నరకాగ్నికి సెలవు

పూలని చూస్తూ మాత్రమే మనమీ నరకాన్ని దాటగలుగుతున్నాం అంటాడు ఇస్సా. అతడు నిజంగా నరకాన్ని చూసాడు. డాంటే కూడా నరకాన్ని చూసాడు. కాని ఇన్ ఫెర్నో ముప్ఫై నాలుగు సర్గల్లోనూ కూడా ఎక్కడా ఒక్క పువ్వు కూడా కనబడ్డట్టు నాకు జ్ఞాపకం లేదు. డాంటే చూసిన నరకం మరీ బొత్తిగా మనం రోజూ జీవిస్తున్న జీవితంలానే కనిపిస్తుంది. ఆ నరకంలో నరకయాతన పడుతున్నవాళ్ళంతా రోజూ మనం చూసేవాళ్ళలానే కనిపిస్తారు. వాళ్ళల్లో చాలామందిని మనం పోల్చుకోగలం కూడా. కానీ వాల్మీకి సంగతి వేరు. ఆయన కావ్యనాయకుడికి అయోధ్య అయినా, అడవి అయినా ఒకటే, అక్కడ పూలుంటే చాలు. ఇంకా అయోధ్యకన్నా అడవిపట్లనే ఎక్కువ ప్రీతి అతడికి, ఎందుకంటే అక్కడ కొండలుంటాయి, చెట్లుంటాయి, విరబూసిన పూలుంటాయి కాబట్టి.

విరబూసిన ఒక పూల చెట్టు కనబడగానే ఈ రోజు నరకాగ్నులకి సెలవు ప్రకటించారని సంతోషపడిపోతాడు ఇస్సా. నేనూ ఒక నరకాన్ని చూస్తున్నాను. ఒక నరకంగుండా నడుస్తున్నాను. కానీ పొద్దున్నే మేడమీద నిండుగా విప్పారిన శంఖుపూల తీగని చూడగానే నా మర్త్య శరీరం అక్కడికక్కడే కూలిపోయి నాలోంచి ఒక గంధర్వుడు బయటికొస్తాడు. ఆ నీలం రంగు పూలొక భాషలో మాట్లాడతాయి. అది విద్యాధరులు మాత్రమే అర్థం చేసుకోగల భాష. ఏళ్ళకిందట నేనొక కథలో ఒక పాత్ర మనఃస్థితి గురించి రాస్తూ అతడు తాను భూమ్మీద విద్యాధరుడు కావడం కన్నా ఆకాశంలో విద్యాధరుడై ఉంటే బాగుణ్ణని అనుకున్నాడని రాసాను. కాని ఇప్పుడు నేను భూమ్మీద విద్యాధరుణ్ణి కాగలగినందుకు నిజంగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను చదివిన కవిత్వాలు, పుస్తకాలు నాకు ప్రేమవిద్యని నేర్పాయి. వికసించిన శంఖంపూల తీగని చూడగానే నా నరకాన్ని పక్కకు నెట్టేసుకోగల శక్తి నేను విద్యాధరుణ్ణి కాగలినందువల్లనే సాధ్యపడింది.

ఇంతకీ ఆ నీలం రంగుపూల తీగని అపరాజిత అని పిలుస్తారట. ఆ పూల తీగ తాను అపరాజితగా వికసించడమే కాదు, నన్ను కూడా అపరాజితుణ్ణి చేస్తున్నది.

నరకంలో ఉండే నరకం ఏమిటంటే అది నువ్వొక్కడివే పడవలసి ఉంటుంది. యుధిష్ఠిరుడు స్వర్గానికి వెళ్ళవలసివచ్చినప్పుడు తన వాళ్ళందరూ మధ్యలో జారిపోయినా కనీసం ఒక కుక్క ఆయనకి తోడుగా నిలబడింది. నరకం ఎందుకు నరకమంటే అక్కడ నీకు తోడుగా నిలబడేవారెవరూ ఉండరు. నరకానికి వచ్చేటప్పటికి ఎవరి నరకం వారిదే. నీ మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు, జీవితకాలం పాటు నిన్ను విడిచిపెట్టనని వాగ్దానం చేసినవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మహా అయితే ఒక వాట్సప్ మెసేజి పెట్టగలరు. కాని నరకంలోని నరకం ఏమిటంటే అక్కడ అన్ని కనెక్టివిటీలూ మూగబోతాయి. డాంటేకి ఈ విషయం తెలుసు. కాబట్టే, నరకంలో అడుగుపెట్టేవాళ్ళు అన్నిటికన్నా ముందు ఆశలు వదిలిపెట్టుకుని మరీ అడుగుపెట్టాలని ఆ నరకద్వారం మీద రాసి ఉందని చెప్తాడు.

కాని జీవితం నాకు నేర్పిన గొప్ప విషయం, నువ్వు నరకానికి చేరువయ్యే కొద్దీ, మనుషులు నీకు దూరమవుతూ ఉండవచ్చేమోగాని, అనుగ్రహం మాత్రం నిన్ను వదిలిపెట్టదని. ఇంకా చెప్పాలంటే, నరకం వల్ల మాత్రమే నువ్వు అనుగ్రహాన్ని గుర్తుపట్టగలుగుతావు. నువ్వెంత నరకం చూస్తూ ఉంటే, అంత దగ్గరగా అనుగ్రహాన్ని పోల్చుకోగలుగుతుంటావు. అందుకనే డాంటే నరకంలో ఇలా అడుగుపెట్టాడో లేదో అలా వర్జిల్ ప్రత్యక్షమయ్యాడు. తనని డాంటేకి తోడుగా ఉండమనీ, దగ్గరుండి మరీ నరకం దాటించమనీ బియాట్రిస్ చెప్పిందని చెప్తాడు.

I am Beatrice who send thee.. Love moved me, that makes me speak

అని అన్నదట ఆమె వర్జిల్ తో.

Love moved me.

ఆ ఒక్క వాక్యం వినడానికేనా ఒక జీవితకాలం నరకంలో గడపవచ్చు. నువ్వు నరకంలో అడుగుపెట్టావని తెలియగానే ఒక దేవత హృదయం కరిగి, ఆమెకు ప్రేమ కలిగి, ఒక దూతని నీ దగ్గరకు పంపిస్తే, అలా ఒక ప్రేమ వాక్యం వినబడుతుందని తెలిస్తే, నేను ప్రతి రోజూ నరకంలో గడపడానికి సిద్ధపడగలను.

నువ్వు మామూలు జీవితం జీవిస్తున్నంతసేపూ నీకు అనుగ్రహమంటే ఏమిటో తెలియడం కష్టం. ఇంకా తెల్లవారకుండానే కమ్మరి కొలిమిలో తిత్తులూదినట్టుగా కోకిల నీ ప్రభాతాల్లోకి ప్రాణం పోస్తూ ఉండటంలోని మహిమ ఏమిటో నీకు తెలియాలంటే, నువ్వెంత నరకం చూసిఉండాలి.

తెల్లవారి మేడమీదకు వెళ్ళగానే రాత్రంతా నీకోసం కూడబలుక్కుని మరీ ఆ మందారాలు, ఆ దేవకాంచనాలు, ఆ ఈజిప్షియన్ క్లస్టర్లు విరబూసాయని నువ్వు గుర్తుపట్టాలంటే ఎన్ని అనవసర పరిచయాల్ని నువ్వు పక్కన పెట్టేయగలిగి ఉండాలి.

అవును. నరకాన్ని కూడా ధిక్కరించగలవి పువ్వులు మాత్రమే. వాటికి తెలుసు, జీవించేది ఒక్కరోజు మాత్రమే. వాటికి మృత్యుభయం లేదు. రేపెలా గడుస్తుందన్న చింతలేదు. ఈ సాయంకాలానికి వాడి నేలరాలిపోతామన్న దిగులు లేదు. వాటికి తెలిసింది ఒక్కటే, ఆ క్షణం, తాము విప్పారుతాయే, ఆ క్షణం, తమ సమస్త అస్తిత్వంతో, ఆనందంతో, లోపల్నుంచీ ఉబికి వచ్చే ధగధగతో, పూర్తిగా, పరవశంతో, అజేయమైన ఆత్మబలంతో, తాము తాముగా పూర్తిగా విప్పారడం. అలా విప్పారిన క్షణం అవి భూమ్మీద స్వర్గాన్ని వికసింపచేస్తాయి. ఆ తర్వాత అవి ఉంటే ఏమిటి? రాలిపోతే ఏమిటి? కనీసం ఆ క్షణం, ఆ ఒక్క క్షణం, నరకలోకం తలుపులు మూసుకుపోతాయి.

అవును, ఇదే గ్రహిస్తున్నాను. రోదించినంతసేపు రోదించాక, కన్నీళ్ళన్నీ ఇంకిపోయేటంతగా హృదయం కరిగి ప్రవహించిపోయేక, భయంతో, నిస్సహాయంగా కుంగిపోయినంతసేపు కుంగిపోయేక, అప్పుడు, అప్పుడు గ్రహించేను, అమృతం ఊటలూరే తావు ఎక్కడుందో. పూలు. పూలకేసి చూడు. ‘ఒక్క పువ్వు రంగు చూస్తూ శతాబ్దాలు బతగ్గలను’ అన్నాడు శేషేంద్ర. అవును, ఆయన కూడా నరకాన్ని చూసాడు. నరకయాతన పడ్డాడు. కాని ఒక్క పువ్వు చాలు నిన్ను పధ్నాలుగు నరకాలనుంచీ బయటపడెయ్యగలదని గ్రహించాడు.

చూడు, జూన్ నెల పొడుగునా తురాయి చెట్ల మిలమిల చూడు. వైశాఖమాసపు తురాయి చెట్లు కావివి. అప్పుడు ఆ చెట్లు జ్వాలాసమానంగా ఉంటాయి. ఒక్క ఆకు కూడా కనిపించని కాలం అది. కాని ఇదుగో ఈ జ్యేష్టమాసపు తురాయిచెట్లు చూడు. కొన్ని పూలు రాలిపోయి ఉంటాయి. మరొకొన్ని వానలు పడుతూనే రాలిపోడానికి మరికొన్ని పూలు సిద్ధంగా ఉంటాయి. ఇంతకు ముందు కనిపించని ఆకుపచ్చని నీడలు ఇప్పుడు ఆ పూల గుబుర్ల చుట్టూ కనిపించడం మొదలుపెడతాయి. దీపాలు ఆరిపోయేముందు ధగధగలాడినట్టు తళుకులీనుతుండే తురాయిపూలకి ఆకుపచ్చని చిమ్నీలు అమర్చినట్టుంటాయి. ఆ ఆకుపచ్చని నీడల్లో ఆ ఎర్రని వెలుగు పడి ఆ ఎర్రటి వెలుగు మీద ఆ ఆకుపచ్చని కాంతి మళ్లా ప్రతిఫలిస్తో ఆకుపచ్చని తెరల వెనక దీపాలు వెలిగించినట్లు ఉండే బాటనొకటినివ్వండి నాకు, ఎటువంటి నరకాన్నైనా నేను సునాయాసంగా దాటేస్తాను.

ఇంతకీ నరకమంటే ఏమిటి? తనని పోయి నరకంలో నడుస్తున్న డాంటేకి తోడుగా నిలబడమని వర్జిల్ తో బియాట్రిస్ అన్నప్పుడు ఆయన అమాయకంగా ఆమెనొక ప్రశ్న అడిగాడు. ‘అమ్మా, నన్ను వెళ్ళమంటున్నావు, నువ్వే వెళ్ళి ఉండవచ్చు కదా, అతడికి తోడుగా నిలబడి ఉండవచ్చు కదా’ అని.

అందుకు బియాట్రిస్ అంది కదా: ‘ఆ నరకలోకంలోని బాధలు నన్ను బాధించలేవు. ఎందుకంటే those things alone are to be feared that have the power of hurting’ అని.

ఇంకా ఇలా అంది:

I am made such by God, in his grace, that your misery does not touch me, nor the flame of this burning assail me.

కాని, ఆమెని, స్వర్గంలో ఉండే మరొక దేవత, లూసియా ఆమె పేరు, ఆమె పంపించిందట, పోయి డాంటేకి స్వస్థత చేకూర్చు అని. లూసియా ని enemy of all cruelty అని వర్ణిస్తుంది బియాట్రిస్.

నరకమంటే బాధపడటం, బాధపెట్టడం. నిజమైన అనుగ్రహానికి నరకం తెలీదు. కాబట్టి ఆ అనుగ్రహ సన్నిధిలో అన్నిరకాల క్రూరత్వాలూ అణగిపోక తప్పదు.

అవును, అనుగ్రహమంటూ ఒకటుందని నీకు తెలియడమే నిజమైన అనుగ్రహం. అనుగ్రహం మరేమీ చెయ్యదు. పువ్వుల్లాగా అది నిండుగా వికసించి ఉంటుంది. మౌనంగా నిన్ను పరికిస్తుంది. అది నీతో ఏమీ మాట్లాడదు. నువ్వేమీ విన్నవించుకోనక్కరేకుండానే అది నిన్ను పరిపూర్ణంగా దీవిస్తుంది.

ఇది కూడా గ్రహించాన్నేను, నరకం నీకు కలిగిన కష్టంలో లేదు, ఆ కష్టం చుట్టూ నువ్వు పెంచిపోషించుకునే, guilt, regret, blaming ల్లో ఉంటుందని. నీకు కష్టం కలుగుతూనే నువ్వొక నరకాన్ని నిర్మించుకోవడం మొదలుపెడతావు. నువ్వు ఏ పని చేస్తే, లేదా ఏమి చెయ్యకుండా ఉండి ఉంటే, ఈ కష్టం తప్పి ఉండేదా అని ఆలోచిస్తావు, పశ్చాత్తాపపడతావు, నీమీద నువ్వు అభియోగ పత్రాలు తయారు చేసుకుంటావు, నీ జీవితంలో నీకు తారసపడ్డ ప్రతి ఒక్కరినీ అపరాధపరిశోధనకి లోను చేస్తావు, ఎప్పటికప్పుడు ఆరోపణ పత్రాలు తయారు చేస్తో, చింపేస్తో, మళ్ళా తయారు చేస్తో-నరకమంటే అదే, మరెక్కడో లేదు.

సరిగ్గా అప్పుడే నీకు తెలీకుండానే ఏ పైలోకాల్లోనో, ఒక బియాట్రిస్, ఒక రేచల్, ఒక లూసియా లు నీ గురించే తలుచుకుంటూ ఉంటారు. ముగురమ్మలు. బియాట్రిస్ ది దివ్యప్రేమ, లూసీ దయామయి, రేచల్ ధ్యానమూర్తి.

‘వెళ్ళు, వెళ్ళి, అతణ్ణి ఆ నరకలోకపు తోవలనుంచి బయట పడెయ్యి’ అని చెప్తూ, కన్నీళ్ళు ఉబికి వస్తున్న తన ప్రకాశమాన నేత్రాల్ని ఆమె పక్కకు తిప్పుకుందని చెప్తాడు వర్జిల్. డాంటే నరకంలో పూల గురించి ప్రస్తావించలేదేమో అన్నాను కదా, పొరపాటు, రెండో సర్గలోనే, బియాట్రిస్ తన తో అలా మాట్లాడగానే, తనలో కలిగిన అనుభూతిని వర్జిల్ ఇలా వర్ణిస్తున్నాడు:

As flowerets, by the nightly chillness blended down and closed, erect themselves all open on their stems when the Sun whitens them; thus I did..

రాత్రంతా చలిలో ముడుచుకుపోయిన కుసుమకళికలు ప్రభాత సూర్యకాంతికి తిరిగి లేచి నిటారుగా నిలబడ్డట్టుగా, so much good daring ran into my heart అని చెప్తున్నాడు వర్జిల్. అంతేకాదు, I began as one set free. తాను విముక్తుడయ్యాడట.

నరకానికి నా కృతజ్ఞతలు. నరకం నాకు తారసపడి ఉండకపోతే నాకొక డాంటేతో పని పడి ఉండేది కాదు, ఒక వర్జిల్ అవసరమయ్యేవాడు కాడు, ఒక బియాట్రిస్ సందేశం నన్ను చేరవచ్చి ఉండేది కాదు. అశోకవనంలో నేనిట్లా శోకిస్తూ ఉండకపోయి ఉంటే, ఒక రామదూత నాకోసం సముద్రాలు ఈది వస్తుండే వాడే కాడు.

పూసిన ప్రతి పువ్వూ ఒక బియాట్రిస్. ఈ నరకాగ్ని ఆ పూలనేమీ చెయ్యలేదు. పువ్వు పూసినంతమేరా నరకానికి సెలవు ప్రకటించినట్టే.

‘పువ్వులు చూడండి, అవి వడకవు, నలుగులాట పడవు. కాని అవెలా వికసిస్తున్నాయో చూడండి. తన సమస్త వైభవంతో కూడిన సొలోమోను కూడా వాటికి సాటిరాలేడని నిశ్చయంగా గలను చూడండి’

అని అంటున్నాడు దైవకుమారుడు. సమస్త శోకాన్నీ పక్కన పెట్టి ఒక పువ్వు ఎదట తదేకలగ్నంగా నిలబడగలిగినప్పుడు ప్రతి ఒక్క మానవుడూ దైవకుమారుడే. మరణించినా పైకి లేవగలిగినవాడే.

22-6-2024

10 Replies to “నరకాగ్నికి సెలవు”

  1. మీ రచన సంఘర్షణ నరకం నుంచి వెలికి వచ్చే దారిని సూచిస్తోంది.నమోనమః.
    అపరాజిత ను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు మాష్టారూ.

  2. “అనుగ్రహమంటూ ఒకటుందని నీకు తెలియడమే నిజమైన అనుగ్రహం. అనుగ్రహం మరేమీ చెయ్యదు. పువ్వుల్లాగా అది నిండుగా వికసించి ఉంటుంది. మౌనంగా నిన్ను పరికిస్తుంది. అది నీతో ఏమీ మాట్లాడదు. నువ్వేమీ విన్నవించుకోనక్కరేకుండానే అది నిన్ను పరిపూర్ణంగా దీవిస్తుంది.”

    This post is so assuring, calming and healing. మాట మాటలోనూ మంత్ర శక్తిని దాచి స్వస్థపరిచి మనిషిని బలోపేతం చెయ్యడానికే రాసినట్టుగా ఉంది.

    ఒక వికసించిన పూవుకు ఈ రోజును ధారపోస్తాను. ❤️

  3. rammohanthummuri – I am a writer, a poet, a head master, a fater, a husband, and a creative person. I primarily in telugu language.
    Thummuri says:

    నా విరిసరాలు నుండి రెండు విరిసరాలు

    పలు రకాల పూలు చూచి
    విపుల విస్తుబోయింది
    తననుండే అవి జనించు
    కిటుకేమిటొ తెలియదంది

    నీ తలపుల తరువును చూస్తే
    నిత్యమల్లె చెట్టు సుమా!
    అది పూవులు పూసినయట్లే
    ఊహలు వికసిస్తాయి నేస్తమా !

  4. సమస్త శోకాన్నీ పక్కన పెట్టి ఒక పువ్వు ఎదట తదేకలగ్నంగా నిలబడగలిగినప్పుడు ప్రతి ఒక్క మానవుడూ దైవకుమారుడే

    ధన్యవాదాలు సర్

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%