జీవన శిల్పి-5

గురూజీ సంభాషణ కొనసాగిస్తున్నారు: మేము దౌలతాబాద్ కోట చూడటానికి వెళ్ళినప్పుడు- దౌలతాబాద్ కోటలో అన్నిటికన్నా ఎత్తైన శిఖరం మీద  ఇరవై రెండు అడుగుల పొడవైన ఫిరంగి. అక్కడికి మనిషి వెళ్ళడమే కష్టం! అంత పెద్ద ఫిరంగిని అక్కడికెలా తీసుకెళ్లారు? మేము కాలేజీ వాళ్ళతో, చాలామందితో వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద చర్చనడిచింది.  ‘దీన్ని పైకెలా తీసుకెళ్లారు?’ అని.  ఏనుగులకి  కట్టి లాగారని ఒకరన్నారు. అలా రకరకాలుగా ఎవరికి తోచింది వారు చెప్పారు. నన్ను కూడా అడిగారు. నేనన్నాను: దాన్నెక్కణ్ణుంచో తీసుకురాలేదు, ఇక్కడే పోతపోసారు. దాని కాస్టింగ్ అక్కడే జరిగిందని. ఎందుకంటే టెక్నిక్ అంత సింపుల్ గా ఉండేది. అది ఎలా పోత పోస్తారో ఆ పద్ధతి నేను వాళ్ళకి వివరించాను. పెద్ద పెద్ద విగ్రహాల్ని పోతపోసేటప్పుడు ఏమేం చేస్తారో చెప్పాను.  తర్వాత చాలా మంది ఆ పద్ధతిలోనే పనిచేసారు.

ఒకరోజు మరో పెద్ద చర్చ నడిచింది. నేను ధోతీ కట్టుకునే ఉండేవాడిని కదా. ధోతీ గురించి పంచాయితీ నడిచింది అక్కడ. చాలామంది నన్ను ప్రశ్నించారు. నేనన్నాను: ‘సరే, మీరు మీ వస్త్రధారణే గొప్పదని నిరూపించండి, నేను నా వస్త్రధారణ గొప్పదని నిరూపిస్తాను. ఎవరిది గొప్పగా ఉంటే వారిది శ్రేష్ఠం అనుకుందాం.ఇందులో ఏముంది?’ అన్నాను.

నస్రీన్ అహ్మదీ అని అక్కడొకరున్నారు, పెద్ద కళాకారిణి.  అరబ్ దేశాల వైపు నుంచి వచ్చిన ఆమె. పర్షియన్ అనుకుంటాను, ఆమెను జడ్జిగా కూర్చోబెట్టారు. ఆమె ప్రపంచమంతా తిరిగి వచ్చినామె. ఆమె కూర్చుంది. చర్చ నడిచింది. ‘నువ్వు నీ వస్త్రధారణ ప్రత్యేకత చెప్పు’ అన్నారు. ఒకళ్ళు చెప్పారు. ‘పరుగెత్తవచ్చు, సైకిల్ తొక్కవచ్చు, వెహికల్ నడపవచ్చు, మెషినరీ పనులు చేయవచ్చు. ఇలా అలా’ అని.

నేనన్నాను, ‘ఇందులో మీరు ఏ ఒక్క పని కూడా చేయాల్సిన అవసరం లేదు. పక్కనే హాస్టల్ ఉంది, నడుచుకుంటూ వస్తాం. సైకిల్ తొక్కాల్సిన అవసరం లేదు, వెహికల్ నడపాల్సిన అవసరం లేదు, మెషినరీ పనేమీ లేదు. మరి మీరివన్నీ ఎందుకు వేసుకుంటున్నారు ? ఆ నాలుగు అంతస్తుల ఇల్లు తయారవుతోంది కదా, దాని పైకప్పు పైన అంత పెద్ద లంగా వేసుకొని, ముసుగు వేసుకొని ఒకామె ఎక్కి పని చేస్తోంది, ఆమెకు అవసరం. ఆ పాలు అమ్మేవాడు వెళ్తున్నాడు. అంత పెద్ద తలపాగా చుట్టుకొని, పెద్ద ధోతీ కట్టుకొని, డబ్బాలు తగిలించుకొని సైకిల్ పైన పరుగెడుతున్నాడు, అతనికి అవసరం. వాళ్ళైతే ఇప్పటివరకు చావలేదు కదా! మీకు ఏ పనీ చేయాల్సిన అవసరం లేనప్పుడు మీకెందుకివి?’ అనడిగాను. నిజమే  కదా!’

‘మీరు మాట్లాడుతున్నారు అంటే కాస్త అర్థం ఉండాలి, మీకేం అవసరం చెప్పండి?’ అన్నాను. దాని తర్వాత, ‘మీరు చెప్పండి’ అన్నారామె. అప్పుడు నేను చెప్పాను. ‘చూడండి, ఈ పనులన్నీ ధోతీ కట్టుకున్నవాడు కూడా చేస్తాడు, ఇవన్నీ చేస్తూ కనిపిస్తూనే ఉన్నారు కదా. ఇందులో ఏమీ లేదు, ఇలా ఇది కట్టుకుని ఈ పనులు చేయవలసి వచ్చినందుకు ఎవరూ చావలేదు ఇప్పటివరకు. పెద్ద విషయం ఏంటంటే, ధోతీ వస్త్రధారణ, తోలుచెప్పులు, ధోతీ, కుర్తా, దుపట్టా, పట్కా లేదా టోపీ. ఇందులో నుండి తలపాగా, టోపీ తీసేస్తే ఏమైనా తక్కువ అవుతుందా? ఏమీ తక్కువ అవ్వదు. శరీరం పైన, భుజం పైన అంగవస్త్రం లేదు, ఏమైనా తక్కువ ఉందా? ఏమీ తక్కువ లేదు. కుర్తా లేదు, సాధారణ రైతులు ధోతీ, బనియన్ పైన ఉంటారు, వాళ్ళని దిగంబరులు అని అనలేం కదా. బనియన్ కూడా లేదు, కాస్త జంధ్యం ఉంది, పంచె కట్టుకొని ఉన్నారు, వారిని చూసి నమస్కరిస్తాం మనం. కాలికి చెప్పులు ఉంటే నడుస్తుంది, లేకపోయినా నడుస్తుంది, ఈ వస్త్రధారణలో ఇది ఉంటే నడుస్తుంది, లేకపోయినా నడుస్తుంది. మరి ఆ  వస్త్రధారణలో నుండి ఏం తీసేస్తారు? షర్ట్ తీసేస్తే దిగంబరుడు అంటారు. చెప్పులు లేకపోతే అనాగరికం అంటారు, ఒక బటన్ ఊడిపోతే రోజంతా ఇబ్బంది పడతాడు దుర్మార్గుడు! ఇంత ఇబ్బందికరమైన వస్త్రధారణ వేసుకొని ఏం ఆనందంగా జీవించగలడు మనిషి?’ అనడిగాను.

