలరు. అది వారి టెక్నాలజీలో సాధ్యమయ్యేది. ఇవాళ్టి ఆధునిక టెక్నాలజీలో సాధ్యం కాదు.’
గురూజీ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు మళ్ళీ తిరిగి వింటున్నప్పుడు, ఆయన చెప్పినదాన్ని ఇంటర్నెట్ ద్వారా రూఢి పరుచుకుందామని చూసాను. నెట్ లో నాకు దొరికిన సమాచారం ప్రకారం Jürgens GmbH & Co Factory అనే ఒక జర్మన్ కంపెనీ widest weaving loom ని రూపొందించినట్టుగా 2005 లో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేసింది. ఆ మరమగ్గం నేయగల వస్త్రం గరిష్టమైన వెడల్పు 33.15 మీటర్లు! అంటే అప్పటికి వందేళ్ళ కితమే, అంటే 1902 నాటికే, అదిలాబాదులో 22.86 మీటర్ల వెడల్పుగల వస్త్రాన్ని చేతితో నెయ్యగల మగ్గాలుండేవన్నమాట! ఈ మాటలు రాస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగానూ, బాధగానూ కూడా ఉంది. ఇంత స్వదేశీ సాంకేతికతను ఎంతలా ధ్వంసం చేసుకుంటూ వచ్చాం మనం!
గురూజీ ఇంకా చెప్తున్నారు: ‘అంతెందుకు? వర్ధాలో చదువుకునేటప్పుడు ఒక విదేశీయుడు వచ్చాడు. అతడి దగ్గర ఫొటోలు తీసే కెమేరా ఉంది. దాని స్క్రూ ఒకటి పోయింది. అందుకని అది పనిచేయడం లేదు. దానికి తగ్గ స్క్రూ కోసం ఆ విదేశీయుడు చాలా చోట్ల వెతుకుతున్నాడు. ఆ సంగతి మన మహేంద్ర పాండ్యా గారికి కూడా చెప్పాడు. ఆ స్క్రూ లేకపోతే కొత్త కెమేరా కొనుక్కోక తప్పదు. కానీ, ఆ రోజుల్లో కెమేరాలు చాలా ఖరీదు.’
‘సరే, పద, బజారుకు వెళ్ళి వెతుకుదాం, ఎక్కడైనా దొరికితే దొరకచ్చు’ అని బజారులో చాలా దుకాణాలు తిరిగారు. చివరికి ఒక స్వర్ణకారుడి దగ్గరకి పోయి అతణ్ణడిగారు. అతడు దాన్ని చూసి, ‘మీరు ఇంకా వెతికి చూడండి, ఈలోపు నా దగ్గర కూడా చూస్తాను’ అని అన్నాడు. వీళ్ళు మరికొన్ని దుకాణాలు తిరిగి వచ్చేసరికి అతడు ఆ స్క్రూ అమర్చేసాడు. ‘మీకు ఈ స్క్రూ ఎక్కడ దొరికింది?’అని వీళ్ళతణ్ణి అడిగారు. ‘నేనే తయారు చేసాను’ అన్నాడు అతగాడు! అప్పుడు ఆ తెల్లవాడికి ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, ‘ఈ దేశంలో ఒక్క స్క్రూ కూడా తయారుచెయ్యగలరా? మా దేశంలో అయితే ఎవరూ తయారు చేయలేరు. మా దేశంలో అలాంటి స్కూలు లక్ష కావాలంటే తయారవుతాయి. కానీ ఒక్క స్క్రూ మాత్రమే తయారుచెయ్యలేరు!’అని అన్నాడు. అవును, ఇక్కడ అవసరమైతే ఒకే ఒక్క స్క్రూ కూడా తయారుచెయ్యగలడు మనిషి. ఒకే ఒక్క వస్తువుని తయారు చెయ్యడం చాలా కష్టం కదా! పెద్ద పెద్ద కార్ఖానాల్లో ఒకే ఒక్క వస్తువు తయారుచెయ్యలేరు. కానీ మనదగ్గర వృత్తిపనివారు ఒకే ఒక్క వస్తువునైనా తయారుచేసేవారు లేదా కోటి వస్తువులైనా తయారు చేసేవారు. అంతే కాదు, అతడు తన కార్ఖానా తన పక్కనే పెట్టుకుని తిరిగేవాడు. ఇంట్లో కూచొని పనిచేసుకోవడం సరే, అవసరమైతే ఎవరైనా తమ ఇంటికి పిలిస్తే కూడా పోయి పనిచేసేవాడు.
