సుప్రసిద్ధ మరాఠీ రచయిత వ్యంకటేశ మాడ్గూళ్కర్ (1927-2001) రాసినవి నేను చదివినవి రెండే. ఒకటి, బనగర్ వాడి నవల. ఆ నవల నామీద చూపించిన ప్రభావం గురించి నేను గత నలభయ్యేళ్ళుగా పదేపదే చెప్తూనే ఉన్నాను. రెండోది, ఆయన రాసిన కథ ‘ఆంజనేయస్వామివారు.’ మరాఠీ కథాసంగ్రాహంలోని ఈ కథ నలభయ్యేళ్ళ కిందట మొదటిసారి చదివినప్పుడు నాకు ఎంత కొత్తగా అనిపించిందో, ఇప్పుడూ, అంతే తాజాగా ఉంది.
ఈ కథని వ్యాఖ్యానించే పొరపాటు చెయ్యను. ఇది చదువుతున్నంతసేపూ, చదివేకా కూడా మనలో ఎన్నో తలపులు చెలరేగుతూనే ఉంటాయి. కాకపోతే ఒక్కమాట చెప్పగలను. ఒకప్పుడు, అంటే దాదాపు ఎనభై ఏళ్ళ కింద, ఒక గ్రామానికి మాత్రమే పరిమితమైన ఈ మనఃస్థితి ఇప్పుడు దేశమంతా కూడా కనిపిస్తుండటం మనం గమనిస్తున్నాం.
ఒక గ్రామానికి చెందిన మౌఢ్యం మీద గురజాడ అప్పారావు రాసిన ‘మీపేరేమిటి’ తెలుగులో వచ్చిన గొప్ప కథల్లో ఒకటి. కాని ఆ కథలో ఆద్యంతం రచయిత కంఠస్వరం, ఆ authorial voice మనకి వినబడుతూనే ఉంటుంది. ఆ రకంగా, శిల్పపరంగా, ఆ కథ కూడా ఒకింత పరిమితికి లోనైనట్టే. కాని ఈ కథలో author తనని తాను పూర్తిగా దిగమింగుకున్నాడు. ‘ఇది ఇలా జరిగింది’ అని మాత్రమే చెప్తాడు, ఎక్కడా తన అభిప్రాయాలు ఏమీ చెప్పకుండా. గొప్ప ఇతిహాసకారుల లక్షణం ఇది. కాబట్టి నేను చదివిన గొప్ప కథల్లో శిల్పరీత్యా కూడా దీన్నొక అగ్రశ్రేణికథగా లెక్కపెట్టుకుంటున్నాను.
ఆంజనేయస్వామివారు
మరాఠీ మూలం: వ్యంకటేశ మాడ్గ్యూళ్కర్
తెలుగు సేత: సోమంచి యజ్ఞన్నశాస్త్రి
జూను నెలలో ఓనాటి ఉదయం తడితడిగా వుంది. ఆ గ్రామంలోకి ఓ పెద్ద వానరమొచ్చింది ఒంటరిగా. దానితో మరో కోతిగాని, పిల్లలుగాని, మూక ఏమీలేదు. మా ప్రదేశంలో కోతులు ఆరుదు. అందుచేత, వానరం కనిపిస్తే ఆదరంతోనూ, గౌరవంగానూ చూసేవారు. పది పన్నెండేళ్ళ తరవాత కనిపించింది, ఈ వానరం. ఎక్కడినించి వొచ్చిందో, ఎలావచ్చిందో, ఎవరికి తెలుసు, కాని గ్రామంలోకి రాగానే, తోక ఫించెములా ఎత్తి చూపిస్తూ, వూరి మారుతీ దేవాలయంలో జొరబడింది. గర్భగుడిలోకి వెళ్ళిపోయింది. కొంచెం సేపయినతరవాత బయటికొచ్చి, దేవాలయశిఖరంమీద కూర్చుంది, తోక ఆడిస్తూ, ఎండ కాచుకుంటూ కూర్చుంది. ఈ విలక్షణమైన ప్రవర్తన, పూజారి, పాండుభార్య కనిపెట్టింది. పిల్లని చంకనెత్తుకుని బయలు దేరింది. గుర్రాన్ని గడ్డి మేపడానికి పొలానికి తీసుకు వెళ్ళిన మొగుడితో ఈవిషయం చెప్పడం చాలా అవసరమని తోచింది, ఆవిడకి. ఆంజనేయస్వామివారు గ్రామానికొచ్చారు! దేవాలయంలోకి వెళ్లి వొచ్చారు స్వామివారు!