నస్రీన్ ఒప్పుకుంది. దాంతో చాలామంది అబ్బాయిలు ధోతీ కట్టుకోవడం మొదలుపెట్టారు.  అక్కడ గర్భా వగైరా జరిగేటప్పుడు చాలామంది ధోతీలు తీసుకొని నా దగ్గరకు వచ్చేవాళ్ళు. ‘ప్రభుజీ ధోతీ కట్టండి, ధోతీ కట్టుకొని గర్భా నాట్యం చేస్తాం’ అని. అలా చాలామందికి ధోతీలు కట్టేవాణ్ణి  నేనక్కడ.

అలా ఇదంతా సరదాగా సాగుతూ ఉండేది అక్కడ. చాలా రకరకాల మనుషులు ఉండేవాళ్ళక్కడ. మణిమండల్ అని ఉండేవాడు, లిబో అని ఉండేవాడు, వాళ్ళు బంగ్లాదేశీలు. ‘మేము ఫారినర్స్’ అని చెప్పుకునేవాళ్ళు వాళ్ళు! బంగ్లాదేశీలు కూడా ఫారినర్స్ అవుతారా ఏంటి? ‘మేము ఫారినర్స్’ అనేవాళ్ళు. గోపాల్ మండల్ అని. ఆయన పహిల్వాన్.  నేనొక రోజు అతణ్ణి అడిగాను ‘గోపాల్ నువ్వెలా వచ్చావిక్కడికి?’ అని. ఆయన మిలిటరీలో ఉన్నప్పుడు,  బల్లెం విసరడం ఉంటుంది కదా. వాళ్ళ  మేజర్ ఏదీ విసరండి అన్నాడు. ఈయన మీరు పక్కకి తప్పుకోండి సాబ్ అక్కడి నుండి అన్నాడు. లేదు, లేదు, నీదిక్కడి దాకా  రాదన్నాడు ఆయన. ఈయన విసిరాడు. అది ఆయన తొడ అవతలి వైపుకి వెళ్ళిపోయింది!

‘నన్ను తీసేసారు’ అన్నాడు గోపాల్! పంపించేసారు.పహిల్వాన్ ఆయన. అంత పెద్ద రాయిని కూడా  ఇలా ఇలా తిప్పేవాడు, పని చేసేవాడు. ఆయన తన స్థలాన్ని చాలా పవిత్రంగా ఉంచుకునేవాడు. చాలా పవిత్రంగా.  ఒకరోజొక అబ్బాయి, ఒకమ్మాయితో కలిసి వచ్చి అక్కడ కూర్చున్నాడు. కాస్త సన్నగా ఉన్న అబ్బాయి. వాళ్ళక్కడ కూర్చుంటే ఈయన వారితో అన్నాడు, ‘మీరు ఇక్కడ కూర్చోవద్దు, ఇది మాకు  చాలా పవిత్రమైన స్థలం. ఇక్కడిలా కూర్చోకూడదు’ అన్నాడు. కూర్చుంటాను,   ఏం  చేసుకుంటావని అడిగాడు వాడు.’నిన్ను ఎత్తి బయట పారేస్తాను అన్నాడీయన. ఎలా పారేస్తావనడిగాడు ఆ కుర్రాడు.  ఈయన వాణ్ణి ఎత్తి గోడ అవతల పారేసాడు! వాడి హీరోయిన్ అది చూసి పారిపోయింది!’

‘అక్కడొకరు కాశ్మీర్ కి చెందినవారున్నారు. కాశ్మీర్ ప్రజలైతే రోజులో చాలాసార్లు స్నానాలు వగైరా చేస్తారని మేము అనుకునేవాళ్ళం. వారిని చూసిన తర్వాత ఆ ఆలోచనే మారిపోయింది. స్నానమే చేసేవాళ్ళు కాదు దుర్మార్గులు! కాశ్మీర్‌లో స్నానం చేయరు సరే. ఇక్కడ కూడా చేయట్లేదు వాళ్ళు!

‘కుల్దీప్ కౌర్ అని ఒకామె. పెయింటింగ్ వేసేది. కాన్వాస్ పెట్టేది.అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమె వచ్చేది, జోలె సంచి తగిలించుకొని. పెయింటింగ్ కాన్వాస్ పెట్టేది. ఆ కలర్ ట్యూబ్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా ఇలా పిండేది పూర్తి గ్లాస్ పైన. అదంతా చేసిన తర్వాత బీడీ వెలిగించి వెనక్కి వెనక్కి జరుగుతూ చూసేది. మేమది  దూరం నుండి నిలబడి చూసేవాళ్ళం. ఆమె బీడీ తాగుతూ తాగుతూ, బీడీ అయిపోగానే దాన్ని అలా పారేసి, పరుగెత్తుకుంటూ వెళ్ళేది.’హా, హా’ అని శబ్దాలు చేసేది. ఐదు నిమిషాల్లో చెమటలు పట్టేసేవి.’

‘ఇది ఏంటి? ఫోర్స్, ప్రభుజీ, ఫోర్స్’ అంది కుల్దీప్. అంది. ‘ఫోర్స్ కోసం నువ్వు ఇంత పహిల్వాన్ గిరీ  చేయాలా ఏంటి?’ అనడిగాను. ‘ఫోర్స్ రావాలి పనిలో’ అనేదామె. ఒకరోజు ఆమె పరుగెత్తుకుంటూ వచ్చింది. కాన్వాస్‌తో పాటు కింద పడిపోయింది! పూర్తిగా కింద పడిపోతే మేము వెళ్లి ఆమెను లేపబోయాము. ఆమె అంది, ‘నన్ను ఎవరూ లేపకండి.ఇది నా పెయింటింగ్‌లో ఒక భాగం’ అంది! చావడం పెయింటింగ్‌లో ఒక భాగం అంట!’