ప్రతి ఒక్క మెటీరియల్ ని ఎలా ఉపయోగించాలో వారికి బాగా తెలుసు. ఎవరికైనా మందుకోసం రాగి కావలసి వచ్చినప్పుడు, ఎక్కడినుంచి తెచ్చేవారు? మన ఈ జుట్టుందే, దీని కొలిమి పెట్టేవారు. అందులోంచి రాగి తీసేవారు. మన జుట్టులోంచి రాగి వస్తుంది. గుర్రపు జుట్టులోంచి జింక్ వస్తుంది. గాడిద జుత్తులోంచి టిన్ వస్తుంది. ఉప్పునుంచి పాదరసం తీసేవారు. పాదరసం కొంచెం మోతాదులో కావాలంటే ఎక్కడికి వెళ్తారు? ఉప్పు కొలిమి పెట్టారు. పాదరసం తీసారు. కాబట్టి ఈ విషయాలన్నీ మన ప్రజలకి తెలుసు. చాలా బాగా తెలుసు. ఏ వస్తువులోంచి దేన్ని తీయవచ్చో.
‘మీరెప్పుడైనా ప్యూర్ బంగారం ఎలా ఉంటుందో చూసారా? స్వచ్ఛమైన బంగారం చాయ్ పత్తి లాగా ఉంటుంది. దాన్ని తరువాత పసుపు బంగారంగా మారుస్తారు. ఇక్కడ బంగారం శుద్ధి చేసేవారున్నారు. వాళ్ళు తులం బంగారం శుద్ధి చేయాలంటే రెండు తులాల వెండి కలుపుతారు. ఇక్కడ కంసాలి దాన్ని శుద్ధి చేస్తాడు. అందులో బంగారం, వెండి శుద్ధి చేసే కంసాలి వేరుగా ఉంటారు. ప్రజలు బంగారం శుద్ధి చెయ్యమని వాళ్ళ దగ్గరకి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు ఒక తులం బంగారంలో రెండు తులాల వెండి కలిపి దాన్ని కరిగిస్తారు. కరిగించినదాన్ని నీళ్ళల్లో పడేస్తారు. నీటిలో పడగానే అది చిన్నచిన్న ముక్కలుగా అయిపోతుంది. ఆ తర్వాత ఒక గాజు భరిణెలో నైట్రిక్ యాసిడ్ లో వేసి కొలిమిమీద పెడతారు. కొంతసేపటికి నీళ్ళన్నీ ఆకుపచ్చగా అయిపోతాయి. ఆకుపచ్చ-నీలం. అప్పుడు దాన్ని కడుగుతారు. నీళ్ళని వేరుచేస్తుంటారు, మళ్ళీ కడుగుతారు, చైనామట్టిపాత్రలో దాన్ని కడుగుతారు చాలాసార్లు. అది శుభ్రమైన తర్వాత చివరికి పూర్తి మట్టిమిగిలిపోతుంది. ఆ మట్టి వేరుగా తీస్తారు, ఈ ఆకుపచ్చ-నీలం నీళ్ళు వేరే బక్కెట్లలో పడతారు. ఆ నీళ్ళల్లొ వెండి ఉంటుంది, నీళ్ళ రూపంలో రాగి ఉంటుంది. అప్పుడు ఆ నీళ్ళల్లో రాగిశలాకను వేస్తారు. అంతే ఆ బంగారంలో ఎంత వెండి మిగిలి ఉందో, అంటే ఈ రెండు తులాల వెండి ఉంది కదా, అదంతా 24 గంటల్లో ఆ రాగిశలాకకి అంటుకుంటుంది. దాని దులిపి మళ్ళీ కరిగించినప్పుడు అది వెండిగా అయిపోవడమే కాదు, ఖచ్చితంగా రెండు తులాల కంటే ఎక్కువే రావాలి. ఆ బంగారంలో ఉన్న వెండి కూడా ఇందులోకి రావాలి. ఆ తర్వాత నీళ్ళు రాగినీళ్ళవుతాయి. దానిలోంచి మళ్ళీ రాగి కూడా తీసేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం మన ప్రజలు చాలా సులభంగా తీసేస్తారు. దానికోసం పెద్ద పెద్ద కొలుములు, పెద్ద పెద్ద వర్క్ షాపులూ ఏవీ అవసరం లేదు.’
