ప్రతి గీతం ఒక రథోత్సవం

అన్నమయ్య సంకీర్తన లహరి రెండవ సంపుటం అన్నమయ్య ఆధ్యాత్మ కీర్తనల రెండో సంపుటానికి వ్యాఖ్యానం. మొత్తం 519 అన్నమయ్య కీర్తనలకి ప్రతి ఒక్కదానికీ అవతారికా, కీర్తనా, కఠిన పదాలకి అర్థాలూ, భావంతో పాటు విశేషాంశాలు కూడా మొదటిసంపుటంలో కన్నా వివరంగా ఉన్నాయి. ఈ సంపుటానికి డా. కోలవెన్ను మలయవాసినిగారితో పాటు కోటవెంకట లక్ష్మీ నరసింహం గారు కూడా వ్యాఖ్యాతగా ఉన్నారు.

ఈ సంపుటంలో కూడా గాయకులు ప్రజలకి బహుపరిచితం చేసిన ‘తెలిసితే మోక్షము తెలియకున్న బంధము’, ఏ పురాణముల ఎంత వెదికినా’, ‘హరియవతారమితడు అన్నమయ్య’, ‘షోడశకళానిధికి షోడషోపచారములు’, ‘దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు’, ‘వేదములు నుతించగ వేడుకలు దైవారగ’, ‘తందనాన ఆహి తందనాన పురె’, ‘ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు’, ‘కలియుగమెటులైనా కలదుగా నీ కరుణ’, ‘జయమంగళము నీకు సర్వేశ్వరా’, ‘తిరుమలగిరి రాయ దేవరాహుత్తరాయ’, వంటి తెలుగు గీతాలతో పాటు ‘డోలాయాంచల డోలాయాం’, ‘పరమపురుష హరి పరమపరాత్పర’, వంటి సంస్కృత సంకీర్తనలు కూడా ఉన్నాయి.

నిజానికి సంగీతకారులూ, గాయకులూ కొల్లగొట్టుకోవలసిన కీర్తనలు మరెన్నో ఈ సంపుటంలో ఉన్నాయి. చాలా కీర్తనల్లో కనవచ్చేది అన్నిటికన్నా ముందు గొప్ప స్పష్టత. కవి తాను అనుభవిస్తున్న పారవశ్యాన్నో, తాను మనకి చూపించాలనుకుంటున్న సౌందర్యాన్నో, పెన్నిధినో చాలా స్పష్టంగా రూపుగట్టేటట్టుగా పాటలు కూర్చాడు. ఏ కారణం చేతనోగాని, సంగీతకారుల దృష్టి వీటిపైకి పోలేదుగాని, ఈ పుస్తకం చేతుల్లోకి తీసుకున్న ఏ పాఠకుడికైనా ఇటువంటి ప్రతి ఒక్క కీర్తనా పాటలపండగగా అనుభవానికొస్తుందని చెప్పగలను. ఉదాహరణలు పంచుకుందామంటే, ఎన్నో కీర్తనలు నేనంటే నేనని ముందుకొస్తున్నాయి. ఈ కీర్తన చూడండి:

ఇందుకేపో వెరగయ్యీ నేమందును
కుందులేని నీ మహిమ కొనియాడగలనా

అటుదేవతల కెల్ల అమృతమిచ్చిన నీవు
యిటు వెన్న దొంగిలుటకేమందును
పటుగతి బలీంద్రుని బంధించినట్టినీవు
సట రోల కట్టువడ్డచందాన కేమందును.

కలిగి యా కరిరాజు కరుణ కాచిన నీవు
ఇల ఆవుల కాచుట కేమందును
తలప బ్రహ్మాది దేవతలకు చిక్కని నీవు
చెలుల కాగిళ్ళకు చిక్కితిమేమందును

భావించనన్నిటికంటే పరమమమూర్తివి నీవు
యీవల బాలుడవైతి వేమందును
కావించి బ్రహ్మాండాలు కడుపున నిడుకొని
శ్రీ వేంకటాద్రి నిలిచితి వేమందును.

