
ప్రియమైన శాఫో
చూస్తూండగానే వసంత ఋతువు తరలిపోయింది. ఇప్పుడు గాల్లో హారతి పడుతున్న తురాయిపూల కొమ్మలమీంచి గ్రీష్మం ప్రవేశించింది. యుద్ధాలమధ్య, మండే ఎండల మధ్య, ఎడతెరిలేకుండా రాలే పచ్చతురాయి పూల మధ్య వసంతం తానున్నాళ్ళూ తన వంతు గానం తాను వినిపించి వెళ్ళిపోయింది. రాలిపోయిన పూలు రాలిపోగా మిగిలిన పూలు, ఎవరికీ అందని చిటారుకొమ్మలమీది చివరి పూలు, వసంతం విడిచిపెట్టి వెళ్ళిన గుర్తులుగా మిగిలి ఉన్నాయి, ఈ నీ కవితను, Fragment 105 A ను గుర్తుకు తెస్తూ-
అన్నిటికన్నా ఎత్తైన ఆఖరిచిటారుకొమ్మన
ముగ్గుతున్నది తియ్యని యాపిల్ పండు
పండ్లు కోసుకునేవాళ్ళు మర్చిపోయారు
లేదు, మర్చిపోలేదు, అందుకోలేకపోయారు
ఈ కవిత మొదటిసారి చదివినప్పుడు, ఆ తియ్యని యాపిల్ పండుని, శాఖాగ్రాన మిగలముగ్గుతున్న ఆ యాపిల్ పండుని , మనుషులు చేతులు చాపినా అందుకోలేనంత ఎత్తులో ఉన్న ఒక సౌందర్యనిధానంగానే నేను భావించాను. ఇదొక వివాహగీతంలోని శకలం కావొచ్చనీ, అందుకోలేని సౌందర్యానికీ, తీరని కాంక్షాపరిపూర్తికీ ప్రతీకగా భావించాను. కాని Judy Grahn రాసిన The Highest Apple: Sappho and The Lesbian Poetic Tradition (1985) చదివేదాకా ఈ ప్రతీకను ఎంత లోతుగా పరిశీలించవచ్చో నాకు తెలియలేదు.
నీ పేరుమీద Sapphic Tradition అనే ఒక కావ్య సంప్రదాయం ప్రాచీన గ్రీకు సాహిత్యంలో వికసించిందని తెలుసు. నీ కవితల్లో కనిపించే చరణాలు Sapphic Stanza పేరిట ప్రత్యేకమైన ఒక ఛందస్సుని ఆవిష్కరించాయని కూడా విన్నాను. మా ముత్యాల సరం 14 మాత్రల చొప్పున మూడు పంక్తుల్లోనూ, చివర అయిదు లేదా అఏడు మాత్రల్తో నాలుగో పాదంలోనూ ఉండే ఒక అమరిక. అది ఆధునిక తెలుగు కవిత్వ స్వరూపాన్ని సమూలంగా మార్చేసింది. అలానే నీపేరు మీద ప్రసిద్ధి చెందిన శాఫో చరణం కూడా ఒక్కొక్కటీపదకొండు మాత్రలుండే మూడు పాదాలతోపాటు అయిదు మాత్రలుండే నాలుగోపాదంతో ఒక వినూత్న సంగీతాత్మకతను గ్రీకు కవిత్వానికి పరిచయం చేసిందని విన్నాను.