‘అలా చాలా రక రకాల మనుషులు.  అక్కడికి వెళ్ళగానే నాకో  మంచి హితబోధ చేశారు బరోడాలో. ‘చూడండి ప్రభుజీ, ఇక్కడ ఎవరు ఎంత గలీజుగా ఉంటారో, వాళ్ళు అంత పెద్ద కళాకారులు’ అని! అవును. ప్రజలు స్నానం చేయరు, జుట్టు విరబోసుకొని ఉంటారు, ప్యాంట్ పైన డ్రాయింగ్స్ వేసి ఉంటాయి, చిరిగిపోయిన బట్టలు. అలా ఉండేది ఆ సమయంలో, ఇప్పుడెలా ఉందో తెలియదు.’

‘ఏదైనా కానీ. నేనైతేఉదయాన్నే హాయిగా స్నానం చేసి, లావు చెప్పులు, తోలు చెప్పులు, అదిలాబాద్‌లో తయారైనవి. తగరంపూ చెప్పులు, అందమైన చెప్పులు, వేసుకొని, విభూతి పెట్టుకొని కాలేజీకి వెళ్లేవాణ్ణి.

‘ఇద్దరు వ్యక్తులు కేరళకు చెందినవారు ఉన్నారు, వాళ్ళు కూడా స్నానాలు వగైరా చేసేవాళ్ళు కాదు. మహేంద్ర పాండ్య దగ్గర కూర్చుని ఉన్నారు.’శర్మాజీ, మీరైతే చాలా బాగా స్నానం చేసి వచ్చేస్తారు’ అన్నారు. ‘అవును సాబ్, చూడండి వీళ్ళు వారం వారం స్నానం చేయరు. వీళ్ళ గతి ఏంటో తెలియదు నాకు. నేనైతే ఒక పూట కాకపోతే ఇంకో పూట స్నానం చేయకపోతేనే నాకు  నచ్చదు’ అన్నాను. వాళ్ళకది నచ్చలేదు. ‘రావు, స్నానం చేసి వచ్చావా?’ అనడిగారు. చేయలేదన్నాడు. ‘వెళ్ళు, స్నానం చేసి రా’ అన్నారు. వాళ్ళు రోజూ రాగానే వారిని అడగడం- స్నానం చేశావా, లేదా అని. వాళ్ళకది చాలా వింతగా అనిపించేది, ఏంటిదంతా అని.’

‘రక రకాల మనుషులు ఉండేవాళ్ళు అక్కడ. ఒకరోజు మేము క్యాంటీన్‌లో కూర్చొని టీ తాగుతున్నాము. ఇంతలో ఒక విదేశీయుడు వచ్చాడు. ఆయన వచ్చాక పరిచయం చేస్తున్నారు. నేను హైదరాబాద్ నుండి బరోడా చదువుకోవడానికి వెళ్ళినప్పుడు మొదట్లో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడ ప్రజలు గట్టిగా మాట్లాడరు, నవ్వరు! గట్టిగా మాట్లాడట్లేదు. మెల్లమెల్లగా మాట్లాడుకోవాలి, నవ్వడం కూడా లేదు. గట్టిగా నవ్వితే ఏదోలా అనుకునేవాళ్ళు అక్కడ. ఇప్పుడు మదన్ లాల్ ఉన్నాడు, ఆయన బెనారస్ వాడు. ఆయన నవ్వు ఎక్కడ ఆగుతుంది? ఆయన చాలా గట్టిగా నవ్వేవాడు!’

‘కాని ఈ ప్రజలు నవ్వట్లేదు. నాకు చాలా వింతగా అనిపించేది. ఇంతలో ఇంకెవరో వచ్చారు. వారితో పరిచయం చేశారు. ‘చూడండి, ఈయన స్కల్ప్చర్ మనిషి, ఆయన పెయింటింగు మనిషి’ అని. ఈ దేశంలో పెయింటింగ్ అబ్బాయి, శిల్పకళ అబ్బాయి కలిసి కూర్చొని టీ తాగుతారా, మాట్లాడుకుంటారా అని ఆయనకు ఆశ్చర్యం వేసింది! నాకు బరోడా వెళ్లినప్పుడు మనుషులు గట్టిగా నవ్వుకోకపోవడం  వింతగా అనిపిస్తే, ఆయనకు బరోడా వచ్చి ఇంకా ఆశ్చర్యం వేసింది. ‘మీ దేశం ఎలా ఉంటుంది సాబ్?’ అనడిగాను. ‘మా దగ్గర ఇలా ఎవరూ కలిసి కూర్చొని మాట్లాడుకోరు. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయితో మాట్లాడనే మాట్లాడడు’ అన్నాడాయన. అది ఏ దేశమో మరి!

అలా మూడు సంవత్సరాలు నేను గడిపేశాను. రెండు సంవత్సరాలు గడిచాక,  ఒకరోజు వెదురు పొద దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాను. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మహేంద్ర పాండ్య నా దగ్గరకు వచ్చి ‘శర్మ, నీకో మాట చెప్పాలి నేను’ అన్నారు. ‘చెప్పండి సాబ్ ‘అన్నాను. ‘నువ్వు కావాలనుకుంటే ఎగ్జామ్ రాయవచ్చు, కానీ నువ్వింకో సంవత్సరం ఇక్కడే ఉండిపోవాలని నా కోరిక’ అని అన్నారు.  ‘సరే సాబ్, ఉంటాను. నాదేం పోయింది?’ అన్నాను. ‘పరీక్ష రాయొద్దు’ అన్నారు. సరే. నేను పరీక్ష రాయలేదు. ఇంకో సంవత్సరం ఉండిపోయాను. కానీ చాలా పని చేశాను.

‘ఆ మధ్యలోనే, అంటే నేను బరోడా వెళ్ళడానికి ముందు, ఇక్కడ మధ్యలో ఖాళీగా ఒక ఏడాది గడిపానని చెప్పానుకదా, అప్పుడే ఇక్కడొక ఆశ్రమం ప్రారంభించాం. కళా ఆశ్రమం. 7 జూన్ 1981 న  ప్రారంభించాం ఆ ఆశ్రమాన్ని.’

‘ఇక్కడేనా, లేక ఇంకెక్కడైనా ప్రారంభించారా?’ అనడిగాను, అంటే నా ఉద్దేశ్యం మేమప్పుడు కూచుని మాట్లాడుకుంటున్న చోటనేనా లేక అదిలాబాదులో మరో చోట ఎక్కడేనా అని.