‘మా చిన్నప్పుడు పూసలవాళ్ళు వచ్చేవారు. వారి మహిళలు మన ఇళ్ళల్లో ఉండే పాత అద్దాల్ని పాదరసం పూసి కొత్తగా చేసేవారు. అనుకుంటే కొత్త అద్దాలు కూడా తయారుచేసేవారు. పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, ఇంట్లో కొత్త అద్దం కావాలంటే, ఏ సైజుది కావాలో, ఆ సైజుకే, ఇంటి ప్రాంగణంలోనే కూచుని తయారు చేసేవారు ఆ మహిళలు. వడ్రంగులకి అద్దాలు తయారు చేసి ఇస్తే, వడ్రంగులు వారికి దువ్వెనలు తయారు చేసి ఇచ్చేవారు. దువ్వెనలు అయితే తుమ్మ కలపతో చేసేవారు లేదా కొమ్ముతో తయారు చేసేవారు. చాలా దువ్వెనలు తయారుచేసేటప్పుడే వాటిలో నూనె నింపేవారు. ఆ దువ్వెనతో తలదువ్వుకునేటప్పుడు తలలో తనంత తానుగా నూనె దిగేది. చాలా రకాల దువ్వెనలు తయారయ్యేవి. మామూలు ఇనుపరంపపు పొడిని కరిగించి అద్దాలు తయారుచేసేవారు.’
‘అలానే గాజులు కూడా. గాజుల్ని కొమ్ముతో తయారుచేసేవారు. ఏనుగుదంతంతో గాజు తయారయ్యేది. ఏనుగు దంతం దొరకకపోతే ఏనుగు ఎముకల్తో తయారు చెయ్యడం మొదలుపెట్టారు. ఆ తర్వాత జంతువుల కొమ్ముల్తో, దుప్పి కొమ్ముల్తో గాజు తయారయ్యేది. ఇక్కడ బంగారగీరి అని ఒక సమాజం ఉంది. వాళ్ళు ఏడాదికి రెండు సార్లు గోండుగ్రామాలకి వెళ్ళేవారు. గోండులు సేకరించి ఉంచిన కొమ్ములు వీరు తెచ్చుకునేవారు. బదులుగా వారికి వెండి చెల్లించేవారు. అలా తీసుకొచ్చిన కొమ్ముని గాజుల సైజులో కట్ చేసి, ఒక పెద్ద మట్టికుండలో నీళ్ళు నింపి, అందులో ఈ ముక్కలన్నీ వేసేవారు. ఆ కుండని భూమిలోపల పూడ్చేవారు. 40 రోజుల తర్వాత దాన్ని తీసేవారు. అప్పటికి అది ముడుచుకుని గుండ్రంగా అయిపోయేది. పూర్తిగా ముడుచుకున్నాక దాన్ని అతికించేవారు. అతికించే పద్ధతి కూడా ఆసక్తికరంగా ఉండేది. మెళ్ళో ఒక ఇనుపట్టీ వేసుకునేవారు. దానికి చిన్న బర్మా డ్రిల్ ఉండేది, బాణంలాగా, దాన్ని ఇలా పట్టుకుని, ఇలా తిప్పుతూ అందులో రంధ్రం చేసేవారు.అందులో వెండితీగనో, రాగితీగనో పెట్టి దాన్ని అతికిస్తూ వెళ్ళేవారు. ఈ పనికోసం ఒక చోట కూచోడం, వర్క్ షాపు నడపడం లాంటిదేమీ లేదు. అలానే తిరుగుతూ, తిరుగుతూ మాట్లాడుతూనే పనిచేసేసేవాళ్ళు సులభంగా. ఆ గాజులు లంబాడా మహిళలు ధరించేవారు.’