దేవాలయందగ్గిర స్కూలుంది. ఆ స్కూలుకి పిల్లలొచ్చారు, పుస్తకాలు, పలకా బలపం పెట్టుకున్న సంచులతోవొచ్చి, స్కూలు తలుపులు తెరవలేదు కనక వరండామీద కూర్చున్నారు. మాస్టరుగారు ఇంకా టీ తాగడం పూర్తి కాలేదు కాబట్టి, స్కూలు తలుపులు తెరవలేదు.
టెలిగ్రాఫు వైరుమీద పిచుకలు కూర్చున్నట్టు, ఆ వరండా మీద పిల్లలు, దగ్గిర దగ్గిరగా కిక్కిరిసి కూర్చున్నారు. కళ్లు చికిలిస్తూ, ఉదయిస్తున్న సూర్యుడి కాంతి చూస్తున్నారు. అప్పుడు వాళ్లకి కనిపించింది ఆ మారుతి దేవాలయం శిఖరం మీద కూర్చున్న ఆ జంతువు ఆనందంతో, ఆశ్చర్యంతో, భయంతో, వాళ్ల మనసులు ఉప్పొంగసాగాయి. అందులో ఓ ముసల్మాను కుర్రాడు ముందుకొచ్చి, తన సొట్టముక్కు గోక్కుంటూ, ‘కోతి కోతి, గోక్కో నీముక్కు, వీ తోక వంకరోయ్’ అన్నాడు. పిల్లలందరూ వంత పాడారు. అప్పుడు ఆ వానరం, తన నల్లమూతి తెరిచి, పళ్ళు కనిపించేలా ఇకిలించి, అందరినీ వెక్కిరించింది. దేవాలయశిఖరంమీద నాట్యం చెయ్యడం ప్రారంభించింది.
ముసల్మాన్ కుర్రాడు, ఓ రాయితీసి, గురిచూసి వీపుకితగిలేలా, విసిరాడు. దెబ్బతగలగానే, ఆ వానరం ఓ గజం పైకి ఎగిరింది. బాధతో గిలగిల కొట్టుకుంది. కిచకిచమంటూ, ఎగురుకుంటూ, పరుగెడుతూ, రావిచెట్టు ఎక్కిపోయి, పై కొమ్మమీద, ఆకులమధ్య కనిపించకుండా కూర్చుంది. పిల్లలు చెట్టుకిందజేరి, పై నున్నకోతిని ఝుడిపించడం మొదలెట్టారు. ఆ పైన ఉత్సాహం పుట్టుకొచ్చి, అల్లరిగా కేకలేస్తూ, రాళ్ళు రువ్వడం ప్రారంభించారు. రువ్వినరాళ్ళు కోతిదాకా వెళ్లలేదు. జిత్తులమారికోతి, ఈ సంగతి కనిపెట్టింది. రావిచిగుళ్లు తింటూ, హాయిగా కూర్చుంది.
ఈలోగా ఈవార్త పూజారి పాండుకి తెలిసింది. ఆయన గబగబ ఇంటికొచ్చాడు. గిన్నెలో ఓ పూరీముక్క పెట్టుకుని ఆ చెట్టుకింద కొచ్చాడు. పిల్లల్ని తరిమేశాడు. అరిచాడు. ‘ఈ పాపానికి ఎలా పరిహారం చేసుకుంటాను? నాలుగుమూలలనించి నలుగురూ వొచ్చి, ఆంజనేయస్వామి వారిని అల్లరిపెడుతున్నారు. ఆయన మీకేం చేశాడురా!’
పూజారి పిల్లల్ని తరిమినప్పుడు. ఆ తుంటరిపిల్లలు తిట్టుకుంటూ ఆ పూజారి ఆ వూళ్లో ఏయే ఆడపిల్లలతో సరసాలాడాడో, ఎవరెవరితో సంబంధం పెట్టుకున్నాడో ఏకరువు పెట్టడం మొదలెట్టారు.