‘లేదు లేదు, అది బస్తీలోనే ఎక్కడో ప్రారంభించాం, సరైన స్థలం లేదు. అంటే ప్రత్యేకంగా స్థలమేమీ లేదు. ఒక పాత ఇల్లు ఉండేది, దయ్యాలున్నాయని ఆ ఇల్లు ఎవరూ అద్దెకు కూడా తీసుకునేవాళ్ళు కాదు! ఆ ఇంటి యజమానితో మాట్లాడితే ఆయన సరే, మీరేం చేయాలనుకుంటే అది చేసుకోండన్నాడు. ఆ ఇంట్లో ఆశ్రమం ప్రారంభించాం. కొన్ని రోజుల్లోనే దాన్ని చాలా అందంగా తీర్చిదిద్దాం. ఆ ఇల్లు అమ్ముడుపోయింది! ఆ తర్వాత వెళ్లి ఒక గుడిసెలో మా ఆశ్రమం పెట్టాం. ఆ గుడిసెకు కూడా మంచి ధర వచ్చింది. అదీ అమ్ముడుపోయింది! అప్పుడు మా ఇంటి పక్కన చిన్న మఠం ఉంటే  ఆ మఠంలో కూర్చున్నాం. మఠంలోనే పని నడిచేది.’

‘ఆ తర్వాత భగవాన్ రావు రాజే అని మా ఇంటి ముందు ఒక లాయర్ ఉండేవారు. ఆయన తన ఇల్లు వదిలేసి హైదరాబాద్ వెళ్తున్నారు. ఆయన్నడిగితే సరే తన ఇంట్లోనే పనిచేసుకొమ్మన్నాడు. అప్పుడు మళ్ళా ఆ ఇంట్లో ఆశ్రమం ప్రారంభించాం. చాలా సంవత్సరాలు అక్కడే నడిచింది. ఆయన మళ్ళీ హైదరాబాద్ నుండి తిరిగి వచ్చేటప్పటికి, అప్పుడు మాకు స్థలం గురించి చింత పట్టుకుంది. అప్పుడు ఈ స్థలం కావాలని గవర్నమెంటుని అడిగాం. ఆ సమయంలో వీళ్ళు లక్షా ఇరవై వేల రూపాయలు వాల్యుయేషన్ చేశారు. కానీ మేము డబ్బులు కట్టలేకపోయాము. దాంతో అది ఆగిపోయింది. అలా ఆగిపోయింది ఇప్పటిదాకా అలాగే ఉంది. ఇస్తే అయిపోయేది. కానీ మా సహచరులున్నారే, వాళ్ళు పెద్ద దళారీలు. డబ్బులు సర్దనూ లేదు, కట్టనివ్వనూ లేదు.’

‘సరే, బరోడా జీవితం మొత్తం మీద ఆనందంగా  సాగింది.  నేను ఆ చెట్టు కిందనే  కూచొని చాలా రోజులు పని చేస్తూనే ఉన్నాను. ఆ సమయంలో విశాఖపట్నానికి చెందిన రమేష్ అని ఒకాయన, మేమాయన్ని ప్రేమతో ‘రామారావు’ అని పిలిచేవాళ్ళం, ఆ అబ్బాయి చాలా సహాయం చేసేవాడు. గుంటూరు వైపు నుండి తిలక్ అని ఒకడు వచ్చాడు, చాలా దుర్మార్గుడు. వాడి దగ్గర చాలా డబ్బు ఉండేది. వాడెలాగైనా నాకు డబ్బులివ్వాలని ప్రయత్నం చేసేవాడు. నేను వాడినుంచెప్పుడూ డబ్బులు తీసుకోలేదు. దాంతో వాడు చాలా కోపంగా ఉండేవాడు.’ నా నుండి ఎప్పుడూ డబ్బులు తీసుకోడు’ అనేవాడు.’

‘అక్కడ సుధాకర్ రెడ్డి ఉండేవాడు, రమేష్ ఉండేవాడు. రమేష్ ఏంటంటే, బట్టలు మురికిగా ఉంటే తీసుకెళ్లి చాకలికి ఇచ్చేవాడు, టీ వగైరా కోసం వసతి చేసేవాడు. ఈ విధంగా  ఒకరోజు చెట్టు కింద కూర్చొని ఉన్నాను, రమేష్ వచ్చి ‘ప్రభుజీ, ఈరోజు కాలేజీలో ఒక ప్రోగ్రాం ఉంది, ఇప్పుడు బస్సులో వెళ్దాం’ అన్నాడు. బస్సులో వెళ్దాం సరే అని యాభై పైసలు ఇచ్చి వెళ్లాడు. నేను వెళ్లి బస్సు ఎక్కాను, బస్సులో కూర్చున్నాను.నా పక్కన ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు, గుజరాతీ ఆయన. కండక్టర్ రాగానే ఆయన అన్నాడు, ‘రెండు టికెట్లివ్వు. ఒకటి ఖండీరావ్ మార్కెట్. మహారాజ్ ఎక్కడికి వెళ్లాలో తెలియదు కానీ, వారికి కూడా ఖండీరావ్ మార్కెట్ టికెట్ ఇచ్చేయ్, వారు ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగుతారు’ అన్నాడు.’

‘నువ్వు నా డబ్బులు ఎందుకు ఇస్తావు సాబ్? నా దగ్గర నా డబ్బులు ఉన్నాయి’  అన్నాను. ‘లేదు లేదు, నేను నీ టికెట్ ఇస్తాను’ అన్నాడు ఆయన. ‘మనకి పరిచయం లేదు, ఏమీ లేదు. నువ్వెందుకు నా టికెట్ ఇస్తావు?’ అనడిగాను. ‘లేదు, నేనే ఇస్తాను. నిన్ను చూసి నాకు టికెట్ ఇవ్వాలనిపించింది, ఇస్తాను’ అన్నాడు! ఆయనే టిక్కెట్టు తీసుకున్నాడు. కండక్టర్ అంత దూరం వెళ్లి మళ్ళీ వచ్చాడు.’

