
ఎనిమిదో తరగతి క్లాసు. తాడికొండలో ఆ తాటాకు పాక తరగతి గదిలో హీరాలాల్ మాష్టారి గొంతులోంచి కన్నీరు ప్రవహిస్తోంది. ఆయన తిరిగి తిరిగి అవే కవితాపంక్తులు పలుకుతూ ఉన్నారు:
వహ్ ఆతా
దో టూక్ కలేజో కే కరతా
పచ్ తాతా
పథ్ పర్ ఆతా
సూర్యకాంత్ త్రిపాఠీ ‘నిరాలా’ రాసిన కవిత ‘భిక్షుక్’. మా పాఠ్యపుస్తకంలో కవిత. కబీర్ దోహాల్ని వినిపించినప్పటిలాగా మాష్టారి స్వరం శాంతంగానూ, మధురంగానూ లేదు. ఆ కవిత పదే పదే ఆయన చదువుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు తాను పోగొట్టుకున్న ఏ స్నేహితుడో, లేదా జీవితపు ఏ మలుపులోనో పోగొట్టుకున్న ఏ చల్లనిచెట్టునీడనో తనకి పదే పదే గుర్తువస్తున్నట్టుంది.
దాదాపు యాభై ఏళ్ళు గడిచాయి, ఆ కవిత ఆయనట్లా చదవడం విని. మళ్ళా ఆ పాఠ్యపుస్తకం తెరిచింది లేదు, ఆ కవిత మళ్ళా చదివింది లేదు. కాని ఈ వాక్యాలు ఎవరో ఒక ముల్లుతో హృదయం మీద గీతలు గీసిపోయినట్టుగా నా స్మృతిలో భాగమైపోయాయి.
పేట్ పీట్ దోనోఁ మిలకర్ హై ఏక్
చల్ రహా లకుటియా టేక్
ముట్టీభర్ దానే కో-భూక్ మిటానే కో
ముహ్ ఫటీ పురానీ జోలీకా ఫైలాతా
దో టూక్ కలేజో కే కరతా
పచ్ తాతా పథ్ పర్ ఆతా
‘దో టూక్ కలేజో కే కరతా-‘ ‘హృదయాన్ని రెండు ముక్కలు చేస్తూ-‘
ఆ బిచ్చగాడు రోడ్డుమీద నడిచి వస్తున్న దృశ్యం నా కళ్ళముందు నిలబడిపోయింది. అప్పటికి నేను శ్రీ శ్రీ ‘భిక్షువర్షీయసి’ కూడా చదివి ఉన్నాను. కాని శ్రీశ్రీ కవితలో ఉన్నది ఆక్రోశం కాదు, అవలోకనం, అశాంతి కాదు, ప్రశ్నార్థకం. ఆ కవిత చెయ్యలేని పని నిరాలా కవిత చేసింది, ఆ పసినాట అది నా హృదయాన్ని రెండు ముక్కలు చేసేసింది.
మాష్టారు మళ్ళా మరెప్పుడూ నిరాలా గురించి చెప్పలేదు. ఆయన జయశంకర్ ప్రసాద్ గురించీ, సుమిత్రానందన్ పంత్ గురించీ మాట్లాడుతుండేవారుగానీ, నిరాలా అనే పేరు తలవగానే ఒక నమస్కారం పెట్టి మౌనంగా ఉండిపోయేవారు. నిరాలా అంటే ‘సాటి లేని వాడ’ య్యా అనేవారు. ఆ తర్వాత పెరిగి పెద్దయ్యాక నేను కూడా మళ్ళా నిరాలాని ఎప్పుడూ చదివింది లేదు, ఇదుగో, ఇప్పుడు ఈ A Life Misspent చదివేదాకా.
కానీ నా దురదృష్టం ఏమని చెప్పను! యాభై ఏళ్ళకింద ఆ నా పసితనంలో నిరాలా తన కవితతో నా గుండెని ఎక్కడ రెండు ముక్కలు చేసాడో, ఇప్పుడు మళ్ళా అక్కడే నా గుండెని చేత్తో పట్టుకున్నాడు. అప్పుడు విరిగిపోయిన ఆ గుండె ఇప్పటికీ అతుక్కోలేదనీ, ఆ పగులు ఎక్కడుందో నిరాలాకి ఒక్కడికే తెలుసనీ అనిపించింది పుస్తకం చదవడం పూర్తయ్యేటప్పటికి.
నిరాలా హిందీలో రాసిన ‘కుల్లీ భాట్’ అనే ఈ రచనకి సతి ఖన్నా అనే ఆయన చేసిన ఇంగ్లిషు అనువాదం A Life Misspent (2016). దీన్ని నవలిక అని అన్నారుగానీ, దీన్ని నిరాశా ఒక జీవితకథ ముసుగులో రాసుకున్న తన ఆత్మకథగా పేర్కొన్నాడు. పట్టుమని 130 పేజీలు కూడా లేని ఈ పుస్తకాన్ని ఆత్మకథగా పేర్కొంటున్నాడేమిటి అని అనుమానిస్తూనే పుటలు తిప్పానుగానీ, ఇది ఒక జీవితకథనో, ఒక కవి ఆత్మకథనో కాదు, ఆత్మలో దివాలా తీసిన భారతదేశం తాలూకు ముఖచిత్రం. ఈ కథ ఒక వ్యత్యస్త ఇతిహాసం. మన చరిత్రలో మహానుభావులుగా ప్రసిద్ధిచెందినవాళ్ళు, జాతిని నడిపినవాళ్ళు ఇక్కడ చాలా లఘుమానవులుగానూ, ఎవరికీ అంతగా తెలియని ఒక అనామక భారతీయుడు అత్యున్నతమానవుడిగానూ ఆవిష్కారమయ్యే విలోమ కథ ఇది. ఇంతవరకూ భారతదేశమంటే నేను టాగోర్, భారతి మాత్రమే అనుకునేవాణ్ణి. కాని నిరాలా పేరు తలవకుండా భారతీయ సాహిత్య చరిత్రమాత్రమే కాదు, భారతీయ మానవత్వ కథ కూడా పరిపూర్ణం కాదనిపించింది ఈ పుస్తకం చదివాక.
ఈ పుస్తకంలో నిరాలా తనకి తన అత్తవారి ఊళ్ళో కుల్లీ భాట్ గా పరిచయమైన పండిట్ పట్వర్దిన్ భట్ అనే ఆయన గురించి రాస్తాడు. ఆ భట్ ‘తక్కువ’ కులానికి చెందినవాడు, అతడికి ‘చెడు’ అలవాట్లు ఉన్నాయి అనే కారణాల వల్ల, నిరాలాని అతడితో స్నేహం చెయ్యవద్దని అత్తవారి కుటుంబం హెచ్చరిస్తుంది. తర్వాత రోజుల్లో భట్ బతుకు తెరువుకోసం రకరకాల దారులు వెతుక్కుంటూ, చివరికి ‘అస్పృశ్యుల’ కోసం ఒక పాఠశాల తెరుస్తాడు. ‘చెడిపోయింది’ గా సమాజం భావించే ఒక ముస్లిం మహిళను తన భార్యగా స్వీకరించి ఆమెతో సహజీవనం మొదలుపెడతాడు. 1930 తర్వాత జాతీయోద్యమం ‘అంటరాని వారి’ మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టాక, అతడు కాంగ్రెసు పార్టీ కార్యకర్తగా, ఉద్యమకారుడిగా మారతాడు. చివరికి, సుఖవ్యాధికి లోనై దీనాతిదీనమైన పరిస్థితుల్లో మరణానికి దగ్గరైనప్పుడు చుట్టూ ఉండే హిందూ సమాజంగానీ, కాంగ్రెసు పార్టీ నాయకులుగానీ, ముస్లిం నాయకులుగానీ అతడికి అండగా నిలబడనప్పుడు నిరాలానే మళ్ళా అతణ్ణి బతికించుకోడం కోసం ఊరూరా తిరిగి విరాళాలు యాచిస్తాడు. చివరికి కుల్లీ భాట్ మరణిస్తాడు. అతడి పదకొండో రోజు శ్రాద్ధ సంస్కారానికి ఏ ఒక్కరూ అతిథిగా రాడానికి ఇష్టపడరు. ఊళ్ళో ఉన్న ఒక్క పురోహితుడూ కూడా తనని సమాజం వెలివేస్తుందన్న భయంతో ముందుకు రాడు. చివరికి నిరాలా తనే పురోహితుడి అవతారం ఎత్తి ఆ శ్రాద్ధకర్మ దగ్గరుండి జరిపిస్తాడు.