అయిరే నువ్వు నివసించిన ద్వీపం పేరుమీద, ఒక స్త్రీ సమూహం కేంద్రంగా నీ కవిత్వంలో కనవచ్చే ప్రేమానురాగ సహజీవనసంతోషం Lesbian Tradition గా ప్రసిద్ధి పొందింది. ఒకప్పుడు, అంటే యూరోపుని మతప్రాబల్యం అణచిపెట్టకముందు, ప్రాచీన గ్రీసులో, నీ కాలంలోనూ, నీ తర్వాత కూడా చాలాకాలం పాటు, ఆ సంప్రదాయం పట్ల ప్రజలు గౌరవం చూపించేవారనే విన్నాను. నువ్వు జీవించిన కాలంలో స్త్రీలింకా సమాజకేంద్రంలో ప్రభావశీల పాత్రను నిర్వహిస్తూ ఉండేవారనీ, ఆ తర్వాత, నెమ్మదిగా, ఆ స్థానంలో, పురుషుల మధ్య పరస్పర అనురాగాన్నీ, అభిమానాన్నీ ప్రకటించుకునే కాలం మొదలయ్యిందనీ కూడా ఏథెన్సు చరిత్ర చెప్తున్నది. కానీ క్రీస్తు తర్వాత నాలుగోశతాబ్దం నాటికి, ఆ సంప్రదాయం కూడా దాదాపుగా కనుమరుగై, స్త్రీపురుష సంబంధాల్ని మతపరమైన నైతికసూత్రాలు శాసించే కాలం మొదలయ్యింది. అప్పణ్ణుంచీ, ఇప్పటిదాకా కూడా, ‘లెస్బియన్’ అనే మాట ఒక నిషిద్ధ పదంగా, నిందార్థకంగా, ఏహ్యతనీ, భయాన్నీ రేకెత్తించే పదంగా మారిపోయింది. ఈ చారిత్రిక పరిస్థితి మీద తిరుగుబాటుగా 60 ల్లో అమెరికాలో మొదలైన లెస్బియన్ సాహిత్యం ఈ రోజు ఒక అగ్రశ్రేణి దర్శనంగా మన్నన పొందుతున్నది. జూడీ గ్రేహన్ అటువంటి సాహిత్యవేత్త, సామాజిక దార్శనికురాలు.
ఆమె రాసిన పుస్తకం మూడు వ్యాసాల సంపుటం. స్త్రీల అస్తిత్వం పట్ల నిరుపమానమైన నిబద్ధతతో, కేవలం సాహిత్యంలోనే కాదు, తులనాత్మక సాంస్కృతిక అధ్యయనంలో కూడా ఆమె పాండిత్యంవల్ల ఆ పుస్తకం అర్థం చేసుకోవడం అంత సులభం కాదనిపించింది. కానీ నవీన మహిళ చరిత్రను తిరగరాస్తుందని మా మహాకవి అన్నమాటలకి నిజమైన అర్థమేమిటో ఆ పుస్తకం చదువుతూ ఉంటే అడుగడుగునా తెలుస్తూ ఉన్నది.
ఆమె తాను ప్రతిపాదిస్తున్న విషయాన్ని వివరించడానికి నీ కవిత్వంతో పాటు, తన కవిత్వంతో పాటు, మరొక ఎనిమిదిమంది కవయిత్రుల కవిత్వాన్ని చర్చించింది. తనతో సహా, ఎమిలీ డికిన్ సన్, అమీ లోవెల్, హిల్టా డూలిటిల్ (ఎచ్.డి), గెర్ట్రూడ్ స్టీన్, ఆడ్రియన్ రిచ్, పౌలా గన్ అలెన్, ఆడ్రి లాడ్, అల్గా బ్రూమూస్ ల కవిత్వాన్ని ఆమె నీ కవిత్వానికే కాక, నీ జీవనశైలికీ, నీ విశ్వాసాలకీ, నువ్వు నమ్మిన విలువలకీ కూడా కొనసాగింపుగా ఆమె వివరించిన తీరు అద్భుతం. ఇంకా ఇరవయ్యవ శతాబ్ది పూర్వార్థంలోనే ఉన్న తెలుగు కవిత్వ ప్రపంచంలో, ఆ కవిత్వాల్ని గాని, ఆమె వాటిని అధ్యయనం చేసిన తీరుని గాని వివరించడం చాలా కష్టం. అసలు అటువంటి భావాలు తెలుగువాళ్ళకీ, సమకాలిక భారతదేశానికీ ఊహకి కూడా అందేవి కావు. ఆమె తన మొదటివ్యాసంలోనే సరస్వతీదేవి గురించి ప్రస్తావించినప్పటికీ, చివరి వ్యాసంలో షట్చక్రాల గురించి రాసినప్పటికీ, సమకాలిక భారతీయ సాహిత్యంగానీ, సామాజిక చర్చలుగానీ ఆమె మాట్లాడుతున్నదాన్ని అంత సులభంగా అర్థం చేసుకోలేవు. పైగా అపార్థం చేసుకోడానికే తొందరపడతాయి.