‘తీసుకున్న తర్వాత నేను దిగి కాలేజీకి వెళ్ళినప్పుడు. వెళ్ళగానే ఎదురుగా నస్రీన్ కనిపించింది నాకు. ‘శర్మా,  బరోడాలోనే ఉండిపోయావు కదా నువ్వింక’ అంది.  ‘లేదు నస్రీన్,  ఈరోజు నేనొక విషయం చూసి వచ్చాను, ఈరోజుతో నాకు నిశ్చింత కలిగింది. నేనెప్పుడైనా బరోడా వదిలేసి వెళ్ళిపోతాను’ అన్నాను. బరోడాలో, కాలేజీలో రెండు గ్రూపులు ఉండేవి, మహేంద్ర పాండ్య, పాంచాల్ సాబ్,  రెండు గ్రూపులూ కూడా నన్ను గుజరాత్ నుండి వెళ్ళనివ్వకూడదనీ, గుజరాత్‌లోనే ఉంచేయాలనీ చాలా ప్రయత్నాలు చేశారు.’

‘సంఖేడాలో రెండు హవేలీలున్నాయి, ఆ హవేలీలు చూపించారు.’నువ్వు అక్కడ చేయాలనుకున్నది ఇక్కడే చెయ్, ఊరిలో ఉండాలంటే ఇక్కడే ఉండు’ అని. బరోడా నగరం మధ్యలో రెండు ఎకరాల స్థలం చూపించారు. ఇక్కడ ఏం చేయాలనుకుంటే అది చెయ్’ అని. మల్లికా సారాభాయ్, మృణాళిని సారాభాయ్ కంపెనీ ఉంది కదా, వాళ్ళ దగ్గర. నేనెప్పుడూ వాళ్ళ దగ్గరకు రానని చెప్పాను. వాళ్ళే అన్ని వసతులు చేస్తామన్నారు. నన్ను గుజరాత్ నుంచి వెనక్కి రానివ్వకూడదనే వాళ్ళ ప్రయత్నమంతా.’

‘నస్రీన్, కృష్ణ ఛాత్పర్, రాఘవ్ కనేరియా మొదలైన వాళ్ళంతా ‘శర్మా, నువ్వేం చేయాలనుకుంటున్నావో అది మీ ఊరికే వెళ్లి చెయ్, ఇక్కడ ఉండొద్దు. నువ్వు చేయబోయేది దీనికంటే చాలా ముఖ్యమైనది, ఇక్కడే ఉంటే నీదంతా ఇక్కడే ముగిసిపోతుంది’ అనేవాళ్ళు. పాండ్యాలాంటివాళ్ళ ఉద్దేశం నన్ను అక్కడినుండి  ఇక్కడికి  రానివ్వకూడదు అని.  నేనేమో చాలా చింతలో ఉండేవాడిని- ఎలా బతకాలి, ఏం చేయాలని. కానీ ఆ సంఘటన జరిగిన రోజు నాకు నమ్మకం కుదిరింది. ప్రపంచంలో పుట్టాము అంటే బతికేస్తాం ఎలాగోలా! పుట్టించినవాడే ఆలోచిస్తాడు, మనకెందుకు చింత అని. నేను పూర్తిగా ప్రశాంతంగా అయిపోయాను. మనసు ప్రశాంతమైన కొన్ని రోజులకే బరోడా వదిలేసి వచ్చేశాను.’

‘బరోడా వదిలేసేటప్పుడు నా దగ్గర చాలా డబ్బు ఉంది. ఆ సమయంలో నా దగ్గర పదమూడు వేల రూపాయలు ఉన్నాయి! ఆ చెట్టు కింద కూర్చొని ఏదైతే పని చేశానో, ఆ పనులన్నీ అమ్ముడుపోయాయి. రాతి విగ్రహాలు తయారు చేశాను. ఒక గైక్వాడ్ ఉండేవాడు, ఆయన నా నుండి ఒక ఇత్తడి విగ్రహాన్ని తీసుకున్నాడు.కిరణ్ అనే అబ్బాయి తీసుకెళ్లి ఇచ్చాడు. ఆ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకున్న తర్వాత, అప్పటికి ఒక కేసు నడుస్తోంది, ఆ రెండు మూడు రోజుల్లోనే ఆయన ఆ కేసు గెలిచాడు! దాంతో వాళ్ళ అమ్మ వగైరా చాలా సంతోషపడ్డారు.ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి నాకు తిరిగి ఇచ్చేసారు. ఏం జరిగిందో చెప్పారు. ‘కానీ గైక్వాడ్ నిన్ను కలవాలనుకుంటున్నాడు’ అన్నారు. ‘అలాంటి వాళ్ళని కలిసి నేనేం చేస్తాను?’ అన్నాను. ఆయన వచ్చాడు. చెట్టు కిందకే వచ్చాడు, చాలా పెద్ద మనిషి ఆయన. ఆయన అన్నాడు, ‘చూడండి ప్రభుజీ, అమ్మ ఉంది ఇంట్లో, అందరూ ఉన్నారు. వారి నమ్మకాలు వారివి, వారి మాటలు వారివి. కానీ నేను ఆ విగ్రహం కాదు, వేరే విగ్రహాలు తీసుకుంటాను’ అన్నాడు. ఏవైతే రాతి విగ్రహాలు ఉన్నాయో, అవన్నీ నేను తీసుకుంటాను అని డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు. ‘రాతి విగ్రహాలు  పూర్తయ్యేంత వరకు నేను డబ్బులు తీసుకోను. ఒకవేళ పగిలిపోతే ఏం చేస్తాం?’అని అన్నాను.’

‘ఆయన ఒకటి రెండు విగ్రహాలు తీసుకొని పదమూడు వేల రూపాయలు ఇచ్చి వెళ్లాడు ఆఖరిలో. చాలామంది దగ్గర ఉన్న డబ్బులు తిరిగి వచ్చేశాయి.  బెనారస్‌లో మదన్ లాల్ పెళ్లి ఉంది, ఆ పెళ్ళికి వెళ్ళాలి నేను. అందుకని నేను మహేంద్రపాండ్య ఇంటికి వెళ్లాను, చాలా బాగా భోజనం పెట్టారు. కాశీ వెళ్తున్నాను అని నీళ్ళబాటిళ్ళు ఇచ్చారు, పెరుగు నోట్లో వేసి నన్ను సాగనంపారు. అలా బెనారస్ వెళ్ళినవాడిని మళ్ళీ బరోడా వెళ్ళనే లేదు, ఇక్కడికే తిరిగి వచ్చేశాను!’

