
ఆషాఢ మాసపు అపరాహ్ణాల్లో
కొండలమీద పరుచుకునే మేఘాలనీడలు
సాయంకాలపు గోధూళిమధ్య
ఊరంతా ముంచెత్తే అంబారవాల నీడలు
గ్రామాలకింకా కరెంటు రాని రోజుల్లో
వెన్నెలరాత్రుల వెచ్చని నీడలు-
అదొక కాలం.
ఒకరిమీద ఒకరు ఒరిగిపడుతూ
కిక్కిరిసిన నీడలు
ఇళ్ళూ, గదులూ, తెరలూ
బంధాలూ, బాహువులూ
స్నేహాలూ, వైరాలూ కలగలిసిపోయి
ఊపిరాడనివ్వని నీడలు
అదొక లోకం-
ఆ కాలం గూడా గడిచింది.
లోపలా బయటా అని వేరుచెయ్యలేని
ఒక తావుకి చేరుకున్నాను.
నాకు నేనే ఒక దీపం
కనుక నీడలు కూడా లేవు.
ఇప్పుడు నడుస్తున్న కాలమిది.
29-10-2025
The paintings on this post ❤️🙏🏽
“నాకు నేనే ఒక దీపం
కనుక నీడలు కూడా లేవు.“
🙇🏻♀️
ధన్యవాదాలు మాధవీ!
Brilliant, sir. Loved it.
ధన్యవాదాలు మానసా!
Touching… Sir.
ధన్యవాదాలు రామ్ భాస్కర్!
గొప్పగా చెప్పారు
ధన్యవాదాలు సార్!
ఈ కవితలో కవి కాలానుసారంగా మానవ అనుభవాల మార్పును తాత్వికంగా ప్రతిబింబించారు. మొదటి భాగంలో ప్రకృతితో ఏకమై జీవించిన ఒక ప్రశాంతమైన యుగాన్ని గుర్తు చేస్తారు. ఆషాఢ మాసపు మేఘాలు, వెన్నెల రాత్రులు, కరెంటు రాని గ్రామాలు అన్నీ ఆ కాలపు నిర్మలతను ప్రతీకాత్మకంగా సూచిస్తాయి. “అదొక కాలం” అనే పాదం ఆ నిశ్శబ్ద యుగానికి ముగింపు గీత లాంటిది.
రెండో భాగంలో కవి ఆధునిక సమాజపు కిక్కిరిసిన వాస్తవాన్ని చూపిస్తారు — ఇళ్ళు, గదులు, తెరలు, బంధాలు, వైరాలు కలగలిసి ఊపిరాడనివ్వని జీవితాన్ని సృష్టిస్తున్నాయి. “ఊపిరాడనివ్వని నీడలు” అన్న పదబంధం ఆధునిక జీవనంలోని ఒత్తిడికి ప్రతీక. చివరి భాగంలో కవి అంతర్ముఖుడై, తనలోనే వెలుగును కనుగొంటాడు. “నాకు నేనే దీపంగా మారుతున్నాను, కనుక నీడలు కూడా లేవు” అనే వాక్యం ఆత్మజ్యోతి, జ్ఞానోదయం యొక్క సంకేతం. మొత్తంగా ఈ కవిత ప్రకృతిలోంచి మానవ సమాజం దాకా, అక్కడి నుండి స్వీయ అవగాహన దాకా జరిగిన అంతర్ముఖ ప్రయాణాన్ని సూచిస్తుంది.
చాలా చక్కగా కవిత అంతస్సారాన్ని వివరించారు. హృదయపూర్వక ధన్యవాదాలు శైలజ మిత్ర గారు!
.
లోపలా బయటా అని వేరుచెయ్యలేని
ఒక తావుకి చేరుకున్నాను.
నాకు నేనే ఒక దీపం
కనుక నీడలు కూడా లేవు.
ఇప్పుడు నడుస్తున్న కాలమిది.
ఆహా! నాకు నేనే దీపం.
కనుక నీడలు కూడా లేవు.
అత్యద్భుతం ఈ రెండు మాటలు. నమోనమః
ధన్యవాదాలు
వెన్నెల రాత్రుల వెచ్చని నీడలు…..
ఊపిరాడని నీడలు…..
నీడలు లేని కాలం….
ఎంత బాగుంది….
నాకు వెన్నెల రాత్రుల వెచ్చని నీడలే బాగా గుర్తు… ఆరుబయట పడుకుని చిక్కటి చీకటిని, ఆ చీకటిలో మిణుకు మిణుకుమనే తారలను చూస్తూ సమయం తెలియని సమయంలో పడుకోవడం… అదో మరపురాని జ్ఞాపకం
వెన్నెలరాత్రుల వెచ్చని నీడలు.. మా అమ్మమ్మగారి ఊర్లో ఎప్పటికీ మర్చిపోలేని నా బాల్యపు రోజుల నీడలు..
ధన్యవాదాలు సార్!