ఈ ఉదాహరణలన్నిటిద్వారా గురూజీ నొక్కి చెప్తున్న అంశం ఒక్కటే- అది ఇక్కడి వృత్తికళాకారుల దగ్గర పెద్ద టెక్నాలజీల్ని రూపొందించే సాంకేతికత ఉండి కూడా చిన్న తరహా, సరళ రూపాల పనిముట్లనే ఉపయోగిస్తూ వచ్చారని. ఇప్పుడు చెప్పలేదుగానీ, మరొకసారి, మరొక సంభాషణలో ఆయన పెద్ద టెక్నాలజీకీ, చిన్న టెక్నాలజీ కి మధ్య మరొక ముఖ్యమైన తేడా కూడా చెప్పారు. ఒకప్పుడు పనిముట్లు లేదా యంత్రాలు చిన్నవిగానూ, సరళంగానూ ఉన్నప్పుడు అవి పెద్దపెద్ద కుటుంబాల్ని పోషించాయనీ, ఇప్పుడు యంత్రాలూ, యంత్రాగారాలు పెద్దపెద్ద రూపాలు ధరించాక కుటుంబాలు చిన్నవైపోయాయనీ!
గురూజీ తన చర్చలో మరింత ముందుకు వెళ్తున్నారు:
‘ముప్ఫై ఏళ్ళ కిందటి దాకా కూడా ఇలాంటి పనులన్నీ ఇక్కడ చాలా సులభంగా జరిగేవి. అవన్నీ నిజానికి అవసరం లేని వస్తువులు. గాజులు వేసుకోకపోతే ఏమవుతుంది? కుంకుమ పెట్టుకోకపోతే ఏమవుతుంది? ఇవి నిత్యావసరవస్తువులైతే కావు కదా. కానీ వీటిద్వారా ఒక అందమైన సమాజపు ఊహ చేయవచ్చు. అందమైన సమాజం కేవలం నిత్యావసర వస్తువులమీద ఏర్పడదు. ఆ మాటకొస్తే ప్రతి ఒక్కరి అవసరాలు చాలా పరిమితంగానే ఉంటాయి. ఎవరైనా ఒక చిన్న గోచీ కట్టుకుని తిరుగుతూ ఉండవచ్చు. లేదా ఒక చిప్పలోనే ఏళ్ళతరబడి కిచిడీ గిచిడీ వండుకుంటూ ఉండవచ్చు. రోమశ మహర్షి చెప్పినట్టు తన తలమీద ఒక గడ్డిపరక పెట్టుకుని తిరుగుతూ, రాత్రి కాగానే, ఇలా వేసుకుంటాను, ఇలా పడుకుంటాను, ఇదే నా ఇల్లు అని చెప్పవచ్చు. కాని అలాగైతే సమాజం నడవదు కదా!’
‘కాబట్టి ఒక అందమైన జీవనశైలి ఏర్పడాలి, ఒక అందమైన గ్రామం ఏర్పడాలి అనే ఉద్దేశ్యంతో ఈ వృత్తిపనివారందరినీ ఒకేచోట చేర్చడం జరిగింది. అందమైన గ్రామంలో నాలుగు విషయాలుంటాయని నిన్న చెప్పాను. అవి విజ్ఞానం, ఆధ్యాత్మికం, కళ, సామాజిక అర్థశాస్త్రం. ఆ నాలుగూ ఒకచోట కూడితే అది అందమైన గ్రామం. కానీ ఈరోజు సమాజమంతా విజ్ఞానం దగ్గరే ఆగిపోయింది. ఆధ్యాత్మికం గురించిన మాట లేదు. విజ్ఞానానికి అవతలి మాట నడవడం లేదు. మన మొదటి మహావాక్యముందే, ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ – అనే మాట ఎప్పుడు వస్తుంది?’