కానీ నీ కవిత్వం గురించి తలుచుకుంటున్నప్పుడు ఆమె ఆలోచనల్నీ, ఆమె ప్రస్తావించిన కవుల కవిత్వాన్నీ తలుచుకోకపోతే, నీ గురించిన నాకెప్పటికీ సరైన అవగాహన ఏర్పడనట్టే. నిజమే, నేనింతదాకా నీ కవిత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు, ప్రేమ గురించీ, సౌందర్యం గురించీ, పూల గురించీ, పరిమళాల గురించీ ఎక్కడెక్కడ ఏ కవులు నీ భావనాసౌకుమార్యం లాంటిదే తాము కూడా ప్రకటించారో వాళ్ళని తలుచుకున్నాను. కాని వాళ్ళకీ నీకూ మధ్య ఒక ప్రధానమైన భేదం ఉన్నదని జూడీ గ్రేహన్ చెప్తున్నది.
అవును, మాకు తెలుసు, ఒకప్పుడు, చరిత్రయుగానికి పూర్వం మానవుడు మనుగడ సాగించిన మన్వంతరాల్లో స్త్రీలే మానవసమాజాన్ని లాలించి, పోషించి, శాసించారని. మాతృస్వామ్యవ్యవస్థగా (matriarchy) చెప్పుకునే ఆ కాలం నిజానికి స్త్రీస్వామ్యం (gynarchy) అనీ, చరిత్ర యుగం మొదలైనతరువాత, అధికారం స్త్రీలనుంచి పురుషులచేతుల్లోకి మారేక, మానవసంబంధాల్లో ఒక అసమవ్యవస్థ, విషమ వ్యవస్థ మొదలయ్యిందనీ ఫెమినిస్టులు వాదిస్తారు. అటువంటి పురాతన స్త్రీ స్వామ్య మహాయుగాల చివరి గడియల్లో, లెస్బోస్ లో ఇంకా ఆ సంప్రదాయాలకు మన్నన కనుమరుగు కాని రోజుల్లో నువ్వు ప్రభవించావనీ, ఒక స్త్రీస్వామ్య సంస్కృతికి నువ్వు చివరి ప్రతినిధి కవివనీ జూడీ గ్రేహన్ ప్రతిపాదన. కాబట్టి నీ యీ కవితలో, చిటారుకొమ్మన ఉన్న యాపిల్ పండు, ఆ పురాతన స్త్రీస్వామ్య విలువలనీ, దాన్ని పురుషస్వామ్యం అందుకోలేకపోయిందనీ ఆమె ఈ కవితను వ్యాఖ్యానిస్తున్నది.
సామాజిక సంబంధాలు స్త్రీకేంద్రకంగా ఉన్నప్పుడు అక్కడ ఆధిపత్యానికి బదులు సహకారం, శాసించడానికి బదులు ఒప్పించడం, పాలించడానికి బదులు పోషించడం ప్రధానంగా ఉంటాయనీ, అటువంటి వ్యవస్థలో మానవసంబంధాలు సమతలసంబంధాలుగా నిలబడతాయనీ స్త్రీవాదులు చెప్తున్నారు. అక్కడ కూడా ప్రేమలు ఉంటాయి, కాని అవి ప్రత్యుత్పత్తి ప్రధానంగా కాక, ఉత్పాదకత ప్రధానంగా ఉంటాయి. అక్కడ కూడా అలకలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, కాని అవి మనుషుల మధ్య అనురాగబంధాన్ని మరింత మధురతరం చేసేవిగా మాత్రమే ఉంటాయి. అక్కడ పోటీ ఉండదు, ఒకరి చేతినందుకుని మరొకరు కలిసి నడవడమే ఉంటుంది. అటువంటి ఒక యుటోపియాను నీ కవిత్వంలో దర్శించడానికి జూడీ గ్రేహన్ చేసిన ప్రయత్నం నన్ను అబ్బురపరిచింది. ఆమె ఆలోచనలు వింటున్నంతసేపూ నా కళ్ళముందొక ఆదర్శలోక కదలాడుతూనే ఉంది.
