క్రమం తప్పని కోకిల

ఈ చైత్రమంతా ఇళ్ళు, వీథులు, భవనాలు
చివరికి గోడలమీద కూడా ఆకుపచ్చ వెలుగు
మరొకవైపు నా నిద్రలో, మెలకువలో రంపాలు
మనిషి మనిషిని వధిస్తున్న దృశ్యాలు, వార్తలు.

ఈ రెండు ప్రపంచాల్నెలా కలుపుకోవాలో తెలీదు
వధించేవాడూ చిత్రవధకి గురవుతున్నవాడూ ఇద్దరూ
నా బతుక్కి అర్థం లేకుండా చేస్తున్నారు, పూల
గాలులు కురిపిస్తున్న తేనెలో విషం కలుపుతున్నారు.

అశక్తుడిగా రోజు గడుపుతాను, నిస్సహాయంగా
నిద్రలోకి జారుకుంటాను. ధైర్యం చెప్పే ఒక్క
మనిషి కూడా కనిపించడు, ఒక్క మాట కూడా
వినిపించదు. ఒక్క సత్యం కూడా అగుపించదు.

మళ్ళీ మళ్ళీ చెట్లకేసి చూస్తాను. అవి ఏదో ఒక
సత్యం కోసం బతకవు, ఏదో ఒక సత్యం కోసం
మరణించవు. తామే సత్యంగా మారిన తావులవి.
ఆ సత్యం తెలుసు కాబట్టే కోకిల క్రమం తప్పదు.

14-4-2026

6 Replies to “క్రమం తప్పని కోకిల”

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading