సాహిత్యపోషకులు

కిందటేడాది విశాఖపట్టణంలో ఒక రచయితల వర్క్ షాప్ కి హాజరయ్యాను. ఆ సందర్భంగా నా ‘ఎల్ల లోకము ఒక్క ఇల్లై’ పుస్తకం కొన్ని కాపీలు తీసుకుపోయి కొందరు మిత్రులకి ప్రత్యేకంగా పేరుపేరునా అందచేసాను. ఆ మధ్యాహ్నం లంచ్ విరామంలో ఒకామె నా దగ్గరకొచ్చి ఆ పుస్తకం కాపీ ఒకటుంటే తనకికూడా ఇవ్వగలరా అనడిగారు. ఆమె ఎవరో నాకు అప్పటిదాకా పరిచయం లేదు. ఆమె తానొక ఉపాధ్యాయిని అని తనని పరిచయం చేసుకుంటూ నా ‘కొన్ని కలలు, కొన్ని మెలకువలు’ పుస్తకం చదివేననీ, అందుకని ఈ పుస్తకం కూడా చదవాలని ఉందనీ చెప్పారు. కానీ అప్పటికే నేను తీసుకువెళ్ళిన కాపీలు అయిపోయేయనీ, హైదరాబాదు తిరిగివెళ్ళాక ఆమెకి ఒక కాపీ పంపిస్తాననీ అడ్రసు తీసుకున్నాను.

కానీ హైదరాబాదు వచ్చాక ఆ సంగతే మర్చిపోయాను. కొన్నాళ్ళు ఆగేక, ఆమెనే మళ్ళా మొహమాటపడుతూనే గుర్తుచేసేక, చివరికి ఆ పుస్తకం కాపీ ఒకటి ఆమెకి కొరియరు చేసాను.

ఆ తర్వాత ఆరేడు నెలలు గడిచాక ఆమె అమెరికా నుంచి నాకో మెసేజి పెట్టారు. అక్కడ తన పిల్లలు ఉన్నారనీ, వాళ్ళ దగ్గర ఉన్నాననీ, అక్కడొక లైబ్రరీలో నా కథల పుస్తకం ఉందా అని అడిగితే లేదన్నారనీ చెప్తూ, అందుకని తాను ఇండియానుంచి నా కథల పుస్తకం కాపీ ఒకటి తెప్పించి మరీ ఆ లైబ్రరీకి డొనేట్ చేసానని చెప్పారు.

మరొకొన్ని వారాల తరువాత తాను అమెరికానుంచి తిరిగివస్తున్నాననీ, నాకేవైనా పుస్తకాలు కావాలంటే తెచ్చిపెడతాననీ చెప్పారు. రెండువందల డాలర్ల దాకా తాను ఆ పుస్తకాలు కానుగ్గా కొని ఇవ్వగలనని కూడా చెప్పారు.

నా పుస్తకాల విష్ లిస్ట్ చూసుకున్నాను. రెండువందల డాలర్లంటే తక్కువేమీ కాదు. గొప్ప కవిత్వం కనీసం పది పుస్తకాలకు తక్కువ కాకుండా తెప్పించుకోవచ్చు. కానీ ఆమె నుంచి కానుకగా తీసుకోడానికి మనసు అంగీకరించలేదు. ఇప్పట్లో అక్కర్లేదనీ, మరెప్పుడైనా కావాలనిపిస్తే తప్పకుండా అడుగుతాననీ చెప్పి తప్పించుకున్నాను.

కాని ఆమె వదల్లేదు. రెండుమూడు నెలల కిందట మరోసారి మెసేజిపెట్టారు. తనకి తెలిసినవాళ్ళు అమెరికానుంచి వస్తున్నారనీ, ఆ రెండువందల డాలర్ల ఆఫరు అలానే ఉందనీ, ఈసారి మాత్రం నేను తప్పించుకోడం కుదరదనీ చెప్పారామె. ఈ సారి ఆ పుస్తకాలు వద్దనే బదులు, అంత సులువుగా దొరకని పుస్తకాల జాబితా చెప్తే సరిపోతుంది కదా అనుకున్నాను. ఆమె పొద్దున్న చెప్పి సాయంకాలం లోపు లిస్టు పంపించమని అడిగితే నా విష్ లిస్ట్ లోంచి అయిదారు పుస్తకాలు, అంత తేలిగ్గా లభ్యం కానివి రాసి పంపించాను(అలా అయితేనైనా ఆమెకి ఆ ఖర్చు తప్పుతుందని). అవి మొత్తం కలిపి వంద డాలర్లు మించకుండా చూసుకున్నాను. (మరో నాలుగు పుస్తకాలు కలపొచ్చు కదా అని మనసు సణుగుతూనే ఉందిగాని, దాని నోరుమూసేసాను)

వారం పదిదినాల కిందట వారి భర్త నాకు ఫోన్ చేసి తాను ఆ పుస్తకాలు తీసుకుని హైదరాబాదు వచ్చాననీ, ఆ పుస్తకాలు తెచ్చి ఇవ్వడానికి మా ఇంటి అడ్రసు చెప్పమనీ అడిగితే నాకు నోట మాట రాలేదు! ఆ పుస్తకాలు ఆయన స్వయంగా తెచ్చి ఇవ్వక్కర్లేదనీ, పోర్టరు యాప్ లో బుక్ చేస్తే మా ఇంటికి నేరుగా వచ్చేస్తాయనీ చెప్పాను. చెప్పిన గంటకల్లా అయిదు పుస్తకాలు మా ఇంట్లో అడుగుపెట్టాయి.

ఆ పుస్తకాలు రాగానే ముందు అట్టలేసేసాను. ఆ తర్వాత వాటిని బల్లమీద పెట్టుకుని పదేపదే చూసుకున్నాను. వాటిల్లో మొదటిది, A Century of  Modern Chinese Poetry (2023), యూనివెర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రెస్ ప్రచురణ. రెండోది, When The Light of the World was Subdued, Our songs Come Through, A Norton Anthology of Native Nations Poetry (2020) జాయ్ హార్జో సంకలనం. మూడోది, నేను చాలా కాలంగా తెప్పించుకుందామనుకుంటున్న పుస్తకం Lark in the Morning, The Verses of the Troubadours (2005). నాలుగోది, Swedish Poetry Nowadays, An Anthology of 6 Poets in the 21st Century (2016). అయిదోది, Bob Dylan (2027) కవిత్వం పైన విమర్శ వ్యాసాల సమగ్ర సంపుటి. ఆ అయిదు పుస్తకాలచుట్టూ సప్తసముద్రాలూ ఉన్నాయి. చీనానుంచి నేటివ్ నేషన్స్ దాకా ప్రపంచకవులు కోకిలల గుంపులాగా బిలబిల్లాడుతూ మా ఇంట్లో అడుగుపెట్టినట్టుంది.

వెంటనే చదవడం మొదలుపెట్టాను. ఆబగా ప్రతి ఒక్క పుస్తకం తెరిచి కొన్నేసి పేజీలేనా చదవకుండా ఉండలేకపోయాను. రాబోయే రోజుల్లో ఆ ప్రతి ఒక్క పుస్తకం గురించి ఎక్కడ ఎలానూ మీతో పంచుకోబోతున్నాను. కాని ఇప్పటికైతే ఆ వదాన్యురాలికి శుభాశీస్సులు అందచేయడం అన్నిటికన్నా ముందు చెయ్యవలసిన పని.

అదే ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజు నేను విశాఖపట్టణంలో పేరుపేరునా ఎవరెవరికి ఆ పుస్తకాలు స్వయంగా నా చేతుల్తో అందచేసానో వాళ్ళెవరూ ఇప్పటిదాకా కనీసం ఆ పుస్తకం ఒక్క పేజీ అయినా చదివినట్టుగా నాకెప్పుడూ చెప్పలేదు. వాళ్ళే కాదు, ఆ పుస్తకాలు నేను కానుకగా ఇచ్చినవాళ్ళల్లో కొందరు సాహిత్య పత్రికలు నడుపుతున్నారు, కొందరు అంతర్జాల సాహిత్య పత్రికలు నడుపుతున్నారు. వారెవ్వరూ తమ పత్రికల్లో కనీసం ఆ పుస్తకం అందుకున్నామని కూడా రాయలేదు. కనీసం ఆ పుస్తకం మీద తామో, మరొకరో నాలుగు వాక్యాల పరిచయం రాయొచ్చని కూడా వారికి తోచలేదు.

కాని ఇదుగో, ఈ ఉపాధ్యాయిని, సాహిత్యలోకంలో ఎవరికీ అంతగా పేరు తెలియని ఈ సాహిత్యప్రేమికురాలు, నేను ఆమెకి ఒక్క పుస్తకం పంపినందుకు, నా కథల పుస్తకం తెప్పించి మరీ అమెరికాలో ఒక గ్రంథాలయానికి దానం చేసారు. నా కోసం పట్టుబట్టి మరీ ఇలా ప్రపంచకవిత్వం తెప్పించి మా ఇంటికి పంపించారు. ఇటువంటి వాళ్ళనే మా మాష్టారు సాహిత్యపోషకులు అనేవారు. అంతేతప్ప  నెలతిరగ్గానే  కవిగారి ఇంటికి ఒక బియ్యం బస్తా పంపించేవాళ్ళు కాదు అని కూడా అనేవారు ఆయన.

నా చిన్నప్పుడు మా ఊళ్ళల్లో దూరప్రాంతాల నుంచి కళాకారులు వచ్చి ఏదైనా ప్రదర్శన ఇచ్చినప్పుడు ఆ ఊళ్ళో పెద్దలు వాళ్ళకేదన్నా తృణమో, పణమో కానుక చేసినప్పుడు, వాళ్ళు ప్రదర్శన ఆపి మరీ, ముందు ఆ దాతల్ని నోరారా దీవించేవారు. నేను కూడా అట్లానే, నా బ్లాగులో రోజూ రాసే రాతలు ఈ పూటకు ఆపి, ఆమెని నోరారా దీవిస్తున్నాను. ఆమెకీ, ఆమె కుటుంబానికీ సరస్వతీ దేవి ఆశీస్సులు సదా వర్షించాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను.

29-4-2024

10 Replies to “సాహిత్యపోషకులు”

  1. ఎంత బాగా రాస్తారో..ఆమెకి నేను కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాను.

  2. శుభోదయం సర్. ఈ పోస్ట్ చదువుతుంటే నాకు ఇవి మదిలో మెలిగాయి. నాకు దొరకని అరుదైన పుస్తకాలు కావాలంటే నేను తిరుపతి, అనంతపురం ( ప్రతి ఆదివారం) సెకండ్ హాండ్ పుస్తకాల షాప్స్ వెళ్ళితే దొరుకుతాయి. ఎందుకంటే సాహిత్య సభలలో పంచిన పుస్తకాలు, రచయితల మధ్య జరిగిన పుస్తక వాయినాలు అన్నీ అక్కడ ఉంటాయి. ఫలానా వారి పేరుతో ప్రేమతో అంటూ ఉన్న ఆటోగ్రాఫ్ కూడా పుస్తకాలపై ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది, వీళ్ళు కూడా ప్రసిద్ధ రచయితలా అని. తిరుపతి లో అయితే ఇలాంటి పుస్తకాలు ఎక్కువ. పుస్తకానికి, రచనకు విలువ ఇవ్వని రచయితలు,
    సాహిత్య కారులు కూడా ఉన్నారు. నేను పుస్తక ప్రేమికుడి మాత్రమే. నమస్కారాలతో

    1. మీ వంటి పుస్తక ప్రేమికులే ఈ లోకానికి ఊపిరి.

  3. Rajendra Prasad Maheswaram – Hyderabad – Nothing great. Just a simple person who loves my village and my roots from my village. Loves to be there and share all the joys with my people living there.. Loves to keep all my memories of staying close to my father in my village and ancestral house.. My village is my paradise...
    రాజేంద్ర ప్రసాద్ maheswaram says:

    చక్కగా సెలవిచ్చారు . ఆ కోవలోని వారిని చాలామందిని చూశాను.

  4. పుస్తకప్రేమాభిరామ వదాన్య వనితాశిరోమణికి నమస్సుమాంజలి.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%