నువ్వు కవిత్వం చెప్పినప్పుడు, అది ఒక House of Muses అనీ ఒక House of Women అనీ , నువ్వు దేవతలతోనూ, నీ స్నేహితురాళ్ళతోనూ కలిసి ఒక ప్రేమప్రపంచాన్ని నిర్మించావని ఆమె నీ కవిత్వ శకలాలమీంచే నాకు నచ్చచెపుతూ ఉంది. అటువంటి ప్రపంచాన్ని నమ్మిన స్త్రీలు మధ్యయుగాల యూరోపులో మంత్రగత్తెలుగా ఇంక్విజిషనుకు గురై సజీవదహనమవుతూ వచ్చారనీ, చివరికి పందొమ్మిదో శతాబ్దపు ఎమిలీ డికిన్ సన్ దగ్గరికి వచ్చేటప్పటికి, ఆ స్త్రీ తన ఇంటికీ, తన గదికీ, తన ఏకాంతమనోమందిరానికీ పరిమితమైపోయిందని ఆమె ఎంతో విశ్వసనీయంగా వివరించింది.
ఎమిలీ తన వదిన సుసాన్ ని ప్రేమించిందని విన్నాం. కానీ ఆమె కవిత్వాన్ని ప్రచురించిన తొలి సంపాదకులు అందులో ఎమిలీ సుసాన్ పట్ల తన ప్రేమని ప్రకటించే భాగాల్ని తొలగించో, లేదా దిద్దుబాట్లు చేసో, లేదా విక్టోరియన్ యుగ నైతికతకు అనుగుణంగా సర్దుబాటుచేసో ప్రకటించారని కూడా ఇప్పుడు మాకు తెలుసు. అందుకని, ‘Heaven’-is what I cannot reach అనే కవిత, నీ కవితను దృష్టిలో పెట్టుకుని, ఏమిలీ తనకి అలభ్యమవుతున్న ప్రేమ గురించి రాసిన కవిత అని జూడీ చెప్తున్న మాట నమ్మదగ్గదే అనిపించింది. ఈ కవిత:
‘స్వర్గం’-నేనెన్నటికీ అందుకోలేనిది
చెట్టుమీది యాపిల్ పండు-
ఆ కొమ్మమీద వేలాడుతున్నది-అందకున్నది
ఆ- స్వర్గం- నాకోసమే.
ఆ రంగు, కదలాడుతున్న ఆ మేఘం
ఆ నిషిద్ధ చరమసీమ-
ఆ కొండ వెనక- ఆ ఇంటి వెనుక
అక్కడ- అక్కడే స్వర్గం- కనిపిస్తున్నది!
ఊరించే ఆ ఊదారంగు అపరాహ్ణాలు
అమాయికంగా తగులుకునే ఉచ్చులు
మోహపెట్టే ఆ ఇంద్రజాలాలు
గతంలో నన్నెన్నోమార్లు మోసపుచ్చినవి.
ఈ యాపిల్ నువ్వు ప్రస్తావించిన యాపిల్. ఏదోను ఉద్యానంలో ఆదిస్త్రీపురుషులు కూడా ఒక యాపిల్ ని చూసారు. అది కూడా నిషిద్ధఫలమేగాని దాన్ని వారు ఆరగించారు. అప్పణ్ణుంచీ మనిషి పుట్టుకతోనే ఒక ఆదిమపాపవారసత్వాన్ని నెత్తినపెట్టుకుని పుడుతున్నాడని మతం భావించింది. కానీ నువ్వు ప్రస్తావించిన యాపిల్ ఎవరికీ అందనిది. అది కొమ్మలన్నిటిపైనా చిటారుకొమ్మన పండిన పండు. దాన్ని అందుకోలేకపోవడమంటే, ఊరించే స్వర్గాన్ని ఎప్పటికీ చేరుకోలేకపోవడమేనని డికిన్ సన్ గ్రహిస్తున్నది.