‘ఇంతకీ ప్రజ్ఞానమంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటి? ఇది వస్త్రం అని తెలుసుకోవడం జ్ఞానం. ఇది పువ్వు, ఇది ఆకు, ఇదంతా జ్ఞానం. ఈ ఆకు ఆకుపచ్చగా ఎందుకుంది? ఇది ఎర్రగా ఎందుకుంది? ఈ వస్త్రం ఎలా తయారవుతుంది?- మనిషి ఎప్పుడైతే దీనిలోతుల్లోకి పోయి శోదిస్తాడో అప్పుడది విజ్ఞానం అవుతుంది. మొదట జ్ఞానం, ఆ పై విజ్ఞానం. కానీ ఈ వస్త్రానికీ, ఈ ఆకుకీ, ఈ పువ్వుకీ ఉన్న పరస్పర సంబంధం ఏమిటి? వీటి మధ్య ఉన్న బంధం ఏమిటి? మనిషి ఎప్పుడైతే ఈ లోతులు తరచి చూస్తాడో అప్పుడది ప్రజ్ఞానం అవుతుంది. అది మన దగ్గర ఆధ్యాత్మికం. అది విజ్ఞానం కంటే చాలా పైన ఉంటుంది. కాబట్టి మన ప్రజలు విజ్ఞానం వరకే పరిమితం కాలేదు. విజ్ఞానాన్ని దాటి ప్రజ్ఞానానికి ప్రాధాన్యతనిచ్చారు. ఈ వస్తువులన్నింటి మధ్య ఉన్న సంబంధం ఏమిటని ఆలోచిస్తే అదంతా ఆధ్యాత్మికం అవుతుంది.’
కాబట్టి ఒక గ్రామంలో విజ్ఞానం, ఆపై ప్రజ్ఞానం. ఒక వాద్యం ఉంది. సంగీత వాద్యం ఉంది లేదా ఈ వస్తువు ఉంది, ఇది విజ్ఞానం. దీన్ని నువ్వు ‘పరా’ మార్గానికి అంటే ఆధ్యాత్మికం కోసం ఉపయోగిస్తావా లేక ‘అపరా’ అంటే లౌకిక ప్రయోజనం కోసం ఉపయోగిస్తావా అనేది నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. అందుకని కళ రెండు రకాలుగా ఉంది-దేశీయ, మార్గీయ.’
‘దేశీయ అంటే ఏమిటి? మార్గీయ అంటే ఏమిటి? ఎప్పుడైతే కళ భౌతిక సుఖం కోసం అవుతుందో అది దేశీయ. దేశీయ సంగీతం ఉంది. వాద్యం ఉంది, అది మన ఆనందంకోసం చేసినప్పుడు అది దేశీయ. ఎప్పుడైతే అది ఆత్మానందంకోసం చేస్తారో అప్పుడది మార్గీయ. నువ్వు దేశీయ జీవితం జీవించాలనుకుంటున్నావా, మార్గీయ జీవితం జీవించాలనుకుంటున్నావా అనేది నీ బుద్ధిమీద ఆధారపడి ఉంటుంది. అలాగే మన దగ్గర దేశీయ సంగీతం ఉంది, మార్గీయ సంగీతం ఉంది, దేశీయ సాహిత్యం ఉంది, మార్గీయ సాహిత్యం ఉంది. మొత్తం మీద గమనించవలసిందొక్కటే- చాలా అందమైన జీవితం జీవించాలంటే కళ చాలా ముఖ్యం.’
‘ఒకవైపు ఈ రకరకాల వృత్తి సాంకేతికతనైపుణ్యాలు కలిగిఉన్న వృత్తిపనివారి సమాజమంతా, చాలా కులాల సమాజం. మరో వైపు కళను బట్టి చాలా పెద్ద సమాజం. స్థూలంగా చూస్తే, ఒక గ్రామంలో మూడే వృత్తులున్నట్టు లెక్క- కర్మ వృత్తి, వైశ్య వృత్తి, భిక్షా వృత్తి. కర్మ వృత్తి, వైశ్య వృత్తి భూమిని సమృద్ధం చేస్తాయి. కానీ భిక్షా వృత్తి సమృద్ధినుండి దూరంగా, నిర్లిప్తంగా ఉండటం గురించి మాట్లాడుతుంది. ఈ సమృద్ధినే మనకి సర్వస్వం కాదు, దీన్ని దాటి ఆవల కూడా మనదగ్గర ఏదో ఉంది అని చెప్తుంది. అందుకని ఇది ఈ సమృద్ధి పట్ల నిర్లిప్తత గురించి మాట్లాడుతుంది. ఎన్నో కళల ద్వారా, మరెన్నో విషయాల ద్వారా అది ఆ మాటని ప్రజలముందు పెడుతుంది. ఆ రకంగా చాలా భిక్షావృత్తి కులాలు ఏర్పడ్డాయి. వీరంతా ఒకరకంగా కళాకారులుగా కూడా ఉన్నారు. చాలా పెద్ద కళాకారులుగా ఉన్నారు. అలానే లోకశిక్షకులుగా కూడా ఉన్నారు.’