చేతులోవున్న పూరీ చూపిస్తూ, ‘రావయ్యా! రా, హనుమంతా, తీసుకో దీన్ని ‘ అని ఆహ్వానించాడు. కాని ఆ కోతి చిగురుటాకులు తింటూ పూజారికేసి చూడనన్నా చూడలేదు. పొలానికి వెళుతున్న ముసలి నానా ఈ సంగతి చూసి , పూజారి ‘పిచ్చాడని’ ఎక్కిరించాడు. గడ్డం ఆడిస్తూ, అన్నాడు. ‘పాండూ, ఇవాళ ఏం వారం?’
‘శనివారం, నానా !’
“అయితే పూరీ ఎలా తింటారురా, ఆంజనేయస్వామివారు.”
“మరి.”
‘ఇవాళ ఉపవాసదినంకదా! ఉప్పుడు పిండో, చలిమిడో పెట్టు, స్వామివారికి.”
నానా విఠలభక్తుడు. ప్రతిసంవత్సరమూ కాలినడకవి పండరిపురం వెళ్ళి, విఠోబాదర్శనం చేసుకొచ్చే వార్కరీ బృందంలోవాడు. సాధుపురుషుడు. గ్రామంలో నలుగురినీ పోగుచేసుకుని భజన చేసేవాడు. భజనకి అవసరమైన తాళాలూ, హార్మోనియం, మద్దెల, అన్నీ ఆయనింట్లో వున్నాయి. రామజన్మ, మారుతీజన్మ మొదలయిన పండుగలు చాలా గొప్పగా జరిపేవాడు. ఆ ముసలాయన చెప్పినది, గ్రామంలో అందరూ మన్నించేవారు.
నానా చెప్పినమాట పూజారికి నచ్చింది. గబగబ ఇంట్లోకి వెళ్ళి ఓ గుప్పెడు వేరుసెనగకాయలు తీసుకొచ్చాడు. ఉపవాసంనాడు వేరుసెనగ తినొచ్చు. అది చూపించి ఆంజనేయుడిని బతిమాలడం మొదలెట్టాడు. “దేవా, రా : ఇది తీసుకో! కిందకి దిగు :’
కాని ఆ వానరం కేవలం నాలుగడుగులు కిందకి దిగి తొంగి చూపింది. తెల్లగుడ్లు చమత్కారంగా తెరిచి, మూపింది. పొడుగువేళ్లతో చంకలు గోక్కుంది. చిగురుటాకులు పీక్కుతింది. కోతి తన విన్నపం మన్నించకుండా అక్కడే కూర్చునివుండిపోతే, పూజారి, నానాని పిలిచాడు. ‘నానా ! నా పాపపుచేతులతో ఇచ్చిన తిండి తినడం ఆంజనేయస్వామివారికి ఇష్టం లేనట్టుంది. నువ్వు పెట్టిచూడు’. అప్పుడు నానా ముందుకొచ్చి, వేరుసెనగకాయలు పుచ్చుకుని బతిమాలాడు, కిందికి దిగిరమ్మని. ‘దేవా నే తమ దాసానుదాసుడిని. నా నైవేద్యం స్వీకరించు. నా సత్యసంధత పరీక్షించకు.”
నానా విధాల ప్రార్థించాడు. పుస్తకంలో చదివిన రకరకాల పేర్లు పెట్టి పిలిచాడు. అప్పుడు వానరం కిందకి దిగడం మొదలెట్టింది. అప్పటికి చాలామంది గ్రామస్తులు అక్కడ గుమిగూడారు. మారుతి కిందకి దిగుతూవుంటే, ఆ గ్రామస్తుల మనసు చాలా ఆతురపడింది. వానరం చెట్టు మొదటికొచ్చింది. ఓ కిందికొమ్మమీద కూర్చుంది.