నిరాలా అంటే ఒక మండుటెండలాంటి జీవనవిషాదమే గుర్తొచ్చేట్టుగా మా మాష్టారు మా మనసుల్లో చిన్నప్పుడు విడిచిపెట్టిన ముద్రకీ, ఈ పుస్తకం తెరవగానే ఇందులో కనిపిస్తున్న వ్యంగ్యానికీ నాకు ముందు లంకె కుదరలేదు. కాని పుస్తకం సగం గడిచేటప్పటికి, తన భార్య, తన వైపు వాళ్ళు, తన అత్తగారివైపు వాళ్ళు దాదాపుగా సగం కుటుంబం తన కళ్ళముందే ఫ్లూ జ్వరానికి ఆహుతైపోయిన సంగతి చదివాక, అప్పుడు అర్థమయ్యింది, నిరాలా అంటే ఏమిటో. తానెంతో ప్రేమించిన తన భార్యను తన ఇరవై రెండేళ్ళ వయసులో పోగొట్టుకున్నాక ఆయన మళ్ళా పెళ్ళిమాటనే ఎత్తలేదు. తల్లిని పోగొట్టుకున్న తన కూతురితో పాటు, తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న మరొక నలుగురు పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చెయ్యడం కోసమే జీవితమంతా నిలబడ్డాడు. చివరికి తన కూతురు కూడా తన కళ్ళముందే మరణించడం చూసాడు. ఈ అనుభవాలన్నీ ఆయనకి చివరిరోజుల్లో మతిస్తిమితం తప్పించాయంటే ఆశ్చర్యం ఏముంది?
కానీ వ్యక్తిగత జీవితంలోని ఈ విషాదాలముందు ఆయన ఎంత గంభీర చిత్తుడిగా నిలబడ్డాడో, ఏ ఒక్క సందర్భంలోనూ తన విలువల్ని వదులుకోడానికి ఎలా సిద్ధపడలేదో, అది- ఆ వ్యక్తిత్వమే నిరాలాను నా కళ్ళముందు మహోన్నతమానవుడిగా నిలబెడుతున్నది. తన కూతురు చనిపోయినప్పుడు ‘సరోజ్ స్మృతి’ అని రాసుకున్న కవితలో ఈ వాక్యాలు చూడండి:
తల్లీ, నేనొక పనికిమాలిన తండ్రిని,
నీ కోసం ఏమీ చెయ్యలేకపోయాను, డబ్బు
సంపాదించడానికి నాకు కొన్ని దారులు
తెలియకపోలేదు, కాని కావాలనే వదిలిపెట్టేసాను
తప్పుడు మార్గాల్లో ఆస్తి కూడబెట్టుకోడమెలాగో
నాకు తెలియంది కాదు. కాని గెలవకండా
ఉండటానికే నేను జీవితమంతా పోరాడేను.
కాబట్టి, నా తల్లీ, బంగారూ, నీకు
పట్టువస్త్రాలు కొనిపెట్టలేకపోయాను,
కడుపునిండా తిండిపెట్టలేకపోయాను. కాని
ఒక్కమాట చెప్పగలను, నేనే బీదవాడి
నోటిదగ్గరనుంచీ కూడు కాజెయ్యలేదు, అతడు
ఏడుస్తుంటే చూడగలిగింది లేదు, నా కన్నీళ్ళల్లో
నేను చూడగలిగింది నా వదనాన్నీ, నా హృదయాన్నే.
చిన్నప్పుడు ఆ బిచ్చగాడిమీద కవిత విన్నప్పుడు నా గుండె రెండుముక్కలయిందంటే అది నా పసితనం వల్ల అనుకున్నాను. కాని ఇదేమిటి, ఇప్పుడు అరవయ్యేళ్ళ తరువాత కూడా, ఈ వాక్యాలు రాస్తూ ఉంటే, నాకు కన్నీళ్ళు ఆగడం లేదు?
ఒకసారి ఇండోర్ లో ఒక సాహిత్యసభలో ప్రసంగిస్తూ మహాత్మా గాంధీ ‘హిందీ సాహిత్యంలో టాగోర్ ఎక్కడ?’ అని అడిగారట. వెంటనే తన చుట్టూ ఉన్న సభాసదుల్ని పక్కకి నెట్టుకుంటో నిరాలా ముందుకు దూసుకొచ్చి ‘మీరు హిందీ సాహిత్యం చదివినట్టు లేదే? ముందు హిందీ కవిత్వం చదివి అప్పుడు మాట్లాడండి’ అని అన్నాడట. అవును, తనకి హిందీ సాహిత్యం గురించి అంతగా తెలియదని గాంధీ ఆ సభాముఖంగానే ఒప్పుకున్నారట. అప్పుడు ‘అయితే నా కవిత్వం పంపిస్తాను చూడండి’ అని అన్నాడట నిరాలా. ఈ సంఘటన గురించి చదివినప్పుడు గాంధీ గురించిన నా ఆరాధన ఏమీ తగ్గకపోగా, ఇదుగో, ఇక్కడ ఒక కవి ఉన్నాడు, టాగోర్ లాగా, గాంధీని ప్రశ్నించగలిగినవాడు అని నాకు నేను సంతోషంగా చెప్పుకున్నాను.