‘మరి వీటన్నింటికోసం గ్రామంలో సామాజిక అర్థశాస్త్రం ఉండటం అవసరం. ఆ అర్థశాస్త్రం సామాజికంగా ఉండాలి, అసామాజికంగా కాదు, వ్యక్తిగనుక సంపన్నుడు కావడం ప్రారంభిస్తే అది పూర్తిగా అసామాజిక అర్థశాస్త్రం. వ్యాపారం ఉద్దేశ్యం లాభం తప్ప లోభం కాదు. లోభం మనిషిని పూర్తిగా అసామాజికంగా మార్చేస్తుంది. అందుకే మన దగ్గర సామాజిక అర్థశాస్త్రం గురించి మాట్లాడాం. లాభానికీ, లోభానికీ మధ్య తేడా ఏమిటంటే- లాభం చాలా రకాలుగా ఉంటుంది, సంబంధాల లాభం ఉంది, బంధుత్వాల లాభం ఉంది, ఇందంతా లాభమే. కానీ లోభంలో కేవలం ఒకే ఒక్క విషయముంటుంది. అక్కడ ఈ లాభాలన్నీ, ఈ సంబంధాలు, ఈ బంధుత్వాలు- ఇవన్నీ అంతమైపోయి, కేవలం తనలో తాను సేకరించడం ప్రారంభిస్తుంది. అది లోభం. లాభంలో సేకరించడం ఉండదు. చాలాసార్లు ఏ వస్తువునైనా ఇచ్చేస్తాడు-మన బంధుత్వం ఉంటుందనిలేదా సంబంధం నిలబడుతుందని. అదంతా లాభమే, కానీ లోభం పూర్తిగా వేరే విషయం-’
అప్పటికి సాయంకాలమైంది. మరికొందరు మిత్రులు, స్థానికులు ఆశ్రమానికి చేరుకున్నారు. గురూజీ తన ప్రసంగం ఆపి వారిని పలకరిస్తూ ఉన్నారు. నేను అంతసేపూ గురూజీ మాట్లాడిన మాటలన్నీ మనసులో కూడగట్టుకుంటూ ఉన్నాను. ఎన్ని విషయాలు! ఎంత దూరం ప్రయాణించాం ఆయనతో కలిసి! బంగారం శుద్ధి చెయ్యడం దగ్గరనుంచి ప్రజ్ఞానం బ్రహ్మ దాకా!
14-6-2026


ఆసక్తికరమైన, అరుదైన విషయాలు!
70 ఏళ్ల క్రిందట బుక్కావాడు పాతకాగితాలు తీసుకొని కుంకుమ, గాజులు ఇవ్వడం జ్ఞాపకం ఉంది.
ధన్యవాదాలు సార్!
ఈ సంభాషణలు చదువుతుంటే ప్రాచీన గ్రామీణ వ్యవస్థ మీద సిద్ధాంత గ్రంథం చదువుతున్నట్టు.. వాటి గురించిన చారిత్రక పాఠాలు సోదాహరణంగా ఒక మహా మహోపాధ్యాయుని క్లాస్ లో కూర్చుని వింటున్నట్టు అనిపిస్తోంది భద్రుడు గారు. ఎంతటి అధ్యయనం, ఎంతటి పరిశీలన, ఎంతటి ధారణ, జ్ఞాపకం గురూజీది. మీ కన్నా మేం ఇంకా అదృష్టవంతులం. మీరు కేవలం వున్నారు.. మేము మీరు గ్రంథస్తం చేస్తున్న ఆ చరిత్రను కావలసిన చోట ఆగి గూగుల్ లో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటూ.. కొన్ని చోట్ల రెండు మూడు సార్లు చదువుకుంటూ ఆకళింపు చేసుకుని మరీ ఒక అవ్యక్తానందానుభూతికి లోనవుతున్నాము. ప్రతి ఒక్క సంభాషణ ఒక దానినిమించి ఒకటి ఉంటున్నాయి.