ఇందులో ఉన్న చమత్కారం తేటతెల్లమేగాని, అది ఈ గీతానికి, ‘చేరా’ మాటల్లో చెప్పాలంటే, ఒక వ్యూహం. ఒక రాతిని శిల్పంగా చెక్కడంలో ఉండే వ్యూహం ఇది. ఇలా దశావతారాలో లేదా పల్లెటూళ్ళ పలుకుబళ్ళో ఏదో ఒకటి ఆధారంగా ఆయన ఒక గీతాన్ని నిర్మిస్తాడు. మూడు నాలుగు చరణాల ఆ గీతం అప్పుడొక రథంగా మారిపోతుంది. అందులో దేవదేవుడు ఊరేగడం మొదలుపెడతాడు. ఆ గీతాన్ని మనం పునః పునః పఠిస్తున్నంతసేపూ ఒక రథోత్సవం మన వీనులవిందుగా నడుస్తూనే ఉంటుంది.

శిల్ప పరంగా ప్రతి ఒక్క గీతంలోనూ ఏదో ఒక సరికొత్త ప్రయోగం కనిపిస్తుంది. ఉదాహరణకి ఈ గీతం ఎత్తుకోడమే ఎలా ఎత్తుకున్నాడో చూడండి:

‘అనుచు దేవగంధర్వాదులు పలికేరు
కనకకశిపు నీవు ఖండించే వేళను..’

అని పల్లవి ఎత్తుకోగానే, ఏమని పలికేరు దేవగంధర్వాదులని మనం ఉత్సుకతతో చెవొగ్గుతాం. అప్పుడు చరణమిలా ఎత్తుకుంటున్నాడు:

‘నరసింహా నరసింహా నను గావు నను గావు
హరి హరి నాకు నాకు నభయమీవే
కరి రక్ష కరిరక్ష గతమైరి దనుజులు
సురనాథ సురనాథ చూడు మమ్ము కృపను..’

చాలా గీతాల్లో భాష ఒక తేనెతుట్టగా మారిపోడం చూస్తాం. సుప్రసిద్ధమైన ఈ కీర్తన మరొకసారి చదివిచూడండి:

తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ
సురతవిన్నాణ రాయ సుగుణకోనేటి రాయ

సిరుల సింగార రాయ చెలువపు తిమ్మరాయ
సరస వైభవ రాయ సకల వినోదరాయ
వరవసంతముల రాయ వనితల విటరాయ
గురుతైన తేగరాయ కొండల కోనేటిరాయ

గొల్లెతల ఉద్దండ రాయ గోపాల కృష్ణరాయ
చల్లువెదజాణ రాయ చల్ల పరిమళ రాయ
చెల్లుబడి ధర్మరాయ చెప్పరాని వలరాయ
కొల్లలైన భోగరాయ కొండల కోనేటిరాయ

సామసంగీత రాయ సర్వమోహన రాయ
ధామవైకుంఠ రాయ దైత్య విభాళరాయ
కామించి నిన్ను కోరితే కరుణించితివి నన్ను
శ్రీమంతుడ నీకు జయ శ్రీ వేంకటరాయ

అన్నమయ్య కీర్తనల్లో ద్వితీయాక్షర ప్రాసతో పాటు, యతి స్థానంలో, ప్రథమాక్షర మైత్రి కూడా పాటిస్తాడు. (సంస్కృత కీర్తనల్లో కూడా ఈ నియమాలే క్రమం తప్పకుండా పాటిస్తాడు). అందువల్ల ఆ పదాల ఎంపిక ఎప్పటికప్పుడు కొత్తగా, ఉత్కంఠభరితంగా ఉంటుంది. ‘సామ సంగీత రాయ’ అనగానే యతి మైత్రి ఎలా పాటిస్తాడా అని చూస్తాం. వెంటనే ‘సర్వమోహన రాయ’ అని మనల్ని నివ్వెరపరుస్తాడు. ‘సామ సంగీతరాయ’ అనే పదబంధానికి ప్రాస ఎలా పొదుగుతాడా అని చూస్తే ‘ధామ వైకుంఠరాయ’ అంటూ శ్రోతల్ని చకితుల్ని చేస్తాడు. ‘ధామ వైకుంఠరాయ’ అనగానే ఆ తర్వాతి అక్షరమైత్రివైపు మన దృష్టి పోతుంది. వెంటనే ‘దైత్య విభాళరాయ’ అని వినగానే ఒక గగుర్పాటు కలుగుతుంది. ఇలా ప్రతి కీర్తనలోనూ పదాల పోహళింపుని తరచిచూడటంలో ఒక ఉర్దూ గజల్లో కాఫియా, రదీఫుల్ని పోల్చుకోవడంలో ఎంత సంతోషం ఉంటుందో ఇక్కడా అంతే సంతోషం ఉంటుంది.

భావమూ, భాషా పక్కనపెట్టి, కొన్నిసార్లు తన గీతాల్లో కవిగా తాను చెయ్యగలదేమో చెయ్యలేనిదేమో పదే పదే తర్కించుకుంటూ ఉంటాడు. ఈ గీతం చూడండి:

తెలిసినవాడా గాను తెలియనివాడా గాను
యిల నొక మాట నీకెత్తిచ్చితిగాని

పుట్టించేవాడవు నీవే బుద్ధిచ్చేవాడవు నీవే
యెట్టున్నా నపరాధాలేవి మాకు
అట్టూనున్నవారముగా ననగా నీ చిత్తమెట్టో
కిట్టి వొకమాట అడిగితి నింతే కాని.

మనసులోపల నీవే మరి వెలుపల నీవే
యెనసి అపరాధాలు ఏవి మాకు
నిను నౌగాదనలేము నీ సరివారము కాము
అనవలసినమాట అంటిమింతే కాని

అంతరాత్మవును నీవే అన్నిటా కావగ నీవే
యెంతైనా అపరాధాలేవి మాకు
వింతలేక శ్రీ వేంకటవిభుడ నీ బంటనింతే
వంతుకు నేనొకమాట వాకుచ్చితి గాని.

తానెందుకు భగవంతుణ్ణి కీర్తిస్తున్నాడంటే అది తన వంతుకు వచ్చింది కాబట్టి పాట కడుతున్నాడట. అలాగని తన తాహతూ, తానెవరిని కీర్తిస్తున్నాడో ఆయన స్తోమతు తెలియనివాడు కాడు. ఈ కీర్తన చూడండి:

పురుషోత్తముడవీవు, పురుషాధముడ నేను
ధరలో నా యందు మంచితనమేది

అనంతాపరాధములు అటు నేము సేసేవి
అనంతమయిన దయ అది నీది
నిను నెరగకుండేటి నీచగుణము నాది
నను నెడయకుండే గుణము నీది.

సకలయాచకమే సరుస నాకు పని
సకల రక్షకత్వము సరి నీ పని
ప్రకటించి నిన్ను దూరే పలుకే నాకెప్పుడూను
వెకలివై నను కాచే విధము నీది.

నేరమింతయును నాది నేరుపింతయును నీది
సారెకు నజ్ఞాని నేను జ్ఞానివి నీవు
యీరీతి శ్రీ వేంకటేశ యిట్టే నన్ను నేలితివి
ధారుణిలో నిండెను ప్రతాపము నీది.

చాలా గీతాల గురించి ఇలా రాసుకుంటూ పోవాలని ఉందిగాని, నన్ను చెప్పలేనంతగా ఆశ్చర్యపరిచిన ఒక గీతాన్ని మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను.

కేశవదాసినైతి గెలిచితి నన్నిటాను
యీ శరీరపు నేరాలిక నేలా వెదక

నిచ్చలు కోరికలియ్య నీ నామమె చాలు
తెచ్చి పునీతు చేయ నీ తీర్థమె చాలు
పచ్చి పాపాలణచ నీ ప్రసాదమె చాలు
యెచ్చుకుందు వుపాయాలు ఇకనేల వెదక

ఘనుని చేయగను నీ కైంకర్యమే చాలు
మొనసి రక్షించను నీ ముద్రలే చాలు
మనిషి కావగ తిరుమణి లాంఛనమే చాలు
యెనసెను దిక్కు దెస ఇక నేల వెదక

నెలవైన సుఖమియ్య నీ ధ్యానమే చాలు
అల దాపుదండకు నీ అర్చనమే చాలు
యిలపై శ్రీ వేంకటేశ యిన్నిటా మాకు కలవు
యెలమి నితరములు ఇకనేల వెదక

ఈ గీతంలోని భావంలో కొత్తదనం లేకపోవచ్చు గాని ఆ ‘కేశవదాసి’ అనే ఒక్క పదంతో కవి దేవుడి చరణాలకు లత్తుక దిద్దాడు. జయదేవుడు కూడా తన గీతాలు ‘కేశవ కేళి రహస్యాన్ని’ గానం చేస్తున్నాయని చెప్పుకున్నాడేగాని, తాను ‘కేశవదాసి’ ని కాగలిగానని చెప్పుకోలేదు. ఆ ఒక్క పదంతో అన్నమయ్య శాశ్వతంగా స్వామి చరణాల దగ్గర తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగాడు.

ఏ భాషలోనైనా వాసిలో మాత్రమే కాదు, రాశిలో కూడా సముద్రమంత సాహిత్యం సృష్టించగలిగే వాళ్ళు ఒకరో ఇద్దరో మాత్రమే ఉంటారు.  గ్రీకులో హోమర్, లాటిన్ కి వర్జిల్, చైనా కి దు-ఫు,  తమిళానికి నమ్మాళ్వార్, ఇంగ్లిష్ కి షేక్స్పియర్, జర్మన్ కి గొథే, ఇటాలియన్ కి దాంతే,  ఫ్రెంచ్ కి  విక్టర్ హ్యూగో, బెంగాలీ కి టాగోర్. పారశీకానికి బహుశా ఇద్దరు: రూమీ, హాఫిజ్.  హిందీకి ముగ్గురు: కబీరు, తులసీ, సూర్.  కానీ తెలుగు భాష అదృష్టం ఏమని చెప్పను! ఇక్కడ కనీసం నలుగురు కవులు ఉన్నారు. తిక్కనా, పాల్కురికి సోమనా, పోతనా, అన్నమయ్యా!

27-5-2024

12 Replies to “ప్రతి గీతం ఒక రథోత్సవం”

  1. rammohanthummuri – I am a writer, a poet, a head master, a fater, a husband, and a creative person. I primarily in telugu language.
    Thummuri says:

    చదువుతుంటేనే తన్మయత్వం కలుగుతుంది. అన్నమయ్య పదరథోత్సవం ఊహిస్తే ఎంత వేడుకగా ఉందో. అన్నమయ్య కీర్తనల్లో నేను ముందు యతి ప్రాసల నిర్వహణనే గమనిస్తాను. అది అనన్య సామాన్యము. యతి ప్రాసులు, అంత్య ప్రాసలు గేయ సంబంది ప్రక్రియలకు ప్రాణోద్దీపకములు . అందుకే ఆయన కీర్తనలు అంతగా అలరిస్తాయి.ఇక వైవిధ్యము చెప్పనలవి కానిది. ఒక చేనేత సదస్సులో ఎవరో ఒక గాయని వస్త్రాలకు సంబంధించిన అన్నమయ్య కీర్తన ఆలపించారని తెలిసినప్పుడు , నరేశ్ నున్నాగారు పలు విషయాలకు అన్నమయ్య కీర్తనలను అనుసంధానించినప్పుడు నేను అబ్బురపడుతుంటాను. ఎంత చెప్పుకున్నా తరగని పదపెన్నిధి అన్నమయ్య సాహిత్యం . ప్రతి ఉదయం ఒక కొత్త సాహిత్య లోకాన్ని చూపిస్తున్న మీరు ధన్యులు. ధన్యవాదాలు సర్.

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్!

  2. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి స్వరంలో నిత్యం అన్నమయ్య గీతాలను వింటూ ఉంటాను. మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది.

  3. ఒక తీయని పంచదార చిలుకనో… ఇంకో భక్తి గాన సుధారసమో… ఇంకొక కోయిల గొంతులో ఒయ్యారమో …మరొక పారవశ్యామో గానీ మీ ప్రతి ఆలోచనా ఒక అమృతగుళిక.
    వాటిని మాటల్లో చెప్పడం అద్భుతం కదా? అలా మీ మాటలు రాగాలొలుకుతూ వరుసగా నిలబడ్డాయి.
    మీరనుభవిస్తున్న అనుభూతి ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ… ఆ స్వామిని కన్నుల్లోనే నిలుపుకుని అన్నమయ్య పదాల్లో భక్తి ని అందుకోవాలి.
    ఏడుకొండలు ఎక్కినంత సంబరం. మీకు నమోనమః

  4. అన్నమయ్య సంకీర్తనలు అవి
    ఆత్మ నివేదనలు
    అమృత సేవనా అనుభూతి గుళికలు
    అరుదైన ఇన్ని గీతాలు
    ప్రస్తావించిన మీ ప్రతిభ కు భక్తి కి
    అనురక్తి కి నమస్సులు….

    తిరువాయపాటి రాజగోపాల్

  5. ఇక్కడ కనీసం నలుగురు కవులు ఉన్నారు. తిక్కనా, పాల్కురికి సోమనా, పోతనా, అన్నమయ్యా!

    great sir

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%