డికిన్ సన్ వారసులుగా అమీ లోవెల్, హిల్డా డూలిటిల్ అనే ఇద్దరు కవయిత్రులు తమ తమ జీవితాల్లో ప్రవేశించిన స్త్రీల ద్వారా తమకి అందుతున్న ప్రేమ గురించి రాసారుగాని, ఆ కవితల్ని ఏ సంపాదకులూ తమ సంకలనాల్లో చేర్చలేదని జూడీ చెప్తున్నది. వారి తర్వాత తన స్త్రీ ప్రేమని గెర్ట్రూడ్ స్టీన్ కొంత వరకూ చెప్పుకోగలిగిందనీ, కానీ, ఆడ్రియన్ రిచ్ తర్వాతనే స్త్రీలు తమ లెస్బియన్ భావోద్వేగాల్ని బహిరంగంగా పంచుకోగలిగే పరిస్థితి మొదలయ్యిందనీ జూడీ చెప్తున్నది.
అమెరికాలో అరవైల్లో తెరిచిన ఈ తలుపులు ఇప్పటికి బార్లా తెరుచుకున్నాయి. ప్రస్తుత అమెరికా సమాజం సెక్సిస్టుగా, రేసిస్టుగా, హింసాత్మకంగా, యుద్ధోన్మాదంలో కూరుకుపోతున్నకొద్దీ దాన్ని మానవీయం చేయడానికి ప్రయత్నిస్తున్న శక్తుల్లో లెస్బియన్లు కూడా ముందున్నారు. అటువంటి మానవతా శీల చైతన్యాన్ని ప్రోది చేస్తున్న లెస్బియన్లు తమతో పాటు ఆదిమ ఇండియన్, ఆఫ్రికన్, యూదు, గ్రీకు సంస్కృతుల్లోని దేవతల్నీ, ప్రభావశీల సంస్కారాల్నీ, ప్రాణశక్తుల్నీ ముందుకు తీసుకొస్తున్నారు. వారిప్పుడు universal సంస్కృతికి బదులు common tradition కోసం అన్వేషిస్తున్నారు. మనం ‘విశ్వజనీన విలువలు’ అని అంటున్నప్పుడు అంతిమంగా అది ఏకపార్శ్వ, అఖండతావాద ధోరణిగా మారి తమలో అల్పసంఖ్యాకుల్ని అణచివేసేదిగా మారుతుంది. అలాకాక ‘ఉమ్మడి సంప్రదాయం’ అని అంటున్నప్పుడు, అందులో, ఎవరి ప్రపంచాలూ, ఎవరి విశ్వాసాలూ, ఎవరి నమ్మకాలూ వారు కాపాడుకుంటూనే తాము ఏకీభవించే తావుల్ని గుర్తుపడతారు. పురుషకేంద్ర భావజాలం అంతిమంగా totalitarian అవుతుందనీ, స్త్రీకేంద్ర చైతన్యం మాత్రమే ఉమ్మడి భాషనీ, ఉమ్మడి సంప్రదాయాన్నీ, ఉమ్మడి జీవితాన్నీ ప్రోత్సహిస్తుందనేది జూడీ గ్రేహన్ ప్రతిపాదన.
ఇప్పటి ప్రపంచంలో లెస్బియన్లను marginalized సమూహంగా పరిగణిస్తున్నారు. నల్లవాళ్ళు, గేలు, యూదులు, అల్ప సంఖ్యాక వర్గాలు, గిరిజన తెగలు, మూడో ప్రపంచపౌరులు, కార్మికులు, సక్రమంగానూ, అక్రమంగానూ కూడా వలసవచ్చినవాళ్ళు- వీళ్ళందరినీ కూడా ప్రస్తుత ప్రపంచం marginalised గానే పరిగణిస్తున్నది. అసలు ఈ marginal అనే పదాన్నే జూడీ ప్రశ్నిస్తున్నది. అంటే మనమింకా కొలంబస్ లానే ఈ ప్రపంచం బల్లపరుపుగా ఉందని నమ్ముతున్నామనీ, కానీ, ప్రపంచం గుండ్రంగా ఉందనీ, కాని మన ప్రాపంచిక దృక్పథంలోనే ఆ పూర్ణత్వం జాగృతం కావలసి ఉందనీ ఆమె చెప్తున్నది.