మీరు ఈ సంభాషణ “అలా వెదురుపొదల పక్కన, ఆయన దగ్గర కూచుంటే, ఏదో పూర్వకాలపు చీనాలో వెదుళ్ళ గుంపు కవులతోనో, లేదా మధ్యయుగాల జపాన్ లో జెన్ గురువుల ఎదటనో కూచున్నట్టుంది.” అంటూ ప్రారంభించిన తీరులోనే చైనా టావోయిజం ఫిలాసఫీ, జపాన్ జెన్ ఫిలాసఫీ రెండింటిలోనూ ఉన్న మనిషి ప్రకృతిలో ఒక భాగం అనే భావనని ఆవిష్కరించి మొదలుపెట్టడం. ఆహా..
ఇంకా ఈ సంభాషణలో గురూజీ ఎన్ని కొత్త కోణాలు స్పృశించారనీ..
“మనది అద్వైత సిద్ధాంతం. కాబట్టి మన టెక్నాలజీ కూడా అద్వైతం ప్రకారమే రూపొందేది. పాశ్చాత్యదేశాలది ద్వైత సిద్ధాంతం. ద్వైతం, అద్వైతాల్లో తేడా ఏమిటి? పాశ్చాత్యదేశాల్లో- ఈ ప్రకృతి మనకోసమే ఉంది, మనం దీన్ని అనుభవించేవాళ్ళం అని నమ్ముతారు. మన దగ్గర అలా లేదు. మన దృష్టిలో మనం ప్రకృతికి చెందినవాళ్ళం, ప్రకృతీ, మనం వేరువేరుకాదు. అందుకే పాశ్చాత్యదేశాల్లో నియంత్రణ అనే మాట నడుస్తుంది. అన్ని వస్తువుల్నీ కంట్రోల్ చెయ్యాలి అని అనుకుంటారు. మన దగ్గర నియంత్రణ అనే మాట ఎప్పుడూ నడవలేదు. అందుకు బదులు సంయమనం అనే మాట నడిచింది. మనం మనల్ని కూడా కంట్రోల్ చేసుకోకూడదు. మనలో మనం సంయమనం కలిగి ఉండాలి.”
నాకు పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు మూలమైనది Adam Smith ‘Wealth Of Nations’ ఎకనామిక్ థియరీ. ఆ ద్వైత గులాములు-యజమానుల వ్యవస్థ మనకు వర్తించదనీ, దానికీ మన భారతీయ అద్వైత ప్రాచీన ఆర్థిక వ్యవస్థకు గల వ్యత్యాసాలు ఎంత సులభంగా అర్థమయ్యేలా చెప్పారో.
1902 నాటికే, అదిలాబాదులో 22.86 మీటర్ల వెడల్పుగల వస్త్రాన్ని చేతితో నెయ్యగల మగ్గాలుండడం, కేవలం కెమెరా కోసం ఒక స్క్రూ తయారు చేయగలిగే సామర్థ్యమున్న సాంకేతిక నిపుణులుండడం గురించిన నిజమైన సంఘటనల గురించి తెలుసుకుంటుంటే మీరన్నట్టు ఈ మాటలు రాస్తున్నప్పుడు నాకు కూడా చాలా ఆశ్చర్యంగానూ, బాధగానూ ఉంది. నిజంగా ఇంత గొప్ప స్వదేశీ సాంకేతికతను ఎంతలా ధ్వంసం చేసుకుంటూ వచ్చాం కదా భద్రుడు గారు.
ఇలా ఈ సంభాషణలో దొర్లిన అనేక ఆసక్తికరమైన విషయాల గురించి చర్చించుకుంటూ పోతే మీ బ్లాగు పోస్టు కన్నా పెద్దగా అయిపోతుంది నా కామెంట్. అందుకని నాకు చాలా నచ్చిన మరో అంశం గురూజీ ఐతరేయోపనిషత్తు లోని ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అనే మహావాక్యాన్ని ఉదహరిస్తూ జ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞానాల మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించిన విషయం ప్రస్తావించి ఆపేస్తాను.
నాకు ఎప్పుడూ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు ఈ quotation గుర్తొస్తుంది .”Knowledge is knowing that a tomato is a fruit; Wisdom is not putting it in a fruit salad.” నేను ఎక్కడైనా ఈ వాక్యం గురించి చర్చిస్తున్నప్పుడు దీన్నే కొంచెం హాస్యం జోడించి ఇలా వివరిస్తూ ఉదహరిస్తాను. –
టమోటాను బంతి అనుకుని నేలకేసి కొట్టడం అజ్ఞానం అంటే వస్తువు స్వభావం తెలియకపోవడం. అది ఒక కాయో, పండో అని గ్రహించి వంటల్లో వాడటం జ్ఞానం లేదా విజ్ఞానం అంటే వస్తువు లక్షణం, ఉపయోగాలు శోధించడం. ఇంక అది ఒక పండయినప్పటికీ దాన్ని ఫ్రూట్ సలాడ్లో వేయకపోవడం ప్రజ్ఞానం అంటే గురూజీ చెప్పినట్టు పరస్పర సంబంధం, ఔచిత్యం గ్రహించడం.
మీ ఈ గురూజీ సంభాషణలన్నీ ఎన్నో విజ్ఞానాల పట్ల అజ్ఞానం గా ఉన్న నాలాంటి పాఠకులకు ప్రజ్ఞానం లాంటిది.
మీ వంటి వారు చదవడం వల్ల ఈ సంభాషణలకు ఒక పరిమళం చేకూరింది. హృదయపూర్వక ధన్యవాదాలు.
మీకంటే బాగా చెప్పలేను. మీరు ఈ సంభాషణ చివర్లో అన్నట్లుగా
“ఎన్ని విషయాలు! ఎంత దూరం ప్రయాణించాం ఆయనతో కలిసి! బంగారం శుద్ధి చెయ్యడం దగ్గరనుంచి ప్రజ్ఞానం బ్రహ్మ దాకా!”
వ్యక్తి సంపన్నుడు కావడం, సమృద్ధుడు కావడం మధ్య ఉన్న తేడాను, ఆ తేడా మన ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేసిందో గురూజీ ఎన్నో ఉదాహరణలతో ఎంతో చక్కగా వివరించారు.
గురూజీ వివరించిన శూన్య-ఆధారిత ఉత్పత్తి-వ్యయ వ్యవస్థ ఎలా పనిచేసేదో, అలాగే మీరు add చేసిన మీ పరిశీలన, ఆ వ్యవస్థలో మిగులు ఉన్నా అది నిల్వల రూపంలోనో, ప్రభుత్వాలకి చెల్లించే పన్నులు రూపంలోనో ఎలా ప్రవహించి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను ఎలా నిలబెట్టిందో తెలుసుకున్నాను.
మన అద్వైత దృష్టి కేవలం ఆధ్యాత్మిక భావన మాత్రమే కాకుండా, technologyని, life style , and economy ని ఎలా ప్రభావితం చేసిందో కూడా తెలిసింది.
ఒక్క స్క్రూను తయారు చేసిన స్వర్ణకారుడు, ఇంటి ప్రాంగణంలోనే అద్దాలు తయారు చేసిన కళాకారులు, గాజులను రూపొందించిన వృత్తిపనివారు, 25 గజాల వెడల్పైన చద్దరును నేసిన మన నేతకళాకారులు వీరందరి దగ్గర వున్న skill, aesthetic and art గురించి చదువుతుంటే ఆశ్చర్యం కలిగింది, గర్వం కూడా కలిగింది.
మీరన్నట్లుగా
“బాధగానూ కూడా ఉంది. ఇంత స్వదేశీ సాంకేతికతను ఎంతలా ధ్వంసం చేసుకుంటూ వచ్చాం మనం”
జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం మధ్య ఉన్న భేదాన్ని, దేశీయ మరియు మార్గీయ కళల గురించి కూడా ఎంతో సరళంగా, లోతుగా అర్థమయ్యేలా చెప్పారు గురూజీ.
ముఖ్యంగా మీరు చెప్పిన ఈ మాట గురూజీ సంభాషణను beautiful గా summarize చేసినట్లు:
“గురూజీ చూసింది, ఆ సామాజిక ఒడంబడికని మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న డిజైన్ని, ఆ డిజైన్ వెనక ఉన్న సౌందర్య దృష్టిని, ఆ సౌందర్య దృష్టి వెనక ఉన్న మనోసౌందర్యాన్ని.”
నిజంగా మరో అద్భుతమైన సంభాషణ. ఎన్ని విషయాలు తెలుసుకున్నామో!
ఇంత విలువైన ఆలోచనలను, అనుభవాలను మాతో పంచుకుంటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సర్! 🙏🏽
ఎంతో సవివరంగా, ఎంతో సహృదయంతో సమ్మరైజ్ చేశారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.