నిజానీకి ఈ పుస్తకంలో నిరాలా గాంధీ, నెహ్రూల్ని సున్నితంగా విమర్శిస్తున్నప్పుడు నాకు పదే పదే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గుర్తొస్తూ ఉన్నారు. శాస్త్రిగారి జీవితానికీ, నిరాలా జీవితానికీ వారు నిండా మింగిన చేదుతనంలోనూ, అనుష్ఠించిన విలువల్లోనూ ఏమంత తేడా లేదు.
బయటి ప్రపంచానికి అంతగా తెలియని ఒక మిత్రుడి కథ రాస్తున్నట్టు నెపం మీద నిరాలా, నిజానికి తన గురించి, మనకు తెలియని ఒక మహోన్నత ముఖచిత్రాన్ని పరిచయం చేసాడు. ఈ చిన్నపుస్తకం అవశ్యం తెలుగులోకి రావలసిన పుస్తకం. ఇంగ్లిషునుంచి కాదు, నేరుగా హిందీనుంచే అనువాదం చెయ్యగలిగినవాళ్ళు ముందు కొస్తే నేను మరింత సంతోషిస్తాను.
నిరాలా బెంగాల్లో పుట్టిపెరగడంతో ఆయనకి హిందీ కావ్యభాషతో పరిచయం లేదు. ఇరవయ్యవ శతాబ్ద ప్రారంభంలో ఖడీబోలీగా ప్రాచుర్యంలోకి వస్తున్న హిందీ సాహిత్యభాష గురించి ఆయనకు ఆయన భార్య మనోహరీ దేవి పరిచయం చేసింది. ఆమె స్ఫూర్తి వల్ల నిరాలా ఖడీబోలీ నేర్చుకుని హిందీ కవిత్వాన్ని ఆధునికయుగంలోకి తీసుకువెళ్ళాడు. అతడి భార్య గొప్ప గాయని కూడా. ఒకసారి తన అత్తవారి ఇంట్లో ఆమె గానం మొదలుపెట్టినప్పుడు తులసీ ప్రసిద్ధ కీర్తన ‘శ్రీరామచంద్ర కృపాళు భజు మన హరణ భవభయ దారుణం’ ని ఆలపించిందట. ఈ పుస్తకాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన అనువాదకుడు ఆ వాక్యాన్ని Sing Praise of Ram, Who banishes terror of being అని అనువదించాడు. అంతేకాదు, పుస్తకానికి చివరలో తాను రాసిన మలిమాటకు ‘భవభయదారుణం: Terror of Being’ అని శీర్షిక పెట్టాడు.
దారుణమైన భవభయం ఎలా ఉంటుందో ఈ 130 పేజీల పుస్తకం నాకు పరిచయం చేసినట్టుగా మరే పుస్తకమూ నాకింతదాకా పరిచయం చేయలేదని చెప్పగలను. కాని నిరాలా భయవిముక్తుడు. ఎందుకంటే, ఆయనే ఒకచోట ఇలా రాసాడు:
A servant is Lord Ram as much as the master.
యజమానిలోనూ, సేవకుడిలోనూ కూడా ఒకే రామచంద్రప్రభువుని చూడటానికే ఆయన జీవితమంతా నిలబడ్డాడు. అందుకనే ఈ కథలో మనకెవరికీ తెలియని ఒక కాంగ్రెసు కార్యకర్త మహాత్మాగాంధీతో సమానంగా కనబడతాడు.
భవభయం దారుణం. కాని ఇటువంటి ధైర్యశాలులు ఆ భవభయాన్ని ఎదుర్కున్నారని తెలియడంలో ఎంత గొప్ప సాంత్వన ఉందని!
14-5-2024
చదువుతుంటే కన్నీళ్లు ఆగటం లేదు. నమస్కారాలు.
ధన్యవాదాలు సార్
పాతికేళ్ల క్రితం సూర్యకాంత్ త్రిపాఠీ నిరాలా జీవిత కథ తెలుగు అనువాదం 400 పేజీలు NBT వాళ్లకోసం ప్రూఫ్ రీడింగ్ చేసిన గుర్తు. ఆయన దైన్య జీవనం ఇప్పటికీ మరువలేనిది. ప్రతిభా వంతుడైన కవి పతనావస్థ మనసుని కలచివేస్తుంది. అది పుస్తకంగా వచ్చిందో రాలేదో తెలియదు. తెలుగులోకి అనువాదం చేసిన రచయిత పేరు కూడా మరచిపోయాను కానీ రచనాంశం లీలగా మనసులో ఉండిపోయింది. ఈ రోజు మళ్లీ మీ సమీక్ష నన్ను అక్కడికి తీసుకువెళ్లింది.