జూడీ రాసిన మూడు వ్యాసాల్లోనూ ఎన్నో వాక్యాలు నేను అండర్ లైను చేసుకున్నాను. వాటన్నిటి గురించీ నా ఆలోచనలు పంచుకోవడమంటే అది మరో పెద్ద పుస్తకం అవుతుంది. ఇప్పటికి నేను నీకు చెప్పగలిగేదల్లా, మధ్యయుగాల ప్రపంచం నీ కవిత్వాన్ని తగలబెట్టి ఆనవాళ్ళు లేకుండా చేసానని అనుకున్నదిగానీ, నీ కవిత్వశకలాల్లోంచే ఒక నవ్యప్రపంచాన్ని ఈ స్త్రీలు ఆవిష్కరిస్తున్నారు. ఆమె రాసిన ఈ చివరి వాక్యాలు చూడు:
Perhaps we are closer to recovering large portions of Sappho’s world than we realize. By integrating our fragmented selves, and by inverting the patriarchal order and world view, we work to create a new paradigm, a new thought from Thought Woman’s weaving basket, a new dream, a common language hitherto forgotten or suppressed, a common mind, a new possibility for recovering our highest apple: the special uses of love, beauty and intelligence with which it is possible to live lives of grace and meaning.
నాకు ఈ సందర్భంగా ఒక సంగతి గుర్తొస్తోంది. మా తెలుగులో ఇటువంటి ఆలోచనలే సావిత్రిగారి ద్వారా వింటూండేవాణ్ణి. ఆమె తన ఇల్లు వదిలిపెట్టి తన పిల్లలిద్దరినీ తీసుకుని రాజమండ్రిలో ఒక చిన్నపాకలో నివాసముండేవారు. ఆ ఇల్లు మా ఆఫీసుకి దగ్గరలో ఉండేది. దాంతో ఎప్పుడు తీరిక దొరికినా నేను పోయి ఆమె దగ్గర కూచునేవాణ్ణి. ఒకమధ్యాహ్నం ఆమెని కలిసినప్పుడు ఆమె ముఖంలో గొప్ప సంతోషం తాండవమాడుతుండటం గమనించాను. ఏమిటి విశేషం అనడిగాను. ‘రాత్రి మా అమ్మగారు నాకు కలలోకి వచ్చారు. ఆమె రెండెండ్ల బండిమీద పంట మూటలుగట్టుకుని తనే బండి తోలుతున్నట్టు కనబడ్డారు. మా నాన్న కాదు, మా పొలంలో పనిచేసే మనుషులు కాదు, స్వయంగా మా అమ్మగారే పంట బండికెత్తి తానే బండితోలుతున్నట్టు కలలో కనిపిస్తే, పురాతన మాతృస్వామ్యసమాజం మళ్ళా ప్రత్యక్షమైనట్టే అనిపించింది’ అని పరవశిస్తూ చెప్పారామె. ఇదుగో, ఇప్పుడు నీ కవిత్వం చదువుతుంటే, నీ కవిత్వం మీద జూడీ గ్రేహన్ ఆలోచనలు చదువుతుంటే, నా కళ్ళముందు కూడా అటువంటి ఒక స్వర్గం కదలాడుతున్నది.
17-5-2026


ఈ ఉషోదయ వేళలో…
ఇది చదువుతుంటే
నిశ్శబ్దంలో నిలిచిన స్వరాలు
అక్షరాల్లో నిద్రపోయిన యుగాలు
చరిత్రలో చేతులు చాచి పలకరించాయి
నేను స్వప్నాల గుండా
చరిత్రల గుండా
మానవ హృదయాల లోతుల్లోకి నడిచాను
ఈ ఉషోదయాన
ఆ కవిత్వంతో నాకు పరిచయం లేకపోయినా
కొన్ని జీవితాలు
కొన్ని ప్రశ్నలు
కొన్ని నిశ్శబ్దాలు
కొంత వెలుగు
మనసు లోతుల్లోకి జారిన అనుభూతి కలిగింది
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
చదువుతూ పోయాను. కొమ్మ చిగురున అందని ఆపిల్ కనపడుతూనే ఉంది. ఆహా… నమస్సులు
ధన్యవాదాలు మేడం!