ఇక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరంలో కోసాయి ఉంది, కోసాయిలో మాకు స్థలం ఉండేది. నలభై ఎకరాల స్థలం. నేను అక్కడే ఉండిపోతాను, ఆశ్రమం అక్కడే తయారవుతుంది అని నేననుకునేవాణ్ణి. ఈ ఓజా వగైరా ఈ కారీగర్లందరూ కూడా అక్కడకి  వచ్చి ఇళ్ళు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ‘గురూజీ, ఇప్పుడూ గుడిసెలోనే ఉంటున్నాం, అక్కడా గుడిసె వేసుకుంటాం’ అని వాళ్ళంతా రావడానికి సిద్ధంగా ఉన్నారు.’

‘కానీ మా ఇంట్లో వాళ్ళు నన్ను వెళ్ళనివ్వలేదు. మా పెద్దనాన్న ఎవరినీ ఆ స్థలంలోకి రానివ్వలేదు.  ఇప్పుడిక్కడ అంతా ఇదైనప్పుడు, ఇక అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు వెళ్ళు అంటున్నారు. ‘ఇక్కడ అంతా సెట్ అయినప్పుడు ఇక నేనెందుకు వెళ్తాను అక్కడికి? ఆ వ్యవసాయభూమి అంతా అమ్మేశారు మళ్ళీ. లేకపోతే అక్కడ ఉంటే చాలా బాగుండేది. ఎప్పుడో ఆశ్రమం అంతా తయారైపోయేది, వేరే వాతావరణం ఉండేది. అదిలాబాద్ వచ్చేవాళ్ళు ఇంకో ఇరవై కిలోమీటర్లు వచ్చేవాళ్ళు, అవును కదా! అప్పుడు కూడా వచ్చి ఉండేవాళ్ళు చాలామంది  మెల్లమెల్లగా. అదంతా చాలా పద్ధతిగా తయారై ఉండేది. ఇక్కడంతా ఇబ్బందిగానే ఉంది ప్రతి విషయంలోనూ. ఇదంతా చూశాం చాలా.’

‘నేనిక్కడికి వచ్చిన కొత్తల్లో  కొత్తగా ఐటిడిఎ ఏర్పాటు చేశారు. ఫణికుమార్ నా దగ్గరకొచ్చి ‘నువ్వు కొలాం పిల్లలకు పాఠాలు చెప్పు, వాళ్లకు డ్రాయింగ్ నేర్పించు’ అని అడిగారు. ‘నేను ఉద్యోగాలన్నీ వదిలేసి వచ్చినవాడిని. అక్కడ నన్ను లెక్చరర్‌గా ఉండమన్నా కూడా వద్దని పారిపోయి వచ్చాను. ఇక్కడికి వచ్చి మళ్లీ ఏం ఉద్యోగం చేస్తాను? నేను చేయను’ అని చెప్పాను. కానీ ఫణికుమార్, శాస్త్రి గారు ‘లేదు లేదు, నువ్వు కచ్చితంగా నేర్పించాలి’ అని బతిమాలారు. దాంతో నేను, ‘నాకు నచ్చినంత కాలం మాత్రమే నేర్పుతాను, ఆ తర్వాత వదిలేస్తాను’ అని ఒప్పందం చేసుకున్నాను.’

‘అలా నేను మళ్లీ కోలాం ఆశ్రమ పాఠశాలకు వెళ్లడం ప్రారంభించాను. అప్పట్లో వాళ్లు నాకు నెలకు 600 ఇచ్చేవారు. అదెంతన్నా ఉండనీ, నాకేమిటనుకుని వెళ్ళడం మొదలుపెట్టాను. ఒకరోజు నేను కోలాం ఆశ్రమ పాఠశాలకు వెళ్తుంటే, దారిలో కలెక్టర్ బంగ్లా ఉంది కదా, అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఆ చెట్టు కింద ఒక పిచ్చిది కూర్చుని ఉండేది. ఆ రోజు ఆదివారం. నేను వెళ్తూ వెళ్తూ  ‘ఈరోజు పండగ రోజు, జనాలు ఇంట్లో ఏమేం వండుకుని తింటున్నారో. కానీ ఈ పిచ్చామె ఇక్కడ కూర్చుంది, ఈమెకి పండగ లేదు కదా అనుకున్నాను. నేను మళ్లీ తిరిగి వెనక్కి వస్తూండగా,  ఏం చూశానంటే, ఒక ఆఫీస్ బాయ్  సైకిల్ మీద తన ఆఫీసర్ కోసం క్యారియర్ తీసుకువెళ్తున్నాడు. ఆ టిఫిన్ బాక్స్ అక్కడ కింద పడిపోయింది. అందులో అన్నం, కూరా అన్నీ రోడ్డు మీద పడ్డాయి. ఆ పిచ్చామె పరుగున వెళ్లి, ఆ రోడ్డు మీద పడిన అన్నాన్ని చేతులతో తుడిచి మళ్లీ బాక్సులో పెట్టుకుని తినడం ప్రారంభించింది. ఆ ప్యూన్ ఖాళీ డబ్బాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అది చూసి నాకనిపించింది: భగవంతుడు ఈమె పండగను ఇక్కడే రోడ్డు మీదే జరిపించేశాడు అని.’ (నవ్వులు).

‘ఆమెకి కూర్చున్న చోటునేతిండి దొరికింది. మనమేమో అనవసరంగా అన్నింటికీ ఆందోళన చెందుతూ ఉంటాం, అంతే కదా’ (నవ్వులు). ‘ఇలాంటివి చాలా చూసిన తర్వాత మనసు నిశ్చింతగా మారుతుంది. లేదంటే ఈ రోజుల్లో పిల్లలందరి ప్రాణాలు ఆందోళనతోనే పోతున్నాయి; ఎలా బతకాలని. ఈ రోజుల్లో అబ్బాయిలు పెళ్లి పేరు చెబితేనే భయపడుతున్నారు. బతకడం ఎలా అనేదే వాళ్లకు అతిపెద్ద సమస్యగా మారింది. మొన్న శంకీ కూడా నన్ను అడుగుతున్నాడు, ‘నాన్నా, మీరు ఆ రోజుల్లో అంత ధైర్యంగా ఎలా బతికార’ని.