నానా, దగ్గిరకి వెళ్ళి, చెయ్యి తెరిచాడు. వానరం ముందుకి వొంగింది. నానాకి చాలాదగ్గిరగా వొచ్చింది. తన నల్ల చేతులతో ముసిలి నానాచెయ్యి పట్టుకుంది. గమ్మత్తుగా అటూ యిటూ చూసింది. నానా అన్నాడు. ‘తీసుకోవయ్యా, ఎందుకీ సంకోచం?’ ఆ మాట అనగానే, ఆ వానరం నానా చేతిని, మొక్కజొన్నపొత్తు, పళ్ళతో పీకినట్టు పీకింది. గాట్లు పడిపోయాయి, తోక ఆడించుకుంటూ మళ్ళీ చెట్టు పైకొమ్మమీదికి వెళ్లిపోయింది.
ఆ వానరం కొరకగా, నానా, బాధతో గిలగిలలాడిపోయాడు. దిమ్మెరపోయి, కూలబడిపోయాడు. గ్రామస్తులు అతని దగ్గిరకి పరుగెట్టుకుంటూ వొచ్చారు. చేతికి నాటువైద్యం చేశారు. ఆయన్ని చేతుల్లో జాగర్తగా ఎత్తుకొచ్చి, ఇంట్లో పడుకో పెట్టారు. తండ్రిచెయ్యి గాట్లుపడడం చూసి, నానా పెద్దకొడుకుకి ఒళ్ళు మండింది. విత్తులు జల్లే సమయంలో, నానా, ఉపయోగంలేకుండా అయిపోయాడు। ఇప్పుడు రోజుకూలీని చూసుకోవాలి.
ఈ ఆలోచనతో నానా కొడుక్కి చాలా కోపమొచ్చింది. గ్రామస్తులు గుసగుసలాడడం ప్రారంభించారు. నానాకీ, ఆయన కోడలికి ఏదో అక్రమసంబంధముందన్న అనుమానం నిజమే వుండాలి. లేకపోతే ఆ వానరం అలా కరిచివుండదు ! ఆ తరవాత మారుతికి వేరుసెనగకాయలు పెట్టడానికి ఎవరూ ముందుకి రాలేదు. ఎవరికీ ధైర్యం లేకపోయింది. అగ్నిపరీక్షకి ఒప్పుకునేవారెవరు ?
కాని గ్రామంలోకి ఒచ్చిన స్వామివారిని, ఆకలితో వుండిపొమ్మనడమెలా?
పూజారికి వూరుకోడం నచ్చలేదు. తన ఎనిమిది సంవత్సరాల చిన్నపిల్లకి పేరుసెనగకాయలిచ్చి వానరంతో అన్నాడు. ‘దేవా ! ఈపిల్ల ఏ పాపమెరగని చిన్నపిల్ల. దీని దగ్గిరనించయినా తీసుకుతిను.’ ఆ అమాయకపు పిల్ల చేతిలో వేరుసెనగకాయలు పెట్టుకుని, చెయ్యి జాచినప్పుడు, ఆ మర్కటం మళ్ళీ కిందికి దిగింది. దిగి, ఆ పిల్ల పిక్క పట్టుకుని గాట్లుపడి రక్తమొచ్చేలా కరిచేసింది. ఆతరవాత కంసాలి ఇంటిపక్కనున్న నిమ్మ చెట్టు ఎక్కి కూర్చుంది.
పూజారి పెళ్ళాం, గుండె బాదుకుంటూ, కోతిని తిడుతూ, వేళ్లు విరిచింది. తాలూకాపట్టణంలో డాక్టరుగారికి చూపించడానికి, పిల్లని భుజంమీద వేసుకుని పూజారి బయలుదేరాడు. దీనిమీద ప్రజలు గుసగుసలాడారు. ‘పూజారి పెళ్ళాం ప్రవర్తనకూడా మంచిదికాదు. అందుకే, ఆ పిల్ల అమాయకురాలైనా, మర్కటరాజు కరిచేశాడు.’
వానరం ఎవరిచేతినించీ తీసుకు తినడానికి నిరాకరించినప్పుడు, అందరికీ ఆందోళన కలిగింది. తమలపాకులు నములుకుంటూ, చిన్నచిన్న గుంపులుగా ప్రజలు గుమిగూడి, ఈ విషయమే చర్చించడం ప్రారంభించారు.
కంసాలి యింటి నిమ్మచెట్టు నించి, కమ్మరి నేరేడుచెట్టుమీదికి వెళ్ళింది వానరం. అప్పుడు బావి మోటని బాగుచేస్తున్న కమ్మరి, నోట్లో నములుతూ వున్న పొగాకు వుమ్మేసి, ఆ సమీపంలో పిల్లకి పాలిస్తున్న పెళ్ళాంతో అన్నాడు. ‘మనయింటికి వానరమొచ్చింది. వేరుసెనగకాయలు తీసుకురా !
పెళ్ళాం. ‘పిచ్చాడివా ! చావనీ ఆ కోతిని! నీ పని నువ్వు చూసుకో’ అంది,పెళ్ళాం.
“సొంతంగా, పిలవకుండా, మనింటికొచ్చాడే. ఏదన్నా పెట్టితీరాలి.’
పెళ్ళాం కోసం వేచిచూడకుండా, దోసెడు వేరుసెనగకాయలు తీసుకొని, వానరానికి చూపించి, కిందకి రమ్మని పిలిచాడు దానిని. చుట్టుపక్కల ఎవరూ లేరని చూసి, ఆ వానరం కిందికి దిగింది. కమ్మరితొడ కొరికి పారిపోయింది. ఆ గ్రామంలో వున్న ఒక్క కమ్మరి, గాయపడి, పనికిరాకుండా పోయాడు. ఇంక సేద్యానికి కావలసిన పనిముట్లు చేసేదెవడు. పనిముట్లు పాడయితే, బాగుచేసేదెవడు?
ఆ లాపుమర్కటం, పొద్దుటినించి మూడోఝాముదాకా గ్రామంలో ధూం ధాం చేస్తూ తిరిగింది. పిచ్చిఎక్కిన కుక్కలాగ, కనిపించిన ప్రతి మనిషినీ కరవడం ప్రారంభించింది.
అప్పుడు నానా పెద్దకొడుకుకి ఒళ్లు మండిపోయింది. ఆపుకోలేనంత కోపమొచ్చింది. చేతినిండా రాళ్లు పుచ్చుకుని, కోతి ఎక్కిన నేరేడుచెట్టు కిందికి వెళ్ళాడు. కోపంతో కోతిని పుద్దేశించి అన్నాడు. ‘స్వామీ, తాము చాలా గడబిడ చేశారు’. తరవాత ఓ రాయితీసి, గురిచూసి కొట్టాడు. కాని, కోతి ఆ దెబ్బ చాలా నేర్పుగా తప్పించుకుంది, ఓ పక్కకి జరిగి, పళ్లు ఇకిలిస్తూ, ఆతని మీదికి ఉరకబోయింది. అతనుకూడా మరోరాయి పుచ్చుకుని దాన్ని బాదడానికి సిద్ధంగా ఉన్నాడు. కాని వానరం పరుగెత్తుకుంటూపోయి, ఓ తోటలో ప్రవేశించింది. రాయి పుచ్చుకుని కాలరుద్రుడై వెనకపడ్డాడు నానాపెద్దకొడుకు.
అతని ఆవేశంచూసి, గ్రామంలో మరికొంతమంది యువకులు, అతనివెంట వెళ్లారు. కర్రలు, రాళ్లు పుచ్చుకునివెళ్ళారు, రెండు మూడు మైళ్లు పరుగెత్తి తరవాత వానరం అలిసిపోయింది. వొచ్చి మీదపడుతున్న రాళ్ల నించి తప్పించుకోడానికి, ఆ వానరానికి శక్యం కాకపోయింది. పది పన్నెండు రాళ్లు తగిలి, ఆ వారం కింద పడిపోయింది. అది కిందపడగానే యువకులందరూ దాన్ని చుట్టు ముట్టేశారు. ఆ వానరం, ఇక లాభం లేదన్నట్టు, చేతులు ఆడించుకుంటూ, దయచూపించమన్నట్టుగా, చుట్టూ తిరగడం మొదలెట్టింది.
అప్పుడు ఆ వూరివర్తకుడి కొడుకు సదా అన్నాడు. నానా కొడుకుతో, ‘ఆ వానరం చూడు. చేతులు జోడించి నన్ను కొట్టొద్దు అంటోంది. మన పాదాలు పట్టుకుంటానంటోంది.’
కావి నానా కొడుకు క్రోధం ఆపుకోలేకపోయాడు. ఆవేశంతో ముందుకెళ్ళి, కోతిని కర్రతో కొట్టాడు. మిగిలిన యువకులు కూడా నిర్దయతో రాళ్ళు రువ్వారు. ముక్కు నించీ, నోటినించీ రక్తం కారుస్తూ, కాళ్ళూ చేతులు ఆడిస్తూ, ఆ కోతి చచ్చిపోయింది. అప్పుడు వానరం రెండుచేతులూ జోడించివున్నాడు. మొహం నిండా మట్టి పట్టుకుపోయింది.
దావి ఈ దయనీయదశ చూడగా, నానాకొడుక్కి జాలివేసింది. అతను విచారంలో అన్నాడు. ‘మీలో ఎవరైనా ఒక్కరు ఇక్కడుండండి. మేం వెళ్ళి తాళాలు, మద్దెలలు తీసుకొస్తాము. వాయిద్యాలతో వానరాన్ని పూడ్చిపెడదాము” అతని గొంతుక విలక్షణంగా, మృదువుగా వినిపించింది.
చచ్చిపోయిన వానరాన్ని కరుణతో చూస్తూ సదా అన్నాడు. ‘పాపం. మనచేతుల్లో చచ్చింది. జరగకూడని పని జరిగిపోయింది :’అందరి సలహా మీదా, సదా అక్కడే దిగబడిపోయాడు, గద్దలూ అవీ రాకుండా కాయడానికి.
మిగిలిన యువకులు గ్రామంలోకి వొచ్చారు. వానరాన్ని చంపిన విషయం వూళ్లో తెలిసినప్పుడు, అందరూ నమస్కారం పెట్టి, ఈ గ్రామంలో జరిగిన అపరాధానికి క్షమించమని ఆంజనేయస్వామివారిని వేడుకున్నారు. భజనచేసుకుంటూ బృందం పొలానికి వెళ్ళింది. గౌరవపురస్కరంగా, మానసన్మానాలతో ఆ వానరాన్ని, శ్మశానానికి తెచ్చి, మనిషిని దహనం చేసినట్టు తగలబెట్టారు.
నానాకి ఈసంఘటన చాలా ఆందోళన కలిగించింది. ఆయన ఏ ప్రదేశంలో వానరం మరణించిందో, అక్కడ ఓ సమాధి కట్టించాడు, ఇప్పుడు భక్తిపరులు, ఆ దారినవొస్తూ, వెళుతున్నప్పుడు, సాష్టాంగనమస్కారంచేసి కదులుతూ వుంటారు.
Featured image courtesy: Wikimedia Commons
7-10-2025

శుభోదయం సర్. వాస్తవం ఇదే. జంతు ప్రవృత్తిని అర్థం.చేసుకోకుండా దాని స్వభావాన్ని నమ్మకాలతో ముడి పెట్టడం తర్వాత విచారించడం. ఇదే జరుగుతున్నది.మంచి కథని పరిచయం చేశారు సర్. ధన్యవాదాలు
ధన్యవాదాలు మేడం!
మీది మూఢ భక్తిరా అని, తాను కోతిని మాత్రమేనని చెప్పటానికి తన పద్ధతిలో ప్రయత్నించింది. మూర్ఖులు చంపేశారు. చంపేసి కూడా సమాధి కట్టి మళ్ళీ మూర్ఖంగా
దణ్ణాలు పెట్టేరు. ప్రస్తుతం మనదేశంలో జరుగుతున్న కథ అంతా ఇలాటిదే. అవునూ, కోతిలో ఆంజనేయస్వామి వున్నాడని నమ్మిన జనాలు ప్రతి మనిషిలో దేవుడున్నాడని ఎందుకు అనుకోరు?
నిజమే కదా!
భలే మంచి కథ చదివించారండీ! ఇటువంటి కథలు చాలా అరుదుగా వస్తాయి.. !
ధన్యవాదాలు మేడం!
ఇకనుంచి మమ్మల్ని వెంటాడే కథ కూడా 🙏🙏