ఈ విషయం నాకు కొత్త. ధన్యవాదాలు సార్.
నిరాలా గారి భవ భయ దారుణం పూర్తి పాఠం చదవాలని మనసు తహతహలాడుతోంది.పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సర్.
ధన్యవాదాలు సార్
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, అనువాద రత్న , డా.వెన్నా వల్లభరావు గారికి పంపాను. వారయితే నేరుగా హిందీ నుంచి తెలుగులోకి అనువాదం చేయగలరు
ధన్యవాదాలు సార్
నాకున్న పరిమిత హిందీ పరిజ్ఞానంతో చినవీర భద్రుడు (Vadrevu Ch Veerabhadrudu) ప్రస్తావించిన భిక్షుక్ అన్న కవితకు నాకు తోచిన అనువాదం:
భిక్షకుడు
======
అదిగో వస్తాడు
ఇంటి గుమ్మం దారి తొక్కుతాడు
మాదాకబళం అంటాడు
మనసును ముక్కలు చేస్తాడు
అందుకు బాధపడతాడు
పొట్ట, వెన్ను ఒక్కటిగా కలిసిపోయినవాడు
కర్రపై వాలుతూ, తూలుతూ నడుస్తున్నాడు
పిడికెడు గింజలకోసం – ఆకలినార్పుట కోసం
చిరిగిన జోలెను ఎదురుగ నిలిపి
మాదాకబళం అంటాడు
మనసును ముక్కలు చేస్తాడు
అందుకు బాధపడతాడు
వెంట తోడుగా ఇద్దరు పిల్లలు
కాలే కడుపును చేత్తో రాస్తూ
ఇంకో చేతిని ముందుకు జాపి
ఆకలితో చిట్లిన పెదవులు తెరచి
బిక్కచూపులతో బిచ్చం అడిగి
కారే కన్నీళ్ళను పానం చేస్తూ
ఎంగిలాకులను తినబోతుంటే
ఎగిసిన కుక్కలు లాగేస్తాయి
ఆగండీ! ఈ నా హృదయంలో ఉంది దయామృతం
ఆ మాధుర్యం మీలో పండిస్తాను
అలుపెరుగని అభిమన్యులు మీరు
తిరిపెమెత్తిడి త్రిలోచనులు మీరు
మీ దుఃఖం నా గుండె నిండగా
నా మోదం మీ మోవి విరియగా
మీ జోలె బరువు పెంచుతాను
నా గుండె బరువు దించుకొంటాను!
హిందీ మూలం తెలుగు లిపిలో:
===================
వహ్ ఆతా–
దో టూక్ కలేజే కో కర్తా, పఛ్తాతా
పథ్ పర్ ఆతా.
పేట్ పీఠ్ దోనోం మిల్కర్ హైం ఏక్,
చల్ రహా లకుటియా టేక్,
ముట్ఠీ భర్ దానే కో — భూఖ్ మిటానే కో
ముఁహ్ ఫటీ పురానీ ఝోలీ కా ఫైలాతా —
దో టూక్ కలేజే కే కర్తా పఛ్తాతా పథ్ పర్ ఆతా.
సాథ్ దో బచ్చే భీ హైం సదా హాథ్ ఫైలాఏ,
బాఏఁ సే వే మల్తే హుఏ పేట్ కో చల్తే,
ఔర్ దాహినా దయా దృష్టి-పానే కీ ఓర్ బఢాఏ.
భూఖ్ సే సూఖ్ ఓఠ్ జబ్ జాతే
దాతా-భాగ్య విధాతా సే క్యా పాతే?
ఘూఁట్ ఆఁసుఓం కే పీకర్ రహ్ జాతే.
చాట్ రహే జూఠీ పత్తల్ వే సభీ సడక్ పర్ ఖడే హుఏ,
ఔర్ ఝపట్ లేనే కో ఉన్సే కుత్తే భీ హైం అడే హుఏ !
ఠహ్రో ! అహో మేరే హృదయ్ మేం హై అమృత్, మైం సీంచ్ దూఁగా
అభిమన్యు జైసే హో సకోగే తుం
తుమ్హారే దుఖ్ మైం అప్నే హృదయ్ మేం ఖీంచ్ లూఁగా.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్! ఎంత మంచిపని చేసారు!