శంకీ అంటే గురూజీ పుత్రుడు, అపూర్వ శర్మ. ఆయన ఫార్మసీ చదువుకున్నారు. ఇప్పుడు హైదరాబాదులో ఒక కంపెనీకి కన్స్లటెంట్ గా ఉన్నారు. ఇప్పుడు కళాశ్రమం బాధ్యతలు ఆయనే చూస్తున్నారు.నెలలో రెండువారాలు హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ, మిగిలిన రెండు వారాలూ కళాశ్రమంలో కార్యక్రమాలు నిర్వహిస్తూంటారు.  కళాశ్రమంలో ప్రతి ఏడూ ఉగాదికి ‘మిత్ర మిలన్ ‘నిర్వహిస్తారు. దీపావళికి దీపోత్సవం జరుపుతారు.

కళాశ్రమంలో దీపోత్సవం

ఆ రెండు ఉత్సవాలకీ దేశం నలుమూలనించీ గురూజీ మిత్రులూ, శిష్యులూ, కళాకారులూ పెద్ద ఎత్తున తరలివస్తారు. అలా వచ్చిన వారంతా కళాశ్రమంలోనే ఉంటారు. అదంతా ఒక పెద్ద పెళ్ళి వేడుకలాగా ఉంటుంది. ఆ రెండు పండగలూ కాక, ఏడాది పొడుగునా, వృత్తిపని శిబిరాలు నడుస్తుంటాయి. గణేశ్ చతుర్థికి మట్టిదీపాలు తయారుచేసే శిబిరం తప్పనిసరిగా నడుస్తుంటుంది.

అపూర్వని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. గురూజీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. తండ్రిమాత్రమే కాదు, ఆ తండ్రి మిత్రులు కూడా గర్వించదగ్గ బిడ్డ అనిపిస్తుంది.

‘నేను మా పిల్లవాడితో చెప్పాను’ గురూజీ చెప్తున్నారు: ‘నేను బతకడం గురించి ఎప్పుడూ ఆందోళన పడలేదు, ఎలా బతకాలి అనే పద్ధతుల గురించి ఆలోచించలేదు. మీరు ‘ఎలా బతకాలి’ అని ఆలోచిస్తున్నారు; ఇంత పెద్ద చదువు చదివిన తర్వాత ఇలాగే బతకాలి అని నియమాలు పెట్టుకుంటున్నారు. మేము కేవలం ‘బతకాలి’ అని మాత్రమే అనుకున్నాం, అంతే తేడా, అంతకుమించి ఏమీ లేదు’అని.

‘బతకాలి అనుకుంటే మనిషి ఎక్కడైనా బతుకుతాడు, అందులో పెద్ద కష్టం ఏముంది? కాని బతకడానికి కార్లుండాలి, అంతస్తులుండాలి, ఇలాగే జీవించాలి అని ఎప్పుడనుకుంటామో అప్పుడే సమస్యలు మొదలవుతాయి. బతకడం మాత్రమే ముఖ్యం అనుకుంటే హాయిగా జీవించవచ్చు. ఇక్కడ ఇంత పెద్ద సమాజం అలాగే బతుకుతోంది కదా. ఇవన్నీ మేము కళ్లారా చూశాం.’

‘నేను 8వ, 9వ తరగతి చదివే సమయానికే చాలా ఉపనిషత్తులు, మనుస్మృతి ఇవన్నీ చదివేశాను. 9వ తరగతి తర్వాత నేను మళ్లీ వేరే పుస్తకాలు ఎప్పుడూ చదవలేదు. మా తాతగారి కాలం నాటి గ్రంథాలయంలో ఉండే ఉపనిషత్తులు, మనుస్మృతి పుస్తకాలన్నీ నేను అప్పుడే పూర్తి చేశాను. ఆ తర్వాత నేను కేవలం రామాయణం మాత్రమే చదువుతూ వచ్చాను. ఆ తర్వాత రామచరితమానస్ మాత్రమే చదివాను, మిగతావి ఏవీ చదవలేదు. నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి, వేరే పుస్తకాలు చదివే ప్రసక్తే రాలేదు’ (నవ్వులు). ‘మిగతా విషయాలన్నీ చూస్తూ వచ్చాం, కానీ ఆ చిన్నతనంలో చదివిన చదువుకు, ఇప్పుడు చేస్తున్న పనులకు ఎక్కడో ఒకచోట సంబంధం కుదురుతూనే వచ్చింది.’

‘చూడండి, మీకో విషయం చెబుతాను. ఒక మనిషి మరొకరి మాటను మూడు రకాలుగా అంగీకరించవచ్చు . ఒకటి, శాస్త్ర ప్రమాణం. శాస్త్రంలో చెబితే నమ్ముతారు.రెండవది, తర్క ప్రమాణం. అంటే లాజిక్‌గా ఆలోచిస్తే అది నిజం అనిపించాలి. మూడవది, అనుభవ ప్రమాణం. అంటే మన సొంత అనుభవంలోకి రావాలి. ఈ మూడు విషయాలనే మనం ప్రమాణాలుగా అంగీకరిస్తాం. మనకు అనుభవం ఉంటే, దాన్ని ఎవరూ కాదనలేరు, దానికి వేరే నిరూపణలు అవసరం లేదు. అలాగే తర్కానికి నిలబడిన విషయాన్ని కూడా అంగీకరించాల్సిందే. ఇక శాస్త్రం ద్వారా నిరూపితమైన దాన్ని కూడా నమ్ముతాం. ఈ మూడు పద్ధతుల్లోనే మనం ఏదైనా నమ్ముతాం. అందుకే నా దగ్గరకు వచ్చేవాళ్లు ఎవరూ నన్ను ప్రత్యేకంగా నిరూపణలు అడగరు, ఎందుకంటే నేను ఈ మూడు ప్రమాణాలకు అనుగుణంగానే మాట్లాడుతాను. నేను ఏ విషయాల గురించి అయితే మాట్లాడతానో, అవి వేరే ఎక్కడా చదవడానికి దొరకవు. మరి ఆ ఆలోచనలు, ఆ ఊహలు, ఆ అనుభూతులు వెనుక ఉన్న రహస్యం ఏంటి?’

