
ప్లేటో సుప్రసిద్ధ రచన ‘సింపోజియం’ లో సోక్రటీసు డయోటిమా గురించి చెప్తాడు. ఆమె వల్లనే తనకి సౌందర్యం గురించీ, ప్రేమ గురించీ తెలిసిందని చెప్తాడు. మామూలు మనుషులు తమకులాంటి సంతతిని కనడం కోసం ఒక్కటైతే నిజమైన ప్రేమికులు సౌందర్యాన్ని సృష్టించడంకోసం చేరువవుతారని డయోటిమా తనకు చెప్పిందని వివరిస్తాడు. (ఆ సంభాషణ పూర్తిగా చదవాలనుకున్నవారు నా అనువాదం ‘ప్రేమగోష్ఠి’ చదవవచ్చు.)
ప్రాచీన గ్రీకు సంస్కృతి పట్ల, దేవతల పట్ల, వారి సౌందర్యోపాసన పట్ల అపారమైన ఆరాధన పెంచుకున్న హోల్డర్లిను తన జీవితంలో కూడా అటువంటి ఒక డయోటిమా కోసం అన్వేషించాడు. అతడు కొన్నాళ్ళు ఒక సంపన్న కుటుంబపు పిల్లలకి ట్యూటరుగా పనిచేసాడు. ఆ రోజుల్లో ఆ గృహిణి సుజెటు గొంటార్డు పట్ల అతడు ఆకర్షితుడయ్యాడు. తన కవిత్వాధిదేవతగా ఆమెను సంభావించాడు. తాను రాసిన Hyperion నవల్లోనూ, కొన్ని కవితల్లోనూ ఆమె ముఖ్యపాత్ర. అటువంటి కొన్ని కవితల్లోంచి మూడు కవితలు ఇక్కడ మీతో తెలుగులో పంచుకుంటున్నాను.
ఈ కవితలకు వివరణ అవసరం లేదనుకుంటాను. ఈ కవితలు చదవగానే కృష్ణశాస్త్రి ‘ఊర్వశి’ గుర్తొస్తే ఆశ్చర్యం లేదు.
డయొటిమాకి
సుందరజీవితమా! శీతకాలంలో లేతమొగ్గలాగా
ఈ ముకుళిత వృద్ధప్రపంచంలో, ఒక్కతెవే వికసిస్తున్నావు.
వసంతకాలపు వెలుగులో చలికాచుకోడానికి
ప్రేమపూర్వకంగా పైకి చేతులు చాపుతున్నావు.
ఆ సుందరమహాయుగాల సూర్యుడు అస్తమించాడు
ఇప్పుడీ మంచురాత్రుల్లో తుపాన్లు ఘూర్ణిల్లుతున్నాయి.
డయొటిమా
రా, నన్ను ఓదార్చు, ఒకప్పుడు నువ్వు పంచభూతాల్నే లాలించినదానివి
స్వర్గవాగ్దేవత సంతోషానివి, కాలచక్ర కల్లోలానివి
శకలాలుగా చిట్లిపోయిన మానవహృదయం ఒక్కటయ్యేదాకా
మానవాళి ప్రాచీన ప్రకృతి, ఆ శాంతస్థిర చిత్తం
ఈ భావోద్విగ్నయుగమ్మీంచి దృఢంగా, ప్రసన్నంగా పైకి లేచేదాకా
చెలరేగుతున్న ఈ సంక్షోభాన్ని స్వర్గశాంతివచనాల్తో అదుపు చెయ్యి
ఓ సజీవ సౌందర్యమా! దుర్బలమానవహృదయసీమకు తిరిగిరా
నిన్ను సమాదరించే గృహాలమధ్యకి, దేవాలయాలకు తిరిగి రా!
శీతకాలంలో వికసించే లేతమొగ్గల్లాగా డయోటిమా జీవిస్తుంది
అంతస్సత్త్వ సంపన్నురాలైనా సూర్యకాంతి ఆమెకి కూడా అవసరం.
కాని ఈ మహారమణీయప్రపంచ సూర్యుడు అస్తమించాడు
గడ్డకట్టిన మంచురాత్రుల్లో తుపాన్లు ఘూర్ణిల్లుతున్నాయి.
డయోటిమా-1
మౌనంగా సహిస్తుంటావు, వాళ్ళు నిన్నర్ధం చేసుకోరు
ఓ పవిత్రజీవితమా! నువ్వు నిశ్శబ్దంగా వాడిపోతుంటావు
అయ్యో! అనాగరికసమూహాలమధ్య నీలాంటివాళ్ళకోసం,
నీ సూర్యకాంతికోసం నువ్వు వెతుక్కుంటున్నావు.
లలితచిత్తులైన ఆ మహాత్ములింకెంతమాత్రం లేరు.
కాలం గడిచిపోతున్నది, కాని దేవతల పక్కన,
వీరుల చెంత, నిన్ను గుర్తుపట్టి నీకులా నిలబడే
ఆ రోజు కోసం నా మర్త్యగీతం వేచివున్నది.
30-10-2025
, నన్ను ఓదార్చు, ఒకప్పుడు నువ్వు పంచభూతాల్నే లాలించినదానివి . మీరు చదువుతున్న, మాకు పంచుతున్న ఈ భావ పరంపరలకి ఎంతో ఆనందంగా ఉంటుంది సర్
ధన్యవాదాలు