
అన్నమయ్య 616 వ జయంతి ఉత్సవాల సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు వారు వారం రోజుల పాటు సాహిత్య సంగీత సభలు ఏర్పాటు చేసారు. అందులో భాగంగా ఒకరోజు సాహిత్యసభకి నన్ను అధ్యక్షత వహించమని అడగ్గానే అది భగవంతుడి పిలుపు గానే భావించి పరిగెత్తుకెళ్లాను. ఆ రోజు పెద్దలు శలాక రఘునాథ శర్మగారు ఒక వక్త, డా. ఇందిర గారు మరొక వక్త. అన్నమాచార్య కళామందిరంలో ఆ జరిగిన సభలో పాల్గోడం ద్వారా నాక్కూడా అన్నమయ్యను నోరారా తలుచుకునే అవకాశం దొరికింది.
అన్నమయ్య గురించి మాట్లాడాలని అనుకోగానే ఒక సుగంధపు భరిణె తెరిచినట్టు ఎన్నో తలపులు గుప్పుమన్నాయి. ఇంతకూ ముందు ఆయన మీద ఒక సమగ్ర వ్యాసం కూడా రాసాను. కాని మాట్లాడిన మాటలే మళ్ళా పునశ్చరణ చేసుకోవలసిన పనిలేకుండానే ఎన్నో కొత్త తలపులు, ముఖ్యంగా జనప్రసిద్ధంగాని ఎన్నో గొప్ప కీర్తనలు నా మనోమందిరం దగ్గర కిక్కిరిసిపోయాయి.
సాధారణంగా అన్నమయ్య కీర్తనలు అనగానే భక్త్యావేశంలోనో, దేవుడి శృంగారాతిశయాన్నో వర్ణించే కీర్తనలే ఉంటాయని అందరూ అనుకుంటారుగాని, గొప్ప కవులందరిలానే ఆయన కూడా తన పాటల్లో తన కాలాన్ని లిఖించిపెట్టాడు. ఆ కల్లోలమయ కాలాన్ని, ఆ సంక్షుభిత సమయాన్ని.
తెలుగు సాహిత్యంలో 15 వ శతాబ్ది చాలా ప్రత్యేకమైంది. అంతకుముందు దాకా తెలుగునేల మీద తెలుగు జీవితానికో లేదా శైవ, వైష్ణవాలకో లేదా హరిహరనాథ తత్త్వానికో సంబంధించిన కవిత్వమే ప్రధానంగా ఉంటూ వచ్చింది. నన్నయ, తిక్కనలు రాజగురువులుగా ఉన్నవాళ్ళు. రాజుకీ, రాజ్యానికీ, ప్రజలకీ కూడా దారిచూపగల అవకాశం ఉండింది వాళ్ళకి. కాని పధ్నాలుగో శతాబ్దం నాటికి పరిస్థితులు మారేయి. అంతదాకా తెలుగు నేలకి కోటగా ఉన్న కాకతీయ సామ్రాజ్యం కూలిపోయింది. మరొకవైపు మహ్మదీయ ప్రాబల్యానికి అడ్డుకట్ట కడుతో ఒకవైపు రెడ్డి రాజులు, మరొక వైపు విజయనగరం కేంద్రంగా సంగమ రాజ్యమూ పాలన మొదలుపెట్టాయి. అదొక సంధికాలం. అంతదాకా తెలుగు కవి పౌరాణిక కాలాన్నే, పౌరాణిక ప్రపంచాన్నే తెలుగులో పునఃసృష్టిస్తూ వచ్చాడు. కాని మొదటిసారి ఇటు ఎర్రాప్రగడ, అటు నాచనసోమన ఇద్దరూ కూడా స్థానిక జీవితంవైపు దృష్టి మరల్చారు. వాళ్ళు కూడా అవే వైష్ణవకథల్నే కావ్యాలుగా రాసినప్పటికీ, ఆ వర్ణనల్లో మొదటిసారిగా తెలుగుసీమ ప్రాకృతిక సౌందర్యం కనిపించడం మొదలుపెట్టింది.
కాని పదిహేనో శతాబ్దికి అంత ప్రశాంతత చిక్కలేదు. అప్పటికి రెడ్డి రాజులు కూడా బలహీనపడటం మొదలుపెట్టి, కొండవీడు కూలిపోయే స్థితికి చేరుకుంది. ఎంతో ఉన్నత ఆశయాలతో, ఉత్తమ సంకల్పాలతో ప్రారంభించిన విజయనగర సామ్రాజ్యం అంతఃకలహాలతో, కుటుంబ కలహాలతో మసకబారడం మొదలుపెట్టింది. మరొకవైపు దక్షిణాపథంలో మహ్మదీయ ప్రాబల్యం వల్ల సామాజిక జీవితంలో కొత్త సంవేదనలు, కొత్త అభిరుచులు, కొత్త జీవితదృక్పథం బలపడటం మొదలుపెట్టాయి. తెలుగు నేల ఒకవైపు రాజకీయంగా అస్థిరమవుతుండగానే, ప్రజాజీవితంలో మార్పుకోసం, కొత్త జీవితాదర్శాలకోసం వెతుకులాట మొదలయ్యింది. తర్వాత రోజుల్లో పద్ధెనిమిది, పందొమ్మిది శతాబ్దాల్లో, ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్ పాలకుల వల్ల దేశంలో సంభవించిన పరిణామాల వంటివే, 15 వ శతాబ్దిలో మహ్మదీయ రాజ్య విస్తరణ వల్ల తెలుగునేలలో సంభవించాయి. దాన్ని మనం సూక్ష్మంగా వివరించలేముగాని, స్థూలంగా దాన్ని ఇహానికి సంబంధించిన ఆసక్తిగా చెప్పవచ్చు. ఒకవైపు యూరోప్ లో రినైజాన్సు, హ్యూమనిజం బలపడుతున్న కాలం అది. తెలుగునేలమీద కూడా అటువంటి ఐహికజాగృతి సంభవించిందని చెప్పవచ్చు. దాన్ని తెలుగు కవులు ‘శృంగార’ అనే పదంతో సూచించారు. పధ్నాలుగో శతాబ్దపు చివరిరోజుల్లోనే శ్రీనాథుడు (1355-1441) ఈ కొత్త మార్పుని పసిగట్టాడు. కాని ఆయన తన జీవితకాలం పొడుగునా ఇహానికీ, పరానికీ మధ్య ఊగిసలాడుతూనే ఉన్నాడు. ఒకవైపు దేహం, మరొకవైపు దైవం ఆయన్ని చెరొకపక్కా లాగుతూనే ఉన్నాయి. పదిహేనో శతాబ్ది చివరిరోజుల నాటికి (1480) పిల్లలమర్రి పినవీరభద్రుడు ఈ కొత్త సంవేదనకి పూర్తిగా అక్షర రూపమిచ్చి శృంగార శాకుంతాలాన్ని రాసాడు. బమ్మెర పోతన (1370-1450) భోగినీదండకంతో తన కావ్యరచన మొదలుపెట్టినప్పటికీ భాగవతకవిగానే తన జన్మసాఫల్యాన్ని సాధించుకున్నాడు. కానీ దేహానికీ, దైవానికీ సంబంధించిన ఈ ఊగిసలాటనుంచి మొదటినుంచీ తప్పించుకున్న కవి అన్నమయ్య (1408-1503) ఒక్కడే. శృంగార, వైరాగ్యాలు రెండింటికీ ఆయన భగవంతుణ్ణే కేంద్రంగా చేసుకున్నాడు.
అన్నమయ్య కాలం నాటికి తాళ్ళపాక ఉదయగిరి పాలనలో ఉండేది. ఆ ఉదయగిరి దుర్గాన్ని బహమనీ సుల్తానుల సహాయంతో గజపతులు వశం చేసుకున్నారు. తెలుగు భాష స్థానంలో ఓఢ్రభాష అధికారభాషగా మారింది. ఈనాడు ఒక ప్రజాస్వామిక నిర్మాణంలో, ఒక సంవిధానం నీడన జీవిస్తున్న మనకి ఆరువందల ఏళ్ళకిందటి ఆ సంక్షోభాన్ని ఊహించడం కూడా కష్టం. తమ భాషకీ, మతానికీ చెందని పాలకుల పాలనలోకి పోవడం వారిని సామాజికంగా ఎంత అతలాకుతలతం చేస్తున్నదో అన్నమయ్య ఈ కీర్తనలో చెప్తున్నాడు:
కాలవిశేషమో లోకముగతియో సన్మార్గంబుల-
కీలు వదలె, సౌజన్యము కిందయిపోయినది.
ఇందెక్కడి సంసారం, బేదెస చూచిన ధర్మము
కందయినది, విజ్ఞానము కడకు తొలంగినది
గొందులు దరిబడె, శాంతము కొంచెంబాయె, వివేకము
మందుకు వెదకిన గానము, మంచితనంపు పనులు.
మరి యిక నేటి విచారము, మాలిన్యంబైపోయిన-
వెరుకలు, సంతోషమునకు ఎడమే లేదాయె
కొరమాలెను నిజమంతయు, కొండలకేగెను సత్యము
మరగైపోయెను వినుకులు, మతిమాలెను తెలివి.
తమకిక నెక్కడి బ్రదుకులు, తడబడే నాచారములు
సమమైపోయినవప్పుడే జాతివిడంబులు
తిమిరంబింతయు బాపగ తిరువేంకట లక్ష్మీ-
రమణుడు గతిదప్పను కలరచనేమియు లేదు.
పరభాషా, పరమతాల ఏలుబడిలోకి పోయిన తమ ప్రాంతాన్నీ, సమాజాన్నీ కాపాడగల దిక్కుకోసం అన్నమయ్యతో సహా ప్రతి ఒక్కరూ మొదట్లో విజయనగర సామ్రాజ్యం వైపు చూసారు. కాని సంగమ రాజవంశంలోని చివరి రాజైన విరూపాక్షరాయల కాలానికి వచ్చేటప్పటికి విలువలు పూర్తిగా భ్రష్టమయ్యాయి. వ్యసనాలకు బానిస అయిన రాయల్ని అతడి కుమారుడు రాజశేఖర రాయలు వధించి సింహాసనం చేజిక్కించుకున్నాడు. ఇంతలోనే అతణ్ణి అతడి తమ్ముడు రెండవ విరూపాక్ష రాయలు వధించి అధికారంలోకి వచ్చాడు. ఈ పరిస్థితుల్ని అన్నమయ్య ఇలా వివరిస్తున్నాడు:
వెరతు వెరతు నిండు వేడుక పడనిట్టి
కురుచబుద్ధుల నెట్లు కూడుదునయ్య
దేహమిచ్చినవాని తివిరి చంపెడు వాడు
ద్రోహిగాక నేడు దొరయట
ఆహికముగ నిట్టి అధమవ్రిత్తికి నే
సాహసమున నెట్టు చాలుదునయ్య
తోడబుట్టినవాని తొడరి చంపెడువాడు
చూడ దుష్టుడు కాక సుకృతి యట
పాడైన ఇటువంటి పాపబుద్ధులు సేసి
నీడనిలువ నెట్టు నేరుతునయ్య
కొడుకునున్నతమతి కోరి చంపెడువాడు
కడు పాతకుడు కాక ఘనుడట
కడలేని ఇటువంటి కలుషవ్రిత్తికి నాత్మ
ఒడబరపగ నెట్లోపుదునయ్య
తల్లి చంపెడువాడు తలప దుష్టుడు కాక
యెల్లవారలకెల్ల నెక్కుడట
కల్లరి అనుచు లోకము రోయు పని ఇది
చెల్లబో నేనేమి సేయుదునయ్య.
యింటి వేలుపు వేంకటేశ్వరు తన వెంట-
వెంట తిప్పెడు వాడు విభుడట
దంటనై ఆతని దాసానుదాసినై
వొంటినుండెద నేమి నొల్లనోయయ్య.
‘వెరతు, వెరతు’ ఇది ఆనాటి కాలం పట్ల అన్నమయ్యకు కలిగిన మొదటి స్పందన.
చివరికి ఈ పితృహంతక, భ్రాతృహంతక రాజవంశంతో విసిగిపోయిన ప్రజల మద్దతుతో సాళువ నరసింహరాయలు విజయనగరాన్ని కైవశం చేసుకుని (1485) సాళువ వంశ పాలన మొదలుపెట్టాడు.
సాళువ నరసింహరాయలు 1450 ప్రాంతం నుంచి తాళ్ళపాక దగ్గరున్న టంగుటూరులో నివాసముంటున్న కారణం చేత, తర్వాత రోజుల్లో చంద్రగిరి పాలకుడిగా ఉండటం చేతా, ఆయనకీ, అన్నమయ్యకీ మధ్య స్నేహం ఉండేది. తన కాలం నాటి రాజకీయ సంక్షోభాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలనేది సాళువ నరసింగరాయడి ఆలోచన. కాని అన్నమయ్య దృష్టి రాజుల్ని మార్చడం మీద లేదు. ఒక రాజవంశం స్థానంలో మరొక రాజవంశం వచ్చినంతమాత్రాన సామాజిక శాంతి, సహజీవనం, సౌభాగ్యం సాధ్యపడవని ఆయన భావించాడు.
మనిషి తన హృదయంలో, తన కుటుంబంలో, తన సమాజంలో దేవుణ్ణి ప్రతిష్టించుకుంటే తప్ప తన చుట్టూ ఆవరించిన నైతిక సంక్షోభం నుంచి బయటపడటం అసాధ్యం అని ఆయన భావించాడు. అందుకని ఒక కీర్తనలో ఇలా అంటున్నాడు:
ఘనుడీతడొకడు కలుగగ కదా వేదములు
జననములు, కులములు, ఆచారములు కలిగె.
కలుషభంజనుడితడు కలుగగ కదా, జగతి
కలిగె ఇందరి జన్మగతుల నెలవు
మలసి ఇతడొకడు ఒడమగ కదా ఇందరికి
నిలువనీడలు కలిగె నిధినిధానములై.
కమలాక్షుడితడు కలుగగ కదా దేవతలు
గమికూడిరిందరును గండి కడచి
ప్రమదమున ఇతడు నిలుపగ కదా సస్యములు
అమర ఫలియించె లోకానందమగుచు.
గరిమె వేంకట విభుడొకడు కలుగగ కదా
ధరయు, నభమును, రసాతలమును కలిగె
పరమాత్ముడిపుడు లోaపల కలుగగా కదా
అరిది చవులును హితములన్నియును.
ఆయన ఉండబట్టి కదా సస్యాలు ఫలిస్తున్నాయన్న మాట ఆండాళ్ తిరుప్పావై లోని రెండవ పాశురాన్ని గుర్తుకు తెచ్చేమాట. పంటలు ఫలించాలంటే రాజకీయ భద్రత అన్నిటికన్నా ముఖ్యం. కాని రాజకీయ భద్రతనే కొరవైన కాలంలో మరి రక్షించేదెవరు? కాబట్టే ఆయన తన జీవితాన్నీ, తన కుటుంబాన్నీ, తన కాలాన్నీ, తన ధనాన్నీ, శక్తియుక్తులు సమస్తాన్నీ శ్రీవేంకటేశ్వరుడికి అర్పితం చేసాడు.
పదిహేనో శతాబ్ది లో తెలుగు జాతి అనుభవించిన ఈ నైతిక సంక్షోభానికి శతాబ్ది చివరి కాలానికి వచ్చేటప్పటికి పినవీరభద్రుడు ఒకరకమైన పరిష్కారాన్నీ, అన్నమయ్య మరొక పరిష్కారాన్నీ ఆశ్రయించారు. పినవీరభద్రుడు శృంగార ప్రధాన కవిత్వం రాసి సాళువ నరసింహరాయలకి అంకితం చేసాడు. అటువంటి గీతాలు తనమీద రాసి తనకి కానుక చెయ్యమని రాయలు అన్నమయ్యను కూడా అడిగాడు. అందుకు అన్నమయ్య నిరాకరించడం, దానికి రాయలు ఆగ్రహించి అన్నమయ్యను చెరసాలలో బంధించడం మనకి తెలిసిన కథనే.
అయితే అన్నమయ్య విశిష్టత ఎక్కడుందంటే ఆయన కొలిచిన వేంకటేశ్వరుడు ఒక కొండకీ, ఒక కోవెలకీ మాత్రమే పరిమితమైన దేవుడు కాడు. తన చుట్టూ ఉన్న సమాజమంతటిలోనూ ఆయన శ్రీవేంకటేశ్వరుణ్ణి చూసాడు. ఈ కీర్తన చూడండి:
ఎవ్వరి కాదన్న నిది నిన్ను గాదంట
యెవ్వరి కొలిచిన నిది నీ కొలువు
అవయవములలో అది కాదిది కా
దని మేలివి మేలననేలా
భువియు పాతాళము దివియు అందలి జంతు
నివహమింతయునూ నీ దేహమే కాన.
నీవు లేనిచోటు నిజముగ తెలిసిన
ఆవల అది కాదనవచ్చును
శ్రీ వేంకటగిరి శ్రీనాథ సకలము
భావింపనీవే పరిపూర్ణుడువు కాన.
ఆయన అనుష్ఠించిన మతం ఏకాంత మతం కాదు. అది ఒక రామానుజ కూటమి. నలుగురినీ కలుపుకుంటూ పోయే సమష్ఠి జీవనం. దాన్నిలా చెప్తున్నాడు:
సహజ వైష్ణవాచార వర్తనుల-
సహవాసమె మా సంధ్య
అతిశయమగు శ్రీహరి సంకీర్తన
సతతంబును మా సంధ్య
మతి రామానుజమతమే మాకును
చతురత మెరసిన సంధ్య.
పరమభాగవత పదసేవనమే
సరవినెన్న మా సంధ్య
సిరివరు మహిమలు చెలువొందగ వే-
సరక వినుటే మా సంధ్య.
మంతుకెక్క తిరుమంత్రపఠనమే
సంతతమును మా సంధ్య
కంతుగురుడు వేంకట గిరిరాయని-
సంతర్పణమే మా సంధ్య.
సాధారణమైన ritual స్థానంలో సంకీర్తనని తీసుకురావడంతో ఆగలేదు ఆయన. వైష్ణవమూ, వైష్ణవుడూ అనగానే ఎవరు వైష్ణవుడు, ఏది వైష్ణవం అనే ప్రశ్నలు తలెత్తడం సహజం. ఆ వైష్ణవం జన్మతో సంక్రమించేది కాదు, ప్రవర్తనశుద్ధితో సాధ్యపడేదని చెప్తున్నాడు. ఈ కీర్తన చూడండి:
మదమత్సరము లేక మనసు పేదై పో
పదరిన ఆసలవాడు పో వైష్ణవుడు
ఇట్టునట్టు తిరిగాడి ఏమైనా చెడనాడి
పెట్టరంటా పోయరంటా పెక్కులాడి
యెట్టివారినైనా దూరి యెవ్వరినైన చేరి
వట్టి ఆసలపడనివాడు పో వైష్ణవుడు.
గడన కొరకు చిక్కి కాముక విద్యల చొక్కి
నిడివి నేమైనా కని నిక్కి నిక్కి
ఒడలి గుణముతోడ ఉదుటు విద్యల చాల
వడదాకి బడలని వాడు పో వైష్ణవుడు.
ఆవల ఒరుల చెడనాడగ వినివిని
చేవమీరి ఎవ్వరిని చెడనాడక
కోవిదు శ్రీ వేంకటేశు కొలిచి పెద్దల కృప
వావివర్తనకలవాడు పో వైష్ణవుడు.
వైష్ణవుడంటే ఎవరో నిర్వచించడంతో ఆగలేదు అన్నమయ్య, దేవుడెక్కడ నిలిచి ఉన్నాడో కూడా వివరిస్తున్నాడు చూడండి:
నీవనగ ఒకచోట నిలిచి ఉండుట లేదు
నీవనుచు కనుగొన్న నిజమెల్ల నీవే.
తన ఆత్మవలెనె భూతముల ఆతుమలెల్ల-
అనయంబు కనుగొన్న అతడే నీవు
తనుగన్న తల్లిగా తగనితర కాంతలను
అనఘుడై మది చూచునతడే నీవు.
సతత సత్యవ్రతాచార సంపన్నుడై
అతిశయంబుగ మెలగునతడే నీవు
ధృతి తూలి ద్రవ్యంబు తృణముగా భావించు-
హతకాముకుడైన అతడే నీవు.
మోదమున సుఖదుఃఖములు ఒక్క రీతిగా
ఆదరింపుచునున్న అతడే నీవు
వేదోక్తమతియైన వేంకటాచల నాథ
ఆదియును, అంత్యంబు అంతయును నీవే.
పరధనానికీ, పరస్త్రీకీ ఎవరు ఆశపడరో అంతిమంగా అతడే వైష్ణవుడు, అతడే భగవంతుడు కూడా అని చెప్తున్నాడు. ఈ దృష్టి కలిగిన తర్వాత కులమతాల సంకుచిత్వాన్ని దాటిపోవడం ఎంతో సులభం అన్నమయ్య లాంటి కవికీ, అటువంటి మనిషికీ. ఈ కీర్తన చూడండి:
ఏ కులజుడేమి యెవ్వడైన నేమి
ఆకడ నాతడె హరినెరిగినవాడు
పరగిన సత్యసంపన్నుడైనవాడు
పరనింద సేయ తత్పరుడు కానివాడు
అరుదైన భూతదయానిధి అగువాడే
పరులు తానే యని భావించువాడు.
నిర్మలుడై ఆత్మనియతి కలుగువాడే
ధర్మ తత్పరబుద్ధి తగిలినవాడు
కర్మమార్గములు గడవని వాడే
మర్మమై హరిభక్తి మరవని వాడు.
జగతిపై హితముగా చరియించువాడే
పగలేక మతిలోన బ్రదికినవాడు
తెగి సకలము నాత్మ తెలిసినవాడే
తగిలి వేంకటేశు దాసుడయినవాడు.
ఇలా కీర్తన వెనక కీర్తన మొత్తం వైరాగ్యకీర్తనలన్నీ ఎత్తి వినిపించాలని ఉంది. గమనించవలసిందేమంటే, జాతి సంక్షోభానికి లోనయ్యినప్పుడు ఆశపెట్టుకోవలసింది రాజుని మార్చడం మీద కాదనీ, ముందు తనని తాను మార్చుకోవడం మీదననీ చెప్పడమే అన్నమయ్య దర్శన సారాంశం. మొదట చూసినప్పుడు ఆయన రాజు కేంద్రంగా కాక, దైవం కేంద్రంగా ఉండే ఒక జీవితాన్నీ, సమాజాన్నీ ప్రతిపాదిస్తున్నాడా అనిపిస్తుంది. కాని చివరికి ఆ దైవం కూడా నీతికేంద్రకం కావడమే అన్నమయ్య వాక్కులోని అమృతం. ఈ కీర్తన చూడండి:
మంచిదివో సంసారము మదమత్సరములు మానిన
కంచును పెంచును ఒకసరింగా తా చూచినను.
ఆపదలకు సంపదలకు అభిమానింపక యుండిన
పాపము పుణ్యము సంకల్పములని తెలిసినను
కోపము శాంతము తమ తమ గుణములుగా భావించిన
తాపము శైత్యమునకు తా తడబడకుండినను.
వెలియును లోపలయును ఒక విధమై హృదయంబుండిన
పలుకును పంతము తానొక భావన తోచినను
తలపున తిరువేంకట గిరి దైవము నెలకొని యుండిన
సొలపక యీనిటికిని తా సోకోరుచెనైనా.
అంతఃశుద్ధిలోంచి బాహ్యశుద్ధి సాధ్యపడుతుంది తప్ప, రాజ్యశుద్ధిలోంచి ఆత్మశుద్ధి సాధ్యంకాదని దృఢంగా నమ్మినవాడు అన్నమయ్య. అటువంటి అన్నమయ్య సంకీర్తనాప్రపంచంలో విహరించి రావడం శ్రీవేంకటేశ్వరునిచరణాల దగ్గర సేదతీరినంత సంతోషంగా అనిపించింది.
2-6-2024
ఒక వేయి బాహువులొనగూడియుండిన
మొకము వాలిచి మీకు మొక్కవలెననిపించె
ఏమి విశ్లేషణము ఏమి లోనారయుటలు
ఏమి చరితల దృక్కు ఎంతగా నిశితము
స్వామి వేంకట విభుని సర్వమ్ము గా దలచి
లేమి వేముల పాట లెక్కగా గొనుటలు
వివరించ గలమీదు విదిత ప్రజ్ఞకు నుతులు
చెవులొగ్గి వినునట్లు చెప్పు నేర్పుకు నతులు
ఆ విమలచరతుడగు అన్నమాచార్యకవి
నీ విధమ్ముగ తెలుపు నిండు మనసుకు స్తుతులు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చిక్కటి మీగడ తరగ పంచదారతో కలిపి సేవించినట్లు ఉంది అండి. మీ స్పందన.
ధన్యవాదాలు అండి.
మీకు పరిపరి ప్రణామాలు.
అద్భుతంగా ఉంది సార్
ధన్యవాదాలు సార్
శుభోదయం, నమస్కారం అండి.
శలాక వారితో మిమ్ములను కూడిన ఛాయాచిత్రాన్ని చూడటం మహద్భాగ్యంగా భావిస్తున్నాను.
శలాక వారి రేడియో ప్రసంగాలు విన్నాను, అద్భుతంగా ఉంటాయి. చక్కని , వినసొంపైన వారి వాక్కుఝరి రస ప్రవాహంలో ఓలలాడినట్లు ఉంటుంది.
బంగారానికి తావి అబ్బినట్లు, శలాక వారి ప్రసంగానికి ముందో వెనుకో – మీ అమృతోపన్యాసం ఉండి ఉంటుంది. వెలుగుకు రాని సరి కొత్త కీర్తనలతో , ఎంతో ఔచిత్యం తో మీ ప్రసంగ ధార సాగి ఉంటుందని నేను అనుకుంటున్నాను.
ఈ వ్యాసంలో ఉటంకించిన కీర్తనలను మీరు ఆలపించి ఉంటారని అనుకుంటున్నాను.
సందర్భానికి తగ్గట్టుగా చరిత్రను కూడా సోదాహరణంగా వివరించారు.
బమ్మెర పోతనామాత్యుడు – తాళ్ళపాక అన్నమాచార్యులు, ఇరువురు దైవం కేంద్రంగానే తమ రచనలను గావించి కైవల్యం పొందారు.
నిజ్జంగా, వారి వారి ఆత్మధృతి శ్లాఘనీయం .
రాజులను నమ్ముకోకుండ , సర్వులకు మేలు చేకూరే పథాన్నె ఎంచుకున్నారు.
మీదైనా శైలిలో చక్కగా, చిక్కగా మంచి రచనను అందించారు. మీకు మిక్కిలి నమస్కారాలు ధన్యవాదాలు.
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పక్కన కూర్చున్న వారు శ్రీ ఆకెళ్ళ విభీషణశర్మ.
అన్నమయ్య నేపథ్యం, చరిత్ర చెబుతూ చక్కని విశ్లేషణ ఇచ్చారు. అన్నమయ్య భక్తి, శృంగార.. ఆధ్యాత్మిక సంకీర్తనలు అన్నీ భగవంతుని వేపే దారి చూపుతాయి.
రాజ్యం సంక్షోభం లో పడ్డపుడు దారి చూపేవారు కవులే కదా. ధన్యవాదాలు, నమస్సులు🙏
హృదయపూర్వక ధన్యవాదాలు మేడం!
మీరు చెప్తున్న సుగంధ భరణి ని ఒక్కసారి చూడాలండి.
మనిషి తన హృదయంలో, తన కుటుంబంలో, తన సమాజంలో దేవుణ్ణి ప్రతిష్టించుకుంటే తప్ప తన చుట్టూ ఆవరించిన నైతిక సంక్షోభం నుంచి బయటపడటం అసాధ్యం అని ఆయన భావించాడు
నీవు లేనిచోటు నిజముగ తెలిసిన
ఆవల అది కాదనవచ్చును
‘వెరతు, వెరతు’ ఇది ఆనాటి కాలం పట్ల అన్నమయ్యకు కలిగిన మొదటి స్పందన.
అన్నమయ్య విశిష్టత ఎక్కడుందంటే ఆయన కొలిచిన వేంకటేశ్వరుడు ఒక కొండకీ, ఒక కోవెలకీ మాత్రమే పరిమితమైన దేవుడు కాడు. తన చుట్టూ ఉన్న సమాజమంతటిలోనూ ఆయన శ్రీవేంకటేశ్వరుణ్ణి చూసాడు. ఈ కీర్తన చూడండి:
ఎవ్వరి కాదన్న నిది నిన్ను గాదంట
యెవ్వరి కొలిచిన నిది నీ కొలువు
ఈ వ్యాఖ్యల్ని నేను అర్థం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసాను.
గొప్ప కవులందరిలానే ఆయన కూడా తన పాటల్లో తన కాలాన్ని
లిఖించి పెట్టాడు.
ఇంత కీన్ అబ్జర్వేషన్ చదివి నాకెంతో సంబరం కలిగింది. మీరు చెప్పినట్టు ఇదొక వెతుకులాట.
మీరు చెప్పే అమృతవాక్కు.
ధన్యవాదాలు మేడం