 ‘ఆ ఆలోచనల వెనుక ఉన్న అసలు కథను నేను మీకు వివరిస్తాను. మిగతా ఆలోచనల గురించి రాబోయే ఐదారు రోజుల్లో వివరంగా మాట్లాడుకుందాం. కానీ ఈ ఆలోచనలు అసలు ఎలా వచ్చాయి అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఒకటి చదువు వల్ల వచ్చింది. హైదరాబాద్‌లో, బరోడాలో చదివిన చదువు. ఇంకొకటి, 9వ తరగతి వయసులో ఉపనిషత్తులు, పురాణాలు చదవడం వల్ల వచ్చింది. వీటన్నింటితో పాటు, గత కొన్ని సంవత్సరాలుగా నేను మీకు చెబుతున్న విషయాలు నా అనుభవం నుండి వచ్చినవి. అవన్నీ నా మనసులోకెలా వచ్చాయో నేను మీకు ముందు ముందు వివరిస్తాను.’

నేను ఆశ్రమం ప్రారంభించిన కొత్తల్లో ఇలాంటి ఆలోచనలు ఏవీ లేవు. అప్పుడు కేవలం ఒకటే ఉద్దేశం ఉండేది; వృద్ధులైన కళాకారులు, శిల్పులు ఉన్నారు కదా, వాళ్ల జీవితం చివరి రోజుల్లో ప్రశాంతంగా గడవాలి అని. వాళ్ల దగ్గర ఉన్న విద్యలను, నైపుణ్యాలను సేకరించి భద్రపరచాలి అనుకున్నాను. అంతకుమించి వేరే ఆలోచన లేదు. వాళ్ల సాంకేతిక పద్ధతుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఎల్లప్ప తాత కంటిచూపు కోల్పోతే, ఆయనకు కంటి ఆపరేషను చేయించాం. చాలా మందికి తోచిన వసతులు కల్పించి, వాళ్ల చివరి రోజులు ప్రశాంతంగా గడిచేలా చూశాం. అంతకుమించిన పెద్ద ఉద్దేశ్యం మరేడీ  లేదప్పుడు. కానీ వాళ్ల నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. లక్ష్మీకాంత్ రావు గారి దగ్గర చాలా నైపుణ్యాలుండేవి. వారు తోలు పని కూడా తెలిసినవారు, మంచం అల్లడం కూడా చాలా బాగా తెలిసినవారు. వారి దగ్గర చాలా పనులు చూసాము.  చాలా సమాచారం సేకరించాం. మామూలుగా దేశ్పాండే లు తోలుపనివంటి వాటి జోలికి వెళ్ళరు, కానీ వారికి చాలా పనులు తెలుసు, చాలా పనులు ప్రజలకు  నేర్పించారు కూడా. దాని  గురించిన అవగాహన నాకు తర్వాత రోజుల్లో వచ్చింది. దానికంటే ముందు వరకు పని నేర్చుకోవాలి అన్నదానిమీదనే దృష్టి ఉండేది ఇంకో విషయం ఏంటంటే, ఆధునిక విచారధార అంటారే, అది నా లోపల కూడా చాలా ఉండేది. ఇదంతా దోపిడీ కోసం తయారైంది, దానికోసం తయారైంది, దీనికోసం తయారైంది అని నా బుర్రలోనూ ఉండేది.  అందుకే ప్రతిచోటా వెళ్లి పెద్ద గొడవలు చేసేవాణ్ణి. ఇదంతా వృథా అని. ఇలాంటి ఆలోచనలు   నా మనసులోనూ చాలానే ఉండేవి.


Featured image and festival photos at Kalashramam, courtesy Apurva Sharma, Adilabad

6-6-2026

3 Replies to “జీవన శిల్పి-5”

  1. ఒక మనిషి మరొకరి మాటను మూడు రకాలుగా అంగీకరించవచ్చు . ఒకటి, శాస్త్ర ప్రమాణం. శాస్త్రంలో చెబితే నమ్ముతారు.రెండవది, తర్క ప్రమాణం. అంటే లాజిక్‌గా ఆలోచిస్తే అది నిజం అనిపించాలి. మూడవది, అనుభవ ప్రమాణం. అంటే మన సొంత అనుభవంలోకి రావాలి. ఈ మూడు విషయాలనే మనం ప్రమాణాలుగా అంగీకరిస్తాం. మనకు అనుభవం ఉంటే, దాన్ని ఎవరూ కాదనలేరు, దానికి వేరే నిరూపణలు అవసరం లేదు. అలాగే తర్కానికి నిలబడిన విషయాన్ని కూడా అంగీకరించాల్సిందే. ఇక శాస్త్రం ద్వారా నిరూపితమైన దాన్ని కూడా నమ్ముతాం. ఈ మూడు పద్ధతుల్లోనే మనం ఏదైనా నమ్ముతాం.

    – ఎంత బాగా చెప్పారో

  2. “వాళ్ల దగ్గర ఉన్న విద్యలను, నైపుణ్యాలను సేకరించి భద్రపరచాలి అనుకున్నాను. అంతకుమించి వేరే ఆలోచన లేదు.”

    ఎంత గొప్ప ఆలోచన! వారి దగ్గరున్న కళలను, నైపుణ్యాలను కాపాడాలనే ఆలోచన ఒకటి; దానిని కష్టనష్టాలకోర్చి ఆచరణలో పెట్టడం ఇంకొకటి. ఇది సామాన్యమైన విషయం కాదు.

    “నేను ఏ విషయాల గురించి అయితే మాట్లాడతానో, అవి వేరే ఎక్కడా చదవడానికి దొరకవు.”
    Truly a self-made man!

    “బతకాలి అనుకుంటే మనిషి ఎక్కడైనా బతుకుతాడు, అందులో పెద్ద కష్టం ఏముంది? కాని బతకడానికి కార్లుండాలి, అంతస్తులుండాలి, ఇలాగే జీవించాలి అని ఎప్పుడనుకుంటామో అప్పుడే సమస్యలు మొదలవుతాయి. బతకడం మాత్రమే ముఖ్యం అనుకుంటే హాయిగా జీవించవచ్చు.”

    Simple, yet high thinking! Guruji seems to have lived this principle and showed that it is possible to just live, without worrying about how to live.

    “లావు చెప్పులు, తోలు చెప్పులు, అదిలాబాద్‌లో తయారైనవి. తగరంపూ చెప్పులు, అందమైన చెప్పులు, వేసుకొని…”
    ఈ చెప్పుల గురించి భలే చెప్పారు! 😊

    శాస్త్ర ప్రమాణం, తర్క ప్రమాణం, అనుభవ ప్రమాణం గురించిన మాటలు చాలా valuable విషయాలు

    నిన్నటి పోస్ట్‌లో ఉన్న ఆ అందమైన buildings pictures, గురూజీ creations చాలా బాగున్నాయి. 🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading